Guntur District Latest News
-
వైఎస్ జగన్ పాలనలో విద్యారంగం కళకళ
● నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక వెలవెల ● ‘అమ్మ ఒడి’కి మంగళం పాడిన పాలకులు ● వైఎస్ జగన్ పుట్టినరోజున ఏటా విద్యార్థులకు ట్యాబ్‌లు ● నాడు – నేడుతో ప్రభుత్వ బడుల్లో మెరుగైన వసతులు ● ఆర్థిక భరోసాతో ప్రతి విద్యార్థి ఇంటా నాడు వెలుగులు ● గుర్తుచేసుకుంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు -
సువర్ణ స్వాప్నికుడి
శనివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2024 విద్యా రంగాన జగన్నినాదం ● నేడు జననేత పుట్టిన రోజుచదువుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని బలంగా నమ్మిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో విద్యారంగానికి పెద్దపీట వేశారు. పేద బిడ్డల బంగారు భవితకు బాటలు వేశారు. వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. మనబడి నాడు–నేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ప్రతి బిడ్డ బడికి వెళ్లాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకాన్ని దిగ్విజయంగా అమలు చేశారు. ఏటా పుస్తకాలు, యూనిఫాం, షూతో కలిపి మొత్తం 10 రకాల వస్తువులతో విద్యాకానుక అందించారు. పేదింటి బిడ్డ దొరబాబులా ఇంగ్లిషు మీడియం చదవాలని బలంగా ఆకాంక్షించారు. అవాంతరాలు ఎదురైనా పట్టువీడలేదు. -
జగనన్న విద్యాదీవెన అమలు ఇలా..
తల్లికి వందనం గురించి అడుగుతున్నారు గత ప్రభుత్వం నాలుగేళ్లపాటు అమ్మఒడి అమలు పర్చడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించింది. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చిన తల్లికి వందనం డబ్బులు ఎప్పుడు ఇస్తారని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలకు వచ్చి అడుగుతున్నారు. నాడు–నేడు నిధులు విడుదల చేయడంతోపాటు ఆయాలకు ఆర్నెల్ల నుంచి బకాయి పడిన వేతనాలను తక్షణమే చెల్లించాలి. – ఎం. కళాధర్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, గుంటూరు నిధులు లేక మొండి గోడలు దర్శనమిస్తున్నాయి నాడు–నేడు పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో పాఠశాలల్లో మొండి గోడలు దర్శనమిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా చేపట్టిన తరగతి గదులు అందుబాటులోకి రాక, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టాయిలెట్లు పూర్తి చేయాలి. తల్లికి వందనం నిధులు విడుదల చేయడంపై దృష్టి సారించాలి. – కె. బసవ లింగారావు, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, గుంటూరుగుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ విద్యావ్యవస్థను ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కళకళలాడిన పాఠశాలలు... కూటమి పాలనలో నేడు వెలవెలబోతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు పైసా ఖర్చులేని నాణ్యమైన, ఆధునిక విద్యను ఉచితంగా అందించే మహత్తర లక్ష్యంతో వైఎస్ జగన్ అమలు చేసిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ పాఠశాలలు ప్రపంచ స్థాయిని అందిపుచ్చుకున్నాయి. వాటి రూపురేఖలను మార్చివేసిన మహత్తరమైన మన బడి నాడు–నేడు కార్యక్రమం నేడు నిరాదరణకు గురైంది. దీంతో బడులు వెలవెలబోతున్నాయి. ప్రగతి పనులను అటకెక్కించిన కూటమి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో దారుణంగా విఫలమైంది. అమ్మ ఒడిని అమలు చేయకపోవడంతో ఫీజుల భారం తల్లిదండ్రులపైనే పడింది. ఆంగ్ల విద్యాబోధన, స్టూడెంట్ కిట్ల గురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరుగుదొడ్లు, పాఠశాలల ప్రాంగణాలు అపరిశుభ్రంగా మారినా కూటమి సర్కారుకు చీమకుట్టినట్టైనా లేదు. ట్యాబ్‌లు ఎక్కడ? గత వైసీపీ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వరుసగా రెండేళ్లపాటు అత్యాధునిక ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ ట్యాబ్‌లను ఉచితంగా పంపిణీ చేశారు. వైఎస్ జగన్ పుట్టిన రోజున జగనన్న కానుక రూపంలో ఈ ట్యాబ్‌లను అందించి వారి ముఖాల్లో ఆనందోత్సాలను నింపారు. కానీ ఇప్పుడా రోజులు కనుమరుగయ్యాయి. గత రెండు విద్యాసంవత్సరాల్లో వరుసగా ట్యాబ్‌లు అందుకోగా, ప్రస్తుతం అది గత జ్ఞాపకంగా మారింది. 2022–23 విద్యాసంవత్సరంలో మొదటి విడతలో గుంటూరు జిల్లాలోని 181 ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 12,127 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందాయి. రెండో విడతలో 2023–24 విద్యాసంవత్సరంలో 12,481 మందికి పంపిణీ చేశారు. ప్రీ లోడెడ్ కంటెంట్‌తో కూడిన రూ.33 వేల విలువైన ట్యాబ్‌లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించింది. మారిన రూపురేఖలు నాడు–నేడు మొదటి దశలో పాఠశాలలకు ఆధునిక హంగులు కల్పించి చదువుల విప్లవాన్ని తెచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత చాటారు. ఆయన పుణ్యమాని ప్రభుత్వ పాఠశాలలు చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా సరికొత్త హంగులతో కళకళలాడాయి. నాడు–నేడు మొదటి విడతలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 1,183 పాఠశాలలను రూ.283 కోట్ల వ్యయంతో ఆధునికీకరించారు. రెండో విడతలో ఒక్క గుంటూరు జిల్లాలోనే 562 స్కూళ్లలో రూ.204 కోట్ల వ్యయంతో పనులు చేపట్టింది. గత వైసీపీ పాలనలో పక్కా ప్రణాళిక, పర్యవేక్షణతో కొనసాగిన ఈ పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేశారు. 165 పాఠశాలల్లో ప్రారంభించిన 584 తరగతి గదుల నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక నిధులు ఇవ్వకపోవడంతో నిలిచిపోయాయి. 65 శాతానికి పడిపోయిన ‘భోజనం’ పాఠశాలల్లో విద్యార్థులకు జగనన్న గోరుముద్ద విజయవంతంగా కొనసాగింది. అప్పట్లో రోజూ పాఠశాలల్లో 90 శాతానికి పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఆరగించేవారు. ప్రస్తుతం అది 65 శాతానికి పడిపోయింది. తినని వారు ఇంటి నుంచి క్యారేజీలు తెచ్చుకుంటున్నారు.జగనన్న హయాంలో అమ్మఒడి పథకం లబ్ధిదారులు ఇలా.. విద్యా సంవత్సరం లబ్ధిదారులు జమ అయిన మొత్తం (రూ.కోట్లలో) 2019–20 1,46,232 219.35 2020–21 1,55,330 217.46 2021–22 1,40,102 210.15 2022–23 1,59,594 239.39 మొత్తం 6,01,258 886.35 విద్యాసంవత్సరం విద్యార్థులు నిధులు(రూ.కోట్లలో) 2019–20 38,773 122.06 2020–21 42,079 93.85 2021–22 40,878 100.98 2022–23 38,252 80.35 వసతి దీవెన 2019–20 36,157 34.73 2020–21 41,995 40.40 2021–22 40,863 36.45 2022–23 37,894 33.31 ఇప్పుడన్నీ ౖపైపె మెరుగులే స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నడూ చూడని అభివృద్ధి సీఎంగా వైఎస్ జగన్ పాలనలో ప్రత్యక్షంగా కనిపించింది. బాలికల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన టాయిలెట్లను ఆధునికంగా తీర్చిదిద్దిన గత వైసీపీ ప్రభుత్వం వాటిలో బ్రాండెడ్ శానిటరీ సామగ్రి ఏర్పాటు చేసింది. 2014–19 మధ్య కాలంలో పాఠశాలల భవనాలకు తాత్కాలిక మరమ్మతులు నిర్వహించడం, మెరుగులు దిద్దడమొక్కటే గత టీడీపీ పాలనలో అభివృద్ధిగా చెప్పేవారు. ఈ నేపథ్యంలో సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పాఠశాలల ముఖచిత్రం సమూలంగా మార్చివేశారు. పేరెంట్స్ కమిటీలకే బాధ్యతలు అప్పగించి, కొనుగోలు చేసిన ప్రతి సామగ్రికి ఈ కమిటీల ద్వారానే చెల్లింపులు చేశారు. -
రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలూ ముఖ్యం
కొరిటెపాడు: నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్రాభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. ‘లఘు ఉద్యోగ భారతి’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసి యోగీష్ చంద్ర అధ్యక్షతన శుక్రవారం ‘ఎంఎస్ఎంఈ సంగమం 2024’ కార్యక్రమం విజయవాడలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శివశంకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ... నూతన పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం వాటి ఏర్పాటుకు అనుకూల వాతావరణం సృష్టించడంతోపాటు పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక భద్రత, అన్ని ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ ఉద్యమ్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకొని ప్రోత్సాహకాలకు అర్హత సాధించాలని సూచించారు. చిన్న తరహా పరిశ్రమల సమస్యలను లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షుడు మాదల వెంకటేశ్వరరావు వివరించారు. తులసి గ్రూప్ అధినేత తులసి యోగీష్ చంద్ర మాట్లాడుతూ ఏపీఐఐసీ ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడల్లో ప్లాట్స్ సద్వినియోగం అయ్యేలా చూడాలని కోరారు. పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం 5 శాతం నుంచి 12 శాతానికి జీఎస్టీ పెంచటం తగదన్నారు. -
క్రీడాస్ఫూర్తిని చాటేలా పోటీల నిర్వహణ
నగరంపాలెం: క్రీడా స్ఫూర్తిని చాటేలా పోటీలు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న జిల్లా స్పోర్ట్స్– గేమ్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ముఖ్య అతిథిగా రేంజ్ ఐజీ మాట్లాడుతూ నిత్యం బందోబస్త్, ఇతరత్రా విధుల నిమిత్తం బిజీగా ఉండే పోలీసులకు జిల్లా వార్షిక క్రీడా పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. దీనిని కొనసాగించాలని అన్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఎనిమిది విభాగాలుగా సుమారు 180 మంది సీ్త్ర, పురుష క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. గుంటూరు తూర్పు ట్రాఫిక్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలోని హెడ్ క్వార్టర్ టీం ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. తెనాలి సబ్ డివిజన్ టీంలోని 42 మంది మహిళలు, ఏఆర్ విభాగంలోని 36 మంది పురుషులు బంగారు పతకాలు సాధించారు. విజేతలకు ట్రోఫీ, బంగారు పతకాలను అందించారు. శిక్షణ ఐపీఎస్ అధికారిణి శ్రద్ధ, జిల్లా ఏఎస్పీలు హనుమంతు (ఏఆర్), రమణమూర్తి (పరిపాలన), ఏటీవీ రవిబాబు (ఎల్ఓ), ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, ఆర్ఐలు శివరామకృష్ణ, ఉదయభాస్కర్, శ్రీహరిరెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. కోచ్‌లు, రిఫరీలను ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు. -
ప్రొటోకాల్‌పై రగడ
సాక్షి ప్రతినిధి గుంటూరు, నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థలో వైఎస్సార్సీపీ పాలకవర్గం ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆ పార్టీ కార్పొరేటర్లను, ఏకంగా మేయర్‌ను ఆహ్వానించకపోవడం శుక్రవారం కౌన్సిల్ వేదికగా రెండు గంటలపాటు చర్చకు దారితీసింది. దీంతోపాటు టౌన్‌ప్లానింగ్ అవినీతి, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాల ప్రక్షాళన, తాగునీటి అంశంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. గోరంట్లలో సీసీ రోడ్డు శంకుస్థాపనకు మేయర్‌ను ఆహ్వానించకపోవడంపై కార్పొరేటర్ మొహమూద్ ప్రశ్నించారు. దీనికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మద్దతుగా నిలిచారు. తమనూ పిలవడం లేదని ఆరోపించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న అధికారులు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోడియం దగ్గరకు వచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులను తాము అధికారుల చుట్టూ తిరిగి చేయించుకుంటే ఎమ్మెల్యేలు టెంకాయ కొట్టి వెళ్లిపోతున్నారని కార్పొరేటర్లు బూసి రాజలత, మల్లవరపు రమ్య ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు సమాధానం ఇస్తూ ప్రొటోకాల్ అంశంపై ఒక ఫార్మెట్ రెడీ చేసి, ఆ విధంగా పాటించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేయర్ మాట్లాడుతూ... అధికారులు ఇప్పుడు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారని మండిపడ్డారు. నాయకుల మధ్య వివాదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్‌కు తెలియకుండా ప్రియాంబుల్స్ ఏ విధంగా పెడతారంటూ ప్రశ్నించారు. టౌన్ ప్లానింగ్ విభాగంపై ఆగ్రహం 21వ డివిజన్లో అక్రమ కట్టడాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయని, అధికారులకు చెప్పినా కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని కార్పొరేటర్ గురవయ్య ప్రశ్నించారు. కార్పొరేటర్ చిష్టీ మాట్లాడుతూ అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు వస్తే భవన యాజమాని వద్ద మామూళ్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఏమైనా ఆధారాలు అందజేయాలని, శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణం వలన చాలా వాణిజ్య సముదాయాలు నష్టపోయే ప్రమాదం ఉందని, వారికి నష్టపరిహారం గురించి తెలియజేయాలన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయకుండా ఏవిధంగా సమావేశాలు నిర్వహిస్తారని కార్పొరేటర్లు వెంకటకృష్ణ (ఆచారి), బూసి రాజలత, ఇతర సభ్యులు ప్రశ్నించారు. స్థానిక ప్రజా ప్రతినిధులను కాదని స్టేక్ హోల్డర్స్‌తో మీటింగ్ ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిప్తాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. మేయర్ కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన సమావేశాలకు ప్రజా ప్రతినిధులను పిలవకుండా డీపీఆర్ ఏ విధంగా సిద్ధం చేస్తారని అధికారులను ప్రశ్నించారు. అందరి భాగస్వామ్యంతో బ్రిడ్జి నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. కౌన్సిల్ సమావేశంలో రెండు గంటలపాటు సాగిన చర్చ టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతిపై విరుచుకుపడిన సభ్యులు ప్రజాప్రతినిధుల సూచనలతో బ్రిడ్జి డీపీఆర్ తయారీకి తీర్మానం -
కక్షిదారుల స్వచ్ఛంద ప్రక్రియ మధ్యవర్తిత్వం
నగరంపాలెం: మధ్యవర్తిత్వం పూర్తిగా కక్షిదారుల స్వచ్ఛంద ప్రక్రియ అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి అన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై జిల్లా కోర్టు ఆవరణలోని డీజే హాల్లో నిర్వహిస్త్తున్న నలభై గంటల శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి మాట్లాడుతూ సమస్య పరిష్కారంలో కక్షిదారులే కీలక పాత్రధారులని అన్నారు. న్యాయమూర్తులకు శిక్షణ ఇచ్చిన ఆర్.రత్నతార, సత్యరావు (తమిళనాడు)లను సత్కరించారు. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్), సంస్థ జిల్లా కార్యదర్శి టి.లీలావతి, న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
డ్రోన్ కెమెరాలతో నిఘా
నగరంపాలెం: జిల్లాలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యాపార కార్యకలాపాలతో కిక్కిరిసే ఏరియాలు, తరుచూ దొంగతనాలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) సమావేశ మందిరంలో శుక్రవారం సీసీఎస్ (సెంట్రల్ క్రైం సిస్టం) ఉన్నతాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలోని క్రైం పోలీసులు మరింత సమర్థంగా విధులు నిర్వహించాలని అన్నారు. సీసీఎస్ పోలీసులు చురుగ్గా ఉంటే దొంగల కదలికలు తగ్గుతాయని చెప్పారు. రాత్రివేళల్లో సంచరించే వ్యక్తుల వేలి ముద్రలను మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ పరికరాలతో సేకరించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసులు ఛేదించాలని అన్నారు. సమావేశంలో సీసీఎస్ డీఏఎస్పీ శివాజీరాజు, సీఐలు (డీసీఆర్బీ) నరసింహారావు, (సీసీఎస్) డి.వెంకన్నచౌదరి, సుబ్బారావు, అల్తాఫ్ హుస్సేన్, నరేష్కుమార్ (సోషల్ మీడియా), నిస్సార్‌బాషా (ఐటీ కోర్) , సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధికి క్రీడలూ కీలకం
గుంటూరు ఎడ్యుకేషన్: దేశ, రాష్ట్ర అభివృద్ధికి క్రీడలు, సాంస్కృతిక అంశాలు వంటివి దోహదం చేస్తాయని రాష్ట్ర సృజనాత్మకత, సాంస్కృతిక సమితి చైర్పర్సన్ పొడపాటి తేజస్వి పేర్కొన్నారు. అమరావతి రోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను ‘ఆదర్శ్ 2024 స్పోర్ట్స్ ఫర్ హార్మనీ’ పేరుతో శుక్రవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా తేజస్వి జాతీయ, క్రీడా పతాకాలు ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పావురాలను ఎగురవేశారు. తేజస్వి మాట్లాడుతూ... ప్రధాని మోదీ ఆశిస్తున్న అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్రీడాకారులు తయారవ్వాలని కోరారు. అబ్దుల్ కలాం, సచిన్ టెండూల్కర్, పీవీ సింధు, హారిక వంటి వారిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. చదువు నేర్పని అద్భుతాలు క్రీడలు, సాంస్కృతిక అంశాలు నేర్పుతాయన్నారు. క్రీడల్లో గెలుపోటములను ఆస్వాదించాలని వివరించారు. అనంతరం తేజస్వి బాలికల కబడ్డీ పోటీలను స్వయంగా ఆడి ప్రారంభించారు. విశిష్ట అతిథిగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ కేవీఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రమణారావు, ఎంఎస్కే ప్రసాద్ వంటి క్రీడాకారులు హిందూ సంస్థల పూర్వ విద్యార్థులేనన్నారు. కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి మాట్లాడుతూ.. పోటీలకు 25 కళాశాలల నుంచి 500 మంది విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారని తెలిపారు. రెండు రోజులపాటు ఈ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ పి.ఐజక్ ప్రసాద్ మాట్లాడుతూ.. క్రీడలతోపాటు మానసిక వికాసానికి దోహదపడే సాంస్కృతిక పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్ డాక్టర్ సీహెచ్ సుబ్బారావు, వైస్ ప్రిన్సిపల్ వజ్రాల నర్సిరెడ్డి, డాక్టర్ కొల్లా సుస్మితా చౌదరి, ఫిజికల్ డైరెక్టర్ కోసూరి రవి తదితరులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి
గుంటూరు వెస్ట్: శంకర్ విలాస్ సెంటర్లో త్వరలో నిర్మించనున్న ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరిగింది. రోడ్లు, భవనాల శాఖాధికారులు, డీపీఆర్ కన్సల్టెన్సీలతో కలిసి రెండు డిజైన్లు రూపొందించారు. మొదటిది దాదాపు కిలోమీటరు పొడవుతో అరండల్‌పేట 10వ లైను నుంచి ఉమెన్స్ కాలేజీ వరకు ప్రతిపాదించారు. రెండోదానిలో హిందూ కళాశాల వరకు ప్రతిపాదన సిద్ధం చేశారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా, మ్యాప్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్మాణంలో ఐకానిక్ ఆర్కిటెక్చర్ ప్రతిబింబించేలా చూడాలన్నారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్లే వాహనాలకు ఇబ్బందులు రాకుండా ఫ్లైఓవర్ నిర్మాణంలో అండర్‌పాస్ మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉమెన్స్ కాలేజ్ నుంచి ట్రాఫిక్‌కు అనుగుణంగా ప్రతిపాదనలు డిజైన్ చేయాలని చెప్పారు. దీని కోసం కాలేజీ వద్ద 24 గంటల సర్వే నిర్వహించి 24వ తేదీన నివేదిక అందించాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీనివాసమూర్తి, ఈఈ విశ్వనాథ రెడ్డి, రైల్వే డీఈఎస్ భరత్ కుమార్, కన్సల్టెన్సీ ప్రతినిధులు నరేంద్ర, ప్రణీత్, కుటుంబ రావు పాల్గొన్నారు. నాణ్యమైన ఇసుకను గుర్తించండి గ్రామ, మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలతో విస్తృత తనిఖీలు నిర్వహించి 5 హెక్టార్లు పైబడిన నాణ్యమైన ఇసుకను గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావుతో కలిసి నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ వారంలోపే ఈ ఇసుక వివరాలు అందజేయాలన్నారు. లిటిగేషన్స్ లేకుండా చూడాలని పేర్కొన్నారు. గ్రామ, మండల స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన ఇసుకను అందించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా మైన్స్ అండ్ జియాలటీ అధికారి డి.వెంకట సాయి, డీపీఓ బి.వి.నాగసాయి కుమార్ , ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం: మహా కుంభమేళా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ శుక్రవారం ఈ విషయం తెలిపారు. ●నంబర్ 07701 గుంటూరు – ఆజంగడ్ రైలు జనవరి 25వ తేదీన, 07702 ఆజంగడ్ – గుంటూరు రైలు 26న నడపనున్నట్లు తెలిపారు. గుంటూరు, కృష్ణా కెనాల్, విజయవాడ, కొండపల్లి, ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్, బలార్షా, చంద్రాపూర్, నాగపూర్ మీదుగా ఇవి ప్రయాణించనున్నాయి. ●నంబర్ 07719 గుంటూరు – గయా రైలు జనవరి 25వ తేదీన, 07720 గయా – గుంటూరు రైలు 27న నడవనున్నాయి. గుంటూరు, విజయవాడ, కొండపల్లి, మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, బలార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్ మీదుగా ఇవి రాకపోకలు సాగించనున్నాయి. -
ఏసుక్రీస్తు మార్గంలో నడవాలి
గుంటూరు వెస్ట్: సర్వ మానవాళి సుఖ సంతోషాలతో జీవించాలంటే ఏసుక్రీస్తు చూపిన శాంతి, ప్రేమ మార్గాల్లో నడవాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ, క్రైస్తవ మైనార్టీ ఆర్థిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రైస్తవంలో ఉన్న ప్రేమ, కరుణ కులమతాలకతీతంగా అందరూ పాటిస్తే సమాజంలో ఎలాంటి విభేదాలు ఉండవన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యం, భక్తి గీతాలు అలరించాయి. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, మొహమ్మద్ నసీర్ అహ్మద్, ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్, ఏపీ మాదిగ కార్పొరేషన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ చైర్పర్సన్ డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, డెప్యూటీ మేయర్ షేక్ షజిల, ఫాదర్ ఇన్నయ, పరదేశిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఆలయ పరిసరాల్లో ఆంక్షలు
మంగళగిరి: జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిమిత్తం ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు ఆలయ ఈవో ఎ.రామకోటిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 నుంచి జనవరి 12వ తేదీ వరకు నాలుగు వైపులా వీధులలో వాహనాలు అనుమతించబోమని పేర్కొన్నారు. పార్కింగ్ కోసం ఘాట్ రోడ్ పక్కన స్థలం అందుబాటులో ఉంటుందని, సీకే బాలికల హైస్కూలులో ఏర్పాట్లు చేస్తామని వివరించారు. -
వైఎస్ జగన్ బర్త్‌డే శుభాకాంక్షల ఫ్లెక్సీల తొలగింపు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు, నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, జెండాలను శుక్రవారం సిబ్బంది తొలగించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీన జరుపుకొంటుండగా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు కనకదుర్గ వారధి, బైపాస్‌రోడ్, సర్వీస్‌రోడ్, తాడేపల్లి రోడ్డులోని ఇతర ప్రాంతాల్లో ఆయన ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేశారు. పుట్టా ప్రతాప్‌రెడ్డి అనే అభిమాని ఏకంగా 2 వేల ఫ్లెక్సీలను, జెండాలను కనకదుర్గ వారధి వెంబడి ఏర్పాటు చేస్తే.. వాటిని పూర్తిగా తొలగించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరిలో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్సీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఫ్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేసిన దగ్గరే కూటమి నాయకులు ఏర్పాటు చేసిన అనేక ఫ్లెక్సీలు, జెండాలున్నాయని గుర్తుచేశారు. వాటిని తొలగించకుండా అధికారులు పక్షపాతం చూపుతున్నారంటూ మండిపడ్డారు. నగర పాలక సంస్థ అధికారుల అత్యుత్సాహం కూటమి నేతల ఫ్లెక్సీల తొలగింపునకు వెనకడుగు వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు -
పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శికి కార్మికుల వినతి
తాడేపల్లిరూరల్: బ్రహ్మానందపురం ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు, నాయకులు గురువారం ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆధ్వర్యంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజన్ను సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... 2014లో కోర్టు ఆదేశాల ప్రకారం యజమానులు దాదాపు రూ.42.93 కోట్లు కార్మికులకు చెల్లించాల్సి ఉందన్నారు. ఆ మొత్తానికి 12 శాతం వడ్డీని కలిపి రెండు నెలల్లో ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు. ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీలో 333 మంది కార్మికులు ఉండగా, దాదాపు సగం మంది అనారోగ్యం, అర్ధాకలితో మృతి చెందారని తెలిపారు. ఒకప్పుడు ఎంతో ఘనంగా బతికిన కార్మికులు నేడు ఆర్థిక బాధలతో, కుటుంబ పోషణ కోసం తమకు నైపుణ్యం లేని పనులకు వెళ్తూ కడుపు నింపుకొంటున్నారని యువరాజన్కు వివరించారు. తగిన న్యాయం చేస్తానని యువరాజన్ హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ తెలిపారు. ఏసీసీ పోరాట కమిటీ కన్వీనర్ కూరపాటి స్టీవెన్ మాట్లాడుతూ.. పీఎఫ్, పెన్షన్ తదితర కార్మికులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లపై హెచ్ఎంటీ తరఫున ఎం.బాలాజీ సంతకాలు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎస్పీ యాజమాన్యం ఆయనకు అధికారం ఇచ్చిందని తెలిపారు. యువరాజన్ను కలిసిన వారిలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి. నాగేశ్వరరావు, తాడేపల్లి పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు, కె. ఆదినారాయణ, బి.అంకయ్య, వై.సాంబయ్య, ఎం.ఆశీర్వాదం, వై.యహోషువా, బి. సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు. కార్మికులు చేస్తున్న దీక్షలో షంషుద్దీన్, రామారావు, బి.నవనీతం, వి.లక్ష్మి, రమాదేవి, దుర్గాభవాని, రిబిక, సాంబశివరావు, సారమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రుల చెంతకు
అద్దంకి రూరల్: ఉదయం తప్పిపోయిన బాలుడిని సాయంత్రానికి అద్దంకి పోలీసులు వెతికి పట్టుకొచ్చిన సంఘటన గురువారం అద్దంకి పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ తెలిపిన వివరాల మేరకు .. అద్దంకి పట్టణానికి గొట్టిపాటి శ్రీధర్ కుమారుడు గొట్టిపాటి ఓంకార్ స్థానిక బెల్ అండ్బెన్నెట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం పాఠశాలకు సైకిల్‌పై వెళ్లిన ఓంకార్.. స్కూల్‌కు వెళ్లే దారిలో సైకిల్, పుస్తకాల బ్యాగ్ పడవేసి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు తమ కుమారుడు తప్పిపోయాడా లేక కిడ్నాప్‌కు గురయ్యాడా అని భయాందోళనతో సీఐకి సమాచారం ఇవ్వడంతో సీఐ కృష్ణయ్య, ఎస్సై ఖాదర్ బాషాల ఆధ్వర్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడి అద్దంకి పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆ బాలుడు సాయంత్రం ఒంగోలు బస్టాండ్‌లో కనబడటంతో తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఎలా వెళ్లావని బాలుడిని అడగ్గా తాను ఒక్కడినే అద్దంకి బస్టాండ్ నుంచి శ్రీశైలం వెళ్లే బస్సు ఎక్కి ఒంగోలు బస్టాండ్‌లో దిగినట్లు తెలిపాడు. బాలుడిని వెతకటంలో విశేష ప్రతిభకనబర్చిన సీఐ కృష్ణయ్య, ఎస్సై ఖాదర్‌బాషాలను, పోలీస్ బృందాన్ని డీఎస్పీ మొయిన్ అభినందించారు. సాయంత్రానికే గుర్తించిన పోలీసులు -
హోరాహోరీగా ఎద్దుల బల ప్రదర్శన పోటీలు
గురజాల/గురజాల రూరల్ : పట్టణంలోనిపాతపాటేశ్వరి అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకుని రైతు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎద్దుల బల ప్రదర్శన పోటీల్లో భాగంగా గురవారం ఆరు పళ్ల జతలు పోటీలు పోటాపోటీగా సాగాయి. ఈ పోటీలను వైద్యుడు చల్లగుండ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పాతమల్లాయిపాలెంకు చెందిన సిద్దంశెట్టి సామ్రాజ్యం ఎద్దుల జత 5201.3 అడుగుల దూరం లాగి ప్రథమస్థానం, కృష్ణాజిల్లా వెదుళ్లపల్లికి చెందిన వల్లభనేని మోహన్‌రావు, గుంటూరు జిల్లా మేడికొండురు మండలం పాలడుగుకు చెందిన వెదుళ్లపల్లి శ్రీనివాసరావు, శాఖమూరి విజయ పవన్ కుమార్ ఎడ్ల జతలు 5,000 అడుగుల దూరం లాగి రెండో స్థానం, గుంటూరు జిల్లా తూళ్లురుకు చెందన మోదుగుల రామిరెడ్డి, గుంటూరు జిల్లా కోల్లిపరకు చెందిన గుదిబండ మాధవ రెడ్డి ఎడ్ల జత 4,600 అడుగుల దూరం లాగి మూడో స్థానం సాధించాయి. గుంటూరు జిల్లా పత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు చెందిన ఎడ్ల జత 4,324 అడుగుల దూరం లాగి నాలుగో స్థానం, పల్నాడు జిల్లా గురజాలకు చెందిన లింగా ధరణీచౌదరి ఎడ్ల జత 4,256 అడుగులు లాగి ఐదో స్థానం, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన కె.హుస్సేన్ ఎడ్ల జత 4,077 అడుగుల దూరం లాగి ఆరోస్థానం, పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లకు చెందిన మేకా అంజిరెడ్డి ఎడ్ల జత 4,000 అడుగుల దూరం లాగి ఏడో స్థానం కై వసం చేసుకున్నట్టు కమిటీ నిర్వహకులు తెలిపారు. శుక్రవారం నాలుగు పళ్ల జతల పోటీలు నిర్వహిస్తామని వివరించారు. -
ఎరువుల దుకాణాలలో తనిఖీలు
భట్టిప్రోలు: ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు నాణ్యమైనవి విక్రయించకుంటే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఏడీఏ సుదర్శనరాజు (సీడ్స్) హెచ్చరించారు. భట్టిప్రోలులోని పలు ఎరువులు, పురుగుమందులు, విత్తనాల దుకాణాలలో గురువారం విస్త్రృత తనిఖీలు నిర్వహించారు. ఆయా దుకాణాలలో తనిఖీలు నిర్వహించి బిల్ బుక్స్, స్టాక్ రిజిస్టర్లు, ఎరువులు, పురుగు మందు నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో భట్టిప్రోలు ఏవో జి.మీరయ్యతోపాటు బాపట్ల వ్యవసాయశాఖ కార్యాలయం టెక్నికల్ ఏఓ ఎ.తిరుమలరావు, తూర్పు గోదావరి జిల్లా నల్లచర్ల ఏఓ కమలరాజు పాల్గొన్నారు. రేపల్లె రూరల్: రైతులకు నాణ్యతతో కూడిన విత్తనాలు, ఎరువులను మాత్రమే విక్రయించాలని వ్యవసాయశాఖ కమిషనరేట్ ఏడీఏ కేఐ సుదర్శనరాజు చెప్పారు. పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను గురువారం వ్యవసాయశాఖల అధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. సుదర్శనరాజు మాట్లాడుతూ రైతులకు అందించే వస్తువులతో పాటు రశీదులను తప్పనిసరిగా అందించాలన్నారు. ఎంఆర్పీ కన్నా అధికంగా విక్రయాలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి దుకాణం ముందు స్టాక్ బోర్డు, ధరల బోర్డులను విధిగా ఏర్పాటు చేయాలన్నారు. దుకాణాలలో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో రేపల్లె ఏడీఏ ఆర్.విజయ్‌బాబు, బాపట్ల వ్యవసాయ కార్యాలయం డీఏవో ఏ.తిరుమలరావు, నల్లజర్ల ఏవో కమల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. స్టాక్ నిల్వలు సక్రమంగా ఉండాలి కర్లపాలెం: ఎరువుల దుకాణాల వద్ద స్టాక్ సక్రమంగా ఉండాలని ఎరువుల తనిఖీ స్క్వాడ్ ఏడీఏ సుదర్శనరాజు పేర్కొన్నారు. కర్లపాలెంలో ఎరువుల దుకాణాలను గురువారం తనిఖీ చేశారు. రైతుల వేలిముద్రలు తీసుకుని ఎరువులు విక్రయాలు చేయాలని సూచించారు. -
విద్యుదాఘాతంతో యువకుడి దుర్మరణం
నరసరావుపేటటౌన్/నరసరావుపేట: విద్యుత్దాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన గురువారం పట్టణంలో జరిగింది. టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం.. పెద్ద చెరువు ఏడో లైనుకు చెందిన ఇర్ల శంకర్(17) తెల్లవారుజామున టీ తాగేందుకు ఇంటి నుంచి బజారుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో రోడ్డుపై తెగి పడి ఉన్న విద్యుత్ తీగను పక్కకు తొలగించేందుకు పట్టుకున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ హైమారావు, ఎస్ఐ హరిబాబు, సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి విద్యుత్ తీగ తెగి పడటంతో దాన్ని పట్టుకొని ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి తల్లి ధనలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రూ.పది లక్షలు చెల్లించాలి విద్యుదాఘాతంతో మృతి ెందిన ఇర్ల శంకర్ కుటుంబానికి తక్షణమే రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్‌లోని మార్చురీలో ఉన్న మృతదేహాన్ని గురువారం నాయకులతో కలిసి ఆయన సందర్శించి ఆ కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తక్షణ పరిహారం అందించాలని కోరారు. విద్యుత్ శాఖ ఏఈ ప్రకటించిన రూ.5లక్షల నష్టపరిహారం సరిపోదని పేర్కొన్నారు. గోపిరెడ్డి వెంట గిరిజన కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ నాయకులు అచ్చి శివకోటి, వేముల శివ, షేక్ మాబు, తురక నాగుల్ మీరా, కోట చిన్నబాబు, అవార్డు కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల ధర్నా
నరసరావుపేట: విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విరమించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బరంపేటలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం గేటు ముందు ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ‘ధర్నా‘ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఎన్సీసీఓఇఇ పిలుపు మేరకే స్పంధించిన విద్యుత్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, జేఏసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కార్యాచరణ సమితి సభ్యులు ఆర్ బంగారయ్య, జేఏసీ నాయకులు కె.రవిశంకర్, డెప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాదరావు కేవీఆర్ఎస్ శ్రీనివాసరావు, అన్నీ వర్గాల విద్యుత్ ఉద్యోగులు, మహిళ ఉద్యోగులూ పాల్గొన్నారు. -
పెనుగొండకు అవార్డు ప్రశంసనీయం
నరసరావుపేట: ప్రముఖ అభ్యుదయ రచయిత, కవి, విమర్శకుడు, అరసం జాతీయనేత, న్యాయవాది పెనుగొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక కావడం పల్నాడు జిల్లా సాహితీ లోకానికి గర్వకారణమని అశ్లీలతా ప్రతిఘటనా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. పెనుగొండ బహుముఖ ప్రజ్ఞాశాలి. అభ్యుదయ సాహిత్య ఉద్యమంలో చురుకై న కార్యకర్తని కొనియాడారు. 1989లో అశ్లీలతా ప్రతిఘటన వేదిక ఏర్పాటు, 1995 ప్రాంతంలో అప్పటి అశ్లీల నవలా రచయితలపై కోర్టులో కేసు వేసి నోటీసులు జారీచేసి వారిని కాళ్ళబేరానికి రప్పించి అశ్లీల నవలలు రాయబోమని లిఖితపూర్వక హామీలు ఇప్పించుటలోనూ, విరసం రుక్మిణితోపాటు పెనుగొండ కీలక పాత్ర పోషించారని గోపీచంద్ తెలిపారు. అశ్లీల డాన్సులను ప్రతిఘటించటంలోనూ, గ్రంథాలయాల నుంచి ఏడు అశ్లీల నవలలను నిషేధింపజేయడంలోనూ ప్రముఖ పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ ఏడాది ఆరంభంలో తాను వెలువరించిన ‘కామోత్సవ దహనం‘ పుస్తకాన్ని కొత్తపల్లి రవిబాబుతో పాటు పెనుగొండ సహ సంపాదకత్వం వహించారని గోపీచంద్ గుర్తు చేశారు. శ్రీ శ్రీ సాహిత్యం అంటే వీరాభిమాని అయిన పెనుగొండను ప్రధాన ఉపన్యాసకునిగా పిలిపించి నాటి పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి సత్కరించారని పేర్కొన్నారు. -
విద్యుత్ ఆదాతో భావితరాలకు మేలు
గుంటూరు వెస్ట్: భావితరాలు మనుగడ సాగించాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే విద్యుత్ ఆదా చేయాల్సిన సామాజిక బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ర్యాలీని కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ ఆదాపై అనేక అవగహనా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. తక్కువ విద్యుత్ వినియోగంతో పనిచేసే గృహోపకరణాలు ప్రజలు వినియోగించాలని సూచించారు. సౌర విద్యుత్‌ను కూడా విస్తృతంగా ఉపయోగించుకోవాలి. పీఎం సూర్య గృహ పథకం కింద జిల్లాలో ఇంటిపై కప్పుపై సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు ఇప్పటి వరకు 5,900 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 594 మంది ఇన్స్టాలేషన్ చేయించుకున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. చిత్రలేఖనం, వ్యాస రచన, వక్తృత్వ పోటీల్లో విజేతలను అభినందించారు. వీరిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 10 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులకు 48 గంటలలోపే వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామని తెలిపారు. 17 శాతం వరకు తేమ ఉన్న ధాన్యానికి కూడా ఎంఎస్పీ ధర అందిస్తున్నామని చెప్పారు. ఎంత ధాన్యాన్నైనా కొంటామని కలెక్టర్ వివరించారు. అనంతరం ఎస్బీఐ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అధికారులతో, ప్రజలతో విద్యుత్ ఆదాపై కలెక్టర్, జేసీ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో డీఆర్వో ఖాజావలి, విద్యుత్ శాఖ ఎస్ఈ ఏవీఎల్‌ఎన్ మూర్తి, అధికారులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితులు అరెస్టు
పట్నంబజారు: యువకుడిపై దాడి చేసి హతమార్చిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాత గుంటూరు పోలీసు స్టేషన్ ఎస్హెచ్ఓ వై.వీరసోమయ్య తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 17తేదీ రాత్రి తెనాలి చెంచుపేటకు చెందిన చప్పిడి దీపక్ (27)ను కొంత మంది వ్యక్తులు తీవ్రంగా గాయపరిచి గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించగా అతడు మృతి చెందాడు. జీజీహెచ్ అధికారుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. మృతుడు దీపక్ అలియాస్ నానిగా గుర్తించారు. గత ఏప్రిల్‌లో తెనాలిలో స్నేహితుడు గద్దల కిరణ్ రూ. 54 వేలను దీపక్‌కు ఇచ్చాడు. అప్పటి నుంచి డబ్బులు అడుగుతుంటే దీపక్ మాట దాటవేస్తూ వస్తున్నాడు. కిరణ్ ఈ నెల 16వ తేదీ రాత్రి దీపక్‌ను తెనాలి నుంచి మాయమాటలు చెప్పి బార్లో మద్యం తాగించాడు. గుంటూరులో మందు పార్టీ ఉందని చెప్పి నమ్మబలికాడు. అప్పటికే ఉద్దేశపూర్వకంగా హత్య చేయాలని పక్కా ప్రణాళికతో ఉన్న కిరణ్.. తన స్నేహితులను సిద్ధం చేశాడు. ఆ మేరకు దీపక్‌ను వారితో కలిసి లాలాపేటకు చెందిన బూసా రవిశంకర్, పాతగుంటూరు గాంధీ బొమ్మ సెంటర్‌కు చెందిన షేక్ అక్బర్, పాతగుంటూరు కుమ్మరి బజారుకు చెందిన నల్లమేకల అశోక్, నల్లమేకల గోపి, వినోభానగర్‌కు చెందిన షేక్ ఫెరోజ్, బాలాజీనగర్‌కు చెందిన మాల్య వెంకట సాయికుమార్లు.... బాలాజీనగర్ జీరోలైను రాజీవ్ గృహకల్ప సమీపంలోని ఖాళీ స్థలంలోకి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం మరింత మద్యం తాగించి తనకు రావాల్సిన నగదు గురించి దీపక్‌ను కిరణ్ అడిగాడు. ఇప్పుడు లేవని, తరువాత ఇస్తానని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. ఈ నేపథ్యంలో కిరణ్, దీపక్ మధ్య ఘర్షణ జరిగింది. మరో నిందితుడు రవిశంకర్ మెడలోని గోల్డ్చైన్ను సైతం దీపక్ లాగడంతో తెగిపోయింది. చైన్ ఒక ముక్క రవిశంకర్ చేతికి, మరో ముక్క దీపక్ వద్ద ఉండటంతో ఇవ్వమని అడగ్గా ఈ విషయంలో వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో గద్దల కిరణ్, రవిశంకర్, మిగిలిన వారందరూ కలిసి కర్రలు, బెల్టుతో క్రూరంగా కొట్టి గాయపరిచారు. 16వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్పృహ తప్పి కింద పడిన దీపక్‌ను గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లి చప్పిడి వెంకటరెడ్డి పేరుతో చేర్పించారు. తర్వాత పరారయ్యారు. చికిత్స పొందుతూ 17వ తేదీ ఉదయం దీపక్ మృతి చెందాడు. మృతుడి తండ్రి చంద్రశేఖరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నందివెలుగు రోడ్డులోని వాటర్ ట్యాంకుల వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడు ఈ హత్యకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన ఎస్సైలు షేక్ అబ్దుల్ రహమాన్, ఎన్.సి. ప్రసాద్, హెడ్‌కానిస్టేబుళ్లు కె.కోటేశ్వరరావు, ఎం.డి.నూరుద్దీన్, కె.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు జి.శ్రీనివాస్, పి.మురళీలను అభినందించారు. -
ఏపీపీఎస్ఎం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాగిరెడ్డి
సత్తెనపల్లి: ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్(ఏపీపీఎస్ఎం) అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్తెనపల్లికి చెందిన భవనం నాగిరెడ్డి, రాష్ట్ర అడ్వైజర్‌గా క్రోసూరుకు చెందిన తిప్పిరెడ్డి జైనేంద్రారెడ్డి ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు పీజే ధన్ హాజరై మాట్లాడారు. ఈనెల 29న కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ సమావేశం విజయవంతంపై చర్చించారు. సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని, ప్రైవేటు పాఠశాలల సమస్యలపై చర్చిస్తారని వెల్లడించారు. సత్తెనపల్లి పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రైవేటు పాఠశాల డైరెక్టర్లు అందరూ హాజరు కావాలని కోరారు. జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపికై న భవనం నాగిరెడ్డి, రాష్ట్ర అడ్వైజర్‌గా ఎంపికై న తిప్పిరెడ్డి జైనేంద్రారెడ్డిలను పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి అభినందించారు. -
ఖోఖో జిల్లా జట్టు శిక్షణ పూర్తి
జె.పంగులూరు: స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో గత 20 రోజుల నుంచి ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యాన అండర్–19 ఉమ్మడి ప్రకాశం జిల్లా ఖోఖో జట్టు శిక్షణ తీసుకుంటోంది. గురువారం రాష్ట్ర ఖోఖో కార్యదర్శి, కళాశాల పీడీ మేకల సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ముగింపు జరిగింది. కళాశాల ప్రిన్సిపాల్ మేకల ఉషారెడ్డి మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న జట్టు ఈనెల 20, 21, 22 తేదీల్లో తిరుపతి జిల్లా పుత్తూరులో జరిగే అండర్–19 బాలుర స్కూల్ గేమ్స్ పోటీల్లో ఖోఖో పోటీల్లో పాల్గొనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో జట్టు మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని కోరారు. అనంతరం పీడీ సీతారామిరెడ్డి మాట్లాడుతూ గ్రామస్తులు, కళాశాల ప్రిన్సిపాల్ మేకల ఉషారెడ్డి సహకారంలో శిక్షణ జరిగినట్లు తెలిపారు. అండర్–19 ఉమ్మడి ప్రకాశం జిల్లా జట్టు 24 సంవత్సరాల నుంచి ప్రథమ, ద్వితీయ స్థానాలు వస్తున్నట్లు తెలిపారు. వీరికి క్రీడా దుస్తులు ప్రభుత్వం సహకారంతో సమకూర్చినట్లు తెలిపారు. ఈ జట్టు ప్రథమ స్థానం సాధించాలని బాపట్ల ఆర్ఐఓ సైమన్, డీఐఈఓ ఎర్రయ్య కోరారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు డేవిడ్‌రాజు, లోకేష్ చక్రవర్తి పాల్గొన్నారు.