
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే గత వారం రోజులుగా జమ్మూకశ్మీర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. అదనపు బలగాల మోహరింపు, అమర్‌నాథ్ యాత్ర రద్దు, చొరబాటుదారుల ఏరివేత... ఇలా వరుస ఘటనలతో చల్లని కశ్మీరం వేడెక్కింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన స్థానిక ప్రజల్లో వ్యక‍్తం అయింది. మరోవైపు కార్గిల్ సెక్టార్‌లో ఉద్యోగులెవరూ విధినిర్వహణ ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని, ఫోన్‌లు తప్పనిసరిగా ఆన్‌లో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్‌లో పరిణామాల వరుసక్రమం ఈ విధంగా ఉంది.
- కశ్మీర్ రాష్ట్రానికి పదివేల మంది కేంద్ర సాయుధ దళాలను తరలిస్తూ కేంద్ర హోం శాఖ జూలై 25వ తేదీన ఉత్తర్వుల జారీ. కేంద్రం నుంచి ఎలాంటి ప్రత్యేక ఉత్తర్వులు లేవని, అంతా సాధారణమేనంటూ జూలై 30న కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ప్రకటన.
- ఆగస్టు 1వ తేదీన కశ్మీర్‌కు అదనంగా మరో పాతిక వేల కేంద్ర సాయుధ బలగాలను తరలిస్తూ కేంద్రం నుంచి ఉత్తర్వులు. కేంద్ర సైనిక, వైమానిక దళాల అప్రమత్తం. అంతర్గత భద్రత కోసం సైనిక దళాల మోహరింపు అంటూ రాష్ట్ర అధికారుల వివరణ.
- ఆగస్టు 2వ తేదీన శ్రీనగర్‌లో సంయుక్త దళాల సమావేశం. అమర్‌నాథ్ యాత్రికుల లక్ష్యంగా పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడిచేసే అవకాశం ఉన్నందున వారిని ఎదుర్కోవడమే తమ లక్ష్యమన్న సంయుక్త దళాలు. సమావేశంలో పాకిస్తాన్‌లో తయారైనట్లు గుర్తులు కలిగిన హ్యాండ్ గ్రెనేడ్, స్నైఫర్ గన్ ప్రదర్శన.
- అదే రోజు సాధ్యమైనంత త్వరగా రాష్ట్రం వదిలి వెళ్లాల్సిందంటూ అమర్‌నాథ్ యాత్రికులు, పర్యాటకులకు అధికారుల హెచ్చరికలు.
- సంక్షోభ నిల్వల కోసం కశ్మీర్ ప్రజలు ఏటీఎం, పెట్రోల్ బంకులకు ఉరుకులు, పరుగులు.
- ఆగస్టు 3న జమ్మూలో మైఖేల్ మాతా యాత్ర రద్దు. శ్రీనగర్ నుంచి విమానాల ద్వారా వేలాది మంది పర్యాటకుల తరలింపు. విమాన ఛార్జీలు పెంచవద్దంటూ విమానయాన సంస్థలకు కేంద్రం ఆదేశాలు. అదే రోజు రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు జైషే మొహమ్మద్ మిలిటెంట్ల కాల్చివేత. పాఠశాలలు, కాలేజీల మూసివేత.
- ఆగస్టు 4న ప్రధాన వీధుల్లో బారికేడ్ల ఏర్పాటు. అల్లర్ల నివారణకు ప్రత్యేక వాహనాలు సిద్ధం. సాయంత్రం మాజీ ముఖ్యమంత్రులు మెహబాబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, సాజద్ లోన్‌ల గృహ నిర్బంధం.
- ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ అత్యవసర సమావేశం. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణం రద్దు. ఇదే విషయమై రాజ్యసభలో సోమవారం అమిత్ షా ప్రకటన.