మోదీ నేతృత్వంలోని కేంద్రం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే అత్యంత సంచలన, సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దశాబ్దాల సంఘ్ పరివార్ కలను, ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కశ్మీర్‌లో 72 ఏళ్ల నుంచి నలుగుతున్న వేర్పాటువాదం, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తూ.. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణాలను రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది.
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేసింది. అలాగే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన తీర్మానం, బిల్లులను కేంద్రం సోమవారమే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది.
ఈ బిల్లులు, తీర్మానాన్ని లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనుండగా, దిగువ సభలో ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉండటంతో అక్కడ కూడా వీటిని ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి నల్లేరు మీద నడకే కానుంది. కేంద్రం చర్యను అనేక పార్టీలు, వివిధ వర్గాల ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించగా, కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు తదితర ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ పార్టీల సభ్యులు తీవ్ర నిరనలకు దిగారు. కేంద్ర ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందనీ, భారత చరిత్రలో ఇదో చీకటి రోజని వారు ఆరోపించారు.
గతకొన్ని రోజులుగా కశ్మీర్‌లో నెలకొన్న హైడ్రామాకు సోమవారం తెరపడింది. భారీ సంఖ్యలో బలగాల తరలింపు, అమర్‌నాథ్ యాత్రికులు, పర్యాటకులను కశ్మీర్ నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలనడం తదితరాల నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠ వీడింది. ప్రతిపక్షాల భయాల్ని నిజం చేస్తూ, లేదు లేదంటూనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేసిన అనంతరం ఆ తీర్మానాన్ని హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టగా, సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
అలాగే జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడగొట్టి లదాఖ్ ప్రాంతాన్ని పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేసింది. లదాఖ్ కాకుండా, మిగిలిన జమ్మూ కశ్మీర్‌ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగానే మార్చింది. అయితే ఢిల్లీ, పుదుచ్చేరిల్లో లాగానే జమ్మూకశ్మీర్ కూడా అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. సరిహద్దుల మార్పులకు సంబంధించి ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’ని కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశ పెట్టగా, ఓటింగ్ అనంతరం సభ ఈ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. ఈ తీర్మానం, బిల్లులను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అక్కడ అధికార పక్షానికి భారీ ఆధిక్యం ఉండటంతో ఆమోదం సులభం కానుంది.
తీర్మానం, బిల్లులు ఆమోదం పొందడంతో బీజేపీతోపాటు పలు పార్టీల నేతలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్దాల నాటి చారిత్రక తప్పిదాన్ని తమ పార్టీ సరిచేసిందని బీజేపీ పేర్కొంది. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లో ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)లతోపాటు ప్రధాన విపక్ష పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు కేంద్రం చర్యను తీవ్రంగా నిరసించాయి. కాగా, ఎన్‌సీ, పీడీపీ నేతలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతోపాటు పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జద్ లోనేను కూడా సోమవారం సాయంత్రం శ్రీనగర్‌లో అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో ఇంటర్నెట్ కనెక్షన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
రెండు జెండాలు ఉండవు: షా
సభ అనంతరం అమిత్ షా ఓ ట్వీట్ చేస్తూ ఇకపై కశ్మీర్‌లో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండవని పేర్కొన్నారు. ‘ఐక్య భారత దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసిన దేశ భక్తులందరికీ మా ప్రభుత్వం అర్పిస్తున్న నివాళే ఈ నిర్ణయం. యావత్ దేశానికీ అభినందనలు. ఎన్నో ఏళ్ల నుంచి నలుగుతున్న చరిత్రాత్మక తప్పిదాన్ని ఈరోజు మోదీ ప్రభుత్వం సరిచేసింది’అని అమిత్ షా ట్విట్టర్‌లో తెలిపారు. మాతృభూమి ఐక్యత, సమగ్రత కోసం దృఢ సంకల్పంతో నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అభినందించారు. జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల్లో శాంతి, అభివృద్ధితో కూడిన కొత్త ఉదయానికి తమ చరిత్రాత్మక నిర్ణయం తలుపులు తెరుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ నాయకుడు రాం మాధవ్ కూడా ట్వీట్ చేస్తూ, జమ్మూకశ్మీర్ దేశంలో సంపూర్ణంగా భాగం అవ్వడం కోసం పోరాడి త్యాగాలు చేసిన, డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నుంచి అనేక మంది దేశభక్తులకు గౌరవం దక్కిందని కొనియాడారు.
అమిత్ షా ప్రసంగానికి మోదీ ప్రశంసలు
రాజ్యసభలో చర్చ సందర్భంగా అమిత్ షా చేసిన ప్రసంగాన్ని మోదీ అభినందించారు. గతంలో జరిగిన చారిత్రక అన్యాయాలను అమిత్ షా ఎంతో సవ్యంగా వివరించారనీ, జమ్మూ కశ్మీర్ ప్రజల పట్ల ప్రభుత్వ దృక్పథాన్ని చక్కగా వివరించారని ప్రశంసించారు. అమిత్ షా ప్రసంగాన్ని మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. షా ప్రస్తావించిన విషయాలు విస్తృతంగా, లోతైన విశ్లేషణలతో ఉన్నాయని మోదీ అన్నారు.
ఇంతకుముందు.. ఇకపై..
► మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉండేవి..
► ఇకపై ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉండవు
► రాష్ట్రప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉండేది..
► ఇకపై ఒకే పౌరసత్వం
► రాష్ట్రానికి ప్రత్యేకంగా జెండా ఉంది..
► ఒకే పతాకం.. అది త్రివర్ణమే..
► ఆర్టికల్ 360(ఆర్థిక అత్యయిక స్థితి) అమలు చేయలేం..
► ఆర్టికల్ 360 అమలు చేయొచ్చు..
► పంచాయతీలకు హక్కులు లేవు
► మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే.. పంచాయతీలకు హక్కులు
► శాసనసభ కాలపరిమితి ఆరేళ్లు
► శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు
► హిందువులు, సిక్కులు తదితర మైనార్టీలకు రిజర్వేషన్లు లేవు
► ఇప్పుడు 16 శాతం రిజర్వేషన్ల అమలు
► వేరే రాష్ట్రాల వారు ఇక్కడ భూములు, ఆస్తులు కొనడం నిషేధం
► అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ భూమి, ఆస్తులు కొనవచ్చు
► సమాచారహక్కు చట్టం వర్తించదు
► సమాచారహక్కు చట్టం అమలు
► వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఇక్కడి మహిళ పెళ్లాడితే ఆమెకున్న స్థానిక పౌరసత్వం, హక్కులు పోతాయి.
► భారతీయుడ్నిగానీ, విదేశీయుడ్నిగానీ పెళ్లాడినా స్థానిక హక్కులు పోవు. భారత పౌరసత్వం ఉంటుంది..
Comments
Please login to add a commentAdd a comment