
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫొటోలు దిగడానికి ఉన్న సమయం.. హింస చెలరేగిన మణిపూర్‌లో పర్యటించడానికి లేదుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. శనివారం ఖర్గే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్రధానిమోదీ లక్ష్యదీప్ పర్యటనపై ఖర్గే విమర్శలు గుప్పించారు.
ఒకవైపు మణిపూర్‌లో దురదృష్టవశాత్తు రెండు వర్గాల మధ్య హింస చెలరేగితే, మరోవైపు ప్రధాని మోదీ మాత్రం బీచ్‌లో సాహస క్రీడ ఆడుతూ.. ఫొటో సెషన్ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా ముందు ఫొటోలకు పోజులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ముందు దేవుడి దర్శనంలా ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోదీ ఫొటోలే కనిపిస్తాయని మండిపడ్డారు. ఇటువంటి పెద్దమనిషి.. ఎందుకు మణిపూర్‌కు వెళ్లడం లేదు? అని సూటిగా ప్రశ్నించారు.
ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ కేంద్ర మంతి గిరిరాజ్ సింగ్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీవాళ్లు మణిపూర్‌కు కేవలం రాజకీయ విహారయాత్రకు మాత్రమే వెళ్లారని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా.. మణిపూర్‌లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment