
సాక్షి, విజయవాడ: దేవాదాయశాఖ మంత్రిగా కొట్టు సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించా. నాకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. నాపై పెట్టిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తా. దేవాదాయశాఖ అంటే సంక్లిష్టమైనది. ప్రస్తుతం దేవాలయాల్లో కొనసాగిస్తున్న సేవల కన్నా మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాను.
అధికారులతో సమీక్షించి వారి సలహాలతో ముందుకెళ్తా. ప్రసాద్ స్కీమ్‌లో అన్ని ప్రముఖ దేవాలయాలని అభివృద్ధి చేస్తాం. చారిత్రాత్మకమైన ఆలయాలు ఏపీలో చాలా ఉన్నాయి. ఏపీలో టెంపుల్ టూరిజం సరిగా లేదు దీనిపై దృష్టి సారించాల్సి ఉంది. ప్రత్యేకయాప్ తయారు చేసి టెంపుల్ టూరిజం అభివృద్ధి చేస్తాం. వీఐపీల కోసమే ఆలయాలు లేవు. భక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తాం. ప్రొటోకాల్ ఉన్నవారికి తగిన గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆలయాలకి సిబ్బంది కొరత అధిగమించడానికి అదనపు సిబ్బందిని తీసుకోవడానికి సీఎం దృష్టికి తీసుకెళ్తాం.
చదవండి: (విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన)
ఆలయాలలో అవినీతి అరికట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. ఆలయాల ఆస్తులు, రికార్డులు డిజిటలైజేషన్ చేయాలి. భగవంతుడు ఆస్థులని రక్షించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఒకే ఆలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని బదిలీలు చేయాల్సిన అవసరం ఉంది' అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment