కొరిటెపాడు(గుంటూరు): మాజీ మంత్రి, టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అబద్ధాలు మాట్లాడితే.. తాను నిజాలు చెబుతానని, ఆయన జీవితమంతా అవినీతి మయమేనని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) పేర్కొన్నారు. బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ సమావేశ మందిరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మొదట్లో సున్నాగా ఉన్న కన్నా.. 45 గజాల స్థలం నుంచి వేల కోట్ల రూపాయలకు ఎగబాకింది కుంభకోణాలు, అవినీతితోనే అన్న సంగతి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అందరికీ తెలుసు అని అన్నారు. కన్నా స్కాముల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు.
సహకారశాఖ మంత్రిగా తన తండ్రి దినానికి విజయవాడలోని విజయకృష్ణ కో–ఆపరేటివ్ సూపర్ బజారు నుంచి లారీల కొద్దీ సరుకులు తెప్పించుకున్న నీచమైన చరిత్ర కన్నాదని.. అందుకు తానే ప్రత్యక్ష సాక్షినన్నారు. కన్నా పాపాల చిట్టా అంతా తనకు తెలుసని.. దాని గురించి మాట్లాడుకుందామా..? నువ్వేంటో.. నీ బతుకేంటో.. గుంటూరు ప్రజలందరికీ తెలుసు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి కన్నా లక్ష్మీనారాయణ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని రాము ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం సిగ్గుచేటు
గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సీబీఐకి లేఖ రాయడంపై ఆ బ్యాంక్ చైర్మన్ లాలుపురం రాము భగ్గుమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు పట్టుకుని మీడియా ముందు కనీస పరిజ్ఞానం లేకుండా కన్నా ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని, చంద్రబాబును ఎన్ని తిట్లు తిట్టాడో ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ ఇంకా గుర్తుందన్నారు. అలాంటిది ఇప్పుడు కేవలం తన రాజకీయ స్వలాభం కోసం టీడీపీలో చేరిన కన్నాకు, ఆయన్ను చేర్చుకున్న చంద్రబాబుకు సిగ్గులేదన్నారు.
నిరూపించకలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా..?
తమ బ్యాంక్ పరిధిలో నకిలీ పాసు పుస్తకాలతో రూ.13 కోట్ల సొమ్ము స్వాహా జరిగిన మాట నిజమేనని.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే కాక తమ హయాంలో జరిగిన వాటిపైనా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. తమ బ్యాంకులో జరిగిన అవినీతి గుట్టును తామే స్వయంగా వెలికి తీసి అందుకు బాధ్యులైన వారిపై నిజాయితీగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం మాది అని ఆయన సగర్వంగా ప్రకటించారు. అందరికీ తెలిసిన ఈ వాస్తవాలు తాజాగా చంద్రబాబు చంకలో దూరిన కన్నాకు తెలియకపోవడం శోచనీయమన్నారు.
అవినీతి అంతమే పంతంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసే నిబద్ధత కలిగినవారిగా, కన్నా డిమాండ్ చేసిన సీబీఐ విచారణకు స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. తాము కూడా కన్నా అవినీతి, అక్రమ సంపాదనపై సీబీఐ విచారణ కోరతామని తెలిపారు. కన్నాకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన కూడా దాన్ని స్వాగతించాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో రూ.500 కోట్ల మేర అవినీతి జరిగిందని కన్నా లక్ష్మీనారాయణ నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించారు. ఒక వేళ నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం స్వీకరించాలని కన్నాకు బహిరంగ సవాల్ విసిరారు.
ఈ విషయంపై బహిరంగంగా చర్చకు సైతం తాను సిద్ధమని.. కన్నాపై పరువు నష్టం దావా కూడా వేస్తామని ఆయన తేల్చి చెప్పారు. నిజంగా తాను చేసిన ఆరోపణలకు కన్నా కట్టుబడి ఉంటే కనీసం బహిరంగ చర్చకు సిద్ధం కావాలని.. లేదంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోమారు తమ బ్యాంకు గురించి కానీ, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గురించి కానీ అవాకులు, చెవాకులు పేలితే తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment