సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ముందు ఈవీఎంలను కాకుండా వీవీ ప్యాట్‌లను లెక్కించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో సోమవారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. న్యాయవాది యలమంజుల బాలాజీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఒకవేళ వీవీ ప్యాట్లకు, ఈవీఎంలకు మధ్య తేడాలుంటే, ఈ అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం వీవీ ప్యాట్‌లను లెక్కించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు.
ఇందులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, ప్రధాన ఎన్నికల అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై మంగళవారం ఉదయం న్యాయమూర్తులు జస్టిస్ జి.శ్యాంప్రసాద్, జస్టిస్ కొంగర విజయలక్ష్మీలతో కూడిన ధర్మాసనం విచారించనున్నది. కాగా కనీసం యాభై శాతం వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించాలన్న విపక్షాల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పిటిషనర్ అన్నీ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న అభ్యర్థనను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందా అనే దానిపై వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment