ఇమ్రాన్‌పై మోదీ యార్కర్‌ | Guest Column By Shekhar Gupta On Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్‌ పై మోదీ యార్కర్‌

Published Sat, Aug 10 2019 12:37 AM | Last Updated on Sat, Aug 10 2019 1:26 PM

Guest Column By Shekhar Gupta On Jammu And Kashmir - Sakshi

ఒకే ఒక్క చర్య.. 70 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. దెబ్బతీయడం పాక్‌ వంతు.. దెబ్బ కాచుకోవడం భారత్‌ వంతు అనేలా సాగిన యథాతథస్థితి కశ్మీర్‌లో తల్లకిందులైంది. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా, భారత ప్రధాని నరేంద్రమోదీ పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ని పదునైన యార్కర్‌తో దెబ్బతీసేశారు. కశ్మీర్‌ సమస్యను ద్వైపాక్షిక సమస్య నుంచి అంతర్జాతీయ సమస్యగా మార్చాలని దశాబ్దాలుగా పాక్‌ చేసిన ప్రయత్నం ఇప్పుడు మోదీ చర్యతో రెండు దేశాల మధ్య అంతర్గత సమస్యగా మారిపోయింది. యథాతథ స్థితి ఇప్పుడు స్థానం మార్చుకుంది.దాన్ని అంగీకరించినా లేక నిర్లక్ష్యపు దాడులకు దిగినా పాక్‌ సాధించేదేమీ ఉండదు.

కశ్మీర్‌ లోయలో ఆంక్షలు తొలగించాక ప్రజలు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసి భారత సైనికులు లోయపై తమ పట్టు కోల్పోయేలా చేస్తారనే ఆశ మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్‌కు మిగిలి ఉంది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ భారత ప్రధాని నరేంద్రమోదీ యార్కర్‌కు చిత్తయ్యారా? క్రికెట్‌ భాషలో చెప్పాలంటే ఇది నిజమేననిపిస్తోంది. ఇంతవరకు కశ్మీర్‌ విషయంలో పాకిస్తానే మొట్టమొదటగా పావులు కదుపుతూ వచ్చేది. దానికి భారత్‌ ప్రతిస్పందించేది. కానీ ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా భారత ప్రధాని మోదీ ఇంతవరకు సాగిన చరిత్రకు మంగళం పాడేశారు. అది ఎంత బలంగా తగిలిం దంటే తగిన ప్రతిస్పందనకు కూడా సిద్ధం కాలేకపోయిన పాకిస్తాన్‌ ఏం జవాబు చెప్పాలో తెలీని అయోమయంలో పడిపోయింది. భారత రాజ్యాంగంలోని తమకు అర్థంకాని చిక్కులు, తికమకల గురించి పాక్‌ జాతీయ అసెంబ్లీలో గత వారం సభ్యులు ప్రదర్శించిన భావోద్వేగాలను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 

ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35–ఏపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాక్‌ చేష్టలుడిగి పోవడానికి అనేక కారణాలున్నాయి మరి. రాజ్యాంగాన్ని తరచుగా చాపచుట్టి, తిరగరాసే అలవాటు ప్రబలంగా ఉన్న పాక్‌ పాలకుడు భారతదేశంలో అలాంటి ఘటన జరగడాన్ని చూసి తట్టుకోలేకపోయారు. రాజ్యాంగాన్ని ధిక్కరించడంలో సాటిలేదనిపించుకున్న పాకిస్తాన్‌ ప్రస్తుత స్పందనకు మంచిన అభాస మరొకటి ఉండదు. రెండోది.. కశ్మీరీయులకు తాను చేసిన హామీలకు భారత్‌ కట్టుబడాల్సి ఉందని పాక్‌ ప్రస్తుతం అరచి గీపెడుతోంది. కానీ బహుళ, ద్వైపాక్షిక సమావేశాల్లో తాను చేసిన వాగ్దానానలన్నింటినీ ఉల్లంఘించడం అలవాటుగా పెట్టుకున్న పాక్‌ మరోవైపు భారత్‌ స్పందనపై ఇంతగా ఉలిక్కిపడటమే అతిపెద్ద రసాభాస. అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏదంటే సిమ్లా ఒప్పందాన్ని భారత్‌ ఉల్లఘించిందంటూ ఇమ్రాన్‌ ఖాన్‌ స్వయంగా ఆరోపణలకు దిగడమే. పైగా, ఫాస్ట్‌ బౌలింగ్‌లో నిష్ణాతుడైన ఇమ్రాన్‌ కొద్దిరోజుల క్రితమే వైట్‌హౌస్‌ నుంచి ప్రకటన చేస్తూ, కశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవడంలో భారత్, పాక్‌ దేశాలు 70 ఏళ్లుగా విఫలమవుతూనే వచ్చాయని, కాబట్టి ఈ విషయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతుడైన మిస్టర్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వం వహించాలని కోరారు.

దాదాపు 31 ఏళ్ల చరిత్ర క్రమంలో (1971లో సిమ్లా ఒప్పందం.. 1999లో లాహోర్‌ ఒప్పందం 2004లో ఇస్లామాబాద్‌ ఒప్పందం వరకు) ఇరుదేశాల మధ్య జరిగిన అతి ముఖ్యమైన మూడు ద్వైపాక్షిక ఒప్పందాలు కాగితపు ముక్కల్లాగా తేలిపోయాయి. చేసుకున్న ఒప్పం దాలను పాక్‌ నేతలందరూ స్వేచ్ఛగా తోసిపుచ్చుతూ వచ్చారు. లాహార్, ఇస్లామాబాద్‌ డిక్లరేషన్లు సిమ్లా ద్వైపాక్షిక నిబద్ధతను మరోసారి నొక్కి చెప్పాయి. అయితే కశ్మీరును ద్వైపాక్షికంగా ఇరుదేశాలూ పరిష్కరించుకోలేవు కాబట్టి ట్రంప్‌ జోక్యం చేసుకోవాలని చెబుతూ బయటి ప్రపంచానికి చెప్పిన ఇమ్రాన్‌ ఈ మొత్తం మూడు ఒప్పందాలను కూడా లాంఛనప్రాయంగానే తోసిపుచ్చేశారు. సిమ్లా ఒప్పంద సారాన్ని తుంగలో తొక్కిన ఇమ్రాన్‌ ఇప్పుడు మాత్రం భారత్‌పై ఆరోపణలకు లంకించుకున్నారు. 

విశేషమైన అంశం ఏమిటంటే, కశ్మీర్‌పై ప్రాథమిక వ్యూహాత్మక, రాజకీయ సమీకరణం ఇప్పుడు పూర్తిగా తల్లకిందులైంది. 1947 నుంచి కశ్మీర్‌పై పాకిస్తానే మొదటిబాణం సంధిస్తూ వచ్చింది. ప్రతి ఘర్షణలోనూ పాక్‌దే ముందడుగుగా ఉండేది. 1947లో, 1965లో, చివరకు 1972లో సిమ్లా ఒప్పందం జరిగేవరకు ప్రతి దాడిలోనూ పాకిస్తానే ముందుండేది. ఆ తర్వాత 17 సంవత్సరాలు కాస్త శాంతి నెలకొన్నా, శాశ్వత శాంతి వైపు పాక్‌ ఎన్నడూ సిద్ధమయ్యేది కాదు.  ఈ క్రమంలోనే పాక్‌ సొంతంగా అణుపరీక్షలు నిర్వహించగలిగింది. ఆప్ఘనిస్తాన్‌లో సోవియట్‌ రష్యాకు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వం లోని సంకీర్ణ కూటమి విజయం సాధించడంలో పాకిస్తాన్‌ అప్రయత్నంగానే తనవంతు సహాయం అందించింది కూడా. పాశ్చాత్య దేశాలకోసం ఒక జిహాద్‌ను గెలిపించిన పాక్‌ తన వద్ద ఉన్న అణ్వాయుధ దన్నుతో తూర్పువైపున  మరొక జిహాద్‌కు రంగం సిద్ధం చేసుకుంది.

కార్గిల్, భారతీయ విమానం హైజాక్, భారత పార్లమెంటుపై దాడి, ముంబైపై ఉగ్రవాదుల దాడి, పఠాన్‌ కోట్, పుల్వామాలో భారత బలగాలపై దాడి ఇలా భారత భూభాగంపై జరుగుతూ వచ్చిన ప్రతి చిన్నా, పెద్ద దాడిలో పాక్‌దే ముందడుగు. ఆ తర్వాతే భారత్‌ ప్రతిస్పందించేది. గత 70 ఏళ్లుగా సైనికంగా ఎంత బలపడినప్పటికీ కశ్మీర్‌ విషయంలో భారత్‌ యథాతథ స్థితిని కొనసాగించడానికి ప్రయత్నించగా పాక్‌ దాన్ని మార్చడానికి పదే పదే ప్రయత్నిం చేది. గత వారం భారత్‌ ఒక్కసారిగా తన వైఖరిని మార్చుకుంది. భారత్‌ మొట్టమొదటిసారిగా చేసిన ఏకపక్ష ప్రదర్శనకు పాక్‌ బిత్తరపోయింది. వాషింగ్టన్‌లో సిమ్లా, లాహార్, ఇస్లామాబాద్‌ ఒప్పందాల గురించి ఇమ్రాన్‌ ప్రస్తావించిన వారం రోజుల తర్వాత, ప్రధాని మోదీ దానికి నిరసన తెలిపి ఊరుకోవడానికి బదులుగా ఒక్కసారిగా చరిత్రను తిరగరాశారు.

కశ్మీర్‌ అంతిమ పరిస్థితిపై ఇప్పటికీ చర్చలు, సంప్రదింపులకు మార్గం ఉందని పాకిస్తాన్, అంతర్జాతీయ కమ్యూనిటీ భావిస్తున్నవేళ అలాంటి పరిస్థితే ఉత్పన్నం కాకుండా పాక్‌ ఆకాంక్షలను భారత్‌ సమాధి చేసిపడేసింది. ఇన్నేళ్ల తర్వాత.. రెచ్చగొట్టడం, తర్వాత తోసిపుచ్చడం, సహాయం చేస్తానని ప్రతిపాదించడం, చర్చలు జరపటం, కొన్నాళ్లు మౌనంగా ఉండిపోవడం.. ఇవీ పాక్‌ కశ్మీర్‌పై భారత్‌ పట్ల అనుసరిస్తూ వచ్చిన ప్రామాణిక చర్యల క్రమం. ఆ చరిత్ర ఇప్పుడు తిరగబడింది. గతంలో ప్రతిసారీ పాకిస్తాన్‌ దూకుడును తగ్గించాలంటూ భారత్‌ ఏదో ఒక అగ్రరాజ్యం సహాయాన్ని అర్థించేది. ఇప్పుడు ఆ పని పాక్‌ వంతయింది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే పాకిస్తాన్‌ తన పరిమితులను, క్షీణిస్తున్న తన స్థాయిని పాక్‌ అర్థం చేసుకున్నట్లే ఉంది. ఐఎమ్‌ఎఫ్‌ నుంచి తనకు రావలసిన 6 బిలియన్‌ డాలర్ల సహాయానికి పాక్‌ తన ఆర్థిక సార్వభౌమత్వాన్నే ఫణంగా పెట్టింది. పైగా, పాక్‌ రాజకీయాలు, సమాజం, వ్యవస్థలు కుప్పగూలిపోయాయి. 

కశ్మీర్‌ సమస్యను ఎల్లప్పుడూ అంతర్జాతీయీకరణ చేయడమే పాకిస్తాన్‌ వ్యూహంగా ఉంటూ వచ్చిందని అదేసమయంలో ఈ సమస్యను ద్వైపాక్షిక స్థాయిలోనే ఉంచాలని భారత్‌ ప్రయత్నించేదని పాకిస్తాన్‌ మాజీ దౌత్యవేత్త హుసేన్‌ హక్కాని గతంలో రాశారు. కానీ ఇప్పుడు మోదీ ప్రభుత్వం భారత్, పాకిస్తాన్‌ రెండింటికీ కశ్మీర్‌ను ఒక ఆంతరంగిక సమస్యగా మార్చివేసింది. మోదీ మెజారిటీకి, రాజ కీయ, బౌద్ధిక బలమున్న ప్రతిపక్ష మైనారిటీకి మధ్య చర్చలు, ఘర్షణల కేంద్రంగా మాత్రమే భారత్‌ను పాక్‌ ఇటీవలికాలంలో లెక్కిస్తూ వచ్చింది. కాని ఒకే ఒక్క చర్యతో పాక్‌లో సర్వత్రా ఒకే చర్చ. ఇదెలా జరిగింది? ప్రపంచంలోనే నంబర్‌వన్‌ గూఢచారి సంస్థగా తాము గర్వంగా చెప్పుకునే ఐఎస్‌ఐ మోదీ కఠిన నిర్ణయం గురించి అణుమాత్రం కూడా ఎందుకు పసిగట్టలేకపోయింది? ఇప్పుడేం చేయాలి? సరిగ్గా దీన్నే ఇమ్రాన్‌ పాక్‌ జాతీయ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ‘ఇప్పుడు భారత్‌పై దాడికి నన్ను ఏం చేయమంటారు చెప్పండి’.

ఇలా అంటున్నానంటే భారత్‌లో ప్రతి అంశం కూడా సవ్యంగా ఉందని చెప్పడం నా ఉద్దేశం కాదు. లేదా కశ్మీర్‌లో ఇప్పుడు భారత చర్యలు అన్నీ సవ్యంగా ఉన్నాయని చెప్పడం కూడా నా ఉద్దేశం కాదు. అలాగని చెప్పి, పాకిస్తాన్‌ ఆర్టికల్‌ 370 రద్దుపైనా (గతంలో దీన్ని చట్టవ్యతిరేకమని పాక్‌ చెప్పేది), జైళ్లపాలైన కశ్మీర్‌ నేతలపై సానుభూతి ప్రకటించినా (వీళ్లను గతంలో తొత్తులని పాక్‌ వర్ణిం చేది), కశ్మీర్‌లో పౌరహక్కుల గురించి గొంతు చించుకున్నా.. దానికి మించిన పరిహాసాస్పద విషయం మరొకటి లేదు. ఎందుకంటే ఇద్దరు మాజీ ప్రధానులు నవాజ్‌ షరీఫ్, షబీద్‌ కఖాన్‌ అబ్బాíసీలను, ఒక మాజీ అధ్యక్షుడు అసిఫ్‌ జర్దారీని పాక్‌ జైలుపాలు చేసింది. మరొక మాజీ అధ్యక్షుడు ముషారఫ్‌పై దేశంలోకే అడుగుపెట్టకుండా నిషేధం విధించింది.

నవాజ్‌ కుమార్తె మరియంను కూడా ఇప్పుడు జైల్లో పెట్టారు. పంజాబ్‌ మాజీ డిప్యూటీ సీఎంకి, నవాజ్‌ పార్టీ ఎంపీలకు, ఇతరులకు శిక్షపడేలా చేసి జైల్లో ఉంచారు. వీరిలో చాలామందిని కనీసం బెయిల్‌ కూడా ఇవ్వకుండా నెలలతరబడి నిర్బంధంలో ఉంచారు. కాబట్టి పౌరహక్కుల భాష పాకిస్తాన్‌కు నప్పదు. యథాతథ స్థితి ఇప్పుడు స్థానం మార్చుకుంది. పాకిస్తాన్‌ దాన్ని అంగీకరించినా సరే లేక వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా నిర్లక్ష్యపు దాడులకు దిగినా ఇకపై అది సాధించేదేమీ ఉండదు. కశ్మీర్‌ లోయలో ఆంక్షలు తొలగించాక ప్రజలు మూకుమ్మడిగా తిరుగుబాటు చేసి లోయపై భారత సైనికుల పట్టు కోల్పోయేలా చేస్తారు అనే ఒక్క ఆశ మాత్రమే ప్రస్తుతం పాకిస్తాన్‌కు మిగిలి ఉంది.


వ్యాసకర్త : శేఖర్‌ గుప్తా, ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement