
15 రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తాం
పెదపాడు : రాబోయే 15 రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. ఇందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వట్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు ఉపకారవేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ గంచీరి దేవికారాణి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ కుటుంబానికి రూ.1.50 లక్షల చొప్పున రుణాలు మాఫీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. డ్వాక్రా గ్రూపునకు లక్ష చొప్పున ఇచ్చి వడ్డీని ప్రభుత్వమే కడుతుందని చెప్పారు. అక్టోబర్ 2 నుంచి పింఛన్లను రూ.1,000కి పెంచుతున్నట్టు తెలిపారు.
పేద విద్యార్థులంతా చదువుకుని ఉన్నతస్థితికి చేరుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేయాలని నిర్ణయించినట్టు మాణిక్యాలరావు చెప్పారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ అభయహస్తం, ఆమ్‌ఆద్మీ, జనశ్రీ బీమా యోజన స్కాలర్‌షిప్పులను నియోజకవర్గంలో 5,661మందికి అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో 70 వేల 600 మందికి ఉపకార వేతనాలు మంజూరు చేసినట్టు చెప్పారు. నరసాపురం ఎంపీ గంగరాజు మాట్లాడుతూ ఆశ్రం ఆసుపత్రిలో సేవాగుణంతోనే వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్, దెందులూరు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.