జమ్మూకశ్మీర్లో ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా గవర్నర్ సత్‌పాల్ మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం. జమ్మూ కశ్మీర్ అనేది సైనిక సమస్య కాదు, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. పరస్పర చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి.
జమ్మూ కశ్మీర్‌లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పర్చడానికి రాజకీయ పార్టీలను అనుమతించకుండా ఆ రాష్ట్ర గవర్నర్ తీసుకున్న రాజ్యాంగ వ్యతిరేక చర్య కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుగొనడంలో నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వానికి ఆసక్తి లేదని స్పష్టం చేస్తోంది. దానికంటే ఎన్నికల్లో జాతీయవాద మనోభావాలను వాడుకోవడం పట్లే దానికి ఆసక్తి ఉన్నట్లుంది. ఇది ఒక రాష్ట్రంలో లేక ఒక నిర్దిష్ట సామాజిక బృందం అనుభవిస్తున్న చారిత్రక వేదన పట్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతూ సమస్యకు మరిం తగా నిప్పు రాజేస్తున్నట్లుగా ఉంది. జమ్మూకశ్మీర్లో రాజకీయ పార్టీలను చర్చలబల్ల వద్దకు తీసుకొచ్చి ప్రభుత్వ ఏర్పాటు కోసం సాధ్యమైనన్ని ప్రయత్నాలు చేసివుండాలని మనలో చాలామంది భావన.
జాతీయ ప్రయోజనాల రీత్యా జాతీయ పార్టీలని చెప్పుకుంటున్నవి ఆ రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించి ద్వితీయపాత్రకు మాత్రమే పరిమితం కావలసి ఉంది. కానీ బీజేపీ నేరుగా రాష్ట్రాన్ని పాలిం చడానికి రాజకీయ సంప్రదింపులు జరిపే ఉద్దేశంతోనే సత్‌పాల్ మాలిక్‌ని జమ్మూ కశ్మీర్‌కు గవర్నర్‌గా పంపించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆయన లక్ష్యం కశ్మీర్ రాజకీయ పార్టీలను హిందుత్వ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించడమే. సాజిద్ లోనేని దాంట్లోభాగంగానే ప్రోత్సహించారు. ఆ రకంగా నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ వంటి స్థానిక రాజకీయ పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టవచ్చని, లేదా తగ్గించవచ్చని భావించారు.
తన ప్రజలపైనే యుద్ధం చేస్తూ, వ్యవస్థల విశ్వసనీయతనే విధ్వంసం చేయడానికి పూనుకున్న ప్రభుత్వాన్ని మనం ఎక్కడైనా చూశామా? హింసాత్మక ఘటనలు పెరిగాయి కాబట్టి కశ్మీరులో గత నాలుగేళ్లుగా పరిస్థితి దిగజారిపోలేదని, కశ్మీర్ సమస్య పరి ష్కారానికి కేంద్రం ఏరకమైన ఆసక్తీ చూపకపోవడమే అక్కడ అశాంతికి కారణమని మనందరికీ తెలుసు. కశ్మీర్ సమస్య పట్ల కఠిన పరిష్కారమే మార్గమని, అంటే సాయుధ బలగాలకు స్వేచ్ఛ ఇచ్చి వారెప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయ ప్రక్రియను అనుమతించని విధంగా పరిష్కరించాలని ఆర్‌ఎస్‌ఎస్ మేధో బృందం చాలవరకు భావిస్తోంది. కశ్మీర్.. యుద్ధం ద్వారా గెలవాల్సిన ప్రాంతంగా సంఘ్ పరివార్ భావిస్తోంది. భారత్‌లో మన బానిసత్వానికి గుర్తుగా మిగిలిన ఇస్లామ్ చిహ్నాలను పూర్తిగా రద్దు చేయాలంటూ రాత్రింబవళ్లు మొత్తుకుంటున్న సంఘ్ భక్తపరివార్‌కి ఇలాంటి తరహా విజయం సంతృప్తినిస్తుం దని ఆర్‌ఎస్‌ఎస్ భావన.
అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచిన తర్వాత ఉన్నట్లుండి గవర్నర్‌కు రాష్ట్రంలో ఇక సుస్థిర ప్రభుత్వం సాధ్యం కాదని స్ఫురించిందంటే కేంద్రం ఆజ్ఞలకు వెన్నెముక లేని గవర్నర్ పూర్తిగా లొంగిపోయినట్లే లెక్క. పైగా ఇతర ప్రతిపక్ష పార్టీలు పంపిన ఉత్తరాలను గవర్నర్ తిరస్కరించారు. వాస్తవానికి మునుపెన్నడూ లేనంత రాజకీయ ఐక్యతను ప్రదర్శించిన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు ఉమ్మడిగా వెళ్లి గవర్నర్‌ను కలవాలని నిర్ణయించాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మరో ఆలోచన ఉన్నట్లుంది.
కశ్మీర్ నుంచి ఈశాన్య భారత్ వరకు హిందుత్వ ప్రభుత్వాన్ని స్థాపించాలనే అమిత్‌షా, నరేంద్రమోదీల స్వప్న సాకారం చేయడానికి జమ్మూకశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం ఆశిం చింది. ప్రభుత్వాన్ని ఏర్పర్చే అవకాశాన్ని రాజకీయపార్టీలకు ఇవ్వకుండా అసెంబ్లీని రద్దుపరచడం ద్వారా మాలిక్ వాస్తవానికి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ సమయంలో ఏం కోరుకుంటోందో దాన్ని మాత్రమే గవర్నర్ పాటించినట్లుంది. గవర్నర్ తన చర్యను సమర్థించుకోవడమే కాకుండా, పీడీపీ, ఎన్‌సీ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పంపిన ఉత్తరాన్ని ఫ్యాక్స్ మిషన్ పనిచేయనందున స్వీకరించలేకపోయినట్లు ప్రకటించడం ఆవేదన కలిగించే విషయం.
పైగా ఆర్‌ఎస్‌ఎస్ నియమించిన రామ్ మాధవ్ సమస్యపట్ల ఏమాత్రం అవగాహన లేకుండానే మీడియా వద్దకు హుటాహుటిన పరుగెత్తుకెళ్లి, పాకిస్తాన్ ఆదేశాల ప్రకారమే ఆ మూడు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పర్చాలని కోరుకుంటున్నట్లుగా ఆరోపించి అభాసుపాలయ్యారు. రామ్‌మాధవ్ వ్యవహరించిన తీరు కశ్మీర్ సమస్య పట్ల బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధీ లేదన్న విషయాన్ని ప్రతిబింబిస్తోంది. సంవత్సరాలపాటు రాష్ట్రాన్ని పాలించిన ప్రభుత్వాన్ని, కొద్ది నెలలక్రితం వరకు భాగస్వామిగా అధికారం చలాయించిన పార్టీని జాతి వ్యతిరేకమైనదిగా ఎలా ముద్రవేస్తారు? జమ్మూకశ్మీర్ వ్యవహా రాల్లో వేలుపెట్టేందుకు రామ్ మాధవ్ లాంటి వ్యక్తిని నియమించినప్పుడే కేంద్రప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకున్నాం.
బీజేపీతో సమస్య ఏమిటంటే అది ప్రజాతీర్పుకు వెన్నుపోటు పొడిచింది. గుజరాత్ బుడగ పేలిపోయింది. అభివృద్ధి ఎజెండా గాల్లో కలిసింది. మన వ్యవస్థలు తమ స్వతంత్రప్రతిపత్తిని, బలాన్ని కోల్పోతున్నాయి. ప్రజలమీద యుద్ధం ప్రకటించి ప్రభుత్వమే వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నట్లు కనిపిస్తోంది. అది జమ్మూ కశ్మీర్‌ను కోరుకుంటోంది కానీ కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని భావించదు. భారత్‌లోని సవర్ణులతో కశ్మీర్‌గురించి చర్చించాలని అనుకుంటోది తప్పితే కశ్మీర్ ప్రజలతో మాట్లాడాలని అనుకోవడం లేదు. ఇక ఆర్‌ఎస్‌ఎస్ జాతీయవాద నమూనా ప్రకారం, వారికి కశ్మీరీ ముస్లింలతో పని లేదు, అక్కడి ప్రజలతో పనిలేదు కానీ అఖండభారత్‌లో భాగంగా కశ్మీర్ భౌగోళిక ప్రాంతం మాత్రమే వారిక్కావాలి. ఒకవేళ వారు ప్రజల గురించి ఆలోచించినప్పటికీ జమ్మూలోని హిందువుల గురించే ఆలోచిస్తారు. ఇంతకంటే మించిన వంచన లేదు.
ఇప్పుడు కశ్మీర్‌కి కావలసింది భారత్ నుంచి ఒక ప్రేమాస్పదమైన వెచ్చటి కౌగిలింత మాత్రమే. యువతకు ఉద్యోగం, అవకాశాలు అవసరం. రాజకీయ వాణిని వినాలి. రాజకీయ చర్చలపట్ల విశ్వాసం ప్రకటించినందుకే అక్కడ ఎంతోమంది సాహస జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కశ్మీర్ సైనిక సమస్య, పాలనాపరమైన సమస్య కాదు. అదొక రాజకీయ సమస్య. చర్చలద్వారానే దాన్ని పరిష్కరించాలి. రాజ్యాంగాన్ని, చట్టపాలనను విశ్వసిస్తున్న రాజకీయ పార్టీల ప్రతిష్టను మసకబార్చి మీరు చేసేదేమీ ఉండదు. ద్వేషానికి, హింసకు వ్యతిరేకంగా పోరాడుతూ అనేకమంది నేతలను కోల్పోయిన కశ్మీర్ రాజకీయపార్టీలపై మరకలువేయడానికి ప్రయత్నిస్తే తర్వాత మీరు మాట్లాడేందుకు మనిషి కూడా మిగలడు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు కశ్మీర్‌లో ఇలాంటి అంగుష్టమాత్రపు రాజకీయాల్లో మునగకూడదు.
-విద్యాభూషణ్ రావత్, మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment