ఇద్దరి మధ్య ‘ఇగో’ చిచ్చు
ఏలూరు : పోటాపోటీగా అభివృద్ధి పనులు చేపట్టేందుకు తహతహలాడాల్సిన టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ నాయకులు ‘ఇగో’ సమస్యతో కత్తులు దూస్తున్నారు. ఎక్కడికక్కడ తమ వర్గానిదే పైచేయి కావాలంటూ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మధ్య కొన్నాళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. తాజా గా సోమవారం ఆ ఇద్దరూ ఇరు పార్టీల శ్రేణుల సమక్షంలోనే ఆరోపణలు గుప్పించుకున్నారు.
తాడేపల్లిగూడెంలో సోమవారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ అండ్ బీ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు, దేవాదాయ శాఖ మం త్రి పైడికొండల మాణిక్యాలరావు పెంటపాడు మండలం ప్రత్తిపాడు వెళ్లారు.
అక్కడ పంచాయతీ కార్యాలయంలో వారికి అల్పాహారం ఏర్పాటు చేయగా, అదే సమయానికి జెడ్పీ ముళ్లపూడి బాపిరాజు, తాడేపల్లిగూడెం మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ అక్కడకు చేరుకున్నారు. బాపిరాజు మంత్రి మాణిక్యాలరావును ఉద్దేశించి ‘నమస్కారం మినిస్టర్ గారూ.. మా పార్టీ వాళ్లను కాస్త చూడండి. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి చాలా కష్టాలు పడ్డారు.
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల ప్రత్తిపాడులో మీరు ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ప్రారంభించేందుకు వెళ్లినప్పుడు అక్కడ మా ఎంపీటీసీకి కనీస సమాచారం ఇవ్వలేదు. ఇలాగైతే ఎలా’గని అసహనం వ్యక్తం చేశారు. ‘టీడీపీ శ్రేణులను కాకుండా ప్రతిపక్ష పార్టీల వాళ్లను మీరు వెంటేసుకుని తిరుగుతూ ప్రోత్సహిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంత్రి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘ఏం మాట్లాడుతున్నారు.
35 ఏళ్లు నేను కూడా ప్రజాసేవలో ఉండే రాజకీయాల్లోకి వచ్చాను. నేనేం చేయాలో మీరు చెబుతారా’ అని మాణిక్యాలరావు ఘాటుగానే మాట్లాడినట్టు తెలిసింది. వాగ్వాదం ముదిరి పరిస్థితి ఒకింత ఉద్రిక్తపూరితంగా మారడంతో మంత్రి శిద్ధా రాఘవరావు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింప చేశారు.