విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్‌చంద్, ఎస్పీ సిద్దార్ధకౌశల్, జేసీ
సాక్షి, ఒంగోలు అర్బన్ : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ నెల 23వ తేదీ జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్నీ ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్‌చంద్ తెలిపారు. మంగళవారం ప్రకాశం భవనంలోని ఎన్నికల కంట్రోలు రూంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఒంగోలు పార్లమెంట్‌కు సంబంధించి రైజ్ కృష్ణసాయి ఇంజినీరింగ్ కాలేజిలో ఒంగోలు, కొండపి, దర్శి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. పేస్ ఇంజినీరింగ్ కాలేజిలో బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి చీరాల, అద్దంకి, పర్చూరు, సంతనూతలపాడు నియోజకవర్గాల ఓట్ల లెక్కిస్తారన్నారు. ఓట్ల లెక్కింపునకు 2700 మంది సిబ్బందిని నియమించామన్నారు. వారిలో 106 మంది సహాయ రిటర్నింగ్ అధికారులు, 1085 మంది సూపర్‌వైజింగ్ అసిస్టెంట్స్, 522 మంది మైక్రో అబ్జర్వర్లు, ఇతర పనుల కోసం 938 మందిని నియమించినట్లు తెలిపారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత కోసం 1261 మందిని నియమించామన్నారు. కౌంటింగ్‌లో పాల్గొనే కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకు, అధికారులు సిబ్బంది ఉదయం 5 గంటలకు తప్పనిసరిగా కౌంటింగ్ కేంద్రాలకు చేరాలన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు రిటర్నింగ్ అధికారులు కేటాయించిన టేబుళ్ల వద్ద మాత్రమే ఉండాలని ఇతర టేబుళ్ల వద్దకు వెళ్లకూడదన్నారు. కౌంటింగ్ ఎలాంటి అంతరాయం కలిగించినా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో ఓటింగ్ రహస్యమని సెక్షన్ 128 ప్రకారం కౌంటింగ్ కేంద్రాల వద్ద ఓట్ల వివరాలు బయటకు తెలియకూడదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులకు, సిబ్బందికి, ఎలక్షన్ ఏజెంట్లకు అల్పాహారంతో పాటు భోజనం, తాగునీరు వసతులు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా మెడికల్ క్యాంపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మీడియా సెంటర్ ఏర్పాటు చేసి మీడియాకు సహకరిస్తామన్నారు.
జిల్లా ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 1300 మంది సీఆర్‌ఎఫ్ భద్రతా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. 23వ తేదీ కౌంటింగ్ నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. దాంతో పాటు 20 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉంటుందన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రమే కాకుండా జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పాల్గొన్నారు.
సెల్‌ఫోన్‌లు అనుమతించం
మీడియా సమావేశానికి ముందు కౌంటింగ్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. 23వ తేదీ ఉదయం 6 గంటలకు తప్పనిసరిగా రాజకీయ పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాలకు చేరాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్దకు సెల్‌ఫోన్‌లు అనుమతించమని స్పష్టం చేశారు. ఎవరికి ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లో వారి వాహనాలు నిలుపుకుని కేంద్రాలకు చేరాలన్నారు. నిబంధనలు ఉల్లఘించడకుండా సహకరించి కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఏజెంట్ బి.హనుమారెడ్డి, టీడీపీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీరాంమాల్యాద్రి, స్వతంత్ర అభ్యర్థి బిళ్లా చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment