దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని.. అందుకోసం ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ను తీసుకురావాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్ర కేబినెట్ ఇవాళ న్యూఢిల్లీలో సమావేశం కానుంది. ఈ సమావేశం ముందుకు జమిలి ఎన్నికల బిల్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ శీతాకాల సమావేశాల్లోనే గనుక చర్చకు వస్తే.. అసలు ఓటింగ్ ఎలా జరుగుతుంది? జమిలి ఎన్నికల బిల్లును ఆమోదింపజేసుకోగలిగే ‘బలం’ ఎన్డీయేకు ఉందా?..
రాబోయే సాధారణ ఎన్నికలు.. జమిలిగానే జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కృత నిశ్చయంతో ఉన్నారు. అందుకోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్నారు. కానీ, పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకెళ్లాలని మోదీ భావిస్తున్నారు.
ముందుగా పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెడతారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దానిని రిఫర్ చేసే అవకాశం ఉండొచ్చు. అవసరం అనుకుంటే జేపీసీ.. వివిధ పార్టీలతో పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టొచ్చు.
మెజారిటీ ఎంత ఉండాలంటే..
ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానం కోసం రూపొందించిన బిల్లు.. రాజ్యాంగ సవరణలతో ముడిపడిన అంశం. కాబట్టి.. ఉభయ సభల్లోనూ మూడింట రెండో వంతు మెజారిటీ కచ్చితంగా అవసరం.
👉రాజ్యసభలో 245 మంది సభ్యులంటే.. కనీసం 164 ఓట్లు పడాలి
👉అలాగే.. లోక్‌సభలో 545 మంది సభ్యులుంటే.. 364 ఓట్లు రావాలి.
ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం సాధారణ మెజారిటీతోనే నడుస్తోంది. కాబట్టి.. ఓటింగ్ సమయానికల్లా మూడింట రెండో వంతు మెజారిటీ మద్దతు సంపాదించుకోవాల్సి ఉంటుంది. జమిలి ఎన్నికలకు మొత్తం 47 పార్టీల్లో 32 పార్టీలు జై కొట్టిన సంగతి తెలిసిందే. అంటే 13 రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి.
ఒకే దేశం.. ఒకే ఎన్నికకు సంబంధించిన ముసాయిదా బిల్లును రూపకల్పన చేసే పని.. కేంద్ర న్యాయ శాఖ చూసుకుంటోంది. ఇక ఈ బిల్లు బుధవారం జరిగే కేంద్ర కేబినెట్ సమావేశం ముందుకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ అది కుదరకుంటే.. వచ్చే బుధవారం జరగబోయే కేబినెట్ సమావేశానికి ముందైనా రావొచ్చు. సంబంధిత ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం గనుక పొందితే.. పార్లమెంటు ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు రానుంది.
ప్రస్తుత లోక్‌సభ గడువు 2029 దాకా ఉంది. కానీ, ఈ మధ్యలోనే దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.
వచ్చే ఏడాది అంటే 2025లో.. ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.
2026లో..
అసోం(పూర్వపు అస్సాం)
పశ్చిమ బెంగాల్
పుదుచ్చేరి
తమిళనాడు
కేరళ
2027లో..
గోవా
ఉత్తరాఖండ్
పంజాబ్
మణిపూర్
ఉత్తర ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్
గుజరాత్
ఈ స్టేట్స్ ఎన్నికల టైంలోనే.. జమిలి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తోంది.
2028లో..
త్రిపుర
మేఘాలయా
నాగాలాండ్
కర్ణాటక
మిజోరాం
ఛత్తీస్‌గఢ్
మధ్యప్రదేశ్
రాజస్థాన్
తెలంగాణ
2029లో..
అరుణాచల్ ప్రదేశ్
సిక్కిం
ఆంధ్రప్రదేశ్
ఒడిషా
జమ్ము కశ్మీర్
హర్యానా
జార్ఖండ్
మహారాష్ట్ర
కోవింద్ కమిటీ సిఫార్సులు
జమిలి ఎన్నికల కోసం.. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొన్ని నెలల పాటు చర్చలు, సూచనలు, సలహాలు తీసుకుని ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికకు గతంలోనే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం విదితమే. కోవింద్ నివేదిక ఆధారంగా.. అందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయ శాఖ రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ముసాయిదా బిల్లును కేబినెట్ భేటీలో ఓకే చేసి .. ఆపై బిల్లును ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి.. ఆమోదం కల్పించాలని మోదీ సర్కార్ యోచిస్తోంది.
ఇప్పుడు కాకుంటే..
జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బిల్లు రూపొందినట్లు బీజేపీ వర్గాల పేర్కొంటున్నాయి. ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఆ తర్వాత ఈ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమావేశాల్లో వీలు కాని పక్షంలో వచ్చే సమావేశాల్లో అయినా.. దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment