
నాలుగున్నరేళ్లలో ‘పోలవరం’ నిర్మాణం
పెనుగొండ రూరల్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాలుగున్నరేళ్లలో పూర్తి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పారు. ఆదివారం పెనుగొండలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందుకు ప్రత్యేక అధికారులను కూడా నియమించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వారితో ప్రతివారం సమీక్ష నిర్వహిస్తున్నారని చెప్పారు. నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి, కృష్ణా జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని, రాయలసీమకు దాహర్తి తీరుతుందని, రాష్ట్రానికి విద్యుత్ కొరత ఉండదని చెప్పారు.
పరిశ్రమల స్థాపనకు కృషి
రాష్ట్రాన్ని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు అన్నివిధాల కృషి చేస్తున్నారని తెలిపారు. సింగపూర్, జపాన్‌లలో పర్యటించి పారిశ్రామిక వేత్తలను ఆకర్షించారన్నారు. పరిశ్రమలకు 24 గంటలు నీరు, విద్యుత్ సదుపాయాలు అందించడానికి పూర్తిస్థాయి ప్రణాళిక రూపొందించినట్టు మాణిక్యాలరావు చెప్పారు. పరిశ్రమలు నెలకొల్పడానికి ఎందరో పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని, దీంతో యువతకు ఉపాధి పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో 85 శాతం మందికి లబ్ధి చే కూరిందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకుండానే ఉద్యాన పంటలకూ రుణమాఫీని వర్తింపచేశామన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని సూచించారు. ఈ సందర్భంగా స్థానిక యువజన నాయకులు మంత్రి మాణిక్యలరావును సత్కరించారు. సమావేశంలో జెడ్పీటీసీ రొంగల రవికుమార్, ఎంపీటీసీ ఏడిద కోదండ చక్రపాణి, బీజేపీ నాయకులు పిల్లి వెంకట సత్తిరాజు, కానూరి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.