రాజీనామా చేస్తానన్న మంత్రి... దిగొచ్చిన బాబు
జెడ్పీ చైర్మన్ బాపిరాజుపై సీఎం ఆగ్రహం
మిత్రపక్షంతో ఘర్షణ వైఖరి తగదని హితవు
నష్ట నివారణ బాధ్యత కళా వెంకట్రావుకు అప్పగింత
ఏలూరు : రాజీనామా చేస్తానన్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వ్యాఖ్యలతో దిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నష్టనివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. జెడ్పీ చైర్మన్ ముళ్ల పూడి బాపిరాజుపై మండిపడ్డారు. భవిష్యత్‌లో ఇటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ అక్షింతలు వేశారు. సమస్య పరిష్కార బాధ్యతను ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు, రెడ్డి సుబ్రహ్మణ్యంకు అప్పగించారు.
పెంటపాడు మండలం ఆకుతీగపాడు, పడమర విప్పర్రు, అలంపురం గ్రామాల్లో సుమారు రూ.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులు ప్రారంభించడానికి జెడ్పీ చైర్మన్ బాపిరాజు బుధవారం ఏర్పాట్లు చేసుకున్న సంగతి విదితమే. ఈ విషయాన్ని మంత్రి మాణిక్యాలరావుకు తెలియజేయలేదు. దీనిపై ఆగ్రహించిన మంత్రి విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ఆయన ఒక దశలో పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారనే ప్రచారం జరిగింది. దీంతో కంగుతిన్న టీడీపీ నేతలు రంగంలోకి దిగి సీఎం చంద్రబాబు ఎదుట పంచాయితీ ఏర్పాటు చే శారు. గురువారం రాత్రి విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇరువర్గాలతో సమావేశమయ్యారు. ఫిర్యాదుల కట్టతో సీఎం చెంతకుముఖ్యమంత్రి సమక్షంలో పంచాయితీకి వెళ్లేముందు జెడ్పీ చైర్మన్ బాపిరాజు పెద్ద కసరత్తే చేశారు.
తాడేపల్లిగూడెంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఎంపీపీలు, ఇతర ముఖ్య నాయకులతో గురువారం ఉదయం సమావేశమయ్యారు. మంత్రికి వ్యతిరేకంగా వివిధ పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగులను సేకరించి ఒక ఫైల్ తయారు చేశారు. ఓటుకు నోటు కేసు వెలుగు చూసిన సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పదవి నుంచి తప్పుకోక తప్పదని మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలు చేశారని, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారనే ఫిర్యాదులను సైతం సిద్ధం చేశారు. ముఖ్యంగా మైనారిటీ నాయకుల అభిప్రాయాలను సేకరించారు.
ఇవన్నీ ముఖ్యమంత్రి ఎదుట ఉంచి పంచాయితీ చేయాలని భావించారు. అయితే, చంద్రబాబు అందుకు అవకాశం ఇవ్వలేదని సమాచారం. బాపిరాజు తాడేపల్లిగూడెంకు సంబంధించిన అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేయగా సీఎం సీరియస్ అయినట్టు సమాచారం. ‘నువ్వేం చెప్పవద్దు. గతంలోనే నీకు చెప్పాను. ఇది మంచి పద్ధతి కాదు. మిత్రపక్షాన్ని కలుపుకుపోవాల్సిన సమయంలో సమస్యలు సృష్టించవద్దు’ అని గట్టిగా చెప్పడంతో బాపిరాజు మౌనం వహించినట్టు సమాచారం.
ఇదిలావుండగా, జెడ్పీ చైర్మన్ తీరుపై మంత్రి మాణిక్యాలరావు తన వాదనను గట్టిగానే వినిపించినట్టు భోగట్టా. తాను నియోజకవర్గంలో లేని సమయంలోనే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ముందు ఉంచారు. తాను మంత్రిని అయినా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేననే కనీస ప్రోటోకాల్ కూడా పాటించకుండా చేపడుతున్న కార్యక్రమాలు ఇబ్బందిగా మారుతున్నాయని మంత్రి సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. భవిష్యత్‌లో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ముఖ్యమంత్రి బాధ్యత అప్పగించారు.