మహారాష్ట్ర, హరియాణాలో మళ్లీ కమలమే వికసిస్తుందా, మోదీ షా ద్వయాన్ని ఎదుర్కొనే శక్తి విపక్షాలకు ఉందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. గురువారం ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరాఠాల ప్రభావం అత్యధికంగా ఉండే మహారాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌కు, జాట్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌కు పగ్గాలు అప్పగించి బీజేపీ చేసిన ప్రయోగాన్ని ఓటర్లు ఎంతవరకు ఆమోదిస్తారో, వరసగా రెండోసారి సీఎంలు అయ్యే చాన్స్ వారికి వస్తుందా అన్నది నేటి ఫలితాలతో తెలిసిపోనుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది.
మహారాష్ట్రలో...
మహారాష్ట్ర శాసనసభ 288 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,237 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేస్తే మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 147 స్థానాల్లో, ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాజకీయ వ్యూహాల ముందు విపక్షాలు నిలబడలేవని ఇంచుమించుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నాయి.
కేదార్‌నాథ్ గుడి వద్ద సీఎం ఫడ్నవీస్ దంపతులు
కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుని అత్యంత చాకచక్యంగా మోదీ ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వినియోగించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఫడ్నవీస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అన్ని రంగాల సుస్థిరాభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోవడం బీజేపీకి కలిసొస్తుందని విశ్లేషకుల అంచనా. రైతు సమస్యలు మినహా ఫడ్నవీస్ పాలనపై పెద్దగా విమర్శలేవీ లేకపోవడం వల్ల ఈ సారి ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే అంచనాలున్నాయి. ఠాక్రే కుటుంబ వారసుడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో ఉండడం ఈ సారి విశేషంగా చెప్పుకోవాలి. మొత్తం 25 వేల మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ విధుల్లో ఉన్నారు.
ఉప ఎన్నికల ఫలితాలూ ప్రతిష్టాత్మకమే
మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లోని రెండు లోక్‌సభ స్థానాలు, 51 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఇవాళే ఉంది. ఈ ఫలితాలతో వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వచ్చిన ఇబ్బందేమీ లేకపోయినప్పటికీ బీజేపీ తన కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉప ఎన్నికల్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
హరియాణా పీఠం ఎవరిది ?
హరియాణాలో మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని, బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంచుమించుగా చెబితే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా దానికి విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించడంతో ఈ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హరియాణాలో కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికంగా దృష్టి పెడితే కాంగ్రెస్ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరాహోరీగా పోటీ ఇచ్చింది.
2014 ఎన్నికలతో పోల్చి చూస్తే హరియాణాలో పోలింగ్ 76.54 నుంచి 68 శాతానికి భారీగా పడిపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేవీలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ (ఐఎన్‌ఎల్‌డీ) చీలిక వర్గం, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీకి 32–44, కాంగ్రెస్‌కు 30–42, ఇక జేజేపీకి 6–10 స్థానాలు వస్తాయని ఇండియా టుడే పోల్స్‌లో వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment