కైకలూరు సీటు కోసం టీడీపీ -జనసేన నేతల మధ్య పోరు జరుగుతోంటే పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చబోతోందా? కైకలూరు సీటు నాదే అంటున్న ఆ మాజీ మంత్రి ఎవరు? టీడీపీ ఆవిర్భవించాక కైకలూరు ప్రజలు ఒక్కసారే ఆ పార్టీని గెలిపించారు. అయినా కైకలూరు కోసం ఎందుకు పోటీ పడుతున్నారు? టీడీపీ, జనసేన మధ్యలోకి వచ్చిన ఆ నేత ఎవరు? ఆ మాజీ మంత్రి ప్రయత్నాలు ఫలిస్తాయా?
కైకలూరు నియోజక వర్గానికి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో పది సార్లు కాంగ్రెస్ అభ్యర్ధులే విజయం సాధించారు. రెండు సార్లు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు. టిడిపి, బిజెపి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు ప్రభంజనం వీచినా కైకలూరులోటీడీపీ ఓటమి చెందింది. 1994లో మరోసారి ఎన్టీయార్ ప్రభంజనం వీచిన సందర్భంలో కూడా కైకలూరులో టిడిపి గెలవలేకపోయింది. ఎన్టీయార్ తర్వాతటీడీపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడికి కూడా కైకలూరు నియోజక వర్గం కొరుకుడు పడలేదు. ఇక్కడి ప్రజల నాడి పట్టుకోవడంలో ఆయన ఘోరంగా విఫలమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ టిడిపికి కైకలూరు పై పెద్దగా ఆశలు లేవంటున్నారు. కాకపోతే ఎన్నికల నగారా మోగితే మొక్కుబడిగానైనా పోటీ చేయాలి కాబట్టిటీడీపీ పోటీ చేయాలంతే.
2019 ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ అభ్యర్ధి దూలం నాగేశ్వరరావుటీడీపీ అభ్యర్ధి జయమంగళ వెంకటరమణపై విజయం సాధించారు.టీడీపీ ఆవిర్భవించాక ఒకే ఒక్కసారి కైకలూరులో 2009లో విజయం సాధించింది. అపుడు టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణ ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పై గెలిచారు. 2014 లో ఇదే కామినేని శ్రీనివాస్ బిజెపి అభ్యర్ధిగా బరిలో దిగి గెలవడమే కాకుండా చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జయమంగళ వెంకటరమణను పార్టీ నాయకత్వం పట్టించుకోవడం మానేసింది. దాంతో ఏడాది క్రితమే ఆయనటీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. చంద్రబాబు నాయుడి వైఖరి,టీడీపీ సిద్ధాంతాలు నచ్చకే తాను పార్టీని వీడుతున్నట్లు జయమంగళ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.
2009లోటీడీపీ జెండా ఎగరేసిన జయమంగళ వెంకటరమణ పార్టీని వీడ్డంతోటీడీపీకి బలమైన అభ్యర్ధే లేకుండా పోయారు. ఫలితంగా కొత్తగా ఇన్ ఛార్జ్ ని పెడదామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. కైకలూరు నియోజక వర్గ ఇన్ ఛార్జ్ గా ఉండండయ్యా అని చంద్రబాబు నాయుడు అదే పనిగా పిలుస్తోన్నా ఎవరూ ముందుకు రాలేదు. అందుకే ప్రస్తుతం కొత్త అభ్యర్ధి వేటలో పడ్డారు చంద్రబాబు నాయుడు. జయమంగళ నిష్క్రమణతోటీడీపీకి బలమైన అభ్యర్ధులు లేని నేపథ్యంలో కైకలూరును తమ ఖాతాలో రాసేసుకోవాలని జనసేన భావిస్తోంది. పొత్తులో భాగంగా కైకలూరు నియోజక వర్గాన్ని తమకి కేటాయించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కోసమే కైకలూరు నియోజక వర్గంలో బలోపేతానికి జనసేన రక రకాల ప్రయత్నాలు చేస్తోంది. చంద్రబాబు పై ఒత్తిడి పెంచడానికి జనసైనికులు ప్రయత్నిస్తున్నారు.
గత ఎన్నికల్లో కైకలూరు నియోజక వర్గం నుండి జనసేన తరపున పోటీ చేసిన బి.వి.రావు ఓటమి చెందినప్పటికీ పదివేల పై చిలుకు ఓట్లు సంపాదించుకోగలిగారు. ఈ తర్వాత నియోజక వర్గంలో తన గ్రాఫ్ మరింతగా పెరిగిందని.. తాను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నానని బి.వి.రావు చెప్పుకుంటున్నారు. తనకు కైకలూరు సీటు ఇస్తే కచ్చితంగా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.టీడీపీ జనసేనల మధ్య సీట్ల సద్దుబాటు ఇంత వరకు కొలిక్కి రాలేదు. ఈ సీటు కోసం జనసేన విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే సందట్లో సడేమియాలా మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అమాంతం నిద్రలేచి రంగంలో దూకేశారు. చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ ఇద్దరూ తనకు బాగా క్లోజ్ అంటోన్న కామినేని ఈ సీటు నాదే అని టీడీపీ-జనసేన క్యాడర్ తోనే అంటున్నారట.
జయమంగళ వెంకటరమణ పార్టీని వీడ్డంతో సీటు తమకి వస్తుందని స్థానిక టీడీపీ నేతలు ఆశలు పెట్టుకుంటే జనసేన , బిజెపి నేతలు ఇదే సీటుపై కర్చీఫ్ వేసుకోవడం తెలుగు తమ్ముళ్లకు కునుకులేకుండా చేస్తోంది. అయినా ఓడిపోయే సీటుకోసం ఇంత పోటీ అవసరమా అని రాజకీయ పండితులు సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఇంత వరకు కైకలూరు సీటు వైపు చూడలేదు. ఈ సీటును జనసేనకు కేటాయించాలా వద్దా అన్నది కూడా ఆయన నిర్ణయం తీసుకోలేదు. చివరి నిముషంలో కామినేని శ్రీనివాసే టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దూకినా ఆశ్యర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటువంటి చిత్ర విచిత్ర రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని వారంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment