తమ్ముళ్లు, అనుయాయులే ఎమ్మెల్యేలు | Kanna Nagaraju Phanindra are circulating as shadow MLAs | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లు, అనుయాయులే ఎమ్మెల్యేలు

Published Sun, Feb 9 2025 4:01 AM | Last Updated on Sun, Feb 9 2025 4:01 AM

Kanna Nagaraju Phanindra are circulating as shadow MLAs

పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న ప్రజాప్రతిని«ధుల బంధువర్గం

ప్రతి పనికి కప్పం కట్టాల్సిందేనంటున్న ‘కన్నా’ కుమారులు 

పెదకూరపాడులో అన్ని దందాల్లోనూ సోదరుడి మాటే శాసనం 

వినుకొండలో మూడు రోజుల ఎమ్మెల్యేగా మారిన జీవీ  

వారంలో మిగతా నాలుగు రోజులు మాజీ ఎమ్మెల్యే మక్కెనదే పెత్తనం 

కోటప్పకొండను కొల్లగొడుతున్న నరసరావుపేట ఎమ్మెల్యే అల్లుడు 

కూటమి పార్టీ శ్రేణుల నుంచే తీవ్ర విమర్శలు  

సాక్షి, నరసరావుపేట: వాళ్లు ఎంపీలో, ఎమ్మెల్యేలో కాదు.. కనీసం పంచాయతీ వార్డు మెంబర్లు కూడా కాదు. అయినా వారిదే ఆ నియోజకవర్గంలో పెత్తనం. మరి వారికున్న అర్హతలేమిటంటే.. సదరు ప్రజా­ప్రతినిధి వారసులు, సోదరులు, బంధువులు, ఆత్మీయులు కావడమే. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేలుగా చలామణి అవుతూ ప్రభుత్వ పథ­కాలు మొదలు.. పదవులు, కాంట్రాక్టులు అన్ని­ంటిలోనూ జోక్యం చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారు. అందినకాడికి దోచుకుని దాచుకుంటు­న్నారు. 

ఈ పరిస్థితి పల్నాడు జిల్లాలో మరింత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో ముగ్గురు షాడో ఎమ్మెల్యేలు పెత్తనం చేస్తుండటం పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తు­తున్నాయి. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కుమా­రులు కన్నా నాగరాజు, కన్నా ఫణీంద్రలు అంతా తామే అంటూ అధికారం చెలాయిస్తున్నారు. భూముల సెటిల్‌మెంట్లు, మద్యం దందా.. ఇలా అన్నింటికీ రేట్లు ఫిక్స్‌ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. 

ప్రతి పనికి కప్పం కట్టాల్సిందేనని లావాదేవీలు చేస్తున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరితోపాటు ఎన్నికల సమయంలో ఆరి్థక వ్యవహారాలు చూసుకున్న కాంట్రాక్టర్‌ దరువూరి నాగేశ్వరరావు కూడా ఇప్పుడు అన్నీ తానై షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ తమ్ము­డు నవీన్‌ చిన్న ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు. 

ప్రవీణ్‌ వ్యాపార వ్యవహారాలు చూసు­కుంటుంటే నవీన్‌ నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడు. ఇసుక రీచ్‌ల వద్ద అనధికార టోల్‌గేట్లు ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. అమరావతి మండలంలో ఎర్రమట్టి దందా ఇతని కనుసన్నల్లోనే సాగుతోంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులంటూ ఉపాధి హామి ఫీల్డ్‌ అసిస్టెంట్లు, యాని­­­మేటర్లను తొలగిస్తున్నారు. మద్యం సిండెకేట్, బెల్టు షాపుల వ్యవహారం అంతా ఈయన చెప్పినట్లే సాగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యేనా మజాకా! 
వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును ‘మూడు రోజుల ఎమ్యెల్యే’ అని నియోజకవర్గ ప్రజలు పిలుస్తున్నారు. వారంలో ఆయ­న గరిష్టంగా నియోజకవర్గంలో మూడు రోజులే ఉంటారు. మిగిలిన నాలుగు రోజుల్లో సొంత వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఆ సమయంలో నియోజకవర్గంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. 

స్థానికంగా చేపల చెరువులన్నింటిని ఈయన తన గుప్పిట్లో పెట్టు­­కున్నారని.. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు అక్రమంగా మట్టి తోలడం, భూకబ్జాలు, నచ్చని వారిపై అక్రమ కేసు­లు, వేధింపులు ఇతని కనుసన్నల్లోనే జరుగుతున్నా­య­ని నియోజకవర్గ ప్రజ­లు చెబుతున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్‌బాబుకు అల్లుడు వరసయ్యే విజయ్‌ అంతా తానై నడిపి­స్తున్నాడు.

గ్రావెల్‌కు అధిక ధర నిర్ణయించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.4 వేలు ఉన్న టిప్పర్‌ మట్టికి ప్రస్తుతం రూ.6,500 వరకు వసూలు చేస్తున్నారు. కోటప్పకొండను అక్రమ గ్రావెల్‌కు అడ్డాగా మార్చారని, పోలీసులను అడ్డుపెట్టు­కుని పంచాయితీలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆ పార్టీ వారే విమర్శిస్తున్నారు. 

చిలుకలూరిపేటలో అయితే అంతా ‘అమ్మ’గారి దయేనని చెబుతున్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పేరుకేనని, అంతా ఆయన భార్యదే పెత్తనమని చిన్నపిల్లలు మొదలు వృద్ధుల వరకు ఒకే మాట చెబుతున్నారు. అధికారులంతా ఆమె సేవలోనే తరిస్తున్నారని విమర్శిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement