న్యూఢిల్లీ: రాజ్యంగంలోని ఆర్టికల్ 35ఏ జమ్మూకశ్మీర్‌లో నివసించని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవీ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 35ఎ జమ్మూ కాశ్మీర్‌లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను లేకుండా చేసిందని అన్నారు.
జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటే భారత రాజ్యాంగం గొప్పది
రాష్ట్ర ప్రభుత్వంలో సమాన అవకాశాలు, ఉద్యోగాలు, భూమిని కొనుగోలు చేసేటటువంటి హక్కులను ఈ ఆర్టికల్ పౌరుల నుంచి దూరం చేసిందని తెలిపారు. వీటిపై జమ్మూకశ్మీర్ నివాసితులకు ప్రత్యేక హక్కులు ఉండటం వల్ల.. ఇతరులు(రాష్ట్రేతరులు) ఈ హక్కులను కోల్పోయారని అన్నారు. భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటే ఉన్నతమైనదన్నకేంద్ర వాదనను సీజేఐ ఏకీభవించారు.
ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్టికల్ 370తోపాటు 35ఏ ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2019లో రద్దు చేసింది. ఈ రెండు అధికరణలు జమ్మూకశ్మీర్ ప్రజలకు విశేష అధికారాలు కల్పించాయి. వారిని శాశ్వత నివాసులుగా నిర్వచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ఆస్తి కొనుగోలు, సెటిల్‌మెంట్ పరంగా ప్రత్యేక హక్కులు అందించాయి.
చదవండి: లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ
మూడు హక్కులను లాగేసుకుంది
అదే సమయంలో 35ఏ ఆర్టికల్ రాష్ట్రేతరుల ప్రాథమిక హక్కులను కాలరాసిందని చంద్రచూడ్ అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించే ఆర్టికల్ 16(1), దేశంలో ఎక్కడైనా నివసించే, స్థిరపడే హక్కును కల్పించే ఆర్టికల్ 19(1)(e), ఆస్తి కొనుగోలు, వృత్తి వ్యాపారం చేయగల స్వేచ్చ 9(1)(f) వంటి మూడు ప్రాథమిక హక్కులను 35ఏ అధికరణ హరించిందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.
దేశాన్ని ఏకతాటిపైకి..
కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. జమ్మూకశ్మీర్‌లోని శాశ్వత నివాసితులు, ఇతర నివాసితుల మధ్య మాత్రమే కాకుండా దేశంలోని ఇతర పౌరుల మధ్య కూడా వ్యత్యాసాన్ని సృష్టించిందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా దేశం మొత్తాన్ని ఏకరీతిన ఉంచిందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఉంచిందన్నారు.
రాష్ట్రంలో గతంలో అమలు చేయని సంక్షేమ పథకాలన్నింటినీ ఇది అమలు చేస్తుందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా విద్యాహక్కును పేర్కొన్నారు. ఆర్టికల్ 370ను తొలగించే వారకు భారత రాజ్యంగంలో చేసిన ఏ సవరణ కూడా జమ్మూకశ్మీర్‌కు వర్తించేది కాదని, దీని ప్రకారం 2019 వరకు అక్కడ విద్యా హక్కు ఎప్పుడూ అమలు కాలేదని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment