మిలమిలా గోదారి
సాక్షి, రాజమండ్రి : గోదావరి నది మధ్యలో గోదావరి మాత భారీ విగ్రహం నెలకొల్పడంవల్ల రాజమండ్రికి ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యత లభిస్తుందని రాష్ర్ట దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ చేసిన ఈ ప్రతిపాదనను ఆయన స్వాగతించారు. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో గోదావరి నదికి కార్తిక పున్నమి హారతి నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలను ప్రపంచం గర్వించే రీతిలో నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం నెలకోసారి పౌర్ణమి నాడు మాత్రమే నిర్వహిస్తున్న హారతిని ప్రతి రోజూ ఇచ్చేవిధంగా చర్యలు చేపడతామన్నారు.
డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, తెలుగునాట ముమ్మాటికీ రాజమండ్రియే సాంస్కృతిక రాజధాని అని, తమిళనాడులో తంజావూరు మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో రాజమండ్రిని ప్రకటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతోపాటు తెలుగు భాష ప్రధాన కేంద్రంగా కూడా రాజమండ్రినే ఎంపిక చేయాలన్నారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ, అందరూ సహకరిస్తే గోదావరి మధ్యలో భారీ ఎత్తున గోదావరి మాత విగ్రహాన్ని మంత్రి మాణిక్యాలరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి 144 సంవత్సరాలకు గోదావరి నదికి వచ్చే విశేష పుష్కరాలకు వచ్చే ఏడాది రాజమండ్రి వేదిక అవుతోందని, వీటిని ముందు తరాలవారు చూడలేకపోయారని, ముందు తరాలు కూడా చూడలేరని, మనకు మాత్రమే ఆ అదృష్టం దక్కిందని అన్నారు.
మాజీ డీజీపీ అరవిందరావు మాట్లాడుతూ, గోదావరికి షోడశోపచారాలతో వైదిక సంప్రదాయాలతో జరుగుతున్న పున్నమి హారతి కార్యక్రమం భక్తుల్లో భక్తితో పాటు జ్ఞానాన్ని కూడా పెంపొందిస్తుందన్నారు. స్వామి విజ్ఞానానంద మాట్లాడుతూ నదులు పరోపకారార్థం ఉద్భవించినవని, వాటినుంచి మనం నిస్వార్థ సేవ నేర్చుకోవాలని, వాటిని పరిరక్షించుకోవాలని అన్నారు. బుద్ధవరపు ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు బీవీఎస్ కుమార్ సారథ్యంలో జరిగిన ఈ పున్నమి హారతికి వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో పబ్లికేషన్స్ అధినేత డాక్టర్ విజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, చైతన్యరాజు, రవికిరణ్‌వర్మ, రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి,
ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పెందుర్తి వెంకటేశ్, రామకృష్ణంరాజు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ, శ్రీలంకకు చెందిన పర్యావరణ పరిరక్షణ నిపుణుడు, రచయిత దయాదిశ నాయకే, గంగా పరిరక్షణకు కృషి చేస్తున్న స్వామి విజ్ఞానానందజీ, రామదూతస్వామి, రైల్వే అడిషనల్ డీజీ కిశోర్‌కుమార్, సమాచార శాఖ జాయింట్ కమిషనర్ ప్రసాదరావు, మాజీ డీజీపీ అరవిందరావు, ప్రముఖ పాత్రికేయులు శ్రీనివాస్, వల్లీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.