
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
పెంటపాడు/తాడేపల్లిగూడెం : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. శనివారం మండలంలోని ముదునూరు, ఆకుతీగపాడు, కోరిమిల్లి, కె.పెంటపాడు, యానాలపల్లి, జట్లపాలెంలో రైతు సాధికార సదస్సులు నిర్వహించారు. మదునూరులో సర్పంచ్ అద్దంకి పెద వెంకట రత్నం అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నా రుణమాఫీ, పింఛన్ల పంపిణీని చేపట్టామన్నారు. రుణమాఫీతో సుమారు 32 లక్షల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం కలగనున్నట్టు చెప్పారు.
ఉద్యాన పంటలకు ఎకరానికి రూ.10 వేలు అందించే యోచనలో ప్రభుత్వం ఉందని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన 48 గంటల్లో సొమ్ము ఇచ్చే ఏర్పాటు చేశామని, అలా అందకపోతే తనను సంప్రదించాలని రైతులకు సూచించారు. ఈనాం భూముల పాస్‌బుక్‌ల జారీకి కలెక్టర్ కె.భాస్కర్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఎంపీపీ పెదపోలు వెంకటేశ్వర్లు, జెడ్పీటీసీ సభ్యులు కిలపర్తి వెంక ట్రావు, డీసీసీబీ డెరైక్టర్ దాసరి అప్పన్న, ఎంపీటీసీ సభ్యురాలు అద్దంకి ఆశాజ్యోతి, మాజీ సర్పంచ్ బుద్దన బాబు, ఆకుతీగపాడు బాబు, పాలూరి బాస్కరరావు, ఎంపీడీవో జీవీకే మల్లికార్జునరావు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు పడాల ఉమాశంకర్, మండల ఐకేపీ ఏపీఎం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.