ఏపీని ఎలా విభజించారో మరిచిపోయారా? | We Will Reallocate Statehood Status to Jammu and Kashmir, Says Shah | Sakshi
Sakshi News home page

ఏపీని ఎలా విభజించారో మరిచిపోయారా?

Published Mon, Aug 5 2019 7:30 PM | Last Updated on Mon, Aug 5 2019 7:40 PM

We Will Reallocate Statehood Status to Jammu and Kashmir, Says Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కశ్మీర్‌ను దేశంలో సంపూర్ణంగా ఐక్యం చేయడం, రక్తపాతం, ఉగ్రవాదానికి తావు లేని ప్రశాంత ప్రాంతంగా చూడటమే తమ లక్ష్యమని, అందులో భాగంగానే జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లుపై జరిగిన చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. చర్చ అనంతరం భారీ మెజారిటీతో ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. రానున్న ఐదేళ్లలో కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని, సాధారణ పరిస్థితులు పునరుద్ధరించిన అనంతరం జమ్మూకశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా ఇస్తామని అమిత్‌ షా స్పష్టం చేశారు. ఎక్కువకాలం జమ్మూకశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చూడాలనుకోవడం లేదన్నారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ విభజన బిల్లు విషయంలో ప్రతిపక్ష ఆరోపణలను ప్రస్తావిస్తూ.. అమిత్‌ షా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విజభన గురించి ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు ఎలా విభజించిందో అందరికీ తెలుసునని, తలుపులు మూసి, లైవ్‌ ప్రసారాన్ని నిలిపేసి నాడు సభలో విభజన బిల్లును ఆమోదింపజేశారని తప్పుబట్టారు. కానీ, కశ్మీర్‌ విషయంలో తాము అలా చేయడం లేదని, ఈ బిల్లుపై అభ్యంతరాలు చెప్పుకోవడానికి ప్రతిపక్ష సభ్యులకు అవకాశమిచ్చామని తెలిపారు. కశ్మీర్‌ ఒక భూతల స్వర్గమని, అది అలాగే ఉంటుందని, ఆర్టికల్‌ 370 రద్దుతో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, పర్యాటక రంగం వృద్ధి సాధిస్తుందని, శాంతిభద్రతలు మెరుగుపడతాయని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

కశ్మీర్‌ హింసకు ఎవరు బాధ్యత వహిస్తారు?
ఆర్టికల్‌ 370ని కొనసాగించడం వల్ల జమ్మూకశ్మీర్‌లో భారీ రక్తపాతం, హింస చోటుచేసుకుందని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆర్టికల్‌ 370 కారణంగా జమ్మూ, కశ్మీర్‌, లడఖ్‌ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయని, ఈ ఆర్టికల్‌ వల్ల స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చే అధికారం కేంద్రానికి లేకుండాపోయిందని, దీని రద్దుతో రేపటి నుంచే జమ్మూకశ్మీర్‌లోని స్థానిక సంస్థలకు నిధులిస్తామని అమిత్‌ షా తెలిపారు. పాక్‌ నుంచి వలస వచ్చిన మన్మోహన్‌సింగ్‌, ఐకే గుజ్రాల్‌ వంటి వారు మనదేశ ప్రధానులయ్యారని గుర్తు చేశారు. దేశానికి సంబంధించిన అంశం ఇదని, ఈ విషయంలో మతపరమైన రాజకీయాలు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్‌ 370 వల్ల జమ్మూ ప్రజలు ఎన్నో అవమానాలకు గురయ్యారని, వారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ఇన్నాళ్లు కశ్మీర్‌ను మూడు కుటుంబాలే శాసించాయి, దోచుకున్నాయని పరోక్షంగా మెహబూబా ముఫ్తి, ఒమర్‌ అబ్దుల్లా, వేర్పాటవాద నాయకులను వేలెత్తిచూపారు. కొందరు నేతల అక్రమాలపై దర్యాప్తు జరుపుతున్నామని, ఈ విచారణతో చలికాలంలోనూ వారికి చెమటలొస్తాయని చెప్పారు.

కశ్మీర్‌ అభివృద్ధికి ఆ ప్రాంత స్వయం ప్రతిపత్తే అడ్డుపడుతోందని, దీనివల్ల కశ్మీర్‌ లోయలో కొత్తగా పరిశ్రమలు రావడం లేదని, యువతకు సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదని అన్నారు. జమ్మూకశ్మీర్‌లో కొత్త పరిశ్రమలు స్థాపించడానికి వీలు లేనప్పుడు ఇంకా ఉద్యోగాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని, దీనితో అభివృద్ధి జరగడం లేదన్నారు. న్యాయబద్ధంగా స్థిరపడదామని వచ్చిన వాళ్లను కూడా అడ్డుకుంటున్నారని, కొందరికీ కశ్మీర్‌ అభివృద్ధి చెందడం ఇష్టమే లేదని విమర్శించారు.

ఉగ్రవాదాన్ని ఎగదోసి.. కొందరు యువతను పక్కదారి పట్టించారని, దేశవ్యాప్తంగా ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండగా.. కశ్మీర్‌లో ఎందుకు లేవని ప్రశ్నించారు. సామాన్యుడికి దక్కాల్సిన న్యాయాన్ని కూడా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కశ్మీర్‌ విభజన బిల్లును కోర్టుల్లో కేసులతో కొందరు అడ్డుకోవాలని చూస్తారని తెలుసునని, కానీ, న్యాయమైన ఈ బిల్లును కోర్టులు అడ్డుకోవని తాను భావిస్తున్నానని చెప్పారు. చట్టపరంగా ఎలాంటి లోపం లేకుండా కశ్మీర్‌ బిల్లును రూపొందించామని, కశ్మీర్‌ను శాసించిన కొందరు పిల్లలు విదేశాల్లో చదువుతుండగా.. కశ్మీర్‌ యువత మాత్రం చదువులులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 370 లేకుండానే నాడు హైదరాబాద్‌ సంస్థానాన్ని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ భారతదేశంలో విలీనం చేశారని, కానీ, కశ్మీర్‌ సంస్థానాన్ని మాత్రం భారత్‌లో విలీనం చేసేందుకు జవహర్‌ లాల్‌ నెహ్రూ ఆర్టికల్‌ 370ని తీసుకొచ్చారని విమర్శించారు. ఆర్టికల్‌ 370 లేకపోవడం వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందన్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలంటే ధైర్యం కావాలని, ఆ ధైర్యం ఉంది కాబట్టే.. దేశ సమగ్రత కోసం నరేంద్ర మోదీ సర్కార్‌ ఆర్టికల్‌ 370ని రద్దు చేసిందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement