శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు కల్పించే ఆర్టికల్ 35ఏపై కేంద్రం వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఎన్సీ అధినేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. భారీ సంఖ్యలో కేంద్ర బలగాల మోహరింపు, అమర్‌నాథ్ యాత్రను అర్ధారంతరంగా నిలిపివేయడం తదితర పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో ఆయన శనివారం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కలిశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...‘ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ప్రత్యేక హోదాను నిలిపివేసే ఉద్దేశం లేదని గవర్నర్ తెలిపారు. కానీ ఈ విషయంలో ఆయన మాటలే అంతిమం కాదు కదా. ఆర్టికల్ 35ఏ విషయంలో భారత ప్రభుత్వమే పార్లమెంటులో సరైన సమాధానమివ్వాలి. తమ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి’ అని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ‘ గురువారం ఇక్కడ 25 వేల బలగాలను దింపారు. వారం గడవకముందే మరో 10 వేల మంది సైనికులను పంపారు. ఈ విషయాల గురించి ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. పౌరులను ఎంతో వేదనకు, ఒత్తిడికి గురిచేస్తున్నారు’ అని మండిపడ్డారు. కాగా బీజేపీ- పీడీపీ కూటమిలో చీలికలో ఏర్పడిన అనంతరం జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment