
న్యూఢిల్లీ: కశ్మీర్‌కు ప్రత్యేక హోదా, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేయడంపై పాకిస్తాన్ కోపంతో రగిలిపోతోంది. కశ్మీర్‌లో రక్తపాతం సృష్టించడం ద్వారా అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్‌ను ఇటీవల జైలు నుంచి విడుదలచేసిన పాకిస్తాన్, తాజాగా మరో కుట్రకు తెరలేపింది. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రసంస్థలతో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) ఇస్లామాబాద్‌లో అత్యున్నత సమావేశం నిర్వహించింది.
ఈ భేటీకి పాక్‌లోని ఉగ్రసంస్థలతో పాటు ఖలిస్తానీ జిందాబాద్ ఫోర్స్(కేజెడ్‌ఎఫ్) వంటి వేర్పాటువాద సంస్థల ముఖ్యనేతలు హాజరైనట్లు భారత నిఘావర్గాలు తెలిపాయి. కశ్మీర్‌లో దాడులతో అలజడి సృష్టించాలని ఈ సందర్భంగా ఉగ్రమూకలకు ఐఎస్‌ఐ ఆదేశాలు జారీచేసిందని వెల్లడించాయి. కశ్మీర్‌లో భద్రతాబలగాలు, ప్రభుత్వ ఆస్తులు లక్ష్యంగా విధ్వంసానికి పాల్పడటం ద్వారా ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించేందుకు పాక్ కుట్ర పన్నుతోందని పేర్కొన్నాయి. సాంబా జిల్లాలోని బరీబ్రహ్మణ ఆర్మీ క్యాంప్, జమ్మూలోని సుంజ్‌వాన్, కలుచక్ ఆర్మీ బేస్‌లు లక్ష్యంగా నలుగురు లష్కరే ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడవచ్చని నిఘావర్గాలు ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే.
లష్కరే మద్దతుదారుల అరెస్ట్
కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న 8 మంది లష్కరే తోయిబా మద్దతుదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాదుల పేరిట వీరు పోస్టర్లు అంటించారు. ప్రజలంతా శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టాలనీ, స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించాలని ఈ పోస్టర్లలో పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment