భారత్‌తో యుద్ధంలో ఓడిపోతాం | Pakistan could lose conventional war with India | Sakshi
Sakshi News home page

భారత్‌తో యుద్ధంలో ఓడిపోతాం

Published Mon, Sep 16 2019 3:59 AM | Last Updated on Mon, Sep 16 2019 4:36 AM

Pakistan could lose conventional war with India - Sakshi

ఇస్లామాబాద్‌: భారత్‌తో సంప్రదాయ యుద్ధం జరిగితే పాకిస్తాన్‌ ఓడిపోతుందని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అంగీకరించారు. అయితే, దాని ప్రభావం ఉపఖండానికి వెలుపల కూడా ఉంటుందని చెప్పారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు నేపథ్యంలో భారత్‌తో చర్చల ప్రసక్తే లేదన్నారు. ‘పాక్‌ ముందుగా యుద్ధానికి దిగదు. నేను యుద్ధానికి వ్యతిరేకిని. శాంతివాదిని. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావనేది నా నమ్మకం’అని తెలిపారు.

సంప్రదాయ యుద్ధమే జరిగితే పాక్‌ ఓడిపోతుంది. అలాంటప్పుడు మాకు రెండే అవకాశాలున్నాయి. ఒకటి లొంగిపోవడం, రెండోది తుదికంటా పోరాడటం. అయితే, స్వాతంత్య్రం కోసం పాక్‌ ప్రజలు చనిపోయేదాకా పోరాడతారని నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ‘అయితే, రెండు అణ్వస్త్ర దేశాలు యుద్ధానికి దిగితే..ప్రారంభంలో అది సంప్రదాయ పోరైనా.. అణ్వస్త్ర ప్రయోగంతోనే ముగిసేందుకు అవకాశం ఉంది. దానిని ఊహించలేం’అని అన్నారు. ‘భారత్‌తో యుద్ధం జరిగేందుకు అవకాశం ఉందని గట్టిగా నమ్ముతున్నా. దీనిని నివారించేందుకే ఐరాసకు వెళ్లాం. ప్రతి అంతర్జాతీయ వేదికపైనా ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాం’అని పేర్కొన్నారు. యుద్ధం ఫలితంగా ఉపఖండానికి అవతల కూడా ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.

భారత్‌ ఎఫ్‌ఏటీఎఫ్‌(ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌) సంస్థ పాకిస్తాన్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ ఆయన.. ఆంక్షల ద్వారా పాక్‌ ను ఆర్థికంగా దివాళా తీయించేందుకు, కష్టాల్లోకి నెట్టేందుకు ప్రయత్నిస్తోంది’అని అన్నారు. కశ్మీర్‌కు స్వతంత్రప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ రద్దును ఉపసంహరించుకునే భారత్‌తో చర్చలుంటాయని స్పష్టం చేశారు. కాగా, ఈ నెల 27వ తేదీన ఐరాస సర్వప్రతినిధి సభలో ప్రధాని ఇమ్రాన్‌ ప్రసంగించేదాకా ఎల్‌వోసీ వరకు చేపట్టే ర్యాలీ వాయిదా వేయాలని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని రాజకీయ, మత సంస్థలు నిర్ణయించుకున్నాయి. కశ్మీరీలకు సంఘీభావంగా ఎల్‌వోసీ వరకు ర్యాలీ చేపట్టాలని ఇమ్రాన్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  

సరిహద్దులో పాక్‌ కవ్వింపులు: 2,050
న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట పాకిస్తాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ ఏడాదిలో పాక్‌ ఇప్పటి వరకూ 2,050 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రావీశ్‌ కుమార్‌ ఆదివారం వెల్లడించారు. ఈ ఘటనల్లో 21 మంది భారత సైనికులు మృతిచెందినట్లు ఆయన తెలిపారు. ఒప్పందాన్ని ఉల్లంఘించడమేగాక భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు మద్దతు ఇస్తోందని మండిపడ్డారు. నియంత్రణ రేఖ వెంట శాంతి భద్రతలు నెలకొనేలా చేసుకున్న 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ పదేపదే ఉల్లంఘిస్తోందని అన్నారు.

దీనికితోడు ఈ నెల మొదటి వారంలో పాక్‌ దాదాపు 100 నుంచి 200 మంది సైనికులను నియంత్రణ రేఖకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి తరలించినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పాకిస్తాన్‌ ఇన్ని కవ్వింపు చర్యలు చేపడుతున్నప్పటికీ భారత    బలగాలు సహనం చూపుతున్నాయని,       ఉగ్రవాదులు చొరబడాలని చూసినపుడు మాత్రం తగిన జవాబు ఇస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్‌వోసీ వెంట భారత బలగాల సంసిద్ధతను ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ శనివారం        పరిశీలించారు. దీనికి ముందే ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కూడా పరిస్థితులను స్వయంగా వచ్చి పరిశీలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement