35ఏ రద్దు? కశ్మీర్‌లో హైటెన్షన్‌.. క్షణక్షణం ఉద్రిక్తత | High Tension in Kashmir Over Possible Scrapping of Article 35 A | Sakshi
Sakshi News home page

35ఏ రద్దు? కశ్మీర్‌లో హైటెన్షన్‌.. క్షణక్షణం ఉద్రిక్తత

Published Sun, Aug 4 2019 6:12 PM | Last Updated on Sun, Aug 4 2019 6:34 PM

High Tension in Kashmir Over Possible Scrapping of Article 35 A - Sakshi

న్యూఢిల్లీ/శ్రీనగర్‌: కశ్మీర్‌లో హైటెన్షన్ నెలకొంది. క్షణక్షణం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. లోయలో పరిస్థితులు, పరిణామాలు.. ఢిల్లీలోనూ హీట్‌ పెంచుతున్నాయి. హస్తినలోనూ వరుస భేటీలు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భద్రతావ్యవహారాల కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. పార్లమెంట్‌లోని షా ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్‌, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా పాల్గొన్నారు. కశ్మీర్‌లో తాజా పరిస్థితిపై చర్చించారు. కశ్మీర్‌లో ఏదో జరగబోతోందన్న ఊహాగానాల మధ్య ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ ముగిసిన వెంటనే కశ్మీర్ వ్యవహారాల అదనపు కార్యదర్శి జ్ఞానేష్‌కుమార్‌తోనూ షా సమావేశమై చర్చలు జరిపారు. మరోవైపు రేపు ఉదయం కేంద్ర కేబినెట్‌ భేటీ కానుంది. జమ్ము కశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్ము కశ్మీర్‌ రిజర్వేషన్‌ రెండో సవరణ బిల్లు-2019ను అమిత్ షా రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. వరుస భేటీలతో కేంద్రం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ మరింత పెరుగుతోంది.

ఆర్టికల్‌ 35 ఏ రద్దు?
కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 35 ఏ రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రేపు ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతోంది. ఈ కీలక భేటీలో కశ్మీర్ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కశ్మీర్‌ నుంచి ఇతర రాష్ట్రాల విద్యార్ధులను, పర్యాటకులను ఇప్పటికే ప్రభుత్వం స్వస్థలాలకు తరలిస్తోంది. కశ్మీర్ అంతటా ప్రత్యేక బలగాలను ప్రభుత్వం  మోహరించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి మొదలైన సంగతి తెలిసిందే.

బ్యాట్‌ సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లండి
భారత సైన్యం హతమార్చిన పాకిస్థాన్‌కు చెందిన బోర్డర్‌ యాక్షన్‌ టీం BAT సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లడానికి పాక్‌కి ఇండియన్‌ ఆర్మీ అవకాశం కల్పించింది. తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లమని సూచించింది. దీనిపై ఆ దేశం స్పందించాల్సి ఉంది. భారత సైనిక పోస్టులపై దాడికి యత్నించిన పాక్‌ బ్యాట్‌ బృందం కుయుక్తులను మన జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. జమ్ముకశ్మీర్‌ కుప్వారా జిల్లా కీరన్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన ఏడుగురుని భారత సైనికులు హతమార్చారు. బ్యాట్‌ దాడి యత్నం జులై 31 అర్ధరాత్రి తర్వాత, ఆగస్టు 1 తెల్లవారుజాము వేళలో జరిగినట్లు సమాచారం. మృతులు పాక్‌ సైన్యానికి చెందిన స్పెషల్‌ సర్వీస్‌ గ్రూప్‌ కమాండోలుగానీ, ఉగ్రవాదులుగానీ కావచ్చని భావిస్తున్నారు.

జమ్మూకశ్మీర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. అదనపు బలగాల మోహరింపు, అమర్‌నాథ్ యాత్ర రద్దు, చొరబాటుదారుల ఏరివేత... ఇలా వరుస ఘటనలతో చల్లని కశ్మీరం వేడెక్కింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు కార్గిల్‌ సెక్టార్‌లో ఉద్యోగులెవరూ విధినిర్వహణ ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని, ఫోన్‌లు తప్పనిసరిగా ఆన్‌లో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సరిహద్దులో బోఫోర్స్‌ శతఘ్నుల్ని మొహరించినట్లు తెలుస్తోంది. తగినంత సంఖ్యలో డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని హాస్పిటల్స్‌కి సూచనలు అందాయి. తాజా పరిస్థితుల్లో కశ్మీర్‌లో పర్యటనలు వద్దంటూ బ్రిటన్‌, జర్మనీ, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ పౌరులకు అప్రమత్త సూచనలు చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement