
విజయవాడ: విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు అవమానం జరిగింది. బుధవారం ఆయన ఆలయ వెనుక భాగం నుంచి వెళ్లే సమయంలో సిబ్బంది గేటుకు తాళం వేసి వెళ్లిపోయారు. అరగంట సేపు ఆయన అక్కడ వేచివున్నారు. మాణిక్యాలరావు వచ్చిన సమయంలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు రావడంతో ఆలయ సిబ్బంది అంతా అటువైపు వెళ్లిపోయారు.
తనపట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిన అధికారులపై మాణిక్యాలరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరణ ఇవ్వాలని ఆలయ అధికారులను ఆదేశించారు. మహామండపం మెట్ల మార్గంలో పారిశుద్ధ్య పనులు చేపట్టకపోవడంపై మండిపడ్డారు. శానిటేషన్ కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. కాగా, తమ పార్టీకి చెందిన మంత్రికి అవమానం జరగడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.