సాక్షి, న్యూఢిల్లీ : ఓట్ల రూపంలో ఏపీ ప్రజలు షాక్ ఇచ్చారన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు దాన్ని వేరే అంశాలపై నెట్టేయడానికి ఢిల్లీ వేదికగా చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ఆయన వ్యవహారశైలి ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించినట్లైందని ఢిల్లీలోని జాతీయ స్థాయి నాయకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అపజయాన్ని ఈవీఎంలు, ఈసీపై తోసేయడానికి చేస్తున్నట్లుగానే అనిపిస్తుందని అంటున్నారు. ఓటమికి ముసుగువేసే లక్ష్యంతో రెండు రోజుల పాటు ఢిల్లీలో చేసిన విన్యాసాలు ఆయన్ను అపహాస్యంపాలు చేశాయి. శనివారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 18 పేజీల గోడును వెళ్లబోసుకున్నారు. తన మద్దతుదారులైన ఉన్నతాధికారులను బదిలీచేయడాన్ని ప్రధానంగా ప్రస్తావించిన చంద్రబాబు 600కు పైగా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని, అంతిమంగా బ్యాలెట్ ద్వారా జరిపితే అనుమానాలు ఉండవని చెప్పుకొచ్చారు.
ఆరు పార్టీలే హాజరు...
ఇక రెండో రోజు ఆదివారం ఢిల్లీలో కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ మీడియా సమావేశం పేరుతో అట్టహాసంగా ఓ పెద్ద మాళవంకర్ ఆడిటోరియంను బుక్ చేశారు. 22 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి వస్తున్నారని బాగా ప్రచారం చేశారు. కానీ వచ్చింది కేవలం ఆరు పార్టీల ప్రతినిధులు మాత్రమే. ఇందులో కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వి, ఆప్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం నుంచి నీలోత్పల్ బసు, ఎస్పీ నుంచి సురేంద్ర సింగ్ హాజరయ్యారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని, సాఫ్ట్‌వేర్ మార్చవచ్చని, వీవీప్యాట్లను 50 శాతం లెక్కించకుండా ఈసీ సాకులు చెప్పడం సరికాదని వీరంతా పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ ఓటు ఇతర గుర్తులకు వెళ్లిందని చంద్రబాబు తప్ప ఈ తాజా ఎన్నికల్లో ఎవరూ ఆరోపించకపోవడం గమనార్హం. మరోవైపు ఈ పార్టీల ఆరోపణలపై 2017 జూన్ మొదటి వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఒక సవాలు విసిరింది. ఏ పార్టీ అయినా సాంకేతిక నిపుణులతో వచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని సవాల్ విసరగా.. తొలుత ఎన్సీపీ, సీపీఎం స్పందించినా చివరి నిమిషంలో తప్పుకొన్నాయి. మిగిలిన ఏ పార్టీ కూడా స్పందించలేదు.
సుప్రీంకోర్టు ఆదేశాలున్నా....
చంద్రబాబు సహా 22 పార్టీల ప్రతినిధులు తాజాగా 50 శాతం వీవీప్యాట్ల స్లిప్‌లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని వేసిన పిటిషన్‌లో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ... ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 బూత్‌లలో లెక్కించాలని ఆదేశించింది. అయినా చంద్రబాబు తాజాగా బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలని ఈసీని కోరారు. చంద్రబాబు తాను ఓటేసినప్పుడు తన ఓటు ఫ్యాన్ గుర్తుకు పడిందేమో అని మీడియా సమావేశంలో ప్రకటించారు. కానీ తన ఓటు వేరే గుర్తుకు పడినప్పుడు చంద్రబాబు ఎందుకు సవాలు చేయలేదన్నది గమనించాలని జాతీయ రాజకీయ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇక తాను ఇచ్చిన 18 పేజీల్లో తన మద్దతుదారులైన ఉన్నతాధికారులను బదిలీ చేయడం వల్ల తనకు భారీగా నష్టం వాటిల్లిందన్నది ఆయన పరోక్షంగా చెప్పుకొన్న గోడు. అంటే ఎన్నికల్లో తనకు మద్దతిచ్చే అధికారులను ముందే నియమించుకున్నట్లు ఆయనే ఒప్పుకున్నట్లయింది.
బాబు గెలిచింది ఈవీఎంల విధానంలోనే..
ఏపీ విభజన అనంతరం 2014లో ఈవీఎంల ద్వారా జరిగినన ఎన్నికల్లో చంద్రబాబే గెలిచారు. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిందీ ఈవీఎంల ద్వారానే. అన్ని కేంద్రాల్లో వీవీప్యాట్‌లు లేవు. అంటే అప్పుడు తమ ఓటు ఎవరికి పడిందో తెలుసుకునే వెసులుబాటు లేదు. తదనంతర పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్నిచోట్లా వీవీప్యాట్లను పెట్టాలని ఈసీఐ నిర్ణయించింది. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, మిజోరంలో ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్‌లను ఉపయోగించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లలో అధికార బీజేపీ ఓటమిచెంది కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిచింది. కర్ణాటకలో అధికార బీజేపీ ఓటమి పాలైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో పరాజయం చెందింది. అప్పుడు లేని విమర్శలు ఇప్పుడెందుకు పుట్టుకొచ్చాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
బెడిసికొట్టిన బాబు ఢిల్లీ డ్రామా
Published Mon, Apr 15 2019 3:55 AM | Last Updated on Mon, Apr 15 2019 7:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment