న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో పర్యటించేందుకు యూరోపియన్ యూనియన్ ఎంపీల బృందానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ చర్య ద్వారా కేంద్రం మహాపాపం చేసిందని, చాలాకాలంగా కశ్మీర్ అంతర్గత అంశమన్న భారత్ విధానాన్ని ఈ చర్య ద్వారా కేంద్రం ఉల్లంఘించిందని మండిపడింది.
‘ఎన్నో పరీక్షలకు నిలబడి కశ్మీర్ అంతర్గత అంశమన్న విధానానికి గత 72 ఏళ్లుగా భారత్ కట్టుబడి ఉంది. ఇప్పుడు కానీ, ఇకముందు కానీ ఈ విషయంలో థర్డ్‌పార్టీ జోక్యం సహించబోమని, ఏ ప్రభుత్వం, సంస్థ లేదా వ్యక్తి మధ్యవర్తిత్వం అంగీకరించబోమని చెప్తూ వస్తోంది. ఈ విధానాన్ని తలకిందులుగా చేయడం ద్వారా మోదీ సర్కార్ మహాపాపానికి ఒడిగట్టింది’ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా మండిపడ్డారు. కశ్మీర్ అంతర్గత అంశమన్న భారత విధానాన్ని ఉల్లంఘించడం ద్వారా మోదీ సర్కార్ కశ్మీర్‌ను అంతర్జాతీయ అంశంగా మార్చివేసిందని విరుచుకుపడ్డారు. కశ్మీర్‌లోకి మూడో వ్యక్తి జోక్యాన్ని అనుమతించడం ద్వారా దేశ సార్వభౌమత్వాన్ని, జాతీయభద్రతను మోదీ సర్కార్ సవాలు చేస్తోందని, అంతేకాకుండా దేశ పార్లమెంటును కూడా అవమానిస్తోందని సుర్జేవాలా విమర్శించారు.
యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యుల బృందం రెండురోజులపాటు జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఓ విదేశీ ప్రతినిధుల బృందం కశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. దేశ రాజకీయ నాయకులే కశ్మీర్ వెళ్లేందుకు అనుమతించని పరిస్థితుల నేపథ్యంలో ఈయూ బృందాన్ని ఎలా పంపారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment