కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్ ముత్యాలరాజు
సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలు–2019 ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 23 ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రెండు రోజులే సమయం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం వేగం పెంచింది. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి డీకేడబ్ల్యూ, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు.
నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి నెల్లూరు సీటీ, రూరల్, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఓట్లను డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్కించనున్నారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. డీకేడబ్ల్యూలో 6, ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీకి 14, పార్లమెంట్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల వివరాలను ముందుగా సువిధాలో అప్‌లోడ్ చేయాల్సిఉంది.
దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు రౌండ్ల వారీగా సువిధాలో అప్‌లోడ్ చేసిన తరువాతనే ప్రకటిస్తారు. దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఇతరులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ టేబుల్స్ వద్దకు ఏజెంట్లకు అనుమతి లేదు. కౌంటింగ్ సిబ్బంది ఈవీఎంలలో ఓట్లు లెక్కించి ఏజెంట్లకు చూపుతారు.
కౌంటింగ్ ఏజెంట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాతనే లోనికి అనుమతిస్తారు. సెల్‌ఫోన్లు కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి లేదు. సెల్‌ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు ఈవీఎంలపై పోసే అవకాశం ఉన్నందున వాటిని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకుపోవడానికి అనుమతి లేదు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలి. అటూ.. ఇటూ తిరగడానికి వీలులేదు. ఏజెంట్లకు అవసరమైన మంచినీరు తదితర ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేస్తోంది.
భారీ బందోబస్తు
కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా నియమించనున్నారు. ఉద్యోగులు, సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై మూడు విడతల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్లను ఏవిధంగా లెక్కించాలో తదితర అంశాలపై కూడా శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న ఉద్యోగులు, సిబ్బందిలో కొంతమందిని రిజర్వులో ఉంచనున్నారు. అవసరమైతే వారి సేవలను వినియోగించుకుంటారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఇతరులకు అల్పహారం, భోజన ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద చేస్తున్నారు.
గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి
22వ తేదీ ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. 23వ తేదీ ఉదయం ముందుగా పోటీలో ఉన్న అభ్యర్థులు, అధికారులు స్ట్రాంగ్ రూమ్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేస్తారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కొక్క రౌండ్‌కు 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత నియోజకవర్గానికి 5 వీవీ ప్యాట్ల స్లిప్‌లు లెక్కిస్తారు. వీవీ ప్యాట్లు లెక్కించి సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాల్సిఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ఆర్‌ఓ ధ్రువీకరణ పత్రం అందజేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment