చినగంజాం పోలీసుస్టేషన్‌లో విలేకరులతోమాట్లాడుతున్నఎస్పీ సిద్ధార్థ్ కౌశల్
చినగంజాం : సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 23వ తేదీన నిర్వహిస్తున్న కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని సిబ్బంది పనితీరు, సౌకర్యాలు, రికార్డులు, పెండింగ్ కేసులు తదితర అంశాలపై పోలీసు అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ఎటువంటి అల్లర్లు లేకుండా నిర్వహించేందుకు శాఖ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. డివిజన్ స్థాయిలో సమీక్షలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఎటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ఆయా ఉన్నతాధికారుల స్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ వివరించారు.
కౌంటింగ్‌కు, ఫలితాలు వెలువరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇబ్బందులను సైతం ఎదుర్కోగలిగే వనరులను ముందుగానే సమకూర్చుకొని బాధ్యతగా పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆయా సర్కిల్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్‌ల స్థాయిలో సిబ్బంది కొరత ఉన్నా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని, అందుకు సిబ్బంది సైతం పూర్తి సహకారం అందించారని, పోలీసు సిబ్బందితో పాటు మీడియా వైపు నుంచి కూడా మంచి సహకారం ఉందన్నారు. చినగంజాం పోలీసుస్టేషన్ పరిధిలో పెదగంజాం వంటి గ్రామంలో చిన్న చిన్న ఘర్షణలు మినహా ఎటువంటి ఇబ్బందుల్లేవన్నారు. ఈ పోలీసుస్టేషన్‌కు సమర్థ మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించామని చెప్పారు. గ్రామాల్లో ముఠా తగాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా, కౌంటింగ్ రోజు స్థానికంగా గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వారు, కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్లి అల్లర్లు సృష్టించే వారున్నారా.. అని ఆరా తీయాలని స్థానిక పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. స్థానికంగా భూ వివాదాలు, అక్రమ మైనింగ్ వంటి వాటిపై నిఘా పెడుతున్నట్లు చెప్పారు. ఎస్పీతో పాటు చీరాల డీఎస్పీ నాగరాజు, ఇంకొల్లు సీఐ ఎం.శేషగిరిరావు, ఎస్‌ఐ ఎ.లక్ష్మీభవాని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment