పంజాబ్‌లో రైతులు ప్రధాని నరేంద్ర మోదీ కాన్వాయ్‌ని అడ్డుకున్నారని విన్నాక ఆయనకు ఫోన్ చేయబోయి కూడా ఆగిపోయాను. అప్పటికే ఆయన ఘోర భద్రతా వైఫల్యంతో కుంగిపోతూ ఢిల్లీలో ల్యాండ్ అయి ఉంటారు కనుక ఆ సమయంలో ఆయన్ని కదిలించడం ఎందుకని నాకు అనిపించింది.
ఒకవేళ నేను మోదీని పలకరించే ప్రయత్నం చేసి, అది సఫలం అయినప్పటికీ.. ‘ప్రధాని కాన్వాయ్‌ని అడ్డుకోవడం చిన్న విషయమేమీ కాదు మోదీజీ..’ అనే ఒక దిగ్భ్రాంతిపూర్వక ప్రారంభవాక్యంతో నా పరామర్శ మొదలవవలసి వచ్చేది. అప్పుడు మోదీజీ.. ‘నా కాన్వాయ్‌ని అడ్డుకోవడం చిన్న విషయం కాదని అంటున్నారంటే.. అడ్డుకున్నవాళ్లు చిన్నవాళ్లు కాదని నాకు చెబుతున్నారా..’ అని నాతో అని ఉండేవారు.
మోదీజీకి కొన్నాళ్లుగా రైతులు గానీ, రైతుల వైపు మాట్లాడుతున్న నేను గానీ నచ్చడం లేదు. బహుశా అమిత్‌షా కూడా మోదీజీకి నచ్చకపోతుండవచ్చు. రైతుల విషయంలో మోదీజీకి మతి తప్పిందని అమిత్‌షా నాతో అన్నట్లు నేను అన్నానని కాంగ్రెస్ వాళ్లు ట్విట్టర్‌లో వీడియో పెట్టడం మోదీజీ దృష్టికి వెళ్లే ఉంటుంది. అమిత్‌షా కూడా షాక్ అయి, వెంటనే నాకు కాల్ చేశారు.
‘‘మీ పేరు సత్యపాల్ కావచ్చు. మీరిప్పుడు ఒక రాష్ట్రానికి గవర్నర్ కావచ్చు. ఒకప్పుడు నాలుగు రాష్ట్రాలకు మీరు గవర్నర్‌గా పని చేసి ఉండొచ్చు. కానీ మీరున్నది బీజేపీలో! బీజేపీలో ఉంటూ బీజేపీలోనే ఒకరికొకరికి తగవు ఎలా పెడతారు? ‘షాజీకి మోదీజీపై ఎనలేని గౌరవం ఉంది’ అని వెంటనే మీకై మీరే ఒక ప్రకటన ఇవ్వండి’’ అన్నారు! సందర్భశుద్ధి లేని గౌరవ ప్రకటన మోదీజీకి ఎలా సమ్మతమౌతుంది?
ఢిల్లీలో అమిత్ షా అంతర్గత భద్రతపై ఇంటెలిజెన్స్‌తో భేటీ పెట్టిన రెండో రోజే పంజాబ్‌లో ప్రధాని కాన్వాయ్ ఫ్లై ఓవర్ మీద ఆగిపోయింది! ఇది కూడా మోదీజీ మనసులో ఉండే ఉంటుంది. అలాంటప్పుడు తను ప్రాణా లతో బయట పడినందుకు పంజాబ్ సీఎంకి కాదు మోదీజీ ధన్యవాదాలు చెప్పవలసింది... దేశ హోమ్ మంత్రి అమిత్‌షాకి!
‘రైతులతో మీరు స్నేహపూర్వకంగా ఉండటం లేదు మోదీజీ’ అని మోదీజీతో పర్సనల్ మీటింగ్‌లో నేను అన్నప్పుడు.. ‘ఇవన్నీ నాకెందుకు చెబుతున్నారు? వెళ్లి అమిత్‌షాతో మాట్లాడండి..’ అన్నారు మోదీజీ! ఆ మాట చెప్పినప్పుడు నాతో అమిత్ షా అన్నమాటే.. మోదీజీకి మతి పోయిందని!
రైతుల గురించి ప్రధానితో మాట్లాడాలి. లేదంటే వ్యవసాయశాఖ మంత్రితో మాట్లాడాలి. హోమ్ మినిస్టర్‌తో మాట్లాడమని అన్నారంటే.. మోదీజీ రైతుల సమస్యల్ని దేశ శాంతి భద్రతల సమస్యగా చూస్తున్నారా?!!
మోదీజీకి రైతులు నచ్చకపోవడం ఎలా ఉన్నా, రైతులకు ఇప్పుడు నరేంద్ర అనే పేరే నచ్చడం లేదనిపిస్తోంది. సాగు చట్టాల్ని రద్దు చేసి రైతులకు మోదీజీ క్షమాపణ చెప్పి ఉండొచ్చు. మళ్లీ ఆ చట్టాలను తెస్తాం అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అనడం రైతుల్ని గాయపరిచింది. ఆయన పేరులోనూ ‘నరేంద్ర’ ఉంది. నరేంద్ర సింగ్ తోమర్ ఆయన.
పీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతుల వెనుక ఎవరున్నారో తెలుసుకోవడం కోసం దర్యాప్తు మొదలైంది. ఎవరిని బుక్ చేస్తారు? రైతుల పోరాటాన్ని నడిపిన ఇద్దరిలో బల్బీర్ సింగ్ రజేవాల్‌నా? రాకేశ్ తికాయత్‌నా? రజేవాల్ పంజాబ్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడుతున్నారు. రాకేశ్ గురించి అడిగితే ముజఫర్‌నగర్‌లో ఉన్నారని తెలిసింది.
‘‘రాకేశ్! ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఆ రోజు రైతుల వెనుక మీరున్నారా?’’ అని అడిగాను.. రాకేశ్‌కి ఫోన్ చేసి.
రాకేశ్ నవ్వారు.
‘‘రైతుల వెనుక ఎవరుంటారు సత్యపాల్‌జీ? వారి ధర్మాగ్రహమే ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ జరగన్విండి. పీఎం ర్యాలీని అడ్డుకుంది భధ్రతా వైఫల్యమా లేక రైతుల ధర్మాగ్రహమా అనేది తేలుతుంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment