Article 35 A
-
ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజ్యంగంలోని ఆర్టికల్ 35ఏ జమ్మూకశ్మీర్‌లో నివసించని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవీ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 35ఎ జమ్మూ కాశ్మీర్లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను లేకుండా చేసిందని అన్నారు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటే భారత రాజ్యాంగం గొప్పది రాష్ట్ర ప్రభుత్వంలో సమాన అవకాశాలు, ఉద్యోగాలు, భూమిని కొనుగోలు చేసేటటువంటి హక్కులను ఈ ఆర్టికల్ పౌరుల నుంచి దూరం చేసిందని తెలిపారు. వీటిపై జమ్మూకశ్మీర్ నివాసితులకు ప్రత్యేక హక్కులు ఉండటం వల్ల.. ఇతరులు(రాష్ట్రేతరులు) ఈ హక్కులను కోల్పోయారని అన్నారు. భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటే ఉన్నతమైనదన్నకేంద్ర వాదనను సీజేఐ ఏకీభవించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్టికల్ 370తోపాటు 35ఏ ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2019లో రద్దు చేసింది. ఈ రెండు అధికరణలు జమ్మూకశ్మీర్ ప్రజలకు విశేష అధికారాలు కల్పించాయి. వారిని శాశ్వత నివాసులుగా నిర్వచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ఆస్తి కొనుగోలు, సెటిల్మెంట్ పరంగా ప్రత్యేక హక్కులు అందించాయి. చదవండి: లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ మూడు హక్కులను లాగేసుకుంది అదే సమయంలో 35ఏ ఆర్టికల్ రాష్ట్రేతరుల ప్రాథమిక హక్కులను కాలరాసిందని చంద్రచూడ్ అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించే ఆర్టికల్ 16(1), దేశంలో ఎక్కడైనా నివసించే, స్థిరపడే హక్కును కల్పించే ఆర్టికల్ 19(1)(e), ఆస్తి కొనుగోలు, వృత్తి వ్యాపారం చేయగల స్వేచ్చ 9(1)(f) వంటి మూడు ప్రాథమిక హక్కులను 35ఏ అధికరణ హరించిందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి.. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. జమ్మూకశ్మీర్‌లోని శాశ్వత నివాసితులు, ఇతర నివాసితుల మధ్య మాత్రమే కాకుండా దేశంలోని ఇతర పౌరుల మధ్య కూడా వ్యత్యాసాన్ని సృష్టించిందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా దేశం మొత్తాన్ని ఏకరీతిన ఉంచిందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఉంచిందన్నారు. రాష్ట్రంలో గతంలో అమలు చేయని సంక్షేమ పథకాలన్నింటినీ ఇది అమలు చేస్తుందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా విద్యాహక్కును పేర్కొన్నారు. ఆర్టికల్ 370ను తొలగించే వారకు భారత రాజ్యంగంలో చేసిన ఏ సవరణ కూడా జమ్మూకశ్మీర్‌కు వర్తించేది కాదని, దీని ప్రకారం 2019 వరకు అక్కడ విద్యా హక్కు ఎప్పుడూ అమలు కాలేదని వివరించారు. -
కశ్మీర్ పైనే అందరి దృష్టి ఎందుకు?
కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఒక వర్గం, ఒక జాతి జనులే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లోని మెజారిటీ ప్రజలు హర్షిస్తున్నారు. రచయితలు, జర్నలిస్టులు, విద్యావేత్తలు, పదవీ విరమణ చేసిన దౌత్యవేత్తలు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఇలా అందరూ కేంద్రం తీసుకున్న నిర్ణయం మంచికేనని చెబుతున్నారు. ఏమిటా మంచి? వాళ్లనుకున్న మంచి నిజంగా జరిగేనా? తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
ఒక కశ్మీర్... రెండు సందర్భాలు
శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో చెప్పే కథను అనేక మార్లు విని ఉన్నప్పటికీ వ్రతం చేసిన ప్రతిసారి విని తీరాలన్న నియమం ఉంది. అలాగే ఒక సందర్భాన్ని విశ్లేషించడానికి ముందు దాని పూర్వరంగాన్ని ప్రస్తా వించడం కూడా ఒక వ్రత నియమం లాంటిదే. ‘దేజావూ’ అనే ఒకరకమైన భ్రాంతికి లోనుకాకుండా ఉండేందుకు ‘కట్టె–కొట్టె–తెచ్చే’ అనే సిద్ధాంతాన్ని అను సరించి కశ్మీర్ భౌగోళిక, చారిత్రక అంశాలను రేఖా మాత్రంగా గుర్తు చేసుకుందాము. భారతదేశ చిత్ర పటంలో మకుటాయమానంగా కనిపించే ప్రాంతమే జమ్మూ–కశ్మీర్. ఇందులో దాదాపుగా సగం ప్రదేశం పాకిస్తాన్, చైనాల ఆక్రమణలో ఉంది. వారి ఆక్రమణను భారత దేశం అధికారికంగా గుర్తించదు కనుక మనం ముద్రించే పటాల్లో మొత్తం జమ్మూ–కశ్మీర్ మన దేశంగానే కనిపిస్తుంది. ఈ రాష్ట్రాన్ని నిలువునా తూర్పు– పడమరలుగా విభజిస్తే తూర్పు ప్రాంతమంతా లదాఖ్. దీనికి తూర్పున టిబెట్ ఉంటుంది. లదాఖ్ పైభాగంలో ఉండే సియాచిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. పడమటి ప్రాంతంలో కొమ్ములాగా వాయువ్యం వైపు విస్తరించిన ప్రాంతమంతా గిల్గిట్–బాల్టిస్తాన్. కారా కోరం, పామిర్, హిందూకుశ్ పర్వత శ్రేణులు విస్తరిం చిన ప్రాంతం. గిల్గిట్‌కు దక్షిణంగా ఉన్న లోయ కశ్మీర్. దానికి దిగువన ఉండే ప్రాంతం జమ్మూ. గిల్గిట్లోనూ, కశ్మీర్‌లోనూ ఉన్నది ప్రధానంగా ముస్లిం మతస్తులే అయినా, వారి మధ్యన చాలా తేడాలున్నాయి. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా ఏ మాత్రం సాపత్యం కుదరని భిన్న జాతులు అవి. గిల్గిట్–బాల్టిస్తాన్లోని తుర్కీ ఛాయలున్న గిరిజన తెగల వారు సెంట్రల్ ఏషియా దేశాల ఆచార వ్యవహారాలకు దగ్గరగా ఉంటారు. బాల్టిస్తాన్ ఉత్తర దిక్కున ట్రాన్స్‌కారాకోరం జమీన్‌ను చైనాకు పాకిస్తాన్ కట్టబెట్టింది. దీనిని ‘షాక్స గమ్’ అని పిలుస్తారు. ఇక్కడ గమనించదగిన అత్యంత కీలక విషయం ఒకటి ఉంది. ప్రాచీన కాలం నుంచి భారతదేశానికి, సెంట్రల్ ఏషియా దేశాలకు మధ్య రహదారిలా ఉండిన కారాకోరం కనుమ మార్గం ఈ షాక్సగమ్ అధీనంలో ఉంటుంది. వందల ఏళ్ల నాటి చైనా–యూరప్ సిల్క్‌రోడ్డు కూడా దీనికి చేరువలో ఉంటుంది. కశ్మీర్ ప్రజలు సహజంగా మర్యాదస్తులు. మతసహనం ఎక్కువగా ఉన్నవారు. శివాలయాలు ఎక్కువగా ఉన్న కశ్మీర్ లోయలో శైవం ప్రభావం కూడా ఎక్కువే ఉంది. బౌద్ధ ప్రబోధాలు, సూఫీ బోధనల ప్రభావం కూడా కశ్మీర్ ముస్లింలపై ఉంది. కశ్మీర్ ప్రజల సంస్కృతిని, జీవనవిధానాన్ని ‘కశ్మీరియత్’ అని పిలు స్తారు. కశ్మీరత్వం అనేది వారి ఆత్మ లాంటిది. పర్యాటక రంగం ఎక్కువ కనుక ఆతిథ్య స్వభావం వారి రక్తంలోనే ఉంది. కశ్మీర్ లోయకు దక్షిణ ప్రాంతమైన జమ్మూలో హిందువుల సంఖ్య అధికం. చైనా ఆక్రమించిన ఆక్సా యిచిన్ పోగా మిగిలిన లదాఖ్ రెండు భాగాలు. కార్గిల్ డివిజన్లో ముస్లిం జనాభా ఎక్కువ. లేహ్ డివిజన్లో బౌద్ధులు ఎక్కువ. పలుచగా హిందువులు కూడా ఉంటారు. మొత్తంగా 40 శాతం బౌద్ధ మతస్తులున్న ఏకైక భౌగోళిక యూనిట్ దేశంలో లదాఖ్ మాత్రమే. వేరువేరు భాషలూ, సంస్కృతులూ, విభిన్నమైన భౌగో ళిక స్వరూపాలున్న ఈ ప్రాంతాలన్నీ కలిపి ఒక రాష్ట్రంగా ఎలా ఉన్నాయి? పంజాబ్ పాలకుడైన మహారాజా రంజిత్‌సింగ్ స్థాపించిన సువిశాల సిక్కు సామ్రా జ్యంలో ఒకప్పుడు ఇవన్నీ భాగంగా ఉండేవి. కశ్మీర్ ప్రాంతాన్ని డోగ్రా రాజవంశీకులు సామంతులుగా పాలించేవారు. తర్వాత కాలంలో ఆంగ్లేయులతో జరిగిన యుద్ధంలో సిక్కు సామ్రాజ్యం పతనమైంది. ఇంగ్లీషు వాళ్లకు అప్పటి కశ్మీర్ పాలకుడైన గులాబ్‌సింగ్ పెద్ద మొత్తంలో ముడు పులు సమర్పించుకుని, గిల్గిట్, లదాఖ్, జమ్మూ ప్రాంతా లను తన రాజ్యంలో కలిపే సుకున్నాడు. గులాబ్‌సింగ్ విశ్వాస పాత్రతను మెచ్చిన బ్రిటిష్ వాళ్లు ఒక స్వతంత్ర రాజ్యంగా జమ్మూ–కశ్మీర్‌ను కొనసాగనిచ్చారు. సందర్భం 1: గులాబ్‌సింగ్ వారసుడే రాజాహరిసింగ్. దేశ విభజన నాటి జమ్మూ–కశ్మీర్ పాలకుడు. విభజన సమయంలో స్వతంత్ర రాజ్యంగానే జమ్మూ–కశ్మీర్ ఉండాలనేది రాజా హరిసింగ్ ఆకాంక్ష. ఏకకాలంలో అటు మహ్మదాలి జిన్నాతోను, ఇటు జవహర్లాల్ నెహ్రూతోనూ రాయ బారాలు నడిపాడు. అదే సమయంలో కశ్మీర్‌ను ఆక్ర మించుకోవడానికి పాక్ రంగంలోకి దిగింది. పఠాన్ లను, గిరిజన తెగలనూ రెచ్చగొట్టి యుద్ధంలోకి దిం చింది. ఈ క్రమంలో గిల్గిట్–బాల్టిస్తాన్ పూర్తిగా, కశ్మీర్ లోయ, జమ్మూలోని కొన్ని ప్రాంతాలు పాక్ అధీనంలోకి వచ్చాయి. ఈ సమయంలో రాజా హరి సింగ్ భారత సహకారాన్ని అర్థించడంతో భారతసైన్యం రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడున్న ఆధీనరేఖ (ఎల్వోసీ) ఆవలి వైపున పాక్ నిలిచిపోయింది. హరి సింగ్ భారత సాయాన్ని అర్థించినప్పుడే జమ్మూ– కశ్మీర్‌ను భారత్‌లో కలిపేందుకు సమ్మతించాడు. అందుకు అనుగుణంగా తన జమ్మూ–కశ్మీర్ రాజ్యాన్ని (గిల్గిట్–బాల్టిస్తాన్, లదాఖ్, జమ్మూలతో సహా) భార త్లో విలీనం చేస్తూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కొనసాగాలనే షరతును పెట్టాడు. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ షరతును అంగీ కరించడం మినహా నెహ్రూకు మరో ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఎందుకంటే రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు ముస్లిం మతస్తులు. హరిసింగ్ నిర్ణయం పట్ల అప్పటికే నిరసనలు మొదలయ్యాయి. అవి మరింత పెరిగితే సమస్య జటిలమవుతుంది. రెండో విషయం, రాజా హరి సింగ్ రాష్ట్రం మొత్తాన్ని భారత్‌లో విలీనం చేసేలా సంతకం పెడుతున్నాడు. దీని ఆధారంగా ఐక్యరాజ్యస మితి జోక్యంతో పాక్‌ను దురాక్రమణదారుగా ప్రకటించి ఆక్రమిత ప్రాంతాల నుంచి తరిమివేయవచ్చని, అన్ని ప్రాంతాలూ భారత యూనియన్‌లో భాగంగా ఉంటా యని నెహ్రూ భావించాడు. ఆపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు కూడా చేశాడు. కాకపోతే ఆ ఫిర్యాదు ముందుకు కదల్లేదు. మూడో అంశం, బ్రిటిష్ కాలం లోనూ జమ్మూ–కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని అనుభవిం చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టు కుని షరతులకు నెహ్రూ సమ్మతించాడు. ఫలితంగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతి పత్తిని కల్పిస్తూ భారత రాజ్యాంగంలో 370వ అధికరణాన్ని చేర్చారు. ఈ అధికరణం ఆధారంగా కశ్మీర్ ప్రజల స్థానికతను నిర్వచిస్తూ తదనంతర కాలంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 35ఎ అధికరణాన్ని చేర్చారు. సందర్భం 2: రాజ్యాంగబద్ధమైన గౌరవాలను కశ్మీర్ ఎక్కువ కాలం అనుభవించలేకపోయింది. ప్రధానమంత్రి పదవి పోయి ముఖ్యమంత్రి పదవి మిగిలింది. పార్లమెంటు అసెం బ్లీగా మారిపోయింది. 370 అధికరణ కూడా నీరుగారి పోయింది. సంకేత ప్రాయంగా ఒక ప్రత్యేక జెండా, చెప్పుకోవడానికి ఓ రాజ్యాంగం మిగిలింది. కశ్మీర్ స్థాని కత నిర్వచనం కారణంగా మిగతా దేశ ఆర్థిక అభివృద్ధితో సమన్వయం కాలేక వెనుకబడిపోయింది. చివరకు షేక్ అబ్దుల్లా లాంటి జనాదరణ కలిగిన నాయ కుడిని జైల్లో పెట్టారు. క్రమంగా కశ్మీర్ విద్యావంతులు కొందరిలో ఒక అసంతృప్తి ఏర్పడింది. కశ్మీర్ స్వతంత్ర రాష్ట్రం కోసం జేకేఎల్ఎఫ్ లాంటి సంస్థలు పనిచేయడం ప్రారంభిం చాయి. ప్రత్యక్ష యుద్ధాల్లో గెలవడం సాధ్యం కాదని భావించిన పాక్ ఇదే అదనుగా ఉగ్రవాద మూక లకు శిక్షణ ఇచ్చి కశ్మీర్లో చిచ్చు పెట్టడం ప్రారంభిం చింది. అంతర్జాతీయంగా ఇస్లామిక్ టెర్రరిజం ప్రబలిన నేప థ్యం కూడా పాక్‌కు కలసి వచ్చింది. పెద్ద సంఖ్యలో యువకులను ప్రభావితం చేసి తన స్వార్థం కోసం మిషన్ కశ్మీర్ పేరుతో పంపించడంతో ఇక్కడ పరిస్థి తులు అదుపు తప్పాయి. మత సహనానికి మారుపేరైన కశ్మీర్ యువతరం మనసుల్లో కూడా విషబీజాలను నాటగలిగారు. ఉగ్రవాదాన్ని అణచివేసే నెపంతో భారత భద్రతా దళాలు వ్యవహరించిన తీరు కూడా కశ్మీర్ ముస్లిం ప్రజలకూ–భారత్‌కూ మధ్య దూరాన్ని పెంచింది. ఈ నేపథ్యంలో కశ్మీర్ వేరు, భారత్ వేరు అనే అభిప్రాయాలను తక్షణం దూరం చేయాల్సిన అవసరం ఉంది. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని నిర్ద్వంద్వంగా ప్రకటించి అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయా ల్సిన అవసరం ఏర్పడింది. కశ్మీర్ ప్రజల విశ్వాసాలను చూరగొని మళ్లీ ‘కశ్మీరియత్’ పునరుద్ధరించడం భార తీయ సమాజం బాధ్యత. లేకుంటే ఈ రావణ కాష్ట రగులుతూనే ఉంటుంది. ఈ 70 సంవత్సరాల కాలంలో ప్రపంచం రూపు రేఖలు చాలా మారిపోయాయి. అప్పటిలాగా వలస దోపిడీ నుంచి అప్పుడే విముక్తి పొందిన తరుణ స్వతంత్ర దేశం కాదు. భారత్ ఇప్పుడొక ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశం. ఈ దేశంలోని 130 కోట్ల మంది జీవన ప్రమాణాలను పెంచుకోవాలన్నా, కోటా నుకోట్ల మంది నవతరం బిడ్డలకు ఉజ్వలమైన భవి ష్యత్తును నిర్మించాలన్నా ఒక గ్లోబల్ పవర్‌గా భారత్ ఎదగక తప్పదు. అలా ఎదగాలంటే ప్రపంచ వర్తక – వాణిజ్యాలను, కనీసం దక్షిణాసియా ప్రాంతంలోనైనా శాసించగలిగే శక్తిని కూడదీసుకోవాలి. ఒకపక్క చైనా శరవేగంగా దూసుకొస్తున్నది. దక్షిణ చైనా సముద్రం నుంచి మలక్కా జలసంధి, బంగాళాఖాతం, అరేబియా సముద్రాల గుండా పర్షియన్ గల్ఫ్, ఎర్రసముద్రాలను దిగ్బంధం చేసే విధంగా ‘ముత్యాలదండ’ పేరుతో ఓడరేవుల సమీపంలో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే సన్నాహాల్లో చైనా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. రాజా హరిసింగ్ విలీనం చేసిన ప్రకారం భారతదేశానికి చెందిన గిల్గిట్–బాల్టిస్తాన్లోని ట్రాన్స్‌కారాకోరం జమీ న్ను పాకిస్తాన్ చైనాకు అప్పగించింది. అక్కడి నుంచి గిల్గిట్–బాల్టిస్తాన్ గుండా పాకిస్తాన్ నైరుతి దిక్కున ఉన్న గ్వదర్ రేవు పట్టణం వరకు చైనా ఒక బ్రహ్మాండమైన కారాకోరం హైవేను నిర్మిస్తున్నది. గ్వదర్ రేవు పాక్ నైరుతి దిక్కున అరేబియా సముద్ర తీరంలో పర్షియన్ గల్ఫ్‌కు ముఖద్వారం లాగా ఉంటుంది. ఈ రేవును చైనాకు 40 ఏళ్ల కౌలుకు పాక్ అప్పగించింది. ఇకముందు పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు మోసుకొచ్చే నౌకలకు చైనా చెక్‌పోస్టును సిద్ధం చేస్తున్న దృశ్యమిది. కశ్మీర్ సమస్యపై మూడో శక్తి ప్రమేయానికి భారత్ వ్యతిరేకం. కానీ, ఈ సమస్యతో ముడిపడి ఉన్న గిల్గిట్–బాల్టి స్తాన్‌లో దాదాపు 10 దేశాలు నిర్మాణ కార్యక్రమాలు సాగిస్తున్నాయి. పెట్టుబడులూ పెడుతున్నాయి. ఇందులో చైనాదే సింహభాగం. విలువైన ఖనిజ సంపదకు ఈ ప్రాంతం నిలయం. హిమనీనదాల్లో అపారమైన జలసంపద నిక్షిప్తమై ఉంది. పర్వత ప్రాంతం కావడం వల్ల హైడల్ పవర్ ఉత్పత్తికి అను కూలం. ఒక్కS సింధూ నది మీదనే ఈ ప్రాంతంలో 40 వేల మెగావాట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చట. భారతదేశంలో ఉన్న మొత్తం జలవిద్యుత్ ప్రాజెక్టుల స్థాపిత సామర్థ్యంతో ఇది దాదాపు సమానం. సింధూ ఉపనదుల మీద మరో 2 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చట. కారాకోరం హైవేపై ఇప్పుడు సరుకు రవాణా వాహనాలు తిరుగుతుండవచ్చు. రేపు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాహనాలు కూడా ఈ రహదారిపై తిరిగే అవకాశం లేకపోలేదు. ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న ఈ పరిణామాలను గట్టిగా ప్రశ్నించా లంటే, అడ్డుకోవాలంటే భారత అధీనంలోని భూభా గంపై భారత సార్వభౌమాధికారం పట్ల ఎటువంటి సందిగ్ధతకు తావుండరాదు. రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు చెల్లవు. మోదీ చర్య చారిత్రక అనివార్యం. బౌద్ధ ధర్మం ఆసియా ఖండం మొత్తంలో విస్తరించినా, పాపం... భారతదేశంలో మాత్రం ఒక్క స్థావరం కూడా మిగల్లేదు. 40 శాతం బౌద్ధ జనాభా గల ఏకైక ప్రాంతం లదాఖ్. కశ్మీర్ చరిత్రకూ, పరిణామాలకూ మౌనసాక్షిగా ఉన్న లదాఖ్ లిటిల్ బుద్ధా ఇప్పుడు నోరు విప్పి చెపుతున్నాడు. ‘అప్పుడు నెహ్రూ చేసింది తప్పేమీ కాదు. ఇప్పుడు మోదీ చేసింది కూడా తప్పేమీ కాదు. వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
ఇమ్రాన్‌పై మోదీ యార్కర్
ఒకే ఒక్క చర్య.. 70 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. దెబ్బతీయడం పాక్ వంతు.. దెబ్బ కాచుకోవడం భారత్ వంతు అనేలా సాగిన యథాతథస్థితి కశ్మీర్లో తల్లకిందులైంది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా, భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని పదునైన యార్కర్‌తో దెబ్బతీసేశారు. కశ్మీర్ సమస్యను ద్వైపాక్షిక సమస్య నుంచి అంతర్జాతీయ సమస్యగా మార్చాలని దశాబ్దాలుగా పాక్ చేసిన ప్రయత్నం ఇప్పుడు మోదీ చర్యతో రెండు దేశాల మధ్య అంతర్గత సమస్యగా మారిపోయింది. యథాతథ స్థితి ఇప్పుడు స్థానం మార్చుకుంది.దాన్ని అంగీకరించినా లేక నిర్లక్ష్యపు దాడులకు దిగినా పాక్ సాధించేదేమీ ఉండదు. కశ్మీర్ లోయలో ఆంక్షలు తొలగించాక ప్రజలు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసి భారత సైనికులు లోయపై తమ పట్టు కోల్పోయేలా చేస్తారనే ఆశ మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్‌కు మిగిలి ఉంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్రమోదీ యార్కర్‌కు చిత్తయ్యారా? క్రికెట్ భాషలో చెప్పాలంటే ఇది నిజమేననిపిస్తోంది. ఇంతవరకు కశ్మీర్ విషయంలో పాకిస్తానే మొట్టమొదటగా పావులు కదుపుతూ వచ్చేది. దానికి భారత్ ప్రతిస్పందించేది. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా భారత ప్రధాని మోదీ ఇంతవరకు సాగిన చరిత్రకు మంగళం పాడేశారు. అది ఎంత బలంగా తగిలిం దంటే తగిన ప్రతిస్పందనకు కూడా సిద్ధం కాలేకపోయిన పాకిస్తాన్ ఏం జవాబు చెప్పాలో తెలీని అయోమయంలో పడిపోయింది. భారత రాజ్యాంగంలోని తమకు అర్థంకాని చిక్కులు, తికమకల గురించి పాక్ జాతీయ అసెంబ్లీలో గత వారం సభ్యులు ప్రదర్శించిన భావోద్వేగాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాక్ చేష్టలుడిగి పోవడానికి అనేక కారణాలున్నాయి మరి. రాజ్యాంగాన్ని తరచుగా చాపచుట్టి, తిరగరాసే అలవాటు ప్రబలంగా ఉన్న పాక్ పాలకుడు భారతదేశంలో అలాంటి ఘటన జరగడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. రాజ్యాంగాన్ని ధిక్కరించడంలో సాటిలేదనిపించుకున్న పాకిస్తాన్ ప్రస్తుత స్పందనకు మంచిన అభాస మరొకటి ఉండదు. రెండోది.. కశ్మీరీయులకు తాను చేసిన హామీలకు భారత్ కట్టుబడాల్సి ఉందని పాక్ ప్రస్తుతం అరచి గీపెడుతోంది. కానీ బహుళ, ద్వైపాక్షిక సమావేశాల్లో తాను చేసిన వాగ్దానానలన్నింటినీ ఉల్లంఘించడం అలవాటుగా పెట్టుకున్న పాక్ మరోవైపు భారత్ స్పందనపై ఇంతగా ఉలిక్కిపడటమే అతిపెద్ద రసాభాస. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏదంటే సిమ్లా ఒప్పందాన్ని భారత్ ఉల్లఘించిందంటూ ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఆరోపణలకు దిగడమే. పైగా, ఫాస్ట్ బౌలింగ్‌లో నిష్ణాతుడైన ఇమ్రాన్ కొద్దిరోజుల క్రితమే వైట్‌హౌస్ నుంచి ప్రకటన చేస్తూ, కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవడంలో భారత్, పాక్ దేశాలు 70 ఏళ్లుగా విఫలమవుతూనే వచ్చాయని, కాబట్టి ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన మిస్టర్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. దాదాపు 31 ఏళ్ల చరిత్ర క్రమంలో (1971లో సిమ్లా ఒప్పందం.. 1999లో లాహోర్ ఒప్పందం 2004లో ఇస్లామాబాద్ ఒప్పందం వరకు) ఇరుదేశాల మధ్య జరిగిన అతి ముఖ్యమైన మూడు ద్వైపాక్షిక ఒప్పందాలు కాగితపు ముక్కల్లాగా తేలిపోయాయి. చేసుకున్న ఒప్పం దాలను పాక్ నేతలందరూ స్వేచ్ఛగా తోసిపుచ్చుతూ వచ్చారు. లాహార్, ఇస్లామాబాద్ డిక్లరేషన్లు సిమ్లా ద్వైపాక్షిక నిబద్ధతను మరోసారి నొక్కి చెప్పాయి. అయితే కశ్మీరును ద్వైపాక్షికంగా ఇరుదేశాలూ పరిష్కరించుకోలేవు కాబట్టి ట్రంప్ జోక్యం చేసుకోవాలని చెబుతూ బయటి ప్రపంచానికి చెప్పిన ఇమ్రాన్ ఈ మొత్తం మూడు ఒప్పందాలను కూడా లాంఛనప్రాయంగానే తోసిపుచ్చేశారు. సిమ్లా ఒప్పంద సారాన్ని తుంగలో తొక్కిన ఇమ్రాన్ ఇప్పుడు మాత్రం భారత్‌పై ఆరోపణలకు లంకించుకున్నారు. విశేషమైన అంశం ఏమిటంటే, కశ్మీర్‌పై ప్రాథమిక వ్యూహాత్మక, రాజకీయ సమీకరణం ఇప్పుడు పూర్తిగా తల్లకిందులైంది. 1947 నుంచి కశ్మీర్‌పై పాకిస్తానే మొదటిబాణం సంధిస్తూ వచ్చింది. ప్రతి ఘర్షణలోనూ పాక్‌దే ముందడుగుగా ఉండేది. 1947లో, 1965లో, చివరకు 1972లో సిమ్లా ఒప్పందం జరిగేవరకు ప్రతి దాడిలోనూ పాకిస్తానే ముందుండేది. ఆ తర్వాత 17 సంవత్సరాలు కాస్త శాంతి నెలకొన్నా, శాశ్వత శాంతి వైపు పాక్ ఎన్నడూ సిద్ధమయ్యేది కాదు. ఈ క్రమంలోనే పాక్ సొంతంగా అణుపరీక్షలు నిర్వహించగలిగింది. ఆప్ఘనిస్తాన్‌లో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వం లోని సంకీర్ణ కూటమి విజయం సాధించడంలో పాకిస్తాన్ అప్రయత్నంగానే తనవంతు సహాయం అందించింది కూడా. పాశ్చాత్య దేశాలకోసం ఒక జిహాద్‌ను గెలిపించిన పాక్ తన వద్ద ఉన్న అణ్వాయుధ దన్నుతో తూర్పువైపున మరొక జిహాద్‌కు రంగం సిద్ధం చేసుకుంది. కార్గిల్, భారతీయ విమానం హైజాక్, భారత పార్లమెంటుపై దాడి, ముంబైపై ఉగ్రవాదుల దాడి, పఠాన్ కోట్, పుల్వామాలో భారత బలగాలపై దాడి ఇలా భారత భూభాగంపై జరుగుతూ వచ్చిన ప్రతి చిన్నా, పెద్ద దాడిలో పాక్‌దే ముందడుగు. ఆ తర్వాతే భారత్ ప్రతిస్పందించేది. గత 70 ఏళ్లుగా సైనికంగా ఎంత బలపడినప్పటికీ కశ్మీర్ విషయంలో భారత్ యథాతథ స్థితిని కొనసాగించడానికి ప్రయత్నించగా పాక్ దాన్ని మార్చడానికి పదే పదే ప్రయత్నిం చేది. గత వారం భారత్ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుంది. భారత్ మొట్టమొదటిసారిగా చేసిన ఏకపక్ష ప్రదర్శనకు పాక్ బిత్తరపోయింది. వాషింగ్టన్లో సిమ్లా, లాహార్, ఇస్లామాబాద్ ఒప్పందాల గురించి ఇమ్రాన్ ప్రస్తావించిన వారం రోజుల తర్వాత, ప్రధాని మోదీ దానికి నిరసన తెలిపి ఊరుకోవడానికి బదులుగా ఒక్కసారిగా చరిత్రను తిరగరాశారు. కశ్మీర్ అంతిమ పరిస్థితిపై ఇప్పటికీ చర్చలు, సంప్రదింపులకు మార్గం ఉందని పాకిస్తాన్, అంతర్జాతీయ కమ్యూనిటీ భావిస్తున్నవేళ అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాకుండా పాక్ ఆకాంక్షలను భారత్ సమాధి చేసిపడేసింది. ఇన్నేళ్ల తర్వాత.. రెచ్చగొట్టడం, తర్వాత తోసిపుచ్చడం, సహాయం చేస్తానని ప్రతిపాదించడం, చర్చలు జరపటం, కొన్నాళ్లు మౌనంగా ఉండిపోవడం.. ఇవీ పాక్ కశ్మీర్‌పై భారత్ పట్ల అనుసరిస్తూ వచ్చిన ప్రామాణిక చర్యల క్రమం. ఆ చరిత్ర ఇప్పుడు తిరగబడింది. గతంలో ప్రతిసారీ పాకిస్తాన్ దూకుడును తగ్గించాలంటూ భారత్ ఏదో ఒక అగ్రరాజ్యం సహాయాన్ని అర్థించేది. ఇప్పుడు ఆ పని పాక్ వంతయింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్ తన పరిమితులను, క్షీణిస్తున్న తన స్థాయిని పాక్ అర్థం చేసుకున్నట్లే ఉంది. ఐఎమ్ఎఫ్ నుంచి తనకు రావలసిన 6 బిలియన్ డాలర్ల సహాయానికి పాక్ తన ఆర్థిక సార్వభౌమత్వాన్నే ఫణంగా పెట్టింది. పైగా, పాక్ రాజకీయాలు, సమాజం, వ్యవస్థలు కుప్పగూలిపోయాయి. కశ్మీర్ సమస్యను ఎల్లప్పుడూ అంతర్జాతీయీకరణ చేయడమే పాకిస్తాన్ వ్యూహంగా ఉంటూ వచ్చిందని అదేసమయంలో ఈ సమస్యను ద్వైపాక్షిక స్థాయిలోనే ఉంచాలని భారత్ ప్రయత్నించేదని పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త హుసేన్ హక్కాని గతంలో రాశారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం భారత్, పాకిస్తాన్ రెండింటికీ కశ్మీర్‌ను ఒక ఆంతరంగిక సమస్యగా మార్చివేసింది. మోదీ మెజారిటీకి, రాజ కీయ, బౌద్ధిక బలమున్న ప్రతిపక్ష మైనారిటీకి మధ్య చర్చలు, ఘర్షణల కేంద్రంగా మాత్రమే భారత్‌ను పాక్ ఇటీవలికాలంలో లెక్కిస్తూ వచ్చింది. కాని ఒకే ఒక్క చర్యతో పాక్‌లో సర్వత్రా ఒకే చర్చ. ఇదెలా జరిగింది? ప్రపంచంలోనే నంబర్‌వన్ గూఢచారి సంస్థగా తాము గర్వంగా చెప్పుకునే ఐఎస్ఐ మోదీ కఠిన నిర్ణయం గురించి అణుమాత్రం కూడా ఎందుకు పసిగట్టలేకపోయింది? ఇప్పుడేం చేయాలి? సరిగ్గా దీన్నే ఇమ్రాన్ పాక్ జాతీయ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ‘ఇప్పుడు భారత్‌పై దాడికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి’. ఇలా అంటున్నానంటే భారత్‌లో ప్రతి అంశం కూడా సవ్యంగా ఉందని చెప్పడం నా ఉద్దేశం కాదు. లేదా కశ్మీర్లో ఇప్పుడు భారత చర్యలు అన్నీ సవ్యంగా ఉన్నాయని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. అలాగని చెప్పి, పాకిస్తాన్ ఆర్టికల్ 370 రద్దుపైనా (గతంలో దీన్ని చట్టవ్యతిరేకమని పాక్ చెప్పేది), జైళ్లపాలైన కశ్మీర్ నేతలపై సానుభూతి ప్రకటించినా (వీళ్లను గతంలో తొత్తులని పాక్ వర్ణిం చేది), కశ్మీర్లో పౌరహక్కుల గురించి గొంతు చించుకున్నా.. దానికి మించిన పరిహాసాస్పద విషయం మరొకటి లేదు. ఎందుకంటే ఇద్దరు మాజీ ప్రధానులు నవాజ్ షరీఫ్, షబీద్ కఖాన్ అబ్బాíసీలను, ఒక మాజీ అధ్యక్షుడు అసిఫ్ జర్దారీని పాక్ జైలుపాలు చేసింది. మరొక మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై దేశంలోకే అడుగుపెట్టకుండా నిషేధం విధించింది. నవాజ్ కుమార్తె మరియంను కూడా ఇప్పుడు జైల్లో పెట్టారు. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకి, నవాజ్ పార్టీ ఎంపీలకు, ఇతరులకు శిక్షపడేలా చేసి జైల్లో ఉంచారు. వీరిలో చాలామందిని కనీసం బెయిల్ కూడా ఇవ్వకుండా నెలలతరబడి నిర్బంధంలో ఉంచారు. కాబట్టి పౌరహక్కుల భాష పాకిస్తాన్‌కు నప్పదు. యథాతథ స్థితి ఇప్పుడు స్థానం మార్చుకుంది. పాకిస్తాన్ దాన్ని అంగీకరించినా సరే లేక వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా నిర్లక్ష్యపు దాడులకు దిగినా ఇకపై అది సాధించేదేమీ ఉండదు. కశ్మీర్ లోయలో ఆంక్షలు తొలగించాక ప్రజలు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసి లోయపై భారత సైనికుల పట్టు కోల్పోయేలా చేస్తారు అనే ఒక్క ఆశ మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్‌కు మిగిలి ఉంది. వ్యాసకర్త : శేఖర్ గుప్తా, ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
కాంగ్రెస్‌లో ‘కల్లోల కశ్మీరం’
జమ్మూ– కశ్మీర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఆ రాష్ట్రం ఎలా స్పందిస్తున్నదో తెలియడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. ముందుజాగ్రత్త చర్యగా ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యాలవంటివన్నీ నిలిపేయడంతో ఈ సమస్య ఏర్పడింది. కానీ సుదీర్ఘకాలం ఈ దేశాన్నేలిన కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ నిర్ణయం వెలువడిన నాటినుంచి కకావికలవుతోంది. కింది స్థాయి నేతలు కశ్మీర్‌పై సరైన సమాచారం లేకపోవడంవల్లా, అవగాహన లోపించడంవల్లా మాట్లాడితే అర్థం చేసు కోవచ్చు. కానీ సీనియర్ నేతలే పొంతనలేని ప్రకటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో పార్టీలో ఏర్పడిన సంక్షోభం ప్రభావమో, కశ్మీర్‌పై ఆ నేతలకు మొదటినుంచీ ఇలాంటి అయోమయావస్థ ఉందో ఎవరికీ తెలియదు. 370, 35ఏ అధికరణలను రద్దు చేస్తూ, జమ్మూ–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నాక పార్లమెంటులో కాంగ్రెస్ ఆ చర్యను తప్పుబట్టింది. కొంత ఆలస్యంగానైనా రాహుల్‌గాంధీ ఒక ట్వీట్ ద్వారా ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ప్రకటన విడుదల చేశారు. కనుక పార్టీ అధికారిక వైఖరేమిటో ఆ నేతలందరికీ అర్ధమై ఉండాలి. కానీ సీనియర్ నాయకుడు జనార్దన్ ద్వివేది ఇందుకు పూర్తి భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఈ అధికరణల రద్దు ద్వారా ఒక చారిత్రక తప్పిదాన్ని సరిచేశారని చెప్పారు. ఇది దేశ సమగ్రత కోసం తీసుకున్న నిర్ణయమని మరో సీనియర్ నాయకుడు దీపేందర్ హుడా అన్నారు. ఇంకా జ్యోతిరాదిత్య సింధియా, మిలింద్ దేవరా, జితిన్ ప్రసాద, అభిషేక్ మను సింఘ్వి వంటివారు కూడా ఆ మాదిరి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. రాజ్య సభలో పార్టీ చీఫ్ విప్‌గా ఉన్న భువనేశ్వర్ కలితా పార్టీ వైఖరితో విభేదిస్తూ ఎంపీ పదవికే రాజీనామా చేశారు. మరో సీనియర్ నేత కరణ్‌సింగ్ సైతం ఈ జాబితాలో చేరారు. ఇక కింది స్థాయి నేతల గురించి చెప్పేదేముంది? కానీ ఇలాంటివారిని సహచర సీనియర్ నేతలు అవకాశవాదులం టున్నారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కాబోతోంది. అందులో రాహుల్ వారసుడి ఎంపికే ప్రధానాంశంగా ఉంటుందని సమాచారం. రెండునెలల జాప్యం తర్వాత ఆ పార్టీలో కదలిక రావడం దాని దుస్థితికి అద్దం పడుతుంది. కశ్మీర్ విషయంలో సీనియర్ నేతలు ఇష్టానుసారం చేస్తున్న ప్రకటనల గురించి కూడా వర్కింగ్ కమిటీ సమావేశం చర్చిస్తుందని అంటున్నారు. నిజానికి 370 అధికరణ రాజ్యాంగంలో పొందుపరిచిన కొద్దికాలంలోనే దాన్ని నీరుగార్చిన చరిత్ర కాంగ్రెస్‌ది. నెహ్రూ కాలంలోనే అందుకు బీజం పడింది. తదనంతరకాలంలో దాన్ని మరిం తగా బలహీనపరిచింది కూడా కాంగ్రెస్ పాలకులే. చివరకు తమకు అనుకూలంగా లేని పార్టీలు అధికారంలోకొస్తే ఆ ప్రభుత్వాలను చిక్కుల్లో పడేసి, తమను లెక్కచేయడం లేదనుకుంటే బర్తరఫ్ చేసి కశ్మీర్‌తో ఆడుకున్నది కాంగ్రెస్ హయాంలోనే. 1975లో షేక్ అబ్దుల్లాతో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఒప్పందం కుదుర్చుకుని ఆయన్ను జైలునుంచి విడుదల చేసింది. 1981లో తన కుమారుడు ఫరూక్ అబ్దుల్లాను వారసుడిగా ప్రకటించినప్పుడు ఆయన శిరస్సుపై తానుంచుతున్నది ముళ్ల కిరీ టమేనని షేక్ అబ్దుల్లా హెచ్చరించారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఆయనకున్న అను భవం అలాంటిది. 1983లో జమ్మూ–కశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఘన విజయం సాధించింది. ఎంతో ప్రజాదరణతో అధికారం చేజిక్కిం చుకున్న ఫరూక్‌ను ఆ మరుసటి ఏడాదే కూలదోశారు. ఆ తర్వాత ఏమాత్రం జనాదరణలేని గులాం మహమ్మద్ షా నేతృత్వంలో ఫిరాయింపు ప్రభుత్వాన్ని నెలకొల్పారు. 1986లో మతకల్లోలాలు రేగాక ఆయన్ను బర్తరఫ్ చేశారు. ఆ మరుసటి ఏడాది జరిగిన ఎన్నికల్లో తిరిగి ఎన్సీ– కాంగ్రెస్ లమధ్య పొత్తు కుదిరింది. ఆ ఎన్నికల్లో భారీయెత్తున రిగ్గింగ్ జరిగిందన్న అపఖ్యాతి మూటగట్టు కుని ఎట్టకేలకు ఆ కూటమి గట్టెక్కింది. సరిగ్గా ఆ తర్వాత నుంచే కశ్మీర్‌లోయలో మిలిటెన్సీ ముదిరింది. సాయుధ శిక్షణ పొందిన ఉగ్రవాదులు చొరబడి హత్యలు, అపహరణలతో అట్టుడికిం చారు. అప్పటి కేంద్రమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె రుబియా సయీద్‌ను మిలిటెంట్లు కిడ్నాప్ చేయడం, తమవారిని విడిపించుకోవడం ఆ కాలంలోనే జరిగింది. ఆ రాష్ట్రం విషయంలో కేంద్రం తప్పులు మీద తప్పులు చేస్తూ పోయింది. అక్కడ పరిస్థితులు నానాటికీ క్షీణిస్తూనే ఉన్నాయి. అది సరిహద్దు రాష్ట్రమని, అక్కడ ఏం జరిగినా పొరుగునున్న పాకిస్తాన్ దాన్ని తన స్వప్రయోజనాలకు వినియోగించుకునే ప్రమాదం ఉన్నదని, దేశానికి అది చేటు తెస్తుందని కాంగ్రెస్ ఏనాడూ అనుకోలేదు. ఇప్పుడు కేంద్రం తీసుకున్న చర్యల్ని సమర్థించేవారిలో చాలామంది రాహుల్ అనుయాయు లుగా ముద్రపడినవారే. 370 అధికరణ విషయంలో అనేక అభిప్రాయాలున్నాయి. కశ్మీర్ ఎదుర్కొంటున్న సకల సమస్యలకూ అదే మూలమని, ఆ అధికరణ రద్దయితే ఆ రాష్ట్రం అభివృద్ధి ఖాయ మని బీజేపీని సమర్ధించేవారు చెబుతున్నారు. దాంతో ఏకీభవిస్తూనే అందుకనుసరించిన విధానాన్ని వ్యతిరేకించేవారున్నారు. ఆ చర్య ప్రమాదకరమని, కశ్మీరీలను అది మరింత దూరం చేస్తుందని వాదించేవారున్నారు. కానీ ఆ అధికరణ ఉండాలని చెప్పే ముందు కాంగ్రెస్ తనవైపుగా గతంలో తప్పిదాలు జరిగాయని అంగీకరించి ఉంటే ఆ పార్టీతో ఏకీభవించినా, ఏకీభవించక పోయినా కనీసం దాని చిత్తశుద్ధిని జనం ప్రశంసించేవారు. అది లేకపోబట్టే జనం సంగతలా ఉంచి, పార్టీలోని సీనియర్ నేతలే కాంగ్రెస్ వైఖరితో విభేదిస్తున్నారు. వారిని అవకాశవాదులంటూ నిందించే బదులు ఇతర సీనియర్ నేతలు ఇన్ని దశాబ్దాలుగా కశ్మీర్లో తమ విధానాలెలా ఉన్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలి. మాటలకూ, చేతలకూ... సిద్ధాంతాలకూ, ఆచరణకూ పొంతన లేకుండా ఎల్లకాలమూ గడిపేద్దామనుకుంటే చెల్లదని గ్రహించాలి. -
ఆర్టికల్ 370 రద్దుపై కమల్‌హాసన్ కామెంట్
సాక్షి, చెన్నై : జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 ఏ రద్దుతో పాటు ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మక్కల్ నీది మయ్యం(ఎంఎన్ఎం) అధినేత కమల్‌హాసన్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లుగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో నిరంకుశంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ఆర్టికల్ 370, 35ఏలకు ఓ ప్రత్యేకత ఉన్నదని, వాటిలో మార్పులు చేయాలనుకుంటే, ముందుగా చర్చల ద్వారా ఆ ప్రక్రియ చేపట్టాలన్నారు. (చదవండి : మోదీ వల్లే కశ్మీర్ సమస్యకు పరిష్కారం!!) జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన తీర్మానం, బిల్లులను కేంద్రం సోమవారమే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది. (చదవండి : జన గణ మన కశ్మీరం) సరిహద్దుల మార్పులకు సంబంధించి ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’ని కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశ పెట్టగా, ఓటింగ్ అనంతరం సభ ఈ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. జమ్మూ కశ్మీర్లో ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)లతోపాటు ప్రధాన విపక్ష పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు కేంద్రం చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. -
తెలంగాణ అప్రమత్తం!
సాక్షి, హైదరాబాద్: కశ్మీర్లో అధికరణ 370, అధికరణ 35ఏ రద్దు పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర హోం శాఖ, నిఘా వర్గాల సమాచారం మేరకు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా హై అలర్ట్ ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి ర్యాలీలు, విజయోత్సవాలు, సభలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం అందుకు తమ అనుమతి తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల అనుమతి లేకుండా ర్యాలీలు తీసేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అధికరణ 370 రద్దు ప్రకటనకు ముందే అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసుల ను కేంద్ర నిఘావర్గాలు హెచ్చరించాయి. ప్రకటన అనంతరం కేంద్ర హోం శాఖ వర్గాలు అధికారికంగా తెలంగాణ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ కాన్ఫరెన్స్.. కేంద్రం ఆదేశాలతో అప్రమత్తమైన డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విషయంలో తగిన సూచనలు చేశారు. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు. సైబర్, టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ, టీఎస్ఎస్పీ పోలీసులతోనూ డీజీపీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనర్లు, ఎస్పీలతో పాటు, కొన్ని ప్రాంతాల్లో ఇన్స్పెక్టర్లకు కూడా పలు సూచనలు చేశారు. ఉద్రిక్తతలు తొలగి సాధారణ వాతావరణం వచ్చేంత వరకు ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాలతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా సున్నితప్రాంతాలు అధికంగా ఉండే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో, ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కొన్ని సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నారు. -
జన గణ మన కశ్మీరం
మోదీ నేతృత్వంలోని కేంద్రం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే అత్యంత సంచలన, సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దశాబ్దాల సంఘ్ పరివార్ కలను, ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కశ్మీర్లో 72 ఏళ్ల నుంచి నలుగుతున్న వేర్పాటువాదం, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తూ.. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణాలను రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35–ఏ అధికరణాలను రద్దు చేసింది. అలాగే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. వీటికి సంబంధించిన తీర్మానం, బిల్లులను కేంద్రం సోమవారమే రాజ్యసభలో ఆమోదింపజేసుకుంది. ఈ బిల్లులు, తీర్మానాన్ని లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టనుండగా, దిగువ సభలో ప్రభుత్వానికి భారీ మెజారిటీ ఉండటంతో అక్కడ కూడా వీటిని ఆమోదింపజేసుకోవడం కేంద్రానికి నల్లేరు మీద నడకే కానుంది. కేంద్రం చర్యను అనేక పార్టీలు, వివిధ వర్గాల ప్రజలు మనస్ఫూర్తిగా స్వాగతించగా, కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు తదితర ప్రతిపక్ష పార్టీలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభలోనూ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ పార్టీల సభ్యులు తీవ్ర నిరనలకు దిగారు. కేంద్ర ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తోందనీ, భారత చరిత్రలో ఇదో చీకటి రోజని వారు ఆరోపించారు. గతకొన్ని రోజులుగా కశ్మీర్లో నెలకొన్న హైడ్రామాకు సోమవారం తెరపడింది. భారీ సంఖ్యలో బలగాల తరలింపు, అమర్నాథ్ యాత్రికులు, పర్యాటకులను కశ్మీర్ నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలనడం తదితరాల నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠ వీడింది. ప్రతిపక్షాల భయాల్ని నిజం చేస్తూ, లేదు లేదంటూనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏలను రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేసిన అనంతరం ఆ తీర్మానాన్ని హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టగా, సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అలాగే జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు భాగాలుగా విడగొట్టి లదాఖ్ ప్రాంతాన్ని పూర్తిగా కేంద్ర పాలిత ప్రాంతంగా చేసింది. లదాఖ్ కాకుండా, మిగిలిన జమ్మూ కశ్మీర్‌ను కూడా కేంద్ర పాలిత ప్రాంతంగానే మార్చింది. అయితే ఢిల్లీ, పుదుచ్చేరిల్లో లాగానే జమ్మూకశ్మీర్ కూడా అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుంది. సరిహద్దుల మార్పులకు సంబంధించి ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు–2019’ని కూడా అమిత్ షా రాజ్యసభలో ప్రవేశ పెట్టగా, ఓటింగ్ అనంతరం సభ ఈ బిల్లును ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయి. ఈ తీర్మానం, బిల్లులను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టి చర్చించనున్నారు. అక్కడ అధికార పక్షానికి భారీ ఆధిక్యం ఉండటంతో ఆమోదం సులభం కానుంది. తీర్మానం, బిల్లులు ఆమోదం పొందడంతో బీజేపీతోపాటు పలు పార్టీల నేతలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్దాల నాటి చారిత్రక తప్పిదాన్ని తమ పార్టీ సరిచేసిందని బీజేపీ పేర్కొంది. మరోవైపు జమ్మూ కశ్మీర్లో ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)లతోపాటు ప్రధాన విపక్ష పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు కేంద్రం చర్యను తీవ్రంగా నిరసించాయి. కాగా, ఎన్సీ, పీడీపీ నేతలు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలతోపాటు పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జద్ లోనేను కూడా సోమవారం సాయంత్రం శ్రీనగర్‌లో అరెస్టు చేసినట్లు అధికారులు చెప్పారు. జమ్మూ కశ్మీర్లో ఇంటర్నెట్ కనెక్షన్లను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు జెండాలు ఉండవు: షా సభ అనంతరం అమిత్ షా ఓ ట్వీట్ చేస్తూ ఇకపై కశ్మీర్లో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాలు ఉండవని పేర్కొన్నారు. ‘ఐక్య భారత దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసిన దేశ భక్తులందరికీ మా ప్రభుత్వం అర్పిస్తున్న నివాళే ఈ నిర్ణయం. యావత్ దేశానికీ అభినందనలు. ఎన్నో ఏళ్ల నుంచి నలుగుతున్న చరిత్రాత్మక తప్పిదాన్ని ఈరోజు మోదీ ప్రభుత్వం సరిచేసింది’అని అమిత్ షా ట్విట్టర్లో తెలిపారు. మాతృభూమి ఐక్యత, సమగ్రత కోసం దృఢ సంకల్పంతో నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అభినందించారు. జమ్మూకశ్మీర్, లదాఖ్‌ల్లో శాంతి, అభివృద్ధితో కూడిన కొత్త ఉదయానికి తమ చరిత్రాత్మక నిర్ణయం తలుపులు తెరుస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ నాయకుడు రాం మాధవ్ కూడా ట్వీట్ చేస్తూ, జమ్మూకశ్మీర్ దేశంలో సంపూర్ణంగా భాగం అవ్వడం కోసం పోరాడి త్యాగాలు చేసిన, డా. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నుంచి అనేక మంది దేశభక్తులకు గౌరవం దక్కిందని కొనియాడారు. అమిత్ షా ప్రసంగానికి మోదీ ప్రశంసలు రాజ్యసభలో చర్చ సందర్భంగా అమిత్ షా చేసిన ప్రసంగాన్ని మోదీ అభినందించారు. గతంలో జరిగిన చారిత్రక అన్యాయాలను అమిత్ షా ఎంతో సవ్యంగా వివరించారనీ, జమ్మూ కశ్మీర్ ప్రజల పట్ల ప్రభుత్వ దృక్పథాన్ని చక్కగా వివరించారని ప్రశంసించారు. అమిత్ షా ప్రసంగాన్ని మోదీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. షా ప్రస్తావించిన విషయాలు విస్తృతంగా, లోతైన విశ్లేషణలతో ఉన్నాయని మోదీ అన్నారు. ఇంతకుముందు.. ఇకపై.. ► మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. జమ్మూకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు, ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉండేవి.. ► ఇకపై ప్రత్యేక హక్కులు, అధికారాలు ఉండవు ► రాష్ట్రప్రజలకు ద్వంద్వ పౌరసత్వం ఉండేది.. ► ఇకపై ఒకే పౌరసత్వం ► రాష్ట్రానికి ప్రత్యేకంగా జెండా ఉంది.. ► ఒకే పతాకం.. అది త్రివర్ణమే.. ► ఆర్టికల్ 360(ఆర్థిక అత్యయిక స్థితి) అమలు చేయలేం.. ► ఆర్టికల్ 360 అమలు చేయొచ్చు.. ► పంచాయతీలకు హక్కులు లేవు ► మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే.. పంచాయతీలకు హక్కులు ► శాసనసభ కాలపరిమితి ఆరేళ్లు ► శాసనసభ కాలపరిమితి 5 సంవత్సరాలు ► హిందువులు, సిక్కులు తదితర మైనార్టీలకు రిజర్వేషన్లు లేవు ► ఇప్పుడు 16 శాతం రిజర్వేషన్ల అమలు ► వేరే రాష్ట్రాల వారు ఇక్కడ భూములు, ఆస్తులు కొనడం నిషేధం ► అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ భూమి, ఆస్తులు కొనవచ్చు ► సమాచారహక్కు చట్టం వర్తించదు ► సమాచారహక్కు చట్టం అమలు ► వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఇక్కడి మహిళ పెళ్లాడితే ఆమెకున్న స్థానిక పౌరసత్వం, హక్కులు పోతాయి. ► భారతీయుడ్నిగానీ, విదేశీయుడ్నిగానీ పెళ్లాడినా స్థానిక హక్కులు పోవు. భారత పౌరసత్వం ఉంటుంది.. -
కశ్మీరం పై సోషల్ ‘యుద్ధం’
సాక్షి, హైదరాబాద్: జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గత నాలుగైదు రోజులు గా కశ్మీర్ పరిణామాలను గమనిస్తున్న ప్రజానీకం సోమవారం ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయింది. 370వ అధికరణ ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడం, రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంతో తెలుగు ప్రజలు సోమవారమంతా ఇదే విషయంపై చర్చలు జరిపారు. ఏ ఇద్దరు మనుషులు కలిసినా, రాజకీయ నేతలు ఎదురుపడినా కశ్మీర్ అంశంపైనే మాట్లాడుకోవడం గమనార్హం. ఏమవుతుందో ఏమో? దేశ భద్రత, భావోద్వేగాలకు సంబంధించిన విషయంలో కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం పెరుగుతుందా.. తగ్గుతుందా అనే విషయంపై ఎక్కువగా చర్చ జరగడం తెలుగు ప్రజల చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. దీంతో పాటు కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల కశ్మీర్ ప్రజ ల్లో ఎలాంటి స్పందన వస్తుంది.. దేశ భద్రతకు సంబంధించి ఏమైనా పరిణామాలు జరుగుతాయా.. సరిహద్దుల్లో సైన్యం మోహరింపు ఎలా ఉంది.. స్థానికంగా ఎలాంటి వివాదాలు తలెత్తకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు.. కేంద్ర నిర్ణయం స్టాక్మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపింది.. అనే అంశాలు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. సామాజిక మాధ్యమాల్లోనూ.. సామాజిక మాధ్యమాల వేదికగా కశ్మీర్ అంశంపై భిన్న వాదనలు నడిచాయి. 370వ అధికరణ ద్వారా అక్కడి ప్రజలకు సంక్రమించిన అధికారాల విషయంలో ఇరువర్గాలు ఓ రకంగా సామాజిక మాధ్యమాల్లో యుద్ధమే చేశాయి. ఈ అధికరణ ద్వారా కశ్మీర్లో వివాహానంతర వారసత్వ హక్కులు, దేశంలోని ఇతర రాష్ట్రాలకున్న ప్రత్యేక అధికారాలు, కశ్మీర్లో కేంద్ర చట్టాలు, అత్యున్నత న్యాయస్థానాల తీర్పుల అమలు తదితర అంశాలపై పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ అధికరణ నెహ్రూ, అబ్దుల్లాల మధ్య జరిగిన చీకటి ఒప్పందమని కొందరు, దేశాన్ని విభజించి పాలించేందుకు జరుగుతున్న కుట్రను ఎదుర్కోవాలంటూ మరికొందరు సామాజిక మాధ్యమాల్లో వాదోపవాదాలు చేస్తూ పోస్టులు పెట్టారు. -
హఠాత్ నిర్ణయాలు!
కశ్మీర్‌కు భారీయెత్తున భద్రతా బలగాల తరలింపు, అక్కడ నిట్‌తోసహా విద్యా సంస్థలన్నిటికీ సెలవులు, అమర్నాథ్ యాత్ర అర్ధాంతరంగా నిలుపుదల, శ్రీనగర్‌లో నిరవధిక కర్ఫ్యూ వగైరా నిర్ణ యాలతో నాలుగైదు రోజులుగా అందరిలోనూ ఉత్కంఠ రేపి, రకరకాల ఊహాగానాలకు తావిచ్చిన కేంద్ర ప్రభుత్వం సోమవారం చకచకా పావులు కదిపింది. జమ్మూ–కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి నిస్తున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను రద్దు చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే అందుకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో ప్రవేశపెట్టి దాని ఆమోదాన్ని పొందింది. పర్యవసానంగా ఆ రాష్ట్రంలో స్థిరాస్తుల కొనుగోలు అధికారం స్థానికులకు మాత్రమే పరిమితం చేసే 35ఏ అధికరణ కూడా రద్దవుతుంది. ... జమ్మూ–కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసి దాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టే కశ్మీర్ పునర్విభజన బిల్లుకు కూడా రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు చట్టమైతే జమ్మూ–కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా... లడఖ్ చట్టసభ రహిత కేంద్ర పాలిత ప్రాంతంగా మారతాయి. ఈ బిల్లులు మంగళవారం లోక్‌సభ ముందుకొస్తాయి. జనసంఘ్‌గా ఉన్నప్పటినుంచీ బీజేపీకి 370, 35ఏ అధికరణల విషయంలో ఉన్న అభిప్రాయాలు ఎవరికీ తెలియనివి కాదు. తమకు సొంతంగా మెజా రిటీ లభిస్తే వాటిని రద్దు చేస్తామని లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విడుదల చేసే మేనిఫెస్టోల్లో ఆ పార్టీ హామీ ఇస్తూనే ఉంది. కానీ 2014 ఎన్నికల మేనిఫెస్టో ఆ అధికరణల రద్దుపై సంబంధిత పక్షాలతో చర్చించి ఒప్పిస్తామని తెలిపింది. ఎన్నికలయ్యాక 2015లో పీడీపీతో కలిసి జమ్మూ– కశ్మీర్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కుదిరిన ఉమ్మడి ఎజెండా స్వయంప్రతిపత్తి అంశంలో యథాతథ స్థితిని కొనసాగిస్తామని తెలియజేసింది. కానీ 2019 లోక్‌సభ ఎన్నికల మేని ఫెస్టోలో మాత్రం స్వరం మారింది. వీటిని రద్దు చేస్తామని నిర్ద్వంద్వంగా చెప్పింది. ఎవరితోనూ సంప్రదించలేదన్న విమర్శలకు జవాబుగా బీజేపీ ఇప్పుడు ఈ మేనిఫెస్టోనే ఉదహరిస్తోంది. జమ్మూ–కశ్మీర్ పునర్విభజన బిల్లు అసాధారణమైనది. ఇంతవరకూ కేంద్ర పాలిత ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తినిచ్చిన సందర్భాలున్నాయి. కొత్త రాష్ట్రాలు ఆవిర్భవించిన సందర్భాలున్నాయి. కానీ రాష్ట్ర హోదా గల ప్రాంతం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారడం ఇదే తొలిసారి. పరిస్థితులు కుదుటపడితే జమ్మూ– కశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తిని ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. అది ఎంతవరకూ సాధ్యమో మున్ముందు చూడాలి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రాల సంఖ్య 29కి పెరగ్గా, అది ఇప్పుడు మళ్లీ 28కి తగ్గింది. ఇతర సంస్థానాల విలీనానికీ, జమ్మూ–కశ్మీర్ విలీనానికీ మధ్య మౌలికంగా వ్యత్యా సాలున్నాయి. ఇతర సంస్థానాలు కొద్దికాలంలోనే దేశంలో విడదీయరాని భాగంగా మారాయి. కానీ జమ్మూ–కశ్మీర్‌కు అప్పుడు పాలకుడుగా ఉన్న హరిసింగ్‌తో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా రాజ్యాంగంలో మొదట 370 అధికరణ, ఆ తర్వాత 35 ఏ అధికరణ వచ్చిచేరాయి. విదేశీ వ్యవ హారాలు, రక్షణ, కమ్యూనికేషన్లు మినహా ఇతర అంశాల్లో రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం ఉంటే తప్ప జమ్మూ–కశ్మీర్ ప్రాంతంలో కేంద్ర చట్టాలేవీ అమలుకాబోవని 370 అధికరణ చెబుతోంది. అయితే 35ఏ అధికరణ విషయంలో ఆదినుంచీ వివాదం ఉంది. ఇది 1954లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో భాగమైంది. పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ ద్వారా మాత్రమే రాజ్యాంగాన్ని సవరించి చేర్చాల్సిన అధికరణను ఇలా దొడ్డిదోవన తీసుకురావడమేమిటని అప్ప ట్లోనే జనసంఘ్ నేతలు నిలదీశారు. దీని రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై 2015లో జమ్మూ–కశ్మీర్ హైకోర్టు తీర్పునిస్తూ 35ఏను సవరణగా కాక 370 అధికరణకు వివరణగా లేదా అనుబంధంగా పరిగణించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లోఉంది. అయితే 370 అధికరణ స్వభావరీత్యా తాత్కాలికమైనదే నన్న పిటిషన్‌ను 2016లో సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అందులోని సబ్ క్లాజ్ 3లోనే అందుకు సంబంధించిన మెలిక ఉన్నదని తెలిపింది. రాష్ట్ర రాజ్యాంగ సభ సిఫార్సుతో రాష్ట్రపతి నోటిఫికేషన్ వెలువరించినప్పుడు మాత్రమే 370 రద్దవుతుందని ఆ క్లాజు చెబుతోంది. ఇప్పుడు రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారానే అది రద్దయింది. కానీ అసెంబ్లీ సస్పెన్షన్‌లో ఉన్న ప్రస్తుత సమయంలో దాని సిఫార్సు లేకుండా తీసుకున్న ఈ చర్య చెల్లుతుందా అన్నది సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంది. అయితే జమ్మూ–కశ్మీర్ మొదటినుంచీ కల్లోలంగా ఉండటం, అది ఉన్నకొద్దీ ఉగ్రరూపం దాలుస్తుండటం వాస్తవం. 2014లో అక్కడ ఉగ్రవాద ఘటనలు 222 జరిగితే నిరుడు అది 614కు చేరుకుంది. అప్పట్లో ఉగ్రవాదం కారణంగా భద్రతా దళాలకు చెందినవారు 47మంది మరణిస్తే, నిరుడు ఆ సంఖ్య 91కి చేరుకుంది. మత ఛాందసవాదుల ఆధిపత్యం గతంతో పోలిస్తే పెరిగింది. ఇప్పుడు 370 రద్దును గట్టిగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కూడా పరిస్థితి ఇంతగా దిగజారడానికి కారణమే. తన సుదీర్ఘపాలనా కాలంలో అది జమ్మూ–కశ్మీర్లో శాంతి నెలకొనడానికి అవసరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. దానికితోడు ఇప్పటికే అక్కడున్న పాక్ అనుకూల ఉగ్రవాద ముఠాలకు తోడు ఇతర ఇస్లామిక్ దేశాల మిలిటెంట్ల జాడలు కూడా కనబడుతున్నాయి. ఈ దశలో నిర్ణయాత్మకంగా వ్యవహరించకపోతే మున్ముందు పరిస్థితి చేయి దాటిపోతుందన్న ఆందోళన కేంద్రానికి ఉన్నట్టు కనబడుతోంది. తాజా నిర్ణయాల విషయంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ వంటివారిని సంప్రదిస్తే బాగుండేది. భారత్‌లో కశ్మీర్ విడదీయరాని భాగమని వారు దృఢంగా విశ్వసిస్తున్నవారే. ఏదేమైనా జమ్మూ–కశ్మీర్లో సాధ్యమైనంత త్వరగా సామరస్యం నెలకొనాలని, అది నిజమైన భూలోక స్వర్గంగా కాంతులీనాలని దేశ ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు. -
న్యాయ సమీక్షకు నిలుస్తుందా?
జమ్మూకశ్మీర్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి తిరుగులేనట్టేనా? ఈ అంశాన్ని భారత్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆమోదిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిలో చెలరేగుతున్నాయి. మోదీ, అమిత్ షా ద్వయం అత్యుత్సాహంగా తీసుకున్న నిర్ణయం భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి వ్యతిరేకమా కాదా అన్నది సుప్రీంకోర్టు తేల్చాల్సి ఉంటుంది. జమ్మూకశ్మీర్ ముఖ చిత్రాన్ని మార్చివేసే రెండు తీర్మానాలు, ఒక బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. దీనికి తోడు జమ్మూకశ్మీర్ రాజ్యాంగానికి సంబంధించిన ఆర్టికల్ 35ఏను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదేశాలు జారీ చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీర్‌కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ తీర్మానం చేశారు. అలాగే, జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నందున అక్కడి అసెంబ్లీకి ఉండే అధికారాలను కేంద్రం చేపట్టవచ్చనే నిబంధన ఆసరాగా ఈ చర్యలు తీసుకున్నారు. అంటే, జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి బదులుగా పార్లమెంటే ఆర్టికల్ 370ని సవరిస్తూ ప్రతిపాదన చేసింది. దీంతో ఆర్టికల్ 370 రద్దును జమ్మూకశ్మీరే కోరినట్టు అయ్యింది. నిజానికి తమ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని తొలగించే ఎటువంటి చర్యనూ కశ్మీరీలు అంగీకరించడంలేదు. స్వాతంత్య్రానంతరం భారత్‌లో కలవడా నికి ఈ ఆర్టికల్ 370 అనే తాత్కాలిక వెసులుబాటును కల్పించారు. ఈ ఆర్టికల్‌లోని 3వ క్లాజ్ ప్రకారం నోటిఫికే షన్ ద్వారా దాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అయితే, ఇక్కడే ఒక మెలిక ఉంది. రాష్ట్రపతి అలా రద్దు చేయా లని భావించినప్పుడు జమ్మూకశ్మీర్ రాజ్యాంగ నిర్ణాయక సభ ఆమోదం తప్పనిసరి అని ఆర్టికల్ 370 పేర్కొంటోంది. దాన్ని 1956లో రద్దు చేశారు. అయితే, అదే స్థానంలో ఏర్పడిన అసెంబ్లీకి అటువంటి ప్రతిపాదన చేసే హక్కు ఉంది. కానీ, ఇక్కడ ఆ అవకాశం లేదు. ఎందుకంటే, ప్రస్తుతం జమ్మూకశ్మీర్ రాష్ట్రపతి పాలనలో ఉంది. రాజ్యాంగం ప్రకారం ఏదైనా రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంటే, అసెంబ్లీకి ఉండే అధికారాలన్నీ పార్లమెంటుకు ఉంటాయి. ఈ కారణంగానే మోదీ సర్కార్ జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయ గలిగింది. అయితే, ఇలా స్వయం ప్రతిపత్తి రద్దు చేయడాన్ని అక్కడి నేతలు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో కేంద్ర నిర్ణయం సమాఖ్య స్ఫూర్తిపై దాడిగా పరిణమించింది. రాజ్యాంగ సవరణకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. కానీ, ఈ బీజేపీ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అటువంటి నిబంధనేమీ లేదు. అంతేగాక, రాజ్యాం గంలోని ఆర్టికల్ 367 కింద ఆర్టికల్ 35ఏను రద్దు చేసినట్టు కనిపిస్తోంది. అయితే, పార్లమెంట్ ఆమోదం లేకుండా, కేవలం ఒక ఆదేశం ద్వారా ఆర్టికల్ 370ని ఇతర రాజ్యాంగ నిబంధనల ద్వారా రాష్ట్రపతి సవరించవచ్చా అనేది మరో వివాదాస్పదమైన ప్రశ్న. ఆర్టికల్ 370లోని నిబంధనల ఆధారంగా అదే ఆర్టికల్‌ను సవరించడంపై కూడా చాలా ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఆర్టికల్ 370లోని నిబంధనల ప్రకా రం జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఇతర రాజ్యాంగ నిబంధనలను సవరించగలమేగానీ, అదే ఆర్టికల్‌ను సవరించలేమని కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదం బరం రాజ్యసభలో వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్ విషయంలో కేంద్రం చేసిన ప్రతిపాదనలను సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంది. చట్టాన్ని సాంకేతికంగా అన్వయించడంకంటే కూడా కోర్టు ఎలా నిర్ణయం తీసుకుం టుందనేది ఆసక్తికర అంశం. గతంలో ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తి సుప్రీం కోర్టు ఎలా వ్యాఖ్యానిస్తుందనేది కూడా కీలకం. కేంద్రం ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి, ఆ రాష్ట్ర స్వభావాన్ని పూర్తిగా మార్చి వేసే చర్యలు చేపట్టవచ్చా? కశ్మీరీ ప్రజలకు వ్యతి రేకమైన, ముఖ్యమైన మార్పును ఇంత సాధారణంగా చేపట్టవచ్చా? రాష్ట్రంలో బలగాలను మోహరించి, ఫోన్లు పనిచేయకుండా చేసి, ప్రజల కదలికలను నియంత్రించి ఈ మార్పులు చేయవచ్చా? రాజ్యాంగాన్ని మార్చే అధికారం లేని పార్లమెంట్ చేసిన ఈ నిర్ణయం రాజ్యాంగ మౌలిక స్వభావంపైనే ప్రభావం చూపనున్నదా అనేది సుప్రీంకోర్టు ముందున్న ప్రశ్న. సీనియర్ జర్నలిస్ట్: శృతిసాగర్ యమునన్, ‘స్క్రాల్’ సౌజన్యంతో -
జాతి మెచ్చిన సాహసోపేత చర్య
అఖండ భారతదేశ స్వప్నం నేడు సాకారమయ్యింది. 133 కోట్ల భారతీయులు సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేసింది భారత ప్రభుత్వం. స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలైనా... నెరవేరని స్వప్నం నేడు సాకారమయ్యింది. కశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసేందుకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలకు చరమగీతం పాడుతూ మోదీ సర్కారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజల గుండెల్లో మార్మోగుతోంది. మిగతా రాష్ట్రాల మాదిరిగా భారతదేశంలో జమ్మూ, కశ్మీర్ మారింది. ‘ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాం గాలు... రెండు జెండాలు వద్దు’ అంటూ ప్రాణార్పణ చేసిన భారతదేశ ముద్దుబిడ్డ శ్యాం ప్రసాద్ ముఖర్జీ నినాదాన్ని నేడు మోదీ సర్కారు సుసాధ్యం చేసింది. భారత్ నుంచి కశ్మీర్‌ను విడదీస్తున్న ఆర్టికల్ 370, 35 అను రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారత ఖ్యాతిని హిమాలయాల ఎత్తుకు చేర్చింది. పార్లమెంట్ సాక్షిగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్టికల్ 370, 35 అ నిబంధనల రద్దు నిర్ణయాలపై దేశ మంతటా పౌరులు సంబరాలు జరుపుకుంటున్నారు. భారతదేశంలో కశ్మీర్ అంతర్భాగమన్న సందేశాన్ని నేడు కేంద్రం రుజువు చేసి చూపించిందన్న సంతో షం కోట్లాది ప్రజల్లో నెలకొంది. ఇలా దేశమంతా పండుగ జరుపుకుం టుంటే... కొన్ని పక్షాలు మాత్రం కుట్రపూరితంగా వేర్పాటువాదుల వాదనకు మద్దతు పలుకుతున్నాయి. దేశంలో కశ్మీర్ అంతర్భాగమని... ఒకటే దేశం... ఒకటే రాజ్యాంగమంటూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిపై నాడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఎలుగెత్తారు. పార్లమెంట్ సాక్షిగా నెహ్రూ కళ్లు తెరిపించే పనిచేశారు. తన అభ్యంతరాలను, సూచనలను పట్టించుకోకుండా నెహ్రూ ప్రభుత్వం నడుస్తున్న తీరుపై ఆందోళనను శ్యాంజీ ఉధృతం చేశారు. 26 జూన్ 1952న ఆర్టికల్ 370ను రద్దు చేయాలంటూ పార్లమెంట్ సాక్షిగా నిరసన తెలిపారు. దేశాన్ని ఇలా వేరుచేయడం సమంజసం కాదంటూ నినదించారు. కశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయాలను నిర్ద్వంద్వంగా ఖండిం చారు. కొందరు స్వార్థపరుల కోసం తీసుకొచ్చిన విధా నం చెల్లదంటూ కశ్మీర్లో పోరుబాట సాగించి అసువులు బాశారు. నాటి నుంచి నేటి వరకు మూడు తరాలు కశ్మీర్ కోసం దేశ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన లక్షల కోట్ల రూపాయలను దిగమింగారు. పైపెచ్చు మత ప్రాతిపదికన జమ్మూ, కశ్మీర్లో మిగతా ప్రజలకు హక్కులు లేకుండా కాలరాశారు. రెండో తరగతి పౌరుల్లా చూసి వంచించారు. అంబేడ్కర్ కలలుగన్న భారతావనిలో నిరుపేదలకు అందాల్సిన ఫలాలు దేశమంతా లభించినా... జమ్మూ, కశ్మీర్లో మాత్రం లభించలేదు. దేశవ్యాప్తంగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రిజర్వేషన్ ఫలాలు అందినా... జమ్మూ, కశ్మీర్లో నివశిస్తున్న బడుగు బలహీన వర్గాలకు మాత్రం ఆ ఫలాలు దక్కలేదు. రిజర్వేషన్లంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి అక్కడి ప్రజలది. కేవలం కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా తీసుకొచ్చిన ఆర్టికల్ 370తో కొన్ని వర్గాలు మాత్రమే ఆ ఫలాలను దక్కించుకున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన తాజా నిర్ణయంతో ఇక ఒక దేశం ఒకటే రాజ్యాంగం పరిఢవిల్లుతుంది. ఏడు దశాబ్దాలుగా వేల మంది భారతీయులు దేశ రక్షణ కోసం అసువులుబాశారు. భరతమాత రక్షణలో సమిధలయ్యారు. భూలోక స్వర్గంగా ఉన్న కాశ్మీర్ తీవ్రవాదులకు స్వర్గధామంగా నిలిచింది. సాధారణ కశ్మీరీలు ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా మారి తీవ్రవాదానికి ఆకర్షితులవుతున్నారంటే అందుకు కారణం అక్కడ స్థానిక ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలే. కశ్మీర్ అనంతనాగ్ గుహల్లో కొలువైన పరమశివుడ్ని దర్శించుకోవాలన్నా ఇబ్బందే. దేశంలోని ఆలయాన్ని దర్శించుకోవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరి స్థితి. కశ్మీర్ పండితుల కులదైవమైన శారదా మాత... సరస్వతి దేవి ఆలయంలోకి వెళ్లాలంటే సాధ్యం కాదు. ఇందుకు కారణం అక్కడి పాలకులు. వారితోపాటు ఆర్టికల్ 370 మాత్రమే. తాజా నిర్ణయంతో భారతదేశం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందని చెప్పాల్సి ఉంటుంది. దేశం గురించి నిర్ణయం తీసుకోవాలంటే ధైర్యం కావాలి. అది మోదీకి సంపూర్ణంగా ఉందన్నారు హోం మంత్రి అమిత్ షా. కశ్మీర్ ఎప్పుడూ భూతల స్వర్గంగా ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అక్షరసత్యాలవుతాయి. అధికారం కోసమో... మరెందుకో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగానే తాజా నిర్ణయం తీసుకొంది. కశ్మీర్లో ఇకపై మూడు కుటుం బాల ఆధిపత్యం చెల్లదు. సామాన్యులే కశ్మీర్లో ఏలికలవుతారు. అధికారం చెలాయిస్తారు. కశ్మీర్లో ఇక దేశమంతటా వర్తిస్తున్న విధానాలే అమలవుతాయ్. దేశంలో ఏ పారిశ్రామికవేత్త అయినా కశ్మీర్ వెళ్లి ఇక పరిశ్రమలు ప్రారంభించవచ్చు. తీవ్రవాదంతో కల్లోలంలా మారిన కశ్మీర్‌ను అభివృద్ధి పట్టాలెక్కించవచ్చు. అందుకు ప్రధాని మోదీ– అమిత్ షా జోడీ నవ శకాన్ని ఆవిష్కరించింది. భారతదేశ ఔన్యత్యాన్ని హిమాలయాల ఎత్తు ఎగిరేలా చేసిన ధీరుడిగా ప్రధాని మోదీ నిలిచి పోతారు. కులాలకు మతాలకు అతీతంగా భారతీయులందరూ ఉప్పొంగే సందర్భమిది. వ్యాసకర్త : పురిఘళ్ల రఘురామ్, బీజేపీ సమన్వయకర్త ఈ–మెయిల్ : raghuram.bjp@gmail.com -
మోదీ , అమిత్‌షాకు అభినందనలు : అద్వానీ
-
కేంద్రం ఇలాంటి నిర్ణయాలతో విభేదాలు సృష్టిస్తోంది
-
కశ్మీర్‌కు స్పెషల్ స్టేటస్ రద్దు... మరి ఆ తర్వాత
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370, 35ఏ రద్దు చేస్తూ నరేంద్రమోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా జమ్మూ కశ్మీర్‌ను విభజించి జమ్మూ కశ్మీర్, లడఖ్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది. లడఖ్ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. దీనికి ప్రకారం కశ్మీర్లో చోటు చేసుకోనున్న ప్రధాన పరిణామాలు ఇలా ఉండబోతున్నాయి. పార్లమెంటు సంబంధిత చట్టాన్ని ఆమోదించిన తర్వాత, జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరిగా అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుంది. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్వంలో పాలన ఉంటుంది. ఆయన హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సన్నిహితంగా ఉంటారు. పాలనా పరంగా లెఫ్టినెంట్ గవర్నర్దే అంతిమ అధికారం. జమ్మూ కశ్మీర్‌కి శాసనసభ ఉంటుంది. దీని ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వానికి భూమిపైనా, పోలీసులపైనా అధికారం ఉండదు. జమ్మూ కశ్మీర్లో హోం శాఖ కీలక అధికారాలను కలిగి ఉంటుంది. ప్రతి అంశంపైనా, ఎక్కువ అధాకారాన్ని, నియంత్రణను కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు, జమ్మూ కశ్మీర్‌లోని శాశ్వత నివాసితులకు మాత్రమే రాష్ట్రంలో ఆస్తి సొంతం చేసుకునే హక్కు ఉంది. శాశ్వత నివాసిగా ఎవరు అర్హత సాధిస్తారో నిర్ణయించే అధికారం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం చేతిలో ఉంది. ఆర్టికల్ 35 ఎ ద్వారా ఈ అధికారాన్ని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి కల్పించింది. దీనిని సోమవారం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రద్దు అయి సంగతి తెలిసిందే. దీంతో దేశ ప్రజలు ఎవరైనా జమ్మూ కశ్మీర్, లడఖ్‌లో ఆస్తి కొనుగోలు చేసే హక్కును కలిగి ఉంటారు. అక్కడ ఎవరైనా శాశ్వత నివాసాన్ని కూడా ఏర్పర్చుకోవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్ అవతరణకు హోం మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ హక్కు అమల్లోకి రానుంది. లడఖ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండవు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ప్రజలు ఓటు వేస్తారు. జమ్మూ కశ్మీర్‌కు నుంచి పూర్తిగా లడఖ్ వేరు కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లడఖ్‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించనుంది లడఖ్ డివిజన్లోని రెండు జిల్లాలు - లే , కార్గిల్ - ఇప్పటికే కొంత స్థాయి స్వయంప్రతిపత్తిని అనుభవిస్తున్నాయి. పాక్షికంగా అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ పాలనలో ఉన్నాయి. ఈ పరిస్థితి ఇకముందు కూడా కొనసాగే అవకాశం ఉంది. -
ఆర్టికల్ 35ఏ కూడా రద్దైందా?
న్యూఢిల్లీ: ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో జమ్మూకశ్మీర్ చట్టసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా మారనుంది. లఢక్‌ను పూర్తి కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ మోదీ సర్కారు సోమవారం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో ఇందులో కీలకాంశంగా ఉన్న ఆర్టికల్ 35ఏ కూడా రద్దైంది. జమ్మూకశ్మీర్‌లో ఎవరికి శాశ్వత నివాసం కల్పించాలి, కల్పించకూడదు అనే నిర్ణయాధికారాన్ని రాష్ట్ర చట్టసభకు ఇప్పటివరకు ఆర్టికల్ 35ఏ కల్పించేది. దీని ప్రకారం జమ్మూకశ్మీర్‌లో శాశ్వత నివాసం లేని వ్యక్తులు రాష్ట్రంలో స్థిరాస్తులు కొనడానికి వీల్లేదు. ఆర్టికల్ 35ఏ రద్దైయిన నేపథ్యంలో బయటి వ్యక్తులు కేంద్రపాలిత కశ్మీర్లో ఆస్తులు సమకూర్చుకుని శాశ్వత నివాసం ఏర్పచుకోవచ్చా అనే ప్రశ్న ఎక్కువగా వినబడుతోంది. కల్లోల కశ్మీర్లో ఉండలేక 1989 నుంచి ఎంతో మంది కశ్మీర్ పండిట్లు ఆస్తులు అమ్ముకుని సొంతగడ్డను వదిలి వలసపోయారు. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో మాతృభూమికి తిరిగి వచ్చేందుకు కశ్మీర్ పండిట్లు సమాత్తమవుతున్నారు. ఆర్టికల్ 35ఏ రద్దుపై ముఖ్యంగా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కశ్మీర్ మహిళలు బయటి వ్యక్తులకు వివాహం చేసుకుంటే వారికి ఆస్తి హక్కు ఉండదు. ఇలాంటి వారి పిల్లలు కూడా కశ్మీర్లో సొంత ఇల్లు లేదా దుకాణాలు కలిగివుండడానికి కూడా ఆర్టికల్ 35ఏ అనుమతించదు. ఇప్పుడు జమ్మూకశ్మీర్ మహిళలు నాన్-కశ్మీరీలను వివాహం చేసుకున్నా వారి ఆస్తి హక్కుకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కశ్మీరేతరులు కూడా జమ్మూ కశ్మీర్లో నిశ్చింతగా స్థలాలు, ఆస్తులు కొనుక్కోవచ్చు. ఆర్టికల్ 35ఏ రద్దు కావడంతో కశ్మీర్ ఆర్థికంగా వృద్ధి సాధించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇన్నాళ్లు బయటి వ్యక్తులు కశ్మీర్లో స్థలాలు కొనేందుకు వీలులేకపోవడంతో మౌలిక సదుపాయాల సంస్థలు, బహుళజాతి కంపెనీలు పెట్టుబడులు పెట్టలేకపోయాయి. దీంతో కశ్మీరీల ఉపాధికి భారీగా గండి పడింది. ఆర్టికల్ 35ఏ రద్దుతో అడ్డంకులు తొలగిపోవడంతో పెట్టుబడులు పెరిగి కశ్మీర్ ఉపాధి అవకాశాలు వృద్ధి చెందుతాయని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్టికల్ 35ఏ రద్దు కచ్చితంగా కశ్మీర్ ఆర్థికాభివృద్ధికి మేలు చేస్తుందని గట్టిగా చెబుతున్నారు. (చదవండి: సంచలన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు) -
35ఏ ఆర్టికల్ ఏం చెబుతోంది
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు తీర్మానం ప్రవేశ పెట్టింది. ఆ వెంటనే ఆర్టికల్ 35ఏ రద్దుకు కూడా తీర్మానం ప్రవేశపెట్టారు. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి ఈ ప్రకటన చేయగానే విపక్షాలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. విపక్షాల ఆందోళన మధ్యనే అమిత్ షా ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ ఈ ఆర్టికల్ జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుంది. (చదవండి : సంచలన నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు) 35ఏ ఆర్టికల్ ఏం చెబుతోంది జమ్ముకశ్మీర్ శాశ్వత నివాసి ఎవరు? అన్న దానిని 35ఏ ఆర్టికల్ నిర్వచిస్తుంది. వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది. 1954 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్–35ఏను చేర్చారు. 35ఏ ప్రకారం.. 1954 మే 14వ తేదీకన్నా ముందు లేదా ఆ తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్ శాశ్వత నివాసి అవుతాడు. ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వం కల్పించే స్కాలర్షిప్లు, ఇతరత్రా సహాయాల్లాంటి ప్రత్యేక ప్రయోజనాలు పొందొచ్చు. దీర్ఘకాలం రాష్ట్రంలో నివసిస్తున్న వారికి సర్టిఫికెట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేయొచ్చు. రాష్ట్ర స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారాన్ని జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఆర్టికల్ 35ఏ కట్టబెట్టింది. అయితే ఈ నిర్వచనాన్ని మూడింట రెండొంతుల మెజారిటీతో రాష్ట్ర అసెంబ్లీ మార్చవచ్చు. కశ్మీరు మహిళ ఇతర రాష్ట్రాల వ్యక్తిని పెళ్లి చేసుకుంటే.. ఆమెకు ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండడానికి వీల్లేదు. ఆమె పిల్లలకు కూడా ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికేట్ ఇవ్వరు. (చదవండి : ఆర్టికల్ 370 పూర్తి స్వరూపం) ఎలా వచ్చింది నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ అబ్దుల్లా, అప్పటి ప్రధాని నెహ్రూ మధ్య 1952 జులైలో డిల్లీలో కుదిరిన ఒప్పందం ప్రకారం.. కశ్మీరీలందరికీ భారత పౌరసత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించడం కోసం చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి ఉంటుంది. ఈ నిబంధనల్నే 1954 మే14న రాష్ట్ర పతి ఉత్తర్వు ద్వారా ఆర్టికల్ 35ఏ కింద చేర్చారు. -
అర్థరాత్రి అలజడి: కేంద్రం గుప్పిట్లోకి కశ్మీర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మరింత వేడెక్కాయి. ఆదివారం అర్ధరాత్రి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను పోలీసులు గృహ నిర్బంధంలోకి తీసుకుని, గడప దాటి బయటకు రావద్దని ఆదేశించారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. పలు జిల్లాల్లో ఆంక్షలు అమలుతోపాటు రాత్రిపూట కర్ఫ్యు కూడా విధించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో అక్కడి పరిస్థితినంతా కేంద్రం తన గుప్పిట్లోకి తెచ్చుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నడమ సోమవారం ఉదయం 9:30 గంటలకు జరగబోయే కేంద్ర మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కశ్మీర్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేబినెట్ భేటీని ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో ఆర్టికల్ 35ఏ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు లోయకు మరింత అదనపు బలగాలను తరలించారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని జమ్మూ కశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఓ ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘రేపు ఏం జరగబోతోందో దేవుడికే తెలియాలి. ఈ రాత్రి సుదీర్ఘంగా ఉండబోతోంది’ అని మెహబూబా ట్వీట్ చేశారు. తమను పోలీసులు అరెస్టు చేశారని కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎం.వై.తరిగామి పేర్కొన్నారు. మరోవైపు, జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, కశ్మీర్ ఐజీలతో గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదివారం అర్ధరాత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను సోమవారం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ, కశ్మీర్ ప్రజలపై దాడిచేయడమే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దు చేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రజలపై దాడిచేయడమే.’ అని చెప్పారు. -
కశ్మీర్లో టెన్షన్.. టెన్షన్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం ఆదివారం నాటికి మరింత ముదిరింది. ఉగ్రవాదులు దాడిచేయొచ్చన్న వార్తల నేపథ్యంలో శ్రీనగర్‌ను వీడాలని రాష్ట్ర క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను అధికారులు ఆదేశించారు. అదే సమయంలో జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించింది. ఈ సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంట్లో సమావేశమైన అఖిలపక్ష నేతలు పరిస్థితిని మరింత దిగజార్చేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేశారు. కశ్మీర్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం చేసేందుకు ఇదే సరైన సమయమని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వ్యాఖ్యానించారు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశం కానున్న కేబినెట్ కశ్మీర్‌పై ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్వసనీయ వర్గాలుచెప్పాయి. కలసికట్టుగా పోరాడుతాం: అఖిలపక్షం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆందోళనల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటిలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అధ్యక్షతన ఈ సమావేశానికి కాంగ్రెస్, పీడీపీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, జేఅండ్‌కే మూవ్మెంట్, ఎన్సీ, సీపీఎం నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనిశ్చితిని రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీలకు వివరించేందుకు వీలుగా ఓ ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపాలని నేతలు నిర్ణయించారు. ఈ విషయమై ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగ నిబంధనల్ని కాపాడేందుకు, రాష్ట్రాన్ని ముక్కలుగా చేయాలన్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు కలసికట్టుగా పోరాడాలని అఖిలపక్ష భేటీలో నిర్ణయించాం. ఆర్టికల్ 35 ఏ, ఆర్టికల్ 370లను రాజ్యాంగవిరుద్ధంగా రద్దుచేయడమంటే జమ్మూ, కశ్మీర్, లడఖ్ ప్రజలపై దాడిచేయడమే. ఈ విషయంలో పరిస్థితులు మరింత దిగజారేలా వ్యవహరించవద్దని భారత్, పాకిస్తాన్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని కోరుతున్నాం’ అని చెప్పారు. మరోవైపు పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నోటీసులు జారీచేసింది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జమ్మూకశ్మీర్ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎవరి పేరునైనా మౌఖికంగా లేదా ఇతర మార్గాల్లో సిఫార్సు చేశారో, లేదో చెప్పాలని కోరింది. దీంతో ప్రజల్ని ఏకంచేయకుండా ప్రధాన రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారనీ, ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవని ముఫ్తీ స్పష్టంచేశారు. మరోవైపు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించనున్న నేపథ్యంలో మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు ఇంట్లోంచి బయటకు రాకూడదని పోలీసులు ఆదేశించారు. కాంగ్రెస్ నేత ఉస్మాన్ మాజిద్, సీపీఎం ఎమ్మెల్యే ఎంవై తరిగామిలను అరెస్ట్ చేశారు. జమ్మూలోనూ బలగాల మోహరింపు.. జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాల మోహరింపుతో ఏర్పడిన అనిశ్చితి కొనసాగుతోంది. ఉగ్రముప్పు నేపథ్యంలో కశ్మీర్‌లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్ ప్రధాన కార్యాలయం, విమానాశ్రయాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను ఆదివారం కట్టుదిట్టం చేశారు. అలాగే జమ్మూలోని పూంఛ్, రాజౌరీ, దొడ, కిష్త్వర్ జిల్లాల్లో ముందు జాగ్రత్తగా బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను భారీగా మోహరించారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు కోచ్ ఇర్ఫాన్ పఠాన్‌ను రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. కశ్మీర్లో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న భయంతో స్థానికులు నిత్యావసర సరుకులు, పెట్రోల్ కొనేందుకు షాపుల ముందు భారీ సంఖ్యలో బారులుతీరారు. మరోవైపు పుల్వామా తరహాలో ఉగ్రవాదులు వాహనాలతో ఆత్మాహుతిదాడికి పాల్పడకుండా ఉండేందుకు భద్రతాబలగాలు రోడ్లపై చాలాచోట్ల బారికేడ్లను ఏర్పాటుచేశాయి. యాజమాన్యం ఆదేశాలతో నిట్–శ్రీనగర్ విద్యార్థులు స్వస్థలాలకు బయలుదేరారు. అమిత్ షా–దోవల్ కీలక భేటీ.. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్లో నెలకొన్న అనిశ్చితి, భారత్‌లో చొరబాటుకు యత్నించిన 5–7 మంది పాక్ బ్యాట్ కమాండోలను ఆర్మీ హతమార్చడం తదితర అంశాలపై దాదాపు గంటపాటు చర్చలుజరిపారు. మరోవైపు జమ్మూ, ఉధమ్‌పూర్, కర్తా ప్రాంతాల నుంచి బయలుదేరే రైళ్లలో రాబోయే 48 గంటలపాటు టికెట్ల తనిఖీ చేయబోమని రైల్వేశాఖ ప్రకటించింది. భారీ సంఖ్యలో ఉన్న అమర్నాథ్ యాత్రికులు రిజర్వేషన్ లేకపోయినా ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని వీడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. అధికారులు, వైద్య సిబ్బంది సెలవులపై వెళ్లరాదనీ, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయరాదని కార్గిల్ కలెక్టర్ ఆదేశించారు. దీటుగా బదులిస్తాం: పాక్ భారత్ ఎలాంటి దుస్సాహసానికి, దురాక్రమణకు పాల్పడినా దీటుగా బదులిస్తామని పాకిస్తాన్ హెచ్చరించింది. కశ్మీరీలకు తమ దౌత్య, నైతిక, రాజకీయ మద్దతును కొనసాగిస్తామని ప్రకటించింది. ఇస్లామాబాద్‌లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశానికి రక్షణ మంత్రి పర్వేజ్ ఖట్టక్, విదేశాంగమంత్రి ఖురేషీ, త్రివిధ దళాధిపతులు, ఐఎస్ఐ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ హాజరయ్యారు. ఈ భేటీ అనంతరం పాక్ స్పందిస్తూ..‘భారత్ చర్యల కారణంగా ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి విఘాతం కలుగుతుంది. కశ్మీర్ అన్నది సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యే. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీన్ని పరిష్కరించాలని భారత్‌ను కోరుతున్నాం. తాజాగా బలగాల మోహరింపుతో కశ్మీర్లో పరిస్థితి అగ్నికి ఆజ్యం పోసినట్లే అవుతుంది’ అని హెచ్చరించింది. ట్రంప్ కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని చెప్పారనీ, అందుకు ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. జమ్మూలో హైదరాబాద్ రైలు ఎక్కుతున్న విద్యార్థులు -
35ఏ రద్దు? కశ్మీర్లో హైటెన్షన్.. క్షణక్షణం ఉద్రిక్తత
న్యూఢిల్లీ/శ్రీనగర్: కశ్మీర్లో హైటెన్షన్ నెలకొంది. క్షణక్షణం ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. లోయలో పరిస్థితులు, పరిణామాలు.. ఢిల్లీలోనూ హీట్ పెంచుతున్నాయి. హస్తినలోనూ వరుస భేటీలు జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో భద్రతావ్యవహారాల కమిటీ సమావేశమై చర్చలు జరిపింది. పార్లమెంట్‌లోని షా ఆఫీస్‌లో జరిగిన ఈ సమావేశంలో జాతీయభద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా పాల్గొన్నారు. కశ్మీర్లో తాజా పరిస్థితిపై చర్చించారు. కశ్మీర్లో ఏదో జరగబోతోందన్న ఊహాగానాల మధ్య ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ ముగిసిన వెంటనే కశ్మీర్ వ్యవహారాల అదనపు కార్యదర్శి జ్ఞానేష్కుమార్తోనూ షా సమావేశమై చర్చలు జరిపారు. మరోవైపు రేపు ఉదయం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. జమ్ము కశ్మీర్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ రెండో సవరణ బిల్లు-2019ను అమిత్ షా రేపు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. వరుస భేటీలతో కేంద్రం ఏం చేయబోతోందన్న ఉత్కంఠ మరింత పెరుగుతోంది. ఆర్టికల్ 35 ఏ రద్దు? కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 35 ఏ రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా రేపు ఉదయం 9:30 గంటలకు కేంద్ర మంత్రివర్గం సమావేశమవుతోంది. ఈ కీలక భేటీలో కశ్మీర్ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కశ్మీర్ నుంచి ఇతర రాష్ట్రాల విద్యార్ధులను, పర్యాటకులను ఇప్పటికే ప్రభుత్వం స్వస్థలాలకు తరలిస్తోంది. కశ్మీర్ అంతటా ప్రత్యేక బలగాలను ప్రభుత్వం మోహరించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితి మొదలైన సంగతి తెలిసిందే. బ్యాట్ సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లండి భారత సైన్యం హతమార్చిన పాకిస్థాన్‌కు చెందిన బోర్డర్ యాక్షన్ టీం BAT సభ్యుల మృతదేహాలను తీసుకెళ్లడానికి పాక్‌కి ఇండియన్ ఆర్మీ అవకాశం కల్పించింది. తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లమని సూచించింది. దీనిపై ఆ దేశం స్పందించాల్సి ఉంది. భారత సైనిక పోస్టులపై దాడికి యత్నించిన పాక్ బ్యాట్ బృందం కుయుక్తులను మన జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా కీరన్ సెక్టార్లో నియంత్రణ రేఖ వద్ద చొరబడడానికి ప్రయత్నించిన ఏడుగురుని భారత సైనికులు హతమార్చారు. బ్యాట్ దాడి యత్నం జులై 31 అర్ధరాత్రి తర్వాత, ఆగస్టు 1 తెల్లవారుజాము వేళలో జరిగినట్లు సమాచారం. మృతులు పాక్ సైన్యానికి చెందిన స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలుగానీ, ఉగ్రవాదులుగానీ కావచ్చని భావిస్తున్నారు. జమ్మూకశ్మీర్ నివురుగప్పిన నిప్పులా ఉంది. అదనపు బలగాల మోహరింపు, అమర్నాథ్ యాత్ర రద్దు, చొరబాటుదారుల ఏరివేత... ఇలా వరుస ఘటనలతో చల్లని కశ్మీరం వేడెక్కింది. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు కార్గిల్ సెక్టార్లో ఉద్యోగులెవరూ విధినిర్వహణ ప్రాంతాలను విడిచి వెళ్లవద్దని, ఫోన్లు తప్పనిసరిగా ఆన్‌లో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సరిహద్దులో బోఫోర్స్ శతఘ్నుల్ని మొహరించినట్లు తెలుస్తోంది. తగినంత సంఖ్యలో డాక్టర్లను అందుబాటులో ఉంచుకోవాలని హాస్పిటల్స్‌కి సూచనలు అందాయి. తాజా పరిస్థితుల్లో కశ్మీర్లో పర్యటనలు వద్దంటూ బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు తమ పౌరులకు అప్రమత్త సూచనలు చేశాయి. -
నివురుగప్పిన నిప్పులా జమ్మూకశ్మీర్!
శ్రీనగర్/జమ్మూ/న్యూఢిల్లీ : ఓవైపు భారీగా బలగాల మోహరింపు.. మరోవైపు కేంద్రం మౌనంతో జమ్మూకశ్మీర్‌లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. జమ్మూకశ్మీర్‌లో శాశ్వతనివాసం, స్వయంప్రతిపత్తికి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయబోతోందన్న వదంతుల నేపథ్యంలో ప్రతిపక్షాలు గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో శనివారం భేటీ అయ్యాయి. ఉగ్రముప్పు ఉన్నప్పటికీ పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తన భద్రతాసిబ్బంది కళ్లుగప్పి నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఇంటికి వెళ్లారు. కేంద్రం తీసుకునే ఎలాంటి చర్యనైనా కలసికట్టుగా ఎదుర్కొందామని కోరారు. అనంతరం ఇతర కశ్మీరీ నేతలతో కలిసి గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో భేటీ అయ్యారు. దీంతో జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ఎలాంటి రాజ్యాంగ నిబంధనల్ని సవరించడం లేదనీ, వదంతుల్ని నమ్మవద్దని మాలిక్ రాజకీయ నేతలు, మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అనిశ్చితిపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా, ఈ విషయంలో కశ్మీరీ ప్రజలకు పార్లమెంటు హామీ ఇవ్వాలని ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా కోరారు. రంగంలోకి ఐఏఎఫ్ విమానాలు.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరగొచ్చన్న ఆర్మీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర పాలనా యంత్రాంగం అప్రమత్తమయ్యాయి. పలువురు పర్యాటకుల్ని, అమర్నాథ్ యాత్రికులను ప్రత్యేక వాహనాల్లో శ్రీనగర్ విమానాశ్రయానికి తరలించాయి. జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం నాటికి 20,000 నుంచి 22,000 మంది పర్యాటకులు ఉన్నారు. అయితే ఉగ్రహెచ్చరికల నేపథ్యంలో గుల్మార్గ్, పెహల్గామ్ వంటి పర్యాటక ప్రాంతాల నుంచి 6,126 మంది పర్యాటకులను శ్రీనగర్‌కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా 5,829 మందిని 32 విమానాల్లో శనివారం తమ స్వస్థలాలకు తరలించారు. భారత వాయుసేన(ఐఏఎఫ్)కు చెందిన విమానాల్లో మరో 387 మందిని గమ్యస్థానాలకు చేర్చారు. ఈ సందర్భంగా పలు విమానయాన సంస్థలు టికెట్ల రీషెడ్యూల్, రద్దుపై విధించే అదనపు చార్జీలను ఆగస్టు 15 వరకూ ఎత్తివేశాయి. టికెట్లను రద్దుచేసుకుంటే అదనపు చార్జీలు విధించబోమని రైల్వేశాఖ చెప్పింది. మరోవైపు భారత పర్యటనలో భాగంగా జమ్మూకశ్మీర్‌కు వెళ్లవద్దని తమ పౌరులను బ్రిటన్, జర్మనీ దేశాలు హెచ్చరించాయి. భద్రతా సిబ్బందిని సంప్రదించాకే కశ్మీర్లో పర్యటించాలనీ, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆస్ట్రేలియా తమ పౌరులకు స్పష్టం చేసింది. అవన్నీ వదంతులే.. నమ్మొద్దు: గవర్నర్ మాలిక్ జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతినిధుల బృందం శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను రద్దు చేయబోతోందని చెలరేగుతున్న వదంతులపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో గవర్నర్ స్పందిస్తూ..‘ఆర్మీ హెచ్చరికల తీవ్రతను దృష్టిలో ఉంచుకునే అమర్నాథ్ యాత్రను తక్షణం నిలిపివేయాల్సి వచ్చింది. ఇక నాకు తెలిసినంతవరకూ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనల్ని సవరించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడంలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలకు కొందరు ఇతర కారణాలను ఆపాదిస్తున్నారు. దీనివల్ల ప్రజల్లో అనవసరంగా భయాందోళన చెలరేగుతుంది’ అని తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై వచ్చే వదంతుల్ని, పుకార్లను నమ్మవద్దనీ, ప్రశాంతంగా ఉండాలని రాజకీయ నేతలు, వారి మద్దతుదారులకు గవర్నర్ సత్యపాల్ మాలిక్ విజ్ఞప్తి చేశారు. ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ రద్దు: వీహెచ్‌పీ ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో పూంఛ్ జిల్లాలో ఈ నెల 6 నుంచి పది రోజుల పాటు సాగనున్న ‘బుద్ధ అమర్నాథ్ యాత్ర’ను రద్దు చేసుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రకటించింది. ఈ విషయమై వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు లీలాకరణ్ శర్మ మాట్లాడుతూ..‘అమర్నాథ్ యాత్రామార్గంలో అమెరికా తయారీ స్నైపర్ తుపాకీ, మందుపాతర లభ్యంకావడం, మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భక్తుల భద్రత రీత్యా బుద్ధ అమర్నాథ్ యాత్రను నిలిపివేస్తున్నాం. అలాగే కుల్గామ్ జిల్లాలో కౌశర్నాగ్ యాత్ర, కిష్త్వర్ జిల్లాలో మచైల్ యాత్రను నిలిపివేస్తున్నట్లు కూడా ఆపేస్తున్నాం’ అని చెప్పారు. మోదీ ప్రకటన చేయాలి: ప్రతిపక్షాలు అమర్నాథ్ యాత్రను కేంద్ర ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేయడంతో దేశ ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై ప్రధాని మోదీ ఉభయసభలను ఉద్దేశించి ఓ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏల కొనసాగింపు విషయంలో తమకు పార్లమెంటు నుంచి హామీ కావాలని ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు. భారత్‌లో విలీనం సందర్భంగా జమ్మూకశ్మీర్‌కు ఇచ్చిన హామీలు కాలాతీతమైనవని వ్యాఖ్యానించారు. ప్రజలను భయపెడుతున్నారు: బీజేపీ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేందుకు కాంగ్రెస్, పీడీపీ, ఎన్సీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ విమర్శించింది. ఈ విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీంద్ర రైనా మాట్లాడుతూ..‘రాజకీయ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాజకీయ పార్టీలన్నీ కేంద్రానికి సహకరించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35 ఏ కారణంగా రాష్ట్రంలో ప్రశాంతత అనేది కరువైంది. ఆగస్టు 15న లోయలోని అన్ని పంచాయతీల్లో మువన్నెల జెండాను ఎగురవేస్తాం’ అని ప్రకటించారు. భద్రతా సిబ్బందికి ముఫ్తీ షాక్ పీడీపీ అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ భద్రతా సిబ్బందికి షాక్ ఇచ్చారు. ఉగ్రముప్పు ఉన్నందున ఇంటి నుంచి బయటకు వెళ్లరాదని హెచ్చరించినప్పటికీ ఆమె శుక్రవారం రాత్రి సిబ్బంది కళ్లు కప్పి గుప్కార్ రోడ్డులోని ఎన్సీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ఇంటికి చేరుకున్నారు. కశ్మీరీల హక్కుల్ని కాపాడుకునేందుకు చేతులు కలుపుదామని కోరారు. అయితే తన ఆరోగ్యం బాగోలేనందున కుమారుడు ఒమర్ అబ్దుల్లాతో ఈ విషయాన్ని చర్చించాలని ఫరూక్ సూచించారు. ఒమర్ ఆదివారం నిర్వహించే అఖిలపక్ష భేటీకి రావాలని కోరారు. దీంతో ముఫ్తీ పీపుల్స్ కాన్ఫరెన్స్ అధినేత సజ్జద్ లోనే, జేకేపీఎం అధినేత, మాజీ ఐఏఎస్ అధికారి షా ఫైజల్‌తో భేటీ అయ్యారు. అనంతరం వీరంతా రాజ్‌భవన్‌కు వెళ్లారు. రాజ్యాంగం ఏం చెబుతోంది? జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ, కశ్మీర్, లడఖ్ పేరిట మూడు ముక్కలుగా చేయడం అసాధ్యం కాదని కొందరు రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల మేరకు పాకిస్తాన్ పక్కనే ఉన్న రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చని అంటున్నారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను మరో అధికరణ 368(1) ద్వారా సవరించవచ్చు. ఇందుకోసం తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. కనీసం సగం రాష్ట్రాలు ఇందుకు ఆమోదం తెలిపితే, ఆర్టికల్ 370 రద్దవుతుంది. ఇది జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్ సరిహద్దుల్ని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఇప్పటికే ఉన్న రాష్ట్రాలకు సరికొత్తగా సరిహద్దుల్ని ఏర్పాటు చేయడంతో పాటు కొత్త రాష్ట్రాలకు సరిహద్దుల్ని నిర్ణయించవచ్చు. కానీ దీనికి ఆర్టికల్ 370 అడ్డుపడుతున్న నేపథ్యంలో ఈ అధికరణాన్ని తొలగించడం తప్ప మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు. ఈ విషయమై లోక్‌సభ మాజీ కార్యదర్శి సుభాష్ కశ్యప్ మాట్లాడుతూ..‘ఆర్టికల్ 370 అన్నది తాత్కాలిక నిబంధనే తప్ప ప్రత్యేకమైన నిబంధన కాదు. మన రాజ్యాంగంలో తాత్కాలిక, పరివర్తన, ప్రత్యేకమైన అనే నిబంధనలున్నాయి. వీటిలో తాత్కాలికమన్నది అత్యంత బలహీనమైనది’ అని తెలిపారు. 35ఏ ఎందుకంత ప్రాముఖ్యం? ► జమ్మూకశ్మీర్ సంస్థానాధీశుడు మహారాజా హరి సింగ్ 1927, 1932లో జారీ చేసిన ఉత్తర్వుల్లో రాష్ట్ర పరిధిలోని అంశాలు, ప్రజల హక్కులను నిర్వచించారు. ఇదే చట్టాన్ని వలస వచ్చిన వారికీ వర్తింపజేశారు. ► కశ్మీర్ పగ్గాలు చేపట్టిన షేక్ అబ్దుల్లా 1949లో భారత ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలి తంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 370 చేరింది. దీంతో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి లభించింది. ఆ రాష్ట్రంపై భారత ప్రభుత్వ అధికారాలు.. రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార రంగాలకే పరిమితమయ్యాయి. ► షేక్ అబ్దుల్లా, నెహ్రూ మధ్య కుదిరిన ఢిల్లీ ఒప్పందం ప్రకారం 1954లో రాష్ట్రపతి ఉత్త ర్వుల మేరకు జమ్మూకశ్మీర్‌కు సంబంధించి 35ఏతోపాటు మరికొన్ని ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ►1956లో జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. దాని ప్రకారం.. 1911కు పూర్వం అక్కడ జన్మించిన, వలస వచ్చిన వారే కశ్మీర్ పౌరులు. అంతేకాకుండా, 1911కు ముందు పదేళ్లకు తక్కువ కాకుండా అక్కడ ఉంటున్న వారికే స్థిరాస్తులపై హక్కుంటుంది. జమ్మూకశ్మీర్ నుంచి వలసవెళ్లిన వారు, ఇంకా పాకిస్తాన్ వెళ్లిన వారు కూడా రాష్ట్ర పౌరులుగానే పరిగణిస్తారు. శ్రీనగర్–నిట్ క్లాసులు బంద్ శ్రీనగర్‌లోని ప్రఖ్యాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో తరగతుల్ని నిరవధికంగా సస్పెండ్ చేస్తున్నట్లు సంస్థ రిజిస్టార్ తెలిపారు. తరగతులు ప్రారంభమయ్యే విషయమై తాము త్వరలోనే సమాచారం అందజేస్తామని వెల్లడించారు. శ్రీనగర్ జిల్లా యంత్రాంగం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలోనే ఈ ఉత్తర్వులు జారీచేస్తున్నామని చెప్పారు. అయితే ఈ ప్రకటనను జిల్లా కలెక్టర్ షాíß ద్ ఖండించారు. ‘శ్రీనగర్–నిట్‌ను మూసివేయాల్సిందిగా మేం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో రకరకాల వదంతులు చెలరేగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సూచించాం’ అని కలెక్టర్ షాహిద్ అన్నారు. నిత్యావసర దుకాణాలు, పెట్రోల్ బంకులు, ఏటీఎంల ముందు ప్రజలు క్యూకట్టారు. శ్రీనగర్‌లో పెట్రోల్‌బంక్ వద్ద స్థానికుల పడిగాపులు -
కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తోందా?
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ప్రధానంగా రెండు మార్గాలను పరిశీలిస్తున్నట్లు న్యాయ, రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ఇందులోభాగంగా కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 35ఏ, ఆర్టికల్ 370లను కేంద్రం రద్దుచేయడం మొదటిది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు జమ్మూకశ్మీర్‌లో ఆస్తులను కొనుగోలు చేసేందుకు, అక్కడే స్థిరపడేందుకు వీలు కలుగుతుంది. అయితే ఈ నిర్ణయంతో భారత్‌లో విలీనమయ్యేందుకు కశ్మీర్‌తో చేసుకున్న ఒప్పందం చెల్లకుండాపోయే ప్రమాదముంది. దీన్ని నివారించేందుకు జమ్మూకశ్మీర్‌ను భారత్‌లో కలిపేస్తున్నట్లు రాష్ట్రపతి కోవింద్ ఆదేశాలు జారీచేసినా అనేక న్యాయపరమైన చిక్కుముళ్లు ఎదురవుతాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మూడు ముక్కలు చేయడం.. ఇక రెండో ప్రతిపాదన ఏంటంటే జమ్మూకశ్మీర్‌ను మూడు ముక్కలు చేయడం. అంటే జమ్మూను ఓ రాష్ట్రంగా, కశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చే ప్రతిపాదన కేంద్రం దృష్టిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది అనుకున్నంత సులభమేంకాదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు అంటున్నారు. రాష్ట్రాన్ని విడగొట్టాలంటే సమగ్రమైన అధ్య యనాలతో పాటు సరిహద్దుల ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలా సమయం పడుతుంది. కానీ ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం యత్నాలు ప్రారంభించినట్లు ఇప్పటివరకూ ఎలాంటి సంకేతాలు లేవన్నది నిపుణుల మాట. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
గవర్నర్ మాటిచ్చారు..కానీ..
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 35ఏపై కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో కేంద్ర బలగాల మోహరింపు, అమర్నాథ్ యాత్రను అర్ధారంతరంగా నిలిపివేయడం తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆయన శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...‘ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ప్రత్యేక హోదాను నిలిపివేసే ఉద్దేశం లేదని గవర్నర్ తెలిపారు. కానీ ఈ విషయంలో ఆయన మాటలే అంతిమం కాదు కదా. ఆర్టికల్ 35ఏ విషయంలో భారత ప్రభుత్వమే పార్లమెంటులో సరైన సమాధానమివ్వాలి. తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి’ అని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ‘ గురువారం ఇక్కడ 25 వేల బలగాలను దింపారు. వారం గడవకముందే మరో 10 వేల మంది సైనికులను పంపారు. ఈ విషయాల గురించి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. పౌరులను ఎంతో వేదనకు, ఒత్తిడికి గురిచేస్తున్నారు’ అని మండిపడ్డారు. కాగా బీజేపీ- పీడీపీ కూటమిలో చీలికలో ఏర్పడిన అనంతరం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. -
దేశమంతటికీ ఒకే రాజ్యాంగం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు, రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్ 35(ఏ)పై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కారణంగా దేశ సార్వభౌమత్వాన్ని నీరుగార్చలేమని దోవల్ వ్యాఖ్యానించడంపై ఆ రాష్ట్ర పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతోపాటు కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం దోవల్ వ్యాఖ్యలను ఖండించని పక్షంలో.. కేంద్రమే కావాలని ఈ వ్యాఖ్యలు చేయించినట్లుగా భావించాల్సి వస్తుందన్నాయి. మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్‌పై రాసిన ఓ పుస్తకం విడుదల సందర్భంగా దోవల్ మాట్లాడుతూ.. ‘వల్లభాయ్ పటేల్ సంస్థానాలన్నింటినీ దేశంలో విలీనం చేయడంపై మాత్రమే దృష్టిపెట్టలేదు. సంస్థానాలతోపాటు దేశమంతా ఒకటిగా ఉండాలనే ఆలోచనతోనే ముందుకెళ్లారు. దేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రజల సార్వభౌమత్వం దేశమంతటికీ వర్తిస్తుంది. కానీ జమ్మూకశ్మీర్ ప్రత్యేక రాజ్యాంగం కలిగి ఉండడం.. భారత రాజ్యాంగ స్ఫూర్తికి విభిన్నంగా ఉంది. స్వతంత్ర భారతమంతా ఒకే రాజ్యాంగం, ఒకే జెండా కింద ఉండాలని పటేల్ భావించారు. కానీ అప్పటి కశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఇందుకు విభేదించారు’ అని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం చాలామటుకు అహింసాయుతంగా కొనసాగడం వల్ల సరైన వేడి రాజుకోలేదని.. అందుకే దేశ ప్రజలకు స్వాతంత్య్రం విలువ అర్థం కావడం లేదని దోవల్ అభిప్రాయపడ్డారు. -
ఆ ఎన్నికలను బహిష్కరించనున్న పార్టీ
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో జరగనున్న పంచాయతీ, స్థానిక ఎన్నికలను బహిష్కరించనున్నట్లు ‘‘నేషనల్ కాన్ఫరెన్స్’’ పార్టీ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 35ఎ కొనసాగింపుపై తమ నిర్ణయాన్ని తెలిపేంత వరకు ఎన్నికలకు వెళ్లబోమని ఎన్సీ తేల్చిచెప్పింది. ఆర్టికల్ 35ఎ పై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇచ్చేవరకు ఎన్నికలకు వెళ్లేదిలేదని పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పష్టం చేశారు. బుధవారం జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్టికల్ 35ఎ పై అనవసర జోక్యం చేసుకోవటం వల్ల చోటుచేసుకునే పరిణామాలను పట్టించుకోకుండా పంచాయతీ, స్థానిక ఎన్నికలపై హుటాహుటిన నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్రంలో నాలుగు దశలలో పంచాయతీ, స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆగస్టు 30న ప్రకటించిన విషయం తెలిసిందే.