
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆశాభావం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సమయం ఆసన్నమైనట్లుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ‘కేంద్ర హోం మంత్రితో ఏడాది క్రితమే ఈ విషయం చర్చించాను. రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఇదే సరైన సమయం’అని ఆయన వివరించారు.
‘ఇటీవల హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఈ విషయమై చర్చ సానుకూలంగా జరిగింది. త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నా. ఈ అంశాన్ని చట్టపరమైన ముగింపు లభించాలని కోరుకుంటున్నా’అని అబ్దుల్లా చెప్పారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక కేంద్రం, జమ్మూకశ్మీర్ మధ్య అంతరం తగ్గిందన్న విషయమై ఆయన స్పందిస్తూ..కొన్ని ఘటనల వల్లే దూరం పెరుగుతుందని చెప్పారు.
ఇటీవల బారాముల్లా జిల్లా సొపోర్, కథువా జిల్లా బిల్లావర్‌లో జరిగిన రెండు హత్యలు నివారించదగినవని చెప్పారు. వీటిపై కేంద్రం పారదర్శకంగా దర్యాప్తు చేయించి, బాధ్యులను తగు విధంగా శిక్షించాలన్నారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇటువంటి పరిణామాలు అవరోధంగా మారుతాయని వ్యాఖ్యానించారు.
భద్రత, పోలీసు విభాగాలు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీ కానప్పటికీ, ఇటువంటివి చోటుచేసుకోకుండా చూడాల్సిన సమష్టి బాధ్యత ఉందని వివరించారు. ఈ విషయంపైనా హోం మంత్రితో మాట్లాడానని వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు అనుమానమున్న 26 ఏళ్ల వ్యక్తి పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరునాడే, సొపోర్‌లోని చెక్‌పోస్ట్ వద్ద ఆగకుండా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.
100 రోజుల పాలనపై..
‘ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది వంద రోజులు కోసం కాదు, ఐదేళ్లూ పాలించడానికే. మా పని మమ్మల్ని చేయనివ్వండి. జమ్మూకశ్మీర్‌లో పాలన అంటే మామూలు విషయం కాదు. 2009–2015లోనూ తేలిగ్గా లేదు. ఇప్పుడూ అంతే. ఎవరికైనా ఈ ఇబ్బంది తప్పేది కాదు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. ఈ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నాం. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకూ ఇది కొత్తే. ఆయనా నేర్చుకుంటున్నారు’అని ఒమర్ అబ్దుల్లా వివరించారు.
కేంద్రం నుంచి ఒత్తిళ్లు..
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లపై ఆయన మాట్లాడుతూ..ఇక్కడ తమకు రాజకీయ పరమైన ఒత్తిళ్లకంటే వాతావరణ పరమైన సవాళ్లే ఎక్కువగా ఉన్నాయంటూ నవ్వారు. ఫిబ్రవరిలోనే ఎండలు మార్చి, ఏప్రిల్‌లో మాదిరిగా మండిపోతున్నాయి. రానున్న వేసవిలో నీటి కొరత తీవ్రం కానుందంటూ ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.
‘వేడి ఎక్కువగా ఉంది. అయితే, అది కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ నుంచీ, ఎవరైనా అధికారీ నుంచీ కాదు. వేడి వాతావరణం కారణంగా ఈసారి నీటి సమస్య తలెత్తనుంది. ఇతరత్రా సమస్యల కంటే దీనిని తీర్చడమెలాగన్నదే మాకు అతిపెద్ద సవాల్ కానుంది’అని ఆయన వివరించారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విభాగాల అధికారులతో సమావేశం కానున్నామన్నారు. వచ్చే రోజుల్లో మంచు, వాన కురిస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment