సాయంలోనూ రాజకీయాలా
తాడేపల్లిగూడెం : తుపాను బాధితులకు సాయం చేయడంలోనూ రాజకీయాలు చేస్తారా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉండే ప్రాంతాల్లో మాత్రమే సాయం చేయాలా.. ఇదేం న్యాయం.. అంటూ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం సాయం అందించేవాడు బాధితుడు ఔనా.. కాదా అనేది మాత్రమే ప్రామాణికం కావాలి కానీ అతడు టీడీపీనా, బీజేపీయా అనే కోణంలో చూడడం దారుణమంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం స్థానిక గుణ్ణం ఫంక్షన్ హాలులో జరిగిన ఒక కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వైఖరిపై మంత్రి బహిరంగ వ్యాఖ్యలు చేశారు.
విశాఖలో హుదూద్ తుపాను బాధితులకు సాయం అందించే విషయంలో గూడెం ప్రాంతంలో సేకరించిన వస్తువులు, ఇతర సామాగ్రి టీడీపీ నాయకులున్న చోట మాత్రమే పంచాలని, అక్కడికే పంపాలని బాపిరాజు చెప్పినట్టుగా తన దృష్టికి వచ్చిందన్నారు. ఇది సరైనా పద్ధతా అని ప్రశ్నించారు. ఇలాంటి రాజకీయాలు చేసే వారికి మునిసిపల్ వైస్ చైర్మన్ లాంటి వ్యక్తులు మద్దతివ్వవచ్చా అని నిలదీశారు. తాను భీమిలి నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా పనిచేశానని, అక్కడ ఎమ్మెల్యే టీడీపీకి చెందినవారని, అలాగని, బీజేపీకి చెందిన తాను సహాయం అందించ లేదా అని మాణిక్యాలరావు ప్రశ్నించారు.
మనం సాయం అందించేవాడు నిజమైన బాధితుడా, అతనికి సహాయం సక్రమంగా అందుతుందా అనే కోణంలో మాత్రమే ఆలోచిస్తామన్నారు. తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీను తుపాను వచ్చిన రోజు సాయంత్రం 15 వేల ఆహారపు పొట్లాలను ఇక్కడి నుంచి తీసుకురాగా, అక్కడ పంచామన్నారు. తుపాను హెచ్చరికలు వెలువడిన వెంటనే సింహాచలం దేవస్థానం నుంచి ఆహార పొట్లాలను తుపాను ప్రభావిత ప్రాంతంలో సిద్ధంగా ఉంచామన్నారు. రాజకీయాలు ఎన్నికల సమయంలో చేసుకోవాలి గాని, సహాయ కార్యక్రమాల సమయంలో కాదని మంత్రి విమర్శించారు. ఎన్నికల సమయంలో తాను ఇంటిలో ఉండి రాజకీయాలు చేశానని, ఇలాంటివి తనకు కొత్తేమీ కాదన్నారు. టీడీపీ నేతలు తమ వైఖరి మార్చుకోవాలని మంత్రి సూచించారు.