artical 370
-
J&K Elections: హిమసీమ చరిత్రలోనే అత్యధిక ‘ఎన్నికల’ వేడి
. దశాబ్దాలుగా ఉగ్ర దాడులకు, కల్లోలానికి పర్యాయపదం. అశాంతితో అట్టుడికిపోతూ వస్తున్న ఆ ప్రాంతంలో ఉగ్ర దాడులు పెద్దగా తగ్గకున్నా కొన్నాళ్లుగా కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో పదేళ్ల విరామం తర్వాత ఎట్టకేలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కు ప్రత్యేక హోదా కలి్పంచిన ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణతో పాటు కాంగ్రెస్ కీలక నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ స్థాపన వంటి కీలక పరిణామాలెన్నో ఈ పదేళ్లలో చోటుచేసుకున్నాయి. ఈ రాజకీయ పరిణామాలపై, లోయలో శాంతిస్థాపన యత్నాలు తదితరాలపై ప్రజల మనోగతానికి ఈ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టే అవకాశముందని భావిస్తున్నారు. దాంతో పీడీపీ, ఎన్సీ వంటి స్థానిక పారీ్టలతో పాటు ప్రధాన పక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. పైగా జమ్మూ కశీ్మర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ప్రజల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పునర్ వ్యవస్థీకరణతో... దశాబ్దకాలంగా జమ్మూ కశీ్మర్ రాజకీయ ముఖచిత్రం ఊహాతీతంగా మారిపోయింది. 2026 జనగణన దాకా నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ జరపరాదన్న రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి 2022లో ఈ ప్రక్రియ చేపట్టారు. అసెంబ్లీ స్థానాలను 87 (లడ్ఢాఖ్‌లోని 4 స్థానాలను మినహాయిస్తే) నుంచి 90కి పెంచారు. మొత్తం సీట్ల సంఖ్య పెద్దగా పెరగకున్నా ముస్లిం ప్రాబల్య కశీ్మర్లో సీట్లు 47కు తగ్గి, హిందువులు ఎక్కువగా ఉండే జమ్మూలో 43కు పెరగడం విశేషం. జమ్మూలోని సాంబా, రాజౌరీ, కథువా జిల్లాల్లో రెండేసి సీట్లు పెరిగితే కశ్మీర్లో ఒక్క స్థానం (కుప్వారాలో) పెరిగింది. అంతకుముందు కశీ్మర్లో 46, జమ్మూలో 37, లడ్ఢాఖ్ ప్రాంతంలో 4 సీట్లుండేవి. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకశ్మీర్ జనాభాలో 43.8 శాతం మంది జమ్మూలో, 56.2 శాతం కశీ్మర్లో నివసిస్తున్నారు. కశీ్మర్లోని ఉత్తరాది జిల్లాల్లో అత్యంత సున్నిత పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎన్నికల నిర్వహణ కత్తిమీద సామేనని ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించాలన్నది నిర్ణయాన్ని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్వాగతించారు. ఈ క్షణాల కోసం జమ్మూ కశీ్మర్ ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎల్జీదే పెత్తనం2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచీ జమ్మూ కశీ్మర్‌కు రాష్ట్ర హోదా తొలగించి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు. నాటినుంచీ కీలక అధికారాలన్నీ లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలోనే కేంద్రీకృతమయ్యాయి. అసెంబ్లీ అధికారాలు కుంచించుకుపోయాయి. దాదాపుగా ప్రభుత్వ నిర్ణయాలన్నింటికీ ఎల్జీ ఆమోదముద్ర తప్పనిసరిగా మారింది. పోలీసు వ్యవస్థతో పాటు భూములకు సంబంధించిన అన్ని అంశాలపైనా ఎల్జీదే నిర్ణయాధికారం.2014 ఎన్నికల్లో ఏం జరిగింది? → 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కశీ్మర్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 65.52 శాతం ఓటింగ్ నమోదైంది. → పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) 28 స్థానాలతో ఏకైక అతి పెద్ద పారీ్టగా నిలిచింది. → రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి 25 సీట్లొచ్చాయి. → నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కి 15, కాంగ్రెస్‌కు 12 స్థానాలు దక్కాయి. → స్థానిక చిన్న పారీ్టలు, స్వతంత్రులకు 7 సీట్లొచ్చాయి. ఏ పార్టీకీ మెజారిటీ రాకపోవడంతో చివరికి బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలా సంకీర్ణ సర్కారు ఏర్పడింది. కానీ విభేదాల నేపథ్యంలో 2018లో బీజేపీ మద్దతు ఉపసంహరించడంతో ఆ సర్కారు కుప్పకూలింది. ఆ తర్వాత 2020లో జిల్లా అభివృద్ధి మండళ్లకు, తాజాగా గత మేలో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటువేశారు.కాంగ్రెస్, ఎన్సీ పొత్తు ఈసారి కాంగ్రెస్, ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకుని రంగంలోకి దిగుతున్నాయి. ఇందులో భాగంగా 51 స్థానాల్లో ఎన్సీ, 32 చోట్ల కాంగ్రెస్ పోటీ చేస్తాయి. సీపీఎం, పాంథర్స్ పారీ్టలకు ఒక్కో స్థానం చొప్పున కేటాయించాయి. మిగతా 5 చోట్ల ఎన్సీ, కాంగ్రెస్ స్నేహపూర్వక పోటీకి దిగుతుండటం విశేషం. మరోవైపు బీజేపీ 16 మంది అభ్యర్థుతో తొలి జాబితా విడుదల చేసింది. తొలుత 44 మంది పేర్లు ప్రకటించినా వాటిలో పలు పేర్లపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఆ జాబితాను రద్దు చేసింది. ఇక మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ ఇప్పటిదాకా రెండు విడతల్లో 16 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) కూడా 13 మందితో తొలి జాబితా విడుదల చేసింది.ఈ ఎన్నికలకు ఇంత ప్రాధాన్యం ఎందుకంటే... లో గత పదేళ్లలో అన్నివిధాలుగా సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. అటు రాష్ట్ర హోదా రద్దయి కేంద్రపాలిత ప్రాంతంగా మారడం మొదలుకుని రాజకీయంగా కూడా ఎన్నో పరిణామాలు జరిగాయి. వీటన్నింటిపైనా సగటు జమ్మూ కశీ్మర్ ప్రజల మనోగతానికి వారి ఓటింగ్ సరళి అద్దం పట్టనుంది. అందుకే ఈ ఎన్నికలను జమ్మూ కశ్మీర్ చరిత్రలోనే కీలకమైనవిగా భావిస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Narendra modi: జమ్మూకశ్మీర్‌కు త్వరలో రాష్ట్ర హోదా
ఉద్ధంపూర్/జైపూర్: జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఇక ఎంతోదూరంలో లేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని, శాసన సభ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేలతో, మంత్రులతో చెప్పుకోవచ్చని తెలియజేశారు. గతంలో జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల నుంచి ఎన్నికల బహిష్కరణ పిలుపులు వినిపించేవని, ప్రస్తుతం అవన్నీ చరిత్రలో కలిసిపోయాయని పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, బాంబు దాడులు, రాళ్ల దాడులు, కాల్పులు, ఘర్షణలు, భయాందోళనల ప్రసక్తి లేకుండా ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగబోతున్నాయని చెప్పారు. శుక్రవారం జమ్మూకశ్మీర్‌లోని ఉద్ధంపూర్‌లో, రాజస్తాన్‌లోని బార్మర్‌లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. రాజస్తాన్ రాష్ట్రం దౌసాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ ప్రజల సమస్యలు పరిష్కరిస్తానంటూ ఇచి్చన హామీని నిలబెట్టుకున్నానని తెలిపారు. ఆ అడ్డుగోడ కూల్చేశాం.. శకలాలు సమాధి చేశాం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో అభివృద్ధి వేగవంతమైందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసం మరింత పెరిగిందని అన్నారు. గతంలో వైష్ణోదేవి, అమర్నాథ్ భక్తుల భత్రతకు ముప్పు ఉండేదని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని వెల్లడించారు. గతంలో కుటుంబ పార్టీల నిర్వాకం వల్ల జమ్మూకశ్మీర్ ఎంతో నష్టపోయిందన్నారు. ఆర్టికల్ 370 అనే అడ్డుగోడను సృష్టించింది కుటుంబ పార్టీలేనని మండిపడ్డారు. ఈ ఆర్టికల్ వల్ల ప్రజలకు రక్షణ లభిస్తుందన్న భ్రమను కుటుంబ పారీ్టలు కలి్పంచాయని ధ్వజమెత్తారు. ప్రజల అండతో ఈ అడ్డుగోడను కూలి్చవేశామని, దాని శకలాలను సైతం సమాధి చేశామని వ్యాఖ్యానించారు. ఓ వర్గం ఓట్ల కోసమే మాంసాహార వీడియోలు విపక్ష ‘ఇండియా’ కూటమిది మొఘల్ రాజుల మైండ్‌సెట్ అని ప్రధానమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామమందిరం బీజేపీ ఎన్నికల ఎత్తుగడ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. రామాలయం కోట్లాది మంది ప్రజల విశ్వాసానికి సంబంధించిన అంశమని అన్నారు. రామజన్మభూమి అంశానికి 500 ఏళ్ల చరిత్రఉందని, అప్పట్లో ఎన్నికలు లేవని చెప్పారు. మొఘల్ పాలకులు ఆలయాలను కూలి్చవేసి, మెజార్టీ ప్రజల మనోభావాలను గాయపర్చి ఆనందిస్తూ ఉండేవారని తెలిపారు. అదే ఆలోచనాధోరణితో విపక్షాలు వ్యవహరిస్తున్నాయని తప్పుపట్టారు. కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష నాయకులు ఓ వర్గం ప్రజలను సంతృప్తిపర్చి ఓట్లు దండుకోవడానికి పవిత్ర మాసాల్లో, నవరాత్రుల్లో మాంసాహారం తింటూ, ఆ వీడియోలను ఉద్దేశపూర్వకంగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని శక్తిహీనంగా మారుస్తారా? భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎంతగానో గౌరవిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంటూ విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ బీఆర్ అంబేడ్కర్ ఇప్పుడొచ్చినా రాజ్యాంగాన్ని రద్దు చేయలేరని అన్నారు. ప్రభుత్వానికి రాజ్యాంగం భగవద్గీత, రామాయణం, మహాభారతం, బైబిల్, ఖురాన్ లాంటిందని అన్నారు. తమకు రాజ్యాంగమే సమస్తం అని వివరించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలిస్తామని విపక్ష ఇండియా కూటమిలోని భాగస్వామ్యపక్షాలు చెబుతున్నాయని మోదీ తప్పుపట్టారు. మనకు ఇరువైపులా అణ్వాయుధ సంపత్తి కలిగిన దేశాలున్నాయని చెప్పారు. మనకు అణ్వాయుధాలు లేకపోతే ఏం జరుగుతుందో తెలియదా? అని నిలదీశారు. మీరు ఎవరు ఆదేశాలతో పని చేస్తున్నారో చెప్పాలని ఇండియా కూటమిని నిలదీశారు. దేశాన్ని శక్తిహీనంగా మార్చడమే ఇండియా కూటమి లక్ష్యమా? అని ప్రధానమంత్రి మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
NCERT Textbooks: ఆ పదాలు తొలగింపు
న్యూఢిల్లీ: పాఠశాల పాఠ్యపుస్తకాల్లో బాబ్రీ మసీదు కూల్చివేత, గుజరాత్ అల్లర్లలో ముస్లింల హత్య, హిందూత్వ తదితర పదాలు, వాక్యాలను తొలగిస్తున్నట్లు జాతీయ విద్యాపరిశోధనా, శిక్షణా మండలి(ఎన్సీఈఆర్టీ) పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో కాలానుగుణంగా చేయాల్సిన మార్పుల్లో భాగంగా ఈ సవరణలు చేపట్టినట్లు ఎన్సీఈఆర్టీ తెలిపింది. ఆరి్టకల్ 370 రద్దుకు సంబంధించిన అంశంలో పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్(పీఓకే) అనే పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అనే పదాన్ని చేర్చారు. పుస్తకాల నుంచి కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై ఎన్సీఈఆర్టీ స్పందించింది. ‘‘ పుస్తకాల ఆధునీకరణలో జరిగే సాధారణ ప్రక్రియ ఇది. నూతన విద్యా ప్రణాళిక కింద చేసే కొత్త పాఠ్యపుస్తకాల తయారీకి దీనితో ఏ సంబంధం లేదని అధికారులు స్పష్టంచేశారు. ఇతర తరగతుల పుస్తకాలతోపాటు 11, 12 తరగతుల రాజనీతి శాస్త్రం, సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకాల్లో ఈ మార్పులు చేశారు. 11వ తరగతిలో లౌకికవాదం అనే 8వ చాప్టర్లో ‘‘ 2002 గుజరాత్ గోధ్రా అల్లర్ల తర్వాత వేయికిపైగా ఊచకోతకు బలయ్యారు. ఇందులో ముస్లింలే ఎక్కువ’’ అనే వాక్యంలో ముస్లింలు అనే పదం తొలగించారు. అల్లర్ల ప్రభావం అన్ని మతాలపై ఉన్న కారణంగా ఒక్క మతాన్నే ప్రస్తావించడం సబబు కాదని ఎన్సీఈఆర్టీ భావించింది. 12వ తరగతి రాజనీతిశాస్త్రం పుస్తకంలోని ‘స్వాతంత్య్రం నుంచి భారత రాజకీయాలు’ చాప్టర్లో కొత్తగా ఆరి్టకల్ 370 రద్దును జతచేశారు. 8వ చాప్టర్లో ‘‘ 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదు కూల్చివేతతో ఎన్నో విపరిణామాలు జరిగాయి. ఇది బీజేపీ, హిందూత్వ వ్యాప్తికి దారితీసింది’’అన్న వాక్యాలకు బదులు ‘ శతాబ్దాలనాటి రామజన్మభూమి ఆలయ వివాదం దేశ రాజకీయాలనే మార్చేసింది’’ అని మార్చారు. ఇందులో హిందూత్వ పదాన్ని తొలగించారు. -
ఆర్టికల్ 370 రద్దు.. మొదటిసారి శ్రీనగర్‌కు ప్రధాని మోదీ
జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నేడు మోదీ కశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నారు. కాగా, ప్రధాని మోదీ నేడు కశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా శ్రీనగర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరగనున్న వికసిత్ భారత్.. వికసిత్ జమ్మూకశ్మీర్ కార్యక్రమానికి మోదీ హాజరు కానున్నారు. ఇక, కేంద్ర పాలిత ప్రాంతంలో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం దాదాపు రూ.5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. New Jammu kashmir after the abrogation of 370 and 35A. Ahead of PM Modi's arrival in the valley, BJP supporters take out a flag march while shouting, "Har Har Modi, Ghar Ghar Modi." Please retweet it pic.twitter.com/MqPQTrHM8g — Aquib Mir (@aquibmir71) March 6, 2024 అలాగే.. శ్రీనగర్‌లోని హజ్రత్బల్ మందిరంలో స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాల కింద రూ.1,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన పర్యటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌లో కొత్తగా రిక్రూట్ అయిన దాదాపు 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధాని అపాయింట్మెంట్ లెటర్లను ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మహిళలు, రైతులు, పారిశ్రామికవేత్తలతో సహా వివిధ కేంద్ర పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం 2,000 రైతు సేవా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. మరోవైపు.. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో పోలీసులు, ఆర్మీ బందోబస్తులో ఉన్నారు. అటు, మోదీ వస్తున్న క్రమంలో కశ్మీర్లో బీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
సాక్షి, ఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను ఉపసంహరిస్తూ 2019వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టింది. దీనిపై సోమవారం వెలువరించిన తీర్పులో ఆర్టికల్ 370ని రద్దు చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకున్న నిర్ణయం అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగే పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం అని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బెంచ్ తీర్పు నిచ్చింది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది. జమ్ము కశ్మీర్ రాజు నాడు దీనిపై ఒప్పందం చేసుకున్నారని సుప్రీం కోర్టు వివరించింది. ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్‌లో యుద్ధవాతావరణాన్ని సృష్టించిందని, కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయడం సరికాదని పేర్కొంది. అలాగే రాష్ట్రపతి అధికారాలను ప్రతిసారి న్యాయపరిశీలనకు తీసుకోవడం సాధ్యంకాదని సీజేఐ స్పష్టం చేశారు. ఇదీ చదవండి: ఆర్టికల్ 370 పూర్వాపరాలు.. ఎందుకు రద్దు చేశారు? వచ్చే ఏడాది ఎన్నికలు నిర్వహించండి జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ వరకు దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సెప్టెంబరు 5న రిజర్వులో ఉంచిన తీర్పును సోమవారం వెలువరించింది. కాగా 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే దీనిని స్థానిక రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయా పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లను దాఖలు చేశాయి. కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో కశ్మీర్లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. రెండు వారాలుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో భద్రతా ఏర్పాట్లపై పోలీసులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా మరికొందరిని గృహనిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టేవారిపై చర్యలు తప్పవని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. -
జమ్మూకశ్మీర్‌లో నవశకం
పల్లి: ప్రజాస్వామ్యం, కృతనిశ్చయం విషయంలో జమ్మూ కశ్మీర్ సరికొత్త ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రెండుమూడేళ్లుగా తమ ప్రభుత్వం ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. 370వ అధికరణ రద్దు తర్వాత తొలిసారి మోదీ కశ్మీర్లో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా దాదాపు రూ. 20వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వీటిలో బనిహాల్– ఖాజీగుండ్ రోడ్ టన్నెల్ కూడా ఉంది. దీనివల్ల ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో కూడా రెండు ప్రాంతాల మధ్య కనెక్టివిటీకి ఇబ్బంది ఉండదు. పంచాయతీ దివస్ ర్యాలీని పురస్కరించుకొని దేశంలోని అన్ని పంచాయతీలను ఉద్దేశించి ఆయన పల్లి గ్రామంలో ప్రసంగించారు. గత రెండేళ్లలో లోయలో రూ. 38వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయని, టూరిస్టులు కూడా పెరిగారని చెప్పారు. అంతకు ముందు 7 దశాబ్దాల కాలంలో కశ్మీర్‌కు కేవలం 17 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయన్నారు. ప్రజలకు మేలు చేసే కేంద్ర చట్టాలు గతంలో ఇక్కడ అమలయ్యేవి కావని, కానీ తమ ప్రభుత్వం దాదాపు 175 కేంద్ర చట్టాలను, పంచాయతీ వ్యవస్థను అమలు చేసి, ఇక్కడి ప్రజల సాధికారతకు దోహదం చేస్తోందని చెప్పారు. జమ్మూ, కశ్మీర్లో ఇటీవల ప్రశాంతంగా మూడంచెల పంచాయతీ రాజ్ ఎన్నికలు జరగడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడి పంచాయతీల బలోపేతానికి తమ ప్రభుత్వం రూ. 22వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు. రాబోయే 25ఏళ్లు జమ్మూ, కశ్మీర్ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదవుతుందన్నారు. సరిహద్దు గ్రామాల మధ్య ఏడాది మొత్తం కనెక్టివిటీ ఉండేలా చూస్తామన్నారు. తొలి కార్బన్ రహిత పంచాయతీ జమ్ము, కశ్మీర్లో పల్లి గ్రామ పంచాయతీ దేశంలోనే తొలి కార్బన్ రహిత(కార్బన్ న్యూట్రల్) పంచాయతీగా చరిత్రకెక్కింది. ఇక్కడ ప్రధాని మోదీ 500 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను ఆరంభించి జాతికి అంకితం చేశారు. దేశానికి కార్బన్‌రహిత మార్గాన్ని పల్లి చూపుతుందని మోదీ చెప్పారు. స్థానిక ప్రజల సహకారంతోనే ఈ ప్రాజెక్టు సాకారమైందని ఆయన కొనియాడారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 6,408 మీటర్ల ప్రాంతంలో 1,500 సోలార్ ప్యానెల్స్‌ను ఇన్స్టాల్ చేశారు. దీనివల్ల 340 గృహాలకు పర్యావరణ హితమైన విద్యుత్ లభిస్తుంది. గ్రామ్ ఊర్జా స్వరాజ్ ప్రోగ్రాం కింద ఈ ప్లాంట్‌ను నిర్మించామని, ఇందుకు రూ. 2.75 కోట్ల వ్యయమైందని అధికారులు తెలిపారు. . ప్రధాని చొరవతో తమకు ఈ ప్రాజెక్టు లభించిందని గ్రామవాసులు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో పది సోలార్ పంపులు ఏర్పాటయ్యాయని, త్వరలో మరో 40 ఏర్పాటు చేస్తారని సర్పంచ్ రవీందర్ చెప్పారు. గ్రామంలో ఎలక్ట్రిక్ బస్, నూతన ప్రభుత్వ పాఠశాల, పంచాయతీ ఆఫీసును ఏర్పాటు చేశారన్నారు. గ్రామవాసులు ఆర్గానిక్ వ్యవసాయం వైపు మరలాలని ప్రధాని వారికి సూచించారు. మీ పూర్వీకుల కష్టాలు మీకుండవు! కశ్మీర్ లోయలో యువత తమ పూర్వీకులు ఎదుర్కొన్న సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. లోయలో అభివృద్ధికి, శాంతి స్థాపనకు ఆయన పలు కార్యక్రమాలను ప్రకటించారు. ‘మీ తాతలు, తల్లిదండ్రులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుత యువత మాత్రం అలాంటి కష్టాల జీవితాన్ని జీవించదు. నేను హామీ ఇస్తున్నాను’’ అని మోదీ కశ్మీరీలకు భరోసా ఇచ్చారు. యువత తన మాటలపై విశ్వాసం ఉంచాలని కోరారు. తాజాగా చేపట్టిన కార్యక్రమాలు లోయలో యువతకు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు. గత రెండుమూడేళ్లుగా జమ్మూ, కశ్మీర్లో కొత్త అభివృద్ధి చోటు చేసుకుంటోందని మోదీ చెప్పారు. దశాబ్దాల తర్వాత పంచాయతీ రాజ్ దివస్ లాంటి కార్యక్రమాలను కశ్మీర్ ప్రజలు జరుపుకోగలుగుతున్నారని చెప్పారు. -
జమ్మూకశ్మీర్‌తో ‘దిల్లీ కీ దూరీ.. దిల్ కీ దూరీ’ వద్దు
న్యూఢిల్లీ: నియోజకవర్గాల పునర్విభజన తరువాత మాత్రమే జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని అక్కడి అఖిలపక్ష నేతలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల విశ్వాసం మళ్లీ చూరగొనేందుకు రాష్ట్ర హోదా పునరుద్ధరణ అత్యంత కీలకమని అఖిలపక్ష నేతలు ప్రధానికి తేల్చి చెప్పారు. 2019 ఆగస్ట్‌లో తొలగించిన రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని సమావేశంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్‌కు చెందిన అందరు నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్ భవిష్యత్ ప్రణాళికపై ఆక్కడి కీలక నేతలతో ప్రధానమంత్రి మోదీ గురువారం తన నివాసంలో దాదాపు మూడున్నర గంటల పాటు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్న నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ముగిసిన తరువాత అసెంబ్లీ ఎన్నికలుంటాయని ప్రధాని తెలిపారని పీపుల్స్ కాన్ఫెరెన్స్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లో ప్రజాస్వామిక ప్రక్రియను బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని తెలిపారని అధికార వర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ 2019 ఆగస్ట్ 5న కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం.. అక్కడి కీలక నేతలతో మోదీ సమావేశమవడం ఇదే ప్రథమం. జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికలను నిర్వహించిన తీరుగానే అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడం ముఖ్యమని తాము భావిస్తున్నామని, అయితే, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరమే ఎన్నికలు ఉంటాయని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని వ్యాఖ్యలతో మెజారిటీ నాయకులు ఏకీభవించారని అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌తో ‘దిల్లీ కీ దూరీ’, ‘దిల్ కీ దూరీ (ఢిల్లీతో అంతరాన్ని, మనసుల మధ్య దూరాలను)లను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సమావేశం సానుకూల, సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ప్రజాస్వామ్యం కోసం పని చేయాలని అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. జమ్మూకశ్మీర్‌ను ఘర్షణాత్మక ప్రాంతంగా కాకుండా, శాంతియుత ప్రాంతంగా నెలకొల్పేందుకు అన్నివిధాలా సహకరిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు’ అని బేగ్ తెలిపారు. నాయకులందరి అభిప్రాయాలను ప్రధాని సావధానంగా విన్నారన్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర సీఎంలుగా పనిచేసిన నలుగురు నాయకులు ఫరూఖ్ అబ్దుల్లా(ఎన్సీ), ఒమర్ అబ్దుల్లా(ఎన్సీ), మెహబూబా ముఫ్తీ(పీడీపీ), గులాం నబీ ఆజాద్(కాంగ్రెస్).. ఉపముఖ్యమంత్రులుగా పనిచేసిన తారాచంద్(కాంగ్రెస్), ముజఫర్ హుస్సేన్ బేగ్ (పీపుల్స్ కాన్ఫెరెన్స్), నిర్మల్ సింగ్ (బీజేపీ), కవీందర్ గుప్తా (బీజేపీ) ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం. మొహమ్మద్ యూసుఫ్ తరిగమి (సీపీఎం), అల్తాఫ్ బుఖారీ (జేకేఏపీ), సజ్జాద్ లోన్ (పీపుల్స్ కాన్ఫెరెన్స్), జమ్మూకశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ జీఏ మిర్, రవిందర్ రైనా (బీజేపీ), భీమ్ సింగ్ (పాంథర్ పార్టీ) కూడా ప్రధానితో సమావేశమైన వారిలో ఉన్నారు. హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్, జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ప్రధాని కార్యాలయంలో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణ కీలకం: షా రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో పాటు శాంతియుతంగా ఎన్నికలను నిర్వహించడం అత్యంత ముఖ్యమైన మైలురాళ్లని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ‘జమ్మూకశ్మీర్ సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. సమావేశంలో జమ్మూకశ్మీర్ భవిష్యత్తుపై చర్చించాం. పార్లమెంట్లో హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలంటే.. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు శాంతియుత ఎన్నికల నిర్వహణ చాలా కీలకం. జమ్మూకశ్మీర్ నేతలతో సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని నాయకులంతా స్పష్టం చేశారు’ అని షా ట్వీట్ చేశారు. రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే: ఫరూఖ్ జమ్మూకశ్మీర్ ప్రజల్లో మళ్లీ విశ్వాసం పాదుకొనాలంటే రాష్ట్ర హోదాను పునరుద్దరించడం చాలా ముఖ్యమని నేషనల్ కాన్ఫెరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పి ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు. ‘ప్రజల్లో నమ్మకం పోయింది. దాన్ని మళ్లీ పొందాలంటే సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించాలి. ఐఏఎస్, ఐపీఎస్ కేడర్లను పునరుద్ధరించాలి. జమ్మూకశ్మీర్ పూర్తిస్థాయి రాష్ట్రంగా మారాలి. రాష్ట్ర ఆస్తిత్వ గుర్తింపు చాలా అవసరం. ఈ విషయాన్నే ప్రధానికి స్పష్టంగా చెప్పాం’ అన్నారు. అస్సాంకు, మాకు మాత్రమే తేడా ఎందుకు?: ఒమర్ జమ్మూకశ్మీర్ విషయంలో ‘దిల్లీ కీ దూరీ.. దిల్ కీ దూరీ’ని తొలగించాలని తాను కోరుకుంటున్నట్లు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని నేషనల్ కాన్ఫెరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నామని మోదీ, షా తెలిపారన్నారు. ‘దిల్లీ కీ దూరీ.. దిల్ కీ దూరీని తొలగించాలని కోరుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు. అయితే, అది ఒక్క సమావేశంతోనే సాధ్యం కాదని నాతో పాటు ఇతర నాయకులు ఆయనకు చెప్పాం’ అన్నారు. డీలిమిటేషన్ కమిషన్ నివేదిక ఇవ్వగానే ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తోందన్నారు. అస్సాంకు, జమ్మూకశ్మీర్‌కు మాత్రమే ప్రత్యేక డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించామన్నారు. ఇది జమ్మూకశ్మీర్‌ను సంపూర్ణంగా భారత్‌లో భాగం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ భావనకు వ్యతిరేకం కాదా? అని ప్రశ్నించామన్నారు. డీలిమిటేషన్ కమిషన్‌ను నిలిపేసి అస్సాంలో ఎన్నికలు నిర్వహించినట్లుగా, జమ్మూకశ్మీర్లోనూ నిర్వహించాలని కోరామన్నారు. అధికారులతో ప్రభుత్వాన్ని నడపడం సరికాదని కేంద్రం కూడా భావిస్తోందన్నారు. పార్టీ తరఫున మాట్లాడాం: ఆజాద్ ప్రధానితో భేటీలో పార్టీ తరఫున పలు అంశాలను లేవనెత్తామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ‘ఎన్నికలకు ముందే రాష్ట్ర హోదా పునరుద్ధరణ, కశ్మీరీ పండిట్లకు పునరావాస ప్రక్రియ, రాజకీయ ఖైదీల విడుదల, జమ్మూకశ్మీర్ యువతకు ఉద్యోగాల కల్పన కోసం స్థానికత నిబంధనలు.. మొదలైన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాం’ అని వివరించారు. 370 రద్దుపై పోరాటం ఆగదు: ముప్తీ ప్రధాని నరేంద్ర మోదీతో అఖిలపక్షం భేటీ బాగా జరిగిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. పాకిస్తాన్‌తో అనధికార చర్చల ద్వారా నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందానికి, చొరబాట్ల తగ్గుదలకు కారణమైనందున ప్రధాని మోదీకి అభినందనలు తెలిపామన్నారు. ‘రెండు దేశాల మధ్య శాంతి నెలకొనేందుకు, అవసరమైతే, చర్చలను పునరుద్ధరించాలని ప్రధానిని కోరాం. నియంత్రణ రేఖ ద్వారా వాణిజ్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశాం’ మెహబూబా ముఫ్తీ అన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. ‘మాకు ప్రత్యేక హోదా పాకిస్తానేం ఇవ్వలేదు. మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్ల ప్రత్యేక హోదా వచ్చింది. దాన్ని పునరుద్ధరించుకునేందుకు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా పోరాటం కొనసాగిస్తాం’ అని మెహబూబా స్పష్టం చేశారు. పునర్విభజన త్వరగా జరగాలి: పీఎం మోదీ జమ్మూకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన త్వరగా జరగాలని, తద్వారా త్వరగా ఎన్నికలు జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ సమగ్ర అభివృద్ధి కోసం సంబంధిత వర్గాలతో చర్చలు జరపడం కీలకమైన ముందడుగు అని కశ్మీర్ నేతలతో భేటీ అనంతరం ట్వీట్ చేశారు. విభిన్న అభిప్రాయాలున్న వారు కూర్చుని చర్చలు జరపడం భారతీయ ప్రజాస్వామ్యంలోని బలమన్నారు. జమ్మూకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం తమ లక్ష్యమన్నారు. కశ్మీర్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు రాజకీయ నాయకత్వం లభించాల్సిన, వారి ఆకాంక్షలు నెరవేరాల్సిన అవసరం ఉందని అక్కడి నాయకులతో చెప్పానన్నారు. జమ్మూ కశ్మీర్‌తో ఉన్న ‘దిల్లీ కీ దూరీ.. దిల్ కీ దూరీ’ని తొలగించాలన్నది తన ఆకాంక్ష అని జేకే నాయకులతో ప్రధాని మోదీ పేర్కొన్నారని అధికార వర్గాలు తెలిపాయి. కశ్మీర్లో ఒక్క మరణం సంభవించినా.. అది బాధాకరమేనని, కశ్మీరీ యువతను రక్షించుకోవాల్సిన బాధ్యత తమ అందరిపై ఉందని ప్రధాని వారితో చెప్పారని వివరించాయి. రాజకీయంగా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా.. జమ్మూకశ్మీర్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అందరం కలసికట్టుగా కృషి చేయాలని ప్రధాని కోరారని తెలిపాయి. -
భారత్‌పై మరోసారి విషం కక్కిన పాక్.. కారణం తెలిస్తే షాక్
లాహోర్: భారత కంపెనీలైన స్టార్, ఆసియా ఛానెల్‌లకు దక్షిణాసియా క్రికెట్ ప్రసార హక్కులు దక్కాయన్న కారణంగా, తమ దేశం ఆడే క్రికెట్ మ్యాచ్‌లను సైతం పాక్‌లో ప్రసారం చేసేందుకు అక్కడి ప్రభుత్వం నో చెప్పింది. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసినందు వల్ల తాము భారత కంపెనీలతో వ్యాపారం చేయబోమని పాక్ సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ మంత్రి ఫవాద్ చౌదరి వెల్లడించారు. భారత్ ప్రభుత్వం స్వయంప్రతిపత్తి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాకే ఆయా కంపెనీలతో తాము వ్యాపారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య వల్ల తమ దేశ క్రికెట్ బోర్డుకు నష్టపోయినా పర్వాలేదని, తమ నిర్ణయంలో మాత్రం ఏ మార్పు ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. కాగా, వచ్చే నెల ఇంగ్లండ్‌లో పర్యటించనున్న పాక్.. మూడు వన్డేలు (జులై 8, 10, 13), మూడు టీ20లు (జులై 16, 18, 20) ఆడనుంది. ఈ ఆరు మ్యాచ్‌లను తమ దేశంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రసారం చేసేది లేదని ఆక్కడి ప్రభుత్వం భీష్మించుకుని కుర్చుంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆ దేశ క్రికెట్ అభిమానులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, భారత్‌పై విషం కక్కే క్రమంలో పాక్.. తమ వేలితో, తమ కంటినే పొడుచుకుంటుందని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధవన్ పేరు ఖరారు..? -
కశ్మీర్ విధ్వంసానికి పాక్ పన్నాగం
ఇస్లామాబాద్ : ఉగ్రవాదులపై పోరులో ముందున్న భారత్‌పై కక్ష తీర్చుకోవాలనుకుంటున్న దాయాది దేశం పాకిస్తాన్ ప్రయత్నాలు ఏమాత్రం మానటంలేదు. దేశంలో ఉగ్ర చర్యలకు పాల్పడాలని, ఉగ్రవాదులను ఉసిగొల్పి విధ్వంసం సృష్టించాలని ప్రణాళిలు రచిస్తూనే ఉంది. ఏ ఒక్క అవకాశం వచ్చినా.. భారత్‌ను దొంగ దెబ్బ తీయాలని కలలు కంటోంది. సరిహద్దుల్లో కశ్మీర్‌ను వేదికగా చేసుకుని రక్తపాతం సృష్టించాలని కుట్రలకు పన్నుతోంది. అయితే భారత్‌కు చెందిన నిఘా వర్గాల అప్రమత్తతో ఎన్నోసార్లు పాక్ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్లో విధ్వంసం సృష్టించేలా పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థలతో మంతనాలు జరిపినట్లు తేలింది. కశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్న సీనియర్ ఇంటిలిజెన్స్ అధికారి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను వెల్లడించారు. (లద్దాఖ్, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం) ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. పాక్ ఆర్మీ నేతృత్వంలోని అధికారుల బృంధం కశ్మీర్లో ఉగ్రదాడికి పాల్పడాలని ప్రణాళిక రచించింది. ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజనపై నిరసనగా భారత ప్రభుత్వంపై కుట్ర పన్నాలని వ్యూహరచన చేసింది. దీనిలో భాగంగా ఆ దేశంలో తలదాచుకుంటున్న జైషే మహ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలకు చెందిన ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ మేరకు 2019 డిసెంబర్ 27న తొలి భేటీ, ఈ ఏడాది జనవరి తొలి వారంలో ఇస్లామాబాద్ వేదికగా రెండో భేటీ నిర్వహించారు. కశ్మీర్లో జాయింట్ ఆపరేషన్ ద్వారా విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా ఈ రెండు సమావేశాల్లో తీర్మానం చేశారు. ఇదంతా పాక్ ఆర్మీకి చెందిన కీలక అధికారుల సమక్షంలోనే జరింది. అయితే అప్పటికే పాకిస్తాన్ కుట్రలను పసిగట్టిన భారత నిఘా వర్గాలు ఆర్మీ సహకారంతో వారి చర్యను భగ్నం చేశారు. భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించి ఎప్పటికప్పుడు చాకచాక్యంగా వహరించారు. దీంతో కశ్మీర్‌కు పాక్ నుంచి పొంచిఉన్న పెను ముప్పు తప్పిందని ఇంటిలిజెన్స్ అధికారి వెల్లడించారు. కాగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ గత ఏడాది ఆగస్ట్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను రెండుగా విభజించిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని పాకిస్తాన్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం బహిరంగంగానే తప్పుబట్టింది. కశ్మీరీలను హక్కులను హరించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని భారత్‌పై విషం కక్కింది. కశ్మీరీలకు అండగా తాము ఉంటామని ఇమ్రాన్ ప్రకటించారు. ఆయన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం సైతం గట్టిగానే బదులిచ్చింది. కశ్మీర్ భారత్‌లోని అంతర్భాగమని, తమ నిర్ణయాల్లో తలదూర్చొద్దని హెచ్చరించింది. అయితే పాక్ బుద్ధిని ముందే ఊహించిన కేంద్రం.. ఆర్మీ సహాయంతో కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలో తలెత్తకుండా కఠిన చర్యలను చేపట్టింది. కీలక నేతలందరినీ గృహ నిర్బంధం చేసి పరిస్థితులను చక్కదిద్దింది. లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు 144 సెక్షన్ విధించి అప్రమత్తంగా వ్యవహరించింది. -
370 రద్దు వల్లే చైనా దురాక్రమణ
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసినందుకే లద్దాఖ్‌లో చైనా దురాక్రమణకు పాల్పడిందని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్రాన్ని తరచూ విమర్శించే ఫరూక్ అబ్దుల్లా ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడంపై మాట్లాడారు. ‘ఆర్టికల్ 370 రద్దును చైనా ఎన్నటికీ ఆమోదించదు. చైనా తోడ్పాటుతో స్వతంత్ర ప్రతిపత్తిని పొందుతామనుకుంటున్నాం. సరిహద్దుల్లో చైనా పాల్పడే చర్యలన్నిటికీ ఆర్టికల్ 370 రద్దుతో వచ్చిన ఆగ్రహమే కారణం’అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఎంపీ ఫరూక్ జాతి వ్యతిరేక, దేశద్రోహ వ్యాఖ్యలు చేశారని విమర్శించింది. ఫరూక్ చైనా దురాక్రమణను సమర్థిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో ఆయన చైనాలో హీరో అయిపోయారని పేర్కొంది. ఆ పార్టీ ప్రతినిధి సంబిత్ మహాపాత్ర మాట్లాడుతూ.. రాజ్యాంగ పద్ధతిలో పార్లమెంట్ ఆమోదంతోనే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ప్రధాని మోదీపై వ్యతిరేకతతోనే ఆయన దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా తరచూ ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలే చేస్తుంటారని తెలిపారు. -
కేంద్ర నిర్ణయం : ఏకమైన విపక్షాలు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఒకటవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్, వామపక్షలు, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్‌లు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్‌కు కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తి హోదాను కొనసాగించాలని, అలాగే కశ్మీర్ విభజనను రద్దు చేయాలని ఆయా పార్టీల అధినేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌ను బీజేపీ సర్కార్ ముక్కలుగా చేసిందని, ఇది స్థానిక ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం తీసుకునన ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు అన్ని పార్టీల నేతలు కలిసి కట్టుగా పోరాటం చేయాలని శ్రీనగర్‌లో శనివారం నిర్వహించిన ఓ సమావేశంలో తీర్మానించారు. అంతేకాకుండా పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద అరెస్ట్ కాబడిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ నేతలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా లాంటి నేతలు విడుదలైనా కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారు. -
ఆ బంధాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నా..
న్యూఢిల్లీ : పొరుగు దేశాలతోపాటు ప్రపంచంలోని ఏ దేశానికీ భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన వ్యవహారమని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పంజాబ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ ప్రథమ స్మారకోపన్యాసం సందర్భంగా ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ ‘భారతదేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. ఆర్టికల్ 370 రద్దు విషయంలో పార్లమెంటు కూలంకశంగా చర్చించింది. ఉభయసభల ఆమోదం పొందింది. ఇదంతా భారతదేశ అంతర్గత వ్యవహారం. ఇతర దేశాలు (పరోక్షంగా చైనా, పాకిస్తాన్లను ఉద్దేశిస్తూ) మా దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. సుష్మాస్వరాజ్ ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత.. ‘ఈ క్షణం కోసమే ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశానంటూ’ చివరి ట్వీట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకుని ఉపరాష్ట్రపతి ఉద్వేగానికి గురయ్యారు. భారతదేశ ఆలోచనలు, విదేశాంగ విధానాన్ని పలు అంతర్జాతీయ వేదికలపై చాలా స్పష్టంగా, హుందాగా అదే సమయంలో బలంగా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. సుష్మా స్వరాజ్‌కు ఘనంగా నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి.. ఆమెను ‘ఆదర్శ భారతీయ మహిళ’గా కీర్తించారు. మాటలు, చేతల్లో స్పష్టత.. ఆలోచన, ఆహార్యం, ప్రసంగాల్లో భారతీయతకు ఆమె ప్రతిరూపమన్నారు. సుష్మా స్వరాజ్‌కు ఘనంగా నివాళులర్పించారు. తనకు అప్పగించిన ప్రతి బాధ్యతను అత్యంత సమర్థవంతంగా నిర్వహించారని.. తను పనిచేసిన ప్రతిచోట తనదైన ముద్రవేశారని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. అలాంటి ఆదర్శంతమైన రాజకీయ నాయకురాలి జీవితాన్ని, ఆమె సాధించిన విజయాలను కొత్తతరం రాజకీయ నాయకులు ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. 1996లో పార్లమెంటులో ‘భారతీయత’పై శ్రీమతి సుష్మాస్వరాజ్ చేసిన ప్రసంగం తనకింకా గుర్తుందన్నారు. ‘ఓ చక్కటి వక్తగా, కార్యశీలిగా, రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాకుండా.. మానవతా విలువలున్న వ్యక్తిగా కూడా సుష్మాస్వరాజ్ అందరి గుండెల్లో నిలిచిపోతారు. ఆమె పేరుముందు స్వర్గీయ అని పెట్టేందుకు కూడా మనసు అంగీకరించడంలేదు. మిత్రులు, మద్దతుదారులు, ప్రజలు ఇలా ఎవరికేం అవసరం వచ్చి ఆమె తలుపు తట్టినా.. నేనున్నానంటూ వచ్చి సాయం చేసే ఓ మంచి సోదరిని ఇంకా మరిచిపోలేకపోతున్నాను’ అని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రిగా ఉన్నసమయంలోనూ.. సమస్య ఉందని సామాజిక మాధ్యమాల్లో విజ్ఞప్తులు వచ్చిన తక్షణమే స్పందించేవారని గుర్తుచేసుకున్నారు. ‘ఇటీవలి కాలంలో నేను చూసిన గొప్ప విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్’ అని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఏడుసార్లు లోక్‌సభకు, అంతకుముందు మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారంటే.. ప్రజల గుండెల్లో ఆమెకున్న స్థానాన్ని అర్థం చేసుకోవచ్చన్నారు. ‘అందరికీ అర్థమయ్యేలా భాషలో స్పష్టత, ఆకట్టుకునే పదాలు వీటికితోడు చక్కటి వక్తృత్వం వెరసి సుష్మాస్వరాజ్ తన ఆలోచనలను చాలా స్పష్టంగా వెల్లడించేవారు. హిందీ, సంస్కృతం, హరియాణ్వీతోపాటుగా కర్ణాటక ఎన్నికల్లో కన్నడ భాషలోనూ స్పష్టంగా మాట్లాడి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె బహుభాషా కోవిదురాలు’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ‘సుష్మాజీ మా కుటుంబంలో ఒకరిగా ఉండేవారు. ప్రతి రాఖీపౌర్ణమికి ఇంటికొచ్చి ఆప్యాయంగా రాఖీ కట్టేవారు. ఆ బంధాన్ని ఇంకా మరిచిపోలేకపోతున్నాను. మొన్న రాఖీ పండగ సందర్భంగా సుష్మాజీ గుర్తుకొచ్చి ఉద్వేగానికి గురయ్యాను. ఆమె పేరుకు ముందు స్వర్గీయ అని పిలిచేందుకు ఇంకా మనసు రావడం లేదు’ అని ఉపరాష్ట్రపతి అన్నారు. గొప్ప వ్యక్తుల సంస్మరణ సభలు నిర్వహించడం కేవలం వారికి నివాళులు అర్పించడానికి మాత్రమే కాదని.. వారు చూపిన ఆదర్శాలను అన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సిన అవసరముందని విద్యార్థులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పంజాబ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజ్ కుమార్, సుష్మాస్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు
దేశంలోనే ముస్లింలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రమైన కశ్మీర్ ఇప్పుడు ఉనికిలోనే లేకుండా పోయింది. భారత రాజకీయ భౌగోళిక ఉనికిలో కశ్మీర్ మటుమాయమైపోయింది. దాని రాజ్యాంగపరమైన, శాసస సంబంధమైన నిర్మాణం రద్దయిపోయింది. బీజేపీ కశ్మీర్‌ని ఎంతో చాతుర్యంగా భారతదేశ ముస్లిం సమస్యగా మార్చిపడేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ తన మైనారిటీలను అణిచివేస్తోందన్న అభిప్రాయం తక్కిన ప్రపంచ దేశాలలో పెరుగుతూ వస్తోందంటే ఆశ్చర్యపడనక్కర లేదు. ఇస్లామిక్ దేశాల్లోని ప్రజాభిప్రాయం గత ఆరునెలలుగా భారత్‌కు వ్యతిరేకంగా బలపడుతోంది. పలు కారణాలతో భారత్ పట్ల అంతర్జాతీయ సమాజానికి ఉన్న సదభిప్రాయం, సమీప భవిష్యత్తులో పరీక్షకు నిలబడవచ్చు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టు 5న జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని, రాష్ట్రప్రతిపత్తిని రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి ముందు, ఆ తరువాత కశ్మీర్ ఎలా కనిపిస్తోంది అనే అంశంపై చర్చ జరగాల్సి ఉంది. అక్టోబర్ విప్లవానికి ముందు ‘మనం ఇప్పుడు విజయం సాధించకపోతే ఏం జరుగుతుంది’ అని విప్లవనేత లెనిన్.. ట్రాట్సీ్కని అడిగాడు. అప్పుడు ట్రాట్సీ్క ‘మనం విజయం సాధిస్తే ఏం జరుగుతుంది’ అని ఎదురు ప్రశ్నించాడు. ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ లెనిన్ అడిగిన ఆ ప్రశ్ననే అడగవలసి ఉండగా, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న పాలకపార్టీలో ఎవరూ కూడా.. 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగానికి తూట్లు పొడవడానికి ముందు, ఆనాడు ట్రాట్సీ్క వేసిన ప్రశ్నకైనా జవాబు ఇచ్చుకోలేకపోయారు. 365 రోజులు గడిచిపోయాయి. కశ్మీర్ లోయ దాదాపు 300 రోజులపాటు మూసివేతకు గురై ఉండిపోయింది. ఈ సంవత్సరం జనవరి వరకు రాజకీయంగా స్తంభించిపోయింది, మార్చి నెల తర్వాత కరోనా లాక్డౌన్లో స్తంభించిపోయింది. సమాచార నియంత్రణ ఎంత కఠినంగా ఉండిందంటే, స్థానిక పత్రికలు ఉదయం తుడుచుకోవడానికి తప్ప చదవడానికి పనికివచ్చేవి కావు. ఎలాంటి లబ్ధిదారులూ, స్థానిక రాజకీయ జోక్యం లేక ప్రజల భాగస్వామ్యం అనేదే లేకుండా పాలనను నిరంకుశోద్యోగులు చేజిక్కించుకోవడం అనేది కశ్మీర్‌ని 1931 కాలం ముందునాటికి తీసుకెళ్లిపోయింది. కశ్మీర్ ప్రజల దృష్టిలో 2019 అనేది 1990ల నాటి మిలిటెన్సీ పతాక దశలో ఉన్నప్పటికంటే ఘోరంగా తయారైపోయింది. అయితే ఈసారి భౌతిక హింస కంటే ఎక్కువగా, తీవ్రమైన అవమానం, బెదిరింపులతో కూడిన మానసిక హింసకు కశ్మీరీలు గురయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే శరీరానికి, మనిషి అస్తిత్వానికి శారీరకంగా తగిలిన దెబ్బకు సరిసమానంగా కశ్మీరీల మనస్సులు తీవ్రంగా దెబ్బతినిపోయాయి. ప్రామాణికంగా చెప్పుకునే ‘బలహీనుల ఆయుధం’ అనేది కశ్మీర్లో శారీరక హింసా సాధనంగా మారిపోయింది. అక్కడ జీవితం నరకంగా మారింది. గాలి బలంగా వీస్తోంది.. కానీ ఊపిరాడటం లేదు అనే మాట కశ్మీరీలందరి ఉమ్మడి వ్యక్తీకరణగా మారిపోయింది. ఇప్పటికే స్వీయాత్మక, ప్రతీకాత్మక హింసారూపాలతో రాజకీయంగా చిక్కుకుపోయిన ఒక సమాజానికి, ఈ మానసిక పాశవికీకరణ అతిపెద్ద నష్టం కలిగించింది. మానవ శాస్త్రవేత్త వీణా దాస్ మాటల్లో చెప్పాలంటే, ఇవి మనిషికి, సమాజానికి, జాతికి సంబంధించిన అనుభవాలుగా మారిపోయాయి. ఇప్పుడు సందేశం చాలా స్పష్టంగా కనబడుతోంది. ఆగస్టు 5, 2019న జమ్మూకశ్మీర్ ఒక రాజకీయ సమస్యగా, అంతర్గత భద్రతా సమస్యగా, అంతర్జాతీయ సంక్లిష్టతల మధ్య ద్వైపాక్షిక సమస్యగా ఉండేది. ఈరోజు అది మతతత్వంతో కూడిన హిందూ–ముస్లిం సమస్యగా, కనీసం మూడు సౌర్వభౌమాధికార దేశాలతో అంతర్గత, బాహ్య భద్రతా సమస్యగా మారిపోయింది. అందుచేత, విస్తృతమైన రాజకీయ ప్రయత్నంతో, చాతుర్యంతో బీజేపీ కశ్మీర్‌ని.. భారతదేశ ముస్లిం సమస్యగా మార్చిపడేసింది. 1989లో కశ్మీర్ పండిట్లు లోయను వదిలిపెట్టాల్సి వచ్చినప్పుడు కూడా కశ్మీర్ ఒక ముస్లిం సమస్యగా ఉండేది కాదు. కశ్మీర్ జాతీయవాద పరిణామంలో, సంవత్సరాలుగా సాగిన ఘర్షణ కాలంలో మతపరమైన బాష్యం అనేది ముఖ్యమైన పాత్ర పోషించిందంటే తోసిపుచ్చలేం.. కానీ ఇది ఇటీవలి కాలం వరకు రాజ కీయాల్లో, రాజకీయ పోరాటాల్లో వ్యక్తం కాలేదు. కశ్మీర్‌ని ముస్లిం సమస్యగా ముద్రించడం ద్వారా కశ్మీర్లో జాతిపరమైన ఉనికిపై మతపరమైన ఉనికి ఆధిక్యత సాధించేసింది. రెండు రాజ్యాంగాల కింద ప్రజలు, వారి హక్కులకు సంబంధించిన సామాజిక ఒడంబడికగా ఇంతవరకు కనిపిస్తూ వచ్చిన కశ్మీర్ సమస్య ఇప్పుడు పరస్పరం తలపడుతున్న మత విశ్వాసాలు కలిగిన బృందాల సమస్యగా మారిపోయింది. జమ్మూకశ్మీర్‌కు మాత్రమే వర్తించే విశిష్ట లక్షణాలను నిర్మూలించివేస్తూ లోయలో ప్రస్తుతం శరవేగంగా మార్పులు జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో జనాభాపరంగా మెజారిటీగా ఉన్న వారిని రాజ కీయపరమైన మైనారిటీగా మార్చివేస్తున్నారు. ఇది ప్రాతినిధ్య అధికారం నుంచి వీరిని వేరు చేస్తుంది. ఇక తతిమ్మా జరగాల్సింది దానికదేగా జరిగిపోతుంది. భారతీయ ముస్లింలను వేరుపర్చడం అనే తిరస్కరించలేని ప్రక్రియ ప్రత్యక్ష పర్యవసానాల్లో భాగంగా తక్కిన భారతదేశం ముస్లిం సమస్యను చూస్తున్నప్పుడు కశ్మీర్లో ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. ముస్లింలపై, ఇతర మతపరమైన మైనారిటీలపై ప్రత్యక్ష దాడులు చేయడానికి అదనంగా వారిని వేరుచేయడం అనేది హిందువుల రాజకీయ స్థానికీకరణను ప్రతిబింబిస్తోంది. ఇదంతా భారత రాజ్యాంగాన్ని బహిరంగంగా తోసిపుచ్చుతూ మన గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని మెజారిటీవాద ప్రజాస్వామ్యంగా మార్చివేస్తున్నారు. అంతర్జాతీయంగా, ఈ పరిణామాలన్నీ కశ్మీర్ పట్ల, కశ్మీర్ గురించి ఏర్పడుతూ వచ్చిన దృక్పథాన్ని మౌలికంగానే మార్చివేశాయి. ఇంతవరకు జాతీయంగా, అంతర్జాతీయంగా కశ్మీర్లో ఏ చర్య తీసుకున్నా భారత ప్రాదేశిక సమగ్రతను సవాలు చేస్తున్న శక్తుల పట్ల ప్రతిచర్యగా దాన్ని సమర్థిస్తూ వచ్చేవారు. అంతర్జాతీయ సమాజం భారత ప్రభుత్వ చర్యను వ్యతిరేకించేది కానీ మానవ హక్కుల ఉల్లంఘనపై ఖండనగా మాత్రమే అది పరిమితమయ్యేది. దశాబ్దాలుగా నిరసనలు తెలిపే ప్రాంతంగా పేరొందిన తహ్రిర్ స్క్వేర్లాగా లాల్ చౌక్ ఒక ఐకానిక్ ప్రాంతంగా ఎన్నడూ కాలేకపోయింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ వ్యూహపరంగా, దౌత్యపరంగా చేస్తూ వచ్చిన ప్రయత్నమే దానికి కారణం. కశ్మీర్లో కొనసాగుతున్న సాయుధ తీవ్రవాదానికి అంతర్జాతీయ దౌత్య చర్చల్లో ఎన్నడూ రాజకీయ మద్దతు లభించేది కాదు. తాలిబన్ తదనంతర శకంలో సాయుధ తీవ్రవాదం పట్ల సహన భావం చాలా వరకు తగ్గిపోయింది. ఇస్లామిక్ దేశాల సంస్థ వంటి వేదికల్లో భారత్‌పై మృదువిమర్శ చేసేవారు కానీ భారత్ కశ్మీర్ విషయంలో తీవ్రమైన వ్యతిరేకతను అరుదుగా మాత్రమే చవిచూడగలిగింది. ఇప్పుడు పునర్నిర్వచించబడుతున్న భారత్.. అంటే మైనారిటీలను, ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలను అణచివేస్తున్న భారత్‌గా, పౌరులకు జాతీయ రిజిస్టర్, పౌరసత్వ సవరణ చట్టం తీసుకొస్తున్న భారత్‌గా, మతపరమైన దాడులపట్ల ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం పాటిస్తున్న భారత్ అనే అర్థం చేసుకోవలసివస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశంలోనే ముస్లింలు మెజారిటీగా ఉన్న ఏకైక రాష్ట్రమైన కశ్మీర్ ఇప్పుడు ఉనికిలోనే లేకుండా పోయింది. భారత రాజకీయ భౌగోళిక ఉనికిలో కశ్మీర్ మటుమాయమైపోయింది. దాని రాజ్యాంగపరమైన నిర్మాణం కానీ, దానితో ముడిపడివున్న శాసన సంబంధమైన నిర్మాణం కానీ రద్దయిపోయాయి. ఈ ప్రతీకాత్మక హింసా చర్య కశ్మీర్ లోని ముస్లిం మెజారిటీనీ వ్యవస్థాపరంగానే పతనమొందించి, వారిని అధికారం నుంచి తప్పించడంలో భాగంగానే జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్ తన మైనారిటీలను అణిచివేస్తోందన్న అభిప్రాయం తక్కిన ప్రపంచ దేశాలలో పెరుగుతూ వస్తోం దంటే ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇస్లామిక్ దేశాల్లోని ప్రజాభిప్రాయం గత ఆరునెలలుగా భారత్‌కు వ్యతిరేకంగా బలపడుతోంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి కీలకమైన ఇస్లామిక్ దేశాల ప్రభుత్వాలు ఇప్పటికైతే∙వ్యతిరేకించడం లేదు కానీ టర్కీ, మలేసియాలు మునుపటికన్నా భారత్ వ్యతిరేక స్వరాన్ని పెంచుతున్నాయి. బహుశా మొట్టమొదటిసారిగా పాక్ ఈ విషయంలో విజయవంతమవుతోందని చెప్పవచ్చు. అప్గాన్ ఒప్పందం తర్వాత అమెరికా కూడా ఈ పరిణామానికి మరింత ఎక్కువగా దోహదపడుతోంది. కశ్మీర్ పరిస్థితి పూర్తిగా దిగజారిపోవడానికి ప్రత్యక్ష స్పందనగానే చైనా బలగాలు సరిహద్దుల్లో మోహరించి ప్రమాద సంకేతాలు పంపుతున్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే భారత్ పట్ల అంతర్జాతీయ సమాజం కలిగి ఉంటున్న సదభిప్రాయం, ప్రత్యేకించి ఉదారవాద రాజకీయ శక్తుల అభిప్రాయం సమీప భవిష్యత్తులో పరీక్షకు నిలబడవచ్చు. కొసమెరుపు: చాలా ఏళ్ల క్రితం కశ్మీర్ లోయలో ఒక గ్రామంలోని సెక్యూరిటీ బంకర్ గోడపై కాస్త సన్న అక్షరాలతో ఇలా రాశారు. ‘ఇక్కడకు వచ్చింది కశ్మీరీల హృదయాలను, మనస్సును గెల్చుకోవడానికే’. దాని కిందే మరింత ముద్దక్షరాలతో కింద రాశారు. ‘వాళ్ల జుత్తు పట్టుకుని ఈడ్చితే చాలు.. హృదయాలు, మనస్సులు వాటికివే అనుసరి స్తాయి’. విసిగిపోయిన సైనికాధికారి ఎవరో ఇలా రాసినట్లుంది. వెనక్కు వెళ్లి చూస్తే 20 ఏళ్ల క్రితం కశ్మీర్లో పరిస్థితి ఇలాగే ఉండేది. (ది వైర్ సౌజన్యంతో) వ్యాసకర్త ఆర్థికవేత్త, జమ్మూ కశ్మీర్ మాజీ మంత్రి} హసీబ్ డ్రాబు -
పురివిప్పిన స్వేచ్ఛా విహంగం.. కశ్మీరం
ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావని చరిత్రలో ఏ ప్రభుత్వం చెయ్యలేని పనిని, మోదీ–అమిత్ షాల ద్వయం చేసి చూపించింది. ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేసి అక్కడ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి ఆ కేంద్రపాలిత ప్రాంతాలు రెండూ ముందుకు దూసుకుపోయేందుకు అవకాశాలు కల్పిస్తోంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పినట్టు ‘ఇన్సానియాత్ (మానవతావాదం), ఝామూరియాత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియాత్ (శాంతి)’ అనే మూడు సూత్రాల ద్వారా జమ్మూ కశ్మీర్, లదాఖ్‌ల సర్వతోముఖాభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అమలుతో డాక్టర్ అంబేడ్కర్ రూపకల్పన చేసిన భారత రాజ్యాంగానికి సంపూర్ణ గౌరవం లభించినట్లయింది. ‘‘ఒక దేశంలో రెండు రాజ్యాం గాలు, ఇద్దరు ప్రధానమంత్రులు, రెండు జెండాలు ఉండకూడదు’ – శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఏడాది క్రితం, 5 ఆగస్టు, 2019న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఏళ్ళుగా జమ్మూ కశ్మీర్ ప్రజలను వేధిస్తూ, వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తూ, కేవలం నాలుగు కుటుంబాలకు, వారి అనుచరులకు ప్రయోజనం చేకూరుస్తున్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ రద్దుకు హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టారు. దేశ ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ జమ్మూ కశ్మీర్లో వంచనకు ముగింపు పలికిన ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయసభలు ఆమోదం తెలిపాయి. ఈ తీర్మానంతో పాకిస్తాన్ నిర్ఘాంతపోయింది. ఈ నిర్ణయంతో సుమారు 2 కోట్ల మంది కశ్మీరీలు లబ్ధి పొందారు. దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ, కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా, సంతోషంతో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా సంబరాలు జరుపుకున్నారు. నూతన శకానికి ఆరంభం బాలల విద్యా హక్కు చట్టం, ఆస్తిలో మహిళలకు సమాన హోదా, బాల్య వివాహ నిషేధం, దళితులపై అత్యాచార నిషేధం వంటివి ఆ రాష్ట్రంలో ఎప్పుడూ అమలుకు నోచుకోలేదు. జమ్మూ కశ్మీర్‌కి చెందిన మహిళలు వేరే రాష్ట్రానికి చెందిన వారిని పెళ్లి చేసుకుంటే వారు తమ ఆస్తిపై ఉన్న హక్కును కోల్పోయేవారు. కానీ ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో ఇటువంటి వాటికి కాలం చెల్లింది. ఇప్పుడు, అక్కడ ప్రజలు దేశంలో ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తినైనా వివాహం చేసుకోవచ్చు, ఎక్కడవారైనా జమ్మూ కశ్మీర్లో ఆస్తులు కొనుగోలు చెయ్యవచ్చు, పిల్లలు ఇతర రాష్ట్రాల విద్యార్థులతో సమానంగా బడికి వెళ్లి విద్యనభ్యసించవచ్చు, కొన్ని షరతులకు లోబడి ఇతర ప్రాంతాల వారు సైతం స్థానికులుగా గుర్తింపు తీసుకోవచ్చు. దేశంలో అర్హులైనవారెవరైనా జమ్మూ కశ్మీర్లో ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా కలిగింది. జమ్మూ కశ్మీర్, లదాఖ్‌లలో ఒక కొత్త శకం ఆరంభమైంది. ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత, 24 అక్టోబర్, 2019లో మొట్టమొదటి బ్లాక్ అభివృద్ధి సమాఖ్యల ఎన్నికలను నిర్వహించారు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగిన ఈ ఎన్నికలలో సుమారు 98% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు 18 జనవరి, 2020 నుండి 24 జనవరి, 2020 వరకు, నేను, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర సీనియర్ మంత్రులు 35 మంది జమ్మూ కశ్మీర్లో పర్యటించాము. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాము. ఆ పర్యటనలో మంత్రులందరం ఆయా గ్రామాల్లో రాత్రి బస కూడా చేశాము. గతేడాది జనవరి 1 నుంచి జూలై 15 వరకు 105 మంది యువత కొత్తగా ఉగ్రవాదంలో చేరితే, ఈ ఏడాది అదే వ్యవధిలో 67 మంది మాత్రమే చేరారు. ఇదే వ్యవధిలో ఉగ్రవాద ఘటనలు 188 నుంచి 122కి తగ్గాయి. ఇప్పుడు యువత ప్రేరేపిత ఉగ్రవాదం నుంచి తమ దృష్టిని చదువులు, ఉద్యోగాల వైపు మళ్లించారు. విద్యార్థులను ప్రోత్సహిస్తూ కేంద్రం జమ్మూలో కొత్తగా ఐఐటీ, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల అభివృద్ధికి 80,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, జమ్మూ కశ్మీర్లో 2 ఎయిమ్స్ సంస్థల్ని సాంబ, అవంతిపొరలో నెలకొల్పుతోంది. లదాఖ్‌లో నూతనంగా 5 వైద్య కళాశాలలను నెలకొల్పింది. ‘లదాఖ్ విశ్వవిద్యాల యం’ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కశ్మీర్ యువత నైపుణ్య వికాసం జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని 18 –35 ఏళ్ళ మధ్య యువతీ యువకుల నైపుణ్య అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘హిమాయత్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. కార్గిల్ గ్రామానికి చెందిన పర్వీన్ ఫాతిమా అనే యువతి ఈ పథకం ద్వారా శిక్షణ పొంది ప్రస్తుతం తమిళనాడులోని తిరుపూర్‌లో ఒక వస్త్ర పరిశ్రమలో సూపర్ వైజర్‌గా పనిచేస్తోంది. లదాఖ్‌లోని దోడకు చెందిన ఫయాజ్ అహ్మద్ కూడా ఈ పథకం కింద శిక్షణ తీసుకొని, పంజాబ్‌లో ఐటీ కంపెనీలో స్థిరపడ్డాడు. వీరిద్దరూ అక్కడ ఉన్న ఎంతో మంది ప్రతిభావంతమైన యువతీ యువకులకు ఆదర్శంగా నిలిచారని ‘మన్ కి బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రశంసించారు. 2019, సెప్టెంబర్ నుంచి కేంద్ర ప్రభుత్వం ఉజ్జ్వల, కిసాన్ యోజన, స్టాండ్–అప్ ఇండియా వంటి 85 పథకాలు లదాఖ్, కశ్మీర్‌లలో ప్రారంభించింది. ఇటీవల ప్రవేశపెట్టిన 2020 బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జమ్మూ కశ్మీర్ కి 30,757 కోట్లు, లదాఖ్ ప్రాంతానికి 5,958 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఈ నిధులతో రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో మౌలికవసతుల కల్పన, వ్యవసాయాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి, విమానాశ్రయాల నిర్మాణం, విపత్తు నిర్వహణ వేగవంతమైనది. అమరనాథ్, వైష్ణోదేవి వంటి పుణ్యక్షేత్రాలు, శ్రీనగర్, జమ్మూ, అనంతనాగ్ వంటి పర్యాటక ప్రదేశాలతో కశ్మీర్, పాంగోంగ్ సరస్సు, హేమిస్ జాతీయ ఉద్యానవనాలతో లదాఖ్‌లు దేశవిదేశ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల సహకారంతో నిరుద్యోగ యువత హోటల్, రవాణా, సేవా రంగాలలో స్వయం ఉపాధి పొందుతూ మిగిలినవారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం కోవిడ్ ప్రభావంతో నెమ్మదించిన ఈ రంగాలు, మహమ్మారి తగ్గగానే తిరిగి పుంజుకోనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు స్థానికుల భూములకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ‘భూమి బ్యాంకు’లను ఏర్పాటు చేసింది. సరుకు, ప్రజా రవాణా కోసం అధునాతన రోడ్లను నిర్మిస్తోంది. జమ్మూ– శ్రీనగర్ రహదారిపై 8.5 కిలోమీటర్ల బనిహాల్–ఖాజిగుండ్ సొరంగం త్వరలో వినియోగంలోకి రానుంది. దీనివల్ల రెండు నగరాల మధ్య 50 కిలోమీటర్లు పైగా దూరం, సగానికి పైగా ప్రయాణ సమయం తగ్గనుంది. 1,313 కోట్ల రూపాయలతో కశ్మీర్లో నూతనంగా రోడ్లు బ్రిడ్జిలను నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. లదాఖ్‌లో 11,800 కోట్ల రూపాయలతో సరిహద్దు రహదారుల సంస్థ వ్యూహాత్మక రహదారులను అభివృద్ధి చేస్తూ మారుమూల ఊర్లను అనుసంధానిస్తోంది. వెల్లువెత్తుతున్న ప్రాజెక్టులు భారత రైల్వే కశ్మీర్ లోని ముఖ్య ప్రాంతాలని కలుపుతూ కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తోంది. ప్రఖ్యాత వైష్ణోమాత ఆలయానికి చేరుకోవడానికి ఢిల్లీ నుండి కాట్రా వరకు అత్యాధునిక వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుని హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించింది. శ్రీనగర్–బారాముల్లా మార్గంలో ఈఫిల్ టవర్ కంటే ఎల్తైన బ్రిడ్జిని రైల్వేశాఖ నిర్మిస్తోంది. 2021కల్లా ఈ మార్గాన్ని పూర్తి చెయ్యాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. హోంశాఖ కొన్ని ప్రాంతాలను భద్రత దళాలకు వ్యూహాత్మక ప్రదేశాలుగా గుర్తించి ఇక్కడ సైనిక అవసరాలకు కావాల్సిన నిర్మాణాలను చేపట్టింది. 900 కిలోమీటర్ల మేర రూ. 11,000 కోట్లతో కేంద్ర విద్యుత్ శాఖ కొత్త ప్రాజెక్ట్ చేపట్టింది. లదాఖ్ గ్రిడ్ని జాతీయ గ్రిడ్‌కి అనుసంధానించి అక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తును దేశమంతటా సరఫరా చేసేం దుకు ప్రణాళికలు రూపొందించింది. కఠినమైన శీతాకాలంలో రక్షణ సంస్థలతో పాటు, లే, కార్గిల్ జిల్లాల ప్రజలకు విద్యుత్ సరఫరా చేయడంలో ఇది సహాయపడుతుంది. భారత రాజ్యాంగానికి సంపూర్ణ గౌరవం ఏడున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావని చరిత్రలో ఏ ప్రభుత్వం చెయ్యలేని పనిని, మోదీ–అమిత్ షాల ద్వయం చేసి చూపించింది. ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేసి అక్కడ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి ఆ కేంద్రపాలిత ప్రాంతాలు రెండూ ముందుకు దూసుకుపోయేందుకు అవకాశాలు కల్పిస్తోంది. మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పినట్టు ‘ఇన్సానియాత్ (మానవతావాదం), ఝామూరియాత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియాత్ (శాంతి)’ అనే మూడు సూత్రాల ద్వారా జమ్మూ కశ్మీర్, లదాఖ్‌ల సర్వతోముఖాభివృద్ధికి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఒకే దేశం ఒకే రాజ్యాంగం అమలుతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపకల్పన చేసిన భారత రాజ్యాం గానికి సంపూర్ణ గౌరవం లభించినట్లయింది. వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఈ–మెయిల్: gkishanreddy@yahoo.com -
ఆర్టికల్ 370 రద్దు : ఏడాదికి విముక్తి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలువురు నేతలపై గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. రానున్న ఆగస్ట్ 5తో ఆర్టికల్ 370ను రద్దు చేసి తొలి ఏడా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పలువురు నేతలను విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగానే పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత, మాజీమంత్రి సజ్జద్ లోనేను శుక్రవారం గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో నిర్బంధం (జైలు) అనేది కొత్తేమీ కాదని, ఎన్నో కొత్త విషయాలను తెలుసున్నాని తెలిపారు. (ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం) గత ఏడాది ఆగస్ట్‌లో సజ్జద్‌ను పోలీసుల కస్టడీలోకి తీసుకుగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలను ఇదివరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పీడీపీ అధ్యక్షురాలు సయ్యద్ ముఫ్తీ మహ్మద్‌ను మాత్రం ఇంకా నిర్బంధంలోనే ఉంచారు. ఆమెతో పాటు మరికొంతమంది కశ్మీర్ నేతలపై నిర్బంధం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు కశ్మీర్ విభజనకు తొలి ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో ఈ ఏడాది కాలంలో చోటుచుకున్న అభివృద్ధిపై నివేదికను వెలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై ఏర్పాట్లును పూర్తి చేసింది. -
కశ్మీర్‌కు నేనే కెప్టెన్‌గా ఉండాలి: అఫ్రిది
కశ్మీర్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మరోసారి వక్రబుద్ధిని చూపెట్టాడు. కశ్మీర్ తమదేనని అర్థం వచ్చేలా మరింత అగ్గిరాజేశాడు. తొలుత భారత ప్రధాని నరేంద్ర మోదీపై అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది.. కశ్మీర్ జట్టును పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడటానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విజ్ఞప్తి చేశాడు. పీఎస్ఎల్లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీ ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నాడు. వచ్చే పీఎస్ఎల్ సీజన్ నాటికే కశ్మీర్ టీమ్ ఏర్పాటుకు కృషి చేయాలంటూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరో అడుగు ముందుకేసి తన చివరి పీఎస్ఎల్ సీజన్లో ఆ జట్టుకు తానే నాయకత్వం వహించాలన్నాడు (మోదీపై విషం కక్కిన అఫ్రిది: పెను దుమారం) ‘పీసీబీకి ఇదే నా విన్నపం. తదుపరి పీఎస్ఎల్లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీని తయారు చేయండి. ఈ జట్టుకు నేనే సారథిగా వ్యహరించి పీఎస్ఎల్కు వీడ్కోలు చెబుతా. కశ్మీర్ జట్టుకు సారథిగా చేసే అవకాశాన్ని నేనే ఉపయోగించుకుంటా. కచ్చితంగా పీఎస్ఎల్లో కశ్మీర్ జట్టు ఉండాల్సిందే’ అంటూ ఒకవైపు విజ్ఞప్తి, మరొకవైపు డిమాండ్ అనే విధంగా అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో కశ్మీర్లకు ఒక స్టేడియం, ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేయాలన్నాడు. దీనికి తాను కరాచీ నుండి వచ్చి సాయం చేస్తానంటూ ఎప్పుడూ లేని ప్రేమను కురిపించాడు. ఇక్కడ దాదాపు 125 క్రికెట్ క్లబ్‌లు ఉన్నట్లు విన్నానని, వీటి మధ్య టోర్నమెంట్లు నిర్వహించే దిశగా ఏర్పాట్లు కూడా చేయాలని పీసీబీకి కొత్త తలపోటును తెచ్చిపెట్టాడు. కశ్మీర్లో మ్యాచ్‌లు చూడటానికి సంతోషంగా ఇక్కడకి వస్తానని, నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి తనతో పాటు కరాచీకి తీసుకువెళ్తానన్నాడు. వారంతా తనతోపాటు ఉండవచ్చని, వారికి ప్రాక్టీస్‌తో పాటు ఎడ్యుకేషన్ కూడా తానే చూస్తానని భరోసా ఇస్తూ లేనిపోని ఆశలు కల్పించాడు అఫ్రిది. (ఈ బ్యాట్‌తో ఎక్కడ కొడతానో తెలుసా?) కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అఫ్రిది తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. లాక్డౌన్ నేపథ్యంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ప్రజలకు తన ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు అఫ్రిది ఆదివారం పీఓకేలో పర్యటించాడు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్తాన్ మొత్తం సైన్యం ఏడు లక్షలు మాత్రమే. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించందంటూ వ్యాఖ్యానించాడు.. అయినా కశ్మీరీ పౌరులకు పాక్ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉందని విషం వెళ్లగక్కాడు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది.ఇప్పటికే పలువురు భారత క్రికెటర్లు.. అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అఫ్రిది నీ స్థాయిని తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ విమర్శించగా, భజ్జీ, యువరాజ్ సింగ్‌లు సైతం మండిపడ్డారు.తీవ్ర దుమారాన్ని రేపిన అఫ్రిది వ్యాఖ్యలపై భారత అభిమానులు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. -
మోదీపై విషంకక్కిన అఫ్రిది: పెను దుమారం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా మహమ్మారిపై పోరు చేస్తుంటే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు. ఇప్పటికే అనేకసార్లు భారత్‌పై విషంకక్కిన పాకిస్తానీ.. మరోసారి నోరుపారేసుకున్నాడు. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అన్యాయంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గతంలో అఫ్రిది తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేసి భారతీయుల ఆగ్రహానికి గురయ్యాడు. లాక్డౌన్ నేపథ్యంలోనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదల ప్రజలకు తన ట్రస్ట్ ద్వారా సహాయం చేసేందుకు అఫ్రిది ఆదివారం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పర్యటించాడు. (ఆర్టికల్ 370 రద్దు: స్పందించిన అఫ్రిది) ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన షాహిద్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘పాకిస్తాన్ మొత్తం సైన్యం ఏడు లక్షలు మాత్రమే. భారత ప్రభుత్వం ఒక్క కశ్మీర్‌లోనే ఏడు లక్షలకుపైగా తన సైన్యాన్ని మోహరించింది. అయినా కశ్మీరీ పౌరులకు పాక్ సైన్యానికే మద్దతు తెలుపుతున్నారు. ప్రపంచమంతా కరోనా వ్యాధిపై పెద్ద పోరాటమే చేస్తోంది. కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ మనస్సులో కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి ఉంది’ అని వివాదాదస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (మోదీపై ఆఫ్రిది సంచలన వ్యాఖ్యలు) కాగా పాక్ ఆటగాడు చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెటర్లు తమదైన శైలీలో కౌంటర్లు ఇస్తున్నారు. జాతియవాదంలో ఎప్పుడూ ముందుండే మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్విటర్ వేదికగా అఫ్రిదిపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘కశ్మీర్లో భారత ప్రభుత్వం ఏడు లక్షల సైన్యాన్ని మోహరించిందని ఓ 16 ఏళ్లు వృద్ధుడు విషయం కక్కుతున్నాడు. భారత్ సొంతమైన కశ్మీర్ కోసం 70 ఏళ్లుగా భిక్షాటన చేస్తూనే ఉన్నారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆర్మీ చీఫ్ బజ్వా, అఫ్రిది లాంటి వ్యక్తులు కుట్ర పన్నుతున్నారు. ఏం చేసినా కశ్మీర్ ఎప్పిటికీ భారతతీయుల సొంతమే’ అంటు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఇక అఫ్రిది వ్యాఖ్యలను యువరాజ్ సింగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, హర్బజన్ సింగ్ లాంటి ఆటగాళ్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాక సోషల్ మీడియాలో సైతం అఫ్రిది వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. -
ఏడు నెలల నిర్బంధం.. ఎట్టకేలకు విముక్తి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గృహనిర్బంధం నుంచి ఎట్టకేలకు విడుదల కానున్నారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగ శుక్రవారం ఫరూక్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీచేసింది. కశ్మీర్‌ను స్వయం ప్రత్తిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు, కశ్మీర్ విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం అతన్ని నిర్బంధించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ నుంచి (ఏడు నెలలుగా) ఆయన నిర్బంధం కొనసాగుతోంది. 83 ఏళ్ల ఫరూక్‌తో పాటు ఆయన కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ ముఫ్తీ మహ్మద్‌లను నిర్బంధం నుంచి విడుదల చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు గతకొంత కాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంను ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు లేవనెత్తారు. ఈ మేరకు స్పీకర్‌కు లేఖను కూడా సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ఫరూక్‌ను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు అక్కడి అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా, ముఫ్తీల నిర్బంధం మాత్రం ఇంకా కొనసాగుతోంది. -
బదిలీ చేయలేం.. మేమే విచారిస్తాం : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చూస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దాఖలైన పటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు విచారించింది. ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలన్న పటిషనర్ల విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అలాగే రద్దు రాజ్యాంగ బద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు సైతం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయడానికి సుప్రీం నిరాకరించింది. కాగా ఆర్టికల్ 370 రద్దుతో పాటు కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడంపై సుప్రీంకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసింది. వీటన్నింటిని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఇక ముందు కూడా ఇదే ధర్మాసనం విచారణను కొనసాగిస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. -
నిరసనలతో అరాచకం
న్యూఢిల్లీ: పార్లమెంటు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ వీధుల్లో నిరసనలు, గృహదహనాలకు దిగితే చివరికి అది అరాచకత్వానికి దారి తీస్తుందని ప్రధాని మోదీ ఘాటుగా హెచ్చరించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) వ్యతిరేక నిరసనల్ని విపక్షాలే రెచ్చగొడుతూ లేనిపోని భయాందోళనలను సృష్టిస్తున్నాయన్నారు. సీఏఏపై విపక్షాల వైఖరిని పాకిస్తాన్‌తో పోల్చారు. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో ముస్లింలపై పాక్ ఇదే విధంగా బురద జల్లిందన్నారు. బడ్జెట్ సమావేశాల తొలిరోజు పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం ఉభయ సభల్లోనూ జరిగిన చర్చకు మోదీ బదులిచ్చారు. లోక్‌సభలో గంటా 40 నిమిషాల సేపు మాట్లాడిన మోదీ సీఏఏ దేశ పౌరులపైనా, మైనార్టీల ప్రయోజనాలపైనా ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపించదని పునరుద్ఘాటించారు. రాజ్యసభలో ఎన్పీఆర్పై ఎక్కువగా మాట్లాడారు. ప్రధాని ప్రసంగం అనంతరం ఉభయ సభలు ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించాయి. ఎన్పీఆర్కి సవరణలు చేపడితేనే నిజమైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. జన గణన, జనాభా పట్టిక సర్వసాధారణంగా జరిగే పరిపాలనాపరమైన ప్రక్రియ అని, ఇప్పుడే దీనిపై ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్న విపక్షాల దాడిని మోదీ తిప్పి కొట్టారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలను ముస్లింలుగా చూస్తే, తాము వారిని భారతీయులుగా చూస్తున్నామని చెప్పారు. చారిత్రక నిర్ణయాలు తీసుకున్నాం దేశ ప్రజలు తమ అయిదేళ్ల పని తీరు చూశాక బీజేపీపై నమ్మకం ఉంచి అధికారాన్ని తిరిగి అప్పగించారన్నారు. అందుకే పాలనలో వేగవంతం, విస్తృతి పెంచడం , సమస్యల్ని పరిష్కరించడం, నిబద్ధతతో నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తున్నామని మోదీ చెప్పారు. పాత విధానాలతో ముందుకు వెళితే ఆర్టికల్ 370 రద్దు అయ్యేది కాదని, ముస్లిం మహిళలు ట్రిపుల్ తలాక్‌తో బాధల్లోనే ఉండేవారని అన్నారు. ఇంకా పాత ఆలోచనలే చేస్తే రామజన్మభూమి వివాదమూ పరిష్కారమయ్యేది కాదు, కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ సాకారమయ్యేది కాదు, భారత్, బంగ్లాదేశ్ మధ్య భూ ఒప్పందం కుదిరేది కాదని ప్రధాని చెప్పుకొచ్చారు. ఆర్థిక లోటును నియంత్రిస్తున్నాం ఆర్థిక లోటును నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ధరల పెరుగుదలను నియంత్రిస్తున్నామని మోదీ చెప్పారు. స్థూల ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు. మేకిన్ ఇండియాపై విదేశాలకు నమ్మకం కుదిరి ఎఫ్‌డీఐలు బాగా పెరిగాయన్నారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయ బడ్జెట్‌ను అయిదు రెట్లు ఎక్కువ చేశామని రూ. 27 వేల కోట్లు ఉన్నదానిని ప్రస్తుతం రూ.1.5 లక్షల కోట్లు చేశామన్నారు. ఈశాన్యంలో అభివృద్ధి నిత్యం రక్తపాతం, హింసతో సతమతమయ్యే ఈశాన్య రాష్ట్రా ల్లో వివిధ రంగాల్లో అభివృద్ధికి బాటలు వేశామన్నారు. బోడో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా శాంతి స్థాపన జరుగుతోందని, పెట్టుబడులకు మార్గం సుగమం అయిందన్నారు. గాంధీ మాకు జీవితం ప్రధాని మోదీ లోక్‌సభ ఆవరణలోకి రాగానే బీజేపీ సభ్యులు జై శ్రీరామ్.. అంటూ నినాదాలు చేస్తే, దానికి కౌంటర్‌గా కాంగ్రెస్ సభ్యులు మహాత్మా గాంధీ జిందాబాద్ అంటూ నినదించారు. సభలో మోదీ ప్రసంగం మొదలు కాగానే కాంగ్రెస్ సభ్యులు మహాత్ముడిని కీర్తిస్తూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఇది ట్రయలర్ మాత్రమే అంటూ వ్యంగ్యబాణాలు విసిరారు. దీంతో మోదీ ఆయనకి చురకలంటించారు. ‘మీకు మహాత్మాగాంధీ ట్రయలర్ కావొచ్చు.. మాకు గాంధీయే జీవితం’ అంటూ బదులిచ్చారు. రాహుల్ ట్యూబ్‌లైట్ తన ప్రసంగానికి విపక్షాలు అడ్డు తగిలినప్పుడల్లా మోదీ వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం మధ్యలో రాహుల్ లేచి ఉద్యోగాల గురించి ప్రస్తావించగానే, తాను మాట్లాడటం మొదలు పెట్టిన 40 నిమిషాల తర్వాత స్పందించడంతో రాహుల్‌ని ట్యూబ్‌లైట్ అంటూ ఎదురు దాడికి దిగారు. ఆరు నెలల్లో యువత మోదీ వీపుని కర్రలతో వాయిస్తారంటూ రాహుల్ వ్యాఖ్యానించారని వచ్చిన వార్తల్ని ప్రధాని ప్రస్తావించారు. రాహుల్ పేరు చెప్పకుండా.. ‘ప్రతిపక్ష ఎంపీ ఒకరు యువత నా వీపుని విమానం మోత మోగిస్తామని అన్నారట. అందుకే మరింత సమయం సూర్యనమస్కారాలకు సమయం కేటాయిస్తా. అప్పుడు ఎలాంటి దూషణలనైనా ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. గీత గీసింది నెహ్రూయే సీఏఏని సమర్థించుకునే క్రమంలో తొలి ప్రధాని నెహ్రూ మాటల్ని ఉదహరించారు. దేశ విభజన తర్వాత సరిహద్దుల నుంచి మన దేశంలోకి వచ్చిన వారిని హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులుగా నెహ్రూయే విభజించి చూశారని మోదీ తెలిపారు. నాటి అస్సాం సీఎం గోపీనాథ్ బర్దోలియాకి నెహ్రూ రాసిన లేఖలో అంశాలను మోదీ ప్రస్తావించారు. పాక్ నుంచి భారత్‌కొచ్చిన వారిలో హిందూ శరణార్థులకు, ముస్లిం వలసదారులకు మధ్య తేడా చూపాలని, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (ఇప్పుడు బంగ్లాదేశ్) నుంచి వచ్చే మైనార్టీలను భారత్ కాపాడాలని లేఖలో ఉందన్నారు. అవసరమైతే హిందూ శరణార్థులకు పౌరసత్వం కల్పించేలా చట్టానికి సవరణలు చేద్దామని నెహ్రూ ఆ లేఖలో పేర్కొన్నారని మోదీ చెప్పారు. మరి అలా మాట్లాడిన నెహ్రూ మతవాదా? ఆయన హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారా అని కాంగ్రెస్‌ను ప్రశ్నించారు ‘నెహ్రూ నాటి పాక్ ప్రధాని లియాఖత్ అలీఖాన్ మధ్య కుదిరిన ఒప్పందంలో పౌరులందరినీ చేర్చకుండా, మైనార్టీల ప్రయోజనాలను ఇరుదేశాల్లో కాపాడాలని ఎందుకు అంగీకారానికి వచ్చారని నిలదీశారు. ఏపీ విభజనను ప్రజలు మర్చిపోరు పౌరసత్వ చట్టం సవరణలపైగానీ ఆర్టికల్ 370 రద్దు సమయంలో గానీ తమతో ఎలాంటి చర్చ జరపకుండానే ప్రభుత్వం ముందుకెళ్లిందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు ప్రధాని స్పందిస్తూ.. ‘ఇది ఎంత మాత్రం నిజం కాదు. వీటిపై సవివరమైన చర్చ జరిగిన విషయం యావత్తు జాతికి తెలుసు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుకూలంగా సభ్యులు ఓటు వేశారు’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన 2014లో యూపీఏ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ విభజనను ప్రస్తావించారు. ‘ప్రజలు అంత తేలిగ్గా ఏదీ మర్చిపోరు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనకు దారి తీసిన పరిస్థితులను ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతకు గుర్తు చేస్తున్నా. ఆ సమయంలో సభను దిగ్బంధంలో ఉంచారు. టీవీల్లో సభా కార్యకలాపాల ప్రసారాలు నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ విభజనను హడావుడిగా ప్రకటించారు’ అని తెలిపారు. నిరుద్యోగంపై మాట్లాడరా?: రాహుల్ దేశం ఎదుర్కొంటున్న అతి ప్రధానమైన నిరుద్యోగ సమస్య ప్రధాని మోదీకి కనిపించలేదా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నెహ్రూ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంశాలను లేవనెత్తి మోదీయే ప్రజల్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ అయిదున్నరేళ్లు గడిచిపోతున్నా ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు. వంద నిమిషాల సేపు మాట్లాడిన ప్రధానికి గత ఏడాది కోటి మంది యువత ఉద్యోగాలు కోల్పోతే దానిపై మాట్లాడడానికి సమయం దొరకలేదా అని రాహుల్ ప్రశ్నించారు. -
మనోళ్లు గూగుల్‌ను ఏమడిగారో తెలుసా?
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 అంటే ఏమిటి ?, అయోధ్య కేసు ఏమిటి ?, జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) అంటే ఏమిటి ? ఇవీ గూగుల్‌ను భారతీయులు ఎక్కువగా అడిగిన ప్రశ్నలు. 2019ఏడాదికిగాను వీటి గురించే అత్యధికంగా వెదికారని గూగుల్ 2019 నివేదిక తెలిపింది. ఎగ్జిట్ పోల్స్, బ్లాక్‌హోల్, హౌడీ–మోడీలను శోధించారు. క్రికెట్ వరల్డ్ కప్‌తోపాటు లోక్‌సభ ఎన్నికల గురించి అత్యధిక మంది సెర్చ్ చేశారు. ఓటేయడం ఎలా ? ఓటరు లిస్టులో పేరును ఎలా చూసుకోవాలి వంటి ప్రశ్నలను గూగుల్‌ను అడిగారు. చంద్రయాన్–2, నీట్ ఫలితాలు, పీఎం కిసాన్ యోజన, కబీర్ సింగ్, అవెంజర్స్ ఎండ్ గేమ్, కెప్టెన్ మార్వెల్ గురించీ వెదికారు. వ్యక్తుల గురించి చేసిన శోధనలో.. ‘ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్’ తొలిర్యాంక్ సాధించారు. తర్వాత లతా మంగేష్కర్, యువరాజ్ సింగ్, ‘సూపర్ 30’ ఆనంద్‡ వంటివారు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగాచూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ టీవీ షో గురించి వెదికారు. -
కశ్మీర్ అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు
శ్రీనగర్: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం.. ఆ రాష్ట్ర పునర్నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగానే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ గిరీశ్ చందర్ ముర్ము గురువారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందకు కేంద్రం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి. దానికి ఇక్కడి యంత్రాంగం, పౌరులంతా సహకరించాలి. జమ్మూ కశ్మీర్ వ్యవహారాలను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నేరుగా పరిశీలిస్తోంది. కావును ఎన్నికల ప్రకటనను కేంద్రమే త్వరలో ప్రకటించనుంది’ అని అన్నారు. కాగా కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తారంటూ గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. తాజాగా మూర్ము చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంచరించుకుంది.కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్‌ను రెండుగా విభజిస్తూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌ను శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రభుత్వం గుర్తించింది. కాగా 2018 జూన్ 20 నుంచి అక్కడ గవర్నర్ పాలన సాగుతోంది. -
కొత్త చరిత్రకు నేడే శ్రీకారం: మోదీ
గాంధీ నగర్: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు ద్వారా అక్కడ నూతన అధ్యాయం ప్రారంభంకాబోతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనేక రాజకీయ ఒడిదొడుకులు, మత కల్లోలాలు ఎదుర్కొన్న కశ్మీర్ నేటి నుంచి కొత్త జీవితంలోకి అడుగుపెడుతోందని పేర్కొన్నారు. కశ్మీర్ కొత్త చరిత్రను నేడు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లబాయ్ పటేల్ 144వ జయంతి సందర్భంగా గుజరాత్లో జరిగిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. పటేల్ స్ఫూర్తితోనే కశ్మీర్ విముక్తి జరిగిందని మోదీ గుర్తుచేశారు. సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘కశ్మీర్‌కు శాపంగా మారిన ఆర్టికల్ 370 వల్ల ఉగ్రవాదం పెద్ద ఎత్తున బలపడింది. ఉగ్రవాదులకు భారత్‌లో కశ్మీర్ అడ్డాగా మారింది. గడిచిన మూడు దశాబ్దాల్లో 40 వేలకు పైగా కశ్మీరీ పౌరులు ప్రాణాలను కోల్పోయారు. ఎంతో మంది తల్లులు బిడ్డల్ని కోల్పోయారు. వారి చర్యల కారణంగా హిమాలయ భూమి రక్తపాతంగా మారింది. భవిష్యత్తులో ఉగ్రవాద సమస్యను పూర్తిగా నిర్మూలించే సంకల్పంతోనే ఆర్టికల్ 370ని రద్దు చేశాం. ఈ నిర్ణయాన్ని యావద్దేశం స్వాగతించింది.’ అని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ అప్పట్లో రాజ్యాంగంలో జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఆగస్టు 5న రద్దు చేసిన విషయం తెలిసిందే. కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఓకే చెప్పగా.. పటేల్ జయంతి అయిన నేటి నుంచి చట్టం అమల్లోకి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు అమల్లోకి వచ్చిన ఈ చట్టంతో 173 ఏళ్ల చరిత్ర కలిగిన జమ్మూ కశ్మీర్ కథ ఇక గతం. జమ్ము కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ చట్టం ప్రకారం అసెంబ్లీ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూకశ్మీర్, పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా లదాఖ్ అవతరించాయి. జమ్మూ కశ్మీర్ కొత్త లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) గా ఐఏఎస్ అధికారి గిరీశ్ చంద్ర ముర్ము, లదాఖ్ ఎల్జీగా ఆర్కే మాథూర్‌లను కేంద్రం నియమించింది. గురువారం శ్రీనగర్, లేహ్‌లలో జరిగే కార్యక్రమాల్లో ఈ ఇద్దరు లెఫ్ట్‌నెంట్ గవర్నర్స్ పదవీ ప్రమాణం చేశారు. -
ఏకపక్షమేనా..?
మహారాష్ట్ర, హరియాణాలో మళ్లీ కమలమే వికసిస్తుందా, మోదీ షా ద్వయాన్ని ఎదుర్కొనే శక్తి విపక్షాలకు ఉందా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. గురువారం ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. మరాఠాల ప్రభావం అత్యధికంగా ఉండే మహారాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌కు, జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉండే హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌కు పగ్గాలు అప్పగించి బీజేపీ చేసిన ప్రయోగాన్ని ఓటర్లు ఎంతవరకు ఆమోదిస్తారో, వరసగా రెండోసారి సీఎంలు అయ్యే చాన్స్ వారికి వస్తుందా అన్నది నేటి ఫలితాలతో తెలిసిపోనుంది. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. మహారాష్ట్రలో... మహారాష్ట్ర శాసనసభ 288 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,237 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేస్తే మిత్రపక్షం శివసేన 124 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ 147 స్థానాల్లో, ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాజకీయ వ్యూహాల ముందు విపక్షాలు నిలబడలేవని ఇంచుమించుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నాయి. కేదార్నాథ్ గుడి వద్ద సీఎం ఫడ్నవీస్ దంపతులు కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుని అత్యంత చాకచక్యంగా మోదీ ఈ ఎన్నికల్లో ప్రచార అస్త్రంగా వినియోగించుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఫడ్నవీస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు లేకపోవడం, అన్ని రంగాల సుస్థిరాభివృద్ధికి పకడ్బందీ చర్యలు తీసుకోవడం బీజేపీకి కలిసొస్తుందని విశ్లేషకుల అంచనా. రైతు సమస్యలు మినహా ఫడ్నవీస్ పాలనపై పెద్దగా విమర్శలేవీ లేకపోవడం వల్ల ఈ సారి ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే అంచనాలున్నాయి. ఠాక్రే కుటుంబ వారసుడు ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో ఉండడం ఈ సారి విశేషంగా చెప్పుకోవాలి. మొత్తం 25 వేల మంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ విధుల్లో ఉన్నారు. ఉప ఎన్నికల ఫలితాలూ ప్రతిష్టాత్మకమే మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు 18 రాష్ట్రాల్లోని రెండు లోక్‌సభ స్థానాలు, 51 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపు ఇవాళే ఉంది. ఈ ఫలితాలతో వివిధ రాష్ట్రాల్లో అధికార పార్టీలకు వచ్చిన ఇబ్బందేమీ లేకపోయినప్పటికీ బీజేపీ తన కేడర్‌లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి ఉప ఎన్నికల్ని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హరియాణా పీఠం ఎవరిది ? హరియాణాలో మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని, బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఇంచుమించుగా చెబితే ఇండియా టుడే, యాక్సిస్ మై ఇండియా దానికి విరుద్ధంగా ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించడంతో ఈ రాష్ట్ర ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 90 శాసనసభ స్థానాలకు గాను 1,169 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హరియాణాలో కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బీజేపీ అధికంగా దృష్టి పెడితే కాంగ్రెస్ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరాహోరీగా పోటీ ఇచ్చింది. 2014 ఎన్నికలతో పోల్చి చూస్తే హరియాణాలో పోలింగ్ 76.54 నుంచి 68 శాతానికి భారీగా పడిపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేవీలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ (ఐఎన్ఎల్డీ) చీలిక వర్గం, దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. బీజేపీకి 32–44, కాంగ్రెస్‌కు 30–42, ఇక జేజేపీకి 6–10 స్థానాలు వస్తాయని ఇండియా టుడే పోల్స్‌లో వెల్లడైంది. -
చొరబాట్లు ఆపేవరకు ఇంతే
లేహ్: సరిహద్దుల వద్ద చొరబాట్లకు భారత ఆర్మీ పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. పాక్ చొరబాట్లను ఆపని పక్షంలో ఇలాంటి చర్యలే కొనసాగుతాయని హెచ్చరించారు. శ్యోక్ నది సమీపంలోని తూర్పు లదాఖ్‌లో నిర్మించిన 1,400 అడుగుల కోల్ చెవాంగ్ రించేన్ వంతెనను సోమవారం మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్టికల్ 370, 35ఏ రద్దు తర్వాత లదాఖ్‌తో స్నేహ బంధం మాత్రమే ఉంటుందని.. శత్రుత్వానికి చోటు ఉండదన్నారు. పాక్ విషయంలో సాయుధ దళాలు ముందస్తు దాడులు చేయలేదని, పాక్ కాల్పులు జరిపిన తర్వాతనే ఎదురుదాడులు చేశాయని చెప్పారు. భారతదేశ సమగ్రతను అస్థిరపరచడానికి, బలహీనపరచడానికి పాక్ ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. దీనికి మన సాయుధ దళాలు గట్టిగానే బదులిస్తున్నాయని అన్నారు. సియాచిన్ పర్యటనకు అనుమతి.. లేహ్–లదాఖ్: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధభూమిగా పేరుగాంచిన సియాచిన్‌పైకి పర్యాటకులను అనుమతినిస్తున్నట్లు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. కునార్ బేస్ క్యాంప్ నుంచి కునార్ పోస్ట్ వరకు ఉన్న మార్గాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. లదాఖ్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. పాక్ ఉగ్రదాడులు ఆపాలి: గవర్నర్ పాక్ ఉగ్రదాడులు ఆపకపోతే భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి చొచ్చుకువెళ్లి అక్కడి ఉగ్రస్థావరాలపై విరుచుకుపడుతుందని కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఇకనైనా తన వైఖరి మార్చుకోవాలని.. ఉగ్రక్యాంపుల ఏర్పాటు మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో భారత ఆర్మీ ఉగ్ర క్యాంపులను కూల్చివేస్తుందని చెప్పారు. కర్తార్‌పూర్ టికెట్ 1400 దర్బార్ సాహిబ్‌ను సందర్శించుకునే సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్ కారిడార్ నుంచి సంవత్సరానికి సుమారు భారత కరెన్సీ ప్రకారం రూ.258 కోట్ల మేర ఆదాయం పొందాలని పాకిస్తాన్ భావిస్తోంది. దీనికోసం కర్తార్‌పూర్ సందర్శనకు వచ్చే భక్తుల నుంచి పెద్దమొత్తంలో ప్రవేశ రుసుము వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఒక్కో భక్తుడు సుమారు రూ.1,400 చెల్లించాలని పేర్కొంది. దీనిపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయినప్పటికీ ఈ నెల 23న కారిడార్‌కు సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. భారత్‌కు పాక్ తపాలా సేవలు బంద్ జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం ఆగస్టులో 5వ తేదీన తీసుకున్న నిర్ణయానికి నిరసనగా అదే నెల 27 నుంచి భారత్‌తో పాక్ తపాలా సేవలను నిలిపివేసింది. రెండు దేశాల మధ్య తపాలా సర్వీసులు రెండు నెలలుగా నిలిచిపోయినట్లు తపాలా శాఖ మంత్రి రవిశంకర్ ధ్రువీకరించారు. తపాలా సేవలను పాకిస్తాన్ ఏకపక్షంగా నిలిపివేసింది. ‘భారత్ నుంచి ఉత్తరాలు తీసుకోవడం లేదు. దీనిపై ప్రభుత్వానికి ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పాక్ నిర్ణయం ప్రపంచ తపాలా సంఘం నిబంధనలకు విరుద్ధం. ఎంతైనా అది పాకిస్తాన్ కదా..!’ అని వ్యాఖ్యానించారు. ఆ చర్యకు బదులుగా భారత్ కూడా పాక్ మెయిళ్లను తీసుకోవడం బంద్ చేసిందన్నారు. భారత్, పాక్‌ల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సౌదీ విమాన సర్వీసుల ద్వారా జరుగుతున్నట్లు సమాచారం. -
నేడే ఎన్నికలు
ముంబై/చండీగఢ్: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీలతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నేడు జరగనున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 సీట్లు, హరియాణాలోని 90 స్థానాలకు ఎన్నికలు, 18 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ సీట్లకు, రెండు లోక్‌సభ స్థానాల(సతారా, సమస్తిపూర్)కు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇందుకోసం యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల బందోబస్తు కోసం మహారాష్ట్రలో 3 లక్షల మందిని, హరియాణాలో 75 వేల మంది పోలీసులను మోహరించారు. మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల ప్రచారంలో బీజేపీ పైచేయి సాధించగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ, దాని మిత్రపక్షాలు వరుసగా రెండోసారి కూడా అధికారాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకుగాను ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ అంశాన్ని బీజేపీ ప్రముఖంగా ప్రచారంలో వాడుకుంది. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి అంశాల్లో ప్రభుత్వ వైఫల్యంపై కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు. ఉప సమరం జరిగే రాష్ట్రాలు.. యూపీలో 11, గుజరాత్ 6, బిహార్ 5, అస్సాం 4, హిమాచల్ ప్రదేశ్ 2, తమిళనాడు 2, పంజాబ్ 4, కేరళ 5, సిక్కిం 3, రాజస్తాన్ 2, అరుణాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, మేఘాలయ, తెలంగాణల్లో ఒక్కోటి చొప్పున స్థానాలకు..మహారాష్ట్రలోని సతారా, బిహార్‌లోని సమస్తిపూర్ లోక్‌సభ స్థానాలకు కూడా నేడు పోలింగ్ జరగనుంది. బరిలో ప్రముఖులు మహారాష్ట్రలో: బీజేపీకి చెందిన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ (నాగ్‌పూర్–నైరుతి), కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రులు అశోక్ చవాన్ (భోకర్), పృథ్వీరాజ్ చవాన్ (కరాడ్) శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే (వర్లి) హరియాణాలో: సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ (కర్నాల్), కాంగ్రెస్ మాజీ సీఎం భూపీందర్ సింగ్ హూడా (గర్హి సంప్లా–కిలోయి), రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా (కైతాల్), కుల్దీప్ బిష్ణోయి (ఆదమ్పూర్), దుష్యంత్ చౌతాలా (ఉచన్‌కలాన్) విపక్షమే లేనప్పుడు అన్ని ర్యాలీలా: సేన రాష్ట్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీనిచ్చే ప్రతిపక్షమే లేదంటూనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పదుల సంఖ్యలో ర్యాలీలు నిర్వహించడం ఎందుకంటూ బీజేపీని మిత్రపక్షమైన శివసేన నిలదీసింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ రాసిన వ్యాసంలో.. ‘ఎన్నికల ప్రచార పర్వంలో తమకు పోటీ ఇచ్చే ప్రతిపక్షమే లేదని సీఎం అంటున్నారు. అలాంటప్పుడు ప్రధాని 10, హోం మంత్రి 30, సీఎం 100 ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నట్లు?’ అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఎన్నో ఫస్ట్లు మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి ఎన్నికల్ని వివిధ కోణాల నుంచి చూస్తే ఎన్నో ఫస్ట్లు కనిపిస్తాయి. ► 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగే తొలి ఎన్నికలివి. ఇప్పటికీ దేశవ్యాప్తంగా మోదీ ఇమేజ్ చెక్కు చెదరని నేపథ్యంలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ► కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు. కశ్మీర్ అసెంబ్లీ అనుమతి లేకుండా రాష్ట్రాన్ని విభజించారన్న విమర్శలు వచ్చినప్పటికీ, రావణకాష్టంలా రగులుతున్న సమస్యకు ఏదో ఒక పరిష్కారం వచ్చిందనే అభిప్రాయమైతే జనంలో కనిపించింది. అందుకే ఈసారి ప్రచారంలో స్థానిక అంశాలను పట్టించుకోకుండా ఆర్టికల్ 370 రద్దునే ప్రధాని మోదీ ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. జాతీయ భావాన్ని రగిల్చి ఓట్లు రాబట్టే ప్రయత్నం చేశారు. ► ట్రిపుల్ తలాక్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలివి. బీజేపీ తీసుకున్న అత్యంత సాహసోపేతమైన చర్య ఇది. దీని ప్రభావం ముస్లిం ఓటర్లపై ఎలా పడుతుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలతో ముస్లింలు, ముఖ్యంగా మహిళా ముస్లింలను బీజేపీ ఏ మేరకు ఆకర్షించగలదో తేలిపోనుంది. ► 2014 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థులు ఎవరో ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లింది. గెలిచిన తర్వాత అనూహ్యంగా మరాఠాల ఆధిపత్యం ఉన్న మహా రాష్ట్రలో బ్రాహ్మణ వర్గానికి చెందిన ఫడ్నవీస్‌ను, జాట్ల ప్రాబల్యం ఉన్న హరియాణాలో పంజాబీ అయిన ఖట్టర్‌ను సీఎంలుగా చేసింది. ఇప్పుడు వారే సీఎంలుగా ఎన్నికలకు వెళుతోంది. మరి మరాఠా, జాట్ల దారి ఎటో తెలిసిపోతుంది. ► ఇక కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తే అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ ఎదుర్కొంటున్న తొలి ఎన్నికలివి. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ అనారోగ్య కారణాలతో పార్టీపై దృష్టిపెట్టలేక పోతున్నారు. దశ, దిశను నిర్దేశించే నాయకత్వలేమితో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు ఇంకెన్ని చేదు అనుభవాలను మిగల్చబోతున్నాయో ! విపక్షమే లేనప్పుడు అన్ని ర్యాలీలా: సేన రాష్ట్రంలో బీజేపీ కూటమికి గట్టి పోటీనిచ్చే ప్రతిపక్షమే లేదంటూనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు పదుల సంఖ్యలో ర్యాలీలు నిర్వహించడం ఎందుకంటూ బీజేపీని మిత్రపక్షమైన శివసేన నిలదీసింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ రాసిన వ్యాసంలో.. ‘ఎన్నికల ప్రచార పర్వంలో తమకు పోటీ ఇచ్చే ప్రతిపక్షమే లేదని సీఎం అంటున్నారు. అలాంటప్పుడు ప్రధాని 10, హోం మంత్రి 30, సీఎం 100 ర్యాలీల్లో ఎందుకు పాల్గొన్నట్లు?’ అని ప్రశ్నించారు. -
‘మొబైల్’ కశ్మీరం
మరో పది రోజుల్లో జమ్మూ–కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతుండగా సోమవారం ఆ రాష్ట్రంలో మొబైల్ సర్వీసుల్ని పాక్షికంగా పునరుద్ధరించారు. ఇకనుంచి అమ్మాయిలు, అబ్బాయిలు ఇంచక్కా మళ్లీ ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకోవచ్చునని అంటూ త్వరలోనే ఇంటర్నెట్ సర్వీ సులు కూడా పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటించారు. అమ్మాయిలు, అబ్బాయిల సంగతేమోగానీ.. చదువులకోసం, ఉద్యోగాల కోసం దూరప్రాంతాలకు వలసపోయిన తమ కన్నబిడ్డలెలా ఉన్నారో తెలియక కలవరపడిన తల్లిదండ్రులున్నారు. వయసు మీదపడిన తమ పెద్దలు అక్కడెలా కాలక్షేపం చేస్తున్నారో, వారి యోగక్షేమాలేమిటో తెలియక దేశంలోని వివిధచోట్ల ఉంటున్న వారి పిల్లలు బెంగపెట్టుకున్నారు. ఆ రాష్ట్రంలోనే వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న బంధు వులు, స్నేహితుల మధ్య కూడా ఇటువంటి పరిస్థితే నెలకొన్నది. ఆపత్సమయాల్లో వైద్యుడికి కబురు పెట్టేందుకు కూడా వీలులేకుండా పోయింది. ఇలా లక్షలాదిమంది 72 రోజుల నుంచి పడుతున్న మానసిక యాతనలకు ఇప్పుడు ముగింపు లభించింది. గత నెల 15 నుంచి ల్యాండ్‌లైన్ ఫోన్ సదుపాయంపై ఉన్న ఆంక్షల్ని సడలించారు. దాన్ని ఇళ్లలో వినియోగిస్తున్నవారు తక్కువ గనుక అందువల్ల కలిగిన మార్పు స్వల్పమే. ఏదైనా అలవాటుగా, అతి సహజంగా మారినప్పుడు.. కోరుకున్న వెంటనే అందుబాటులో కొచ్చినప్పుడు దాని విలువను గుర్తించడం ఎలాంటి వారికైనా కష్టమే. కమ్యూనికేషన్ల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడం మాత్రమే కాదు... సాధారణ కదలికలపై సైతం ఆంక్షలు వచ్చి పడిన కశ్మీర్లో ఫోన్ సౌకర్యం పునరుద్ధరణ జరిగాక ఎటువంటి భావోద్వేగాలు ఉబికి వచ్చాయో చానెళ్ల లోని దృశ్యాలు కళ్లకు కట్టాయి. ఈ సమస్య ఒక్క కశ్మీరీలది మాత్రమే కాదు... అక్కడ శాంతిభద్రత లను కాపాడటానికెళ్లిన జవాన్లది కూడా. వారు సైతం తమ క్షేమసమాచారాలను దూరప్రాంతాల్లో ఉన్న తమ ఆప్తులతో పంచుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సత్యపాల్ మాలిక్ అన్నట్టు మొబైల్ సర్వీసుల కన్నా కశ్మీరీల భద్రతే ప్రభుత్వానికి ముఖ్యం కావొచ్చు. వాటిని ఉగ్రవాదులు వినియోగించుకుని విధ్వంసకర కార్యకలాపాలకు దిగే ప్రమాదం ఉండొచ్చని ప్రభుత్వానికేర్పడ్డ భయాందోళనలు సహేతుకమైనవే కావొచ్చు. అయితే వాటికి అవసరమైన చర్యలు తీసుకుంటూనే, కొన్ని పరిమితులతోనైనా కమ్యూనికేషన్ సదుపాయాలకు వీలు కల్పించి ఉంటే బాగుండేది. పర స్పరం సంభాషించుకోవడానికి, స్వేచ్ఛగా సంచరించడానికి, తమ భావాలను వ్యక్తం చేయడానికి, అయినవారి గురించి తెలుసుకోవడానికి వీల్లేని పరిస్థితులు ఎలాంటివారికైనా దుర్భరమనిపిస్తాయి. బతుక్కి అర్ధం లేదనిపిస్తాయి. ఒక్క కమ్యూనికేషన్ల వ్యవస్థ మాత్రమే కాదు...ఆ రాష్ట్రంలో లక్షలాదిమంది పిల్లలు బడి మొహం చూసి కూడా 72 రోజులవుతోంది. బడులేమిటి...ఉన్నత విద్యాసంస్థల వరకూ అన్నిటా అదే పరిస్థితి. ఈ నెల 9 నుంచి కళాశాలలు తెరిచారు. కానీ హాజరవుతున్న విద్యార్థులు అంతంత మాత్రమే. ఒక విద్యాసంవత్సరంలో ఇంత సుదీర్ఘకాలం విద్యార్థులు చదువులకు దూరం కావడం వారి భవిష్యత్తుకెంత నష్టం కలిగిస్తుందో చెప్పనవసరం లేదు. దేశంలో ఇతర ప్రాంతాల విద్యార్థు లతో సమంగా వారు పోటీపడటం అసాధ్యమవుతుంది. విద్యాసంస్థలతోపాటు దుకాణాలు, ప్రజా రవాణా వ్యవస్థ కూడా పడకేశాయి. ఆ రాష్ట్రంలో మళ్లీ సాధారణ పరిస్థితులు పునరుద్ధరించాలని ప్రభుత్వం కూడా శాయశక్తులా ప్రయత్నిస్తున్నదనడానికి ఈమధ్య అక్కడి పత్రికల్లో ఇచ్చిన వాణిజ్య ప్రకటనే సాక్ష్యం. మూతపడిన దుకాణాలు, కనబడని ప్రజారవాణా వ్యవస్థ ఎవరి లబ్ధికంటూ ఆ ప్రకటన ప్రశ్నించింది. ‘మిలిటెంట్లకు లొంగిపోదామా... ఆలోచించండ’ని కోరింది. దుకాణాలు, విద్యాసంస్థలు మూతబడటం మిలిటెంట్ల బెదిరింపుల వల్లేనని అధికారులు చెబుతుంటే, అది నిరసన వ్యక్తీకరణగా 370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తున్నవారు చెబుతున్నారు. మీడియాపై ఆంక్షలు లేకుంటే ఇలాంటి పరిస్థితులు చాలావరకూ నిరోధించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో, వాటి మంచిచెడ్డలేమిటో తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు సాధారణ ప్రజానీకం భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉండదు. సమాచార వినిమయంపై ఆంక్షలున్నప్పుడే వదం తులు రాజ్యమేలుతాయి. ఆ స్థితిని తమకనుకూలంగా వినియోగించుకునేందుకు రకరకాల శక్తులూ ప్రయత్నిస్తాయి. కేంద్ర ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తు న్నప్పుడు చేసిన ప్రకటనలో ఇది తాత్కాలికమేనని ప్రకటించింది. పరిస్థితులు అనుకూలించాక తిరిగి రాష్ట్ర ప్రతిపత్తినిస్తామని తెలిపింది. ఇంకా నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ వంటి ప్రధాన పక్షాల నేతలు నిర్బంధంలోనే ఉన్నారు. కనుకనే ఈ నెల 24న జరగబోయే బ్లాక్ డెవెలప్మెంట్ కౌన్సిళ్ల ఎన్నికల్లో తాము పాలు పంచుకోవడం లేదని ఆ పార్టీలు తెలియజేశాయి. 370 అధికరణ రద్దు విషయంలో భిన్నాభిప్రా యంతో ఉన్నా ఈ పార్టీలన్నీ జమ్మూ–కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని స్పష్టంగా ప్రకటించినవే. కశ్మీర్లో వేర్పాటువాదుల పలుకుబడి గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గడంలో ఈ పార్టీల పాత్ర కూడా తక్కువేమీ కాదు. ఈమధ్యకాలంలో వరసగా ఆంక్షలు సడలిస్తున్నామని జమ్మూ–కశ్మీర్ ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంటున్న పర్యాటకం నాలుగు రోజుల క్రితం మొదలైంది. అయితే సందర్శకుల తాకిడి పెరగడానికి కొంచెం సమయం పడుతుంది. అంతర్జాతీయంగా కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ చేస్తున్న ప్రచారానికి అడ్డుకట్ట పడా లంటే అక్కడ సాధారణ పరిస్థితులు పునరుద్ధరించడమే మార్గం. రాష్ట్రంలోనూ, వెలుపలా నిర్బం ధంలో ఉన్న కశ్మీర్ నేతలను కూడా సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తే అక్కడ పరిస్థితి మెరుగ వుతుంది. ఆ దిశగా కేంద్రం ఆలోచించాలి. -
144 మంది చిన్నారుల అక్రమ నిర్బంధం
శ్రీనగర్: కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం బాలల హక్కులు పూర్తిగా నిర్బంధించడ్డాయని జువైనల్ జస్టిస్ట్ కమిటీ (బాలల న్యాయ సంరక్షణ, పరిరక్షణ) పేర్కొంది. కశ్మీర్లో మైనర్లను నిర్బంధిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం తమకు పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని జమ్మూ కశ్మీర్ హైకోర్టును ఆదేశింది. హైకోర్టు సూచన మేరకు విచారణ చేపట్టిన జువైనల్ కమిటీ.. ఈ మేరకు బుధవారం సుప్రీంకోర్టుకు నివేదిక అందించింది. ఆగస్ట్ 5 నుంచి ఇప్పటి వరకు 144 మంది మైనర్ బాలురు, బాలికలు పోలీసులు నిర్బంధంలో ఉన్నారని, వారినంతా అక్రమంగా అరెస్ట్ చేశారని కమిటీ నివేదించింది. అరెస్టయిన వారంతా 9 నుంచి 18 ఏళ్ల మధ్యలోనే ఉన్నారని పేర్కొంది. అయితే కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని సుప్రీంకోర్టులో ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా మైనర్ల నిర్బంధంపై బాలల హక్కుల కార్యకర్త సుష్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్నవారిని వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు లోయలో విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా.. కేంద్ర మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. కశ్మీర్లో అంతా ప్రశాంతగానే ఉందని చెబుతోంది. కాగా జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై దాఖలైన వ్యాజ్యాలను విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఆయా పిటిషన్లపై విచారణను ప్రారంభించనుంది. -
మనం ఇంకా గెలువని కశ్మీర్
కమ్యూనికేషన్ నిబంధనలను ఎత్తివేయడంపై జాప్యం కొనసాగుతుండటం కశ్మీరీల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. ఇది పరిస్థితులను అదుపు తప్పేలా చేస్తుంది. పైగా కశ్మీర్ స్థితిగతులను ప్రపంచం పరిశీలి స్తోంది కూడా. కానీ ప్రస్తుతం కశ్మీర్ గురించి ప్రపంచం పట్టించుకుంటోందా? కనీసం కశ్మీర్ గురించి ప్రపంచానికేమైనా తెలుసా? కశ్మీర్ ఉపఖండంలో భాగమని, దీనికోసమే భారత్, పాకిస్తాన్ లు అసంగతమైన స్థాయిలో పరస్పరం కలహించుకుంటున్నాయనీ. తరచుగా అణుయుద్ధ స్థాయికి కూడా దీన్ని తీసుకెళుతున్నాయని అర్థమైనప్పుడు మాత్రమే ప్రపంచం అట్లాస్‌లో కశ్మీర్ గురించి శోధిస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కేటగిరీలో ఇమడక పోవచ్చు. ఉపఖండం గురించి అమెరికా అధికారులు తనకు వివరిస్తున్నప్పుడు బటన్, నిప్పిల్ అంటే ఏంటి (భూటాన్, నేపాల్ దేశాలు) అని ట్రంప్ ప్రశ్నించడం ఎవరూ ఇంకా మర్చిపోలేదు. చివరకు గత జూలైలో అమెరికాలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో జరిపిన ప్రెస్ కాన్ఫరెన్సులో ట్రంప్ కశ్మీర్‌ని ‘నిత్యం బాంబులు కురుస్తున్న ఆ సుందరమైన స్థలం’ అంటూ వర్ణించడం కూడా మన దృష్టి పథాన్ని దాటిపోలేదు. ఇది మనకు ఏం చెబుతోంది అంటే.. భారత అత్యుత్తమ వ్యూహా త్మక, రాజకీయ ప్రయోజనాల రీత్యా చూస్తే కశ్మీర్‌పై బయటినుంచి వచ్చే ఏ వార్త కూడా మంచి వార్త కాదన్నట్లే.. కశ్మీర్లో తీవ్రవాదం ప్రారంభమైన తర్వాత గత 30 ఏళ్లలో 1991–94 మధ్య కాలంలో మాత్రమే కశ్మీర్ సమస్య ప్రపంచం దృష్టికి వచ్చింది. కశ్మీర్లో ఎవరూ క్షమించలేనటువంటి తీవ్రవాద వ్యతిరేక పోరాటాన్ని ప్రారంభించిన నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే కశ్మీర్ సమస్య ప్రపంచానికి తెలియవచ్చింది. ప్రతి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థా అక్కడి అణచివేతను తొలిసారిగా పట్టించుకుంది. మొట్టమొదటిసారిగా క్లింటన్ పాలనా యంత్రాంగం భారత్‌పై మండిపడింది కూడా. కానీ పీవీ నరసింహారావు ఈ సమస్యను అధిగమించి కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ప్రత్యేకించి కశ్మీర్లో అంతర్జాతీయ మీడియా ప్రవేశించడానికి అవకాశం కల్పించి ప్రపంచ అభిప్రాయాన్ని కాస్త చల్లబరిచారు. కానీ మానవ హక్కుల సంస్థలకు ప్రవేశం కల్పించలేదు. దానికి ప్రతిగా తన సొంత జాతీయ మానవ హక్కుల కమిషన్ ను 1993లో నెలకొల్పారు. ఆనాటి నుంచి కశ్మీర్ సమస్యను తెరవెనక్కి నెట్టడం పైనే పీవీ కేంద్రీకరించేవారు. 1994లో అమెరికా కాంగ్రెస్‌లో చేసిన ప్రసంగంలో కూడా కశ్మీర్ విషయాన్ని ఎంతో చతురతతో ప్రస్తావించారు. అయితే దాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి టెక్సాస్ని కలిపేసుకున్న విధంగా చారిత్రక పోలికను తీసుకొచ్చారు. మరోవైపున వ్యూహాత్మకంగా కశ్మీర్‌ను స్థాయిని పీవీ తగ్గించివేశారు. అప్పట్లో నాకు ఇచ్చిన ఒక ఇంటర్వూ్యలో కశ్మీర్ భవిష్యత్తును మీరెలా చూస్తున్నారు అని నేను అడిగిన ప్రశ్నకు పీవీ సులువుగా తేల్చిపడేశారు. ‘భాయీ, వారు ఏదో ఒకటి చేస్తారు. మేము కూడా మరొకటి చేస్తాం. ఈ అటలోంచే దాని ఫలితం వస్తుంది’ అనేశారు. కశ్మీర్‌ను ఆయన ఆ స్థాయిలోనే చూశారు. సిమ్లా ఒప్పందం తర్వాత దశాబ్దాల పాటు ఏబీ వాజ్పేయితోసహా భారత ప్రధానులంతా కశ్మీర్ సమస్యను కుదించే వ్యూహాన్నే అవలంబించారు. కార్గిల్ వంటి దాదాపు యుద్ధం సంభవించిన స్థితిలో కూడా పాకిస్తాన్ ఉగ్రవాదం గురించే మాట్లాడసాగాం. అంతే తప్ప కశ్మీర్‌ను ఒక సమస్యగా చూపించడానికి భారత్ అనుమతించలేదు. చాలాకాలం ఇది చక్కగా పనిచేసింది. 2001లో అమెరికాపై దాడులు జరిగాక పాకిస్తాన్ ని పెంచి పోషించడానికి అమెరికా పూనుకున్నప్పుడు కూడా పాక్ సైన్యం కశ్మీర్ గురించి పెద్దగా మాట్లాడింది లేదు. ఎందుకంటే కశ్మీర్ పరిస్థితిని ఇంకా దిగజార్చాలని అమెరికా భావించలేదు. అదే సమయంలో భారత్ ఈ నూతన పరిస్థితిని చాలావరకు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంది. ఈ నేపథ్యంలో మూడు పరిణామాలు ఆవిర్భవించాయి. మొదటిది, భారత్–పాక్‌లు వ్యూహాత్మక సమతుల్య స్థితికి చేరుకున్నాయనీ, సమస్యలు ఏవైనా ఉంటే అవి ఎత్తుడల స్థాయిలోనే ఉంటున్నాయని ప్రపంచం విశ్వసించసాగింది. రెండు, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థతో పాక్, వికాసదశలో సాగుతున్న భారత్ యధాతథస్థితిలోనే తమకు కొత్త ప్రయోజనాలు ఉన్నట్లు గ్రహించాయి. మూడు, రెండు దేశాల కొత్త తరాలు ఆధీనరేఖే తమ సరిహద్దుగా ఆమోదించే స్థాయికి ఎదుగుతూ వచ్చాయి. ప్రస్తుతం మోదీ ప్రభుత్వ హయాంలో భారతదేశం ప్రణాళికా రహితంగానే ఫలప్రదమయ్యే తన పూర్వ ప్రధానుల వైఖరినుంచి పక్కకు తప్పుకుని యధాతథ స్థితిని విచ్ఛిన్నపర్చే స్థాయికి చేరుకుంది. అయితే అలా పాత స్థితిని బ్రేక్ చేసిన మొదటి ప్రభుత్వం మోదీది కాదు. కశ్మీర్ సమస్య తన ప్రాధాన్యతను కోల్పోతోందని నిసృ్పహకు గురైన పాక్ తొలుత 2008లో, తర్వాత పఠాన్ కోఠ్లో, పులవామాలో యధాతథస్థితిని బద్దలు చేయడానికి ప్రయత్నించింది. ఈ దాడులకు పాల్పడింది స్థానికులే అని ఆరోపిస్తే సరిపోతుంది. కశ్మీర్లో యుద్ధవాతావరణాన్ని సృష్టించడం, అణు ప్రమాదాన్ని రేకెత్తించడం, దీంతో ప్రపంచం భీతిల్లగానే ప్రధాన సమస్యవైపు దాని దృష్టిని మళ్లించడం అనేది ఇప్పుడు పాక్ వైఖరిగా మారింది. ఒకవేళ పాక్ వ్యూహం పని చేయకపోతే, అది మరింత అసహనానికి లోనై మళ్లీ అదే పని చేస్తుందేమో తెలీదు. ప్రస్తుతానికి పాక్ వ్యూహం పనిచేయనందునే, రెండోసారి మెజారిటీ సాధించిన మోదీ నాయకత్వంలోని భారతదేశం యథాతథ స్థితిని నిర్ణయాత్మకంగా మార్చే ప్రయత్నం చేసిందని మనం అర్థం చేసుకుంటాం. పాక్ ఇప్పుడు కూడా యుద్ధ బెదిరింపులకు దిగింది. ప్రస్తుతం దాన్ని కూడా వదిలేసింది. తన సైనిక పరిమితులను అది గ్రహించింది. దానికి ప్రపంచంలో ఎవరూ ఆశ్చర్యపోలేదు కూడా. న్యూయార్క్‌లో ఇమ్రాన్ ఖాన్ విలేకరుల సమావేశంలో భారత్‌పై దాడి చేయలేనప్పుడు మనం ఇంకేం చేయగలమని ఆయన అడిగిన తీరును చూపిస్తున్న వీడియో క్లిప్‌ను దయచేసి పరిశీలించండి. ఇప్పటి వరకు బానేవుంది. ఇప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఒప్పకున్నా, ఒప్పకోకపోయినా అర్థశతాబ్దం తర్వాత ఇప్పుడు కశ్మీర్ సమస్య అంతర్జాతీయం అయ్యింది. ఇప్పుడు పాక్ కాదు, భారత్ పరిస్థితిని తన చేతిలోకి తీసుకోవాల్సి ఉంది. చైనా, టర్కీ తప్ప ఏ దేశమూ ఆగస్టు 5 తరువాత జరిగిన మార్పులు తన అంతర్గత అంశాలని చెబుతున్న భారత్ వైఖరిని ప్రశ్నించలేకపోవడం, అలాగే, ఆగస్టు 5కు ముందునాటి స్థితి కల్పించాలని డిమాండ్ చేయలేకపోవడం మనకు అనుకూలమే. అమెరికాతో సహా చాలా దేశాలు కశ్మీర్లో జరుగబోయే తదనంతర పరిణామాలపై ఆసక్తితో ఉన్నాయి. ఊచకోత సాగుతోందన్న ఇమ్రాన్ మాటలను ఎవరూ నమ్మడం లేదు. అలాగని, శ్రీనగర్‌లో సాధారణ స్థితిని చూపుతున్న డ్రోన్ చిత్రాలపట్ల కూడా సంతృప్తిగా లేరు. కశ్మీర్లో అమానుషమైన నిర్బంధం కొనసాగుతోంది. వేలాదిమందిని ఎలాంటి ఆరోపణలు, విచారణ లేకుండా నిర్బంధించడంపట్ల ఆయా దేశాలు త్వరలోనే సహనాన్ని వీడొచ్చు. ఐక్యరాజ్య సమితి సమావేశాలు ముగిసినట్టే. పాకిస్తాన్ ను ఏకాకిని చేసి మనం సాధించిన దౌత్య విజయంపై సంబరాలు చేసుకోవచ్చు. మోదీ న్యూయార్క్ నుంచి ప్రతికూల అంశాల కంటే ఎక్కువగా అనుకూల అంశాలతోనే, తిరిగి వస్తున్నారు. కశ్మీర్ మా అంతర్గత అంశం అన్న భారత్ పాతపాటను ఎవరూ సవాల్ చేయలేదు. మోదీతో వైట్ హౌస్‌లో జరిపిన సమావేశంలో సైతం కశ్మీర్లో సాధారణ స్థితిని నెలకొల్పాలనీ, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాత్రమే ట్రంప్ కోరారు. అంతేగానీ, అగస్టు 5కు ముందునాటి స్థితిని పునరుద్ధరించమని కోరలేదు. అయితే, ఇదే స్థితిని భారత్ భవి ష్యత్‌లో కూడా కొనసాగిస్తే బాధితులమంటూ పాకిస్తాన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించే అవకాశం కశ్మీర్ ఇస్తుంది. న్యూయార్క్‌లో ఏడాది కోసారి తూతూమంత్రంగా సాగే భారత్, పాక్ సమావేశాల్లో కశ్మీర్ భారత అంతర్గత అంశంగా నిలబెట్టుకోవడం దౌత్య విజయం అనుకుంటే, కశ్మీర్ భవిష్యత్, భారత్ చెప్పుకునే జాతిహితం కూడా అందులో ఇమిడి ఉంటాయి. కశ్మీర్లో సమాచార నిషేధం విధించి మరో వారంలో రెండు నెలలు పూర్తవుతాయి. కాలం గడుస్తున్న కొద్దీ కశ్మీర్‌ల్లో ఆగ్రహం పెల్లుబికుతుంది. తగిన సమయంలో దాన్ని అదుపు చేయడం సవాల్‌గా మారుతుంది. సమయం దాటేకొద్దీ హింస, రక్తపాతం చోటుచేసుకునే ప్రమాదం ఉంది. అప్పుడు పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉంది. కశ్మీర్ పట్ల ప్రపంచం వ్యతిరేకంగా స్పందించడం లేదు. కానీ, ఇప్పుడది సున్నిత సమస్యగా మారింది. ఆ విధంగా కశ్మీర్ అంశం అంతర్జాతీయం అయ్యింది. ఆగస్టు 5 నిర్బంధం తర్వాత పరిస్థితిని ఏంటని ఆలోచించడమే కొత్త యధాతథస్థితిగా ఉంటుంది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కశ్మీర్‌పై కిషన్‌రెడ్డి కీలక ప్రకటన
సాక్షి, బెంగళూరు: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడి ప్రాంత పునర్నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా కశ్మీర్ అభివృద్ధి కొరకు ప్రత్యేక ప్రణాళికను రచిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం వెల్లడించారు. ఈ మేరకు తొలుత ఏయే అంశాలపై దృష్టిసారించాలన్న దాని కొరకు కశ్మీర్ వ్యాప్తంగా ఓ బృందంతో సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. అయితే దీనిలో భాగంగా దశాబ్దాల కాలంగా మూతబడిపోయిన దేవాలయాలు, పాఠశాలలను పునరుద్దరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి ప్రకటించారు. తొలి విడతలో భాగంగా 50వేల దేవాలయాలు వీటిలో చోటుదక్కించుకున్నాయన్నారు. బెంగళూరు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి ఈ మేరకు వివరాలను వెల్లడించారు. గత పాలకులు, ఉగ్రవాదుల చర్యల కారణంగా కశ్మీర్ పూర్తిగా ధ్వంసమైందని, దాన్ని తిరిగి పునరుద్దరించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు. ఇరవై ఏళ్లుగా లోయలో సినిమా థియేటర్లు మూతపడి ఉన్నాయని వీలైనంత త్వరగా వాటిని కూడా తెరుస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇన్నేళ్లూ ఉపాధికి దూరంగా ఉన్న కశ్మీరీ యువకులను నేవీ, ఆర్మీ, కేంద్ర బలగాల్లోకి తీసుకునేందుకు ప్రత్యేక నియామకాలను చేపడతామని స్పష్టం చేశారు. అలాగే మూతపడ్డ యూనివర్సిటీలను త్వరలోనే తెరుస్తున్నట్లు వెల్లడించారు. కశ్మీర్ వవ్యాప్తంగా టూరిజంను మరింత అభివృద్ధి చేస్తామని, దాని కొరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా కశ్మీర్ విభజన అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అక్కడి జనజీవనం పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. కొన్ని ప్రాంతాల్లో మినహా రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ప్రశాతంగా ఉన్నట్లు వివరించారు. సమాచార, సాంకేతిక వ్యవస్థపై ఆంక్షాలు పూర్తిగా సడలించామని పేర్కొన్నారు. -
మోదీ-షా ద్వయం మరోసారి ఫలిస్తుందా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల వేడి మొదలైంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల బరిలోకి దిగేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీనే ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులు. వరుస ఓటములతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చావోరావే తేల్చుకునే పరిస్థితి. ముఖ్యంగా హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలతో పాటు కర్ణాటకలోని 15 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ కఠిన పరీక్షనే ఎదుర్కొనుంది. పార్టీ నాయకత్వంతో పాటు, కార్యకర్తల భవిష్యత్తుని ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని రాజకీయ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ విషయానికొస్తే.. జరగబోయే ఎన్నికల్లో తమకు తిరుగలేదని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.. కేంద్రంలో మద్దతు కలిగిన బలమైన ప్రభుత్వం ఉండటం, ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్నికల వ్యూహకర్తగా పేరొందిన అమిత్ షాలు ఉండనేఉన్నారు. మోదీ చరిష్మాతోనే 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దానిలో భాగంగానే హర్యానా, నాసిక్ సభల్లో ప్రసంగించిన మోదీ.. ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మోదీచే మరికొన్ని బహిరంగ సభలను నిర్వహించాలని బీజేపీ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశ వ్యాప్తంగా మోదీ 400 ర్యాలీలు నిర్వహించగా ఆ ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాలను సాధించింది. దీనికి భిన్నంగా గత ఎన్నికల్లో కేవలం 144 ర్యాలీల్లో పాల్గొన్న మోదీ ఏకంగా 303 స్థానాలను సాధించిపెట్టారు. వ్యతిరేకత తప్పదా..? అయితే కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం.. అనేక కీలక, వివాదాస్పద నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. వాటిలో ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు, ఎన్ఆర్సీని అమలు చేసింది. వీటిని కొన్ని వర్గాల ప్రజలు స్వాగతించగా.. మరికొందరు తీవ్రగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కీలకపైన అసెంబ్లీ ఎన్నికల ముందు వీటి నుంచి కమళ దళం ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ) నుంచి దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తొలుత అస్సాంలో అమలు చేసిన కేంద్రం.. ఆ తరువాత దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ఇదివరకే ప్రకటించింది. మొదట్లో ఎన్ఆర్సీ సృష్టించిన ప్రకంపనలు అంతాఇంతా కాదు. ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమం పలుప్రాంతాల్లో తీవ్ర రూపం దాల్చింది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ తాజా ఎన్నికలపై ఎంతోకొంత ప్రభావం చూపుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెరసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తమకే లాభం చేకూరుస్తాయని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లింలు బీజేపీపై కొంత ఆగ్రహంగా ఉన్నారని భావిస్తోన్న కాంగ్రెస్ ఆ వర్గాన్ని తమవైపు తిప్పుకోని పూర్వవైభవం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే ఎన్ఆర్సీపై కూడా పోరాడుతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రతిపక్షాలు చెమటోడుస్తున్నాయి. బీజేపికి పెద్ద దిక్కుగా మారిన మోదీ, అమిత్ షాలే అన్ని ఎన్నికల్లోనూ విజయం బాధ్యతను మోస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటకలో ఉప ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో షా, మోదీ ద్వయం ఫలిస్తుందా అనేది వేచి చూడాలి. -
‘గాంధీ ఇండియానా లేక గాడ్సే ఇండియానా’
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ పీడీపీ అధినేత్రి, మాజీ ముఖ్యమత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె సనా ఇల్తిజార్ జావేద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గాంధీ జన్శించిన ఇండియానా లేక గాడ్సే ఇండియానా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. శుక్రవారం ఢిల్లీలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన ఇంటర్వ్యూ ఇల్తిజార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కశ్మీర్‌పై బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నెలలు గడుస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థ ఏ మాత్రం మెరుగుపడలేదని, ప్రజలపై నిర్బంధం విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ ప్రజలకు, దేశ ప్రజలకు మధ్య దూరం చాలా పెరిగిందన్నారు. తమపై విధించిన ఆంక్షలను పూర్తిగా సడలించి లోయలో ప్రశాంతతను పునరుద్ధరించాలని ఇల్తిజార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కశ్మీర్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయంపై తమను కనీసం సంప్రదించకపోవడం దారుణమన్నారు. ఇది తమ హక్కులను కాలరాయడమేనని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా ఆర్టికల్ 370 రద్దు రాష్ట్ర విభజన నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సహా ఒమర్ అబ్దుల్లాను గృహ నిర్బంధం లో ఉంచిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తలు న్యాయవాదులు ఆఖరికి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడేందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని సనా అన్నారు. అదే విధంగా కశ్మీర్లో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను కూడా ఆమె తీవ్రంగా విమర్శించారు. -
కశ్మీర్లో స్తంభించిపోయిన ‘న్యాయం’
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ‘ప్రజా భద్రతా చట్టం’ కింద అరెస్టయిన వేలాది మంది యువకులు గత నెల పదిహేను రోజులుగా జైళ్లలోనే మగ్గుతున్నారు. రాష్ట్రంలోని జైళ్లు సరిపోకపోవడంతో వేలాది మందిని ఇరుగు, పొరుగు రాష్ట్రాలకు కూడా తరలించిన విషయం తెల్సిందే. వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్ జైళ్లలో ఊచలు లెక్క పెడుతున్నారు. వారు తమ ఆరెస్టులను సవాల్ చేసేందుకు కోర్టులకు వెళ్లే ఆస్కారం కూడా లేకుండా పోయింది. కోర్టుల తలుపులు ఇప్పటికీ తెరచుకోవడం లేదు. ఇదేమిటిని ప్రశ్నించేందుకు న్యాయవాదులు కూడా అందుబాటులో లేకుండా పోయారు. వారిలో ఎక్కువ మంది కటకటాల వెనెక్కే వెళ్లారు. ఇప్పటికీ నిర్మానుష్యంగా ఉన్న హైకోర్టుకు వెళ్లే దారి కశ్మీర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మియాన్ అబ్దుల్ ఖయ్యూంను అరెస్ట్ చేసి ఆగ్రా జైల్లో నిర్బంధించగా, హైకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నజీర్ అహ్మద్ రోంగాను అరెస్ట్ చేసి మొరదాబా జైల్లో నిర్బంధించారు. ఆ తర్వాత బారముల్లా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ సలాం రాథర్‌ను అరెస్ట్ చేసి యూపీ జైల్లో నిర్బంధించారు. అందుబాటులో లేకుండా పోయిన అనంతనాగ్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఫయద్ సోదాగర్ జాడ కోసం స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. ఇదిలావుండగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, సీనియర్ న్యాయవాది మొహమ్మద్ యూసుఫ్ భట్, ఆయన కుమారుడు, న్యాయవాది జుబేర్ అహ్మద్ భట్లను కూడా పోలీసులు అరెస్ట్ చేసి జైళ్లకు తరలించారని సోఫియన్ జిల్లా కోర్టు న్యాయవాదులు తెలిపారు. హైకోర్టు ఆవరణలో అతికించిన నోటీసు వారందరిని రెండేళ్లపాటు ఎలాంటి విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించేందుకు అవకాశం ఉన్న కశ్మీర్‌కు మాత్రమే పరిమితమైన ‘ప్రజా భద్రతా చట్టం’ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంత మంది న్యాయవాదులను అరెస్ట్ చేయడమే కాకుండా వారు విధులు నిర్వర్తించడానికి వీల్లేకుండా కోర్టుల తలుపులకు తాళాలు వేసి ఉంచడం పట్ల కశ్మీర్ బార్ అసోసియేషన్‌కు చెందిన 1,050 మంది న్యాయవాదులు ఇటీవల సమావేశమై అరెస్టయిన న్యాయవాదులే తరఫునే కాకుండా అదశ్యమైన యువకుల తరఫున ‘హబియస్ కార్పస్’ పిటిషన్ దాఖలు చేసేందుకు ఏడుగురు న్యాయవాదులను నియమించారు. కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా ఢిల్లీలో విద్యార్థుల నిరసన శ్రీనగర్‌లోని కశ్మీర్ హైకోర్టు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందేనని, ఈ విషయంలో అవసరమైతే తానే స్వయంగా శ్రీనగర్‌కు వెళతానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కోర్టులన్నీ యథావిధిగా పనిచేసేందుకు తమ అధికార యంత్రాంగం తప్పకుండా సహకరిస్తుందని, హైకోర్టుతోపాటు దిగువ కోర్టులు కూడా సజావుగానే పనిచేస్తున్నాయని కశ్మీర్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు గురువారం నాడు ప్రకటించారు. ఇప్పటికీ కశ్మీర్లో ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించలేదని, ప్రభుత్వ రవాణా సర్వీసులేవీ నడవడం లేదని, కొన్ని చోట్ల కోర్టుల తలుపులు తెరస్తున్నప్పటికీ సిబ్బందిగానీ, జడ్జీలుగానీ, న్యాయవాదులుగానీ రావడం లేదని కశ్మీర్ బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. దాదాపు సగం న్యాయవాదులు జైళ్లలో మగ్గుతుంటే ఇంకా ఎవరు వచ్చి విధులు నిర్వర్తిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కశ్మీరీలకు బంగారు భవిష్యత్తు ఇస్తానని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న నేపథ్యంలో ఈ నిర్బంధం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. -
బట్టలన్నీ విప్పేసి, కాళ్లు, చేతులు కట్టేసి..
సాక్షి, న్యూఢిల్లీ : ‘మమ్మల్ని రాత్రి పూట ఇళ్ల నుంచి బయటకు తీసుకెళ్లారు. తీవ్రంగా కొట్టారు. శరీరమంతటా ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’ అని కొంత మంది గ్రామస్తులు ఆరోపించగా, ‘రాత్రిపూట సైనిక శిబిరాల నుంచి ప్రజలు అరుపులు, ఏడ్పులు రోజూ వినిపించేవి’ మరికొంత మంది తెలిపారు. ‘ఆగస్టు 14వ తేదీన రాత్రిపూట సైనికులు మా ఇళ్లు తలుపు తట్టారు. నేను తలుపులు తీశాను. పది మంది సైనికులు ఇంట్లో జొరబడ్డారు. నాకు, నా సోదరుడి కళ్లకు గంతలు గట్టి బయటకు తీసుకెళ్లారు. ముందుగా రోడ్డవతలికి నా సోదరుడిని తీసుకెళ్లారు. అక్కడ అతడిరి తీవ్రంగా కొడుతుండడంతో హృదయ విదారకమైన ఏడుపు వినిపించింది. నన్ను సమీపంలోని చౌగామ్ సైనిక శిబిరానికి తీసుకెళ్లారు. అక్కడ బట్టలన్నీ విప్పేశారు. చేతులను, కాళ్లను కట్టేసి ఇనుప రాడ్లతో కొట్టారు. చేతులు, కాళ్లు, వీపు, పిర్రలపై ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చారు’ 26 ఏళ్ల అబిద్ ఖాన్ ‘ఏపీ’ వార్తా సంస్థకు వివరించారు. సోఫియాన్ జిల్లా హిర్పోరా గ్రామంలో ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ‘నీ పెళ్లికి హిజ్బుల్ ముజాహిదీన్’ మిలిటెంట్ సంస్థకు చెందిన రియాజ్ నైకూ మిలిటెంట్‌ను ఎందుకు ఆహ్వానించావు ? ఇప్పుడు అతనెక్కడున్నాడో చెప్పు ?’ అంటూ భారత సైనికులు తనను హింసించారని, అతను ఎవరో, అసలు ఎక్కడుంటారో కూడా తనకు తెలియదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదని అబిద్ ఖాన్ మీడియాకు వివరించారు. తన పురుషాంగం, వరి బీజాలపై కూడా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చారని తెలిపాడు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేసిన నేపథ్యంలో మున్ముందు ఎలాంటి నిరసన ప్రదర్శనలు జరపరాదనే ఉద్దేశంతోనే వారు ఇలా తనను హింసిస్తున్నారని అర్ధం అయిందని ఆయన చెప్పారు. తన లాగే తన గ్రామానికి చెందిన మరికొంత మంది యువకులను ఇలాగే హింసించినట్లు తెల్సిందని చెప్పాడు. సైనిక శిబిరం నుంచి అబద్ ఖాన్ విడులయ్యాక పది రోజుల పాటు నిల్చోలేక పోయాడు, కూర్చోలేక పోయాడని, ఆ పది రోజులు వరుసగా వాంతులు చేసుకుంటూనే ఉన్నాడని, బ్రతుకుతాడని ఆశ లేకుండేనని కుటుంబ సభ్యులు తెలిపారు. 20 రోజుల తర్వాత తేరుకొని కాస్త అటు, ఇటు నడవ కలుగుతున్నాడని వారు చెప్పారు. పలు గ్రామాల్లో జరుగుతున్న ఇలాంటి మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. కశ్మీర్లో ఎప్పుడో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ నేటికి సాధారణ పరిస్థితులు లేవని ఏపీ మీడియా వెల్లడించింది. ఇంకా పలు ప్రాంతాల్లో టెలిఫోన్ సౌకర్యాలను కూడా పునరుద్ధరించలేదు. -
భారత్‌తో యుద్ధంలో ఓడిపోతాం
ఇస్లామాబాద్: భారత్‌తో సంప్రదాయ యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఓడిపోతుందని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అంగీకరించారు. అయితే, దాని ప్రభావం ఉపఖండానికి వెలుపల కూడా ఉంటుందని చెప్పారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో భారత్‌తో చర్చల ప్రసక్తే లేదన్నారు. ‘పాక్ ముందుగా యుద్ధానికి దిగదు. నేను యుద్ధానికి వ్యతిరేకిని. శాంతివాదిని. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావనేది నా నమ్మకం’అని తెలిపారు. సంప్రదాయ యుద్ధమే జరిగితే పాక్ ఓడిపోతుంది. అలాంటప్పుడు మాకు రెండే అవకాశాలున్నాయి. ఒకటి లొంగిపోవడం, రెండోది తుదికంటా పోరాడటం. అయితే, స్వాతంత్య్రం కోసం పాక్ ప్రజలు చనిపోయేదాకా పోరాడతారని నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ‘అయితే, రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే..ప్రారంభంలో అది సంప్రదాయ పోరైనా.. అణ్వస్త్ర ప్రయోగంతోనే ముగిసేందుకు అవకాశం ఉంది. దానిని ఊహించలేం’అని అన్నారు. ‘భారత్‌తో యుద్ధం జరిగేందుకు అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నా. దీనిని నివారించేందుకే ఐరాసకు వెళ్లాం. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాం’అని పేర్కొన్నారు. యుద్ధం ఫలితంగా ఉపఖండానికి అవతల కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు. భారత్ ఎఫ్ఏటీఎఫ్(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్) సంస్థ పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఆయన.. ఆంక్షల ద్వారా పాక్ ను ఆర్థికంగా దివాళా తీయించేందుకు, కష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తోంది’అని అన్నారు. కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ రద్దును ఉపసంహరించుకునే భారత్‌తో చర్చలుంటాయని స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 27వ తేదీన ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రధాని ఇమ్రాన్ ప్రసంగించేదాకా ఎల్వోసీ వరకు చేపట్టే ర్యాలీ వాయిదా వేయాలని పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని రాజకీయ, మత సంస్థలు నిర్ణయించుకున్నాయి. కశ్మీరీలకు సంఘీభావంగా ఎల్వోసీ వరకు ర్యాలీ చేపట్టాలని ఇమ్రాన్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సరిహద్దులో పాక్ కవ్వింపులు: 2,050 న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంట పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ ఏడాదిలో పాక్ ఇప్పటి వరకూ 2,050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రావీశ్ కుమార్ ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనల్లో 21 మంది భారత సైనికులు మృతిచెందినట్లు ఆయన తెలిపారు. ఒప్పందాన్ని ఉల్లంఘించడమేగాక భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. నియంత్రణ రేఖ వెంట శాంతి భద్రతలు నెలకొనేలా చేసుకున్న 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ పదేపదే ఉల్లంఘిస్తోందని అన్నారు. దీనికితోడు ఈ నెల మొదటి వారంలో పాక్ దాదాపు 100 నుంచి 200 మంది సైనికులను నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి తరలించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పాకిస్తాన్ ఇన్ని కవ్వింపు చర్యలు చేపడుతున్నప్పటికీ భారత బలగాలు సహనం చూపుతున్నాయని, ఉగ్రవాదులు చొరబడాలని చూసినపుడు మాత్రం తగిన జవాబు ఇస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్వోసీ వెంట భారత బలగాల సంసిద్ధతను ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ శనివారం పరిశీలించారు. దీనికి ముందే ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ కూడా పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించారు. -
పాక్ జిత్తులు: కశ్మీర్లో హింసకు రహస్య కోడ్
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్లో అలజడి సృష్టించేందుకు పాకిస్తాన్ సైన్యం, ఉగ్రసంస్థల అధినేతలు తమ అనుచరులకు కోడ్ బాషాల్లో రహస్య సందేశాలను పంపుతున్నట్లు భారత నిఘా వర్గ సంస్థలు గుర్తించాయి. ఇందు కోసం పలు ఎఫ్ఎం ట్రాన్స్మిషన్ స్టేషన్లను ఎల్వోసీ సమీపానికి పాకిస్తాన్ తరలించినట్ల కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కశ్మీర్లో దాడులు చేయాలంటూ ఈ కేంద్రాల ద్వారా స్థానిక ఉగ్రవాదులకు సందేశాలను పంపిస్తున్నారని వెల్లడించారు. సంప్రదింపుల కోసం ఉగ్రవాద సంస్థలు జైష్ మొముమ్మద్ (68/69), లష్కేరే తోయిబా (ఏ3), ఆల్ బద్ర్ (డీ9) సంకేతాలను వాడుతున్నారని తెలిపారు. సైన్యం, ఉగ్రసంస్థలు, పాకిస్తాన్ జాతీయ గీతమైన ‘క్వామీ తరనా’ ద్వారా సందేశాలు పంపతున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. కేంద్ర ప్రభుత్వం కశ్మర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజుల వ్యవధిలోనే దాయాది దేశం ఎల్వోసీ వద్ద హైప్రీక్వెన్సీతో రేడియో స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు నిఘా సంస్థలు తెలిపాయి. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్‌ను భారీ దెబ్బతీయాలని ఆదేశం పావులు కదుపుతోన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజాద్‌ను జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స్ వర్గాలు గుర్తించిన విషయం తెలిసిందే. చదవండి: భారీ కుట్రకు పాక్ పన్నాగం.. మసూద్ విడుదల! -
భారత్‌లో అలజడి సృష్టించండి
న్యూఢిల్లీ: కశ్మీర్‌కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేయడంపై పాకిస్తాన్ కోపంతో రగిలిపోతోంది. కశ్మీర్లో రక్తపాతం సృష్టించడం ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను ఇటీవల జైలు నుంచి విడుదలచేసిన పాకిస్తాన్, తాజాగా మరో కుట్రకు తెరలేపింది. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రసంస్థలతో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) ఇస్లామాబాద్‌లో అత్యున్నత సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి పాక్‌లోని ఉగ్రసంస్థలతో పాటు ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్(కేజెడ్ఎఫ్) వంటి వేర్పాటువాద సంస్థల ముఖ్యనేతలు హాజరైనట్లు భారత నిఘావర్గాలు తెలిపాయి. కశ్మీర్లో దాడులతో అలజడి సృష్టించాలని ఈ సందర్భంగా ఉగ్రమూకలకు ఐఎస్ఐ ఆదేశాలు జారీచేసిందని వెల్లడించాయి. కశ్మీర్లో భద్రతాబలగాలు, ప్రభుత్వ ఆస్తులు లక్ష్యంగా విధ్వంసానికి పాల్పడటం ద్వారా ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని పేర్కొన్నాయి. సాంబా జిల్లాలోని బరీబ్రహ్మణ ఆర్మీ క్యాంప్, జమ్మూలోని సుంజ్వాన్, కలుచక్ ఆర్మీ బేస్‌లు లక్ష్యంగా నలుగురు లష్కరే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. లష్కరే మద్దతుదారుల అరెస్ట్ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న 8 మంది లష్కరే తోయిబా మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదుల పేరిట వీరు పోస్టర్లు అంటించారు. ప్రజలంతా శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టాలనీ, స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ఈ పోస్టర్లలో పిలుపునిచ్చారు. -
కశ్మీర్‌పై జోక్యాన్ని సహించం
జెనీవా/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతి పత్తి రద్దు నిర్ణయం తమ సార్వభౌమాధికారానికి సంబంధించిందని భారత్ స్పష్టం చేసింది. ఈ విషయంలో మరో బయటి శక్తుల జోక్యాన్ని అంగీకరించబోమని పేర్కొంది. కశ్మీర్లో పరిస్థితులపై అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలంటూ జెనీవాలో మంగళవారం జరిగిన ఐరాస మానవ హక్కుల సంఘం(యూఎన్‌హెచ్చార్సీ) 42వ సమావేశంలో పాకిస్తాన్ కోరిన నేపథ్యంలో భారత్ ఈ విషయం స్పష్టం చేసింది. ఐరాస మానవ హక్కుల సంఘంలో కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ చేస్తున్నదంతా దుష్ప్రచారమని కొట్టిపారేసింది. విదేశాంగ శాఖ కార్యదర్శి(తూర్పు) విజయ ఠాకూర్ సింగ్ జెనీవాలో మాట్లాడుతూ.. మానవహక్కుల ముసుగులో రాజకీయ దుష్ప్రచారానికి ఐరాసను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇతర దేశాల్లో మైనారిటీలకు మానవ హక్కులు లేవంటూ మాట్లాడుతున్న వారు సొంత దేశంలో మైనారిటీలను అణగదొక్కుతున్నారు’ అని అన్నారు. ‘కశ్మీర్‌కు సంబంధించి ఇటీవల చేపట్టిన మార్పులు భారత రాజ్యాంగానికి లోబడి జరిగాయి. భారత పార్లమెంట్ కూలంకషంగా చర్చించి తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా అంతరంగిక విషయం’అని పేర్కొన్నారు. ఇతర దేశాల జోక్యాన్ని భారత్ అంగీకరించబోదన్నారు. ఇదే విషయాన్ని ఆయన మానవహక్కుల సంఘం చీఫ్ మిఛెల్ బాచెలెట్‌కు వివరించారు. సీమాంతర ఉగ్రవాదం బెడద కారణంగానే ఆంక్షలు విధించినట్లు వివరించారు. 130 కోట్ల జనాభా కలిగిన తమ దేశంలో మానవ హక్కులకు అత్యుత్తమ రక్షణ ఉందన్నారు. చైనా–పాక్ ప్రకటనపై భారత్ మండిపాటు పాకిస్తాన్లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన నేపథ్యంలో కశ్మీర్ అంశంపై రెండు దేశాల సంయుక్త ప్రకటనపై భారత్ మండిపడింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ మాట్లాడుతూ..‘కశ్మీర్‌కు సంబంధించి రెండు దేశాల సంయుక్త ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. జమ్మూకశ్మీర్ భారత్‌లో విడదీయరాని అంతర్భాగం’అని పేర్కొన్నారు. ‘పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) పేరుతో తీసుకునే చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం. పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని 1947 నుంచి చట్ట విరుద్ధంగా ఆక్రమించుకుంది’అని పేర్కొన్నారు. ‘భారత్‌లోని కశ్మీర్ రాష్ట్రం’ పాక్ విదేశాంగ మంత్రి భారత్‌లోని కశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు లేవని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషి అన్నారు. అన్ని అంతర్జాతీయ వేదికలపైనా పాక్ నేతలు మామూలుగా కశ్మీర్ అంటూ ప్రస్తావిస్తుంటారు. కానీ, ఖురేషి మంగళవారం యూఎన్‌హెచ్చార్సీ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌లోని కశ్మీర్ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులున్నాయని అంటున్నారు. అలాంటప్పుడు అంతర్జాతీయ సంస్థలను అక్కడికి ఎందుకు అనుమతించడం లేదు? మీడియాపై ఆంక్షలెందుకు? స్వచ్ఛంద, పౌర సంస్థలను కశ్మీర్లోకి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. అనంతరం ఆయన యూఎన్‌హెచ్చార్సీ భేటీలో మాట్లాడుతూ.. ‘కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని భారత్ రద్దు చేసింది. కశ్మీర్ ప్రజలకు న్యాయం కోసమే ఇక్కడికి వచ్చాం. యూఎన్‌హెచ్చార్సీ మౌనంగా ఉండటం ఇబ్బందికర పరిణామం’ అని అన్నారు. -
‘600 ఏళ్లలో ఎన్నడూ ఇలా లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : ‘గత 600 సంవత్సరాల్లో మొట్టమొదటి సారిగా ఈద్, శుక్రవారం సందర్భంగా ముస్లింల ప్రార్థనలు లేకుండా పోయాయి’ అని ఇస్లాం మత గురువు హజీ బిలాల్ అహద్ అమ్దాని వ్యాఖ్యానించారు. ఆయన శ్రీనగర్‌లోని జేలం నదీ ఒడ్డునగల 14వ శతాబ్దం నాటి ‘ఖాంక్ ఏ మౌలా’కు ఆయన డిప్యూటి ఇమామ్‌గా పనిచేస్తున్నారు. ‘ఎన్నో ఆందోళనల సందర్భంగా కూడా ఇలా ప్రార్థనలు జరగకుండా ఉన్న రోజు లేదు. అంతెందుకు, మిలిటెన్సీ ఎక్కువగా ఉన్న 1989లో నలువైపుల నుంచి తుపాకీ తూటాలు దూసుకొచ్చినప్పుడు కూడా ఈ మౌలాలో ప్రార్థనలు నిలిచిపోలేదు. రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న ఆగస్టు 5వ తేదీ నుంచి నేటి వరకు కూడా ఈద్ రోజునగానీ, శుక్రవారం నాడుగానీ మౌలాలో సామూహిక ప్రార్థనలకు స్థానిక అధికారులు అనుమతించలేదు’ అని ఆయన గురువారం స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు. ‘హమ్ క్యా చాహ్తే హై, ఆజాదీ’ అంటూ 1989లో మిలిటెంట్లు జరిపిన ఆందోళనలో అనేక మంది మరణించారు. 1947లో కశ్మీర్లో జరిగిన మత కలహాల్లో కూడా వందలాది మంది మరణించారు. ఈ రెండు సందర్భాల్లోనే కాకుండా 1975లో కశ్మీర్లో ప్రధాన మంత్రి వ్యవస్థను రద్దు చేసి షేక్ అబ్దుల్లాను అరెస్ట్ చేసినప్పుడుగానీ, 1998 కశ్మీర్లో సైన్యం సద్భావన యాత్ర నిర్వహించినప్పుడుగానీ ప్రార్థనలు నిలిచిపోలేదన్నది అమ్దాని ఉద్దేశం. కశ్మీర్లో అప్రకటిత కర్ఫ్యూ అమల్లోకి వచ్చి సెప్టెంబర్ 5వ తేదీ నాటికి సరిగ్గా నెల రోజులు గడిచాయి. అయినప్పటికీ శ్రీనగర్‌తోపాటు పలు పట్టణ ప్రాంతాల్లో స్మశాన నిశబ్దం కొనసాగుతోంది. ల్యాండ్, మొబైల్ టెలిఫోన్ సర్వీసులను, ఇంటర్నెట్ సదుపాయాలను ఇంతవరకు పునరుద్ధరించలేదు. రాష్ట్రం నుంచి ఎవరు ఇతర రాష్ట్రాలకు వెళ్లాలన్నా, ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు కశ్మీర్లోకి రావాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న అప్రకటిత ఆంక్ష కొనసాగుతోంది. ప్రార్థనలు నిర్వహించకుండా కొన్నిచోట్ల ఇమామ్‌లను అరెస్ట్ చేసినట్లు అమ్దాని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను శ్రీనగర్ పోలీసు ఉన్నతాధికారి ఖండించారు. ఇతర కేసుల విషయంలో కొందరు ఇమామ్‌లను అరెస్ట్ చేసిన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు. అయితే తాజా పరిణామాలకు, వారి అరెస్ట్‌లకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తనను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పటికీ అర్థం కావడం లేదని శ్రీనగర్‌లోని అగ సయ్యద్ హజీ హాసన్ మందిరం ఇస్లాం గురువు అగా సయ్యద్ ఐజాజ్ రిజ్వీ తనను కలిసిన మీడియా ప్రతినిధితో వ్యాఖ్యానించారు. ఆయన్ని ఆగస్టు 22వ తేదీన ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. జడిబాల్లోని మరో మసీదు ఇమామ్ ఇమ్రాన్ రెజా అన్సారీతోపాటు మరొ కొందరు ఇమామ్‌లను సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారట. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అరెస్ట్ చేస్తున్నామని మాత్రమే పోలీసులు వారికి చెప్పారట. శ్రీనగర్‌లోని పలు చారిత్రక మసీదుల్లో కూడా శుక్రవారం నాటి ప్రార్థనలు నిలిచిపోయాయి. ఇప్పుడు వాటిల్లో పావురాల రెక్కల చప్పుడు మినహా మరే ఇతర శబ్దాలు వినిపించడం లేదు. -
కశ్మీర్‌పై ఇమ్రాన్ తీరు మార్చుకోవాలి: పాక్‌నేత
ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇమ్రాన్ వ్యాఖ్యలను ఆ దేశానికే చెందిన ముత్తహిదా కౌమి మూవ్మెంట్ వ్యవస్థాపకుడు ఆల్తారీ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని తన మద్దతు ప్రకటించారు. హుస్సేన్ ఆదివారం తన మద్దతుదారులతో ఓ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ సమావేశంలో ‘సారే జహాసే అచ్చా’ గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘దేశ ప్రజలను రెచ్చగొట్టేందుకే ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశంపై మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పాక్ ఆర్మీని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. కశ్మీర్‌పై ఆయన తీరు మార్చుకోవాలి. పాక్ ఆర్మీ ఇమ్రాన్ చెప్పినట్లు వ్యవహరిస్తోంది. కశ్మీర్ అంశంపై పూర్తిగా భారత్ అంతర్గత అంశం. దీనిలో ఏ దేశామూ జోక్యం చేసుకోరాదు’ అని అన్నారు. -
భారత్ దాడిచేస్తే మేం సిద్ధమే: ఇమ్రాన్
ఇస్లామాబాద్: తుదిశ్వాస వరకు కశ్మీరీలకు అండగా ఉంటా మని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చెప్పారు. కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని భారత్ రద్దు చేయడాన్ని నిరసిస్తూ కశ్మీరీలకు సంఘీభావంగా శుక్రవారం పాక్ వ్యాప్తంగా ర్యాలీలు జరిగాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ఇమ్రాన్ మాట్లాడారు. ‘పాకిస్తానీలు కష్టకాలంలో ఉన్న కశ్మీరీలకు మద్దతు తెలుపుతున్నారు. కశ్మీరీల బాధను పంచుకునేందుకు, పూర్తి స్థాయి మద్దతు తెలిపేందుకే నిరసనలు తెలుపుతున్నాం. తుదిశ్వాస వరకు కశ్మీరీల వెన్నంటే ఉంటాం. కశ్మీర్‌పై అంతర్జాతీయ సమాజం దృష్టిని మరల్చేందుకు భారత్ సైనిక చర్యకు దిగనుందని సమాచారం ఉంది. ఎలాంటి దురాక్రమణలనైనా నిలువరించేందుకు పాక్ ఆర్మీ సిద్ధంగా ఉంది’ అని ఇమ్రాన్ అన్నారు. -
సరిహద్దు శిబిరాలకు ఆర్మీ చీఫ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్‌తో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఆ దేశ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం శ్రీనగర్‌కు చేరుకున్నారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి సైనిక పోస్టులను సందర్శించారు. బలగాల కార్యాచరణ సన్నద్ధత, ముఖ్యంగా ఎల్వోసీ వెంట వాస్తవ పరిస్థితులపై సైనిక కమాండర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాదామీబాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో రాష్ట్రంలో అంతర్గత పరిస్థితులపైనా ఆయన సమీక్షించనున్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ఆర్మీ చీఫ్ రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఇలా ఉండగా, కశ్మీర్ లోయతోపాటు శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు విధించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మలయాళ మనోరమ న్యూస్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. -
కశ్మీర్‌పై మీ ఏడుపు ఆపండి
లేహ్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించడం పూర్తిగా భారతదేశ అంతర్గత విషయమని, ఈ విషయంలో పాకిస్తాన్‌కు సంబంధం లేదని, కశ్మీర్‌పై ఆ దేశం ఏడుపు ఆపాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాకిస్తాన్‌కు సూచించారు. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌కు ఒక విధానమంటూ లేదని, ఆ విషయంలో ఆ దేశం చేస్తున్న యాగీకి అంతర్జాతీయంగా ఏ దేశమూ మద్దతు ప్రకటించలేదని రక్షణ మంత్రి చెప్పారు. ‘నేను పాకిస్తాన్‌ను ప్రశ్నిస్తున్నా.. మీకేం సంబంధం ఉందని కశ్మీర్ విషయంలో రోదిస్తున్నారు? నిజానికి పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయిన ప్రాంతమే. మీకు నిజంగా ఆసక్తి ఉంటే, గిల్గిత్, బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై, అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడులపై రోదించండి’అని పాకిస్తాన్‌ని తీవ్రంగా విమర్శించారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుపై అంతర్జాతీయంగా మద్దతు సంపాదించాలని పాకిస్తాన్ చేసిన కుటిల ప్రయత్నాలను ఏ దేశమూ సమర్థించలేదని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ డీఆర్డీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కిసాన్–జవాన్ విజ్ఞాన్ మేళా’సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు చేస్తున్న పొరుగు దేశంతో చర్చలు అసాధ్యమని ఆయన చెప్పారు. భారత్ పాకిస్తాన్‌తో సత్సంబంధాలనే కోరుకుంటోంది. అయితే పాకిస్తాన్ మొదట ఉగ్రవాదులను భారత్‌లోకి చొప్పించడం మానుకోవాలి. కశ్మీర్‌పై మాట్లాడేముందు వారు పీవోకే, బలూ చిస్తాన్‌పై మాట్లాడాలి అని రాజ్‌నాథ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిత్, బలూచిస్తాన్ భారతదేశంలో భాగమేనంటూ 1994లో భారత పార్లమెంట్లో చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. -
కశ్మీరీలు చనిపోతున్నా.. పట్టించుకోరా!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు సగటు మానవుడు ఎంతో ఆసక్తి చూపుతున్నాడు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని కాంగ్రెస్‌తోపాటు పాటు విపక్ష పార్టీలు నెత్తీనోరు మొత్తుకుంటున్నాయి. దీనికి భిన్నంగా కశ్మీర్లో పరిస్థితులు అంతా సవ్యంగా ఉన్నాయని భారత ప్రభుత్వం, ఆర్మీ అధికారులు ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు విపక్షాల బృందం శనివారం కశ్మీర్‌కు బయలుదేరింది. కానీ వారిని మాత్రం కశ్మీర్లో అడుగుకూడా పెట్టనీయలేదు. దీంతో కశ్మీర్లో ప్రస్తుతం ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తన తల్లికి మెడిసిన్ కొనేందుకు కశ్మీర్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ వ్యక్తి మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిని బట్టి అక్కడి పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థంచేసుకోవచ్చు. కశ్మీర్ టూ ఢిల్లీ.. ‘‘బతుకుకు భరోసా కల్పిస్తామన్న భారత ప్రభుత్వమే మా బతుకులను చిదిమేస్తోంది. నా తల్లి డయాబెటిక్ బాధితురాలు. ప్రతి రోజు మందులు వాడటం తప్పనిసరి. కశ్మీర్లో ఆంక్షలు విధించినప్పటి నుంచి (ఆగస్ట్ 4) ఇక్కడ ముందులు లభించడంలేదు. ఓ రోజు మందులు పూర్తిగా అయిపోవడంతో కశ్మీర్ మొత్తం తిరిగాను. కానీ ఎక్కడా మందుల షాపులు లేవు. కొన్ని ఉన్నా.. వాటిలో సరైన మెడిసిన్ లభించడంలేదు. దీంతో ప్రభుత్వ అంబులెన్స్‌లో లిఫ్ట్ ద్వారా శ్రీనగర్ వెళ్లాను. అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. నా తల్లి ఆరోగ్యం విషమించే స్థాయికి చేరింది. దీంతో శ్రీనగర్ నుంచి ఢిల్లీ వచ్చి మందులు తీసుకుని వెళ్లాను. దేవుడి దయ వల్ల నా తల్లికి అప్పటికీ బతికే ఉంది. నా వద్ద సరిపడ డబ్బులు ఉన్నాయి కనుక నేను ఢిల్లీ వరకు వెళ్లగలిగాను. మరి పేదవాడి పరిస్థితి ఏంటి?. లోయలో సరైన వసతులు, ఆసుపత్రులు లేక చాలా మంది చనిపోతున్నారు. కనీసం వైద్యులు కూడాలేరు. అత్యవసర పరిస్థితి ఎదరురైతే ప్రభుత్వ రవాణ వ్యవస్థ కూడా లేదు. వైద్య వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీంతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆంక్షలను పూర్తిగా సండలించాలి’అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్‌లోని తాజా పరిస్థితులపై ఓ మెడికల్ షాప్ వ్యాపారి మాట్లాడుతూ.. ‘‘గత 20 రోజులుగా స్టాక్ రావట్లేదు. చాలామంది మందుల కోసం వచ్చి నిరాశగా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు’’ అని అన్నారు. మరికొంత మంది మాత్రం ఇక్కడి పరిస్థితుల కారణంగా తమ కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయారని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా.. కశ్మీర్లో పలుప్రాంతాల్లో రవాణా, టెలివ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటికీ లోయలో మాత్రం పరిస్థితి మారనట్లు తెలుస్తోంది. తాజాగా కశ్మీర్‌కు వెళ్లిన విపక్షాల బృందాన్ని తిరిగి వెనక్కి పంపడంతో పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ ఆ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అంతా బాగుంటే ముఖ్య నేతలను ఇంకా నిర్భందంలో ఎందుకు ఉంచుతున్నారని కశ్మీర్ మాజీ సీఎం గులాబ్‌నబీ అజాద్ ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టులో పీసీఐ పిటిషన్.. జమ్మూకశ్మీర్‌లో సమాచార వ్యవస్థపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ వేసిన పిటిషన్‌ను పరిశీలించాల్సిందిగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జర్నలిస్టులు తమ వృత్తిని నిర్వహించేందుకుగాను ఆంక్షలను ఎత్తివేయాల్సిందిగా ఆ పిటిషన్లో కోరారు. మీడి యా, దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆంక్షలు తొలగించేందుకు సహాయం చేయాలని పీసీఐ కోరింది. -
విపక్షాల పర్యటన.. కశ్మీర్లో ఉత్కంఠ!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఇంకా కొన్ని చోట్ల నిషేదాజ్ఞలు కొనసాగుతున్న వేళ విపక్షాల పర్యటన ఉత్కంఠకు దారితీస్తోంది. ఈ పరిణామం అక్కడి అధికారులను, సిబ్బందిని కలవర పెడుతోంది. విపక్షాల అగ్రనాయకుల పర్యటన శాంతి స్థాపనకు తీవ్ర విఘాతం కలిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు మరికొన్ని జాతీయ పార్టీల నేతలు నేడు కశ్మీర్లో పర్యటిస్తోన్న విషయం తెలిసిందే. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన అనంతరం అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోయలో పరిస్థితులు ప్రశాతంగా ఉన్నాయని, అవసమరయితే స్వయంగా తెలుసుకునేందుకు లోయలో పర్యటించాలని గతంలో గవర్నర్ సత్యపాల్ రాహుల్‌కు ఆహ్వానించారు. రాహుల్ గాంధీ అందుకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, డీఎంకేకు చెందిన విపక్ష లోయలో బృందం పర్యటించనుంది. ఈ బృందంలో రాహుల్ సహా గులాం నబీ ఆజాద్, కేసీ.వేణుగోపాల్, ఆనంద్ శర్మ, డి.రాజా, సీతారాం ఏచూరి, సహా ఇతర నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరింత ఇప్పటికే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నట్లు సమాచారం. అయితే కశ్మీర్లో పర్యటించేందుకు మాత్రం అక్కడి సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయం దాటి రావడానికి వీళ్లేదని తేల్చిచెప్పాయి. వారు పర్యటించే ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్‌ను అమలు చేశారు. కశ్మీర్ మాజీ సీఎం, సీనియర్ నేత గులాంనబీ అజాద్ ఇంటి ముందు భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. లోయలో వాతావరణం ప్రశాతంగా ఉంటే తమపై ఇన్ని ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. అమాయక కశ్మీరీ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు. మరోవైపు విపక్ష నేతల పర్యటనపై అధికార బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రశాతంగా ఉన్న కశ్మీర్లో అల్లర్లు సృష్టించేందుకే అక్కడ పర్యటిస్తున్నారని తీవ్ర స్థాయిలో విరుచుపడింది. మరోవైపు వీరి పర్యటన నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం.. లోయలో శాంతి, భద్రతల పునరుద్ధరణ కొనసాగుతున్న వేళ నాయకులు ఇక్కడ పర్యటించే ప్రయత్నం చెయ్యొద్దని కోరింది. అలాగే అనేక ప్రాంతాల్లో ఇంకా నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయని.. ఈ నేపథ్యంలో తాజా పర్యటన.. నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని ప్రకటించింది. శాంతి, భద్రతల పునరుద్ధరణకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యటనను రద్దు చేసుకోవాలని అధికారులు కోరారు. -
కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ పాతపాటే పాడారు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్–పాకిస్తాన్ల మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటించారు. ఫ్రాన్స్‌లోని బియార్రిట్జ్‌లో ఈ వారాంతంలో జరిగే జీ7 సదస్సు సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రధాని మోదీతో చర్చిస్తానని ట్రంప్ తెలిపారు. వాషింగ్టన్లో ట్రంప్ మాట్లాడుతూ.. ‘భారత్, పాకిస్తాన్లతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ప్రస్తుతం బాగోలేవు. కాబట్టి ఈ పరిస్థితిని చక్కదిద్దదేందుకు నా వల్ల వీలైనంతమేరకు ప్రయత్నిస్తాను. అవసరమైతే అందుకోసం మధ్యవర్తిత్వం చేస్తాను’ అని వెల్లడించారు. భారత్–పాక్‌ల మధ్య సంబంధాలు ప్రస్తుతం ఘోరంగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్రం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. అలాగే జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు(జమ్మూకశ్మీర్, లదాఖ్)గా విభజించింది. దీంతో భారత్–పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంపై ట్రంప్ ఈ మేరకు స్పష్టం చేశారు. కశ్మీర్ ద్వైపాక్షిక సమస్యనీ, ఇందులో మూడోపక్షం జోక్యాన్ని తాము సహించబోమని భారత్ ప్రకటించినప్పటికీ మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ చెప్పడం గమనార్హం. మరోవైపు తాలిబన్లతో చర్చలపై ట్రంప్ స్పందిస్తూ.. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు బలపడకుండా అమెరికా బలగాలు అక్కడే మరికొంతకాలం ఉంటాయని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం తాము తాలిబన్లతో చర్చలు జరుపుతున్నామనీ, గతంలో ఏ అధ్యక్షుడూ ఈ పనిని చేయలేకపోయారని వ్యాఖ్యానించారు. ద్వైపాక్షికమే: బ్రిటన్ ప్రధాని లండన్: జమ్మూకశ్మీర్ అన్నది భారత్–పాకిస్తాన్ల ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని బ్రిటన్ తెలిపింది. ఈ సమస్యను ఇరుదేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించింది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కశ్మీర్, ఉగ్రవాదం, లండన్‌లో భారత హైకమిషన్ దగ్గర విధ్వంసం సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బోరిస్ మాట్లాడుతూ..‘కశ్మీర్ సమస్యను భారత్–పాక్‌ల ద్వైపాక్షిక సమస్యగానే బ్రిటన్ గుర్తిస్తోంది. దీన్ని ఇరుదేశాలు చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి. భారత్–బ్రిటన్లు తమ భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవాల్సిన అవసరముంది’ అని తెలిపారు. ఉగ్రవాదమే పెనుముప్పు: మోదీ ఈ సందర్భంగా ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్‌తో పాటు యూరప్‌కు ప్రస్తుతం ఉగ్రవాదం పెనుముప్పుగా మారిందని తెలిపారు. ‘ఈ ఉగ్రభూతంపై పోరాడేందుకు మనం సమిష్టిగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే తీవ్రవాదం, హింస అసహనం పెచ్చరిల్లకుండా, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్) వంటి ఉగ్రవాద సంస్థలు మన గడ్డపై అడుగుపెట్టకుండా నిలువరించగలం’ అని ప్రధాని తెలిపారు. ఫ్రాన్స్‌లో జరిగే జీ7 సదస్సు సందర్భంగా మోదీ, బోరిస్ కలుసుకోనున్నారు. -
కశ్మీర్‌పై ఐసీజేకి వెళ్తాం: పాక్
ఇస్లామాబాద్/జమ్మూ/శ్రీశ్రీనగర్: కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పాక్ తెలిపింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విదేశాంగ మంత్రి ఖురేషి తెలిపారు. కశ్మీర్ అంశాన్ని అన్ని అంతర్జాతీయ వేదికలపైనా ప్రస్తావించడంతో పాటు, ఐసీజేలోనూ పిటిషన్ వేస్తామని ఆగస్టు 6వ తేదీన జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రధాని ఇమ్రాన్ ఇటీవల చెప్పారు. పాక్ కాల్పుల్లో భారత జవాను మృతి నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాలు, భారత ఆర్మీ పోస్టులే లక్ష్యంగా పాక్ బలగాలు మరోసారి కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్ జిల్లాలో జరిపిన కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను మరణించగా, నలుగురు పౌరులు గాయపడ్డారు. భారత బలగాలు జరిపిన కాల్పుల్లో పాక్ ఆర్మీకి భారీ నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. సరిహద్దు వెంబడి కృష్ణా ఘటి, మెందర్ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం పాకిస్తాన్ బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో బిహార్‌కు చెందిన రవిరంజన్ సింగ్ (36) మరణించగా నలుగురు పౌరులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాగా, బాలాకోట్ దాడుల సమయంలో పాక్ విమానాలను మిగ్–21తో ఎంతో ధైర్యంగా తరుముకుంటూ వెళ్లిన ఐఏఎఫ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను చిత్రహింసలు పెట్టిన పాక్ కమాండో అహ్మద్ ఖాన్.. భారత సైన్యం కాల్పుల్లో హతమైనట్లు సమాచారం. ఆగస్టు 17వ తేదీన భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుం డగా నక్యాల్ సెక్టార్లో సైన్యం జరిపిన కాల్పుల్లో అహ్మద్ ఖాన్ మరణించినట్లు సమాచారం. మిగ్ 21 జెట్ విమానాన్ని కూల్చేయడంతో తప్పించుకున్న అభినందన్‌ను పాక్ సైన్యం పట్టుకున్న విషయం తెలిసిందే. కాగా, జమ్మూ కశ్మీర్లో క్రమంగా ప్రశాంత వాతావరణం నెలకొంటోంది. దాదాపు 15 రోజుల తర్వాత మంగళవారం శ్రీనగర్‌లో వాణిజ్య కేంద్రం లాల్ చౌక్ వద్ద బారికేడ్లను పోలీసులు తొలగించారు. పలు ప్రాంతాల్లో ఆంక్షలను సడలించారు. శాంతి భద్రతల దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో భద్రతా బలగాల మోహరింపు కొనసాగుతోంది. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. కశ్మీర్లోకి ప్రవేశించేందుకు యత్నించిన కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్‌ను జమ్మూ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అడ్డుకుని తిరిగి ఢిల్లీకి పంపేశారు. -
‘తపాలా కార్యాలయంలేని ఓ దేశం’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ది కంట్రీ వితౌవుట్ ఏ పోస్టాఫీస్ (తపాలా కార్యాలయం లేని ఓ దేశం)’ అంటూ అమెరికాలో నివసించిన కశ్మీరీ కవి ఆఘా షాహిద్ అలీ 1997లో ఓ కవిత రాశారు. 1990లో కశ్మీర్లో మిలిటెన్సీ తారా స్థాయికి చేరుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఏడు నెలల పాటు తపాలా సేవలను నిలిపివేశారు. అప్పుడు పోస్టాఫీసుల్లో గుట్టలు గుట్టలుగా ఉత్తరాలు, పార్సళ్లు పేరుకు పోయాయి. ఆ పరిస్థితిని దష్టిలో పెట్టుకొన ఆయన ఈ కవిత రాశారు. ఆ తర్వాత 2001లో ఆయన మరణించారు. అయితే ఆయన రాసిన ఆ కవితా ఇప్పటికీ బతికే ఉంది. ఇప్పుడు కూడా కశ్మీర్లో అదే పరిస్థితి ఏర్పడింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోకి 370వ అధికరణాన్ని ఎత్తివేస్తూ, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీ నుంచి ఆ రాష్ట్రంలో టెలిఫోన్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలను నిలిపివేసినప్పుడే తపాలా సేవలను కూడా నిలిపివేశారు. ఈ విషయం అంతగా దేశం దష్టికి రాలేదు. ఇప్పటికి కూడా కశ్మీర్లో తపాలా సేవలకు ఇంకా పునరుద్ధరించలేదు. మిగతా సర్వీసులను ఇప్పటికే పాక్షికంగానైనా పునరుద్ధరించారు. దీంతో ఇప్పటి కశ్మీరీ పరిస్థితికి ‘ది కంట్రీ వితౌవుట్ ఏ పోస్టాఫీస్’ పేరిట నాడు షాహిద్ అలీ రాసిన కవితా పంక్తులను ప్రముఖ కర్ణాటక çసంగీత విద్వాంసుడు టిఏం కష్ణ గుర్తు చేశారు. ఒకప్పుడు తాను చదివిన ఆ కవితా పంక్తులను గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాకు విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కశ్మీర్‌కు ఎలాంటి ఉత్తరాలుగానీ పార్సళ్లుగానీ బట్వాడా చేయరాదంటూ కేంద్రం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు ఢిల్లీలోని తపాలా విభాగానికి చెందిన డాక్ భవన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు. శ్రీనగర్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన తపాలా విభాగానికి కశ్మీర్ రాష్ట్రవ్యాప్తంగా 1965 తపాలా కార్యాలయాలు ఉన్నాయి. టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యాలు పెరిగిన నేటి పరిస్థితుల్లో ప్రజలు తపాలా సేవలు ఉపయోగించుకోవడం తగ్గుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వ పథకాలకు మాత్రం ఈ సేవలు ఇప్పటికీ ఎంతగానో ఉపయోగ పడుతున్నాయి. -
వివాదాస్పద ట్వీట్ : బీఎస్ఎన్ఎల్ అధికారులపై వేటు
వేర్పాటువాద నాయకుడు (91) సయ్యద్ అలీషా గిలానీ ట్వీట్ వివాదం నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులపై వేటు పడింది. 370 ఆర్టికల్ రద్దు అనంతరం తీవ్రమైన ఆంక్షల మధ్య, గిలానీ ట్వీట్ చేయడం కలకలం రేపింది. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు బీఎస్ఎన్ఎల్కు చెందిన ఇద్దరు అధికారులు గిలానీకి సహకరించినట్టుగా తేల్చారు. దీంతో ఇద్దరినీ విధులనుంచి సస్సెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు అనంతరం కేంద్రం అక్కడ అన్నిరకాల సమాచార వ్వవస్థలను స్తంభింప చేసింది. ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370 రద్దును ప్రకటించక ముందునుంచే (ఆగస్టు, 4) మొత్తం రాష్ట్రంలో ల్యాండ్లైన్లతో సహా, అన్ని కమ్యూనికేషన్ సౌకర్యాన్ని రద్దు చేసినప్పటీకీ, అలీషా గీలానీ కొన్ని ట్వీట్లు చేయడం దుమారం రేపింది. ఆగస్టు 8 ఉదయం వరకు ఆయనకు ల్యాండ్‌లైన్ ఫోన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎలా అందుబాటులోకి వచ్చిందన్నది చర్చనీయాంశమైంది. ఆయన ట్వీట్లు రెచ్చగొట్టేవిగా ఉన్నాయంటూ ట్విటర్ ఖాతాను నిలిపి వేసింది. కాగా 370, 35 ఏ అధికరణలు రద్దు అనంతరం కశ్మీర్లో అగ్ర రాజకీయ నాయకులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఫరూక్ అబ్దుల్లా సహా వందలాది మందిని గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. -
ఆర్మీపై కామెంట్: కశ్మీరీ యువతిపై క్రిమినల్ కేసు
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారత ఆర్మీ దళాలు కశ్మీరీలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయంటూ విద్యార్థిని నాయకురాలు, స్థానిక యువతి షెహ్లా రషీద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై భారత ఆర్మీ తీవ్రంగా స్పందించింది. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని, కశ్మీర్లో పరిస్థితులు పూర్తిగా ప్రశాంతంగా ఉన్నాయని స్పష్టంచేసింది. షెహ్లా వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపింది. అయితే భారత ఆర్మీపై ఆమె చేసిన పోస్ట్ వివాదంగా మారడంతో ప్రముఖ న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ సుప్రీకోర్టులో క్రిమినల్ కేసును నమోదు చేశారు. భారత ప్రభుత్వంపై, ఆర్మీపై నిరూపణలేని ఆరోపణలు చేశారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కశ్మీర్ మూవ్మెంట్ నాయకురాలైన షెహ్లా రషీద్ కశ్మీర్ విభజనపై సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఆమె కశ్మీర్లో ఆర్మీ అధికారులను ప్రజలను చిత్రహింసలను గురిచేస్తున్నారని ఆరోపించారు. యువకులను అర్థరాత్రి సమయంలో ఇంట్లో నుంచి బలవంతగా తీసుకెళ్తున్నారని, పలువురిని గృహనిర్భందానికి గురిచేస్తున్నారని పోస్ట్ చేశారు. 9) Armed forces are entering houses at night, picking up boys, ransacking houses, deliberately spilling rations on the floor, mixing oil with rice, etc. — Shehla Rashid شہلا رشید (@Shehla_Rashid) August 18, 2019 -
భారత్ మాపై దాడి చేయొచ్చు: పాక్
ఇస్లామాబాద్: కశ్మీర్ సమస్య నుంచి అంతర్జాతీయ సమాజం దృష్టిని మళ్లించేందుకు భారత్ తమపై దాడిచేసే అవకాశముందని పాకిస్తాన్ ప్రకటించింది. భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా దీటుగా తిప్పికొడతామని హెచ్చరించింది. మొదటగా అణ్వాయుధాలను ప్రయోగించరాదన్న విధానానికి కట్టుబడి ఉన్నామనీ, అయితే భవిష్యత్తు పరిస్థితుల దృష్ట్యా ఇది మారవచ్చని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఈ మేరకు స్పందించింది. పాక్ విదేశాంగ మంత్రి, ఆర్మీ ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ శనివారం సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ..‘భారత్ ఎలాంటి దాడిచేసినా తిప్పికొట్టేందుకు ఎల్వోసీ వెంట పాక్ బలగాలను సిద్ధంగా ఉంచాం’అని తెలిపారు. ‘కశ్మీర్ సెల్’ ఏర్పాటు అణ్వాయుధాల ప్రయోగంపై రాజ్‌నాథ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ విమర్శించారు. ‘భారత్–పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో రాజ్‌నాథ్ ఈ ప్రకటన చేయడం నిజంగా దురదృష్టకరం. భారత్ యుద్ధోన్మాదంతో ఉందనడానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. పాక్ విదేశాంగ శాఖలో కశ్మీర్ విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా, సమాచారాన్ని చేరవేసేందుకు రాయబారుల్ని నియమిస్తాం’అని ఖురేషీ చెప్పారు. -
కశ్మీర్‌పై నాడు పాకిస్తాన్.. నేడు చైనా
న్యూయార్క్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. చైనా అభ్యర్థన మేరకు శుక్రవారం నాడు రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు భద్రతా మండలి తెలిపింది. కాగా ఓ అంశంపై రహస్య పద్దతిలో (గోప్యంగా) సమావేశాన్ని నిర్వహించడం 55 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ఫిర్యాదుపై స్పందించిన యూఎన్ఎస్సీ 1965లో తొలిసారి ఇలా రహస్య సమావేశాన్ని నిర్వహించింది. తాజాగా చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఐరాసలో బహిరంగ చర్చను నిర్వహింపజేయడంలో పాక్ విఫలమైనట్లయింది. కశ్మీర్ అంశంపై భద్రతా మండలి చర్చించడం చాలా అరుదని యూఎన్ఎస్సీ పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై పాకిస్తాన్, చైనా ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక బృందం నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నట్లు యూఎన్ఎస్సీ అధ్యక్షుడు జోనా రోనెకా తెలిపారు. మరోవైపు కశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో తాను ప్రతినిధిగా వ్యవహరిస్తానని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇదివరకే వ్యాఖ్యానించారు. దీనిపై చైనా మద్దతును కూడా ఆయన కోరారు. కాగా కశ్మీర్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై స్పందించాల్సిందిగా పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ‘ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానాలు ఐక్యరాజ్యసమితి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్ అక్రమ చర్యలకు పాల్పడుతోందని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై ప్రత్యేక సమావేశం జరపాల్సిందిగా’ కోరుతున్నాం అని పాక్ యూఎన్ఓకి రాసిన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని చైనా యూఎన్ఎస్సీ అధ్యక్షుడితో చర్చించిన క్రమంలో శుక్రవారం భేటీ జరుగనుంది. కాగా ఇటీవల చైనాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. అయితే ఈ రహస్య సమావేశం ద్వారా పాక్‌కు ఏమాత్రం ప్రయోజనం కలిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నేడు ఐరాస రహస్య చర్చలు
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని శుక్రవారం ఉదయం గోప్యంగా నిర్వహించనున్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఐరాసలో బహిరంగ చర్చను నిర్వహింపజేయడంలో పాక్ విఫలమైనట్లయింది. భద్రతా మండలికి ప్రస్తుతం రొటేషన్ పద్ధతిలో చీఫ్‌గా ఉన్న పోలండ్ అంశంపై ఉదయం పది గంటలకు చర్చ నిర్వహించేలా లిస్టింగ్ చేసిందని వారు చెప్పారు. కశ్మీర్ అంశంపై భద్రతా మండలి చర్చించడం చాలా అరుదన్నారు. -
‘పరిమితం’.. దేశహితం
ఎర్రకోటలో ఆరోసారి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం జనాభా పెరిగితే రాబోయే తరాలకు లెక్కలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభా విస్ఫోటనాన్ని నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలూ చర్యలు చేపట్టాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. ఇప్పటికే దేశంలో కొంత భాగం ప్రజలు చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. దీన్ని అనేక మంది వ్యతిరేకించినా.. దేశ ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు. కశ్మీరీల కలలకు రెక్కలు జమ్మూకశ్మీర్ అంశంలో కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయించదు. ‘సీడీఎస్’ రూపకల్పన.. త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి సైనిక, వాయుసేన, నౌకాదళానికి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది. దేశంలోనే విహారం ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 75వ స్వాతంత్య్ర దినోత్సవం వచ్చే నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీంతో దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం అభివృద్ధి చెందుతుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ఒక దేశం, ఒక ఎన్నిక అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి. న్యూఢిల్లీ దేశం ఎదుర్కొంటున్న వేలాది సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పుడు భారత్‌కు ఎంతో బలమైన ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి వరుసగా ఆరోసారి, 73వ స్వాతంత్య్ర దినోత్సవాన ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. రంగురంగుల తలపాగాతో గురువారం వేదిక మీదకు వచ్చిన మోదీ.. త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం ఆ మూడింటికీ కలిపి కొత్తగా ఒక అధిపతిని (చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్టాఫ్ – సీడీఎస్) నియమించడం, దేశంలో జనాభా విస్ఫోటనాన్ని అరికట్టడం, జమ్మూ కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం తదితర అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. దేశంలోని ప్రతి ఇంటికీ పైపుల ద్వారా నీరు అందించేందుకు తమ ప్రభుత్వం రాబోయే కొన్నేళ్లలో రూ. 3.5 లక్షల కోట్లను ఖర్చు చేయనుందని మోదీ చెప్పారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న నేపథ్యంలో, రాబోయే ఐదేళ్లలో ఏకంగా వంద లక్షల కోట్ల రూపాయలను మౌలిక వసతుల రంగంలో పెట్టి, ఆర్థిక వ్యవస్థ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ వెల్లడించారు. ఒక దేశం, ఒకే కార్డు వ్యవస్థతో ఒకే కార్డుతో దేశంలో ఎక్కడైనా ప్రయాణాలకు చెల్లింపులు చేసే వ్యవస్థను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. దాదాపు 95 నిమిషాల పాటు, సుదీర్ఘంగా సాగిన మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... జనాభాను నియంత్రించాల్సిందే.. ‘జనాభా పెరిగితే రాబోయే తరాల వారికి లెక్కపెట్టలేనన్ని సమస్యలు, సవాళ్లు ఎదురవుతాయి. జనాభాను నియంత్రించేందుకు కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశం నేరుగా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటైన జనాభా విస్ఫోటన సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిన సమయం వచ్చింది. కుటుంబాలు చిన్నగా ఉండాలి. ఒక్కో కుటుంబంలో మనుషులు ఎక్కువగా ఉంటే వారికి సరైన విద్య, వైద్య సౌకర్యాలు అందవు. వారి ఇళ్లతోపాటు మొత్తంగా దేశం కూడా సంతోషంగా ఉండదు. ఇప్పటికే దేశంలో కొంత భాగం మంది ప్రజలు జనాభాను తగ్గించుకుని, చిన్న కుటుంబాలుగా ఉంటూ సుఖంగా జీవిస్తున్నారు. వారిని చూసి మిగతా వారు నేర్చుకోవాలి. ఈ నిర్ణయాన్ని అనేక మంది వ్యతిరేకించినా సరే, దేశ, ప్రజలకు మంచి భవిష్యత్తును అందివ్వడం కోసం ఇది తప్పదు’. ‘సీడీఎస్’విధివిధానాలను రూపొందిస్తున్నాం ‘త్రివిధ దళాలకు కలిపి కొత్తగా ఓ అధిపతిని నియమిస్తాం. సీడీఎస్ (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా నియమితులయ్యే వ్యక్తి ఆర్మీ, వాయుసేన, నౌకాదళం.. మూడింటికి కలిపి సంయుక్త అధిపతిగా ఉంటారు. త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని మరింత పెంచడం కోసం సీడీఎస్‌ను నియమించాల్సిన సమయం వచ్చింది. సీడీఎస్ నియామక విధి విధానాలను మా ప్రభుత్వం ఇంకా రూపొందిస్తోంది’అని మోదీ చెప్పారు. ప్రస్తుత విధానంలో త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం మూడు సేనల చీఫ్‌ల కమిటీ (చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ–సీవోఎస్సీ) ఉంది. ఆ ముగ్గురు అధిపతుల్లో ఎవరు అత్యంత సీనియర్ అయితే వారు సీవోఎస్సీ చైర్మన్‌గా ఉంటారు. కొత్తగా నియమితులయ్యే సీడీఎస్ త్రివిధ దళాల మధ్య సమన్వయం కోసం కృషి చేయడంతోపాటు ప్రధాని, రక్షణ మంత్రులకు సైనిక సలహాదారుగానూ ఉంటారు. కశ్మీరీల కలలకు కొత్త రెక్కలు ఇవ్వాలి ‘జమ్మూ కశ్మీర్ అంశంలో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం, భావం లేదు. కేవలం ప్రజలు అప్పజెప్పిన బాధ్యతను పూర్తి చేశా. జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చాల్సిన, వారి కలలకు కొత్త రెక్కలను ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. 370వ అధికరణం రద్దవ్వడంతో ఇప్పుడు భారత్ ఒక దేశం, ఒకే రాజ్యాంగంగా మారింది. సాహసోపేత, పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి మా ప్రభుత్వం సంశయిం చదు. ఆర్టికల్ 370పై గత 70 ఏళ్లలో చేయలేని దానిని మేము ఇప్పుడు చేసి చూపించాం’ దేశంలోనే విహారయాత్రలకు వెళ్లండి.. ‘ఏడాదికి దాదాపు 2 కోట్ల మంది భారతీయులు విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. వారంతా 2022 నాటికి దేశంలోనే కనీసం 15 పర్యాటక కేంద్రాలను సందర్శించాలి. దీనివల్ల దేశీయంగా పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభించి దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం విదేశాల్లో మాదిరిగా దేశంలోని పర్యాటక కేంద్రాల్లో చాలా మంచి హోటళ్లు ఉండకపోవచ్చు. కానీ, ప్రజలు వెళ్లడం మొదలుపెడితే వాటంతట అవే వస్తాయి. దేశం గొప్పగా మారాలంటే తప్పదు.. ‘దేశం గొప్పగా మార్చేందుకు లోక్‌సభతోపాటు అన్ని శాసనసభలకూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి. ప్రస్తుతం జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుండటం శుభపరిణామం. ‘ఒక దేశం, ఒక ఎన్నిక’ అంశంపై అన్ని భాగస్వామ్య పక్షాల్లో చర్చలు జరగాలి’అని మోదీ అన్నారు. అయితే రాజ్యాంగం మార్చకుండానే జమిలి ఎన్నికలు అసాధ్యమని న్యాయ కమిషన్ గతేడాది ఆగస్టులోనే తేల్చి చెప్పడం తెలిసిందే. ఆరేళ్లు.. ఆరు తలపాగాలు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలప్పుడు ప్రసంగం చేసే సమయంలో వైవిధ్యమైన తలపాగాలు ధరించడం మోదీ ప్రత్యేకత. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రసంగం చేసే సమయంలోనూ మోదీ ఆ ప్రత్యేకతను చాటుకున్నారు. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ రంగులున్న తలపాగాను, సగం వరకే చేతులున్న తెల్ల కుర్తా, పైజామా, కాషాయ రంగు అంచులున్న కండువాను ధరించి మోదీ వేదికపైకి వచ్చారు. 2014లో తొలిసారి ఎర్రకోటపై నుంచి ప్రసంగించినప్పుడు మోదీ తల భాగం ఎర్రగా, తోక భాగం ఆకుపచ్చ జోధ్‌పురీ తలపాగా పెట్టుకున్నారు. 2015లో పసుపు రంగు వస్త్రంపై ఎరుపు, ముదురు ఆకుపచ్చ రంగు గీతలున్న తలపాగాను, 2016లో పసుపు, గులాబీ రంగు తలపాగాను మోదీ ధరించారు. 2017లో దట్టమైన ఎరుపు, పసుపు రంగులపై బంగారు వర్ణం గీతలున్న తలపాగాను, 2018లో కాషాయ తలపాగాతో మోదీ ఎర్రకోటపైకి వచ్చారు. ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా.. 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమం ఎర్రకోటలో ఆహ్లాద వాతావరణంలో ఉత్సాహంగా సాగింది. మోదీ ఎర్రకోటకు చేరుకుని తిరిగి వెళ్లే వరకూ కార్యక్రమం జరిగిన తీరు ఇలా... ► చారిత్రక కోట వద్దకు ప్రధాని చేరుకోగానే సందర్శకులంతా లేచి నిలబడ్డారు. ► కార్యక్రమానికి నరేంద్ర మోదీ తెల్లని పైజామా–కుర్తా, రాజస్తానీ తరహా రంగురంగుల తలపాగా ధరించి వచ్చారు. ► రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మోదీకి స్వాగతం పలికారు. ► తర్వాత మోదీ ఇంటర్ సర్వీసెస్, పోలీస్గార్డ్ల వందనం స్వీకరించారు ► అనంతరం ప్రధాని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ► తర్వాత మోదీ జాతిని ఉద్దేశించి 95 నిమిషాల పాటు ప్రసంగించారు. వరుసగా ఆరోసారి బుల్లెట్ ప్రూఫ్ పోడియం రక్షణ లేకుండా ప్రసంగించారు. ► ఈ కార్యక్రమానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, రమేశ్ పోఖ్రియాల్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ త్రివిధ దళాధిపతులు బిపిన్ రావత్, బి.ఎస్. ధనోవా, కర్మబీర్ సింగ్ హాజరయ్యారు. ► ఎర్రకోట ముందు వేలాది మంది పాఠశాల పిల్లలు ’నయా భారత్’ అనే హిందీ అక్షరాల ఆకారంలో నిలబడ్డారు. ► తెల్లవారుజామున కురిసిన వర్షం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చింది. అమరవీరులకు సలాం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్దనున్న అమర్‌జవాన్ జ్యోతి వద్ద నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి కోవింద్ వందనం ఆసేతు హిమాచలం జమ్మూలో జరిగిన స్వాతంత్య్రదిన వేడుకల్లో అలరించిన పాఠశాల విద్యార్థుల ప్రదర్శన భారీ త్రివర్ణం ముంబైలోని హిరానందాని గార్డెన్స్‌లో భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్న ప్రజలు తల్లీ భారతి వందనం మహారాష్ట్ర కొల్హాపూర్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి జెండా వందనం చేస్తున్న నటి ఊర్మిళ మతోండ్కర్ -
కశ్మీరీలకు భారీ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు అత్యంత భారీ ప్రయోజనాలను పొందుతారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. మిగతా దేశ పౌరులంతా ఏయే హక్కులు, ప్రయోజనాలు, సౌకర్యాలను పొందుతున్నారో.. ఆ లాభాలను ఇకపై జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజలు కూడా పొందగలరని కోవింద్ అన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన చట్టం తదితరాలు జమ్మూ కశ్మీర్‌లోని ఆడబిడ్డలకు కూడా న్యాయం అందిస్తాయని కోవింద్ తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఉన్న 370వ అధికరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పది రోజుల క్రితమే తొలగించి, జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ సహిత కేంద్రపాలిత ప్రాంతంగాను, లదాఖ్‌ను ఆ రాష్ట్రం నుంచి విడదీసి అసెంబ్లీ రహిత కేంద్రపాలిత ప్రాంతంగాను మార్చాలని ప్రతిపాదించడం తెలిసిందే. దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 నుంచి ఈ కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఉనికిలోకి వస్తాయి. స్వాతంత్య్రమంటే అధికార మార్పిడి కాదు.. స్వాతంత్య్రం కోసం పోరాడిన పాత తరాన్ని కోవింద్ గుర్తు చేసుకుంటూ ‘స్వాతంత్య్రమంటే కేవలం అధికార మార్పిడేనని పెద్దలు అనుకోలేదు. జాతి నిర్మాణమనే సుదీర్ఘ, విస్తృత ప్రక్రియలో అదో మెట్టు మాత్రమేనని ఆ మహోన్నత వ్యక్తులు భావించారు. ప్రతీ వ్యక్తి, ప్రతీ కుటుంబం.. అలా మొత్తంగా సమాజ జీవితం బాగుండాలనేది వారి ఆశయం’ అని అన్నారు. ఒకరి జీవన విధానాన్ని లేదా పద్ధతులను చాలా తక్కువ సందర్భాల్లోనే భారత్ వేలెత్తి చూపిందనీ, ఇక్కడ అంతా అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ, ‘మనం బతుకుదాం, ఇతరులను బతకనిద్దాం’ అనే సూత్రాన్ని అనుసరిస్తారన్నారు. అత్యంత దుర్బలమైన వ్యక్తుల గొంతుకను వినగలిగే సామర్థ్యాన్ని భారత్ ఎన్నటికీ కోల్పోదని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలను కోవింద్ అభినందిస్తూ, ప్రతీ ఎన్నిక ఓ కొత్త ప్రారంభాన్ని తెస్తుందని, భారత ప్రజల ఉమ్మడి ఆశలకు ఊపిరి పోస్తుందని అన్నారు. -
కశ్మీర్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి చాలా సున్నితమైందని, అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేలా కేంద్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్రం ఆ రాష్ట్రంపై విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ విషయమై కేంద్రానికి ఆదేశాలు జారీ చేసేందుకు నిరాకరించింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌పై పలు ఆంక్షలు విధించి, దూకుడుగా వ్యవహరించిందంటూ కాంగ్రెస్ నేత తెహ్సీన్ పూనావాలా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ‘రాష్ట్రంలో పరిస్థితులపై జిల్లాల మేజిస్ట్రేట్ల నుంచి ప్రభుత్వం రోజువారీ వాస్తవ నివేదికలను తీసుకుని సమీక్షిస్తోంది. తదనుగుణంగా ఆంక్షల సడలింపు చేపడుతోంది’అని తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం ‘కశ్మీర్ చాలా సున్నితమైన అంశం. అక్కడ రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవు. ఆ రాష్ట్రంలో వాస్తవంగా ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. కానీ, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఒకవేళ ఏదైనా జరిగితే అందుకు కేంద్రానిదే బాధ్యత అవుతుంది. అందుకే సాధారణ పరిస్థితులు నెలకొన్నాక రెండు వారాల అనంతరం ఈ పిటిషన్‌ను విచారిస్తాం’అని తెలిపింది. వాదనల సందర్భంగా పిటిషనర్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘రాష్ట్రంలో సమాచార, ప్రసార వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. అక్కడ మోహరించిన సైనికులకు కూడా తమ కుటుంబసభ్యులతో ఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం లేకుండా చేశారు’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది మేనకా గురుస్వామి తెలపగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు కనీసం ఆస్పత్రులు, విద్యాసంస్థలు, పోలీస్స్టేషన్లకు కూడా వెళ్లేందుకు అవకాశం లేకుండాపోతోందని, వారి హక్కులకు భంగం కలుగు తోందంటూ న్యాయవాది గురుస్వామి పేర్కొనగా ఆధారాలుంటే చూపించాలని బెంచ్ కోరింది. ‘తీవ్రతను అర్థం చేసుకోకుండా, వాస ్తవాలు తెలియకుండా చాలా నిర్లక్ష్యంగా, ఆషామాషీగా ఈ పిటిషన్ వేసినట్లు కనిపిస్తోంది’ అని అంది. -
కశ్మీర్‌పై వైగో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై ఎండీఎంకే చీఫ్, ఎంపీ వైగో (వి.గోపాలసామి) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వందవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి కశ్మీర్ భారత్‌లో భాగంగా ఉండదని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘భారత్ వందవ స్వాతంత్ర్య దినోత్సవం జరుగుపుకునే సమయానికి భారత్‌లో కశ్మీర్ భాగంగా ఉండదు. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌పై బురద చల్లింది. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కశ్మీర్‌కు 30 శాతం అన్యాయం చేస్తే.. బీజేపీ 70 శాతం చేసింది. కశ్మీర్‌పై గతంలో కూడా నా అభిప్రాయం ఇదే విధంగా చెప్పాను’అని అన్నారు. కాగా కశ్మీర్ విభజన సందర్భంగా పార్లమెంట్లో వైగో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిందం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. కాగా డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై 110 జయంత్యుత్సవాలను తమ పార్టీ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే నెలలో ఈ వేడుకలను ప్రారంభిస్తామని చెప్పారు. -
‘యావత్ పాకిస్తాన్ మీకు అండగా ఉంటుంది’
కరాచీ: జమ్మూ కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ క్రికెట్ కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ స్పందించాడు. ఇది కశ్మీరీ సోదరులకు కష్ట కాలంగా సర్పరాజ్ అభివర్ణించాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించేందుకు కశ్మీరీలకు అల్లా సాయం చేయాలని తాను ప్రార్థించినట్లు తెలిపాడు. ‘ కశ్మీరీ సోదరులారా.. బాధను, కష్టాలను సమానంగా పంచుకుందాం. యావత్ పాకిస్తాన్ మీకు అండగా ఉంటుంది’ అని సర్పరాజ్ అహ్మద్ పేర్కొన్నాడు. కరాచీలో ఈద్ ప్రార్థనలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన సర్పరాజ్ ఆర్టికల్ 370 రద్దుపై పైవిధంగా స్పందించాడు. అంతకుముందు పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది సైతం ఆర్టికల్ 370 రద్దుపై విమర్శలు గుప్పించాడు. ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. అసలు ఐరాసను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంత జరుగుతున్నా ఎందుకలా నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఐరాస ఎందుకు స్పందించట్లేదు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి’ అంటూ అఫ్రిది మండిపడ్డాడు. -
ఢిల్లీ–లాహోర్ బస్సు రద్దు
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం లాహోర్–ఢిల్లీ బస్ సర్వీసులను పాక్ రద్దు చేసిన నేపథ్యంలో, భారత్ కూడా ఢిల్లీ–లాహోర్ బస్ సర్వీసును రద్దు చేసిందని ప్రజారవాణా సీనియర్ అధికారి తెలిపారు. ఈ బస్సు సోమవారం ఉదయం 6 గంటలకు లాహోర్‌కు వెళ్లాల్సి ఉండగా ప్రస్తుతం రద్దు అయింది. తమ దేశం నుంచి వస్తున్న బస్ సర్వీసులన్నీ సోమవారం నుంచి నిలిచిపోతాయని శనివారమే పాక్ స్పష్టం చేసింది. 1999 ఫిబ్రవరిలో ఈ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. -
సోదరుడిని కలవనివ్వండి: కశ్మీరీ యువతి ఆవేదన
శ్రీనగర్: గత వారం రోజులుగా బయటి ప్రపంచంతో కశ్మీరీలకు సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. దీంతో కశ్మీరీలకు ఊరనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులపై విధించిన ఆంక్షలను పాక్షికంగా సడలించింది. సోమవారం నాటి ప్రార్థనలను దృష్టిలో పెట్టుకుని.. ఆంక్షల సడలింపు నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370 తొలగింపు, రాష్ట్ర విభజన నేపథ్యంలో కశ్మీర్లో కేంద్రం కర్ఫ్యూ విధించింది. ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఫోన్ సర్వీసులు పనిచేస్తున్నప్పటికీ సరిహద్దు ప్రాంతాల్లో మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ వారంలో బక్రీద్, రాఖీ పౌర్ణమి ఉన్న నేపథ్యంలో కర్ఫ్యూ ని ఎత్తివేసి, ఇంటర్నెట్, ఫోన్ సర్వీసులను పునరుద్దరించాలని ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం ఓ కశ్మీరీ యువతి అక్కడున్న ఇబ్బందికర పరిస్థితులను గ్రీవెన్స్‌లో వ్యక్తం చేసింది. ‘మా ప్రాంతంలో కనీసం ఇంటర్నెట్, ఫోన్ సర్వీసు కూడా లేదు. మా కుంటుంబ సభ్యులతో మాట్లాడక వారం గడుస్తోంది. ఈనెల 15న రాఖీ సందర్భంగా మా సోదరుడుని కలవాలి. దయచేసి ఆంక్షల నుంచి మాకు విముక్తి కల్పించండి’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా పలుప్రాంతాల్లో ముస్లింల ప్రార్థనలపై ఆంక్షలను పాక్షికంగా సడలించిన విషయం తెలిసిందే. బక్రీద్ పర్యదినాన్ని పురస్కరించుకుని సోమవారం పెద్ద ఎత్తున ప్రార్థనలో పాల్గొననున్నారు. నగరంలోని ప్రధానమైన జమా మసీదు తెరవకపోయినప్పటికీ.. చిన్న చిన్న మసీదుల్లో ప్రార్థనలకు అనుమతిచ్చారు. ప్రార్థనలపై ఎలాంటి ఆంక్షలు లేవని ఆర్మీ అధికారులు తెలిపారు. -
ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తాం
సాక్షి, చెన్నై: కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కశ్మీర్ అభివృద్ధి, సంక్షేమంపై ఇక పూర్తి స్థాయిలో కేంద్రం దృష్టి పెడుతుందని ఆయన చెప్పారు. ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి రెండేళ్ల పయనంలో సాగిన పర్యటనలు, సందేశాలు, ఉపదేశాలు, కార్యక్రమాలతో కూడిన ‘లిజనింగ్ లెర్నింగ్ లీడింగ్’ పుస్తకావిష్కరణ ఆదివారం చెన్నైలో జరిగింది. సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నేతృత్వంలో రూపొందించిన ఈ పుస్తకాన్ని అమిత్‌షా ఆవిష్కరించారు. తొలి ప్రతిని వెంకయ్య అందుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఉపరాష్ట్రపతి స్థాయి వరకు వెంకయ్య చేసిన రాజకీయ, ప్రజాసేవ గురించి అమిత్ షా వివరించారు. ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని ప్రస్తావిస్తూ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేస్తామని స్పష్టం చేశారు. వెంకయ్య ఇన్నాళ్ల తన పయనాన్ని గుర్తుచేసుకుంటూ రాజకీయంగా తప్పుకున్నా, ప్రజాసేవలో, ప్రజాపయనంలో విశ్రాంతి లేదని వ్యాఖ్యానించారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నటుడు రజనీకాంత్.. వెంకయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. గొప్ప ఆధ్యాత్మిక వాదిగా ఉన్న వెంకయ్య పొరపాటున రాజకీయాల్లోకి వచ్చేశారని చమత్కరించారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తదితరులు హాజరయ్యారు. అమిత్ షాకి రజినీ ప్రశంసలు కశ్మీర్ వ్యవహారం, ఆర్టికల్ 370 రద్దు విషయమై హోం మంత్రి అమిత్‌షాను రజినీకాంత్ అభినందించారు. ప్రధానమంత్రి మోదీ, అమిత్‌షా కృష్ణార్జునులని కొనియాడారు. ‘నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం కృష్ణార్జునుల ద్వయం వంటిది. అయితే వీరిద్దరిలో కృష్ణుడు ఎవరో, అర్జునుడు ఎవరో మనకు తెలీదు’ అని రజినీకాంత్ అన్నారు. త్వరలో రాజకీయ పార్టీని స్థాపించి, 2021లో తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని రజినీకాంత్ గతంలో చెప్పడం తెలిసిందే. -
పాకిస్తాన్ మరో దుశ్చర్య
ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 రద్దుతో ఇప్పటికే కశ్మీర్‌పై కాలుదువ్వుతున్న పాకిస్తాన్ మరో దుశ్చర్యకు పాల్పడింది. సిక్కు పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి లాహోర్ సమీపంలో చోటుచేసుకుంది. ఘటనపై స్పందించిన లాహోర్ సిటీ అధికార ప్రతినిధి తానియా ఖురేషి.. విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఘటనకు పాల్పడ్డ ఇద్దరి వ్యక్తులను గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తిగా దెబ్బతిన్న విగ్రహానికి మరమత్తులు చేపిస్తామని పేర్కొన్నారు. కాగా జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదాను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న అనంతరం... పాకిస్తాన్‌లోని కొన్ని సంఘాలు నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా పలు హింసాత్మక ఘటనలకు కొందరు వ్యక్తులు పాల్పడ్డారు. దానిలో భాగంగానే సిక్కు పాలకుడైన రంజిత్ సింగ్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. భారత్ నిర్ణయంపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇదివరకే విషంకక్కిన విషయం విధితమే. -
కశ్మీర్‌పై భారత్‌కు రష్యా మద్దతు
మాస్కో/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు రష్యా మద్దతు ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటివి భారత రాజ్యాంగానికి లోబడే జరిగాయని స్పష్టం చేసింది. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలని కోరుతున్నాం. ఇందుకోసం రెండు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనపాతిపదికన రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం’ అని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. నేవీలో హై అలర్ట్ భారత నేవీలో శనివారం హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి సముద్ర దాడులనైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము అప్రమత్తంగా ఉన్నట్లు నావికాదళం తెలిపింది. ‘తీర ప్రాంత భద్రతా చర్యలు వేగవంతమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఉండేందుకు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి’అని నావికాదళ సిబ్బంది డిప్యూటీ చీఫ్ మురళీధర్ పవార్ వెల్లడించారు. ‘సముందరి జిహాద్’పేరుతో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు సముద్రంలో దాడులు చేసేందుకు తమ కేడర్‌కు శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అన్ని నేవీ స్టేషన్లలో హై అలర్ట్ విధించారు. లాహోర్–ఢిల్లీ బస్ సర్వీసులు నిలిపివేత లాహోర్–ఢిల్లీల మధ్య నడుస్తున్న బస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. జాతీయ భద్రతా సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, పోస్టు సేవల మంత్రి మురద్ సయీద్ అన్నారు. కరాచీ నుంచి వచ్చే థార్ ఎక్స్‌ప్రెస్ 165 మంది ప్రయాణికులతో శనివారం భారత్ సరిహద్దుకు చేరుకుంది. అక్కడి నుంచి మరో లింకు రైలు ద్వారా ప్రయాణికులను భారత్ తీసుకొచ్చారు. దీనికి ముందు ఈ రైలును సరిహద్దు వరకు తీసుకురావడానికి పాక్ అనుమతించింది. -
ఇక కశ్మీర్ వధువులను తెచ్చుకోవచ్చు
చండీగఢ్: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు పరిణామాలపై స్పందిస్తూ ‘గతంలో బిహార్ నుంచి కోడళ్లను తెచ్చుకునేవారమని, ఇకపై కశ్మీర్ నుంచి అందమైన వధువులను తెచ్చుకోవచ్చు’అంటూ వ్యాఖ్యానించారు. ఫతేబాద్‌లో శనివారం లింగ నిష్పత్తిపై జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వివాదం కావడంతో, మీడియా తనను అపార్థం చేసుకుందంటూ తను అన్న మాటలను వీడియో ఆధారాలతో ట్విట్టర్లో పోస్టు చేశారు. కాగా, హరియాణా ముఖ్యమంత్రివి హేయమైన మాటలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కఠోరమైన ఆర్ఎస్ఎస్ శిక్షణ కూడా ఆ బలహీన మనస్తత్వం ఉన్న మనిషిపై ప్రభావితం చూపలేకపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ, ‘ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఉన్న మహిళలకు కూడా అవమానంగా భావించాలి’అని అన్నారు. -
ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకు మాజీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన శనివారం న్యాయస్థానంలో పిటిషన్‌ను దాఖలు చేశారు. కశ్మీర్‌ను విభజిస్తూ.. ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కశ్మీరీల అభిప్రాయానికి వ్యతిరేకంగా, రాష్ట్రాన్ని విభజించారని సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 5వ తేదిన పార్లమెంట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కశ్మీర్ నేతలు న్యాయశాఖను ఆశ్రయిస్తారని వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగానే బీజేపీ ప్రభుత్వం కూడా న్యాయనిపుణలతో చర్చించి, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా వ్యూహాలు రచించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఒమర్ అబ్దుల్లా పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
ఆర్టికల్ 370 రద్దు; ఏడు నిమిషాల్లోనే సమాప్తం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రత్తిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 5వ తేదిన ఆర్టికల్ 370 రద్దు చేస్తున్నట్లు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటించారు. అయితే ఆయన ప్రకటన ముందు ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశమయింది. ఈ భేటీకి మంత్రివర్గ సభ్యులతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అధికారులు కూడా హాజరయి కశ్మీర్‌పై అంశంపై చర్చించారు. అయితే కీలకమైన ఈ సమావేశం కేవలం ఏడు నిమిషాల్లోనే ముగిసినట్లు తెలిసింది. భేటీపై ఓ సీనియర్ అధికారి వివరాలు వెల్లడిస్తూ.. ‘‘కేంద్రమంత్రి మండలి సమావేశం కేవలం ఏడు నిమిషాల్లోనే ముగిసింది. ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు అమిత్ షా వివరించారు. దానికి ప్రధానితో సహా మంత్రిమండలి సభ్యులంతా సుముఖత వ్యక్తం చేశారు’’ అని వెల్లడించారు. కాగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని ఆర్టికల్ 370ని రద్దు చేసి చరిత్రలో మోదీ, అమిత్ షా నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి కీలకమైన నిర్ణయాన్ని తీసుకోడానికి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ప్రభుత్వం ప్రణాళికలు రచించినట్లు తెలిసింది. కానీ ఈ విషయం ఎవరికీ కూడా తెలియకుండా షా, మోదీ గోప్యంగా ఉంచారు. చివరి నిమిషంలో మంత్రిమండలి ఆమోదం తీసుకుని ఆర్టికల్ 370ని రద్దు చేస్తున్నట్లు పార్లమెంట్లో ప్రకటించారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్పీకరించినప్పటి నుంచి మూడోకంటికి తెలియకుండా సంచలన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలకు, ఆందోళనలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ముందస్తు సమాచారం లేకుండా అనూహ్యమైన చర్యలను చేపడుతున్నారు. పెద్దనోట్ల రద్దు, పాకిస్తాన్‌పై మెరుపుదాడులు, బాలాకోట్‌పై వైమానిక దాడి వంటి సాహసోపేత నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రత్తిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేసి చరిత్రలో నిలిచిపోయారు. ఈ చర్య దేశ ప్రజలనే కాక యావత్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. -
ప్రార్థనలు.. ప్రశాంతం!
శ్రీనగర్/న్యూఢిల్లీ/ఐరాస/వాషింగ్టన్: కశ్మీర్లో ప్రార్థనలు చేసుకునేందుకు ప్రభుత్వం శుక్రవారం ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు శాంతియుతంగా మసీదుల్లో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోపోర్‌సహా కొన్నిచోట్ల అల్లరిమూకలు భద్రతాబలగాలపై రాళ్లు విసరగా, వారిని బలగాలు చెదరగొట్టాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఏచూరి, రాజాల అడ్డగింత.. కశ్మీర్లో పర్యటించేందుకు వచ్చిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్ విమానాశ్రయంలో దిగిన వీరిద్దరినీ అధికారులు తిరిగి ఢిల్లీకి విమానంలో పంపించారు. ఈ విషయమై సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘శ్రీనగర్‌లోకి ఎవ్వరినీ అనుమతించరాదని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను పోలీసులు మాకు చూపించారు. భద్రతా కారణాల రీత్యా ఎవ్వరినీ అక్కడకు తీసుకెళ్లలేమని చెప్పారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ శుక్రవారం కూడా శ్రీనగర్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో తన సహాయకులతో కలిసి పర్యటించారు. పలుచోట్ల కశ్మీరీలతో ముచ్చటించారు. అనంతరం సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులతో ఆయన సమావేశమయ్యారు. సంయమనం పాటించండి: గ్యుటెరస్ జమ్మూకశ్మీర్ విషయంలో భారత్–పాకిస్తాన్‌లు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ కోరారు. ఐరాస మార్గదర్శకాలకు లోబడి సిమ్లా ఒప్పందం మేరకు ఇరుదేశాలు తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు. కశ్మీర్ సమస్యను మరో పక్షం జోక్యంలేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని 1972లో భారత ప్రధాని ఇందిర, పాక్ అధ్యక్షుడు జుల్ఫీకర్ అలీ భుట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు. మా పాలసీ మారలేదు: అమెరికా కశ్మీర్ విషయంలో తమ విధానంలో ఎలాంటి మార్పులేదని అమెరికా తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి భారత్–పాకిస్తాన్‌లు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించడమే మార్గమని పునరుద్ఘాటించింది. కాగా, అమెరికా విదేశాంగ సహాయ మంత్రి జాన్ ఆగస్టు 11–17 మధ్య భూటాన్, భారత్‌లో పర్యటించనున్నారు. భారత్, పాకిస్తాన్‌లు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా శుక్రవారం పిలుపునిచ్చింది. పాక్ భయపడుతోంది: విదేశాంగ శాఖ కశ్మీర్లో భారత చర్యలు చూసి పాక్ భయపడుతోందనీ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇకపై ప్రజలను తప్పుదోవ పట్టించలేమని పాక్ ఆందో ళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ అన్నారు. కుల్‌భూషణ్ జాధవ్ ను భారత రాయబారులు కలిసే అంశంపై తాము పాక్‌తో మాట్లాడుతున్నామన్నారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పంచాయతీలు, వార్డులు, మొహల్లాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. ఆగ్రా జైలుకు కశ్మీర్ వేర్పాటువాదులు కశ్మీర్‌లోని హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మియన్ ఖయ్యూంను పోలీసులు కశ్మీర్ లోయలోని జైలు నుంచి యూపీలోని ఆగ్రాకు తరలించారు. కశ్మీర్లో సమస్యలు సృష్టించగల వ్యక్తులను కేంద్రం ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఖయ్యూంతోపాటు 25 మంది వేర్పాటువాదులనుఆగ్రాకు తరలించగా, శుక్రవారం మరో 20 మందిని కశ్మీర్ నుంచి ఆగ్రా సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా వారిని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రముఖ న్యాయవాదిగా పేరున్న ఖయ్యూం, వేర్పాటువాదులకు సంబంధించిన అనేక కేసులను వాదించారు. -
ద్వైపాక్షిక సంబంధాలకు బ్రేక్!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ/శ్రీనగర్/షోపియాన్/ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని కేంద్రం రద్దుచేయడంపై పాకిస్తాన్ ప్రతీకార చర్యలకు దిగింది. పాక్‌లో పనిచేస్తున్న భారత రాయబారి అజయ్ బిసారియాను దేశం నుంచి బహిష్కరించింది. అలాగే భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ అధ్యక్షతన బుధవారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ఇమ్రాన్‌తో పాటు పాక్ విదేశాంగ, హోం మంత్రులు, ఆర్థిక సలహాదారు, త్రివిధ దళాధిపతులు, ఐఎస్ఐ చీఫ్, కశ్మీర్ వ్యవహారాల మంత్రి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాగా, అజయ్ బిసారియా ఎన్నిరోజుల్లోగా దేశం విడిచిపెట్టిపోవాలో పాక్ స్పష్టత ఇవ్వలేదు. భద్రతామండలిని ఆశ్రయిస్తాం ఎన్ఎస్సీ సమావేశం అనంతరం పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషీ మీడియాతో మాట్లాడుతూ..‘మా దౌత్యాధికారులు ఇకపై ఢిల్లీలో(భారత్) ఉండబోరు. అలాగే పాక్‌లో భారత రాయబారి అజయ్ బిసారియాను వెనక్కి పంపాలని నిర్ణయించాం. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొడుతూ, ఆర్టికల్ 370ను రద్దుచేస్తూ భారత్ ఏకపక్షంగా చట్టవిరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు, ఇతర ముఖ్యమైన విషయాల్లో కుదిరిన పరస్పర అవగాహన, ప్రోటోకాల్స్‌ను సమీక్షిస్తాం. అంతేకాదు.. జమ్మూకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలి దృష్టికి తీసుకెళతాం’ అని తెలిపారు. తమ గగనతలాన్ని సెప్టెంబర్ 5 వరకూ పాక్షికంగా మూసేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయంలో తాము చైనాతోనూ సంప్రదింపులు జరుపుతామని చెప్పారు. ప్రస్తుతం భారత రాయబారి అజయ్ బిసారియా ఇస్లామాబాద్‌లో పనిచేస్తుండగా, భారత్‌లో పాక్ రాయబారి మొయిన్–ఉల్–హక్ ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ఆగస్టు 15.. ‘బ్లాక్ డే’ భారత్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులోభాగంగా జమ్మూకశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘనను ప్రపంచదేశాల దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని దౌత్యమార్గాలను వినియోగించుకోవాలని ఆదేశించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో భారత్ ఎలాంటి దుశ్చర్యకు దిగినా దీటుగా తిప్పికొట్టేందుకు వీలుగా మరింత అప్రమత్తంగా ఉండాలని పాక్ సైన్యానికి సూచించారు. పాక్ స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 14ను కశ్మీరీలకు సంఘీభావ దినంగా జరుపుకోవాలని ఎన్ఎస్సీ భేటీలో నిర్ణయించినట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. అలాగే భారత స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15ను ‘బ్లాక్ డే’గా జరుపుకుంటామని ప్రకటించారు. మరోవైపు భారత్ చర్యలను తాము ఖండిస్తున్నామనీ, కశ్మీరీలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని పాక్ పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఐక్యరాజ్యసమితి ఆందోళన జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న చర్యలపై తాము ఆందోళన చెందుతున్నామని ఐక్యరాజ్యసమితి తెలిపింది. దీనివల్ల రాష్ట్రంలో మానవహక్కుల ఉల్లంఘనలు మరింత తీవ్రమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి గ్యుటెరస్ కోరుకుంటున్నట్లు ఆయన అధికార ప్రతినిధి స్టెఫేన్ డుజర్రిక్ తెలిపారు. మరోవైపు భారత్–పాక్ మధ్య మిలటరీ ఉద్రిక్తత తలెత్తకుండా సత్వరం చర్చలు జరపాల్సిన అవసరముందని అమెరికా అభిప్రాయపడింది. ‘ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను మెరుగుపర్చేందుకు, అన్నిపక్షాలు చర్చలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారత్–పాకిస్తాన్ల మధ్య చర్చలు ప్రారంభమవ్వాలనీ, ఉద్రిక్తతలు తగ్గాలని అమెరికా కోరుకుంటోంది’ అని వైట్‌హౌస్‌లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. బలగాల అధీనంలో మసీదులు జమ్మూకశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా బలగాలు డేగకళ్లతో పహారా కాస్తున్నాయి. ప్రజలను వేర్పాటువాదులు మైక్‌ల ద్వారా రెచ్చగొట్టకుండా శ్రీనగర్, దానిచుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మసీదులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ సహా 560 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కశ్మీర్‌లోయలో భద్రతాబలగాలు–ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణ పలువురికి బుల్లెట్ గాయాలు కాగా, ఓ యువకుడు పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో జీలంనదిలో దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీని ఓ జైలు గదిలో ఒంటరిగా బంధించినట్లు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా అధికారులు నిషేధాజ్ఞలు ఎత్తివేస్తారా? లేక కొనసాగిస్తారా? అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. జమ్మూ రైల్వేస్టేషన్లో ప్రయాణికులు కశ్మీరీలతో దోవల్ ముచ్చట్లు జమ్మూకశ్మీర్‌లో హైటెన్షన్ కొనసాగుతున్న నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ బుధవారం షోపియాన్, శ్రీనగర్‌లో పర్యటించారు. పోలీస్, ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమై శాంతిభద్రతలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఉగ్రవాది బుర్హాన్‌వనీ స్వస్థలం షోపియాన్‌లో దోవల్ స్థానికులతో కలిసి సంప్రదాయ కశ్మీరీ వంటకం ‘వజ్వాన్’ను రుచిచూశారు. స్థానిక ప్రజలతో ఈ సందర్భంగా దోవల్ మాట్లాడుతూ..‘పరిస్థితి ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు?’ అని అడిగారు. దీంతో ఓ స్థానికుడు అంతా బాగుందని జవాబిచ్చారు. వెంటనే దోవల్ స్పందిస్తూ..‘అవును.. సమస్యలన్నీ సమసిపోతాయి. అందరూ ప్రశాంతంగా బతకాలి. దేవుడు ఏది చేసినా మనమంచికే. మీ భద్రత, సంక్షేమం మా బాధ్యత. మీ భవిష్యత్ తరాల అభివృద్ధి, సంక్షేమం కోసమే మేం ఆలోచిస్తున్నాం’ అని తెలిపారు. అనంతరం సీఆర్పీఎఫ్ బలగాలను కలుసుకున్న దోవల్..‘వామపక్ష తీవ్రవాదం నుంచి కశ్మీర్లో ఉగ్రవాదం వరకూ సీఆర్పీఎఫ్ బలగాలపై నిశ్చింతగా ఆధారపడగలనని భారత్ నమ్ముతోంది’ అని వ్యాఖ్యానించారు. షోపియాన్‌లో స్థానికులతో మాట్లాడుతున్న అజిత్ దోవల్ భారత్‌కు మద్దతుగా పాక్‌లో బ్యానర్లు ఇస్లామాబాద్: అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల రెడ్‌జోన్‌తో సహా పాకిస్తాన్ రాజధానిలోని పలు ప్రాంతాల్లో భారత్‌కు మద్దతుగా బ్యాన ర్లు దర్శనమిచ్చాయి. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ బ్యానర్లలో పేర్కొన్నారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు వాటిని తొలగించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలతో కూడిన ‘అఖండ భారత్’ మ్యాప్‌ను బ్యానర్లలో ప్రదర్శించారు. ‘ఈరోజు జమ్మూకశ్మీర్‌ను తీసుకున్నారు. రేపు బలూచిస్తాన్.. ఆ తర్వాత పీవోకేను స్వాధీనం చేసుకుంటారు. అఖండ హిందుస్తాన్ కలను దేశ ప్రధాని సాకారం చేస్తారన్న పూర్తి నమ్మకం నాకుంది’ అని శివసేన నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆ బ్యానర్లలో పేర్కొన్నారు. -
అఫ్రిది వ్యాఖ్యలను తిప్పికొట్టిన గంభీర్
న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ.. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన ట్వీట్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మండిపడ్డారు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందన్న అఫ్రిది వ్యాఖ్యలను గంభీర్ తనదైన శైలిలో తిప్పికొట్టారు. ‘ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. స్వేచ్చ విషయంలో అందరికీ సమాన హక్కులు వర్తిస్తాయి. ఇంత జరుగుతున్నా ఐరాస ఎందుకలా నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు స్పందించట్లేదు. అసలు ఐరాసను ఎందుకు ఏర్పాటు చేశారు? కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలి’ అని అఫ్రిది ట్వీట్ చేశాడు. దీనిపై గంభీర్ స్పందిస్తూ..‘అఫ్రిది ఎప్పుడూ చురుగ్గా ఉంటాడు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది వాస్తవమే. ఈ విషయాన్ని తెలిపిన నిన్ను అభినందించాల్సిందే. కానీ నువ్వు మరిచిపోయిన విషయం ఏంటంటే.. ఇవన్నీ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లో జరుగుతున్నాయని ప్రస్తావించకపోవడం. ఏం బాధపడకు త్వరలో పీఓకే పరిస్థితులను కూడా పరిష్కరిస్తాం.’ అంటూ అఫ్రిదికి గంభీర్ చురకలింటించారు. ఇక ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు వాదులాడుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా కశ్మీర్ విషయంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. మైదానంలో కూడా ఒకరిపై ఒకరు దూసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. -
కశ్మీర్ కోసం ప్రాణాలైనా అర్పిస్తా: అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పునర్విభజన బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్‌సభ ముందుకు తీసుకువచ్చారు. ఆర్టికల్ 370 రద్దుపై కూడా కేంద్రమంత్రి లోక్‌సభలో ప్రకటన చేశారు. చర్చలో భాగంగా కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరీ మాట్లాడుతూ.. కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నియమాలను పాటించలేదని విమర్శించారు. కశ్మీర్ మొదటి నుంచీ దేశ అంతర్గత వ్యవహారమని, కానీ ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ ఇది ద్వైపాక్షిక అంశమని పేర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. కశ్మీర్ అంతర్గత వ్యవహారమా? లేక ద్వైపాక్షిక వ్యవహారమా? అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అధీర్ రంజన్ వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. కశ్మీరీలకు ఈ పరిస్థితికి రావడానికి కాంగ్రెస్ చేసిన తప్పిదాలే కారణమని మండిపడ్డారు. కశ్మీర్ ప్రజల విముక్తి కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానని షా పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమేనని, దానికి ఇతర దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. కశ్మీర్ భారత సమాఖ్యలో భాగమేనన్న అమిత్ షా.. ఆ విషయం రాజ్యాంగంలో కూడా ఉందని గుర్తుచేశారు. కశ్మీర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న పార్లమెంట్‌కు పూర్తిస్థాయి అధికారం ఉందని తెలిపారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో జమ్మూకశ్మీర్‌కు ప్రయోజనం చేకూరుతుందని, ఆర్టికల్ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్ విభజన బిల్లుల ఆమోదానికి సభలో సహకరించాలని ఆయన కోరారు. ఇప్పటికే రాజ్యసభలో ఆమోదం పొందిన విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చారు. -
ఆర్టికల్ 370 రద్దు: విషంకక్కిన అఫ్రిది
ఇస్లామాబాద్: జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ట్విట్టర్ వేదికగా స్పందించారు. భారత ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ పౌరులకు కనీస హక్కులు దక్కడం లేదు. అసలు ఐరాసను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇంత జరుగుతున్నా ఎందుకలా నిద్రపోతోంది. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఐరాస ఎందుకు స్పందించట్లేదు. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనను పరిగణలోకి తీసుకోవాలి’ అంటూ ట్వీటర్లో అభిప్రాయపడ్డారు. చదవండి: ఆర్టికల్ 370 రద్దు చదవండి: త్రిమూర్తులు... ఎంఎస్డీ అలాగే దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని అఫ్రిది కోరారు. సదరు ట్వీట్‌ను ఐక్యరాజ్యసమితి, డొనాల్డ్ ట్రంప్‌కు ట్యాగ్ చేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌పై భారత ప్రభుత్వ చర్యపై పాకిస్తాన్ ప్రభుత్వం ఇదివరకే ఖండించింది. ఐరాస తీర్మానాలకు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న నిర్ణయంపై అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళతామని తెలిపింది. కశ్మీరీలకు మద్దతు కొనసాగిస్తామని పేర్కొంది. తాజా పరిణామంతో రెండు అణ్వస్త్ర దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణిస్తాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. భారత్ ప్రకటన ఐరాస తీర్మానాలకు వ్యతిరేకమని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ పేర్కొన్నారు. చదవండి: హిందూ రాజు ముస్లిం రాజ్యం చదవండి: నాలుగు యుద్ధాలు -
కశ్మీర్ అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షం
లక్నో: జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేస్తూ.. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. దీనికి భిన్నంగా విపక్ష కాంగ్రెస్ ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ పార్టీ పార్లమెంట్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కశ్మీర్‌పై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. రాయ్‌బరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అధితి సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె ‘దేశ సమైఖ్యతకు తామంతా కట్టుబడి ఉంటాం. జైహింద్’ అంటూ ట్వీట్ చేశారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా అధితి పోస్ట్ చేయడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. అధితి సింగ్ పోస్ట్‌పై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి యూపీయే చైర్పర్సన్ ఎంపీగా గెలుపొందిన విషయం గమన్హారం. ఆమెతో పాటు యూపీ కాంగ్రెస్ సీనియర్ నేత జనార్థన్ ద్వివేది కూడా కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. వీరితో పాటు మరికొంత మంది హస్తం నేతలు కూడా ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై తమ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ విప్ భువనేశ్వర్ కలిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన రాజీనామా చేశారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఆత్మహత్యాసదృశ్యంగా ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దేశమంతా కశ్మీర్ అంశంపై చర్చిస్తుంటే కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు రాహుల్ గాంధీ, సోనియా, ప్రియాంక గాంధీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. -
కశ్మీరీల్లో ఆగ్రహం.. ఆందోళన!
జమ్మూ: ఆర్టికల్ 370ని రద్దుచేయడంపై పలువురు కశ్మీరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రంలో మళ్లీ హింస రాజుకుంటుందని భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రం తాజా నిర్ణయం కారణంగా ముస్లిం మెజారిటీ గుర్తింపులను రాష్ట్రం కోల్పోతుందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొందరు స్థానికులు మాత్రం ఇందుకు కశ్మీర్ ప్రాంతీయ పార్టీలను తప్పుపడుతున్నారు. ఈ విషయమై శ్రీనగర్‌కు చెందిన ఫరూక్ అహ్మద్ షా మాట్లాడుతూ..‘కేంద్రం నిర్ణయంతో మేం షాక్‌కు గురయ్యాం. కేంద్ర ప్రభుత్వాలతో గత 70 ఏళ్లుగా చేతులు కలుపుతున్న కశ్మీరీ రాజకీయ పార్టీలు ఆర్టికల్ 370ని ఎముకలగూడులా మార్చేశాయి. కేంద్రం తాజా నిర్ణయం వల్లే ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశముంది’అని హెచ్చరించారు. ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది.. కేంద్ర ప్రభుత్వం తమను ఇంకెంతకాలం గృహనిర్బంధంలో ఉంచుతుందని కశ్మీరీ యువకుడు అర్షద్ వార్సీ(20) ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని రద్దుచేయడం అంటే తమ ఆగ్రహాన్ని వెలిబుచ్చేందుకు వీల్లేనట్లు కాదని స్పష్టం చేశారు. మరో మహిళా టీచర్ మాట్లాడుతూ..‘ఈ దుస్థితికి జమ్మూకశ్మీర్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలే కారణం. ఆర్టికల్ 370 రద్దుతో మా గుర్తింపును కోల్పోయినట్లైంది’అని చెప్పారు. కశ్మీరీ పండిట్ల సమస్య అదే.. ఇక ఫాతిమా బానో అనే మహిళా ఎంట్రప్రెన్యూర్ కూడా తాజా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ‘కేవలం ఆర్టికల్ 370 రద్దుతో దశాబ్దాలుగా కశ్మీర్లో కొనసాగుతున్న అశాంతి, హింస సమసిపోతుందా? అలా జరుగుతుందన్న నమ్మకం నాకు లేదు. కశ్మీరీ పండిట్లు తమ స్వస్థలాలకు తిరిగొచ్చేందుకు ఆర్టికల్ 370, ఆర్టికల్–35ఏ అన్నవి అసలు అడ్డంకే కాదు. పండిట్లు తిరిగిరావడానికి శాంతిభద్రతల పరిస్థితులే ప్రధాన అడ్డంకిగా ఉన్నాయి’అని తెలిపారు. -
మోదీ , అమిత్‌షాకు అభినందనలు : అద్వానీ
-
కశ్మీర్ పరిణామాల వరుసక్రమం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గత వారం రోజులుగా జమ్మూకశ్మీర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. అదనపు బలగాల మోహరింపు, అమర్నాథ్ యాత్ర రద్దు, చొరబాటుదారుల ఏరివేత... ఇలా వరుస ఘటనలతో చల్లని కశ్మీరం వేడెక్కింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తం అయింది. మరోవైపు కార్గిల్ సెక్టార్లో ఉద్యోగులెవరూ విధినిర్వహణ ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని, ఫోన్లు తప్పనిసరిగా ఆన్‌లో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్లో పరిణామాల వరుసక్రమం ఈ విధంగా ఉంది. కశ్మీర్ రాష్ట్రానికి పదివేల మంది కేంద్ర సాయుధ దళాలను తరలిస్తూ కేంద్ర హోం శాఖ జూలై 25వ తేదీన ఉత్తర్వుల జారీ. కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులు లేవని, అంతా సాధారణమేనంటూ జూలై 30న కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటన. ఆగస్టు 1వ తేదీన కశ్మీర్‌కు అదనంగా మరో పాతిక వేల కేంద్ర సాయుధ బలగాలను తరలిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు. కేంద్ర సైనిక, వైమానిక దళాల అప్రమత్తం. అంతర్గత భద్రత కోసం సైనిక దళాల మోహరింపు అంటూ రాష్ట్ర అధికారుల వివరణ. ఆగస్టు 2వ తేదీన శ్రీనగర్‌లో సంయుక్త దళాల సమావేశం. అమర్నాథ్ యాత్రికుల లక్ష్యంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడిచేసే అవకాశం ఉన్నందున వారిని ఎదుర్కోవడమే తమ లక్ష్యమన్న సంయుక్త దళాలు. సమావేశంలో పాకిస్తాన్లో తయారైనట్లు గుర్తులు కలిగిన హ్యాండ్ గ్రెనేడ్, స్నైఫర్ గన్ ప్రదర్శన. అదే రోజు సాధ్యమైనంత త్వరగా రాష్ట్రం వదిలి వెళ్లాల్సిందంటూ అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులకు అధికారుల హెచ్చరికలు. సంక్షోభ నిల్వల కోసం కశ్మీర్ ప్రజలు ఏటీఎం, పెట్రోల్ బంకులకు ఉరుకులు, పరుగులు. ఆగస్టు 3న జమ్మూలో మైఖేల్ మాతా యాత్ర రద్దు. శ్రీనగర్ నుంచి విమానాల ద్వారా వేలాది మంది పర్యాటకుల తరలింపు. విమాన ఛార్జీలు పెంచవద్దంటూ విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు. అదే రోజు రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్ మిలిటెంట్ల కాల్చివేత. పాఠశాలలు, కాలేజీల మూసివేత. ఆగస్టు 4న ప్రధాన వీధుల్లో బారికేడ్ల ఏర్పాటు. అల్లర్ల నివారణకు ప్రత్యేక వాహనాలు సిద్ధం. సాయంత్రం మాజీ ముఖ్యమంత్రులు మెహబాబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, సాజద్ లోన్ల గృహ నిర్బంధం. ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణం రద్దు. ఇదే విషయమై రాజ్యసభలో సోమవారం అమిత్ షా ప్రకటన. -
ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్ సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. జమ్మూ, కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న జమ్మూ, కాశ్మీర్ సమస్యకు పరిష్కారంగా ప్రవేశపెట్టిన కీలకమైన ఈ బిల్లుపై మాట్లాడే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. జమ్మూ, కాశ్మీర్‌ను ఆక్రమించేందుకు పాకిస్తాన్ సైన్యం ప్రయత్నించినపుడు భారత సైన్యం పాక్‌చొరబాటును తిప్పికొడుతూ దాదాపు 25 కిలోమీటర్లు పాక్‌భూభాగంలోకి చొచ్చుకుపోయిందని అన్నారు. ఆనాడు భారత సైన్యాన్ని వెనక్కి రప్పించి నెహ్రూ చారిత్రక తప్పిదం చేయలేదా అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టడం ద్వారా నెహ్రూ నాటి కాశ్మీర్ పాలకుల ఒత్తిడికి తలవంచబట్టే నేడు ఈ దుస్థితి దాపురించిందని అన్నారు. తాత్కాలికమైన ఈ ఆర్టికల్370ని కాంగ్రెస్ప్రభుత్వం రద్దు చేసి ఉంటే ఈరోజు దీనిపై చర్చించాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చదవండి: కశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం ఒక ఒరలో రెండు కత్తులు ఏ విధంగా ఇమడనప్పుడు దేశంలో రెండు వేర్వేరు ప్రాంతాలు స్వతంత్రంగా ఎలా ఉండగలవని ప్రశ్నించారు. ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు వేర్వేరు పతాకాలు, ఇద్దరు వేర్వేరు ప్రధాన మంత్రులు భారత దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా కనిపించవని అన్నారు. భారత జాతీయ పతాకాన్ని తగులబెడితే అది నేరం కాని ప్రాంతం దేశంలో అంతర్భాగం ఎలా అవుతుందని నిలదీశారు. ఇలాంటివి ఒక్క జమ్మూ, కాశ్మీర్లో మాత్రమే సాధ్యమవుతున్నాయని అన్నారు. కాశ్మీరీ యువతిని వివాహం చేసుకున్న పాకిస్తానీ భారతీయ పౌరుడు అవుతున్నాడు. అదే భారత దేశంలోని ఏ ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న కాశ్మీరీ యువతిని ఆ రాష్ట్రంలో అంటరాని వ్యక్తి అవుతోందని అన్నారు. ఇది దారుణమైన లింగ వివక్ష కాదా అని ప్రశ్నించారు. భారత దేశాన్ని ఒక దేశంగాను, ఒక సంఘటిత ప్రాంతంగాను, ఒక జాతిగాను చూడాలన్న ఆకాంక్షతో దేశ ప్రజలు 1947 నుంచి పోరాడుతూనే ఉన్నారు. దేశ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈరోజు హోం మంత్రి అమిత్‌షా నడుం బిగించారు. సర్దార్ పటేల్‌విడిచి పెట్టిన కార్యాన్ని హోం మంత్రి పూర్తి చేస్తున్నారు. కాంగ్రెస్‌పార్టీ, జవహర్‌లాల్‌నెహ్రూ చేసిన చారిత్రక తప్పిదాలను సరి చేసి 130 కోట్ల భారత ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి అమిత్‌షా సబ్కా వికాస్ నినాదాన్ని ఆచరణలో పెట్టబోతున్నారని విజయసాయి రెడ్డి ప్రశంసించారు. ఈ చర్య దేశ పౌరుల మధ్య వివక్షను తొలగించి దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని మరింత పట్టిష్టం చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జమ్మూ, కాశ్మీర్‌శాంతి, సౌభాగ్యాలతో పురోగమిస్తుందని అన్నారు. ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆయన అభినందనలు తెలిపారు. కాగా ఆర్టికల్ 350 రద్దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు సమాజ్‌వాదీ, బీఎస్పీ, బీజేడీ, అన్నాడీఎంకే, ఆప్ మద్దతు తెలిపాయి. మరోవైపు కేంద్ర తీర్మానాన్ని కాంగ్రెస్, జేడీయూ, ఎండీఎంకే, డీఎంకే, పీడీపీ ఎన్సీపీ వ్యతిరేకించాయి. కాగా జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. -
కశ్మీర్ సమస్యకు ఇది మంచి పరిష్కారం
-
కశ్మీర్లో భయం...భయం
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్లో ఎప్పుడేమి జరుగుతుందోనన్న భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. వీధుల్లో దాదాపు 35 వేల మంది సైనికుల పద ఘట్టనలు కొనసాగుతున్నాయి. జమ్మూ కశ్మీర్ ప్రాంతానికి చెందిన ముగ్గురు శక్తివంతమైన నాయకులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, సాజద్ లోన్ల అనూహ్య గృహ నిర్బంధం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ఉన్నతాధికారులకు శాటిలైట్ ఫోన్లు అందుబాటులో ఉంచారు. పాఠశాలలు, కళాశాలలన్నింటినీ మూసివేశారు. హాస్టళ్లను కూడా ఖాళీ చేయాల్సిందిగా విద్యార్థులకు ఆదేశం. ప్రధాన కూడళ్లలో బారికేడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అల్లర్లు జరిగితే అదుపు చేయడానికి ప్రత్యేక వాహనలు సిద్ధం చేశారు. చదవండి : కశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం వీధుల్లో సభలు, సమావేశాలు, ధర్నాలను పూర్తిగా నిషేధించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ, కర్ఫ్యూ విధించడం లేదని రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటన చేశారు. ఆయన అలాంటి ప్రకటన చేసినప్పటికీ అన్ని చోట్ల భారీ బందోబస్తుతో పాటు నిఘాను ముమ్మరం చేశారు. శుక్రవారం నుంచే అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులను రాష్ట్రం నుంచి వెళ్లి పోవాల్సిందిగా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కశ్మీర్‌కు పదివేల కేంద్ర బలగాలను తరలిస్తూ జూలై 25వ తేదీన కేంద్ర హోం శాఖ ఆదేశాలను జారీ చేసిన నాటి నుంచే ప్రజల్లో ఏదో జరగబోతోందన్న ఆందోళన నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆగస్టు ఒకటవ తేదీన కశ్మీర్లోకి మరో పాతికవేల మంది సైనికులను తరలించారు. చదవండి: ఇదొక చీకటి రోజు : ముఫ్తి కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370 వ అధికరణం రద్దువుతుందన్న ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. నిత్యవసరాల నిల్వల కోసం మార్కెట్లలో ప్రజల తాకిడి పెరిగింది. వంట గ్యాస్ కోసం జనం బారులు తీరారు. వీధుల్లో సైన్యం పహారా మొదలైంది. ఆదివారం సాయంత్రానికల్లా ఇళ్లలోకి వెళ్లాల్సిందిగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో రాష్ట్రమంతా పరిస్థితులు గంభీరంగా మారాయి. అనేక చోట్ల ఒకరకమైన నిశ్శబ్ధ వాతావరణ నెలకొంది. సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమై 370 అధికరణ రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ నిర్ణయంపై రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయడంతోనే సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రతిపక్షాల ఆందోళన, కాంగ్రెస్ సహా సభ నుంచి పలు పార్టీల సభ్యుల వాకౌట్ చేశారు. 370 అధికరణాన్ని రద్దు చేస్తూ చేసిన నిర్ణయంపై కేంద్రం ఆయా రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. పలు రాజకీయ పార్టీలు ఆ నిర్ణయాన్ని సమర్థించగా, మరికొన్ని వ్యతిరేకించాయి. ఇకపోతే కశ్మీర్ లో తాజా పరిస్థితులను, పరిణామాలను కేంద్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. -
ఆర్టికల్ 370 అంటే ఏమిటి?
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాజ్యసభలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. దీంతో ఇన్నేళ్లూ కశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక హోదా ఇక పూర్తిగా రద్దు కానుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 మరోసారి తెరపైకి వచ్చింది. దానిని వివరాలు..భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూకశ్మీర్ రాష్ర్టానికి ఆర్టికల్ 370 స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తుంది. రాజ్యాంగంలోని 21వ భాగంలో దీన్ని పొందుపరిచారు. ఆర్టికల్ 370 కింద కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించారు. దేశంలోని మిగతా రాష్ర్టాలకు రాజ్యాంగ ప్రకారం కల్పించే సౌకర్యాలు కశ్మీర్‌కు వర్తించవు. 1947లో షేక్ అబ్దుల్లా ఆర్టికల్ 370 ముసాయిదాను తయారు చేశారు. రాజా హరిసింగ్, అప్పటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదేశాల ప్రకారమే.. అబ్దుల్లా ఆర్టికల్ ముసాయిదాను రూపొందించారు. చదవండి: సంచలన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు ఆర్టికల్ 370 ప్రకారం.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సమాచార అంశాలు మినహా.. మిగతా చట్టాల అమలు కోసం కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి. ఆ రాష్ట్రం అనుమతి తెలిపినప్పుడు మాత్రమే పార్లమెంట్ రూపొందించిన చట్టాలను అమలవుతాయి. అంటే ఈ ఆర్టికల్ ప్రకారం.. కశ్మీర్ ప్రజలు ప్రత్యేక చట్టం కింద జీవిస్తున్నారన్నది అర్థమవుతోంది. పౌరసత్వం, ప్రాపర్టీ ఓనర్షిప్, ప్రాథమిక హక్కులు కూడా కశ్మీర్‌కు భిన్నంగా ఉంటాయి. దీని ప్రకారం ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్లో స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. ఆర్టికల్ 370 ప్రకారం కశ్మీర్లో ఆర్థిక ఎమర్జెన్సీ విధించే అధికారం కూడా కేంద్రానికి ఉండదు. కేవలం యుద్ధం లేదా బాహ్య వత్తిళ్ల వల్ల ఏర్పడే పరిణామాల నేపథ్యంలోనే కశ్మీర్లో ఎమర్జెన్సీ ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒకవేళ రాష్ట్రంలో ఏవైనా అల్లర్ల చోటుచేసుకుంటే, ఆ సమయంలో ఎమర్జెన్సీ విధించే అవకాశం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితోనే కేంద్రం ఎమర్జెన్సీని ప్రకటిస్తుంది. అయితే ప్రత్యేక చట్టాల అమలు కోసం తయారైన ఆర్టికల్ 370ని రద్దు చేయాలని బీజేపీ తొలినుంచి భావించింది. దాని కోసమే తన ఎన్నికల మ్యానిఫెస్టోలో వాగ్దానం కూడా చేసింది. 2019లో తిరిగి తాము అధికారంలోకి వస్తే కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని మోదీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. తాజాగా అమిత్ షా ప్రకటనతో ఎన్నికల హామీని నెరవేర్చారు. దీంతో దీంతో కశ్మీర్ ప్రత్యేక హక్కులను కోల్పోయి.. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులను కల్పించబడ్డాయి. ఇక పార్లమెంట్ చేసే ప్రతిచట్టం దేశమంతటితో పాటు కశ్మీర్‌లోనూ అమలు కానుంది. కశ్మీర్ భూభాగాల మార్పుపై కూడా పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంక్రమించింది. -
కశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌పై అనేక ఉత్కంఠ పరిణామాలకు తెరదించుతూ.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో ప్రతిపాదించారు. కశ్మీర్ అంశంపై తొలినుంచి గోప్యతను పాటించిన కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తన నిర్ణయాన్ని బయటపెట్టింది. దీంతో చారిత్రాత్మక నేపథ్యం, వివాదాస్పదంగా ఉన్న ఆర్టికల్ 370 రద్దయింది. కాగా అమిత్ షా ప్రకటన మరుక్షణమే ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీంతో కశ్మీర్ ప్రత్యేక హక్కులను కోల్పోయి.. కేంద్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులను కల్పించబడ్డాయి. ఇక పార్లమెంట్ చేసే ప్రతిచట్టం దేశమంతటితో పాటు కశ్మీర్‌లోనూ అమలు కానుంది. కశ్మీర్ రెండుగా విభజన.. ఆర్టికల్ 370పై పక్కా వ్యూహాన్ని అమలు చేసిన అమిత్ షా.. ముందుగానే బిల్లుకు సంబంధించిన వాటిపై పూర్తి కసరత్తు చేసి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కశ్మీర్‌ను రెండు భాగాలుగా విభజన చేస్తూ.. మరో బిల్లును కూడా సభ ముందుకు తీసుకువచ్చారు. లఢక్‌ను పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతూ బిల్లును రూపొందించారు. అలాగే చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్ కానుంది. గత వారం రోజులుగా భద్రతా బలగాల మోహరింపుతో కల్లోలంగా మారిన కశ్మీర్ వ్యవహారం కీలక ప్రకటనతో ముగిసింది. అమిత్ షా ప్రకటనపై రాజ్యసభలో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ నిర్ణయం తీసుకుందని తీవ్రంగా మండిపడ్డాయి. 370 రద్దుపై రాజ్యసభలో సభ్యులు ఆందోళన నిర్వహించారు. కాగా అమిత్ షా ప్రకటనకు ముందు ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర మంత్రిమండలి భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా దేశానికి సమస్యగా మారిన కశ్మీర్ ప్రత్యేక హక్కుల అధికరణను తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. దీని కోసం ఎన్నో రోజులుగా తీవ్ర కసరత్తు చేసిన మోదీ ప్రభుత్వం.. కీలక సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటించింది. కశ్మీర్‌కు సమస్యాత్మకంగా మారిన ఆర్టికల్ 35ఏ, 370 అధికరణలను రద్దు చేస్తామని గత ఎన్నికల సమయంలో అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో పూర్తి బలంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈమేరకు కీలక ప్రకటన చేసింది.