సాక్షి, విజయవాడ: తనపై సొంత పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో బీజేపీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారం వివరణ ఇచ్చారు. అనారోగ్యం కారణంగానే నిన్న జరిగిన పార్టీ పదాధికారుల సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయినట్టు వెల్లడించారు.
అసలేం జరిగింది..?
రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అధ్యక్షతన ఆదివారం విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కమలనాథులు కీలక విషయాలు చర్చించారు. ఏపీ ప్రభుత్వం నుంచి బీజేపీ మంత్రులు బయటకు వచ్చి సీఎం చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేశారు. అప్పటివరకు సమావేశంలో ఉన్న మంత్రి కామినేని శ్రీనివాస్ ఈ అంశం ప్రస్తావనకు రాగానే బయటకు వెళ్లిపోయారు. ఆయన హడావుడిగా బయటకు వెళ్లిపోవడం పట్ల పలువురు అభ్యంతరం చేశారు. దీంతో మంత్రి కామినేని ఈరోజు వివరణయిచ్చారు.
ఏ నిర్ణయానికైనా కట్టుబడతా..
బీజేపీ మంత్రుల రాజీనామాలను అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీకి పంపితే బాగుంటుందని సమావేశంలో చర్చించుకున్నారు. పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడతానని మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జవాబిచ్చినట్టు సమాచారం. అయితే ఈ అంశంపై పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే మంచిదని హరిబాబు సూచించడంతో ఈ అంశంపై చర్చను ముగిసించారు.
Comments
Please login to add a commentAdd a comment