గవర్నర్ సత్యపాల్ మాలిక్
సరిగ్గా అయిదు నెలలక్రితం పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత జమ్మూ– కశ్మీర్‌లో రాజకీయం వేడెక్కింది. చకచకా జరిగిన పరిణామాల పర్యవసానంగా హఠాత్తుగా బుధవారం అసెంబ్లీ రద్దయింది. ఎప్పుడూ పరస్పరం కత్తులు నూరుకునే ప్రాంతీయ పక్షాలు మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని పీడీపీ, ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్‌లు కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయడం మొదలు పెట్టగానే బీజేపీ నాయకత్వం అప్రమత్తమైంది. ఫలితంగా పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జాద్ గని లోన్ ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇప్పించాలంటూ వాట్సాప్ మాధ్యమం ద్వారా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు లేఖ పంపారు.
తాము లేఖ ఇవ్వబోతే గవర్నర్ కార్యాలయం స్పందించలేదని, దాన్ని ఫ్యాక్స్ చేయడానికి ప్రయత్నిస్తే అవాంతరాలు వచ్చాయని మెహబూబా చెబుతున్నారు. కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు రాష్ట్రాల్లో తమకనుకూలమైన పరిస్థితులు ఉంటే ఒకరకంగా, లేనట్టయితే మరో రకంగా వ్యవహరించడం మన దేశంలో రివాజుగా మారింది. ఈ సంస్కృతిని ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయే అయినా ఇతర పక్షాలు కూడా అందుకు భిన్నంగా లేవు. ఇష్టానుసారం ప్రభుత్వాలను బర్తరఫ్ చేయడం, బలహీనులకు అధికారం కట్టబెట్టడం ఆనవాయితీ అయింది. ఎస్‌ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక ఈ ధోరణికి కాస్త అడ్డుకట్ట పడినా పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు జమ్మూ–కశ్మీర్ గవర్నర్ చేసింది ఇటువంటిదే.
87మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేసే పార్టీకి లేదా కూటమికి కనీసం 44మంది మద్దతు అవసరం. సభలో 28మంది సభ్యులున్న పీడీపీ, 12మంది సభ్యులున్న కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. 15మంది సభ్యులున్న నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) దీనికి బయటినుంచి మద్దతిస్తానని చెప్పింది. అంటే మొత్తంగా ఈ పార్టీలకు 56మంది ఎమ్మెల్యేలున్నట్టు లెక్క. అటు సజ్జాద్ తమకు 25మంది సభ్యులున్న బీజేపీతోపాటు మరో 18మంది ఎమ్మెల్యేల మద్దతున్నదని గవర్నర్‌కు పంపిన లేఖలో చెప్పారు. అంటే ఆ పక్షం తమకు 44మంది సభ్యుల బలం ఉందని చెప్పింది. ఇక్కడ న్యాయంగా గవర్నర్ విశ్వసించాల్సింది ఎవరిని? సజ్జాద్ పార్టీకి ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఈ ఇద్దరికీ బీజేపీ మద్దతు ఉన్నట్టు అర్ధమవుతూనే ఉంది. కానీ మరో 18మంది ఎక్కణ్ణుంచి వచ్చినట్టు? సజ్జాద్ వారి పేర్లు ఇచ్చారా? ఆ ఎమ్మెల్యేల నుంచి వచ్చిన మద్దతు లేఖలు గవర్నర్‌కి సమర్పించారా? ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడిన రెండు పక్షాల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వాన్ని నెలకొల్పే సత్తా లేదన్న నిర్ణయానికి ఆయనెలా వచ్చినట్టు?
వాస్తవానికి పీడీపీలో చీలిక తీసుకొచ్చి, తమ సన్నిహితుడు సజ్జాద్ గని లోన్‌కు అధికార పగ్గాలు కట్టబెట్టాలని బీజేపీ కొంతకాలంగా అనుకుంటోంది. ప్రస్తుత అసెంబ్లీ గడువు 2020 డిసెంబర్‌తో ముగుస్తుంది. ప్రస్తుతానికి సజ్జాద్‌తో నెట్టుకొచ్చి, ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేయించి ఆర్నెల్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలతోపాటు దానికి కూడా ఎన్నికలు జరిపించాలని బీజేపీ వ్యూహం రచించింది. ఈ విషయం మీడియాలో గుప్పుమన్నా పీడీపీలో మొదట్లో పెద్దగా కదలిక లేదు. తగినంత రాజకీయ అనుభవం లేకనో, తమ పార్టీనుంచి ఎవరూ బయటికి పోరన్న ధీమానో... మొత్తానికి మెహబూబా నిర్లిప్తంగా ఉండిపోయారు. కానీ మంగళవారం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ఎంపీ ముజఫర్ హుస్సేన్ బేగ్ చేసిన ప్రకటనతో ఆమె మేల్కొన్నారు. సజ్జాద్ తన కుమారుడితో సమానమని ఆయన చెప్పడంతో కొందరు ఎమ్మెల్యేలు జారుకునేలా ఉన్నారని మెహబూబాకు అర్ధమైంది. అందుకే బుధవారం ఆదరా బాదరాగా కాంగ్రెస్, ఎన్‌సీలను కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ రాజకీయాల సంగతెలా ఉన్నా...జమ్మూ–కశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సున్నితమైన ప్రాంతం. అక్కడ అటు వేర్పాటువాదం, ఇటు ఉగ్రవాదం దశాబ్దాలుగా సమస్యగా మారాయి. అందుకే అక్కడ అస్థిరత నెలకొన్నప్పుడు ప్రధాన రాజకీయ పక్షాలు, కేంద్ర ప్రభుత్వమూ ఆచి తూచి అడుగులేయాలి. తమకు అలవాటైన రాజకీయపుటెత్తులు అక్కడ ప్రయోగిస్తే పరిస్థితి వికటిస్తుంది. అది దేశ ప్రయో జనాలకు చేటు తెస్తుంది. తాజా పరిణామాలపై బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు విపరీత ధోరణులతో ఉన్నాయి. రాష్ట్రంలోని మూడు ప్రధాన పక్షాలూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామ నడంలో కుట్ర దాగున్నదని అనడం అత్యంత దారుణం. ప్రజలెన్నుకున్న పార్టీలు తమ విభేదాలు మరిచి ఒకటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం ఏమంత అపరాధం? ఎలాంటి కుట్ర?
వాస్తవానికి జమ్మూ–కశ్మీర్‌లో ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో గవర్నర్ పాలన కన్నా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వం ఉండటం అత్యవసరం. రెండేళ్ల వ్యవధి ఉండగానే అసెంబ్లీ రద్దు చేయడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. గవర్నర్ అన్ని ప్రత్యామ్నాయాలూ పరిశీలించి, ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికీ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే సత్తా లేదని సంతృప్తి చెందాక ఆ నిర్ణయా నికొస్తే ఎవరూ అభ్యంతరం చెప్పరు. అందుకోసం అసెంబ్లీని సమావేశపరిచి అక్కడే బలా బలాలు తేలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేది. కానీ దానికి విరుద్ధంగా జమ్మూ–కశ్మీర్‌లో బూటకపు ప్రజాస్వామ్యం నడుస్తున్నదన్న వేర్పాటువాదుల ప్రచారానికి బలం చేకూర్చే విధంగా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే వ్యవహరించడం విడ్డూరం. అసెంబ్లీ రద్దు అంశాన్ని ఏ పార్టీ అయినా కోర్టులో సవాలు చేస్తే గవర్నర్ నిర్ణయం న్యాయ పరీక్షకు నిలబడుతుందా అన్నది సందేహమే. రాజకీయ పక్షాల బలాబలాలు తేలాల్సింది చట్టసభల్లో తప్ప రాజ్‌భవన్‌లలో కాదని పలుమార్లు న్యాయ స్థానాలు స్పష్టం చేశాయి. అయినా స్వీయ రాజకీయ ప్రయోజనాలకోసం ఎంతకైనా తెగించటం అధికారంలో ఉన్నవారికి అలవాటైపోయింది. ఇది విచారకరం.
Comments
Please login to add a commentAdd a comment