సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా వేసిన ఓటు సక్రమంగా నమోదైందా? లేదా అనే విషయంపై ఓటర్లలో చాలాకాలంగా సందేహాలు ఉన్నాయి. పారదర్శకత కో సం తిరిగి బ్యాలెట్ పత్రాల పద్ధతినే తీసుకు రావాలనే డిమాండు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పారదర్శకత కోసం వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో మొదటిసారిగా వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు.
ర్యాండమ్‌గా వీవీ ప్యాట్ల ఎంపిక..
నియోజకవర్గంలో అసెంబ్లీకి సంబంధించి ఐదు, లోక్‌సభకు ఐదు చొప్పున మొత్తం పది వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రకారం అసెంబ్లీ, లోక్‌సభలకు సంబంధించి మొత్తం 100 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓటర్లనుంచి వచ్చిన ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మీటెడ్ పోస్టల్ బ్యాలెట్లు (ఈటీపీబీఎస్), ఈవీఎంలోని కంట్రోల్ యూనిట్‌లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలను ఫారం–20లో నమోదుచేస్తారు. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించకుండా రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి వీలు లేదు. కౌంటింగ్ చివరిలో వీవీ ప్యాట్ల లెక్కింపు జరుగుతుంది.
వీవీ ప్యాట్లను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 267 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయనుకుందాం. ఆ సంఖ్య మేరకు కార్డు సైజు తెల్లటి స్లిప్పులలో పోలింగ్ కేంద్రాల నెంబర్లు రాస్తారు. వీటన్నింటినీ ఒకచోట చేర్చి ఆర్‌ఓ లాటరీ పద్ధతిలో ఐదు స్లిప్పులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ అభ్యర్థులు/ఎన్నికల ఏజెంట్లు/కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు. అలా ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీ ప్యాట్లను తీసుకొచ్చి అందులోని స్లిప్పులను లెక్కిస్తారు. సంబంధిత పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులు సమానంగా ఉన్నప్పుడు అందరి ఆమోదంతో ఆర్‌ఓ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించకుండా ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి వీలు లేదు.
ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే....
పోలింగ్ రోజు తొలుత ఏజెంట్ల సమక్షంలో మాక్‌పోల్ నిర్వహించాలి. మాక్‌పోల్‌లో నమోదైన ఓట్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేయాలి. మాక్ పోల్ వల్ల వీవీ ప్యాట్‌లో నమోదైన స్లిప్పులను జాగ్రత్తగా తీసి ఒక కవరులో ఉంచి సీలు చేయాలి. ఆ తర్వాత ఈవీఎంలో క్లియర్ బటన్ నొక్కి అసలు పోలింగ్ ప్రారంభించాలి. ఈ విషయంపై పోలింగ్ సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ సైతం ఇచ్చారు. అయితే జిల్లాలో పలుచోట్ల వీవీ ప్యాట్ స్లిప్పులను తొలగించకుండా అలాగే ఉంచారు. ఇందువల్ల ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులకు తేడా వస్తుంది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. 23న కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు వివరించాలి. వీవీ ప్యాట్ స్లిప్పులను ప్రక్కన పెట్టి ఆ తర్వాత అసలు ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది.
ఈవీఎంలు మొరాయిస్తే
కౌంటింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయించే అవకాశం లేకపోలేదు. ఏదైనా కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని చూపకపోతే దాన్ని తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారి కస్టడీలో ఉంచాలి. మిగతా ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగించాలి. అన్ని ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొరాయిం చిన ఈవీఎంలను తీసుకు రావాలి. వాటికి సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి ఆ తర్వాత ఫలితాలను విడుదల చేయాలి. మొరాయించిన ఈవీఎంల సమాచారాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల కమిషన్‌కు పంపాలి.
Comments
Please login to add a commentAdd a comment