చంద్రబాబే మాకు బాకీ | DWCRA Women Fires on Chandrababu Naidu Over Debt Waiver | Sakshi
Sakshi News home page

చంద్రబాబే మాకు బాకీ

Published Tue, Mar 26 2019 8:02 AM | Last Updated on Tue, Mar 26 2019 10:26 AM

DWCRA Women Fires on Chandrababu Naidu Over Debt Waiver - Sakshi

డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలన్నింటినీ అధికారంలోకి రాగానే మాఫీ చేస్తాం. మహిళా సంఘాలకు లక్ష రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తాం2014 ఎన్నికల మేనిఫెస్టోలో బాబు హామీ

‘‘డ్వాక్రా మహిళలందరికీ చెబుతున్నా.. మీ అప్పులన్నీ నేను మాఫీ చేస్తాను. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు. మీరిక నిశ్చింతగా ఉండొచ్చు’’. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు ఊరూరా తిరిగి ఇలా నమ్మబలికారు.   

ఎన్నికలు ముగిశాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవిలో కూర్చున్నారు. ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనడం చంద్రబాబు సహజ నైజం. అందుకే నాలుగున్నరేళ్లలో ఒక్కరోజు కూడా డ్వాక్రా అక్కచెల్లెమ్మలు గుర్తుకురాలేదు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలని ఎప్పుడూ ఆలోచించలేదు. మరోవైపు వడ్డీతో సహా కట్టాల్సిందేనంటూ బ్యాంకులు నోటీసులు ఇవ్వడంతోపాటు అవమానిస్తుండటంతో..అప్పోసప్పోచేసి, తినోతినకో రుణాలు చెల్లిస్తున్నారు మహిళలు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. అకస్మాత్తుగా చంద్రబాబుకు డ్వాక్రా మహిళలు గుర్తుకొచ్చారు. ఏదో ఒక మాయ చేయాలి. అంతే.. పసుపు–కుంకుమ పల్లవి అందుకున్నారు. రుణమాఫీ చేస్తానని నాలుగున్నరేళ్లు మాయ చేసి.. ఇప్పుడు ఎన్నికల ముందు పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ పేరిట మళ్లీ అప్పులు ఇస్తున్నారని డ్వాక్రా మహిళలు వాపోతున్నారు. పసుపు కుంకుమ కింద ఇస్తానంటున్న పదివేలు పోగా.. ఇంకా చంద్రబాబే తమకు బాకీ ఉన్నాడని అక్కచెల్లెమ్మలు కుండబద్దలు కొడుతున్నారు. 

లంకిరెడ్డి విద్యాధర్‌రెడ్డి సాక్షి, అమరావతి: ‘డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తాను.. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు అంటూ.. 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు చెబితే నమ్మామని.. నాలుగున్నరేళ్లు రుణాల మాఫీ ఊసే ఎత్తలేదని డ్వాక్రా మహిళలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు ‘పసుపు కుంకుమ’ అంటూ కొత్త పథకం ప్రకటించి.. అప్పు ఇస్తూ పసుపు కుంకుమ పవిత్రతను దెబ్బతీస్తున్నారని అక్కచెల్లెమ్మలు చెబుతున్నారు. ఇది ముమ్మాటికీ మహిళలను మోసం చేయడమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి వెలుగు అధికారులు జారీ చేసిన అంతర్గత సర్క్యులర్‌లో.. ‘కేవలం సంఘాల పొదుపు ఖాతాలో మాత్రమే సభ్యులు అప్పులు తీసుకొను నిమిత్తం జమ చేస్తారు’ అని పేర్కొన్నారు. దీన్ని బట్టి పసుపు కుంకుమ పథకంతో డ్వాక్రా సంఘాలకు మళ్లీ అప్పులు మిగిల్చే పరిస్థితి ఎదురుకానుందని మహిళా సంఘాల నేతలు వాపోతున్నారు. మహిళలకు ఉచితంగా పదివేలు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ.. చంద్రబాబు మళ్లీ వారిని మోసం చేస్తున్నారని అంటున్నారు.  ఇదిలా ఉంటే.. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ పెరిగిపోయి..రాష్ట్రంలో డ్వాక్రా మహిళల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. డ్వాక్రా రుణాలు మాఫీ అని ఎన్నికలప్పుడు మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని.. ఇప్పుడు మళీ ఎన్నికలు రాగానే పసుపు కుంకుమ పేరుతో ముష్టేస్తున్నారని మరికొందరు మహిళలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాగా రుణమాఫీ చేయలేదని సాక్షాత్తు మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా రాత పూర్వకంగా చెప్పిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.


పొదుపు సంఘాలకు పసుపు–కుంకుమ నగదును అప్పుగానే ఇస్తున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్‌

చెల్లని చెక్కులిచ్చి
మరోవైపు చెక్కులు బ్యాంకుల్లో మార్చుకునేందుకు మహిళలు నానాపాట్లు పడుతున్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతూ.. చెక్కులు మార్చేకునేందుకు వెళితే కొన్నిచోట్ల చెల్లడం లేదని డ్వాక్రా సంఘాల ఫిర్యాదులు గత వారం రోజులు నుంచి అధికమయ్యాయి. రాష్ట్రంలో 95 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.9వేల కోట్లను తానే ఇచ్చినట్లు సీఎం చంద్రబాబు సభల్లో ప్రకటించడాన్ని మహిళా సంఘాల నేతలు తప్పుపడుతున్నారు.  

టీడీపీ నాయకుల పెత్తనం
పసుపు–కుంకుమ చెక్కులను ఆయా గ్రామాల్లో స్ధానిక టీడీపీ నేతల చేతుల మీదుగా పంపిణీ చేస్తున్నారు. చెక్కులు ఇచ్చేటప్పుడు టీడీపీ నాయకులు తమ అభ్యర్ధుల తరఫున ప్రచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని డ్వాక్రా మహిళలు పేర్కొంటున్నారు. ఆర్ధిక సాయం అందించామని తమపై టీడీపీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ప్రచారానికి పిలిచినా రావాలంటూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారని డ్వాక్రా సంఘాలు వాపోతున్నాయి. టీడీపీ నేతల ఒత్తిళ్లు ఓ వైపు కొనసాగుతుండగా.. మరోవైపు వెలుగు అధికారులు సీఎం సభలకు వెళ్లాలని.. పోలవరం యాత్రలకు పోవాలంటూ బలవంతంగా పంపుతున్నారని డ్వాక్రా మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

పైసా కూడా డ్వాక్రా రుణమాఫీ చేయలేదని అసెంబ్లీలో మంత్రి పరిటాల సునీత ప్రకటనకు సంబంధించిన వార్త క్లిప్పింగ్‌ 

రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు- 9,53,571 
డ్వాక్రా సభ్యుల సంఖ్య- 95,69,080 
బాబు హామీ ఇచ్చినప్పుడు డ్వాక్రా రుణాలు- రూ. 14,204 కోట్లు
రుణాలు మాఫీ కాక వడ్డీలు పెరిగిపోయి ప్రస్తుతం- రూ. 25,424 కోట్లు

చంద్రబాబే నాకు రూ.15వేలు బాకీ
నా పేరు టి.కృపామణి. ప్రకాశం జిల్లా పర్చూరు. ఎన్నో ఏళ్లుగా స్వయం సహాయక సంఘంలో పొదుపు చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నా.  మా గ్రూపు చేస్తున్న పొదుపు కారణంగా గతంలో బ్యాంకు నుంచి రూ.2లక్షలు రుణంగా ఇచ్చారు.  ఒక్కొక్కరికి రూ.20వేల వంతున రుణం దక్కింది. చంద్రబాబు 2014లో ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు.  దాంతో నేను తీసుకున్న రుణానికి వడ్డీ రూ.15వేలు అయింది. అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.35వేల వరకు చెల్లించా. ఇప్పుడు పసుపు–కుంకుమ కింద ఇస్తానన్న రూ.10వేలు, గతంలో ఇచ్చిన రూ.10వేలు కలుపుకున్నా..చంద్రబాబే నాకు ఇంకా రూ.15వేల వరకు బాకీ ఉన్నాడు. చంద్రబాబు ఇస్తున్న రూ.పదివేలతోనే మాకు ఏదో అద్భుతం జరుగుతుందని, కష్టాలన్నీ గట్టెక్కుతాయని చెబుతున్నారు. ఆయన డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని ఇచ్చిన హామీ గురించి మాట్లాడటం లేదు. ఇచ్చిన ఈ డబ్బు కూడా అప్పుగా  ఇచ్చారా అనే అనుమానం కలుగుతోంది.   

మాఫీ అని మాయ చేసి.. ఎన్నికల ముందు ముష్టి 
నా పేరు.. కట్టా  సుజ్ఞానమ్మ. మాది గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడు. గతంలో పావలా వడ్డీ పథకం కింద మేలు జరిగింది. ఇప్పుడు నేను తీసుకున్న రుణానికి రూపాయి వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. డ్వాక్రా రుణాలు మాఫీ అని ఎన్నికలప్పుడు మాయ చేసి..ఇప్పుడు మళ్లీ ఎన్నికల ముందు ముష్టేస్తున్నారు. ఇన్నాళ్లూ గుర్తుకు రాని పసుపు–కుంకుమ పథకం బాబుగారికి ఎన్నికల ముందు  జ్ఞాపకం వచ్చింది. ఆయన జేబులో నుంచి మాకు ఈ డబ్బులు ఇవ్వడం లేదు కదా. చంద్రబాబు ఏ సభ పెట్టినా.. మమ్మల్ని ఒత్తిడి చేసి సభలకు తరలించారు. ఎన్ని పనులున్నా..చేసేదేమీ లేక సభలకు వెళ్లాం. పసుపు–కుంకుమ కింద రూ.పదివేలిచ్చి అదేదో తమ సొంత డబ్బు ఇచ్చినట్లు టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు.

వైఎస్సార్‌ ఆసరా నిలబెడుతుంది 
నా పేరు దండిప్రోలు లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం 21వ వార్డు. నా భర్త అనారోగ్యంతో ఏపనీ చేయలేడు. కుమారుడు, కుమార్తె వివాహాలు కావడంతో వారి పిల్లలతో కుటుంబాలను పోషించుకుంటూ తంటాలు పడుతున్నారు. నేను ఇంటి వద్ద లేసు అల్లికలు చేస్తూ, చీపుర్లూ అల్లుతూ ఎంతోకొంత సంపాదించుకుంటున్నా. 2007 నుంచి డ్వాక్రా గ్రూపులో ఉన్నా. 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తాననే చంద్రబాబు హామీతో వాయిదాలు కట్టలేదు. నిక్షేపంగా నెలనెలా అప్పులు కడుతూ.. మళ్లీ రుణాలు తీసుకునే వాళ్లం. చంద్రబాబు రుణమాఫీ చేస్తామంటే.. అప్పులు కట్టడం మానేశాం. తరువాత బ్యాంకులు ఒత్తిడి చేయడంతో వడ్డీతో సహా కట్టాం. ఇప్పుడు ఇస్తున్న పసుపు కుంకుమ మాకు అప్పులకు కూడా సరిపోదు. అది అప్పేనని సాక్షాత్తు ప్రభుత్వ సర్క్యులర్‌లోనే పేర్కొంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 40–60 సంవత్సరాలోపు మాలాంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఏడాదికి కొంత చొప్పున రూ.75వేలు ఇస్తామంటున్నారు. వైఎస్సాఆర్‌ ఆసరా ద్వారా డ్వాక్రా రుణాల మొత్తం మహిళ చేతికే ఇస్తామని, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని, సున్నా వడ్డీలకే రుణాలు ఇప్పిస్తామని జగన్‌ చెబుతున్నారు. అలా చేస్తే మా బతుకులు మారతాయని నమ్ముతున్నాం. 

రుణ మాఫీ కాక.. అప్పుచేసి బాకీ తీర్చాం    
నా పేరు పెదశింగు రామలక్ష్మి. మాది పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణం, పీచుపాలెం ప్రాంతం. నేను మత్స్యకార మహిళను. భర్త కోటేశ్వరరావు, పెయింటింగ్‌ పనిచేస్తాడు. నాకు ఇద్దరు పిల్లలు. 1999 నుంచి సంగీత పేరుతో ఏర్పడిన డ్వాక్రా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నా.  డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని 2014 ఎన్నికలకు ముందు నమ్మిస్తే.. రుణాలు కట్టలేదు.  దాంతో ఆ రుణాలకు వడ్డీలు రూ.12వేలుపైనే కట్టాం. 2014 ఎన్నికల నాటికి మా గ్రూపునకు రూ.4.80లక్షలు అప్పు ఉంది. అధికారంలోకి వస్తే మొత్తం రుణమాఫీ చేస్తామంటే.. అప్పుకట్టలేదు. 2016 నాటికి వడ్డీ రూ 1.20లక్షలు దాటింది. బ్యాంకువారు నోటీసులు పంపితే అప్పులు చేసి బాకీలు తీర్చాం. మా గ్రూపులో ఒక్కొక్కరూ రూ.12వేలు పైనే వడ్డీకట్టారు. మేం కట్టిన వడ్డీలు అన్నీ కలుపుకుంటే రూ.20వేలు వరకూ లెక్క వస్తుంది. మాకు పసుపు కుంకుమ అని మొన్న రూ.10వేలు చెక్కులు ఇచ్చారు. ఇందులో ఒక చెక్కు మారింది. ఇక మాకు పసుపు కుంకుమ ఎక్కడ ఇచ్చినట్టు? ఇప్పుడిస్తున్న రూ.10వేలు పసుపు కుంకుమ డబ్బు మేం కట్టిందే. మా డబ్బులు మాకిచ్చి.. హంగామా చేయడం ఏమిటి? మమ్మల్ని దారుణంగా మోసం చేస్తున్నారు చంద్రబాబు. 

​​​​​​​
పసుపు కుంకుమ పేరుతో అప్పా?
    
మా డ్వాక్రా గ్రూపు బ్యాంకు నుంచి రూ.2లక్షలు రుణం తీసుకొని పొదుపు చేసుకుంటూ... ఆర్ధిక పరిపుష్టి సాధించాం. 2014 ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని చెబితే.. రుణం చెల్లించలేదు. కాని చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదు. దాంతో బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ పెరిగిపోయింది. చేసేదేమీ లేక వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద బ్యాంకుకు రుణం చెల్లించాం. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు రుణ మాఫీ చేయకుండా... పసుపు కుంకుమ పేరుతో మా దగ్గర నుంచి తీసుకున్న వడ్డీ డబ్బులే మాకు ఇవ్వడం ఏమిటి? చంద్రబాబు మాఫీ చేయకపోవడంతో వడ్డీలు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితిలో అప్పో,సప్పో చేసి బ్యాంకులకు రుణాలు కట్టాం. పసుపు కుంకుమ పేరిట చంద్రబాబు మోసం చేస్తున్నారు.  – బాబు తీరుపై మండిపడుతున్న గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంకు చెందిన డ్వాక్రా గ్రూపు సభ్యులు శాంతారా, ఎస్‌కే జాన్‌బీ, రమీజా, మోతి, అషిరిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement