vv Pat equipment
-
ఈవీఎం, వీవీ ప్యాట్ల ఓట్లను ఎందుకు లెక్కించరు?
సాక్షి, అమరావతి: ‘ఒంగోలు నియోజకవర్గం పరిధిలోని 12 బూత్‌లలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ఓట్లను లెక్కించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. కానీ ఈసీ మాక్ పోలింగ్ నిర్వహిస్తామంటోంది. ఈవీఎం ఓట్లను.. వీవీ ప్యాట్ల ఓట్లను ఎందుకు లెక్కించరు? రెండింటినీ ఎందుకు మ్యాచ్ చేయరు?’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఈసీ తీరు వల్ల అనుమానాలు మరింత పెరుగుతున్నాయని చెప్పారు. ఈవీఎంలపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు. వైఎస్ జగన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘కోర్టులో వైఎస్సార్సీపీ వేసిన కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికీ మేము అడిగే ప్రాథమిక ప్రశ్న ఒక్కటే.. ఒంగోలు నియోజకవర్గంలోని 12 బూత్‌లలో ఈవీఎంలు.. వీవీప్యాట్ల సంఖ్యను మ్యాచ్ చేయాలని కోరాం. నిజంగానే ఎన్నికల కమిషన్ మనసులో కల్మషం లేకపోతే మ్యాచ్ చేసి చూపించొచ్చు కదా? మా సందేహాలే కాకుండా దేశంలోని అందరి సందేహాలు నివృత్తి అవుతాయి?. కానీ, ఇదే ఈసీహైకోర్టులో.. సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరించేలా వ్యవహరించింది. సుప్రీంకోర్టు ఈవీఎం, వీవీప్యాట్ల నంబర్లను వెరిఫై చేయమని చెప్పలేదని, మాక్ పోలింగ్ మాత్రమే చేయమని చెప్పిందని మాట్లాడుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత మాక్ పోల్ చేయడం వల్ల ఏం సాధిస్తాం. ఈవీఎంలోని నంబర్.. వీవీప్యాట్లను మ్యాచ్ చేయకపోవడంతోనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఆరు నెలలు దాటేస్తే వీవీప్యాట్లపై ఇంక్ పోతుందేమోనని ఎదురు చూస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఇది అన్యాయం. అమెరికా, యూకేతో సహా 90 శాతం అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే ప్రజాస్వామ్యం అన్నది ప్రబలంగా ఉండటం కాదు.. అది ప్రబలంగా ఉన్నట్టు కనిపించాలి. ప్రజాస్వామ్యంలో విలువలను నిలబెట్టాలి.’ అని అన్నారు. -
ఈవీఎంలపై అనుమానాలు బలపర్చిన హర్యానా ఫలితాలు!
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లపై మళ్లీ చర్చ మొదలైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు కావడంతో కాంగ్రెస్ పార్టీ ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఈ ఫలితాలను అంగీకరించేది లేదని ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. పార్టీ వైఖరికి తగ్గట్టుగానే కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. హర్యానా ఎన్నికల సందర్భంగా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్‌లో కనిపించిన తేడాను విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు వీరు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన చోట్ల ఈవీఎంల బ్యాటరీ ఛార్జ్ 70 శాతం మాత్రమే ఉంటే.. బీజేపీ గెలిచిన స్థానాల్లో 99 శాతం ఉండటం ఎలా సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఇదే విషయాన్ని కేరళ కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.హిస్సార్, మహేంద్ర ఘడ్, పానిపట్ జిల్లాలలో ఈవీఎం బ్యాటరీల ఛార్జింగ్ 99 శాతం ఉందని కాంగ్రెస్ గుర్తించింది. అంటే ఇక్కడ ఈవీఎంల టాంపరింగ్ జరిగిందన్న అభియోగాన్ని మోపుతున్నారు. నౌమాల్ అనే శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర సింగ్ ఈవీఎంల బాటరీ ఛార్జింగ్‌పై అభ్యంతరం చెబుతూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు కూడా. తొమ్మిది ఓటింగ్ యంత్రాల నెంబర్లు ఇస్తూ, వాటిలో బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఎలా ఉందంటూ ప్రశ్నించారు. దీనిని బట్టి ఎంపిక చేసుకున్న కొన్ని పోలింగ్ కేంద్రాల్లో టాంపరింగ్ జరిగిందన్న అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా జరిగి ఉంటే ప్రజాస్వామ్యానికి అది పెను ప్రమాదమే అవుతుంది. ఎన్నికలు ఒక ఫార్స్ గా మిగిలిపోతాయి.ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తిగా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలకు గురి అవుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీలో మాదిరే హర్యానాలో కూడా ఎన్నికల ఫలితం ప్రజలను గందరగోళంలో పడేసిందని వ్యాఖ్యానించారు. అమెరికాతో సహా పలు ప్రజాస్వామ్య దేశాలలో ఈవీఎంలు వాడడం లేదని, పేపర్ బాలెట్నే వాడుతున్నారని, దేశంలోనూ పేపర్ బాలెట్ రావాలని ఆయన సూచించారు. ఈ విషయంలో ఆయన దేశానికి మార్గదర్శకత్వం వహించారని అనుకోవాలి.ఏపీలో ఈవీఎంల టాంపరింగ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. ఆశ్చర్యకరంగా ఈ ఆరోపణలు, అనుమానాలను నివృత్తి చేయాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రంలోని ఎన్నికల అధికారులు కాని ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా మాక్ ఓటింగ్ చేస్తామంటూ ప్రజల్లో అనుమానాలు మరింత బలపడేలా వ్యవహరించారు. ఉదాహరణకు ఒంగోలు శాసనసభ నియోజకవర్గంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంల డేటానున వీవీప్యాట్ స్లిప్‌లతో పోల్చి చూపాలని వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇందుకు అవసరమైన ఛార్జీలను కూడా చెల్లించారు. కానీ ఈ పని చేయాల్సిన ఎన్నికల అధికారులు ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేసేందుకు ప్రయత్నించారు. అభ్యర్థి అంగీకరించక పోవడంతో కొత్త డ్రామాకు తెరలేపుతూ.. వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని నమూనా ఈవీఎంలో మాక్ పోలింగ్ జరుపుతామని ప్రతిపాదించారు. ఇందుకు వైసీపీ అభ్యర్థి ససేమిరా అన్నారు. హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వాదోపవాదాలు జరిగాయి. తీర్పు రిజర్వులో ఉంది. చిత్రంగా రెండు నెలలు అయినా తీర్పు వెలువడలేదు. ఈ పరిణామాలన్నీ ప్రజల సందేహాలకు మరింత బలం చేకూర్చాయి.విజయనగరం జిల్లాలో వైసీపీ ఎంపీ అభ్యర్ధి చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి అప్పల నరసయ్యలు కూడా బాలినేని మాదిరిగానే ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. కానీ ఫలితం మాత్రం తేల లేదు. అధికారులు వీవీప్యాట్ స్లిప్‌లు లెక్కించబోమని భీష్మించుకున్నారు. మరోవైపు పోలింగ్ జరిగిన రెండు నెలలైనా ఈవీఎంల బ్యాటరీ ఛార్జింగ్ 99 శాతం ఉండటంపై వివరణ ఇవ్వాల్సిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) అధికారులు తమకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవంటూ తప్పించుకున్నారు. ఈ విషయాలన్నీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈవీఎంల ఏదో మతలబు ఉందని చాలామంది అభిప్రాయపడే స్థితికి కారణమైంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలుగుదేశం పార్టీ ఈవీఎంల మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు చేశారు. అందుకు తగ్గ ఉదాహరణలూ ఇచ్చారు. ఈ సందేహాలన్నింటిపైఎన్నికల సంఘం తగిన వివరణ ఇచ్చి ఉంటే అనుమానాలు బలపడకపోవును. ఇంకోపక్క వీవీప్యాట్ స్లిప్‌లను పోలింగ్ తరువాత 45 రోజుల పాటు భద్రపరచాలన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా కాదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారులు పది రోజులకే స్లిప్‌లు దగ్ధం చేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా వివాదాస్పదమైంది.వీవీప్యాట్ స్లిప్‌లు ఉండీ ప్రయోజనం ఏమిటి?లెక్కించనప్పుడు వివిపాట్ స్లిప్‌ల రూపంలో ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసినట్లు అన్న ప్రశ్నలిప్పుడు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం మొండిగా వ్యవహరిస్తూ జవాబిచ్చేందుకు నిరాకరించడం ఎంత వరకూ సబబు?హర్యానా అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్‌దే విజయమని ఢంకా భజాయించి మరీ చెప్పాయి. ఒక్కటంటే ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని చూచాయగా కూడా చెప్పలేదు. బీజేపీకి మద్దతిచ్చే జాతీయ ఛానళ్లు కూడా ఇదే మాట చెప్పాలి. అయితే అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఫలితాలు బీజేపీకి అనుకాలంగా రావడం గమనార్హం.కౌంటింగ్ మొదలైన తరువాత గంటన్నర పాటు కాంగ్రెస్ పార్టీ 20 నియోజకవర్గాల్లో మెజార్టీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ తరువాత బీజేపీ చాలా నాటకీయంగా పుంజకోవడమే కాకుండా.. మెజార్టీ మార్కును దాటేసింది కూడా. కౌంటింగ్ సందర్భంగా ఆయా రౌండ్ల ఫలితాల వెల్లడి విషయంలోనూ ఎన్నికల సంఘం చాలా ఆలస్యం చేసిందని, దీని వెనుక కూడా కుట్ర ఉందని కాంగ్రెస్ అనుమానిస్తోంది.ప్రజలు నిజంగానే ఓటేసి బీజేపీని గెలిపించి ఉంటే అభ్యంతరమేమీ ఉండదు కానీ.. ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుంది. ఏపీలో ఇదే తరహా పరిణామాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ వంటివారు స్పందించి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించి ఉంటే కాంగ్రెస్ పార్టీ నైతికంగా వ్యవహరించినట్లు అయ్యేది. తాజా పరిణామాలతో తన వాదనను బలంగా వినిపించే అవకాశమూ దక్కేది. అప్పట్లో సందీప్ దీక్షిత్ అనే కాంగ్రెస్ నేత ఏపీలో ఓట్ల శాతం పెరిగిన వైనం, ఈవీఎం ల తీరుపై విమర్శలు చేసినా, వాటికి ఈసీ స్పందించలేదు. ఇంకా పెద్ద స్థాయి నేతలు మాట్లాడి ఉండాల్సింది.ట్యాంపరింగ్ సాధ్యమేనా?సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన నేపథ్యంలో ఈవీఎంల టాంపరింగ్ పెద్ద విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు అవకాశం ఇవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది. కానీ ఈసీ స్వతంత్రంగా వ్యవహరించడం మానేసి, కేంద్రంలో ఉన్న పార్టీకి తొత్తుగా పనిచేస్తోందన్న విమర్శలు ఎదుర్కుంటోంది. టాంపరింగ్ అవకాశం ఉంటే జమ్ము-కాశ్వీర్ లో కూడా జరిగేది కదా అని కొందరు వాదిస్తున్నారు. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ, అన్ని చోట్ల చేయాలని లేదు. ప్రస్తుతం అది కేంద్ర పాలిత ప్రాంతం కనుక కేంద్ర పెత్తనం అక్కడ ఎలాగూ సాగుతుంది. కానీ ఉత్తర భారత దేశం మధ్యలో ఉండే హర్యానాలో బీజేపీ ఓటమి పాలైతే దాని ప్రభావం పరిసర రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉందని భయపడి ఉండవచ్చని, అందుకే సెలెక్టివ్‌గా టాంపరింగ్ జరిగి ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల వాదనగా ఉంది.2009 ముందు వరకు ఈవీఎంలపై ఆరోపణలు పెద్దగా రాలేదు. 2009లో తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడమే కాకుండా, టాంపరింగ్ ఎలా చేయవచ్చో, కొందరు నిపుణుల ద్వారా ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. 2014లో ఆయన విభజిత ఏపీలో గెలిచిన తరువాత మాత్రం దీని ప్రస్తావనే చేయలేదు. 2019లో ఓటమి తర్వాత ఈవీఎంలపై కోర్టుకు వెళ్లిన వారిలో ఈయన కూడా ఉన్నారు.ఆ క్రమంలోనే సుప్రీం కోర్టు వీవీప్యాట్ స్లిప్ లపై మార్గదర్శకాలు ఇచ్చింది. అయినా సరే ఎన్నికల అధికారులు వాటిని పట్టించుకోకపోవడం విశేషం. 2024లో టీడీపీ కూటమి మళ్లీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు కాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాని ఈవీఎంల టాంపరింగ్ ఊసే ఎత్తలేదు. పలు ఆరోపణలు వస్తున్నా, వారు కిమ్మనకపోవడం కూడా ఆసక్తికరంగానే ఉంది. ప్రజలలో అనుమానాలు మరింత బలపడ్డాయని చెప్పవచ్చు.ఈసీ ప్రజల సంశయాలు తీర్చకుండా ఇప్పటిలాగానే వ్యవహరిస్తే దేశంలో ఎవరూ ఎన్నికలను నమ్మని పరిస్థితి వస్తుంది. ప్రజాభిప్రాయాన్ని వమ్ము చేస్తున్నారని రాజకీయ పార్టీలు ఆరోపిస్తాయి. భవిష్యత్తులో జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలలో ఈ సమస్య మళ్లీ ముందుకు రావచ్చు. 2029 లోక సభ ఎన్నికలు బాలెట్ పత్రాలతో జరగాలన్న డిమాండ్ పెరుగుతోంది. అందుకు కేంద్రం అంగీకరించకపోతే ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించే అవకాశం ఉంటుందా అన్నది అప్పుడే చెప్పలేం. బ్యాలెట్ పత్రాల పద్దతి ఉంటే రిగ్గింగ్ జరగదా? జరగదని చెప్పజాలం.1972 లో పశ్చిమబెంగాల్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రిగ్గింగ్ చేసిందని ఆరోపిస్తూ సీపీఎం ఎన్నికలను బహిష్కరించింది. ఆ తర్వాత 1978 ఎన్నికలలో ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది.ఇప్పుడు సీసీటీవీల వ్యవస్థ వచ్చింది కనుక బ్యాలెట్ పత్రాల రిగ్గింగ్‌ను కొంతమేర నిరోధించవచ్చు. ఈవీఎంల వ్యవస్థ వల్ల సులువుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నా, వాటిని మానిప్యులేట్ చేస్తున్నారని జనం నమ్మితే మాత్రం ఈవీఎంలు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు అవుతుంది. ఏది ఏమైనా ఈవీఎంల టాంపరింగ్ కు అవకాశం లేని టెక్నాలజీని వాడాలి. లేదా బాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించడమే మంచిది కావచ్చు. కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ?
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతుండగా వాటిని నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల యంత్రాంగం మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తోంది. తాజాగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని ఈవీఎంల గోదాం వద్ద జరిగిన హైడ్రామానే దీనికి నిదర్శనం. ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు.. ఈవీఎంలున్న ట్రంక్ పెట్టె తాళం చెవి మాత్రం దొరకలేదని తాపీగా చెప్పడంతో దాదాపు రెండు మూడు గంటల పాటు గందరగోళం నెలకొంది. అన్నిచోట్లా గాలించి ఎట్టకేలకు తాళం చెవి తెచ్చేవరకు ఈవీఎంల గోదాం వద్ద కలెక్టర్ తన బృందంతో కలసి పడిగాపులు కాయక తప్పలేదు. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల బ్యాటరీ స్టేటస్, ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలు – వీవీ ప్యాట్లలో ఓట్ల స్లిప్పులను లెక్కించి సరిపోల్చాలని కోరుతూ విజయనగరం లోక్‌సభ వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నర్సయ్య ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. గజపతినగరం నియోజకవర్గంలో మే 13వ తేదీన దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకూ పోలింగ్ జరిగిందని, దాదాపు 81.06 శాతం ఓటింగ్ నమోదైందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈవీఎంలకు, వీవీ ప్యాట్లకు బ్యాటరీ కనీసం 50 శాతమైనా వినియోగమై ఉంటుందన్నారు. అయితే దాదాపు 21 రోజుల తర్వాత జూన్ 4వ తేదీన కౌంటింగ్ కోసం వాటిని తెరిచినప్పుడు బ్యాటరీ స్టేటస్ (పవర్) 99 శాతం చూపించడం తీవ్ర ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అందువల్ల గజపతినగరం అసెంబ్లీ నియోజవర్గం పరిధిలోని దత్తిరాజేరు మండలం పెదకాద పోలింగ్ స్టేషన్ నంబరు 20లో ఈవీఎం, వీవీ ప్యాట్ల బ్యాటరీ స్టేటస్ 99 శాతం ఎందుకు ఉందో వెరిఫికేషన్ చేయాలని కోరారు.తలుపులు తెరిచారు.. తాళం చెవి మరిచారుపోలింగ్ పూర్తి అయిన తర్వాత ఈవీఎంలను, వీవీ ప్లాట్లను నెల్లిమర్లలోని గోదాంలో భద్రపరిచారు. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టరు ప్రతి నెలా వాటిని కచ్చితంగా తనిఖీ చేయాలి. బొత్స అప్పల నర్సయ్య, బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు సోమవారం వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని రెండు రోజుల క్రితమే అధికారులకు తెలుసు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల కల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌తో పాటు ఎన్నికల కమిషన్ నియమించిన బెల్ ఇంజనీర్ల బృందం గోదాం వద్దకు చేరుకుంది. అయితే ఈవీఎంలు భద్రపరిచిన గది తాళాన్ని తెరిచిన అధికారులు ఈవీఎంలున్న ట్రంక్ పెట్టె తాళం చెవి మాత్రం మరచిపోయినట్లు చెప్పడం విస్మయం కలిగిస్తోంది. వాస్తవానికి ఆ తాళాలు కలెక్టరేట్లోని ఎన్నికల సెల్ వద్ద ఉండాలి. అయితే మధ్యాహ్నం కావస్తున్నా తాళం చెవి రాకపోవడంతో పగలగొట్టేందుకు అధికారులు సిద్ధం కాగా ఫిర్యాదుదారుల తరఫున హాజరైన బెల్లాన వంశీ అభ్యంతరం చెప్పారు. చివరకు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎట్టకేలకు తాళాలు పట్టుకొచ్చి బాక్స్‌లను తెరిచారు.మాక్ పోలింగ్‌లోనూ చిత్ర విన్యాసాలు..ఫిర్యాదుదారులు పరిశీలించాలని కోరిన పెదకాద పీఎస్ నంబరు 20కి సంబంధించిన ఈవీఎంను బయటకు తీసి బ్యాటరీని సీజ్ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆ బ్యాటరీకి బదులు కొత్త బ్యాటరీతో ఈవీఎం మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే పార్టీల గుర్తులు గాకుండా తమకు నచ్చిన గుర్తులు లోడ్ చేసి మాక్ పోలింగ్ ప్రారంభించారు. వీవీ ప్యాట్లను కూడా పెట్టలేదు. సుమారు 1,400 ఓట్లున్న పీఎస్‌కు సంబంధించిన ఈవీఎంను కొత్త బ్యాటరీతో మాక్ పోలింగ్ నిర్వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అర్థరాత్రి దాకా ఈ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ రోజు ఏవిధంగా ప్రక్రియ సాగిందో అదే రీతిలో నిర్వహిస్తేనే పవర్ ఎంత వినియోగమైందో తెలుస్తుందని, అలాకాకుండా మొక్కుబడిగా మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఉపయోగం లేదని బొత్స అప్పల నర్సయ్య, బెల్లాన చంద్రశేఖర్ పేర్కొన్నారు. పోలింగ్ రోజు ఈవీఎం, వీవీ ప్యాట్లకు వినియోగించిన బ్యాటరీ స్టేటస్ కౌంటింగ్ నాటికి ఇంకా 99 శాతం ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. మాక్ పోలింగ్ కోసం వాడిన బ్యాటరీ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు అధికారికంగా నమోదు చేయాలని కలెక్టర్‌ను కోరారు.నేడు కూడా తనిఖీ కొనసాగింపు...విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం కోమటిపల్లి, నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుంపాం పోలింగ్స్టేషన్ల తాలూకు ఈవీఎంలను, వీవీ ప్యాట్లను తనిఖీ చేయాలన్న బెల్లాన చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు మంగళవారం ఆ ప్రక్రియ కొనసాగనుంది. -
టిక్.. టిక్.. టిక్
సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలు–2019 ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 23 ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రెండు రోజులే సమయం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం వేగం పెంచింది. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి డీకేడబ్ల్యూ, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి నెల్లూరు సీటీ, రూరల్, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఓట్లను డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్కించనున్నారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. డీకేడబ్ల్యూలో 6, ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీకి 14, పార్లమెంట్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల వివరాలను ముందుగా సువిధాలో అప్లోడ్ చేయాల్సిఉంది. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు రౌండ్ల వారీగా సువిధాలో అప్లోడ్ చేసిన తరువాతనే ప్రకటిస్తారు. దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఇతరులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ టేబుల్స్ వద్దకు ఏజెంట్లకు అనుమతి లేదు. కౌంటింగ్ సిబ్బంది ఈవీఎంలలో ఓట్లు లెక్కించి ఏజెంట్లకు చూపుతారు. కౌంటింగ్ ఏజెంట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాతనే లోనికి అనుమతిస్తారు. సెల్ఫోన్లు కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి లేదు. సెల్ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు ఈవీఎంలపై పోసే అవకాశం ఉన్నందున వాటిని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకుపోవడానికి అనుమతి లేదు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలి. అటూ.. ఇటూ తిరగడానికి వీలులేదు. ఏజెంట్లకు అవసరమైన మంచినీరు తదితర ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేస్తోంది. భారీ బందోబస్తు కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా నియమించనున్నారు. ఉద్యోగులు, సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై మూడు విడతల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్లను ఏవిధంగా లెక్కించాలో తదితర అంశాలపై కూడా శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న ఉద్యోగులు, సిబ్బందిలో కొంతమందిని రిజర్వులో ఉంచనున్నారు. అవసరమైతే వారి సేవలను వినియోగించుకుంటారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఇతరులకు అల్పహారం, భోజన ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద చేస్తున్నారు. గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి 22వ తేదీ ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. 23వ తేదీ ఉదయం ముందుగా పోటీలో ఉన్న అభ్యర్థులు, అధికారులు స్ట్రాంగ్ రూమ్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేస్తారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కొక్క రౌండ్‌కు 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత నియోజకవర్గానికి 5 వీవీ ప్యాట్ల స్లిప్‌లు లెక్కిస్తారు. వీవీ ప్యాట్లు లెక్కించి సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాల్సిఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ఆర్ఓ ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. -
‘ముందు వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలి’
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్లను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది యలమంజుల బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఒకవేళ వీవీ ప్యాట్లకు, ఈవీఎంలకు మధ్య తేడాలుంటే, ఈ అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై మంగళవారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. కాగా కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషనర్ అన్నీ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న అభ్యర్థనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందా అనే దానిపై వేచి చూడాల్సిందే. -
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఇలా...
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా వేసిన ఓటు సక్రమంగా నమోదైందా? లేదా అనే విషయంపై ఓటర్లలో చాలాకాలంగా సందేహాలు ఉన్నాయి. పారదర్శకత కో సం తిరిగి బ్యాలెట్ పత్రాల పద్ధతినే తీసుకు రావాలనే డిమాండు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పారదర్శకత కోసం వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో మొదటిసారిగా వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు. ర్యాండమ్‌గా వీవీ ప్యాట్ల ఎంపిక.. నియోజకవర్గంలో అసెంబ్లీకి సంబంధించి ఐదు, లోక్‌సభకు ఐదు చొప్పున మొత్తం పది వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రకారం అసెంబ్లీ, లోక్‌సభలకు సంబంధించి మొత్తం 100 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓటర్లనుంచి వచ్చిన ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మీటెడ్ పోస్టల్ బ్యాలెట్లు (ఈటీపీబీఎస్), ఈవీఎంలోని కంట్రోల్ యూనిట్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలను ఫారం–20లో నమోదుచేస్తారు. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించకుండా రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి వీలు లేదు. కౌంటింగ్ చివరిలో వీవీ ప్యాట్ల లెక్కింపు జరుగుతుంది. వీవీ ప్యాట్లను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 267 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయనుకుందాం. ఆ సంఖ్య మేరకు కార్డు సైజు తెల్లటి స్లిప్పులలో పోలింగ్ కేంద్రాల నెంబర్లు రాస్తారు. వీటన్నింటినీ ఒకచోట చేర్చి ఆర్ఓ లాటరీ పద్ధతిలో ఐదు స్లిప్పులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ అభ్యర్థులు/ఎన్నికల ఏజెంట్లు/కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు. అలా ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీ ప్యాట్లను తీసుకొచ్చి అందులోని స్లిప్పులను లెక్కిస్తారు. సంబంధిత పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులు సమానంగా ఉన్నప్పుడు అందరి ఆమోదంతో ఆర్ఓ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించకుండా ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి వీలు లేదు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే.... పోలింగ్ రోజు తొలుత ఏజెంట్ల సమక్షంలో మాక్‌పోల్ నిర్వహించాలి. మాక్‌పోల్‌లో నమోదైన ఓట్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేయాలి. మాక్ పోల్ వల్ల వీవీ ప్యాట్‌లో నమోదైన స్లిప్పులను జాగ్రత్తగా తీసి ఒక కవరులో ఉంచి సీలు చేయాలి. ఆ తర్వాత ఈవీఎంలో క్లియర్ బటన్ నొక్కి అసలు పోలింగ్ ప్రారంభించాలి. ఈ విషయంపై పోలింగ్ సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ సైతం ఇచ్చారు. అయితే జిల్లాలో పలుచోట్ల వీవీ ప్యాట్ స్లిప్పులను తొలగించకుండా అలాగే ఉంచారు. ఇందువల్ల ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులకు తేడా వస్తుంది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. 23న కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు వివరించాలి. వీవీ ప్యాట్ స్లిప్పులను ప్రక్కన పెట్టి ఆ తర్వాత అసలు ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఈవీఎంలు మొరాయిస్తే కౌంటింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయించే అవకాశం లేకపోలేదు. ఏదైనా కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని చూపకపోతే దాన్ని తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారి కస్టడీలో ఉంచాలి. మిగతా ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగించాలి. అన్ని ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొరాయిం చిన ఈవీఎంలను తీసుకు రావాలి. వాటికి సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి ఆ తర్వాత ఫలితాలను విడుదల చేయాలి. మొరాయించిన ఈవీఎంల సమాచారాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల కమిషన్‌కు పంపాలి. -
టీవీ9 భారత్ వర్ష్‌కు ఈసీ వార్నింగ్
సాక్షి, న్యూఢిల్లీ : టీవీ9 భారత్ వర్ష్ ఛానల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చింది. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు మాయం అయ్యాయంటూ తప్పుడు కథనాలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈవీఎంల భద్రత, తరలింపు అంశాలపై అత్యున్నత నిఘా ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టం చేసింది. తప్పుడు రిపోర్టింగ్ చేయకుండా జర్నలిజం ప్రమాణాలు కాపాడాలని హితవు పలికింది. మీడియా జర్నలిజం విలువలు విడిచి దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందని ఈసీ అభిప్రాయపడింది. ప్రజల్లోకి తప్పుడు సమాచారం ప్రచారం చేయొద్దని ఈసీ ఈ సందర్భంగా టీవీ9 భారత్ వర్ష్ చానల్‌కు హితవు పలికింది. కాగా భారత్ వర్ష్ ఛానల్‌ను రవి ప్రకాశ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఫోర్జరీ, నిబంధనలకు విరుద్ధంగా ఆయన భారత్ వర్ష్ చానల్‌కు కోట్లు దారి మళ్లించారంటూ టీవీ9 యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
దొరికిన వీవీ ప్యాట్ స్లిప్పులు.. కలకలం!
సాక్షి, నెల్లూరు : ఆత్మకూరు ప్రభుత్వ పాఠశాలలో ఈవీంఎలకు అమర్చిన వీవీ ప్యాట్ స్లిప్పులు దొరకడం కలకలం రేపింది. ఎన్నికల్లో ఏ పార్టీ గుర్తుకు ఓటు వేశారో ఓటరకు తెలిపేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మేషిన్ల (ఈవీఎంల)కు వీవీ ప్యాట్లు అమర్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో దాదాపు 200 వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికాయి. ఈ స్లిప్పులను ఆత్మకూరు రిటర్నింగ్ అధికారి సోమవారం పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి ఈవీఎంల వినియోగానికి సంబంధించిన శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన స్లిప్పులు ఇవని రిటర్నింగ్ అధికారి తెలిపారు. నిబంధనల ప్రకారం శిక్షణ ఇచ్చినప్పుడు వాడిన వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా భద్రపరచాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో వీవీ ప్యాట్ స్లిప్పులు దొరికిన ఘటనపై అధికారులను వివరణ కోరతామని కలెక్టర్ స్పష్టం చేశారు. -
బాబు గెలిచింది ఈవీఎంల విధానంలోనే..
-
బెడిసికొట్టిన బాబు ఢిల్లీ డ్రామా
సాక్షి, న్యూఢిల్లీ : ఓట్ల రూపంలో ఏపీ ప్రజలు షాక్ ఇచ్చారన్న విషయాన్ని ముందుగానే గ్రహించిన చంద్రబాబు దాన్ని వేరే అంశాలపై నెట్టేయడానికి ఢిల్లీ వేదికగా చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ఆయన వ్యవహారశైలి ఫలితాలు రాకముందే ఓటమిని అంగీకరించినట్లైందని ఢిల్లీలోని జాతీయ స్థాయి నాయకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అపజయాన్ని ఈవీఎంలు, ఈసీపై తోసేయడానికి చేస్తున్నట్లుగానే అనిపిస్తుందని అంటున్నారు. ఓటమికి ముసుగువేసే లక్ష్యంతో రెండు రోజుల పాటు ఢిల్లీలో చేసిన విన్యాసాలు ఆయన్ను అపహాస్యంపాలు చేశాయి. శనివారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 18 పేజీల గోడును వెళ్లబోసుకున్నారు. తన మద్దతుదారులైన ఉన్నతాధికారులను బదిలీచేయడాన్ని ప్రధానంగా ప్రస్తావించిన చంద్రబాబు 600కు పైగా పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని, అంతిమంగా బ్యాలెట్ ద్వారా జరిపితే అనుమానాలు ఉండవని చెప్పుకొచ్చారు. ఆరు పార్టీలే హాజరు... ఇక రెండో రోజు ఆదివారం ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో విపక్షాల సమావేశం ఏర్పాటు చేశారు. జాతీయ మీడియా సమావేశం పేరుతో అట్టహాసంగా ఓ పెద్ద మాళవంకర్ ఆడిటోరియంను బుక్ చేశారు. 22 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి వస్తున్నారని బాగా ప్రచారం చేశారు. కానీ వచ్చింది కేవలం ఆరు పార్టీల ప్రతినిధులు మాత్రమే. ఇందులో కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్, అభిషేక్ మనుసింఘ్వి, ఆప్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సీపీఐ నుంచి సురవరం సుధాకర్‌రెడ్డి, సీపీఎం నుంచి నీలోత్పల్ బసు, ఎస్పీ నుంచి సురేంద్ర సింగ్ హాజరయ్యారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చని, సాఫ్ట్వేర్ మార్చవచ్చని, వీవీప్యాట్లను 50 శాతం లెక్కించకుండా ఈసీ సాకులు చెప్పడం సరికాదని వీరంతా పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ ఓటు ఇతర గుర్తులకు వెళ్లిందని చంద్రబాబు తప్ప ఈ తాజా ఎన్నికల్లో ఎవరూ ఆరోపించకపోవడం గమనార్హం. మరోవైపు ఈ పార్టీల ఆరోపణలపై 2017 జూన్ మొదటి వారంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఒక సవాలు విసిరింది. ఏ పార్టీ అయినా సాంకేతిక నిపుణులతో వచ్చి ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని సవాల్ విసరగా.. తొలుత ఎన్సీపీ, సీపీఎం స్పందించినా చివరి నిమిషంలో తప్పుకొన్నాయి. మిగిలిన ఏ పార్టీ కూడా స్పందించలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలున్నా.... చంద్రబాబు సహా 22 పార్టీల ప్రతినిధులు తాజాగా 50 శాతం వీవీప్యాట్ల స్లిప్‌లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని వేసిన పిటిషన్లో సుప్రీం కోర్టు తీర్పు ఇస్తూ... ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 బూత్‌లలో లెక్కించాలని ఆదేశించింది. అయినా చంద్రబాబు తాజాగా బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలని ఈసీని కోరారు. చంద్రబాబు తాను ఓటేసినప్పుడు తన ఓటు ఫ్యాన్ గుర్తుకు పడిందేమో అని మీడియా సమావేశంలో ప్రకటించారు. కానీ తన ఓటు వేరే గుర్తుకు పడినప్పుడు చంద్రబాబు ఎందుకు సవాలు చేయలేదన్నది గమనించాలని జాతీయ రాజకీయ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇక తాను ఇచ్చిన 18 పేజీల్లో తన మద్దతుదారులైన ఉన్నతాధికారులను బదిలీ చేయడం వల్ల తనకు భారీగా నష్టం వాటిల్లిందన్నది ఆయన పరోక్షంగా చెప్పుకొన్న గోడు. అంటే ఎన్నికల్లో తనకు మద్దతిచ్చే అధికారులను ముందే నియమించుకున్నట్లు ఆయనే ఒప్పుకున్నట్లయింది. బాబు గెలిచింది ఈవీఎంల విధానంలోనే.. ఏపీ విభజన అనంతరం 2014లో ఈవీఎంల ద్వారా జరిగినన ఎన్నికల్లో చంద్రబాబే గెలిచారు. 2015 ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిందీ ఈవీఎంల ద్వారానే. అన్ని కేంద్రాల్లో వీవీప్యాట్లు లేవు. అంటే అప్పుడు తమ ఓటు ఎవరికి పడిందో తెలుసుకునే వెసులుబాటు లేదు. తదనంతర పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్నిచోట్లా వీవీప్యాట్లను పెట్టాలని ఈసీఐ నిర్ణయించింది. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, మిజోరంలో ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లను ఉపయోగించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌లలో అధికార బీజేపీ ఓటమిచెంది కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో టీఆర్ఎస్ గెలిచింది. కర్ణాటకలో అధికార బీజేపీ ఓటమి పాలైంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ట్రాల్లో పరాజయం చెందింది. అప్పుడు లేని విమర్శలు ఇప్పుడెందుకు పుట్టుకొచ్చాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. -
ఈవీఎంలపై విచారణ జరపండి
సాక్షి, న్యూఢిలీ: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసి తన రక్షణ వ్యవస్థకు విఘాతం కలిగించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొత్తం 618 కేంద్రాల్లో అడ్జర్న్డ్ పోల్ (వివిధ కారణాలతో పోలింగ్‌కు విఘాతం కలిగితే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి తిరిగి ఎన్నిక నిర్వహించడం) చేపట్టాలని కోరారు. చంద్రబాబు శనివారం మధ్యాహ్నం పలువురు మంత్రులు, పార్టీ సహచరులతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాతో సుదీర్ఘంగా సమావేశమై 18 పేజీల వినతిపత్రం అందజేశారు. పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలను హ్యాకింగ్ చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఈవీఎంల మొరాయింపుపై విచారణ నిర్వహించాలని, ఫామ్ – 7 దరఖాస్తులకు సంబంధించి ఐపీ చిరునామాను రాష్ట్ర పోలీసులకు అందచేయాలని సీఈసీని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... అధికారులను ఎందుకు బదిలీ చేశారు? ‘‘ఈసీ ద్వారా జరిగిన అవకతవకలు, పక్షపాత వైఖరిపై తీవ్ర అసంతృప్తి, నిరసన తెలియజేశా. ఒక పద్ధతి లేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మాట వినకుండా, నేరస్తులు ఇష్టానుసారంగా పిటిషన్లు ఇస్తే దానికి అనుగుణంగా అధికారులను బదిలీలు చేయడం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐటీ, ఈడీ దాడులు చేసినప్పుడు ఈసీ గమ్మున కూర్చోవడం, ఏపీ ప్రజానీకంపై మూకుమ్మడి దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలిపా. ఏకే శర్మ పనికి రాడని పంపిస్తే ఆయనను పరిశీలకుడిగా నియమించడం, కడప ఎస్పీని మార్చడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చడం చేశారు. మార్చి ఎవరిని నియమించారు? జగన్మోహన్రెడ్డి కేసులో నిందితుడిని వేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఎక్కడికి పోతున్నారు మీరు..? యంత్రాంగాన్ని డీమోరలైజ్ చేశారు. తొలుత ఈవీఎంలు మొరాయించాయి. అవి ప్రారంభమయ్యే సమయానికి స్పీకర్‌పై, ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత అరాచకం ఎన్నడూ లేదు. తొలిసారి జరిగింది. దీనికి కారణం ఎవరు? ఎన్నికల సంఘం బాధ్యత తీసుకుంటుందా? మీ ఇష్టారీతిన బదిలీలు చేసి ఏపీని రావణకాష్టం చేశారు. దుర్మార్గంగా ప్రవర్తించారు. రెచ్చిపోయి రౌడీలంతా రోడ్డు మీదకు చేరారు. చేతగానితనం వల్ల మీరు పూర్తిగా విఫలమయ్యారు. ఒంటి గంటకు మిషన్లు పెట్టారు. మేం పోలింగ్ వాయిదా వేయాలని అడిగితే వినలేదు. మధ్యాహ్నం 3.30, 4.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. క్యూలో నిలబడిన వాళ్లంతా రాతింబవళ్లూ చంటిపిల్లలను చంకనేసుకుని అవస్థలు పడ్డారు. ఎవరిది బాధ్యత? ఈసీది కాదా? ఓటర్లు బిచ్చగాళ్లా? ఓటర్లను గౌరవంగా చూసే బాధ్యత లేదా? సాయంత్రం 5 గంటలకు ఒక పిలుపునిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సామాన్య ప్రజానీకం కంకణం కట్టుకుని వచ్చి క్యూలో నిలబడ్డారు. ఈవీఎంలపై సామాన్యులకు సందేహం ఉంది. వీవీ ప్యాట్లపై సందేహం ఉంది. సుప్రీం కోర్టు అడిగితే వీవీప్యాట్ పత్రాలు లెక్కించేందుకు ఆరు రోజులు పడుతుందని చెప్పారు. ఇలా ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఎలా? ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఉండాలి. ఈవీఎంల మీద ఎప్పటి నుంచో పోరాడాం. మేం పోరాడితేనే వీవీ ప్యాట్లు వచ్చాయి. వీవీ ప్యాట్లు కూడా సరికాదని ఎప్పుడో చెప్పాం. పేపర్ బ్యాలెట్లే ఈ దేశానికి సరైన నిర్ణయం. పేపర్ బ్యాలెట్లపై అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఆపరేట్ చేయమంటే ఎలా చేస్తారు? థర్మల్ పేపర్ మీద చాలా అనుమానం ఉంది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. అందుకే వచ్చాం. రాష్ట్రంలో జరిగిన అవకతవకలను దేశానికి చెప్పాలని వచ్చాం. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఈవీఎంలను ఎవరు మానిప్యులేట్ చేశారు? ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించటాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘ఈవీఎంలు పనిచేయకపోతే ప్రతిపక్షాలు ఎందుకు అడగలేదు? హింస జరిగితే ఎందుకు మాట్లాడలేదు? హింస మీరే చేశారా? రాత్రి మూడు గంటలకు ఎవరు ఓటేశారు? వాళ్లంతా ప్రెస్టీజ్‌గా తీసుకున్నారు. మోదీ, కేసీఆర్, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తిరుగుబాటు చేశారు. తెల్లవారుజాము వరకు ఓట్లేశారంటే చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. లేటుగా పోలింగ్ జరిగిన కేంద్రాల్లో అడ్జర్న్డ్ పోల్గా ప్రకటించాలి. ఫారం– 7ఏపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. తొలి గంటలో పోలింగ్ ఎందుకు జరగలేదు? ఎవరు హ్యాకింగ్ చేశారు? ఎవరు మానిప్యులేట్ చేశారు? వీటికి సమాధానం కావాలి. ఇలాంటిది జరగకుండా ఉండాలంటే పేపర్ బ్యాలెట్ రావాలి..’ అని బదులిచ్చారు. 50 శాతం వీవీ ప్యాట్ల పత్రాలు లెక్కించాలి ‘అన్ని రాజకీయ పార్టీలు, మేధావులతో మాట్లాడతా. జాతీయ స్థాయిలో డిబేట్ చేస్తా. వీవీ ప్యాట్ల పత్రాలు లెక్కించేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నిస్తున్నా. 50 శాతం వీవీ ప్యాట్ల పత్రాలను లెక్కించాలి..’ అని పేర్కొన్నారు. ‘హింస రెండు వైపులా జరగలేదు. మావాళ్లు త్యాగాలు చేశారు. అవతల రౌడీలు వస్తే పారిపోయారనుకోండి ఏమవుతుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బలయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు..’ అని మరో ప్రశ్నకు బదులిచ్చారు. నేడు ఢిల్లీలో సీఎం, విపక్ష నేతల భేటీ ఈవీఎంల పనితీరు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై చంద్రబాబు, ఇతర విపక్ష నేతలు ఆదివారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ సమావేశం జరగనుంది. 12.30 గంటలకు నేతలు మీడియాతో మాట్లాడనున్నారు. -
మీ ఓటెంతో రహస్యం
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల నుంచి ప్రవేశపెట్టిన వీవీప్యాట్లతో ఎవరికి ఓటు వేశారో తెలిసిపోతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. పోలింగ్ బూత్‌లో వేసిన ఓటు మరో వ్యక్తికి తెలిసే అవకాశమే ఉండదని, అటువంటి అపోహలను నమ్మవద్దన్నారు. ఓటు వేసిన వారికి మాత్రమే వీవీప్యాట్‌లో ఎవరికి ఓటు వేశారన్నది ఏడు సెకన్లపాటు కనిపిస్తుందని, ఆ తర్వాత దీన్ని ఇక ఎవ్వరూ చూసే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11 ఎన్నికల ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ద్వివేది ‘సాక్షి’తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు ఎవరికి వోటు వేశారో మాకు తెలుస్తుందంటూ ఎవరైనా ఓటర్లను బెదిరిస్తుంటే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన తర్వాత ఎన్నికలయ్యేంత వరకు నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండటానికి వీల్లేదన్నారు. ప్రచారం తర్వాత ప్రలోభాలు భారీగా పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా వ్యయ పరిశీలకులు ఈ అంశంపై చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.110 కోట్ల నగదు, రూ.23 కోట్ల విలువైన మద్యం, 100 కేజీల బంగారం, 325 కేజీల వెండిని పట్టుకున్నట్లు తెలిపారు. ఒక సహాయకుడు ఒక్కరికే.. దివ్యాంగ ఓటరుకు సహాయకులుగా వచ్చినవారి విషయంలో ఎన్నికల నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని, పోలింగ్ సిబ్బంది వీటిని తూ.చ తప్పకుండా పాటించాలన్నారు. ఒక సహాయకుడు ఒకరికి మాత్రమే సహాయంగా పోలింగ్ కేంద్రంలోకి రావడానికి అనుమతిస్తారని, ఇలా వచ్చిన సహాయకుడి కుడి చేతి వేలుకు ఇంకు మార్కు వేయాల్సి ఉంటుందని, దీనివల్ల అతను మరొకరికి సహాయకుడిగా రావడానికి వీలుండదన్నారు. దివ్యాంగులకు ఓట్ వేసేందుకు వీల్ చైర్లతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదే విధంగా పోలింగ్ కేంద్రాల్లోకి కెమెరాలు, సెల్ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదన్నారు. ఓటరు ఓటు వేయడానికి వచ్చేసరికి అతని ఓటును వేరేవాళ్లు వేసి ఉంటే టెండర్ ఓటు ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని, దీనికి సంబంధించిన పత్రాలు ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉంటాయన్నారు. కానీ ఈ ఓటును ఓట్ల లెక్కింపులో పరిగణనలోకి తీసుకోరని ఆయన స్పష్టం చేశారు. బలగాలు రాకపోయినా... ఎన్నికల నిర్వహణకు అడిగిన పోలీసు సిబ్బంది కంటే 15,000 మంది తక్కువగా వచ్చారన్నారు. అదనపు బలగాలు రాకపోయినా ఉన్న సిబ్బందితోనే పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో సాయుధ బలగాలు వినియోగించి, సున్నిత ప్రాంతాల్లో వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్స్‌తో, వీడియోగ్రఫీ ద్వారా ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 11వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు తమకు అత్యంత కీలకమైన సమయమని, ఈ సమయంలో పార్టీల ఏజెంట్ల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో 50 ఓట్లు మాక్ పోలింగ్ నిర్వహించి వాటిని డిలీట్ చేయడం జరుగుతుందన్నారు. ఇటువంటి సమయంలో ఓటింగ్ యంత్రాల్లో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిదిద్దడానికి నియోజకవర్గానికి ముగ్గురు భెల్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. అలాగే ప్రతీ నియోజకవర్గంలో 20 శాతం అదనపు ఓటింగ్ యంత్రాలు, 25 వీవీప్యాట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందిని తరలించడానికి 7,600 బస్సులు సిద్ధం చేశామని, 10వ తేదీ మధ్యాహ్నం నుంచే సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామన్నారు. -
వీవీ ప్యాట్‌లో తప్పు చూపితే ?
సాక్షి, అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా వీవీప్యాట్లను (ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్) వినియోగిస్తున్నారు. ఈవీఎంలో ఓటరు తాను వేసిన గుర్తుకే ఓటు పడిందా లేదా అనే అనుమానం వచ్చినప్పుడు వీవీప్యాట్ ద్వారా పరిశీలించుకోచ్చు. తాను వేసిన గుర్తు ఒకటైతే వీవీప్యాట్‌లో మరో గుర్తుకు పడినట్లు తప్పు ప్రింట్ చూపిస్తే దానిని రాంగ్ ప్రింట్ ఆఫ్ వీవీప్యాట్ పేపర్ స్లిప్ అంటారు. ఇలాంటి సందర్భంలో పీఓలు ఏం చేయాలని అనేదానిపై ఓటరు అవగాహన కలిగి ఉండాలి. తప్పు ప్రింట్ చూపెడితే.. ప్రిసైడింగ్ అధికారి రూల్ 49ఎంఏ ప్రకారం చర్యలు తీసుకోవాలి. హ్యాండ్ బుక్‌లోని ఆనెక్సర్–15 ప్రకారం ఫిర్యాదు చేసిన ఓటరు వద్ద డిక్లరేషన్‌ను ప్రిసైడింగ్ అధికారి తీసుకోవాలి. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో 17 ఎలో ఓటరు వివరాలు మరోసారి ఎంటర్ చేయాలి. కంట్రోల్ యూనిట్ నుంచి ఓటును విడుదల చేయాలి. ఏజెంట్ల సమక్షంలో ప్రిసైడింగ్ అధికారి వీవీప్యాట్‌లో వచ్చిన స్లిప్‌ను పరిశీలించాలి. ఓటరు ఫిర్యాదు నిజమని తేలితే... ప్రిసైడింగ్ అధికారి పోలింగ్‌ను ఆపేసి రిటర్నింగ్ అధికారికి తెలియజేయాలి. ఓటరు ఫిర్యాదు తప్పని తేలితే 17 ఎలో ఆ ఓటరు రెండోసారి రాసిన వివరాలు రిమార్క్ కాలమ్‌లో ఓటరు చేసిన ఫిర్యాదు తప్పని రాయాలి. 17 సి అనగా పోలైన ఓట్ల వివరాలు తెలిపే ఫారంలోని మొదటి భాగంలో (పార్ట్–1) ఆ వివరాలు నమోదు చేయాలి. ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోతే .. పోలింగ్ సమయంలో ఈవీఎంలు, వీవీప్యాట్లు పనిచేయకపోతే.. వాటి స్థానంలో రిజర్వ్‌లోని వాటిని ఏర్పాటు చేయాలి. కొత్త ఈవీఎం, వీవీప్యాట్‌లో మళ్లీ మాక్‌పోల్ నిర్వíßహించాలి. డిక్లరేషన్ రాయాలి (సింగిల్ ఓటు) ర్క్డ్ ఓటరు వస్తే... ప్రిసైడింగ్ అధికారి వద్ద ఓటరు జాబితాకు సంబంధించి వర్కింగ్ కాపీలు, మార్క్డ్ కాపీలు ఉంటాయి. అందులో ఆబ్సెంట్, షిప్టెడ్, డెత్ (ఏఎస్డీ) జాబితాలో ఉన్న ఓటర్లను మార్క్ చేసి ఉంటారు. మార్క్డ్ ఓటరు ఓటు వేయడానికి వస్తే ప్రిసైడింగ్ అధికారి ఆ ఓటరు తెచ్చిన గుర్తింపుతో ఓటరు జాబితాలోని వివరాలను సరిచూడాలి. నిజమైతే 17ఎలో ఆ ఓటరు సంతకంతో పాటు వేలిముద్ర తీసుకోవాలి. ఓటు వేసేందుకు అనుమతించాలి. ఏఎస్డీ జాబితా నుంచి ఓటు వేసిన వారి వివరాలతో ఒక రికార్డు తయారు చేయాలి. -
వేసిన ఓటు చూసుకోండి
విజయనగరం మున్సిపాలిటీ: మారుతున్న కాలానికి అనుగుణంగా ఓటింగ్ విధానం మార్పులు సంతరించుకుంటోంది. ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తోంది. 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడగా 1951లో దేశంలో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. తొలినాళ్లలో బ్యాలెట్ విధానాన్ని ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఈ విధానంలో బ్యాలెట్ పేపర్‌పై ఓటర్ నచ్చిన అభ్యర్థికి ముద్ర వేసి బ్యాలెట్ బాక్సులో వేయాల్సి ఉంటుంది. అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కించి విజేతను ప్రకటించేవారు. 2004 వరకు ఇదే విధానం కొనసాగగా 2004 సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలు (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) అందుబాటులోకి వచ్చాయి. ఈవీఎం వినియోగంపై ఆరోపణలు రావడంతో ఎన్నికల సంఘం పారదర్శకత కోసం వీవీ ప్యాట్ (ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్)ను ప్రవేశపెట్టింది. ఈసారి ఎన్నికల్లో వీవీ ప్యాట్‌ను వినియోగించనున్నారు. ఈ విధానంలో మీరు ఎవరికి ఓటు వేశారో మీరు ధ్రువీకరించుకునే సదుపాయం కల్పించారు. వీవీ ప్యాట్ అంటే.. ఇటీవల తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వీవీ ప్యాట్‌ను ప్రవేశపెట్టింది. ఓటు వేసిన తర్వాత ఎవరికి పడిందో సరిచూసుకునే వెసులుబాటు కల్పిస్తుండటం వీవీ ప్యాట్ ప్రత్యేకం. ఇందుకోసం వీవీ ప్యాట్ అనే అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సరికొత్త యంత్రం ద్వారా ఎలా ఓటు వేయాలో తెలుసుకుందాం. వీవీ ప్యాట్‌తో ఓటు వేసే విధానం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లగానే అక్కడ ఓటింగ్ కోసం మూడు యంత్రాలు కనిపిస్తాయి. అవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. పోలింగ్ అధికారి తన వద్ద ఉండే కంట్రోల్ యూనిట్ ద్వారా మనల్ని ఓటింగ్‌కు అనుమతిస్తారు. అధికారులు చెప్పిన తర్వాత మనం ఓటు వేయడానికి బ్యాలెట్ యూనిట్ ఉంచిన బూత్‌లోకి వెళ్లాలి. బ్యాలెట్ యూనిట్ మీద అభ్యర్థులకు సంబంధించిన పార్టీల గుర్తులు ఉంటాయి. మనం మొదట బ్యాలెట్ యూనిట్లో నచ్చిన గుర్తుకు ఓటు వేయాలి. ఏడు సెకెన్ల పాటు కనిపించే ఓటు ఎవరూ నచ్చకపోతే ‘నోటా’ బటన్‌పై క్లిక్ చేయాలి. మనం ఓటు వేసిన వెంటనే ఏ అభ్యర్థికి ఓటు వేశామో.. ఆ అభ్యర్థికి సంబంధించిన గుర్తు ముద్రించిన కాగితం ఒకటి వీవీ ప్యాట్ యంత్రానికి అమర్చిన అద్దం వెనకాల కనిపిస్తుంది. ఇది 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. దానిని పరిశీలించి మనం ఎంచుకున్న అభ్యర్థికే ఓటు పడిందా, లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. ఈ విధానంలో ఏ గుర్తుకు ఓటు వేశామో అక్కడికక్కడే కచ్చితంగా ధ్రువీకరించుకోవచ్చు. అనుమానం వస్తే లెక్కింపు వీవీప్యాట్‌లో కనిపించిన కాగితం ముక్క 7 సెకన్ల అనంతరం.. యంత్రం అడుగు భాగంలో అమర్చిన బాక్సులోకి వెళ్లిపోతుంది. అది ఇక బయటకి రాదు. దీంతో మన ఓటు ప్రక్రియ ముగిసినట్టు. యంత్రం పనితీరుపై అభ్యర్థి ఎప్పుడైనా అనుమానం వ్యక్తం చేస్తే ఆ కాగితపు ముక్కలను పరిశీలించి, లెక్కించే సౌలభ్యం ఉండటం ఈ సరికొత్త ఓటింగ్ విధానం ప్రత్యేకత. -
ఇక చకచకా..
బ్యాలెట్ పేపర్ తయారీకే 15 రోజులు, పగలు, రాత్రి యుద్ధ ప్రాతిపదికన ప్రింటింగ్ ప్రెస్‌ల హడావుడి, పెద్ద బ్యాలెట్ పేపరులో గుర్తులను వెదికి ఓటు ముద్ర వేసి మడతపెట్టి పెట్టెలో వేయడం, మళ్లీ అవన్నీ తెరిచి గంటల తరబడి/ కొన్నిసార్లు తెల్లవారే వరకు లెక్కించడం... ఈ సుదీర్ఘ క్రతువుకు స్వస్తి పలుకుతూ అందుబాటులోకి వచ్చినవే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లు. వీటిపై మన అపోహలు, అనుమానాలను తీర్చేందుకు సరికొత్తగా ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) పుట్టుకొచ్చింది. ఓటు మనం కోరుకున్న పార్టీకే పడిందా, లేదా? అన్నది సెకన్లలో చూసుకుని, కచ్చితంగా ధ్రువీకరించుకునే వీలుండటం వీవీ ప్యాట్ల ప్రత్యేకత. పోలింగ్ ప్రక్రియలో వీటి ప్రవేశంతో అంతా సులభతరమైంది. నూతన అధ్యాయం: అవకతవకలకు తావు లేకుండా భారత ఎన్నికల సంఘం 1982లో కేరళలోని పారూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను ప్రవేశపెట్టింది. ఈసీఐఎల్, బెల్ సహకారంతో వీటిని తయారు చేయించింది. కొందరు కోర్టుకెళ్లడంతో కేంద్రం 1988లో ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ చేసి ఈవీఎంల వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. ఉమ్మడి ఏపీలో 1989లో తొలిసారిగా షాద్‌నగర్ (ఇపుడు తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వీటిని వినియోగించారు. 1998 పార్లమెంటు ఎన్నికలు, మధ్యలో పలు అసెంబ్లీల ఎన్నికల్లో వినియోగించారు. 2004 నుంచి దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. పారదర్శకతతో వీవీప్యాట్లు: మన ఓటు అనుకున్న అభ్యర్థికే పడిందా, లేదా అని కాగితం స్లిప్‌లో చూసుకునే అవకాశం ఉంది. దీన్ని మొదటిసారిగా 2013లో నాగాలాండ్‌లోని నాక్సెన్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ప్రవేశపెట్టారు. డిసెంబరులో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించారు. ఇలా పనిచేస్తాయి... ముందుగా కంట్రోల్ యూనిట్‌కు బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్‌ను అనుసంధానం చేస్తారు. కంట్రోల్ యూనిట్ పోలింగ్ బూత్ అధికారి నియంత్రణలో ఉంటుంది. తర్వాత బ్యాలెట్ యూనిట్‌ను, వీవీప్యాట్ యంత్రాలను ఆన్ చేస్తారు. ఈ ప్రక్రియ పోలింగ్ ఏజెంట్ల ఎదుటే జరుగుతుంది. శాంపిల్‌గా 50 ఓట్లు వేస్తారు. నమూనా పోలింగ్‌లో అన్నీ సవ్యంగా ఉన్నాయనిపార్టీల ఏజెంట్లు సంతృప్తి చెందాకే ఓటింగ్ ప్రారంభమవుతుంది. ఓటేసేదిలా... పోలింగ్ సిబ్బంది తనిఖీ పూర్తయ్యాక ఓటరు వేలిపై సిరా గుర్తు పెట్టి బ్యాలెట్ యూనిట్ వద్దకు పంపుతారు. కంట్రోల్ యూనిట్ ద్వారా ఎన్నికల అధికారి బ్యాలెట్ యూనిట్‌ను సిద్ధం చేసిన వెంటనే దానిపై గ్రీన్ లైట్ వెలుగుతుంది. అభ్యర్థి పేరుతో పాటు, గుర్తు, సీరియల్ నంబరు ఉంటుంది. ఓటరు తనకు నచ్చిన గుర్తు ఎదురుగా ఉన్న నీలం రంగు బటన్ నొక్కాలి. వెంటనే ఓటరు ఏ అభ్యర్థికి ఓటు వేశాడో పక్కనున్న వీవీప్యాట్‌లో 7 సెకన్లపాటు కనిపిస్తుంది. అపోహలకు తావులేకుండా... ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు మరింత పారదర్శకంగా నిర్వహించడానికి ఈసీ కొత్త సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. డిసెంబరులో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో అభ్యర్థుల ఫొటోలు సైతం కనిపించే ఏర్పాట్లు చేశారు. దీంట్లో గుర్తులతో పాటు అదనంగా నోటా బటన్ కూడా ఉంటుంది. 2004 ఎన్నికల నుంచి ఇది ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వచ్చింది. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ యూనిట్‌ను ప్రవేశపెట్టారు. పోటీలోఎంతమంది ఉన్నా.. డిసెంబరులో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఎం–3 కంట్రోల్ యూనిట్లను వాడారు. వీటికి 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేయవచ్చు. దీనివల్ల పోటీలో ఎంతమంది ఉన్నా ఇబ్బంది ఉండదు. అపోహలు...ఆరోపణలు ఈవీఎంల వినియోగంపై పలు పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు సందేహాలు వెలిబుచ్చాయి. ఏ పార్టీకి ఓటు వేసినా.. ఒక పార్టీకే పడుతున్నాయంటున్నారు. మళ్లీ పేపర్ బ్యాలెట్ విధానాన్ని తీసుకురావాలని కొన్ని పార్టీలు, ముఖ్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఓటమి నెపాన్ని ఈవీఎంలపై నెడుతున్నారని కొన్ని పార్టీల నాయకులు, అధికారులు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో నెగ్గిన చంద్రబాబు అప్పుడు ఏ ఆరోపణలు చేయలేదు. తెలంగాణలో ఓటమి తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేస్తూ బ్యాలెట్ పేపరు కావాలంటున్నారు. ఆరోపణలు చేస్తున్న వారెవరూ ఎలక్షన్ కమిషన్ ముందు నిరూపించ లేకపోవడం విశేషం.సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
నియంత్రించే.. ‘యంత్రుడు’
సాక్షి, ఎడ్లపాడు: ఇప్పటి వరకు పోలింగ్ స్టేషన్లో రెండు రకాల యంత్రాలు మాత్రమే ఉండేవి. వాటిలో ఒకటి కంట్రోల్ యూనిట్ (సీయూ) యంత్రం, మరొకటి బ్యాలెట్ యూనిట్ (బీయూ) యంత్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఓటింగ్ యంత్రాల నిర్వహణ పారదర్శకంగా ఉండేందుకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అదనంగా ‘ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్’ అనే మూడో యంత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. సింపుల్ వీవీ ప్యాట్‌గా పిలిచే ఈ కొత్త యంత్రంపై వినియోగం, ఉపయోగాలపై ఈవీఎంల ద్వారా ఓటు వేసే విధానంపై మాస్టర్ ట్రైనీలు, ఎలక్ట్రోరల్ అధికారులు జిల్లాలోని అన్ని మండలాల్లోనూ శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. వీవీ ప్యాట్‌తో ప్రయోజనాలు... ఎన్నికల కేంద్రంలో బ్యాలెట్ యూనిట్‌పై ఓటు వేయగానే తక్షణమే తాను ఏ అభ్యర్థికి ఓటు వేసింది..ఏ గుర్తు బటన్ నొక్కిన వివరాలు వీవీ ప్యాట్ యంత్రంలోని చిన్నపాటి కంప్యూటర్ తెరపై స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమాచారం ఓటరుకు కేవలం ఏడు సెకన్ల కాలం మాత్రమే నిలుస్తుంది. ఏడు సెకన్లు పూర్తికాగానే ఆ తెరపై సమాచారం అదృశ్యమైపోతుంది. ఇలా అదృశ్యమైన సమాచారం మరుక్షణమే ఓ చిన్న కాగితంపై ముద్రణై అదే యంత్రంలోని అడుగుభాగాన ఉన్న ఖాళీ బాక్సులో పడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరుక్షణమే ఆ ఓటు సమాచారం పోలింగ్ అధికారి వద్ద ఉంటే కంట్రోల్ యూనిట్‌కు చేరుతుంది. గత ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్లో ఓటు వేయగానే అది కంట్రోల్ యూనిట్లోకి వెళ్లి నిక్షిప్తమయ్యేది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వీవీ ప్యాట్ విధులు ఉంటాయి. ఎప్పుడైనా ఎవరైనా ఓటరు తన ఓటుపై అనుమానాలు, అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. ఏదైనా పార్టీ లేదా ఎవరైనా అభ్యర్థి ఫలానా బూత్‌లో పడిన ఓట్లపై తమకు అనుమానాలు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు వీవీప్యాట్‌లో నమోదైన కాగితాల ఆధారంగా పరిశీలించే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పిస్తోంది. ఇటీవల కాలంలో దేశంలో జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మూడు యంత్రాలతోనే పోలింగ్ నిర్వహించారు. ఈసారి కొత్తగా ప్రవేశపెడుతున్న వీవీప్యాట్ల పని తీరు, ప్రయోజనంపై ఓటర్లకు క్షేత్రస్థాయిలో అవగాహనయ్యేలా ప్రచారం, శిక్షణ ఇవ్వాలని ఎలక్ట్రోరల్ అధికారులకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఓటింగ్‌పరంగా ఎదురయ్యే సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం క్షణాల్లో లభ్యమయ్యే అవకాశాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తెస్తోంది. -
ఈవీఎంల హ్యాక్ అసాధ్యం
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని సీఈవో రజత్‌కుమార్ స్పష్టం చేశారు. ఓటింగ్ యంత్రాల పనితీరుపై అనుమానాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం ఇక్కడ ‘లోక్‌సభ జనరల్ ఎలక్షన్స్– మీడియా మానిటరింగ్ అండ్ మీడియా మేనేజ్మెంట్’అనే అంశంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఈసీ నిబంధనల ప్రకారంగా ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి అంశాలకే యంత్రాంగం పరిమితమవుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఈసీ నియమించే ఎన్నికల పరిశీలకులు, ఎన్నికల వ్యయ పరిశీలకులు తమ పరిధిలోకి రారని, నేరుగా ఈసీకే వారు నివేదికలు అందజేస్తారని వివరించారు. ఎన్నికల సమయంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా అనుసరించాల్సిన పద్ధతుల గురించి జిల్లా ఎన్నికల అధికారులు దానకిషోర్(హైదరాబాద్), రోనాల్డ్‌రాస్(మహబూబ్‌నగర్), డీఎస్ లోకేష్‌కుమార్(రంగారెడ్డి), అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధప్రకాష్, జాయింట్ సీఈవోలు ఆమ్రపాలి, రవికిరణ్, పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ టీవీకే రెడ్డి వివరించారు. వీవీ ప్యాట్ స్లిప్స్‌కు ఐదేళ్ల భద్రత: రోనాల్డ్ రాస్ వీవీప్యాట్ స్లిప్పులను ఐదేళ్లపాటు భద్రపరిచే పద్ధతి ఉందని మహబూబ్‌నగర్ డీఈవో రోనాల్డ్ రాస్ తెలిపారు. ఈవీఎంల సాంకేతికత, వాటి పనితీరు, భద్రతా ప్రమాణాల అంశాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. లోక్‌సభ ఎన్నికలకు కొత్తగా వచ్చే ఎం3 ఈవీఎంలు సాంకేతికంగా పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. పోలింగ్ రోజున క్యూలో ఉన్న వారందరికీ ఓటు వేసే సదుపాయం కల్పించే క్రమంలో అర్ధరాత్రి 12 దాటితే ఎం3 ఈవీఎం క్లోజింగ్ బటన్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుందన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేయడం అసాధ్యమని, దీనిపై ఈసీ బహిరంగ సవాల్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దానకిషోర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో విద్యావంతులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నా ఆశించిన మేరకు పోలింగ్ నమోదు కాకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బోగస్ ఓట్ల నమోదుకు సంబంధించి విచారణ అంశాలు పలు దశల్లో ఉన్నాయని తెలిపారు. -
ఈ సారి కొత్తగా..
సాక్షి, దమ్మపేట: ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం కొన్ని మార్పులు చేసింది. కొన్ని ప్రత్యేక సౌకర్యాలను జోడించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తోంది. అభ్యర్థుల ఫొటోలు ఓటర్లు అభ్యర్థిని గుర్తించేందుకు వీలుగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)పై పోటీలో ఉన్న అభ్యర్థుల ఫొటోలను ఏర్పాటు చేస్తున్నారు. 2014 ఎన్నికల వరకు ఈ విధానం లేదు. త్వరలో జరగనున్న ఎన్నికలకు ఎన్నికల సంఘం ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఓటు సరిచూసుకోవచ్చు ఈవీఎంల పనితీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ సారి ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ ప్యాట్)లను వినియోగిస్తున్నారు. దీంతో మనం ఎవరికి ఓటు వేశామో తెలుసుకోవచ్చు. 7 సెకన్ల పాటు వీవీ ప్యాట్‌లో కనిపిస్తుంది. సీ–విజిల్ యాప్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే ఫిర్యాదు చేయడానికి సీ–విజిల్ యాప్ ఉపయోగపడుతుంది. ఉల్లంఘనకు సంబంధించి వీడియోలు, ఫొటోలు జిల్లా ఎన్నికల అధికారికి అక్కడ నుంచి ఎన్నికల సంఘానికి పంపవచ్చు. -
‘వీవీప్యాట్’ను రూపొందించిన ఈసీఐఎల్
* ఈవీఎంలతో పాటు పక్కనే వీవీప్యాట్ పరికరాల ఏర్పాటు * ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వినియోగం * ఓటింగ్‌లో పారదర్శకత దిశగా ఈసీ తొలిమెట్టు * వీవీప్యాట్ పనితీరును వివరించిన ఈసీఐఎల్ సీఎండీ సుధాకర్ హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి పారదర్శకంగా, విశ్వసనీయంగా ఎన్నికల ప్రకియ జరిగేలా.. ఓటరు సంతృప్తి చెందేలా ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) ప్రింటింగ్ యంత్రాన్ని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) రూపొందించింది. శుక్రవారం ఈసీఐఎల్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పి.సుధాకర్ వీవీప్యాట్ పనితీరును మీడియాకు వివరించారు. ఇటీవల ఓటర్లు తాను ఓటు వేసిన అభ్యర్థికే ఓటు నమోదైందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, వీటిని నివృత్తి చేసేందుకే వీవీప్యాట్‌ను రూపొందించామని తెలిపారు. దీనిని ఓటింగ్ యంత్రంతో పాటు ఉంచుతామని, ఓటరు ఓటు వేసిన వెంటనే తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు, గుర్తు వీవీప్యాట్ పరికరంలోని స్క్రీన్‌పై కొన్ని క్షణాల పాటు కనిపిస్తుందని, ఆ వివరాలు ప్రింట్ మాదిరిగా అందులోనే నిక్షిప్తమవుతాయని వివరించారు. దీనివల్ల ఓటరుకు తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థికే ఓటు వేశానన్న సంతృప్తి కలగడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తినా మ్యానువల్‌గా ఓట్లను లెక్కించే సౌలభ్యం ఉంటుందన్నారు. ఒక్కో యంత్రం లో 1,500 ఓట్లను నమోదు చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల.. బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా వినియోగించినట్లు తెలిపారు. తాజాగా వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో వీటిని వినియోగించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని, ఇప్పటికే 40కిపైగా వీవీప్యాట్ యంత్రాలను ఖమ్మం పంపించామని చెప్పా రు. 2019 సాధారణ ఎన్నికలకల్లా దేశవ్యాప్తంగా వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలు లేవని, కొన్ని పరికరాలను అమర్చితే ట్యాంపరింగ్ చేయవచ్చనేది అపోహ మాత్రమే అని సుధాకర్ స్పష్టం చేశారు. అనేక రకాల సందేహాలు తమ దృష్టికి వచ్చిన సందర్భంలో వాటిని నివృత్తి చేస్తూ వస్తున్నామని, ఇక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా వీవీప్యాట్ దోహదపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరక్టర్ ఫైనాన్స్ కిశోర్ రుంగ్టా, డైరక్టర్ పర్సనల్ వీఎస్ బంగారుబాబు, ఈవీఎం డివిజన్ హెడ్ మహేంద్రన్, ఇన్స్ట్రుమెంట్ డివిజన్ జీఎం అనురాగ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.