వన్‌ నేషన్‌-వన్ ఎలక్షన్‌ అసాధ్యం: ఖర్గే | Kharge says One Nation One Election is impossible | Sakshi
Sakshi News home page

వన్‌ నేషన్‌-వన్ ఎలక్షన్‌ అసాధ్యం: ఖర్గే

Published Thu, Oct 31 2024 3:43 PM | Last Updated on Thu, Oct 31 2024 3:53 PM

Kharge says One Nation One Election is impossible

ఢిల్లీ: దేశంలో వన్‌ నేషన్‌-వన్ ఎలక్షన్‌ అమలు చేయటం ఎట్టిపరిస్థితుల్లో సాధ్యం కాదని‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశంలో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ను అతిత్వరలో అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.

‘‘పార్లమెంట్ ఏకాభిప్రాయం అవసరం కాబట్టి  వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌ అమలు చేయటం అసాధ్యం. ముఖ్యంగా ప్రధాని మోదీ ఏమి చెప్పారో.. దానిని ఆయన చేయరు. ఎందుకంటే వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ పార్లమెంట్‌ ముందుకు వచ్చినప్పుడు.. అందరి ఆమోదం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే అమలులోకి వస్తుంది.  ఒకే దేశం ఒక ఎన్నిక అమలలోకి రావటం అసాధ్యం’ అని తెలిపారు.

ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ 149వ జయంతి సందర్భంగా.. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి మోదీ పూలమాలలు వేసి మోదీ నివాళులర్పించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. ‘‘ మేం ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా పని చేస్తున్నాం. ఇది భారతదేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. అదేవిధంగా త్వరలో భారత్‌లో వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌తో పాటు కామన్‌ సివిల్‌ కోడ్‌ అమలు కానుంది’’ అని అన్నారు.

ఇప్పటికే.. ప్రతిపక్షాలు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై విమర్శలు  గుప్పిస్తున్నాయి. అసాధ్యమైన ఆలోచన, ఫెడరలిజం, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే ప్రయత్నంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే లక్ష్యంతో రూపొందించిన 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు' ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం సెప్టెంబర్ 18న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement