సాక్షి, చీరాల రూరల్ : సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చీరాల పోలీసు సబ్–డివిజన్ స్థాయి పోలీసు అధికారులతో సోమవారం చీరాల ఐఎల్‌టీడీ శాండ్రిజ్ గెస్ట్‌హౌస్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. కౌంటింగ్ ప్రక్రియకు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి తగిన సూచనలు, సలహాలను అందించామన్నారు. కౌంటింగ్ రోజు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంయమనం పాటించాలని సూచించారు. 30 పోలీసు యాక్టు, 144 సెక్షన్‌లు అమలులో ఉన్నందున ప్రజలు కూడా గుంపులు గుంపులుగా రోడ్లపై చక్కర్లు కొట్టవద్దన్నారు. పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు.
పోలీసు సిబ్బంది కూడా విధులలో అలసత్వం లేకుండా నిరంతరాయంగా పనిచేయాలని సూచించారు. రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసుకోరాదని, అలానే సంఘ విద్రోహ శక్తులు, రౌడీ షీటర్లు, డెకాయిట్లు, అల్లర్లకు పాల్పడే వారిపై నిఘా ఉందని చెప్పారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. పోలీసు ఆంక్షలను ధిక్కరించిన వారిని ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఎస్పీ వెంట ట్రైనీ ఎస్పీ బింధు మాదవ్, డీఎస్పీ ఉప్పుటూరి నాగరాజు, సీఐలు శ్రీనివాసరావు, రాజ మోహనరావు, ప్రసాద్, శేషగిరిరావు, ఎస్సైలు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment