Counting Election
-
ఏకపక్షమేనా..?
మహారాష్ట్ర, హరియాణాలో మళ్లీ కమలమే వికసిస్తుందా, మోదీ షా ద్వయాన్ని ఎదుర్కొనే శక్తి విపక్షాలకు ఉందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. గురువారం ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరాఠాల ప్రభావం అత్యధికంగా ఉండే మహారాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌కు, జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌కు పగ్గాలు అప్పగించి బీజేపీ చేసిన ప్రయోగాన్ని ఓటర్లు ఎంతవరకు ఆమోదిస్తారో, వరసగా రెండోసారి సీఎంలు అయ్యే చాన్స్ వారికి వస్తుందా అన్నది నేటి ఫలితాలతో తెలిసిపోనుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. మహారాష్ట్రలో... మహారాష్ట్ర శాసనసభ 288 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,237 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేస్తే మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 147 స్థానాల్లో, ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాజకీయ వ్యూహాల ముందు విపక్షాలు నిలబడలేవని ఇంచుమించుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నాయి. కేదార్నాథ్ గుడి వద్ద సీఎం ఫడ్నవీస్ దంపతులు కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుని అత్యంత చాకచక్యంగా మోదీ ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వినియోగించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఫడ్నవీస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అన్ని రంగాల సుస్థిరాభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోవడం బీజేపీకి కలిసొస్తుందని విశ్లేషకుల అంచనా. రైతు సమస్యలు మినహా ఫడ్నవీస్ పాలనపై పెద్దగా విమర్శలేవీ లేకపోవడం వల్ల ఈ సారి ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే అంచనాలున్నాయి. ఠాక్రే కుటుంబ వారసుడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో ఉండడం ఈ సారి విశేషంగా చెప్పుకోవాలి. మొత్తం 25 వేల మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ విధుల్లో ఉన్నారు. ఉప ఎన్నికల ఫలితాలూ ప్రతిష్టాత్మకమే మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లోని రెండు లోక్‌సభ స్థానాలు, 51 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఇవాళే ఉంది. ఈ ఫలితాలతో వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వచ్చిన ఇబ్బందేమీ లేకపోయినప్పటికీ బీజేపీ తన కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉప ఎన్నికల్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హరియాణా పీఠం ఎవరిది ? హరియాణాలో మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని, బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంచుమించుగా చెబితే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా దానికి విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించడంతో ఈ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హరియాణాలో కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికంగా దృష్టి పెడితే కాంగ్రెస్ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరాహోరీగా పోటీ ఇచ్చింది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే హరియాణాలో పోలింగ్ 76.54 నుంచి 68 శాతానికి భారీగా పడిపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేవీలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ (ఐఎన్ఎల్డీ) చీలిక వర్గం, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీకి 32–44, కాంగ్రెస్‌కు 30–42, ఇక జేజేపీకి 6–10 స్థానాలు వస్తాయని ఇండియా టుడే పోల్స్‌లో వెల్లడైంది. -
సర్వం సిద్ధం
సాక్షి, ఒంగోలు అర్బన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23వ తేదీ జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్నీ ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. మంగళవారం ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోలు రూంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఒంగోలు పార్లమెంట్‌కు సంబంధించి రైజ్ కృష్ణసాయి ఇంజినీరింగ్ కాలేజిలో ఒంగోలు, కొండపి, దర్శి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. పేస్ ఇంజినీరింగ్ కాలేజిలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చీరాల, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల ఓట్ల లెక్కిస్తారన్నారు. ఓట్ల లెక్కింపునకు 2700 మంది సిబ్బందిని నియమించామన్నారు. వారిలో 106 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 1085 మంది సూపర్వైజింగ్ అసిస్టెంట్స్, 522 మంది మైక్రో అబ్జర్వర్లు, ఇతర పనుల కోసం 938 మందిని నియమించినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 1261 మందిని నియమించామన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకు, అధికారులు సిబ్బంది ఉదయం 5 గంటలకు తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాలకు చేరాలన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు రిటర్నింగ్ అధికారులు కేటాయించిన టేబుళ్ల వద్ద మాత్రమే ఉండాలని ఇతర టేబుళ్ల వద్దకు వెళ్లకూడదన్నారు. కౌంటింగ్ ఎలాంటి అంతరాయం కలిగించినా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ రహస్యమని సెక్షన్ 128 ప్రకారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల వివరాలు బయటకు తెలియకూడదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులకు, సిబ్బందికి, ఎలక్షన్ ఏజెంట్లకు అల్పాహారంతో పాటు భోజనం, తాగునీరు వసతులు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా మెడికల్ క్యాంపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్ ఏర్పాటు చేసి మీడియాకు సహకరిస్తామన్నారు. జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 1300 మంది సీఆర్ఎఫ్ భద్రతా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. 23వ తేదీ కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. దాంతో పాటు 20 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రమే కాకుండా జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పాల్గొన్నారు. సెల్ఫోన్లు అనుమతించం మీడియా సమావేశానికి ముందు కౌంటింగ్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 23వ తేదీ ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు సెల్ఫోన్లు అనుమతించమని స్పష్టం చేశారు. ఎవరికి ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో వారి వాహనాలు నిలుపుకుని కేంద్రాలకు చేరాలన్నారు. నిబంధనలు ఉల్లఘించడకుండా సహకరించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఏజెంట్ బి.హనుమారెడ్డి, టీడీపీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీరాంమాల్యాద్రి, స్వతంత్ర అభ్యర్థి బిళ్లా చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
కౌంటింగ్‌కు పటిష్ట బందోబస్తు
సాక్షి, చీరాల రూరల్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చీరాల పోలీసు సబ్–డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సోమవారం చీరాల ఐఎల్టీడీ శాండ్రిజ్ గెస్ట్‌హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియకు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన సూచనలు, సలహాలను అందించామన్నారు. కౌంటింగ్ రోజు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. 30 పోలీసు యాక్టు, 144 సెక్షన్లు అమలులో ఉన్నందున ప్రజలు కూడా గుంపులు గుంపులుగా రోడ్లపై చక్కర్లు కొట్టవద్దన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. పోలీసు సిబ్బంది కూడా విధులలో అలసత్వం లేకుండా నిరంతరాయంగా పనిచేయాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసుకోరాదని, అలానే సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు, డెకాయిట్లు, అల్లర్లకు పాల్పడే వారిపై నిఘా ఉందని చెప్పారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. పోలీసు ఆంక్షలను ధిక్కరించిన వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ వెంట ట్రైనీ ఎస్పీ బింధు మాదవ్, డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు, సీఐలు శ్రీనివాసరావు, రాజ మోహనరావు, ప్రసాద్, శేషగిరిరావు, ఎస్సైలు, పాల్గొన్నారు. -
ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి
సాక్షి, ఒంగోలు అర్బన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23వ తేదీ జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎటువంటి ఆందోళన చెందకుండా ఆత్మ విశ్వాసంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌చంద్ అన్నారు. సోమవారం ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోలు రూములో సువిధ పోర్టల్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, సీలింగ్ రూము, స్ట్రాంగ్ రూముల ఇన్‌చార్జ్‌లకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణ నిర్వహించారు. దీనిపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సువిధ పోర్టల్‌లో నమోదు చేసే డేటా తప్పులు లేకుండా చూడాలని అసిస్టెంట్ స్టేటిస్టికల్ అధికారి, టెక్నికల్ అసిస్టెంట్స్‌కు సూచించారు. టెక్నికల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. సువిధ డేటా ఎంట్రీ ఆపరేటర్ వినియోగించే కంప్యూటర్‌కు యుపిఎస్ బ్యాకప్ ఉండేలా చూడాలన్నారు. యాంటి వైరస్ ఇన్స్టాల్ చేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. రౌండ్ వారీగా వచ్చిన డేటాను ఎక్స్ఎల్ లో డేటా ఎంటర్ చేయాలని, రౌండ్ల వారీగా ఫలితాలు నమోదు చేయాలన్నారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి రిటర్నింగ్ అధికారి కేంద్ర ఎన్నికల పరిశీలకులు సంతకం చేసినవి మాత్రమే స్కానింగ్ చేసి మీడియాకు పంపాలని సూచించారు. సీల్ చేసిన కంట్రోల్ యూనిట్లు స్ట్రాంగ్ రూమకు చేర్చాలన్నారు. బ్యాలెట్ ఓట్ల కవర్లు తెరవడం, వాటని స్కాన్ చేసేవిధానాలను వివరించారు. అధికారులంతా ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి, డీఆర్ఓ వెంకటసుబ్బయ్య, ప్రత్యేక కలెక్టర్ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. -
టిక్.. టిక్.. టిక్
సాక్షి, నెల్లూరు(పొగతోట): సార్వత్రిక ఎన్నికలు–2019 ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 23 ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రెండు రోజులే సమయం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం వేగం పెంచింది. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి డీకేడబ్ల్యూ, తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించిన నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కించనున్నారు. నెల్లూరు పార్లమెంట్‌కు సంబంధించి నెల్లూరు సీటీ, రూరల్, కావలి, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల ఓట్లను డీకేడబ్ల్యూ కళాశాలలో లెక్కించనున్నారు. తిరుపతి పార్లమెంట్‌కు సంబంధించి సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాల ఓట్లను ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో లెక్కిస్తారు. డీకేడబ్ల్యూలో 6, ప్రియదర్శిని ఇంజినీరింగ్ కళాశాలలో 4 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీకి 14, పార్లమెంట్‌కు 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల వివరాలను ముందుగా సువిధాలో అప్లోడ్ చేయాల్సిఉంది. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రంలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అభ్యర్థులకు వచ్చిన ఓట్ల వివరాలు రౌండ్ల వారీగా సువిధాలో అప్లోడ్ చేసిన తరువాతనే ప్రకటిస్తారు. దానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి ఇతరులు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కౌంటింగ్ టేబుల్స్ వద్దకు ఏజెంట్లకు అనుమతి లేదు. కౌంటింగ్ సిబ్బంది ఈవీఎంలలో ఓట్లు లెక్కించి ఏజెంట్లకు చూపుతారు. కౌంటింగ్ ఏజెంట్లను పూర్తిస్థాయిలో పరిశీలించిన తరువాతనే లోనికి అనుమతిస్తారు. సెల్ఫోన్లు కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతి లేదు. సెల్ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు ఈవీఎంలపై పోసే అవకాశం ఉన్నందున వాటిని కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకుపోవడానికి అనుమతి లేదు. ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్ వద్దనే ఉండాలి. అటూ.. ఇటూ తిరగడానికి వీలులేదు. ఏజెంట్లకు అవసరమైన మంచినీరు తదితర ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేస్తోంది. భారీ బందోబస్తు కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉన్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా నియమించనున్నారు. ఉద్యోగులు, సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై మూడు విడతల్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎలక్ట్రానిక్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలోని ఓట్లను ఏవిధంగా లెక్కించాలో తదితర అంశాలపై కూడా శిక్షణ ఇచ్చారు. శిక్షణ తీసుకున్న ఉద్యోగులు, సిబ్బందిలో కొంతమందిని రిజర్వులో ఉంచనున్నారు. అవసరమైతే వారి సేవలను వినియోగించుకుంటారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, పోలీసులు ఇతరులకు అల్పహారం, భోజన ఏర్పాట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద చేస్తున్నారు. గుర్తింపు కార్డు ఉంటేనే అనుమతి 22వ తేదీ ఉద్యోగులు, సిబ్బంది, ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వనున్నారు. గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. 23వ తేదీ ఉదయం ముందుగా పోటీలో ఉన్న అభ్యర్థులు, అధికారులు స్ట్రాంగ్ రూమ్స్‌ను పరిశీలిస్తారు. అనంతరం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ముందుగా సర్వీస్ ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేస్తారు. అనంతరం ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఒక్కొక్క రౌండ్‌కు 14 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎంల లెక్కింపు పూర్తయిన తరువాత నియోజకవర్గానికి 5 వీవీ ప్యాట్ల స్లిప్‌లు లెక్కిస్తారు. వీవీ ప్యాట్లు లెక్కించి సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాల్సిఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థికి ఆర్ఓ ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. -
ఫస్ట్ ఖమ్మం... లాస్ట్ ఇందూరు
సాక్షి, హైదరాబాద్: మరో 48 గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో విజేతలెవరో తేలనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠతోపాటు ఏ నియోజకవర్గం ఫలితం ఎప్పుడు వస్తుంది... ముందుగా ఫలితం ఎక్కడ తేలుతుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం చేసిన ఏర్పాట్ల ప్రకారం చూస్తే ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపులో తొలుత ఖమ్మం ఫలితం రానుందని అంచనా. చివరగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నిజామాబాద్ ఫలితం వెలువడనుంది. అయితే ప్రతి నియోజకవర్గానికి సగటున ఐదు పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాలన్న సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆయా పార్లమెంటు సెగ్మెంట్లలో ర్యాండమ్‌గా తీసుకొనే పోలింగ్ స్టేషన్లలో ఉన్న ఓట్లనుబట్టి ఫలితాల వెల్లడి స్థానాలు తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘కౌంటింగ్’తీరూ కీలకమే... తెలంగాణలోని 35 కౌంటింగ్ కేంద్రాల్లో 17 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేసిన ఈసీ.. ఒక రౌండ్‌కు 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కించనుంది. ఈ లెక్కన రాష్ట్రంలో తక్కువ 1,476 పోలింగ్ స్టేషన్లున్న ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ ఫలితం మొదట రానుంది. అయితే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఐదు వీవీప్యాట్లను లెక్కించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసినందున వాటి లెక్కింపునకు అదనంగా మరో ఐదు గంటలు పట్టనుంది. తొలుత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించిన అనంతరం చివరగా ర్యాండమ్ పద్ధతిలో ఐదు వీవీప్యాట్లలోని ఓట్ల ను లెక్కించనున్నారు. ఈవీఎంలలో పోలైన ఓట్ల తో వాటిని సరిపోల్చుకున్న అనంతరం విజేతను అధికారికంగా ప్రకటించనున్నారు. ఒక్కో రౌండ్ ఓట్ల లెక్కింపునకు సగటున 20 నుంచి 30 నిమిషాలు పట్టనుంది. అభ్యర్థులు ఎక్కువగా ఉన్న చోట ఈ సమ యం మరింత పట్టే అవకాశం లేకపోలేదని ఈసీ వర్గాలంటున్నాయి. ఆయా కౌంటింగ్ కేంద్రాల్లోని పరిస్థితులు, ఎన్నికల సిబ్బంది, రిటర్నింగ్ అధికారి పనితీరు ఫలితాల వెల్లడికి పట్టే సమయంపై ప్రభా వం చూపే వీలుందని చెబుతున్నాయి. పోలింగ్ బూత్‌లు ఎక్కువగా ఉన్న పార్లమెంటు సెగ్మెంట్ ఫలితాలు కూడా ముందుగానే వెలువడే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తున్నాయి. ఈవీఎం ఓట్ల కౌంటింగ్ సమయంలో ప్రతి అభ్యర్థికి పోలైన ఓట్లను రికార్డు చేయాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల ఆలస్యం జరిగే అవకాశముంది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు తక్కువగా ఉన్న జహీరాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఫలితాలు ముందుగా వెలువడినా ఆశ్చర్యంలేదు. నిజామాబాద్‌లో ఆలస్యం... దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల ఫలితం ఆలస్యం కానుంది. దేశంలోనే ఆలస్యంగా ఫలితం వెలువడే లోక్‌సభ స్థానం ఇదే అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ సీటుకు 185 మంది పోటీపడుతుండటంతో ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగనుంది. ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన ఒక్కో అభ్యర్థికి నమోదైన ఓట్లను పరిశీలించి రికార్డు చేసేందుకు సగటున ఏడు నిమిషాలు తీసుకోనుంది. దీంతోపాటు చివరగా లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని 35 పోలింగ్ కేంద్రాల్లోని వీవీప్యాట్లను లెక్కించాల్సి ఉండటంతో ఫలితం ఆలస్యం కానుంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపుతో పోలిస్తే దీనికే ఎక్కువ సమయం పట్టనుంది. అయితే అభ్యర్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. ఈ కౌంటింగ్ కేంద్రంలో 18 టేబుళ్లను ఏర్పాటు చేసింది. తద్వారా ఫలితాల వెల్లడిలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన మల్కాజిగిరిలోని ఎల్బీ నగర్, మేడ్చల్ అసెంబ్లీ స్థానాల పరిధిలోని 500 పైచిలుకు పోలింగ్ కేంద్రాలు ఉండటంతో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. సగటున ఇక్కడ 30 రౌండ్లలో లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే మేడ్చల్, ఎల్బీ నగర్ అసెంబ్లీల పరిధిలో 28 టేబుళ్లు ఏర్పాటు చేయడంతో పార్లమెంటు కౌంటింగ్ రౌండ్లు తగ్గుతాయనే అంచనా ఉంది. అయితే అవి ఏ మేరకు తగ్గుతాయన్న దానిపై స్పష్టత లేదు. మొత్తంమీద అత్యధిక ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు ఉన్న ఈ నియోజకవర్గంలోని ఓట్ల లెక్కింపును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. -
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా జరగాలి
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు అత్యంత పకడ్బందీగా నిర్వహించాల ని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ కన్సల్టెంట్ భన్వర్‌లాల్ ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఈ నెల 23న చేపట్టే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై జిల్లా ఎన్నికల ప్రధాన అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు, సహాయ రిటర్నింగ్ అధికారులకు సోమవారం రెండవ విడత శిక్షణ, పునశ్చరణ కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భన్వర్‌లాల్ పాల్గొన్నారు. ఎన్నికల అధికారులకు పలు సలహా లు, సూచనలు ఇచ్చారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన చట్టపరమైన అంశాలతోపాటూ, కౌంటింగ్‌కు ముందు, తర్వాత దశలవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్నికల అధికారులకు సవివరంగా తెలియజేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు తెరిచే సమయంలో అభ్యర్థులు, ఏజెంట్లు, పరిశీలకులు తప్పనిసరిగా అక్కడ ఉండడం వంటి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ విమర్శలకు, ఆరోపణలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చూడాలని వారికి స్పష్టం చేశారు. లెక్కింపు ప్రక్రియకు తుది రూపం ఇవ్వడానికి మొదటి రెండు రౌండ్లు దశలవారీగా ఎలా లెక్కించాలో ఆ సమయంలో ఏఆర్ఓలు ఎలా అప్రమత్తం గా ఉండాలో వివరించారు. రిటర్నింగ్ అధికారుల, పరిశీలకులకున్న పరిమితులు అలాగే వారికున్న అధికారాలు వాటిని ఎలా వినియోగించాలో వివరిస్తూ, కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్ యంత్రాల భద్రత, ఎన్నికల తాలూకు రికార్డులు, పత్రాలను ఎలా సీలు వేయాలి, ఫలితాల ప్రకటనను ఎన్నికల సంఘానికి నిర్దేశిత ఫారాల్లో ఎలా నింపి పంపాలన్న విషయాలపై కూడా అవగాహన కల్పించారు. ఈటీపీబీఎస్ వంటి అధునాతన టెక్నాలజీని మొదటిసారిగా వినియోగిస్తున్నందువల్ల దానికి అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం, ఎన్వలప్‌లమీద క్యూఆర్ కోడ్ వంటివి స్కాన్ చేయడం వంటి అంశాలను దానికి సంబంధించిన విషయ నిపుణులు వివరించారు. ఓట్ల లెక్కింపులో సువిధ అనే అప్లికేషన్‌ను ఎలా ఉపయోగించాలో కూడా మాస్టర్ ట్రైనర్లు వివరించారు. సువిధ పోర్టల్‌లో డేటా ఎంట్రీ జరిగిన తర్వాతనే ఆ రౌండ్ ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుందని కూడా వారికి స్పష్టం చేశారు. 21వ తేదీన ఓట్ల లెక్కింపు సన్నద్ధతను పూర్తిస్థాయిలో పరీక్షించి చూసుకోవడానికి డ్రెస్ రిహార్సల్ నిర్వహించాలని భన్వర్‌లాల్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఈనెల 23న ఓట్ల లెక్కింపు జరుగుతున్న దృష్ట్యా అందరి దృష్టి ఈవీఎంల మీద ఉంటుందనీ, ఎక్కడా అజాగ్రత్తకు అవకాశం లేకుండా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని రజత్ కుమార్ ఆదేశించారు. లెక్కింపు ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి శిక్షలు విధిస్తుందని భన్వర్ లాల్ హెచ్చరించారు. -
కౌంటింగ్‌కు పటిష్ట భద్రత
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ లోక్‌సభ ఓట్ల లెక్కిం పు ప్రక్రియ సందర్భంగా ప టిష్ట భద్రత ఏర్పాటు చే యనున్నట్లు పోలీస్ క మిషనర్ కార్తికేయ తె లిపారు. కౌంటింగ్ నిర్వ హించే డిచ్పల్లిలోని క్రిస్టియన్ మెడికల్ క ళాశాల (సీఎంసీ) పరిసరాల్లో 144 సెక్షన్ అమ లులో ఉంటుందని చెప్పారు. సీపీ ఆదివారం తన చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 23న జరగనున్న నిజామాబాద్ ఎంపీ స్థానం ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లెక్కింపు కేంద్రం వద్దకు అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రానికి వెళ్లే అన్ని దారుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, అనుమతి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రం వద్దకు పంపుతామన్నారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం వద్దకు రావద్దని సూచించారు. ఎలాంటి ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసుశాఖలోని టాస్క్‌ఫోర్స్ విభాగం 2018లో గేమింగ్, గుట్కా, ఎక్సైజ్, ఎక్స్‌ప్లోసివ్, మైనింగ్ తదితర చట్టాల కింద 493 కేసులు నమోదు చేసిందని వివరించారు. 2019లో ఇప్పటి వరకు 14 కేసులు నమోదయ్యాయని తెలిపారు. -
పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలి
సాక్షి, ఒంగోలు అర్బన్: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎటువంటి పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులకు సూచించారు. ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోలు రూములో ఆదివారం సహాయ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లు, నోడల్ అధికారులకు పోస్టల్ బ్యాలెట్, ఎలక్ట్రానికల్లి ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్లపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాటుకు చేసిన టేబుల్ వద్ద ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లలతో పాటు ఒక సూక్ష్మ పరిశీలకులు ఉంటారన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో భారత ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరించి విధులు నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంంధించి కవర్ బీ లో ఉన్న ఫారం 13సీ, 13ఏని జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. ప్రతి టేబుల్‌కు పోస్టల్ బ్యాలెట్ కవర్లు 500 చొప్పున బండిల్ కట్టి, చెల్లుబాటు కానీ పోస్టల్ బ్యాలెట్లను విడిగా ఒక కవర్లో ఉంచాలన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి 7 కారణాలతో ఇన్వాలిడ్గా ప్రకిటించే అంశాలను కలెక్టర్ అధికారులకు వివరించారు. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్‌కు సంబంధించి సహాయ రిటర్నింగ్ అధికారి నిర్ణయాధికారి అని తెలిపారు. ఓట్ల లెక్కింపులో కౌంటింగ్ అసిస్టెంట్లను సమర్ధవంతగా వినియోగించుకుని ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. 13ఏలో ఓటర్లు సంతకంతో పాటు గిజిటెడ్ అధికారి అటెస్టేషన్ కలిగి ఉండాలనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎలక్ట్రానికల్లి ట్రాన్స్మిటెడ్ పోస్టల్ పద్ధతిలో కౌంటింగ్ ప్రక్రియలో చేపట్టాల్సిన చర్యల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. 13ఏ, 13బీ, 13సీ ఫారాలను తప్పనిసరిగా స్కాన్ చేయాలన్నారు. స్కానింగ్‌కు సంబంధించి క్యూర్‌కోడ్ రీడర్‌ను సంసిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇన్‌వాలిడ్‌కు సంబంధించి 13సీ కవర్ వెనుక భాగాన తగిన కారణాలను తెలపాల్సి ఉంటుందన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ప్రత్యేక కలెక్టర్ చంద్రమౌళి, సంయుక్త కలెక్టర్లు నాగలక్ష్మి, సిరి, డీఆర్ఓ వెంకటసుబ్బయ్య, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారుల ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సమీక్ష
సాక్షి, ఒంగోలు: కౌంటింగ్ గడువు దగ్గర పడుతున్న దృష్ట్యా కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌశల్ అధికారులతో చర్చించారు. స్థానిక రైజ్ కాలేజీలోని కౌంటింగ్ కేంద్రంలో అధికారులతో మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. రైజ్ కాలేజీ, పేస్ కాలేజీల్లోకి కేవలం వ్యక్తులను మాత్రమే అనుమతించాలని, వాహనాలను అనుమతించరాదని సూచించారు. అభ్యర్థులకు, పోలింగ్ ఏజెంట్లకు ఒక మార్గం, అధికారులకు, పోలింగ్ సిబ్బందికి ఒక మార్గం, మీడియా ప్రతినిధులకు మరో మార్గం ద్వారా లోపలకు అనుమతించేందుకు తగు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వాహనాలను బయట పార్కు చేసుకునేందుకు అవసరమైన స్థలాలను సిద్ధం చేయాలన్నారు. పెళ్లూరు హైవే డౌన్ నుంచి వల్లూరు హైవే డౌన్ వరకు ఒక మార్గంలో మాత్రమే ట్రాఫిక్‌ను పంపాలని, రెండో మార్గం కేవలం ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు, పర్యవేక్షించేందుకు వచ్చే వారికోసం సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ మేరకు ట్రాఫిక్ డైవర్షన్ బోర్డులు, ట్రాఫిక్ సైన్ బోర్డులు, పార్కింగ్ బోర్డులు సిద్ధంగా ఉంచాలన్నారు. రైజ్ కాలేజీ సెంటర్ ఇన్చార్జి ఎం వెంకటేశ్వరరావు, పేస్ కాలేజీ ఇన్చార్జి డాక్టర్ బి.రవిలతో పాటు ఆర్అండ్బీ అధికారులు, పోలీసు అధికారులతో ఏర్పాట్లపై ఎస్పీ సమీక్షించారు. -
కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు
చినగంజాం : సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని సిబ్బంది పనితీరు, సౌకర్యాలు, రికార్డులు, పెండింగ్ కేసులు తదితర అంశాలపై పోలీసు అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ఎటువంటి అల్లర్లు లేకుండా నిర్వహించేందుకు శాఖ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. డివిజన్ స్థాయిలో సమీక్షలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయా ఉన్నతాధికారుల స్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు. కౌంటింగ్‌కు, ఫలితాలు వెలువరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇబ్బందులను సైతం ఎదుర్కోగలిగే వనరులను ముందుగానే సమకూర్చుకొని బాధ్యతగా పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆయా సర్కిల్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్ల స్థాయిలో సిబ్బంది కొరత ఉన్నా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని, అందుకు సిబ్బంది సైతం పూర్తి సహకారం అందించారని, పోలీసు సిబ్బందితో పాటు మీడియా వైపు నుంచి కూడా మంచి సహకారం ఉందన్నారు. చినగంజాం పోలీసుస్టేషన్ పరిధిలో పెదగంజాం వంటి గ్రామంలో చిన్న చిన్న ఘర్షణలు మినహా ఎటువంటి ఇబ్బందుల్లేవన్నారు. ఈ పోలీసుస్టేషన్‌కు సమర్థ మహిళా సబ్ ఇన్స్పెక్టర్ను నియమించామని చెప్పారు. గ్రామాల్లో ముఠా తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, కౌంటింగ్ రోజు స్థానికంగా గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వారు, కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లి అల్లర్లు సృష్టించే వారున్నారా.. అని ఆరా తీయాలని స్థానిక పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. స్థానికంగా భూ వివాదాలు, అక్రమ మైనింగ్ వంటి వాటిపై నిఘా పెడుతున్నట్లు చెప్పారు. ఎస్పీతో పాటు చీరాల డీఎస్పీ నాగరాజు, ఇంకొల్లు సీఐ ఎం.శేషగిరిరావు, ఎస్ఐ ఎ.లక్ష్మీభవాని పాల్గొన్నారు. -
కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఏప్రిల్ 11న పోలింగ్ జరుగగా మే 23న కౌంటింగ్ జరగనుంది. ఎప్పుడూ లేని విధంగా పోలింగ్, కౌంటింగ్‌కు మధ్య 41 రోజుల సుదీర్ఘ గడువు వచ్చింది. దీంతో అభ్యర్థులు, ఓటర్లు ఎన్నికల్లో గెలుపోటముల అవకాశాలపై అంచనా లెక్కలతో తలమునకలుగా ఉండి పోయారు. అభ్యర్థుల గెలుపుపై పెద్ద ఎత్తున పందేలు నడిచాయి. గెలుపు మాదంటే మాదంటూ ప్రధాన పార్టీ అభ్యర్థులు ఎడతెగని లెక్కలతో గడుపుతున్నారు. సొంతంగా కొందరు సర్వేలు చేయించుకుంటుండగా ప్రధాన పార్టీలు సైతం నియోజకవర్గాలు, జిల్లాలు, రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు చేయించాయి. ఇక రాష్ట్ర, కేంద్ర నిఘా విభాగాల సర్వేలపై అభ్యర్థులు ఆరా తీస్తూ లెక్కలు వేసుకుంటున్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లో ఘన విజయం సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉండగా సగం స్థానాలు మావేనంటూ టీడీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. అభ్యర్థుల వారీ మెజార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కనున్నాయన్న దానిపైనా పందేలు చర్చలు నడుస్తున్నాయి. సుదీర్ఘ సమయం అనంతరం ఎట్టకేలకు కౌంటింగ్‌కు సమయం ఆసన్నమైంది. మరో ఐదు రోజులు మాత్రమే గడువుంది. ఈనెల 23న ఒంగోలు శివారులోని రైజ్, పేస్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. జిల్లాలోని ఒంగోలు, బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు జిల్లా పరిధిలో ఉన్న 12 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఇక్కడ జరగనుంది. ఎన్నికల అధికారులు కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులకు శిక్షణ సైతం ముగిసింది. ఇక ఎన్నికల్లో పోటీ పడిన ప్రధాన పార్టీలతో పాటు మిగిలిన పార్టీల అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ సైతం ముగిసింది. కౌంటింగ్ దగ్గర పడడంతో అభ్యర్థులతో పాటు ఓటర్లలోనూ ఉత్కంఠ పెరిగింది. జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ పార్టీలకు చెందిన 155 మంది అభ్యర్థులు పోటీ పడగా ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ పరిధిలో 26 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ మధ్య పోటీ ఉంది. ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో 22,62,249 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుక్నునారు. జిల్లా వ్యాప్తంగా 85.92 శాతం పోలింగ్ నమోదైంది. మహిళలు సైతం గణనీయంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. 13,24,075 మహిళా ఓట్లకు గాను 11,34,761 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
కౌంటింగ్‌కు కట్టుదిట్ట భద్రత
సాక్షి ప్రతినిధి, ఏలూరు, ఏలూరు టౌన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాతీర్పును ప్రతీ ఒక్కరూ శిరస్సా వహించాల్సిందే. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను ఏవో రెండు, మూడు ఘటనలు మినహా మొత్తంగా ప్రశాంతంగా నిర్వహించాం. ఇక ఓట్ల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పగడ్బందీగా చేపడతాం. కేంద్రాల వద్ద మూడంచెల భద్రత పెట్టాం. కౌంటింగ్‌కు పటిష్ట చర్యలు చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు వ్యవస్థను సిద్ధం చేశాం. ఎన్నికల కమిషన్ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తూ కౌంటింగ్‌ను సక్రమంగా నిర్వహించటమే మా ముందున్న ప్రధాన లక్ష్యం అని ఎస్పీ ఎం.రవిప్రకాష్ చెప్పారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా కాసేపు ముచ్చటించారు. ప్రశ్న: జిల్లాలో ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ? ఎస్పీ : జిల్లాలో 15 అసెంబ్లీ, ఏలూరు, నరసాపురం లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఓట్ల లెక్కింపునకు ఏలూరు, భీమవరంలో నాలుగు కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఏలూరులో సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాల, రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాల, భీమవరంలో విష్ణు విద్యా సంస్థలు, సీతా పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌంటింగ్ కేంద్రాలను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. భీమవరంలో 7, ఏలూరులో 8 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సాగుతుంది. ప్రశ్న: సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు? ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా 96 సమస్యాత్మక గ్రామాలను ఇప్పటికే గుర్తించాం. ఓట్ల లెక్కింపు అనంతరం గత ఎన్నికల్లోనూ చాలా చోట్ల గొడవలు జరిగిన దాఖలాలు ఉన్నాయి. అందుకే సమస్యాత్మక గ్రామాల్లో ముందుస్తుగానే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఏలూరు, దెందులూరు, భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందుస్తు భద్రతా చర్యలు చేపడుతున్నాం. ప్రశ్న: కౌంటింగ్ కేంద్రాల్లో నిబంధనలు ఏమిటి ? ఎస్పీ : ప్రధానంగా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎవ్వరూ సెల్‌ఫోన్ తీసుకురాకుండా చర్యలు చేపట్టాం. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళే కానిస్టేబుల్ నుంచి జిల్లా అధికారి వరకూ ఎవరూ సెల్‌ఫోన్స్ తీసుకువెళ్లేందుకు అనుమతి లేదు. ఎన్నికల అబ్జర్వర్లు మాత్రమే సెల్‌ఫోన్ కలిగి ఉండేందుకు అనుమతి ఉంటుంది. ఇక సెల్ఫోన్లకు టోకెన్ సిస్టంకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే విషయమై పరిశీలిస్తున్నాం. పోలీసు అధికారులు నిర్దేశించిన ట్రాఫిక్ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ప్రశ్న: కౌంటింగ్ ఏజెంట్లలో క్రిమినల్స్ ఏవరైనా ఉన్నారా ? ఎస్పీ : జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారుల నుంచి కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను తీసుకుని వారిపై ఎమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా అని పరిశీలించాం. ఒక నియోజకవర్గంలో రౌడీషీటర్ ఉన్నట్లు గుర్తించి వెంటనే అధికారులకు నివేదించాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జిల్లాలో 7 వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం. వీరిలో 26 మందిపై రౌడీషీట్లు ఓపెన్ చేశాం. ఇటువంటి వారిపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. ప్రశ్న: ఏ విధమైన భద్రతా చర్యలు చేపట్టారు ? ఎస్పీ : ఏలూరు కౌంటింగ్ కేంద్రాల వద్ద జిల్లా అదనపు ఎస్పీ ఈశ్వరరావు, నరసాపురం కేంద్రాల వద్ద ఏఆర్ ఏఎస్పీ మహేష్‌కుమార్‌ను ప్రత్యేకంగా నియమించాం. జిల్లా వ్యాప్తంగా 67మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లతో పెట్రోలింగ్ నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. ఇక పోలీస్ సబ్‌డివిజన్ అధికారులతో ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడైనా గొడవలు జరిగితే వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్ళి పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు నిర్ణయించాం. ఇక జిల్లాలో 3,500మంది పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు, ఒక కంపెనీ ఏపీఎస్పీ బలగాలనూ మోహరించేందుకు చర్యలు చేపట్టాం. ప్రశ్న: ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత చర్యలు ? ఎస్పీ : జిల్లాలో ఏలూరు, భీమవరం ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నాం. కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్ళే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తాం. దీనికోసం మెటల్ డిటెక్టర్లు, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. ఎన్నికల కమిషన్ మంజూరు చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారు మాత్రమే తనిఖీలు అనంతరం లోనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రం లోపల సైతం ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు మాత్రమే మఫ్టీలో పోలీసు అధికారులను భద్రత కోసం నియమించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రశ్న: వాహనాలు పార్కింగ్‌కు ఏవిధమైన చర్యలు తీసుకున్నారు ? ఎస్పీ : ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. అధికారులకు ఒక ప్రాంతంలోనూ, వీఐపీలు, సీని యర్ అధికారులు, ఆర్ఓలకు ప్రత్యేకంగానూ, ఏజెంట్లు, ఇతర వ్యక్తులకు మరోచోట వాహన పార్కింగ్‌కు స్థలాలను నిర్ణయించాం. ఏలూరులో రామచంద్ర ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో ట్రాఫిక్ డీఎస్పీ అధికారితో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం. భీమవరంలో విష్ణు కళాశాల వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ట్రాఫిక్ మళ్ళింపుకు చర్యలు తీసుకున్నాం. ప్రశ్న: యువత, విద్యార్థులకు మీరిచ్చే సందేశం ? ఎస్పీ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిఒక్కరూ ప్రజా తీర్పును గౌరవించాలి. అభ్యర్థుల ఓటమి, గెలుపులపై యువత, విద్యార్థులు, అభిమానులు సంయమనం పాటించాల్సి ఉంది. అనవసరంగా గొడవలు, కొట్లాటలకు దిగటం ద్వారా భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. రాజకీయ పార్టీల అభ్యర్థులకు ఇప్పటికే సూచనలు చేయటం జరిగింది. వారంతా నిబంధనలకు అనుగుణంగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక కౌంటింగ్ పూర్తి అయిన మూడు రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. గెలిచిన అభ్యర్థులు సైతం నిబంధనల మేరకు విజయోత్సవ ర్యాలీలకు అనుమతులు తీసుకుని మాత్రమే ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. -
కౌంటింగ్‌లో ఫారం–17సీ కీలకం
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ఫారం–17సి పార్ట్–2 ఎంతో కీలకమైంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్, సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు దీనిపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. కంట్రోల్ యూనిట్లో నమోదైన మొత్తం ఓట్లు, ఫారం–17సిలో పొందుపరిచిన మొత్తం ఓట్లు సరిపోల్చి చూడాలి.పార్లమెంటు/అసెంబ్లీ నియోజకవర్గ నెంబరు, పోలింగ్ కేంద్రం పేరు, ఆ పోలింగ్ కేంద్రంలో వినియోగించిన కంట్రోల్ యూనిట్లు, బ్యాలెటింగ్ యూనిట్ల ఐడెంటిఫికేషన్ నెంబర్లను ఫారం–17సిలో నమోదు చేస్తారు. ఆ పోలింగ్ కేంద్ర పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్య, ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల సంఖ్య (ఫారం–17ఏలో నమోదు చేసిన వివరాలు), పోలింగ్ కేంద్రంలోకి వచ్చాక ఓటు వేయకుండా నిరాకరించి వెళ్లిపోయిన వారు, ఓటేసేందుకు పీఓ అనుమతించని వారి సంఖ్య, ఓటింగ్ యంత్రంలో నమోదైన మొత్తం ఓట్ల సంఖ్య ఫారం–17సీలో ఉంటాయి. అలాగే టెండర్డ్ బ్యాలెట్లు, సరఫరా చేసిన పేపరు సీళ్ల సీరియల్ నెంబర్లు, ఎన్ని పేపర్ సీళ్లు వినియోగించారు? వినియోగించని పేపరు సీళ్లు ఎన్ని తిరిగి రిటర్నింగ్ అధికారికి వెళ్లాయి? డ్యామేజ్ అయిన పేపరు సీళ్ల సీరియల్ నెంబర్లు వంటి వివరాలు ఇందులో ఉంటాయి. కౌంటింగ్‌లో ఫారం–17సి ఏజెంట్లకు ఎంతో ఉపయోగపడుతుంది. నమోదైన ఓట్లలో తేడా వస్తే..?! కౌంటింగ్ సమయంలో టేబుల్ వద్దకు కంట్రోల్ యూనిట్‌తోపాటు ఫారం–17సీ పార్ట్–1 తప్పనిసరిగా తీసుకు వస్తారు. ఆయా అభ్యర్థులకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లంతా ఫారం–17సిలో ఉన్న వివరాలను రాసుకోవాలి. కంట్రోల్ యూనిట్ డిస్ప్లే సెక్షన్లో చూపిన పోలైన మొత్తం ఓట్లు, ఫారం–17సిలో నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉండాలి. క్లరికల్ తప్పిదం, మరే కారణం వల్లగానీ కంట్రోల్ యూనిట్, ఫారం–17సి ఓట్ల సంఖ్యలో తేడాలు వస్తే అది వివాదాస్పదంగా మారుతుంది. అలాంటి కంట్రోల్ యూనిట్లు ప్రక్కన ఉంచి సమాచారాన్ని రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమిషన్‌కు పంపుతారు. కంట్రోల్ యూనిట్ టేబుల్‌పైకి రాగానే ఏజెంట్ల పరిశీలనకు ఉంచుతారు. ఆ కంట్రోల్ యూనిట్ ఏ పోలింగ్ కేంద్రానికి చెందినదో ఏజెంట్లు నిర్దారించుకోవాలి. ట్యాంపరింగ్ జరిగితే... కంట్రోల్ యూనిట్ టేబుల్‌పైకి రాగానే క్యాం డిడేట్ సెక్షన్ సీలింగ్ సక్రమంగా ఉందో లేదో కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్లు చూసుకోవాలి. రిజల్ట్ సెక్షన్‌పై ఉన్న స్ట్రిప్ట్ సీలు, గ్రీన్ పేపరు సీలు సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి. సీరియల్ నెంబర్లు ఫారం–17సిలో నమోదు చేసినవే ఉండాలి.కంట్రోల్ యూనిట్, పేపరు సీళ్లు, అడ్రస్ ట్యాగులు ట్యాంపరింగ్ జరిగాయని గుర్తిస్తే సూపర్వైజర్లు ఆ విషయాన్ని రిటర్నింగ్ అధికారి, అబ్జర్వర్ల దృష్టికి తీసుకు వెళ్లాలి. ట్యాంపరింగ్ జరగని సీయూలను మాత్రమే కౌంటింగ్ నిర్వహించాలి. ర్యాండమ్‌గా కౌంటింగ్ కౌంటింగ్ ఒక రౌండ్ పూర్తయిన వెంటనే అందులోని రెండు కంట్రోల్ యూనిట్లను జనరల్ అబ్జర్వర్ తన టేబుల్ వద్దకు తెప్పించుకుంటారు. అదనపు కౌంటింగ్ సూపర్వైజర్తో ఓట్ల లెక్కింపు చేయిస్తారు. కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల సంఖ్యకు, ఫారం–17సీ పార్ట్–2లో కౌంటింగ్ సూపర్వైజర్ నమోదు చేసిన ఓట్ల సంఖ్య సమానంగా ఉంటే ఇబ్బంది లేదు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే సూపర్వైజర్ను కౌంటింగ్ నుంచి తప్పిస్తారు. ఆ సూపర్వైజర్ తనిఖీ చేసిన మిగతా కంట్రోల్ యూనిట్లలన్నింటినీ జనరల్ అబ్జర్వర్ మరోసారి లెక్కింపజేస్తారు. వివరాలు తప్పులు నమోదు చేసిన కౌంటింగ్ సూపర్వైజర్పై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు.అసాధారణంగా ఇరువురు అభ్యర్థులకు కౌంటింగ్‌లో ఓట్లు సమానంగా వస్తే ఏం చేయాలనే సందేహం రావడం సహజం. అలాంటి సందర్బం ఎదురైనపుడు ప్రజాప్రతినిద్య చట్టం ప్రకారం రిటర్నింగ్ అధికారి లాటరీ ద్వారా ఫలితాలను ప్రకటిస్తారు. లాటరీలో ఎవరు గెలుపొందితే వారిని విజేతగా ప్రకటిస్తారు. -
పారదర్శకంగా కౌంటింగ్ ప్రక్రియ
విజయనగరం గంటస్తంభం: సాధారణ ఎన్నికల కౌంటింగ్ పక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా, పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం. హరి జవహర్లాల్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ తీవ్రతను గుర్తించి అందుకు అనుగుణంగా బాధ్యతగా లెక్కింపు చేపట్టాలన్నారు. ఈనెల 23న జరగనున్న కౌంటింగ్‌కు సంబంధించి ఏఆర్ఓలు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లతో గురువారం స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను ఆకళింపు చేసుకోవాలన్నారు. పోలింగ్ పక్రియ కంటే కౌంటింగ్ పక్రియ భిన్నంగా ఉంటుందన్నారు. కౌంటింగ్ పక్రియను ఎన్నికల కమిషన్ కూడా పరిశీలిస్తుందని చెప్పారు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగా ఉండే దుస్తులు వేసుకోకుండా ఉండాలని.. కౌంటింగ్ ఏజెంట్లు ఎంత పరిచయస్తులైనా వారితో అధిక సమయం సంభాషించకూడదని సూచించారు. దీనివల్ల రాజకీయ పక్షాల నాయకులకు అనుమానాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఎటువంటి సమస్యలెదురైనా రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గుర్తింపు కార్డులు లేని పక్షంలో ఎట్టిపరిస్థితుల్లో లోపలకు అనుమతించరని, మూడు అంచెల్లో పోలీస్ తనిఖీలు ఉంటాయన్నారు. అలాగే ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరన్నారు. కార్యక్రమంలో డీఆర్వో జె. వెంకటరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఇలా...
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా వేసిన ఓటు సక్రమంగా నమోదైందా? లేదా అనే విషయంపై ఓటర్లలో చాలాకాలంగా సందేహాలు ఉన్నాయి. పారదర్శకత కో సం తిరిగి బ్యాలెట్ పత్రాల పద్ధతినే తీసుకు రావాలనే డిమాండు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పారదర్శకత కోసం వీవీ ప్యాట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో మొదటిసారిగా వీవీ ప్యాట్లను వినియోగిస్తున్నారు. ర్యాండమ్‌గా వీవీ ప్యాట్ల ఎంపిక.. నియోజకవర్గంలో అసెంబ్లీకి సంబంధించి ఐదు, లోక్‌సభకు ఐదు చొప్పున మొత్తం పది వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ప్రకారం అసెంబ్లీ, లోక్‌సభలకు సంబంధించి మొత్తం 100 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాల్సి ఉంటుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లు, సర్వీసు ఓటర్లనుంచి వచ్చిన ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మీటెడ్ పోస్టల్ బ్యాలెట్లు (ఈటీపీబీఎస్), ఈవీఎంలోని కంట్రోల్ యూనిట్లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. ఈ లెక్కింపు పూర్తయిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయన్న వివరాలను ఫారం–20లో నమోదుచేస్తారు. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించకుండా రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి వీలు లేదు. కౌంటింగ్ చివరిలో వీవీ ప్యాట్ల లెక్కింపు జరుగుతుంది. వీవీ ప్యాట్లను ర్యాండమ్‌గా ఎంపిక చేస్తారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో 267 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయనుకుందాం. ఆ సంఖ్య మేరకు కార్డు సైజు తెల్లటి స్లిప్పులలో పోలింగ్ కేంద్రాల నెంబర్లు రాస్తారు. వీటన్నింటినీ ఒకచోట చేర్చి ఆర్ఓ లాటరీ పద్ధతిలో ఐదు స్లిప్పులను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ అభ్యర్థులు/ఎన్నికల ఏజెంట్లు/కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో నిర్వహిస్తారు. అలా ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వీవీ ప్యాట్లను తీసుకొచ్చి అందులోని స్లిప్పులను లెక్కిస్తారు. సంబంధిత పోలింగ్ కేంద్రానికి చెందిన ఈవీఎంలో నమోదైన ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులు సమానంగా ఉన్నప్పుడు అందరి ఆమోదంతో ఆర్ఓ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించకుండా ఎన్నికల ఫలితాలు ప్రకటించడానికి వీలు లేదు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వస్తే.... పోలింగ్ రోజు తొలుత ఏజెంట్ల సమక్షంలో మాక్‌పోల్ నిర్వహించాలి. మాక్‌పోల్‌లో నమోదైన ఓట్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారి తన డైరీలో నమోదు చేయాలి. మాక్ పోల్ వల్ల వీవీ ప్యాట్‌లో నమోదైన స్లిప్పులను జాగ్రత్తగా తీసి ఒక కవరులో ఉంచి సీలు చేయాలి. ఆ తర్వాత ఈవీఎంలో క్లియర్ బటన్ నొక్కి అసలు పోలింగ్ ప్రారంభించాలి. ఈ విషయంపై పోలింగ్ సిబ్బందికి పలు దఫాలుగా శిక్షణ సైతం ఇచ్చారు. అయితే జిల్లాలో పలుచోట్ల వీవీ ప్యాట్ స్లిప్పులను తొలగించకుండా అలాగే ఉంచారు. ఇందువల్ల ఈవీఎంలలో నమోదైన ఓట్లకు, వీవీ ప్యాట్లలోని స్లిప్పులకు తేడా వస్తుంది. ఈ విషయాన్ని అధికారులు గుర్తించారు. 23న కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు, ఎన్నికల ఏజెంట్లకు వివరించాలి. వీవీ ప్యాట్ స్లిప్పులను ప్రక్కన పెట్టి ఆ తర్వాత అసలు ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. ఈవీఎంలు మొరాయిస్తే కౌంటింగ్ సమయంలో ఈవీఎంలు మొరాయించే అవకాశం లేకపోలేదు. ఏదైనా కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని చూపకపోతే దాన్ని తీసుకెళ్లి రిటర్నింగ్ అధికారి కస్టడీలో ఉంచాలి. మిగతా ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగించాలి. అన్ని ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత మొరాయిం చిన ఈవీఎంలను తీసుకు రావాలి. వాటికి సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి ఆ తర్వాత ఫలితాలను విడుదల చేయాలి. మొరాయించిన ఈవీఎంల సమాచారాన్ని సంబంధిత రిటర్నింగ్ అధికారులు ఎన్నికల కమిషన్‌కు పంపాలి. -
కౌంటింగ్‌లో సూపర్వైజర్ల పాత్ర కీలకం
సాక్షి, ఒంగోలు అర్బన్: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో కౌంటింగ్ సూపర్వైజర్ల పాత్ర కీలకమైనదని, ఈ నెల 23వ తేదీ వారంతా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌చంద్ సూచించారు. కౌంటింగ్ ప్రక్రియపై సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు గురువారం స్థానిక ఏ–1 కన్వెన్షన్ హాలులో శిక్షణ తరగతులు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే అధికారులు చిత్తశుద్ధితో నిజాయితీగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల నియమావళిని పూర్తిగా అవగాహన చేసుకుని ఎలాంటి ఆటంకాలు లేకుండా విధులు నిర్వహించాలన్నారు. కంట్రోల్ యూనిట్లో ఓట్ల లెక్కింపులో భాగంగా పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు నోటాలో వచ్చిన ఓట్లు కూడా నమోదు చేయాలన్నారు. రౌండ్ల వారీగా, అభ్యర్థుల వారీగా పోలైన ఓట్లు సక్రమంగా ప్రీప్రింటెడ్ ఫారం–17సీ పార్ట్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఫారం 17సీ పార్ట్ ఎంతో ముఖ్యమైనదన్నారు. అదేవిధంగా 17ఏ బ్యాలెట్ పేపర్ దగ్గర ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు 17సీ పార్ట్ పూర్తి చేసి ఒక కాపీని నోడల్ అధికారికి, మరో కాపీని అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారికి అందజేయాలన్నారు. కంట్రోల్ యూనిట్లో పోలైన ఓట్లను జాగ్రత్తగా నమోదు చేయాలని, తప్పులు జరిగితే తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోగ్రఫీ, వెబ్ కాస్టింగ్ చేస్తామన్నారు. రౌండ్ల వారీగా, అభ్యర్థుల వారీగా పోలైన ఓట్ల డేటాను మైక్రో అబ్జర్వర్లు నమోదు చేసి నేరుగా ఎన్నికల అబ్జర్వర్లకు అందజేయాలన్నారు. ప్రతి కౌంటింగ్ హాలుకు ఇద్దరు నోడల్ అధికారులను నియమించామన్నారు. తప్పనిసరిగా కంట్రోల్ యూనిట్లో గ్రీన్ పేపర్ సీల్ చెక్ చేసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు సంతృప్తి పడేలా పనిచేయాలి... కౌంటింగ్ ఏజెంట్లు సంతృప్తి పడేలా పనిచేయాలని సూపర్వైజర్లకు కలెక్టర్ సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో రెండు హాళ్లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు అపాయింట్మెంట్ లెటర్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతి రౌండ్లో రెండు కంట్రోల్ యూనిట్లను ఎన్నికల అబ్జర్వర్లు ర్యాండమ్‌గా పరిశీలిస్తారని వెల్లడించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు ప్రతి రౌండ్లో డేటాను సక్రమంగా నమోదు చేయాలన్నారు. ఈవీఎంలతో పాటు పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ పేపర్లు లెక్కిస్తామన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్లు ఉదయం 5.30 గంటలకు తప్పనిసరిగా కౌంటింగ్ హాలులో కేటాయించిన టేబుల్ వద్ద ఉండాలన్నారు. కౌంటింగ్ హాలులోకి మొబైల్ ఫోన్లు అనుమతించరని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎదరుపడే అసాధారణ పరిస్థితులను ఏ విధంగా పరిష్కరించుకోవాలనే అంశాలను అధికారులకు కలెక్టర్ వివరించారు. కౌంటింగ్ ప్రక్రియను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయిలో వివరించారు. శిక్షణలో ప్రత్యేక కలెక్టర్ వీఆర్ చంద్రమౌళి, జాయింట్ కలెక్టర్లు నాగలక్ష్మి, సిరి, డీఆర్ఓ వెంకటసుబ్బయ్య, 12 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
కౌంటింగ్‌కు భారీ బందోబస్తు
నిజామాబాద్క్రైం, న్యూస్‌లైన్: మున్సిపల్, పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈనెల 12న మున్సిపల్ ఎన్నికల ఓట్లను, 13న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ఎన్నికల ఓట్లను జిల్లా కేం ద్రంలోని నిర్మల హృదయ కాన్వెంట్ స్కూల్ లో లెక్కించనున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూర్ మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లు గా పోటి చేసిన అభ్యర్థులు, వారి అనుచరులు భారీ సంఖ్యలో కౌటింగ్ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని పోలీ సులు జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక పోలీ సుల బలగాలను బందోబస్తులో వినియోగిస్తున్నారు. ఈవీఎంలను నిర్మల హృదయ కాన్వెం ట్ స్కూల్లోని స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రపరిచారు. రేపు జరుగనున్న కౌటింగ్‌కు నలుగురు డీఎస్పీల నేతృత్వంలో 12 మంది సీఐలు, ఎస్సై లు 34 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 43 మంది, కానిస్టేబుళ్లు 159 మంది, మహిళ కానిస్టేబుళ్లు, మహిళ హోంగార్డులు 34 మంది, హోంగార్డులు 61 మంది, మూడు కంపెనీల స్పెషల్ పార్టీ పోలీసు బలగాలను బందో బస్తుకు వినియోగిస్తున్నారు. ఎన్నికల అధికారులు జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగిన అభ్యర్థుల ఏజెంట్లు, జర్నలిస్టులు మినహా మరెవ్వరిని లోపలకు అనుమతించడం లేదు. లెక్కింపు కేంద్రానికి వందమీటర్ల దూరంలో అభ్యర్థుల అనుచరులు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు గానీ ఎవరూ ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ లెక్కింపు బలగాలు ... ఈనెల 13న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. నిజామాబాద్, ఆర్మూర్ సబ్డివిజన్ల పరిధిలోని 18 మండలల ఎంపీటీసీ, జడ్పీటీసీల బ్యాలెట్ బాక్సులను నగరం నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డులో తిరుమల నర్సింగ్ కాలేజ్‌లో భద్రపరిచారు. ఇక్కడే కౌటింగ్ నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా బందోబస్తు కోసం ముగ్గురు డీఎస్పీలు , సీఐలు 8 మంది, ఎస్సైలు 16 మంది, ఏఎస్సైలు నలుగురు, హెడ్‌కానిస్టేబుళ్లు 32 మంది, కానిస్టేబుళ్లు 172 మంది , మహిళ కానిస్టేబుళ్లు 15 మంది, హోంగార్డులు 20 మందితో పాటు మూడు కంపెనీల ప్రత్యేక పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. కామారెడ్డిలో ..... కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోకి వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన సదాశివనగర్ మండలంలోని మర్కల్ వద్ద గల విజయ ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజ్‌లోనే కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ డీఎస్పీ ఆధ్వర్యంలో నలుగురు సీఐలు, ఎస్సైలు 13 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 19 మంది, కానిస్టేబుళ్లు 39 మంది , మహిళ కానిస్టేబుళ్లు 18 మంది, హోంగార్డులు 20 మంది, స్పెషల్ పార్టీ పోలీసుల బృందం విధులను నిర్వహించనున్నారు. బోధన్‌లో .... బోధన్ సబ్‌డివిజన్ పరిధిలోకి వచ్చే మండలాల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ పట్టణ సమీపంలోని ఆర్కే కాలేజ్‌లో చేపట్టనున్నారు. ఇక్కడ డీఎస్పీ ఒకరు, సీఐలు ఐదుగురు, ఎస్సైలు 19 మంది, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 43 మంది, కానిస్టేబుళ్లు 141 మంది, మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులు 23 మంది, హోంగార్డులు 33 మంది , రెండు స్పెషల్పార్టీల పోలీసుల బృందం బందోబస్తు నిర్వహించనున్నారు.