fundamental rights
-
సత్వర విచారణ నిందితుడి ప్రాథమిక హక్కు: సుప్రీం
న్యూఢిల్లీ: కేసుల్లో వేగంగా విచారణ జరగడం, కోర్టు నుంచి సాధ్యమైనంత త్వరగా తీర్పు పొందడం నిందితుల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. అండర్ ట్రయల్స్‌ను నిరవధికంగా నిర్బంధంలో ఉంచడం సరికాదని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది. బిహార్‌లో నాలుగేళ్లకు పైగా కస్టడీలో ఉన్న వ్యక్తికి శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. విచారణ ఇప్పట్లో పూర్తయే అవకాశం కనిపించడం లేదు గనుక బెయిలిస్తున్నట్టు వెల్లడించింది. -
మా మకుటం... సత్యమేవ జయతే!
మీరు గుడ్లురిమితే గుండెలు జారిపోవడానికి ఇక్కడ భీరువులెవరూ లేరు. మీరంతటి వీర వరేణ్యులు కూడా కారు! మీరు కళ్లెర్రజేస్తే కాలి బూడిదయ్యే కొంగలేమీ ఇక్కడ లేవు. తమరు తపోధనులైన కౌశికులు ఎంతమాత్రం కారు. మీ అధికారం సర్వంసహాధికారం కాదు. మీరు థామస్ హాబ్స్ ప్రతిపాదించిన ‘లెవయధాన్’ వంటివారు కారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన పరిమితులతో కూడిన అధికారం మాత్రమే మీ చేతిలో ఉన్నది. అదే రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు మాకు అండగా ఉన్నవి. ఆ హక్కుల్ని రక్షించడానికి న్యాయస్థానాలు దన్నుగా ఉన్నవి.రెండు వారాల కిందనే సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పిందో ఒకసారి గమనించండి. అచ్చం మీ సర్కారుకు మల్లేనే యూపీలోని యోగీబాబా సర్కార్ కూడా ఓ జర్నలిస్టుపై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించింది. కేసు సుప్రీంకోర్టు తలుపు తట్టింది. జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యానమేమిటో మళ్లీ ఒకసారి పరిశీలించండి. ‘‘ప్రజల భావ ప్రకటనా స్వాతంత్య్రాన్ని ప్రజాస్వామ్య దేశాలు గౌరవించాలి. భారత రాజ్యాంగంలోని 19 (1) (ఏ) అధికరణం పాత్రికేయుల హక్కులకు రక్షణ కల్పి స్తున్నది. పాత్రికేయుడు రాసిన వార్తా కథనం విమర్శనాత్మకంగా ఉన్నదనే నెపంతో అతడిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు.’’సర్వోన్నత న్యాయస్థానం ఇంత స్పష్టంగా తేటతెల్లం చేసిన అంశంపై ఏపీ ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకొని వ్యవహరిస్తున్నది. విజయవాడలో వరద సహాయక చర్యల్లో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ పత్రిక ఎత్తిచూపింది. బాధ్యత గల ఫోర్త్ ఎస్టేట్‌గా అది దాని విద్యుక్త ధర్మం. ‘ముంపులోనూ మేసేశారు’ అనే శీర్షికతో ఏలినవారి ఆగ్రహానికి గురైన కథనాన్ని ప్రచురించాము. దానికి కట్టుబడి ఉన్నాము. మీ ప్రభుత్వ అధి కార నివేదికల ఆధారంగానే మేమా కథనాన్ని రాశాము. మేము స్వయంగా వండి వార్చిన కథనం కాదు. వరద సహాయ కార్య క్రమాల సమీక్ష పేరుతో ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశం సందర్భంగా రెవెన్యూ శాఖ ఇచ్చిన ప్రెజెంటేషన్‌లో పేర్కొన్న విషయాల్నే ‘సాక్షి’ ఉటంకించింది.కోటిమంది భోజనాల కోసం 368 కోట్లు ఖర్చు చేశామనీ, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు వగైరాలకు 23 కోట్లు ఖర్చయ్యాయనీ, వాటర్ బాటిల్స్‌కు 26 కోట్లు వెచ్చించామనీ, మొత్తం 534 కోట్లు పునరావాస సహాయ శిబిరం కోసం ఖర్చయినట్టు ఆ ప్రెజెంటేషన్‌లో ఉన్నది. ఈ లెక్కల్లోని అనౌచిత్యాన్ని ప్రజలు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. సీపీఎం నేత బాబూ రావు ప్రజల సమక్షంలోనే ప్రభుత్వాన్ని నిలదీసిన వీడియో విస్తృతంగా సర్క్యులేషన్లో ఉన్నది. సరిగ్గా ఆ గణాంకాలనే పేర్కొంటూ, అవే ప్రశ్నల్ని ‘సాక్షి’ కూడా వేసింది.రెవెన్యూ శాఖ అధికారులు ప్రజంటేషన్ ఇచ్చినప్పుడు ఇవే అంకెల్ని చూసిన పెద్దలకు కోపం రాలేదు. జనంలో చర్చ జరుగు తున్నప్పుడు కూడా అంత కోపం రాలేదు. కానీ, ‘సాక్షి’లో కథనం రాగానే సుర్రున ప్రకోపించింది. ఆ కథనాన్ని ఖండ ఖండాలుగా ఖండించే బాధ్యతను ఇద్దరు మంత్రులకు అప్పగించారు. ఆ కార్యనిర్వహణ వారి వశం కాలేదు. వెంటనే కూటమిలోని ఒకటో నెంబరు పత్రిక రంగంలోకి దిగింది. అబ్బెబ్బే... సహాయ పునరావాస కార్యక్రమాలకు 139 కోట్లు మాత్రమే ఖర్చయింది. 534 కోట్లు అనే మాట అబద్ధమని ఆ పత్రిక తేల్చేసింది. అదే నిజమైతే కేంద్ర పరిశీలక బృందానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన నివేదికలో రిలీఫ్ క్యాంప్ ఖర్చు పేరుతో 534 కోట్లు ఎందుకు చూపెట్టారు? సదరు పత్రిక ఈ నివేదికను చూడలేదా? ప్రజల కళ్లకు గంతలు కట్టడ మనేది వారికి పెన్నుతో పెట్టిన విద్యగా చాలాసార్లు నిరూపణ అయింది.ఏ కొద్దిమందికో పులిహోర పొట్లాలు పంచి, కోటిమందికి పైగా పంచినట్టు లెక్క చూపడమేమిటి? ఆ పులిహోరకు ఒక్కో ప్లేటుకు 370 రూపాయల ఖర్చేమిటి? ఇటువంటి దగుల్బాజీ లెక్కలు చూసిన జనంలో ప్రభుత్వ ప్రతిష్ఠ బాగా పలుచబారింది. ఈ ప్రభుత్వ వ్యతిరేక వరదను ప్రతిపక్షంపైకి మళ్లించాలనే ఉద్దేశంతోనే తిరుపతి లడ్డూ వివా దాన్ని ముఖ్యమంత్రి తెరపైకి తెచ్చారనే అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో అప్పుడే పొడసూపింది. కానీ, ఈ డైవర్షన్ స్కీమ్ ఫలితమివ్వకపోగా సర్కారుపైకే ఎదురు తిరిగింది.ఐదేళ్లు పరిపాలించడం కోసం గద్దెనెక్కిన ప్రభుత్వం ఐదు మాసాలు కూడా నిండకముందే ఒక ‘విఫల ప్రభుత్వం’గా ముద్ర వేయించుకోవడం ఒక అరుదైన సందర్భం. ఇటువంటి అప్రతిష్ఠను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూటగట్టుకున్నది. ఏ గడ్డి కరిచైనా అధికారంలోకి రావాలనే సంకల్పంతోనే ఎన్డీఏ కూటమి అలవికాని హామీలను ఇచ్చిందనే అభిప్రాయం ఆ రోజుల్లోనే రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. అందువల్లనే మేనిఫెస్టో విడుదల రోజున బీజేపీ ప్రతినిధి దాని ప్రతిని పట్టుకోవడానికి నిరాకరించారనే వార్తలు వచ్చాయి. అటువంటి అంచనాలకు తగి నట్టుగానే ఈ నాలుగు నెలల పైచిలుకు కాలాన్ని కూటమి సర్కార్ నెట్టుకొచ్చింది.మేనిఫెస్టోలో హైలైట్‌గా వారు చెప్పుకున్న ‘సూపర్ సిక్స్’లో ఒక్క పథకం జోలికి ప్రభుత్వం వెళ్లలేకపోయింది. ఖజానాపై పెద్దగా భారం పడని ఉచిత గ్యాస్ సిలిండర్ల (ఏడాదికి మూడు) పంపిణీని ఈ దీపావళి నుంచి ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మిగిలిన ఐదు పథకాల అమలు సంగతి దేవుడెరుగు. ఫలానా రోజు నుంచి వాటిని ప్రారంభిస్తామనే ఒక కనీస షెడ్యూల్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.బుడమేరు వరదల సందర్భంగా ప్రభుత్వ నిష్క్రియా పరత్వం కొట్టొచ్చినట్టు కనబడింది. ముందుచూపు లేకపోవడం, వ్యూహరాహిత్యం వల్ల నలభై నిండు ప్రాణాలను బలి పెట్టవలసి వచ్చింది. మూడు లక్షలమంది తమ సర్వస్వాన్ని కోల్పోయారు. తమ యావజ్జీవిత ఆర్జితాన్ని గంగపాలు చేసు కోవలసి వచ్చింది. వారి జీవిత చక్రాన్ని వెనక్కు తిప్పడం సాధ్యమయ్యే పనేనా? ముందుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి, వారి విలువైన సామగ్రిని భద్రపరచుకునేందుకు దోహదపడి వుంటే ఇంత దుఃస్థితి ఏర్పడేది కాదు. అందుకే దీన్ని ‘విఫల ప్రభుత్వం’అంటున్నారు. రెగ్యులర్ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టలేక ఇంత కాలం నెట్టుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా ఈ దేశంలో ఏపీ కూటమి ప్రభుత్వమే! నాలుగున్నర నెలల కాలంలో 32 వేల కోట్లు అప్పు తెచ్చినందుకు, ప్రపంచ బ్యాంకు వాళ్లు నేడో రేపో విడుదల చేస్తారని చకోర పక్షుల్లా 15 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నందుకు ‘అప్పుల సర్కార్’ అని కూడా అనవచ్చు. ఇసుక రీచుల్లో, మద్యం షాపుల వేలాల్లో, ఉద్యోగుల బదిలీల్లో లంచాల దుర్గంధాన్ని వెదజల్లుతున్నందుకు ‘అవినీతి సర్కా ర్’గా పరిగణించాలి. తమ సంఖ్యా బలంపై ఆధారపడిన ప్రభుత్వమే కేంద్రంలో ఉన్నా, ఆ సర్కార్‌లో తమకూ భాగ మున్నా సొంత రాష్ట్రానికి కించిత్ మేలును కూడా చేసుకోలేక పోయినందుకు ‘అసమర్థ ప్రభుత్వం’గా భావించాలి.సాధారణంగా కొత్త ప్రభుత్వాలపై ఇంత త్వరగా జనంలో వ్యతిరేకత వ్యక్తం కాదు. ఏపీ పరిణామం మాత్రం అసాధా రణమైనదే. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బహిరంగంగా కనిపి స్తున్నది. కొత్త సర్కార్ తన హామీలు అమలు చేయకపోగా, జగన్ సర్కార్ అందిస్తున్న పథకాలను చేజార్చుకొని మోస పోయామన్న ఆవేదన ప్రజల్లో కనిపిస్తున్నది. హామీలు, స్కీముల సంగతి పక్కనబెట్టినా సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు కూడా దిగజారాయి. గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను కొత్త ప్రభుత్వం గాలికొదిలేసింది. గ్రామీణ ఆరోగ్యం పడకేసింది. ప్రభుత్వ స్కూళ్ల నుంచి మళ్లీ ప్రైవేట్ బడులకు విద్యార్థుల వలస మొదలైంది. ఐదేళ్ల తర్వాత ఎరువుల కోసం, విత్తనాల కోసం రైతులు క్యూలైన్లలో నిలబడవలసి రావడాన్ని చూస్తున్నాము. ఇటువంటి అనేక కారణాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నాయి.క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవాలన్నీ బయటికొస్తే అసంతృప్తి మరింత పరివ్యాప్తమవుతుంది. అందుకే మాట వినని మీడియాను దండోపాయంతో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుంది. ఆ ఉపాయంతోనే ‘సాక్షి’ మీద విజయవాడ పోలీస్ స్టేషన్లో ఒక అక్రమ కేసును బనాయించారు. మీడియాలో వచ్చిన వార్తలపై అభ్యంతరాలు ఉండటంలో తప్పులేదు. దాని మీద వివరణ ఇవ్వవచ్చు. దాన్ని ప్రచురించక పోతే అప్పుడు న్యాయస్థానానికి వెళ్లడం సదరు వ్యక్తులు లేదా వ్యవస్థలు చేయవలసిన పని. కానీ ఎకాయెకిన పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం భావ వ్యక్తీకరణ హక్కుపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు. రోజులు గడుస్తున్నకొద్దీ పరిణతి సాధించవలసిన ప్రజాస్వామ్యంలో ఇటువంటి దండనాథులు తలెత్తడం ఒక విషాదం.‘‘నీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. కానీ,నీ అభిప్రాయం వెల్లడించే హక్కు కోసం నా ప్రాణాలైనా ఇస్తా’’ అనేది మూడు శతాబ్దాల కిందటి ఫ్రెంచ్ ప్రజాస్వామిక నినాదం. ఇంత చరిత్ర ఉన్నది కనుకనే ప్రజాస్వామిక ‘హక్కు’ను ఏ పాలకుడూ చిరకాలం అణచిపెట్టి ఉంచలేడు. ‘‘కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలపు విజయమొస్తే, విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా?’’ అన్నారు గుంటూరు శేషేంద్రశర్మ. ఏమీ కాదు! ఈ దాదాగిరి త్రుటికాలమే. అక్రమ కేసులకు భయ పడేది లేదు. ప్రజల పక్షాన నిలబడకుండా కాడి వదిలేసేదీ లేదు. నిశ్చయంగా, నిర్భయంగా జనం గుండె గొంతుకై ‘సాక్షి’ ప్రతిధ్వనిస్తుంది. ‘సాక్షి’ పత్రిక మీద కనిపించే మకుటమే ‘సత్యమేవ జయతే’!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సుప్రీమ్ తేల్చిన ప్రత్యేక హక్కు
ఇది చరిత్రాత్మక తీర్పు. ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపగల తీర్పు. ‘‘పర్యావరణ మార్పుల దుష్ప్రభావం నుంచి విముక్తి’’ని సైతం ప్రత్యేకమైన ప్రాథమిక హక్కుగా భారత సర్వోన్నత న్యాయస్థానం తొలిసారిగా గుర్తించింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14), వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు (ఆర్టికల్ 21)ల విస్తృత పరిధిలోకే అదీ వస్తుందంటూ గత వారం సుప్రీమ్ పేర్కొనడం విశేషం. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టమేక పిట్ట), లెస్సర్ ఫ్లోరికాన్ (గడ్డి నెమలి) లాంటి అంతరిస్తున్న పక్షుల పరిరక్షణకు సంబంధించిన ఓ కేసు విచారణలో కోర్ట్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పక్షులను కాపాడడం, పర్యావరణ పరిరక్షణ... రెండూ కీలకమైన లక్ష్యాలంటూనే, ఒకదాని కోసం మరొకదాన్ని బలి చేయకుండా సమగ్ర వైఖరిని అవలంబించడం అవసరమని స్పష్టం చేసింది. పర్యావరణ మార్పులపై ఉదాసీనంగా ఉన్న పాలకులకు బాధ్యతను గుర్తు చేసింది. గతంలోకి వెళితే, పక్షుల రక్షణ కోసం 2021లో గుజరాత్, రాజస్థాన్లలోని 99 వేల చదరపు కి.మీ.ల పైగా ప్రాంతంలో ఎత్తైన విద్యుత్ లైన్లపై సుప్రీమ్ ధర్మాసనం పూర్తి నిషేధం విధించింది. సౌరఫలకాల ప్రాజెక్టుల వద్ద వేసిన ఎత్తైన వైర్లకు తగిలి పక్షులు మరణిస్తుండడంతో ఈ వివాదం రేగి, నిషేధం దాకా వచ్చింది. అయితే సౌర, పవన విద్యుచ్ఛక్తికి అవకాశం ఉన్న ప్రాంతంలో భూగర్భ విద్యుత్ కేబుళ్ళనే అనుమతిస్తే, స్వచ్ఛ ఇంధన లక్ష్యాలలో భారత్ వెనుకబడుతుందని కోర్ట్ తాజాగా భావించింది. పర్యావరణంపై ప్రపంచ ప్రయత్నాలకు అది అవరోధమనీ, పైపెచ్చు జీవించే హక్కు, సమానత్వపు హక్కు, ఇంధనం అందుబాటు లాంటి ప్రాథమిక హక్కులకు ముప్పు అనీ అభిప్రాయ పడింది. పక్షులను రక్షిస్తూనే, పర్యావరణాన్ని పరిరక్షించేలా సమతూకం పాటించడంపై దృష్టి పెట్టా లంటూ, విద్యుత్‌లైన్లపై ఏకపక్ష నిషేధాన్ని తొలగించింది. మార్చి 21న ఈ ఉత్తర్విచ్చినా శనివారం మొత్తం తీర్పును అప్లోడ్ చేయడంతో పర్యావరణంపై జడ్జీల విస్తృత చర్చ బయటకొచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి. పర్యావరణ మార్పులపై భారత్‌లో చట్టం లేనంత మాత్రాన వాటి దుష్ప్ర భావాల నుంచి భద్రతకు భారతీయులకు హక్కు లేదని కాదు అని కోర్ట్ కుండబద్దలు కొట్టింది. పర్యావరణ మార్పుతో సమానత్వపు హక్కుపై ఎంత ప్రభావం ఉంటుందో సోదాహరణంగా చర్చించింది. పర్యావరణ మార్పు వల్ల ఒకచోట తిండికీ, నీటికీ కొరత ఏర్పడితే ధనికుల కన్నా బీదలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనీ, సమానత్వపు హక్కనే భావనే దెబ్బతింటుందనీ విశదీకరించడం విశేషం. క్లైమేట్ ఛేంజ్‌కూ, మానవ హక్కులకూ ఉన్న సంబంధాన్ని ప్యారిస్ ఒప్పందం గతంలోనే గుర్తించింది. అంతర్జాతీయ చట్టాల కింద గ్రీన్హౌస్ వాయువుల్ని తగ్గిస్తూనే, ఆరోగ్య వాతావరణంలో జీవించడానికి ప్రజలకున్న ప్రాథమిక హక్కును కాపాడాలని సుప్రీమ్ పేర్కొనడం కీలకాంశం. ఇది స్వాగతించాల్సిన విషయం. ఆ మాటకొస్తే పర్యావరణ పరిరక్షణను హక్కుల కోణంలో నుంచి వ్యాఖ్యానించడం సుప్రీమ్ చాలాకాలంగా చేస్తున్నదే. కాలుష్యరహిత వాతావరణంలో బతకడమ నేది జీవించే హక్కులో భాగమని దశాబ్దాల క్రితమే పేర్కొంది. స్వచ్ఛమైన నీరు, గాలి అనేవి ప్రజల హక్కు అని గత నెలలోనూ వ్యాఖ్యానించింది. తాజా తీర్పు వాటికి కొనసాగింపు. అయితే, దేశంలోని కోట్లాది ప్రజానీకాన్ని పర్యావరణ దుష్ప్రభావాల నుంచి విముక్తం చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త తీర్పు అయినా పూనిక నిస్తుందా అన్నది ప్రశ్న. అసలు స్వచ్ఛమైన, ఆరోగ్య కరమైన వాతావరణంలో బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ, వనరుల దుర్వినియోగం, మార్కెట్ శక్తుల ప్రకృతి విధ్వంసం, పెరిగిపోతున్న వినిమయవాదం ప్రాణాల మీదకు తెస్తోంది. తెలిసైనా, తెలియకైనా అలా పర్యావరణ హాని చేయడమంటే మనిషి జీవించే హక్కును నిరాకరించడమే! జీవితాలనూ, జీవనోపాధినీ దెబ్బ తీస్తున్న ఈ పరిస్థితులు మానవాళి ఉనికికే ఎదురైన సవాళ్ళు. పైపెచ్చు, ధనికులతో పోలిస్తే దారితెన్నూ లేని బీదసాదలపై ఈ ప్రభావం అధికమని అందరూ అంగీకరిస్తున్నదే. ఆ పరిస్థితులు కొనసాగరాదన్నదే సుప్రీమ్ ఆదేశం అందిస్తున్న సందేశం. వర్షపాతాల్లో మార్పులు, వేళ కాని వేళ వడగాడ్పులు రాగల కాలంలో మరింత పెరగనున్నాయని ప్రపంచ సంస్థలు భారత్‌ను ఇప్పటికే హెచ్చరించాయి. హిమానీనదాలు కరుగుతున్నా, సముద్రమట్టాలు పెరుగుతున్నా, రాజధానిలోనే స్వచ్ఛమైన గాలి కరవైనా అవేవీ పాలకులకు ప్రాధాన్యాలుగా కనపడక పోవడం దౌర్భాగ్యం. ఆ తలనొప్పి విద్యావేత్తలు, ఉద్యమ కారులు, పౌరసమాజ బృందాలదేనని పొరబడుతున్న వేళ సుప్రీమ్ తీర్పు చెంపపెట్టు. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేసి, ప్రభుత్వాలు చేపడుతున్న అనేక విధానాలు ఇవాళ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయనేది నిష్ఠురసత్యం. దానికి తోడు కనీస స్పృహ లేకుండా నేల, నింగి, గాలి, నీరును కలుషితం చేయడంలో అందరం పోటీలు పడుతున్నాం. పర్యవసానాలే ఇప్పుడు చూస్తున్న అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, ఇంకా అనేకానేక పర్యావరణ దుష్ప్రభావాలు. ఈ పరిస్థితుల్లో సుప్రీమ్ గుర్తించిన ఈ ప్రత్యేక హక్కు పార్లమెంట్‌కు మేలుకొలుపు కావాలి. పర్యావరణంపై కుంభకర్ణ నిద్ర నుంచి ఇకనైనా పాలకులు మేల్కోవాలి. ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగాల్సి ఉంది. వనరుల సమర్థ వినియోగంపై చర్యలు చేపట్టి, అందరిలో అవగాహన పెంచాల్సి ఉంది. లేదంటే, ఈ తాజా తీర్పు ఆసరాగా పౌరులు తమ హక్కును కాపాడుకొనేందుకు చట్టపరమైన మార్గాలను అనుసరించే వీలు ఉండనే ఉంటుంది. -
ఆర్టికల్ 35ఏ వారి ప్రాథమిక హక్కులను లాగేసుకుంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజ్యంగంలోని ఆర్టికల్ 35ఏ జమ్మూకశ్మీర్‌లో నివసించని పౌరుల ప్రాథమిక హక్కులను లాగేసుకుందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవీ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఆర్టికల్ 35ఎ జమ్మూ కాశ్మీర్లో నివసించని ప్రజలకు కొన్ని కీలక రాజ్యాంగ హక్కులను లేకుండా చేసిందని అన్నారు. జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటే భారత రాజ్యాంగం గొప్పది రాష్ట్ర ప్రభుత్వంలో సమాన అవకాశాలు, ఉద్యోగాలు, భూమిని కొనుగోలు చేసేటటువంటి హక్కులను ఈ ఆర్టికల్ పౌరుల నుంచి దూరం చేసిందని తెలిపారు. వీటిపై జమ్మూకశ్మీర్ నివాసితులకు ప్రత్యేక హక్కులు ఉండటం వల్ల.. ఇతరులు(రాష్ట్రేతరులు) ఈ హక్కులను కోల్పోయారని అన్నారు. భారత రాజ్యాంగం జమ్మూకశ్మీర్ రాజ్యాంగం కంటే ఉన్నతమైనదన్నకేంద్ర వాదనను సీజేఐ ఏకీభవించారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 11వ రోజు విచారణ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఆర్టికల్ 370తోపాటు 35ఏ ను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 2019లో రద్దు చేసింది. ఈ రెండు అధికరణలు జమ్మూకశ్మీర్ ప్రజలకు విశేష అధికారాలు కల్పించాయి. వారిని శాశ్వత నివాసులుగా నిర్వచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు, ఆస్తి కొనుగోలు, సెటిల్మెంట్ పరంగా ప్రత్యేక హక్కులు అందించాయి. చదవండి: లోక్‌సభ ఎన్నికలు ముందస్తుగానే రావొచ్చు: మమతా బెనర్జీ మూడు హక్కులను లాగేసుకుంది అదే సమయంలో 35ఏ ఆర్టికల్ రాష్ట్రేతరుల ప్రాథమిక హక్కులను కాలరాసిందని చంద్రచూడ్ అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించే ఆర్టికల్ 16(1), దేశంలో ఎక్కడైనా నివసించే, స్థిరపడే హక్కును కల్పించే ఆర్టికల్ 19(1)(e), ఆస్తి కొనుగోలు, వృత్తి వ్యాపారం చేయగల స్వేచ్చ 9(1)(f) వంటి మూడు ప్రాథమిక హక్కులను 35ఏ అధికరణ హరించిందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. దేశాన్ని ఏకతాటిపైకి.. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. జమ్మూకశ్మీర్‌లోని శాశ్వత నివాసితులు, ఇతర నివాసితుల మధ్య మాత్రమే కాకుండా దేశంలోని ఇతర పౌరుల మధ్య కూడా వ్యత్యాసాన్ని సృష్టించిందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేయడం ద్వారా దేశం మొత్తాన్ని ఏకరీతిన ఉంచిందని పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో సమానంగా ఉంచిందన్నారు. రాష్ట్రంలో గతంలో అమలు చేయని సంక్షేమ పథకాలన్నింటినీ ఇది అమలు చేస్తుందని అన్నారు. ఇందుకు ఉదాహరణగా విద్యాహక్కును పేర్కొన్నారు. ఆర్టికల్ 370ను తొలగించే వారకు భారత రాజ్యంగంలో చేసిన ఏ సవరణ కూడా జమ్మూకశ్మీర్‌కు వర్తించేది కాదని, దీని ప్రకారం 2019 వరకు అక్కడ విద్యా హక్కు ఎప్పుడూ అమలు కాలేదని వివరించారు. -
హక్కులకు ప్రమాదం!
ఒక నిషిద్ధ సంస్థలో కేవల సభ్యత్వం ఉన్నా సరే దాన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 కింద నేరంగా పరిగణించవచ్చని సుప్రీం కోర్టు బెంచ్ ఇచ్చిన తాజా తీర్పుతో మౌలిక న్యాయసూత్రాలకు విఘాతం కలిగినట్లయింది! ఇటీవల సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఒక నిషిద్ధ సంస్థలో కేవల సభ్యత్వం ఉన్నా సరే దాన్ని చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం – 1967 కింద నేరంగా పరిగణించ వచ్చని సారాంశం. అయితే నిర్దిష్ట సంస్థలో క్రియాశీల, నిష్క్రియాత్మక సభ్యత్వాల మధ్య వ్యత్యాసాన్ని ఈ తీర్పు పట్టించు కోలేదు! ఉగ్రవాదంపై పోరు, దేశ భద్రత పరిరక్షణ పేరుతో చట్టవ్యతిరేకంగా ఏజెన్సీలు పని చేయడాన్ని చట్టబద్ధం చేయడం అనే ప్రమాదం ఈ తీర్పులో దాగుంది. 2011నాటి అరూప్ భూయాన్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ అసోం హోమ్ డిపార్ట్మెంట్ కేసులో సుప్రీంకోర్టే ఇచ్చిన తీర్పుకు ఇది స్వీయ విఘాతం. నిషిద్ధ సంస్థలు తమ సభ్యుల పేరు, చిరునామా, ఫోన్ నంబర్లు, ఈమెయి ల్తో కూడిన రిజిస్ట్రీని నిర్వహించవు. చట్ట బద్ధ సంస్థ సభ్యత్వ రికార్డుల విషయంలో కూడా, ఒక సంస్థ నిషేధానికి గురైన తర్వాత ఆ సంస్థలో ఎవరు సభ్యులు, ఎవరు దాంట్లో కొనసాగుతారు అని ఏ సంస్థ అయినా లేదా న్యాయస్థానమైనా ఎలా నిర్ధారిస్తాయి? సంబంధం ఉన్నంత మాత్రాన అమాయకులైన యువతీ యువకులను చట్టవిరుద్ధ ఉగ్రవాద సంస్థల సభ్యులుగా ఎలా ఇరికిస్తారు అనే విష యాన్ని గతంలో జ్యోతి బాబా సాహెబ్ కోర్జ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర (2012) కేసు చక్కగా విశ్లేషించింది. ఈ కేసులో 15 మంది వ్యక్తులను (అందరూ గిరిజన యువతీయువకులే) ఉగ్రవాద సంస్థ అయిన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సభ్యులుగా ఆరోపించారు. పుస్తకాలు, ఆర్టికల్స్, పాంప్లెట్స్ వంటి మావోయిస్టు ప్రచార సాహి త్యాన్ని కలిగివుండటమే వీరు చేసిన నేరం. ఇది తప్ప, వీరు ఉగ్రవాద చర్యల్లో లేదా హింసాత్మక చర్యల్లో పాల్గొన్నారని కానీ, ఉగ్రవాద శిబిరాన్ని నిర్వహించారనికానీ, రిక్రూట్మెంట్ చేశారని గానీ, మావోయిస్టు కార్యకర్తలకు ఆశ్రయం ఇచ్చారని కానీ, ఉగ్రవాద చర్యల కోసం నిధులు సేకరించా రని కానీ వీరిపై ఆరోపణలు లేవు. కానీ, ఉగ్రవాద సంస్థ సభ్యత్వం తీసుకోవడం అనేది నిర్బంధించ దగిన శిక్షార్హమైన నేరం అవుతుందని, దీనిగ్గాను యావజ్జీవ శిక్షకూడా విధించొచ్చని బాంబే హైకోర్టు ‘ఉపా’ సెక్షన్ 20కి విస్తృతార్థం కల్పించింది. 2011లో అరూప్ భూయాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు, ’’హింసాత్మక చర్యలకు పాల్పడటం లేదా ప్రజలను హింసాత్మక చర్యలకు ప్రేరేపించడం లేదా అశాంతిని సృష్టించడానికి పూనుకోవడం చేస్తే తప్ప, నిషిద్ధ సంస్థలో కేవలం సభ్యత్వం ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తిపై నేరా రోపణ చేయలేము’’. సూచించడం, ప్రేరేపించడం మధ్య వ్యత్యాసం ఉందంటూ బ్రాండెన్ బర్గ్ వర్సెస్ ఓహియో కేసులో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై ఆనాడు భారత సుప్రీంకోర్టు ఆధారపడింది. ‘‘కేవలం సభ్యత్వం ఉన్నంత మాత్రాన దాన్ని చట్టవిరుద్ధం అని చెప్పలేము. చట్టవ్యతిరేక కార్యాచరణకు స్పష్టంగా ప్రేరేపించి నట్లయితేనే అది చట్టవిరుద్ధంగా మారుతుంద’’ని అమెరికా ఫెడరల్ కోర్టు రనీఫ్ కేసులో తీర్పు చెప్పింది. సభ్యత్వం విషయంలో క్రియాశీలకంగా ఉండటానికి నిష్క్రియాత్మకంగా ఉండటానికి మధ్య వ్యత్యాసం ఉందంటూ స్కేల్స్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ఇచ్చింది. నిషిద్ధ సంస్థతో సంబంధం ఉన్నంత మాత్రాన అపరాధం మోపడానికి నేరన్యాయ చట్టంలో తావులేదని ఎల్బ్రాండ్ట్ వర్సెస్ రస్సెల్ కేసులో కూడా అమెరికా సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పులను నాడు భారత సుప్రీంకోర్టు ప్రస్తావించింది. కానీ తాజా తీర్పు భద్రత పేరుతో హక్కులకు విఘాతం కలిగించేలా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు 44 సంస్థలను ఉగ్రవాద సంస్థలుగా, 13 సంస్థలను చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించింది. ఉగ్రవాదాన్ని, టెర్రరిస్టు చట్టాలను, ఉగ్రవాద బృందాలను నిర్వచించడంలో, అసంబద్ధంగా ఉగ్రవాదిగా ముద్రల పాలైన వారిని ఒక మేరకు కాపాడేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పెనుగులాడుతున్నాయి. అదే సమ యంలో ఉగ్రవాద నిరోధక సంస్థల అధికారాలను దుర్వినియోగం చేయడాన్ని అరికట్టాల్సి ఉంది. వ్యక్తులపై తప్పుడు ముద్రలు వేయడం అనేది వాస్త వానికి ఉగ్రవాదంపై పోరాట యత్నాలను పలుచ బారుస్తుంది. ఇది ప్రజాస్వామిక విలువలను, సంస్థ లను అణగదొక్కుతుంది. ఉగ్రవాద, చట్టవ్యతిరేక కార్యాచరణను ఏది ఏర్పరుస్తుంది? ఉగ్రవాద, చట్టవ్యతిరేక బృంద సభ్యుడిగా ఏదీ నిర్ధారిస్తుంది అనే అంశాలపై ప్రతి ఉదార ప్రజాస్వామిక వ్యవ స్థలో కచ్చితమైన న్యాయపరమైన వ్యాఖ్యలకు అనుగుణంగానే మునుపటి మూడు తీర్పులు ఉంటూ వస్తున్నాయి. ఉదాహరణకు, సామాజిక లేదా వృత్తిపరమైన పరస్పర ప్రతిచర్యల క్రమంలో ఉగ్ర వాద బృందాల సంబంధంలోకి తెలియకుండా వచ్చిన వారిని మినహాయించడానికి ఇవి ప్రాధాన్య మిచ్చాయి. ఇక్కడ మాత్రం అనుమానితులు కాని పౌరులను ఉచ్చులో చిక్కుకునేలా చేయడానికి నిఘా సంస్థలకు సుప్రీం తన తాజా తీర్పులో సమ ర్థంగా లైసెన్సును మంజూరు చేసినట్లయింది. అశీష్ ఖేతాన్ వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్ జిందాల్ గ్లోబల్ లా స్కూల్ -
ప్రజల పై బెదిరింపు చర్యలకు దిగొద్దు! రష్యాని తిట్టిపోసిన యూఎన్
UN Human Rights Council, deputy UN rights chief Nada: ఉక్రెయిన్ యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న తమ దేశ ప్రజలపై బెదిరింపులకు దిగుతున్న రష్యా దుస్సాహాసాన్ని యూఎన్ తాత్కాలిక మానవ హక్కుల చీఫ్ నాడా అల్ నషిఫ్ తీవ్రంగా ఖండించారు. ప్రాథమిక హక్కలు అణగదొక్కే చర్యలకు పాల్పడవద్దంటూ హెచ్చరించారు. డిప్యూటీ యూఎన్ హక్కుల చీఫ్ నాడా అల్ నషిఫ్ యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందు మాట్లాడుతూ...ఉక్రెయిన్‌లో యుద్ధానికి వ్యతిరేకంగా గళం విప్పే వ్యక్తులపై బెదిరింపులు, నిర్బంధ చర్యలు, ఆంక్షలు విధించడటం తదితరాలన్నింటిని తప్పుపట్టారు. ఇది రాజ్యంగబద్ధంగా ఇవ్వబడ్డ ప్రాథమిక హక్కులకు సంబంధించి.. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని హెచ్చరించింది. అలాగే రష్యలో జర్నలిస్టులపై పెంచుతున్న ఒత్తిడి, ఇంటర్నెట్ వనరులను నిరోధించడం తదితరాలన్నింటిని వ్యతిరేకించారు. మిచెల్ బాచెలెట్ స్థానంలో కొత్త చీఫ్ వోల్కర్టర్క్ వచ్చే వరకు ప్రస్తుతం మానవ హక్కుల కోసం తాత్కాలికి హైకమిషనర్‌గా నాడా అల్ నషీఫ్ పనిచేస్తున్నారు. రష్యా ప్రభుత్వ వైఖరి మీడియా స్వేచ్ఛకు విరుద్ధంగా, సమాచారాన్ని యాక్సెస్ చేసే హక్కును ఉల్లంఘించేవిగా ఉన్నాయన్నారు. అలాగే నిర్దేశిత విదేశీ లేదా అంతర్జాతీయ ప్రతినిధులతో అప్రకటిత పరిచయాలను రష్యన్ ఫెడరేషన్ భద్రతకు వ్యతిరేకమైన నేరంగా పరిగణించవద్దని రష్యాకి పులపునిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌లో పూర్తి స్థాయి దాడి చేసినప్పటి నుంచి రష్యా దళాల ఉల్లంఘలపై ఉన్నత స్థాయి విచారణకు యూఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అదేశించింది. మరోవైపు రష్యాలో హక్కుల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని ఒత్తిడి కూడా పెరుగుతోంది. అంతేగాదు అక్కడ పరిస్థితిని సమీక్షించే ఒక రిపోర్టర్ని నియమించాలని యూరోపియన్ యూనియన్ దేశాల హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌ని కోరాయి కూడా. (చదవండి: 50 మిలియన్ల మందికి పైగా ప్రజలు బానిసత్వంలోనే: యూఎస్ రిపోర్ట్) -
భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్ రికార్డు చేయడం నేరం: హైకోర్టు
Recording wife’s telephonic call without her consent is a blatant violation of her privacy చండీఘడ్: భార్య అనుమతి లేకుండా ఆమె ఫోన్ కాల్స్‌ను భర్త రికార్డు చేయడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పంజాబ్, హర్యానా ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. జనవరి 20, 2020 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లిసా గిల ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పంజాబ్‌లోని భటిండాకు చెందిన ఓ వ్యక్తి భార్య వేదింపులకు గురిచేస్తోందని, విడాకులు ఇప్పించమని కోర్టును ఆశ్రయించాడు. అందుకు సాక్షంగా ఫోన్ సంభాషణలను సమర్పించాడు. దీంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా ఫిబ్రవరి 20, 2007లో సదరు భార్యభర్తలిరువురికీ వివాహం జరిగింది. 2011 మేలో వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. ఐతే మనస్పర్ధల కారణంగా 2017లో విడాకులు కోరుతూ భర్త పిటిషన్ దాఖలు చేశాడు. క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో జూలై 9, 2019న భార్య భర్తలిరువురి ఫోన్ సంభాషణకు సంబంధించిన సీడీ, సిమ్ కార్డులను సాక్షాలుగా సమర్పించాడు. దీన్ని సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. తనకు తెలియకుండా తన సంభాషణలను రికార్డు చేయడం గోప్యతను ఉల్లంఘించడమేనని వాదించింది. ఐతే భార్య వేధింపులకు సాక్షాలుగా మాత్రమే వీటిని సమర్పించామని, ఆమె గోప్యతకు భంగం కలిగించాలనే ఉద్దేశ్యంతోకాదని భర్త తరపు న్యాయవాది పేర్కొన్నారు. ఇరువురి వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఫోన్ రికార్డులను సాక్షాలుగా పరిగణించలేమని తేల్చిచెప్పింది. అంతేకాకుండా భార్య అనుమతి లేకుండా, ఆమెకు తెలియకుండా ఫోన్ సంభాషణలు రికార్డు చేయడం నేరమని పంజాబ్- హర్యానా హైకోర్టు వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోన్ రికార్డింగ్‌లను సాక్ష్యంగా పరిగణించకుండా విడాకుల కేసుపై ఆరు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని భటిండా ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. చదవండి: అదిరిపోయే స్కీమ్! ఈ సేవింగ్ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది! -
మనిషి హక్కుకు గుర్తింపు ఏది?
సాటిమనిషిని మనిషిగా చూడని సందర్భాలెన్నో చూస్తూనే ఉన్నాం. మనల్ని కాపాడిన మానవ హక్కుల పరిరక్షణను మనమే కాలరాస్తున్నాం, హరించివేస్తున్నాం. 1948 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి విశ్వమానవ హక్కులను ప్రకటన చేసింది. దాని లక్ష్యం ప్రతి ఒక్కరూ ఏ విధమైన వివక్షకు గురవ్వకుండా ప్రశాంతంగా జీవించాలి. కానీ అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నాయా అన్న సందేహం రాక తప్పదు. ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించిన సుమారు 30 ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ మనల్ని మనం కాపాడుకోలేకపోవడం బాధాకరం. మానవ హక్కులు గురించి మాట్లాడుకోవడమే తప్ప ఉల్లంఘన జరిగే తీరు మాత్రం మారడం లేదు. నిరంతరం ఏదో ఒక వార్తతో ప్రతి ఒక్కరు ఉలికిపడుతున్నారు. కోర్టులు మాత్రం హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ నివారణ మాత్రం కష్టతరమవుతోంది. మానవ హక్కులు, స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. భారతదేశంలో మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1993 అక్టోబర్ 12న నాటి ప్రధాని పి.వి. నరసింహరావు మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసారు. నేటికి 18 రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లను మన దేశంలో ఏర్పాటు చేసాయి. (చదవండి: కనురెప్పే కాటేస్తే... కన్నుకేది రక్ష?) 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన, ఆదర్శవంతమైన ఒక ఉమ్మడి ప్రమాణంగా సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను రూపొందించింది. దీన్ని చారిత్రక అంశంగా పరిగణిస్తారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా ప్రతి పౌరుడికి అవగాహన కల్పించడానికి ఆమోదించిన దినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 10న ఒక అంశాన్ని ప్రాతిపదికంగా తీసుకొని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తుంది. గత సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో ‘బాగా కోలుకోండి... మానవ హక్కుల కోసం నిలబడండి’ అనే నినాదంతో జరుపుకున్నారు. (చదవండి: మహిళలు... కొంచెం ఎక్కువ సమానం) – డాక్టర్ నెమలిపురి సత్యనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
నిరసన... ప్రాథమిక హక్కు కాదా?
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ‘నిరసన తెలిపే హక్కు’ తిరుగులేనిదా అనే అంశాన్నీ పరిశీలించాల్సి ఉందని సుప్రీంకోర్టు ఇటీవల నొక్కి చెప్పింది. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడానికి గానీ, శాంతియుతంగా నిరసన తెలుపడానికి గానీ ఢిల్లీ పోలీసులు తమకు అనుమతి నిరాకరించడంపై కిసాన్ మహా పంచాయత్ ఒక పిటిషన్ వేసింది. కానీ, కోర్టు ముందు పిటిషన్ వాయిదాలో ఉండటం, లేక న్యాయస్థానం పరిధిలో ఉండటం అనే కారణాలు చూపి నిరసన తెలిపే హక్కుపై ఆంక్షలను విధించకూడదు. ఒక సమస్యపై న్యాయపరిష్కారం కోసం కోర్టులను సంప్రదించాక, ప్రజలు అదే సమస్యపై నిరసన తెలిపే హక్కును కోల్పోతారని న్యాయమూర్తులు పేర్కొనడం పరిహాసాస్పదమైన విషయం. అక్టోబర్ 4న, ఇద్దరు న్యాయమూర్తులతో (జస్టిస్ ఏఎమ్ ఖన్విల్కర్, జస్టిస్ సీటీ రవికుమార్) కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మూడు పేజీల ఆదేశాన్ని జారీ చేసింది. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన ‘నిరసన తెలిపే హక్కు’ తిరుగులేనిదా అనే అంశాన్నీ పరిశీలించాల్సి ఉందని కోర్టు నొక్కి చెప్పింది. అలాగే కేంద్రప్రభుత్వం గత ఏడాది తీసుకొచ్చిన 3 వ్యవసాయ సంస్కరణ చట్టాల రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ రైతు ప్రతినిధులు న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత కూడా, ఆ చట్టాలకు వ్యతిరేకంగా కిసాన్ మహాపంచాయత్ తన నిరసనలను బహిరంగంగా కొనసాగించవచ్చా అనే అంశాన్ని కూడా పరిశీలించదల్చుకున్నట్లు కోర్టు ఆదేశం పేర్కొంది. దీనిపై కోర్టు తన ఆదేశంలో పొందుపర్చిన రాతపూర్వకమైన విషయం కానీ, న్యాయమూర్తులు వాడిన పదాల తీరు కానీ అత్యంత విచారకరంగా ఉన్నాయని చెప్పాలి. జంతర్‌మంతర్ వద్ద కూర్చుని ధర్నా చేయడానికిగానీ, శాంతియుతంగా నిరసన తెలుపడానికిగానీ ఢిల్లీ పోలీసులు తమకు అనుమతి నిరాకరించడంపై కిసాన్ మహా పంచాయత్ ఒక పిటిషన్ వేసింది. తమకు అనుమతి నిరాకరించిన పోలీసులు, సంయుక్త కిసాన్ మోర్చా వంటి సంస్థలకు మాత్రం అనుమతి మంజూరు చేశారని పిటిషన్‌దారులు సుప్రీంకోర్టుకి విన్నవిం చారు. చట్టం ముందు సమానత్వానికి హామీ ఇస్తున్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 బట్టి చూస్తే, ఈ ప్రత్యేక సందర్భంలో ఢిల్లీ పోలీసుల నిరాకరణ వివక్షతో కూడి ఉందా లేదా ఆర్టికల్ 19 కింద నిరసన తెలిపే రాజ్యాంగ హక్కును ఇది ఉల్లంఘిస్తోందా అనే విషయాన్ని పరిశీలించడానికి న్యాయస్థానం ముందుగా ఢిల్లీ పోలీసుల ఆదేశాన్ని పరిశీలించాల్సి ఉంది. కానీ దీనికి బదులుగా, నిరసన హక్కు పరిమితులను విచారించేందుకు న్యాయస్థానం ముందుకు రావడం గమనార్హం. రాజ్యాంగ విధానం, స్ఫూర్తి ఏమిటి? నిరసన తెలిపే హక్కు అనేది... భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) కింద వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ– ఆర్టికల్ 19(1) (బి) కింద శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛకు చెందిన రెండు ప్రాథమిక హక్కులతో కూడి ఉంది. పైన పేర్కొన్న రెండు హక్కులూ భారత సార్వభౌమాధికారం, దేశ సమగ్రత, సామాజిక శాంతి వంటి అంశాల ప్రాతిపదికన ఆర్టికల్ 19(2), ఆర్టికల్ 19(3) కింద హేతుపూర్వకమైన పరిమితులకు లోబడి ఉంటాయి. కోర్టు ముందు వాయిదాలో ఉండటం, లేక న్యాయ స్థానం పరిధిలో ఉండటం అనే అంశాలకు రాజ్యాంగపరంగా విలువకానీ, అనుమతికానీ లేదు. ఈ కారణాలు చూపి నిరసన తెలిపే హక్కుపై ఆంక్షలను విధించకూడదు. మరీ ముఖ్యంగా, ఇంతకు ముందే పేర్కొన్నట్లుగా ప్రాథమిక హక్కులపై శాసన, కార్యనిర్వాహక వర్గం ఆంక్షలు విధించడాన్ని రాజ్యాంగం అనుమతిస్తుందా అనే అంశాన్ని పరిశీలించడమే న్యాయస్థానం విధి. అంతేకానీ అదనపు కారణాలను వెతకడానికి ప్రయత్నించి, వాటి ఆధారంగా ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించే విషయాన్ని పరిశీలించే పని న్యాయస్థానంది కాదు. శాసన, కార్యనిర్వాహక వర్గం పనితీరుపై తనిఖీ ఉంచడం అనే విధిని నిర్వర్తించడానికి బదులుగా, న్యాయస్థానం ప్రాథమిక హక్కుపై ఆంక్షలకు సంబంధించి ఇలాంటి వైఖరిని చేపట్టినప్పుడు, ఆ శాసన, కార్యనిర్వాహక వర్గం తరపున కోర్టు తనకుతానుగా సమర్థవంతంగా పనిచేసినట్లు అవుతుంది. మరోమాటలో చెప్పాలంటే, న్యాయస్థానం ప్రాథమిక హక్కుల ప్రాతిపదికను విచారించి, వాటిపై ఆంక్షలు విధించడంపై ఆత్రుత ప్రదర్శించినట్లు కనిపిస్తే ప్రభుత్వం చేసే పనిని కోర్టు స్వయంగా చేసినట్లు అవుతుంది. అదనంగా, రాజ్యాంగపరమైన సవాలు కోర్టుముందు అపరిష్కృతంగా ఉందన్న కారణంగా నిరసన తెలిపే హక్కును ఎవరికైనా లేకుండా చేయకూడదని 2020 సంవత్సరంలోనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొని ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంది. కాబట్టి అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన న్యాయాదేశానికి కట్టుబడాల్సిన న్యాయమూర్తులు ప్రస్తుత ఆదేశం విషయంలో కాస్త నిర్లక్ష్యం ప్రదర్శించారనే చెప్పాలి. నిరసన ఒక రాజకీయ కార్యాచరణ న్యాయపరమైన సవాలుకు, నిరసన తెలుపడానికి మధ్య లింకు పెట్టి రైతుల నిరసన హక్కుపై ఆంక్షలు విధించవచ్చని కోర్టు సూచించడం శుద్ధ అసంగతమైన విషయం అనే చెప్పాలి. ఇలాంటి వైఖరి పూర్తిగా హేతువిరుద్ధమైనదని చెప్పడానికి కనీసం మూడు స్పష్టమైన కారణాలను పేర్కొనవచ్చు. మొదటిది, కోర్టును సంప్రదించడం అనేది న్యాయపరమైన పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇక నిరసన అనేది రాజ కీయ అన్వేషణకు సంబంధించింది. మొదటి అంశంలో, శాసన కార్యనిర్వాహక వర్గం చట్టబద్ధత లేదా రాజ్యాంగబద్ధతపై న్యాయస్థానం నిర్ణయం తెలపాలి. కాగా, రైతుల నిరసనకు కారణమైన ప్రభుత్వ తొలి నిర్ణయాన్ని రద్దు చేయడం లేదా సవరించడంపై నేరుగా విధాన నిర్ణేతపై ఒత్తిడి తేవాలని ప్రజలు చూస్తున్నారు. ఈ రెండు మార్గాలు ఒకదానికొకటి స్వతంత్రంగా ఉంటాయి. ఒక న్యాయపరమైన పరిష్కారాన్ని వెదుకుతున్నప్పుడు ఒక వ్యక్తి రాజకీయ పరిష్కారాన్ని కోల్పోవడానికి సముచితమైన కారణం లేదు. రెండోది, శాసనాలకు ఎదురయ్యే న్యాయపరమైన సవాళ్లు రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటాయి. కానీ ప్రజాస్వామిక సమాజంలో నిరసనలకు మరింత విస్తృత ప్రాతిపదిక ఉంది. శాసనం కూడా రాజ్యాంగ బద్ధమైనదే కావచ్చు కానీ ప్రజలు దాన్ని యథాతథంగా స్వీకరిస్తారని భావించకూడదు. రాజ్యాంగపరమైన ఆదేశాలు శాసన, కార్యనిర్వాహక వర్గం కార్యాచరణకు కనీసమాత్రంగానే చట్టబద్ధతను అందిస్తాయి. ప్రజలు ప్రతి సందర్భంలోనూ నిరసన తెలిపే హక్కును కలిగి ఉంటారు. మూడోది, న్యాయస్థానం నిర్ణయాలపై నిరసన తెలుపడానికి కూడా మన రాజ్యాంగం అనుమతిస్తోంది. నిజానికి, న్యాయ నిర్ణయాలకు వ్యతిరేకంగా సాగే ప్రజా నిరసనలు ఆ నిర్ణయం ప్రభావాన్ని తటస్థం చేయడానికి లేదా ఉపశమింపచేయడానికి రాజ్యాంగ, న్యాయపరమైన మార్పులను ప్రేరేపిస్తాయి. షెడ్యూల్డ్ కులాలు, తెగలపై అత్యాచారాల నివారణ చట్టం 1989 అమలును సుప్రీంకోర్టు 2018 నాటి తీర్పు ద్వారా పలుచబార్చినప్పుడు, చెలరేగిన తీవ్రమైన నిరసనల కారణంగా కోర్టు తీర్పును తటస్థం చేయడానికి ఆ చట్టానికి పార్లమెంటు సవరణ తీసుకొచ్చింది. ప్రాథమికంగా అప్రజాస్వామికం ప్రభుత్వ విధానంలో లేక నిర్ణయాల్లో తలెత్తిన వివాదాస్పద అంశాలను పరిష్కరించడానికి న్యాయపరమైన చర్యలను ప్రారంభించినప్పటికీ, అవి ఇతర ప్రజాస్వామిక చర్యలను నిరోధించలేవు. నిజానికి న్యాయపరమైన పరిష్కారాన్ని అన్వేషించడం అనేది ప్రజలు తమ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి అవలంబించే అనేక ప్రజాస్వామిక ఎంపికల్లో భాగంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో, ఒక సమస్యపై న్యాయపరిష్కారం కోసం కోర్టులను సంప్రదించాక, ప్రజలు అదే సమస్యపై నిరసన తెలిపే హక్కును కోల్పోతారని న్యాయమూర్తులు పేర్కొనడం పరిహాసాస్పదమైన విషయం. ఈ సందర్భంగా న్యాయమూర్తుల ఆలోచనా ధోరణి ప్రాథమికంగానే అప్రజాస్వామికంగా ఉంది. కోర్టుల్లో విచారణ ప్రారంభించాక, నిరసన తెలిపే హక్కు ఉండదని జడ్జీలు పేర్కొన్నారని ఊహించుకుందాం. దాని పరిణామపూర్వకమైన ముగింపు ఎలా ఉంటుంది? సమస్య కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నిరసనలకు అనుమతి లేదనుకుంటే, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు కూడా అనుమతి ఉండదు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు దాన్ని నిరోధించడానికి రాజ్యాంగ సంవి ధానానికి న్యాయవ్యవస్థ అవసరమవుతుంది. సుప్రీంకోర్టు అనవసరంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఊహకు అందని విషయమే. రంజిన్ పల్లవ్ త్రిపాఠి అధ్యాపకుడు, నేషనల్ లా యూనివర్సిటీ, ఒడిశా -
ప్రాథమిక హక్కులుగా కనెక్టివిటీ, కమ్యూనికేషన్
న్యూఢిల్లీ: దేశాల మధ్య, దేశాల్లో అంతర్గతంగా ప్రజల మధ్య డిజిటల్ విభజనను తగ్గించడంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ప్రస్తుత తరుణంలో కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ అనేవి ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కులుగా మారాయని ఆయన ఆభిప్రాయపడ్డారు. ఖతర్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా అంబానీ ఈ విషయాలు తెలిపారు. ‘తిండి, బట్ట, నీడలాగానే కనెక్టివిటీ, కమ్యూనికేషన్స్ అనేవి ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవసరాలుగా, ప్రాథమిక హక్కులుగా మారాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో 4జీ నెట్వర్క్ లేకపోతే భారత్‌లో పరిస్థితి ఎలా ఉండేదో ఊహించడం కూడా కష్టంగా ఉండేది. దేశాల మధ్య, దేశాల్లో అంతర్గతంగా ప్రజల మధ్య డిజిటల్ విభజనను తగ్గించాల్సిన అవసరం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత భారీ స్థాయి టీకాల కార్యక్రమం నిర్వహించేందుకు, పిల్లలు ఇంటి నుంచే విద్యాభ్యాసం చేసేందుకు, ఉద్యోగులు ఎక్కడి నుంచైనా విధులు నిర్వర్తించేందుకు డిజిటల్ మౌలిక సదుపాయాలే తోడ్పడ్డాయని అంబానీ వివరించారు. రాబోయే రోజుల్లో డిజిటల్, ఫిజికల్ (వైద్యపరంగా భౌతికమైన మౌలిక సదుపాయాలు) మేళవింపు సర్వసాధారణం కాగలదని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాలు పర్యావరణహితంగామారక తప్పదు.. పరిశుభ్రమైన ఇంధనాల వినియోగం ద్వారా వ్యాపార సంస్థలు పర్యావరణ అనుకూల విధానాలను పాటించడం మినహా ప్రస్తుతం మరో గత్యంతరం లేదని ముకేశ్ అంబానీ చెప్పారు. తమ సంస్థ కూడా ఈ దిశగా చర్యలు తీసుకుంటోందని ఆయన వివరించారు. కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించుకోవడంపై గ్రూప్‌లోని వివిధ విభాగాలు దృష్టి పెట్టాయని అంబానీ తెలిపారు. క్రూడాయిల్, సహజ వాయువు వినియోగం కొనసాగించినప్పటికీ.. కర్బన ఉద్గారాలను ఉపయోగకరమైన ఉత్పత్తులు, రసాయనాలుగా మార్చగలిగే కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని అంబానీ పేర్కొన్నారు. -
బాల్యవివాహాలు పిల్లల హక్కుల ఉల్లంఘనే!
భారత ప్రభుత్వం చట్టబద్ధ మైన వివాహ వయస్సును పెంచాలని భావిస్తోంది. అయితే వివాహాలకు చట్టబద్ధమైన వయస్సును పెంచడం ఒక్కటే సరిపోదు. ప్రధానంగా బాల్య వివాహం పిల్లల హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇది వారి శారీరక వృద్ది, మానసిక, భావోద్వేగాల పెరుగుదల, విద్యావకాశాలపై కూడా వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఉత్తరాంధ్రలో కౌమారదశలోనే పెళ్లయి తల్లులైన వారితో బృంద చర్చలో, చిన్నవయసులోనే పెళ్లి చేయడం వల్ల తమ బాల్యాన్ని, ఆడుకునే, నేర్చుకునే స్వేచ్ఛను పోగొట్టుకున్నామని చెప్పారు. పెళ్లి కాగానే మానసికంగా సంసిద్ధం కాకుండానే ఆమె కుటుంబ పాత్రలు పోషిం చాల్సి వస్తోంది. భార్యగా, తల్లిగా, కోడలిగా బరువైన బాధ్యతలు స్వీకరించాల్సి రావడం మైనర్ బాలికకు కష్టమవుతుంది. దీంతో వారు ఒంటరితనానికి, కుంగుబాటుకు గురికావడానికి దారి తీస్తుంది. ప్రపంచంలోనే బాలికా వధువులు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. మహిళలకు వివాహ వయస్సును 18 ఏళ్లుగా, పురుషులకు 21 ఏళ్లుగా స్థిరపర్చడం, బాల్యవివాహ నిషేధ చట్టాన్ని అమలుపర్చడం ఉనికిలో ఉన్నప్పటికీ దేశంలో బాల్య వివాహాలు అధికంగా జరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో బాల్య వివాహాలు 2005లో 47 శాతం ఉండగా ఇది 2015 నాటికి 27 శాతానికి పడిపోవడం మంచిదే కానీ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో బాల్యవివాహాలు అధికంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 20 నుంచి 24 ఏళ్ల వయసున్న మహిళల్లో 33 శాతం మందికి 18 ఏళ్ల లోపే పెళ్లవుతున్నట్లు ఎన్ఎఫ్హెచ్ఎస్–4 డేటా 2015–16 నివేదిక తెలిపింది. ఇక పురుషుల విషయానికి వస్తే 25 నుంచి 29 ఏళ్ల వయసున్న యువకుల్లో 21 ఏళ్లకు ముందే పెళ్లాడుతున్న వారు 11.8 శాతంగా ఉన్నారు. అదే తెలంగాణలో 20–24 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల్లో 25.7 శాతం మంది వివాహం చేసుకుంటూండగా, 15–19 ఏళ్ల ప్రాయంలోని బాలికల్లో 14 శాతం మంది తల్లులవుతున్నారు. అయితే యంగ్ లైవ్స్ లాంగిట్యూడినల్ స్టడీ 2002 నుంచి తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న అధ్యయనం మరింత స్పష్టమైన చిత్రాన్ని ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2013లో 19 ఏళ్లలోపు వయసున్న బాలికల్లో 25 శాతం మంది చట్టబద్ధమైన వయసుకు ముందే పెళ్లాడుతున్నారని, 2020 నాటికి ఇది 14 శాతానికి పడిపోయిందని ఈ నివేదిక తెలిపింది. తెలంగాణలో కూడా 2013 నాటికి 19 ఏళ్ల లోపు వయసున్న బాలికల్లో 28 శాతం మంది చట్టబద్ద వయసుకు ముందే పెళ్లాడుతుండగా వీరి సంఖ్య 2020 నాటికి 17 శాతానికి పడిపోయింది. జిల్లాల వారీగా చూస్తే కడప, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 18 ఏళ్లకు ముందే వివాహ మాడుతున్న బాలికల సంఖ్య వరుసగా 20 శాతం, 24 శాతం, 27 శాతంగా నమోదైంది. ఈ జిల్లాల్లో కొన్ని మండలాల్లో ఇది 36 శాతం మేరకు అధికంగా నమోదైంది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన 9 జిల్లాల్లోనూ, ఏపీలో 5 జిల్లాల్లో సంప్రదాయాలు, సామాజిక ఆచారాలు, విశ్వాసాలు, దారిద్య్రం వంటివి బాల్య వివాహాలకు ప్రధాన కారణం అవుతున్నాయి. పెద్దగా చదువుకోకపోవడం, విద్యావకాశాల లేమి కూడా వీటికి తోడవుతున్నాయి. రజస్వల అయితే చాలు పెళ్లీడు వచ్చేసినట్లే అని తల్లిదండ్రులు భావించడం, వారిలో అవిద్య, వలసలు, ఎక్కువమంది అమ్మాయిలు ఉండ టం వంటివి కూడా బాల్యవివాహాలను ప్రేరేపిస్తున్నాయి. చట్టం మాత్రమే ఈ దురాచారాన్ని అడ్డుకోలేదని, మార్పు అనేది కుటుంబం, కమ్యూనిటీ స్థాయి నుంచే ప్రారంభం కావాలని న్యాయనిపుణుల మాట. సెకండరీ విద్యను బాలికలకు అనుకూలంగా మలుస్తూ వారి రక్షణకోసం పెట్టుబడి పెట్టాలి. పేదలు బాలికలను బడికి పంపేలా చేయడానికి షరతులతో కూడిన నగదు బదిలీ చేయడం, 18 ఏళ్లదాకా నిర్బంధ విద్యను అందించడం మంచి ఫలితాలను తెస్తుంది. ముఖ్యంగా విద్య, బాల్యవివాహాలపై డేటా బ్యాంకును గ్రామీణ సంస్థలు ఏర్పర్చుకుంటే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి వీలుంటుంది.' వ్యాసకర్త ఆర్థికవేత్త, సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ పి. పృథ్వీకర్ రెడ్డి మొబైల్ : 94408 90508 -
మాస్కులు ధరించకపోతే ఇతరుల హక్కుల్ని కాలరాసినట్టే
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించకపోతే ఇతరుల ప్రాథమిక హక్కులైన జీవించేహక్కు, ఆరోగ్య హక్కులను కాలరాసినట్టేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనా కట్టడికి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలైన భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం తప్పనిసరిగా అందరూ పాటించాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిని కోవిడ్ కేర్ సెంటర్లలో సేవలు చేయాలంటూ గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ ఎస్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన బెంచ్ గుజరాత్ హైకోర్టు తీర్పుని సవాల్ చేస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను విచారించింది. గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గుజరాత్ హైకోర్టు ఉద్దేశం మంచిదే అయినప్పటికీ కోవిడ్ సెంటర్లలో సామాన్యులు సేవలు చేస్తే మరిన్ని కరోనా కేసులు పెరిగిపోతాయన్నారు. ఇందుకు ఏకీభవించిన సుప్రీం గుజరాత్ హైకోర్టు ఆదేశాలను నిలిపివేసింది. దోషులుగా తేలిన వారిపై జీవితకాల నిషేధం వద్దు దోషులుగా రుజువైన రాజకీయ నేతలు ఎన్నికల్లో పాల్గొనకుండా జీవిత కాలంపాటు నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిల్‌ను కేంద్రం తిరస్కరించింది. ఎన్నికైన ప్రతినిధులు కూడా చట్టానికి లోబడే ఉంటారని తెలిపింది. ‘పిటిషనర్ కోరినట్లుగా ప్రజాప్రతినిధ్య చట్ట సవరణ సహేతుకంగా లేదు. అంతేకాదు, రాజ్యాంగ విరుద్ధం, తన వాదనను సమర్థనగా ఎటువంటి వాస్తవ అంశాలను చూపలేదు’ అని పేర్కొంది. -
హక్కులంటే వ్యక్తిగత తగాదాలు కాదు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలో పొందుపర్చిన ప్రాథమిక హక్కులే మానవ హక్కులని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరదృష్టితో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లోనే ప్రాథమిక హక్కుల రూపంలో మానవ హక్కులను పొందుపర్చారని ఆయన చెప్పారు. చాలామందికి మానవ హక్కులంటే ఏమిటో అవగాహన తక్కువగా ఉందని, వ్యక్తిగత తగాదాలు, అధికారులు పనులు చేయకపోవడం, ఇతరత్రా సమస్యలతో కమిషన్‌కు పలువురు అర్జీలతో రావడం సబబుకాదని చెప్పారు. మానవ హక్కులపై అన్ని స్థాయిల్లోనూ అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణమూర్తి అధ్యక్షతన శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆదిలాబాద్ జిల్లాలోని కుగ్రామంలో జన్మించిన తాను గ్రామపెద్దకు భయపడేవాడినని, అయితే తాను పదోతరగతి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ గ్రామపెద్ద వచ్చి భుజం తట్టి తనను ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. అందరూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకోవాలని జస్టిస్ చంద్రయ్య హితవు చెప్పారు. రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్, లోకాయుక్త 2 పదవులూ బీసీలకు ఇవ్వడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సీఎం కేసీఆర్‌కు అభినందనలు తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయమూర్తుల పోస్టులు భర్తీ చేసేలా స్వతంత్ర జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హక్కుల ఉల్లంఘనల కేసుల్లో కమిషన్ సత్వర న్యాయం అందించాలని తెలంగాణ జనస మితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కోరారు. మానవహక్కుల రక్షణకు కమిషన్ సుమో టోగా కేసుల్ని స్వీకరించి న్యాయం చేయాలని సభాధ్యక్షు డు సత్యనారాయణమూర్తి కోరారు. హక్కుల రక్ష ణకు కృషి చేస్తానని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ నాన్ జ్యుడీషియల్ మెంబర్ మహ్మద్ ఇర్ఫాన్ మెయినుద్దీన్ చెప్పారు. అనంతరం జస్టిస్ చంద్రయ్యను కృష్ణయ్య, కోదండరాం సన్మానించారు. -
ఉచిత ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు
లండన్: ఇంటర్నెట్ సేవలను ఉచితంగా పొందడమన్నది మానవుల ప్రాథమిక హక్కు అని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజలు ఇంటర్నెట్ను పొందలేకపోతున్నారని, దీంతో ప్రపంచ స్థాయి వ్యక్తులతో సమానంగా తమ జీవితాలను బాగుపరుచుకునే అవకాశాలు లేకుండా పోతున్నాయని పేర్కొంది. ఈ అధ్యయనాన్ని చేపట్టిన బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ పరిశోధకులు భారత్‌లోని కేరళ రాష్ట్రాన్ని ఓ ఉదాహరణగా చూపారు. ఇంటర్నెట్ పొందడమనేది ప్రాథమిక హక్కుగా కేరళ రాష్ట్రం ప్రకటించిందని, ఈ ఏడాది చివర కల్లా 3.5 కోట్ల మందికి ఇంటర్నెట్ను అందివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. కొందరికి ఇంటర్నెట్ అందుబాటులో ఉండి.. మరికొందరికి లేకపోవడం వల్ల ప్రాథమిక స్వేచ్ఛగా పేర్కొనే వ్యక్తీకరణ, సమాచార స్వేచ్ఛలను కోల్పోతారంది. -
హక్కులకు భంగం కలిగితే ఊరుకోం
న్యూఢిల్లీ: ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలను రద్దు చేసే విషయంలో పార్లమెంటు చర్యలు తీసుకునేంతవరకు న్యాయవ్యవస్థ చూస్తూ ఊరుకోదని సుప్రీం కోర్టు పేర్కొంది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377 చట్టబద్ధతపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు అభిప్రాయ పడింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్హోత్రాలతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం దాదాపు 90 నిమిషాల పాటు విచారణ జరిపింది. సెక్షన్ 377పై అనుకూల, వ్యతిరేక వాదనలు పూర్తిగా విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ నెల 20లోపు అనుకూల, వ్యతిరేక వాదనలను లిఖితపూర్వకంగా కోర్టుకు సమర్పించాలని కోరింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా అక్టోబర్ 2వ తేదీన రిటైరవుతున్న నేపథ్యంలో ఆ తేదీకి ముందే తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. సమానత్వపు హక్కు వారికెలా వర్తిస్తుంది? విచారణ సందర్భంగా అపోస్టలిక్ అలయెన్స్ ఆఫ్ చర్చెస్, ఉత్కళ్ క్రిస్టియన్ అసోసియేషన్ తరఫున న్యాయవాది శ్యామ్ జార్జ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని 377 సెక్షన్‌ను సవరించడమా, కొనసాగించడమా అనేది నిర్ణయించాల్సింది పార్లమెంటేనని అన్నారు. దీనికి స్పందనగానే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే చట్టాలపై పార్లమెంటు నిర్ణయం తీసుకునేవరకూ తాము నిరీక్షిస్తూ కూర్చోమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం శ్యామ్ జార్జ్ వాదన కొనసాగిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15 ప్రకారం సమానత్వపు హక్కు స్త్రీ, పురుషులైన పౌరులందరికీ వర్తిస్తుంది కానీ ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్)లతో పాటు ప్రత్యేక సెక్సువల్ ఓరియంటేషన్ (లైంగిక ధోరణి) ఉన్న వ్యక్తులకు వర్తించదన్నారు. ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 377 రద్దుపై నిర్ణయం తీసుకునే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకే వదిలేసింది. ఈ ఒక్క అంశంపైనే రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకోవాలని.. స్వలింగ సంపర్కుల వివాహాలు, దత్తతలు, హక్కులు తదితరాల జోలికి పోవొద్దని కోరింది. దీనికి సుప్రీం ధర్మాసనం కూడా అంగీకరించింది. ఇద్దరు వయోజనుల పరస్పర అంగీకార స్వలింగ సంపర్కానికి సంబంధించిన చట్టాన్ని మాత్రమే పరిశీలిస్తామని, ఒకవేళ తాము అందులోని శిక్షార్హమైన నిబంధనలను తొలగిస్తే ఎల్జీబీటీక్యూ (లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) వర్గంపై ఉన్న అనర్హత తొలగిపోయి వారు కూడా త్రివిధ దళాల్లో చేరడంతో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తారని ధర్మాసనం తెలిపింది. ఇదే జరిగితే అలాంటి సంబంధాలను సమాజంలో హీనంగా చూసే రోజులు పోతాయని పేర్కొంది. మూక హత్యల నిరోధానికి చట్టం! న్యూఢిల్లీ: అల్లరి మూకలు చేసే దాడులు, హత్యలను సమర్థంగా నిరోధించేందుకు కొత్త చట్టాన్ని చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు మంగళవారం పార్లమెంటుకు సూచించింది. ప్రజలే సొంతంగా పాలనను, చట్టాలను చేతుల్లోకి తీసుకుని శిక్షలు విధించే భయానక పద్ధతిని అనుమతించకూడదంది. మూకదాడులు, గో రక్షణ దాడులకు సంబంధించిన నేరాలను నియంత్రించడం, దోషులకు శిక్ష విధించడం తదితరాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం పలు సూచనలు చేసింది. శాంతి భద్రతలను కాపాడటంతోపాటు, చట్టాలు అమలయ్యేలా చూడటం రాష్ట్రాల బాధ్యతేనంది. మూక దాడుల వంటి హింసాత్మక ఘటనలను నిరోధించేందుకు మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా జాతిపిత మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ, తెహ్సీన్ పూనావాలా తదితరులు వేసిన పిటిషన్లపై విచారణను కోర్టు మంగళవారం కొనసాగించింది. ఈ సందర్భంగా రాష్ట్రాలు, కేంద్రానికి పలు సూచనలు జారీ చేసింది. కోర్టు సూచించిన కొన్ని చర్యలు... ♦ మూక దాడులను నిరోధించేందుకు ప్రతి జిల్లాలోనూ ఎస్పీ లేదా ఆపై స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమించాలి. ♦ దాడులు చేసే అవకాశం ఉన్న వ్యక్తులను ముందే పసిగట్టేందుకు ఓ నిఘా బృందాన్ని డీఎస్పీ సహాయంతో నోడల్ అధికారి ఏర్పాటు చేయాలి. ♦ గతంలో మూక దాడులు జరిగిన జిల్లాలు, ప్రాంతాలు, గ్రామాలను గుర్తించే పనిని రాష్ట్రాలు తక్షణం ప్రారంభించి మూడు వారాలు ముగిసేలోపు ఆయా ప్రాంతాలను గుర్తించాలి. ♦డీజీపీలు లేదా హోం శాఖ కార్యదర్శులు నోడల్ అధికారులతోనూ, పోలీసుల నిఘా విభాగం తోనూ నిత్యం సమీక్షలు నిర్వహించాలి. ♦ మూక దాడులు జరిగేందుకు అవకాశం ఉండేలా ఎక్కడైనా గుంపు కనిపిస్తే వారిని చెదరగొట్టాల్సిన బాధ్యత ప్రతి పోలీసుకూ ఉంటుంది. ♦ మూక దాడులకు పాల్పడేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రభుత్వా లు ప్రకటనల రూపంలో హెచ్చరించాలి. -
రాజీవ్ దేశం కోసమే జీవించారు
న్యూఢిల్లీ: భావ ప్రకటనా స్వేచ్ఛను బీజేపీ, ఆరెస్సెస్ నియంత్రించాలని చూస్తోంటే, తాను మాత్రం దాన్ని గౌరవిస్తూ, ప్రాథమిక హక్కుగా భావిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. మాజీ ప్రధాని, రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీని కించపరుస్తూ ఇటీవల నెట్‌ఫ్లిక్స్ సిరీస్ విడుదలైన నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘ నా తండ్రి ఈ దేశం కోసమే జీవించారు, మరణించారు. ఓ కల్పిత వెబ్ సిరీస్ పాత్రదారుడి వ్యాఖ్యలు ఈ నిజాన్ని మార్చలేవు’ అని రాహుల్ ట్వీట్ చేశారు. -
ఇక చెప్పుకోం... చేసి చూపిస్తాం
‘మహిళలకు ఎన్నో అవకాశాలున్నాయి, ఎదగడానికి ఆకాశమే హద్దు’ అనే మాటలు వినడానికి ఎంత బాగున్నప్పటికీ వాస్తవంలో అలా ఏ మాత్రం లేదంటున్నారు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల. సాధికారత సాధనలో మహిళలకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయని, కెరీర్లో నిలదొక్కుకోవడం కంటే మహిళ అయిన కారణంగా ఎదురయ్యే విమర్శలను, వివక్షను ఎదుర్కోవడానికే ఎక్కువ శక్తి అవసరమవుతోందన్నారామె. ‘‘ఫిఫ్టీ– ఫిఫ్టీ అనేది ఒక ముసుగు మాత్రమే. క్రీడాకారుల్లో పది మంది అబ్బాయిలుంటే అమ్మాయిలు ముగ్గురో నలుగురో ఉంటారు. ఆ ముగ్గురు నలుగురిని చూపించి మహిళలకు ఎన్ని అవకాశాలో అని భూతద్దంలో చూపించుకుంటారు. క్రీడారంగంలోకి రావాలనే ఆసక్తి ఉన్న అమ్మాయిలకు కొదవలేదు. అయితే పరిస్థితులే అందుకు అనుకూలంగా లేవు. స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయడానికి స్టేడియాలున్నాయి. కానీ కోచ్‌లే తగినంతగా లేరు. ప్రభుత్వం కోచ్‌లను నియమించి ట్రైనింగ్ ఇప్పిస్తూ, వాటిలో దిగువ స్థాయి బాలికలకు అవకాశం ఇస్తే వారిలో నుంచి ఎంతోమంది క్రీడాకారిణులు వస్తారు. అలాంటి ప్రయత్నమే కనిపించడం లేదు. రాను రాను బ్యాడ్మింటన్ రిచ్మన్ గేమ్‌గా మారిపోతోంది. మా నాన్నలాంటి నాన్న ఉంటే! మనది పితృస్వామ్య సమాజం. కాబట్టి సమాజం మహిళలనే ప్రశ్నిస్తుంది. మహిళలు ప్రశ్నిస్తే సహించలేదు. అమ్మాయి ఇలాగే ఉండాలి... అన్నట్లు కండిషన్ అయిపోయింది సొసైటీ. ఆ మైండ్‌సెట్ నుంచి సొసైటీ బయటపడాలి. ఉదాహరణకు నన్ను మా నాన్న చాలా లిబరల్గా పెంచారు. అప్పట్లో మా నాన్నను అందరూ ‘ఏంటి అలా పెంచుతున్నావు, మగరాయుడిలా ఉంటోంది’ అనేవాళ్లు. మా నాన్న ధైర్యవంతుడు కాబట్టి ఈ రోజు నేను సమాజం ముందు తలెత్తుకుని నిలబడగలిగాను. అలాంటి నాన్నలు లేని అమ్మాయిలు చాలామంది అందరిలో ఒకరిలా జీవించేస్తున్నారు. ఇప్పటి వరకు నేను ఎవరి ముందూ తలదించలేదు. ఆ తత్వాన్ని తలబిరుసుగా ముద్ర వేస్తుంటారు. నా జీవితంలో పాతికేళ్లు బ్యాడ్మింటన్ ప్రాక్టీసే ఉంది. నన్ను నేను ప్రూవ్ చేసుకుంటూనే ఈ స్థాయికి వచ్చాను. అయినప్పటికీ నా ముఖాన్నే ‘ఈమె ఆడలేదులే’ అన్నారు. నేను దేశం కోసం ఆడాను, దేశానికి విజయాలు తెచ్చాను. పరాయి దేశంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడంలో ఎంత సంతోషపడ్డానో దేశానికి పతకాలు తెచ్చినప్పుడూ అంతే సంతోషపడ్డాను. అవేవీ కనిపించలేదు ఈ మేల్ డామినేషన్ సిస్టమ్‌కి. నా కళ్లెదురుగా జరిగే తప్పుల్ని ‘అలా ఎందుకు’ అని ప్రశ్నించడమే వాళ్లకు గుర్తొచ్చేది. దేశంలో నంబర్‌వన్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను అకారణంగా తప్పించారు. కారణం ఒక్కటే! నేను 2006లో కామన్వెల్త్ గేమ్స్‌లో మెడల్ సాధించిన తర్వాత నా గ్రాఫ్ పెరిగింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో ఆడకుండా తప్పించారు. మనసులో మరేవో కారణాలు పెట్టుకుని, ఫిట్నెస్ వంకతో తప్పించారు. మగ బ్యాడ్మింటన్ ప్లేయర్ 30 ఏళ్ల వయసులో కూడా ఆడుతూ మెడల్ సాధించినప్పుడు నేను 24 ఏళ్లకే ఫిట్నెస్ కోల్పోతానా? ఆ తర్వాత 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్లో గోల్డ్ సాధించాను, 2011 వరల్డ్ చాంపియన్ షిప్లో కాంస్య పతకం వచ్చింది. నిజానికి ఫిట్నెస్ కోల్పోయి ఉంటే ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? ఆ మాటలోనే ఉంది ఆధిపత్యం! ఎన్ని కబుర్లు చెప్పుకున్నా సరే మనది మేల్ డామినేషన్ సొసైటీ. ‘మహిళలకు ఎన్నో అవకాశాలనిస్తున్నాం’ అనే మాటలోనే ఆధిపత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంటే ఇచ్చే స్థాయిలో వాళ్లు తీసుకోవాల్సిన స్థితిలో మహిళలు ఉన్నారనేగా ఈ మాటలు చెప్పే మగవాళ్ల ఉద్దేశం. మా ఆటలో కూడా మెన్స్ డబుల్స్ ఉన్నట్లు విమెన్స్ డబుల్స్ ఉండవు. ఆ బారికేడ్‌ను దాటడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది. విమెన్స్ డబుల్స్ గురించి మాట్లాడితే ‘విమెన్ సింగిల్స్ ఉన్నాయి చాలు కదా’ అంటారు. ఇంకా గట్టిగా అడిగితే మిక్స్డ్ డబుల్స్ పెట్టేవారు. సాధికారత సాధించాలనే తపన ఉన్న మహిళలకు కొదవ లేదు. తమ చేతిలో ఉన్న అధికారాన్ని కాస్తంత వదులుకోవడానికి సిద్ధంగా లేని మగవాళ్లే ఎక్కువగా ఉన్నారు, అడ్డంకులను ఎదుర్కొని తమను తాము నిరూపించుకోవాలని ప్రయత్నించే వాళ్లంతా తీవ్రమైన వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏదైనా అసమానతను ప్రశ్నిస్తే వారికి ఒక ముద్ర వేసేస్తారు. అందుకు ఉదాహరణ నేనే. సోషల్ మీడియా విస్తరించడం వల్ల సమాజం నిజస్వరూపం బయటపడుతోంది. ఎంత ఇరుకుగా ఆలోచిస్తారో తెలుస్తోంది. ముఖ్యంగా యూత్ ఆలోచనలు ఇలా ఉంటే రాబోయే తరం మహిళ పరిస్థితి ఎలా ఉంటుంది? కమింగ్ జనరేషన్‌కి తండ్రులు ఈ యువతే కదా! సొసైటీ ఈ లేబిలింగ్ హ్యాబిట్ పోనంత వరకు మహిళకు సమానత్వం అనేది సాధ్యం కాదు. సమానత్వం కోసం, సాధికారత కోసం పోరాటమే ఉంటుంది. 21వ శతాబ్దంలో కూడా ఇంకా ఫెమినిజం, సమానవేతనం, వివక్ష, వేధింపులు, సాధికారత సాధన వంటి పదాలు వినిపిస్తున్నాయంటే... ఇందుకు తలదించుకోవాల్సింది మహిళలు కాదు మొత్తం సమాజం. ఈ పదాలు వినిపించని రోజు, వీటి అవసరం లేని రోజు మనం సంపూర్ణ సాధికారత సాధించినట్లు’’. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మహిళలు జనాభాలో సగభాగం ఉన్నారు, అయినా అవకాశాల్లో మైనారిటీలే. అందుకే మహిళలు సాధికారత సాధించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వాలి, ప్రోత్సాహకరమైన వాతావరణం కల్పించాలి. మహిళలకు తమ మీద తమకు సందేహం ఉండకూడదు. తానిది చేయగలనా అని మనమే సందేహపడితే ఇక ప్రోత్సాహం ఎక్కడ నుంచి లభిస్తుంది? ఎవరైనా వేలెత్తి చూపించగానే బెంబేలు పడిపోవడం మానేయాలి. అమ్మాయిలు తమకు ఇష్టమైన రంగంలో రాణించడానికి ముందడుగు వేయాలి. పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని సమకూర్చుకోవాలి. ∙సినిమాలలో హీరోయిన్ పాత్రతో పోల్చుకోవడం మానేయాలి. ఎందుకంటే మన సినిమాల్లో హీరోయిన్ పాత్ర చాలా బలహీనమైనది. ఆమెకు కష్టం వస్తే హీరో వచ్చి రక్షించే సీన్లకోసం, హీరో పాత్రను ఎలివేట్ చేయడం కోసం అలా చిత్రీకరిస్తుంటారు. అది కమర్షియల్ ఎలిమెంట్ కావచ్చు. అమ్మాయిలు ఆ మైండ్‌సెట్‌లో కూరుకుపోకూడదు. కళ్ల ముందు ఏమి జరుగుతున్నా తలదించుకుని వెళ్లిపోతుంటే మంచి అమ్మాయి అనే బిరుదు వస్తుంది. ఆ బిరుదు కోసం ఎవరూ తమ ఉనికిని పణంగా పెట్టకూడదు. ∙ఈ తరం పేరెంట్స్ ప్రోగ్రెసివ్‌గా ఆలోచిస్తే... రాబోయే తరం అమ్మాయిలు, అబ్బాయిలకు అవకాశాలలో సమానత్వం వస్తుంది. మహిళలకు సాధికారత అందుబాటులోకి వస్తుంది. పరిస్థితులను మనమే మార్చుకోవాలి ‘రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్ని సెక్టార్ వాళ్లతో కలసి పనిచేయాలి. వివక్ష ఎదురైనా వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. సమస్యలు అన్ని చోట్లా ఉన్నట్లే రాజకీయాల్లోనూ’ అన్నారు కొత్తూరు గీతామూర్తి. ‘‘నేను 20 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను. నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీచేశాను. పార్టీలో ఉంటూ రకరకాల సమస్యల మీద సమాచారం ఇవ్వడం, పోలీస్ వ్యవస్థతో అవగాహన సదస్సులు నిర్వహించడంతోపాటు 23 జిల్లాలకు డైరెక్టర్‌గా, పార్టీ కోర్ కమిటీ మెంబర్‌గా చేశాను. గ్రామ కో ఆర్డినేటర్‌గా చేశాను. ఏ ఉద్యోగానికైనా ఓ టైమ్ లిమిట్ ఉంటుంది. పాలిటిక్స్‌లో ఉదయం ఆరుగంటల నుంచే డ్యూటీ మొదలైతే అర్ధరాత్రి దాటాకా ఫోన్లు వస్తుంటాయి. ఇక్కడ ఆడ–మగ తేడా లేదు. ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొనాలి. రాజకీయాల్లో మహిళల పట్ల వివక్ష ఉంది. అలాగని దూరంగా ఉంటే ఇంకా దూరం పెట్టేస్తారు. ఇప్పటికీ చాలా పార్టీలలో మగనాయకులు ఆడవారి సేవలను మంగళహారతులకు, పూల దండలు వేయడానికే సరిపెడుతున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో నాకూ ఆత్మన్యూనత ఉండేది. అది పోవడానికి నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకున్నాను. రాజకీయాల్లో ఉన్న మహిళ ప్రతి రోజు తనని తాను కొత్తగా మార్చుకోవాలి. నిరంతరం ప్రజల్లో ఉండాలి, వారి కష్టసుఖాలు తెలుసుకోవాలి, వాటిని సాధ్యమైనంత పరిష్కరించాలి. యాక్టివ్‌గా ఉంటేనే అది సాధ్యమవుతుంది. బేటీ బచావో ప్రోగ్రామ్‌లో అంగన్వాడీ స్థాయి నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. ఆడపిల్లలకు ఎక్కడ సమస్యలు ఉంటే అక్కడ అండగా మేము నిలబడుతున్నాం. మా ఇంట్లో వాళ్లు నాకు మంచి సపోర్ట్. అలా ఉండేలా ఇంటి వాతావరణాన్ని మనమే మార్చుకోవాలి. అప్పుడే రాజకీయాల్లోనూ విజయం సాధించగలం.’’ – నిర్మలారెడ్డి రాస్తే పుస్తకమే అవుతుంది! ఏ స్పోర్ట్స్ పర్సన్ కూడా స్టార్డమ్ కోసం ఆట మొదలు పెట్టరు. ఆట మీద ప్యాషన్‌తో శ్రమిస్తాం. సక్సెస్ సాధించిన తర్వాత స్టార్డమ్, సెలబ్రిటీ హోదాను సమాజమే ఇస్తుంది. మేము కోరేది క్రీడాకారులుగా ఆదరించమనే. అయితే అందులోనూ మగవాళ్లకు ఆడవాళ్లకు తేడా చూపిస్తుంటే ఏంటిది అనిపిస్తుంది. నేను అనుభవించిన తేడాలను రాస్తే పుస్తకమే అవుతుంది. ఎదురీదాల్సిన పరిస్థితులు ఎన్ని వచ్చినా వెనుకడుగు వేయలేదు. నాకు తెలుసు నేనేమిటో? అందుకే ఎటువంటి వివక్షనీ ఖాతరు చేయలేదు. నేను నేనుగా నిలబడగలిగాను. నన్ను నేను నిరూపించుకోగలుగుతున్నాను. అక్కడా పోరాటమే! సమానమైన పనికి సమాన వేతనం అనే డిమాండ్‌ని ఇప్పుడు క్షేత్రస్థాయిలో వింటున్నాం. కానీ ఒకప్పుడు స్పోర్ట్స్‌లోనూ ఈ వివక్ష ఉండేది. బ్యాడ్మింటన్‌లో మగవాళ్లకు ఇచ్చినంత ప్రైజ్‌మనీ ఆడవాళ్లకు ఇచ్చే వారు కాదు గతంలో. మనదేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలోనే ఇంతటి వివక్ష ఉండేది. ఈ కండిషన్ నుంచి ఈక్వల్ రెమ్యూనరేషన్ కోసం ప్లేయర్లు పోరాడి సాధించుకోవాల్సి వచ్చింది. ఫండమెంటల్ రైట్స్... - మహిళలకు మగవాళ్లతో సమానమైన హక్కు - మహిళల పట్ల లింగవివక్ష నిషేధం - అవసరమైనప్పుడు రాజ్యం... మహిళల ప్రయోజనాల కోసం నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకోవాలనే సూచన - ఉద్యోగాల కల్పనలో ప్రతి పౌరునికీ సమాన అవకాశాలుండాలి... అని చెప్తున్నాయి. -
‘నా ప్రాథమిక హక్కుల్ని రక్షించండి’
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ప్రాథమిక హక్కులతో పాటు వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎయిర్‌సెల్–మాక్సిస్, ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో తన కుమారుడు కార్తీకి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు సమన్లు జారీచేయడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చిదంబరం కోర్టును ఆశ్రయించారు. తనతో పాటు కార్తీ పేరు ఎఫ్ఐఆర్లో లేకపోయినప్పటికీ ఈడీ, సీబీఐలు వేధిస్తున్నాయనీ, ఈ చట్టవిరుద్ధమైన విచారణను వెంటనే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
అసహనానికి చోటు లేదు
విశ్వవిద్యాలయాల్లో హింస కాదు చర్చ జరగాలి: ప్రణబ్ కొచ్చి: అసహనపరులకు భారత్‌లో చోటు ఉండకూడదని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. పురాతన కాలం నుంచి మనదేశం స్వేచ్ఛాయుత ఆలోచనలు, భావప్రకటనకు నిలయమని పేర్కొన్నారు. ఆయన గురువారం ఇక్కడ కేఎస్ రాజమోని ఆరో స్మారక ప్రసంగం చేశారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు, అధ్యాపకులు అర్థవంత చర్చల్లో పాల్గొనాలి కానీ అశాంతిని రాజేసే వాతావరణాన్ని సృష్టించరాదని పిలుపునిచ్చారు. హింస, అశాంతి అనే సుడిగుండంలో విద్యార్థులు చిక్కుకోవడం విచారకరమని అన్నారు. వర్సిటీల్లో స్వేచ్ఛాయుత ఆలోచన విధానాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఏబీవీపీ, ఏఐఎస్ఏ మద్దతుదారుల మధ్య ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఈ మధ్య జరిగిన గొడవలు, విద్యార్థిని గుర్మెహర్ కౌర్ ట్వీట్ల తరువాత భావ స్వేచ్ఛ, జాతీయవాదంపై వెల్లువెత్తిన చర్చల నేపథ్యంలో ప్రణబ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మన విశ్వవిద్యాలయాలు భారత్‌ను జ్ఞాన సమాజం వైపు నడిపే వాహనాల లాంటివి అని అన్నారు. దేవాలయాల్లాం టి వర్సిటీల్లో సృజన, స్వేచ్ఛాయుత ఆలోచనలు మార్మోగాలని అభిలషించారు. అసహనం, మహిళలపై దాడుల వంటివాటి పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. విరుద్ధ భావాలు ప్రకటించడం, చర్చలు జరగడం మన సమాజం విశిష్ట లక్షణమని చెప్పారు. ‘వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ అనేవి రాజ్యాంగం పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులు’ అని ప్రణబ్ అన్నారు. -
జెండాతో కొత్త రాజకీయం
రెండో మాట జాతీయ పతాకాన్ని ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలో గాంధీజీ చెప్పిన మాటలు కూడా మనకు పరగడుపైపోవడం విచారకరం: ‘నిర్మాణాత్మక కృషిలో ఉన్న సంస్థలు జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు. ముస్లింలు, హిందువుల మధ్య ఘర్షణకు ఈ పతాకావిష్కరణ కారణమయ్యే పక్షంలో ఈ జెండాను ఎగురవేయరాదు’ అన్నారాయన. అందుకే ఉభయ తారకంగా ముందు పార్టీ జెండాలో ఉన్న చరఖా స్థానంలో దేశ సమైక్యతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అశోక చక్రాన్ని ఈ జెండా మధ్యలో ఉంచారని గ్రహించాలి. ‘ఈ దేశపౌరుడు తన ప్రాథమిక హక్కులకు ప్రమాదం ఏర్పడిందని దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు మేము అతను చెప్పేది విని తీరవలసిందే.... ఈ దేశంలో ఏవో అసాధారణమైన పరిణామాలు జరిగిపోతున్నాయి. ఇందులో సందేహం లేదు. ఈ సమస్యను మేం పరిశీలించి తీరుతాం.’ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసినప్పుడు బెయిల్ కోసం కోర్టును అర్థిస్తూ పెట్టుకున్న పిటిషన్ వాదనకు వచ్చినప్పుడు గౌరవ న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేల ధర్మాసనం చేసిన వ్యాఖ్య (19-2-16) ‘భిన్నాభిప్రాయాలని, ఆలోచనలని చర్చల ద్వారా గెలవడానికి బదులు రాజ్యాధికారాన్ని ప్రయోగిస్తున్నట్టు ప్రస్తుత సంక్షోభం స్పష్టం చేస్తోంది.’ -ప్రొఫెసర్ హర్బన్ ముఖియా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పరిణామాల నేపథ్యంలో సుప్రసిద్ధ వ్యంగ్య చిత్రకారుడు కేశవ్ ఆసక్తికరమైన చిత్రం (18-2-16) గీశాడు. అంతకు ముందు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య, తరువాత కన్హయ్య కుమార్ అరెస్టు, వేధింపులకు నిరసనగా దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విద్యార్థి, అధ్యాపక, ఆచార్యుల ఆందోళన సందర్భంగా జాతీయత, జాతీయవాదం ఒకరి గుత్తసొమ్మా అన్న ప్రశ్న వచ్చింది. ఆ పేరుతో కొందరిని వేధించి వారి మీద జాతి విద్రోహులనో, దేశ ద్రోహులనో ముద్ర వేయడం గురించి కూడా ప్రజా బాహుళ్యంలో చర్చ బయలుదేరింది. ఈ అంశం మీదే కేశవ్ వ్యంగ్య చిత్రాన్ని సంధించారు. ఇకపైన దేశపౌరులు దేశభక్తిని, ప్రభు విధేయతను చాటుకోవలసిన కొలబద్ద కేంద్ర హోంమంత్రి కార్యాలయం వద్ద నేషనలిజం-సెన్సార్‌బోర్డ్ అన్న మకుటంతో ఒక బోర్డును తగిలించాడు. దేశంలో కొన్ని విపరిణామాలను శ్రద్ధగా పరిశీలిస్తున్న అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం ‘దేశంలో ఏదో జరుగుతున్నదంటూ’ వ్యాఖ్యానించిన ఒకరోజు ముందరే ఈ వ్యంగ్య చిత్రం వెలువడడం విశేషం. సరిగ్గా అదే సమయంలో దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలలోను ఇక నుంచి 207 అడుగుల ఎత్తున జాతీయ జెండా రెపరెపలాడుతూ ఉండాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ఆధ్వర్యంలో సూరజ్‌కుంద్‌లో కొలువుతీరిన 42 కేంద్రీయ విశ్వ విద్యాలయాల వైస్ చాన్సలర్లు అలాగేనంటూ తీర్మానించారట. అప్పుడే అక్కడ జాతీయ జెండా ఒడ్డూపొడుగు గురించి కొంత గందరగోళం జరిగిందని వార్తలొచ్చాయి. దీని అపూర్వ లక్ష్యం ఏమై ఉంటుంది? దేశ విశ్వవిద్యాలయాలలో ప్రబలి పోతున్న జాతీయవాద వ్యతిరేక ప్రవాహానికి అడ్డుకట్ట వేయడానికి జాతీయ జెండాను రెపరెపలాడించడమే మార్గమని భావించారట. ఆ భాషే అప్రజాస్వామికం అనేక రంగాలలో (అభివృద్ధి పేరుతో, ఇండియాలోనే తయారీ పేరుతో ప్రైవేటు, ప్రభుత్వ రంగాలను కమ్ముకుంటూ వస్తున్న విదేశీ గుత్తపెట్టుబడులు మినహా) నైరాశ్య వాతావరణం నెలకొనడానికి దారితీసిన పరిణామాలను సమీక్షించుకుని అసంఖ్యాక బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడే హేతుబద్ధమైన తిరుగులేని చర్యలను తీసుకోవడంలో యూపీఏతో పాటు ఏన్డీఏ పాలకులు కూడా వైఫల్యం చెందడానికి కారణాలను తెలుసుకుంటే రాజకీయ నిర్ణయాలు పక్కదారులు తొక్కడానికి ఆస్కారం ఉండదు. ఈ గుర్తింపు లేనందునే పాలకులు ఎవరికి వారు ‘నా ప్రభుత్వాన్ని అస్థిరం చేయడానికి’ ఎవరో కుట్ర పన్నుతున్నారని భావించి వలస పాలనావ శేషంగా సంక్రమించిన ‘రాజద్రోహ/ దేశద్రోహ’ నేర చట్టాలను ప్రజల మీద ప్రయోగించ చూడడం హాస్యాస్పదం కాదా? ‘రాజద్రోహ’ భాష ప్రజావ్యతిరేకం. లేదా దేశద్రోహ నేర భాష స్వార్థ పరిపాలనా ఫలితం. తాజాగా నరేంద్ర మోదీ ప్రభుత్వం మీద బహుముఖంగా వస్తున్న విమర్శలను ఆయన కుట్రగా భావిస్తున్నారు గానీ, ఆరెస్సెస్ ఛాయల నుంచి బయటపడనంతవరకు తనకు సుఖమూ, శాంతీ ఉండదని ఆయన ఆలస్యంగానైనా గుర్తిస్తే ఆయనకూ దేశానికీ కూడా మంచిది. నిజానికి సంఘ్‌పరివార్ అసహిష్ణుత హద్దులు దాటి ప్రొఫెసర్లు, చరిత్రకారులు,ప్రజాస్వామిక పక్షాల నాయకులను హత్య గావించే వరకు వ్యాపించడం తన పాలనకు శ్రేయస్కరం కాదని కూడా మోదీ తెలుసుకోవాలి. వ్యతిరేకించిన సావర్కర్ నిజానికి విశ్వవిద్యాలయాలలో జాతీయ పతాకం ఎగురవేయడం ఎన్నాళ్ల నుంచో కొనసాగుతున్నది. ఇదేమీ కొత్తకాదు. అయినా జాతీయ జెండాను గౌరవించాలన్న స్పృహ పరివార్ వర్గానికి ఎప్పటి నుంచి కలిగింది? విశ్వవిద్యాలయాల మీద జాతీయ జెండా ఎగురవేయడం గురించి వైస్‌చాన్సలర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో తప్పులేదు. ఇది ఆహ్వానించదగినది. కానీ ఇది కొత్త అంశం కాదు. ఈ జెండాను జూలై 22, 1957న భారత రాజ్యాంగ నిర్ణయ సభ ఆమోదిస్తూ, సభ్యులంతా లేచి నిలబడి ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని గౌరవించారు. తరువాత మూడు రోజులకే హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ ఆ తీర్మానాన్ని వ్యతిరేకించి అవమానించడం చరిత్ర మరవదు. పైగా గాంధీజీని అవమానిస్తూ ఆయన ప్రకటన కూడా చేశారు. జాతీయ జెండాలోని తొలి చరఖాను తీసుకువెళ్లి ఏదైనా నూలు ఒడికే అసోసియేషన్‌కు ట్రేడ్‌మార్క్‌గా ఉపయోగించుకోండని సావర్కర్ హేళన చేశారు. అనేక చర్చల తరువాత, బహుళ జాతుల, భాషల, వర్గాల, తెగల, ఆదివాసీల, సిక్కు, ముస్లిం, జొరాస్ట్రియన్, పార్సీ, బౌద్ధులు, జైనులు, క్రైస్తవులతో కూడిన భారతదేశాన్ని ఒక మహా సెక్యులర్ సమాజంగా భావించి నాడు స్థూలంగా త్రివర్ణ పతాకంగా ఆ జెండా అవతరించింది. ఆగస్టు 8, 1942న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించే ముందు గాంధీజీ ఏమన్నారో గమనించండి! ‘‘కత్తి వాదరమీద నమ్మకం ఉన్న డాక్టర్ బాలకృష్ణ శివరామ్మూంజే, సావర్కర్ వంటి హిందువులు, హైందవ పెత్తనం కింద ముస్లింలు అణిగి మణిగి ఉండేటట్టు చేయాలని కోరుకోవచ్చుగానీ, నేను మాత్రం ఈ వర్గానికి చెందినవాడను కాను. వారికి ప్రతినిధినీ కాను. నేను జాతీయ కాంగ్రెస్‌కు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తాను’’ అని ప్రకటించారు. ‘‘ఎవరు ఏ మత దృక్పథానికి చెందినప్పటికీ భరతమాతకు ఉన్నది మాత్రం అవిభక్త హృదయమే. అవిభాజ్యమైన సమైక్య భావనేనని మరచిపోరాదు. నవభారత స్త్రీపురుషులంతా ఒక్కతాటి మీద నిలిచి ఈ జాతీయ జెండాకు వందనం చేయండి!’’ అన్నారు సరోజినీదేవి. కానీ హిందుత్వ ఛాంధసత్వానికి కట్టుబడిన సావర్కర్ ఈ జాతీయజెండాను ఎన్నటికీ ‘హిందుస్తాన్ జాతీయ పతాకంగా గుర్తించబోనని నేను స్పష్టం చేయదలిచాను’ (‘ది హిస్టారిక్ స్టేట్మెంట్’, సావర్కర్ ) అన్నారు. మరి త్రివర్ణ పతాకం స్థానంలో ఏ జెండాను ఎంపిక చేసుకుందామని ప్రశ్నిస్తే, ‘కాషాయ పతాకం(భాగవ) మాత్రమే కావాలి’ అని అన్నారాయన. ఈ భాగవ జెండా మీద కుండలిని, కృపాణం ఉండాలి. మానవజాతి ఉనికిని చాటే పతాకంగా ఉండాలి. ఇది అఖండ హిందూధ్వజం ఈ హైందవం మరొక జెండాకు సెల్యూట్ కొట్టదు. అందులో ‘ఓం’ ఉండాలి అని కూడా అన్నారు సావర్కర్. ఆ కోరిక చిట్టా అంతటితో ఆగిపోలేదు. స్వస్తిక్ గుర్తు కూడా ఉండాలని ఆయన భావన. నాజీ హిట్లర్‌కు, అతని పార్టీకి కూడా ఇదే గుర్తు. వైదిక కాలం నుంచి మన హిందూ జాతి భావధారను ప్రతిబింబించే కుఠారం (కత్తి) కూడా ఉండాలి. ఇదీ పేగులు మెడలో వేసుకున్నట్టుగా సావర్కర్ ధోరణి. అయితే గాంధీజీ హత్యలో నాథూరామ్ గాడ్సేతో పాటు తాను కూడా ముద్దాయిగా నమోదవుతున్న ఘడియలలోనే సావర్కర్ హిందూ మహాసభ జెండాతో పాటు ఎందుకైనా మంచిదని జాతీయ జెండాను కూడా హడావుడిగా పెట్టవలసి వచ్చిందని మరచిపోరాదు. అలా క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణచడానికి బ్రిటిష్ వారికి పరోక్షంగా తోడ్పడిన వాళ్లలో కొన్ని హిందుత్వ శక్తులు కూడా ఉన్నాయనడానికి మరెవరోకాదు, హిందూ మహాసభ నాయకులలో ఒకరైన శ్యామాప్రసాద్ ముఖర్జీ రాసిన ‘లీవ్స్ ఫ్రం ఏ డైరీ’ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. కర్ణుడి చావుకు అనేక కారణాలన్నట్టు ఏదో ఒక స్థాయిలో క్విట్ ఇండియా ఉద్యమం నీరసించడానికి తలా ఒక చేయి వేశారనడానికి నెహ్రూ అన్న మాటలే నిదర్శనం- ‘కాంగ్రెస్‌లో ఆది నుంచీ కొన్ని ఆరెస్సెస్ శక్తులు ఉంటూనే వచ్చాయి’. అశోక చక్రంతో సమాధానం జాతీయ జెండా రూపశిల్పిని అంతా కలసి వివాదంలోకి దించిన చరిత్ర కూడా ఉంది. కానీ జాతీయ పతాకాన్ని ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించాలో గాంధీజీ చెప్పిన మాటలు కూడా మనకు పరగడుపైపోవడం విచారకరం: ‘నిర్మాణాత్మక కృషిలో ఉన్న సంస్థలు జాతీయ పతాకాన్ని ఎగురవేయరాదు. ముఖ్యంగా దేశంలోని ముస్లింలు, హిందువుల మధ్య ఘర్షణకు ఈ పతాకావిష్కరణ కారణమయ్యే పక్షంలో ఈ జెండాను ఎగురవేయరాదు’ అన్నారాయన. అందుకే ఉభయతారకంగా ఉండే విధంగా ముందు పార్టీ జెండాలో ఉన్న చరఖా స్థానంలో దేశ సమైక్యతా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హిందువులు, ముస్లింలు సమంగా ప్రేమించే అశోక చక్రాన్ని ఈ జెండా మధ్యలో ఉంచారని గ్రహించాలి. అయితే కత్తిని ప్రేమించిన సావర్కర్ కూడా ధర్మచక్రాన్ని తానే ప్రతిష్టించానని అనడం విశేషమే. అలాగే ఆరెస్సెస్ తానులో ముక్క అయిన హిందూ మహాసభ తరఫున 1925-30 మధ్య ఆర్యజాతి సిద్ధాంతం ద్వారా యూదులను లక్షలుగా ఊచకోత కోయడానికి కారకులై నాజీ ఫాసిస్టు నాయకులైన ముస్సోలినీ, హిట్లర్‌తో డాక్టర్ మూంజీ మంతనాలు జరిపి ‘ఏకజాతి రక్త సంబంధాల’ను తవ్వి తీయడానికి ప్రయత్నించారు. 1925లో నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ ఒక పరిపూర్ణ శక్తిగా అవతరించిన తరువాత 1930లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలన్న కారణంతో డాక్టర్ మూంజీ యూరప్ వెళ్లి ఫాసిస్టు ముస్సోలినీని కలసి వచ్చారు. ఏకరక్త/ ఏకజాతి ప్రాతిపదిక మీద సూడెటాన్ల్యాండ్ను దురాక్రమించిన హిట్లర్ చర్య సబబేనని రెండో ప్రపంచ యుద్ధానికి సంవత్సరం ముందే 1938లోనే సావర్కర్ కితాబిచ్చారు. అందుకే మౌఢ్యాన్ని, కుల ప్రాతిపదికలను ప్రతీఘాత శక్తులని చరిత్రకారులు వర్ణించి ఉంటారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
వర్తమానమూ... విజయసూత్రమే
అస్పష్టత.. క్లిష్టత:కొన్ని ప్రశ్నల సమాధానాలు సులభంగానే అనిపిస్తాయి. కానీ క్లిష్టంగా, అస్పష్టంగా, తికమక పెట్టేలా ఉంటాయి. ఇలాంటివాటికి తొందరపాటు పనికిరాదు. అలా చేస్తే భారీ మూల్యం తప్పదు. ఉదాహరణ:కేంద్ర మంత్రి మండలి ఎవరికి బాధ్యత వహిస్తుంది? లోక్‌సభకా? పార్లమెంట్‌కా? దీని వివరణ కోసం ఆర్టికల్ 75లో సమగ్రంగా చదివితే స్పష్టత వస్తుంది. అదే విధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు సంబంధించిన విషయాలు కూడా ఇలాగే ఇబ్బందిపెడతాయి. అందువల్ల వీటిపై సమ గ్ర అధ్యయనం అవసరం. ప్రిలిమ్స్‌కు స్వల్పవ్యవధి మాత్ర మే ఉంది. ఈ కొద్ది సమయాన్ని సరైన ప్రణాళికతో సద్వినియోగపరచుకోవచ్చు. అందుకు మేలైన దారుల్లో కొన్ని... పాత ప్రశ్నపత్రాలతో పూర్తి అవగాహన: పాత పేపర్లను క్షుణ్నంగా చదివితే పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. పాత ప్రశ్నపత్రాలకు మించిన ఉత్తమ వనరులు వేరేవేమీ లేవనడంలో సందేహం లేదు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు చేయాల్సిన మొదటి పని ఇదే. ఇలా చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఎకానమీ సబ్జెక్ట్‌కు 15 సంవత్సరాల పాత ప్రశ్నపత్రాలను, మిగతా సబ్జెక్టులకైతే 20-30 సంవత్సరాల పేపర్లను నిశితంగా పరిశీలించాలి. వీటిని అధ్యయనం చేస్తే మానసికంగా కొంత విజయం సాధించినట్లే. గత పదేళ్లలో నిర్వహించిన ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను క్షుణ్నంగా పరిశీలించి ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పరచుకోవాలి.ప్రశ్నల ప్రాతిపదికకు సంబంధించి ముఖ్యాంశాలను నోట్స్‌లో రాసుకోవాలి. ఏడాదిగా సివిల్స్ కోసం సాధన సాగించిన వారు నోట్స్‌లో రాసుకున్న అంశాలను పునశ్చరణ చేయాలి. క్లిష్టమైన అంశాలను మరింత గుర్తుండి పోయేలా పాకె ట్ బుక్‌లో రాసుకుంటే మంచిది. రాజ్యాంగం, ఎకనామిక్స్, చరిత్ర.. ఇలా ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన కీలక పాయింట్లను ఇందులో రాసుకోవాలి. ప్రిలిమ్స్.. మెయిన్సకు ఉపయుక్తమే: సాధారణంగా ప్రిలిమ్స్ కోసం చదివిన అంశాలు మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్‌కు అంతగా ఉపకరించవని అనుకుంటారు. కానీ ఈ భావన తప్పు. ప్రిలిమ్స్ అంశాలు పూర్తిగా కాకున్నా కొంతమేర దోహద పడతాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ మధ్య చాలావరకు భిన్నత్వం ఉంటుంది. ఈ రెంటికీ సిలబస్ కూడా వేర్వేరు. అయితే అంశాలకు సంబంధించి స్పష్టత, అనుబంధ సమాచారం, మానసిక క్రమశిక్షణ, మార్గదర్శక సూత్రాల అమలులో రెండు పరీక్షలకు ఒకేలా ఉంటుంది. వర్తమాన అంశాలపై పట్టు: ఇటీవల 16వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సరళి, ఎన్నికల కమిషన్. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ల మధ్య పోలిక మొదలైన అంశాలు చదవాలి. 14వ ఆర్థిక సంఘం తుది నివేదిక కొద్ది నెలల్లో సమర్పిస్తుంది. దీనిపై ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇటీవల గవర్నర్ల నియామకం - తొలగింపు (ఆర్టికల్ 123) వివాదాస్పదంగా మారింది. ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థకు జ్యుడీషియల్ కమిషన్ మధ్య వివాదం... ఇలా వర్తమానవ్యవహారాలకు సంబంధించి ప్రశ్నలు రావచ్చు. జాతీయ అత్యయిక పరిస్థితి (ఆర్టికల్ 352), రాష్ట్రపతి పాలన మొదలైనవి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తరచూ రాష్ట్రపతిని కలవడానికి ప్రధాన కారణాలు, ద్రవ్యోల్బణం, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో), మానిటరీ పాలసీ, సెబీ ఆర్డినెన్స్, చెల్లింపుల్లో సమతూకం (బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్), రాయితీలు, ఎఫ్ఆర్బీఎం, పన్ను వసూలు భావనలు (ట్యాక్సేషన్ కాన్సెప్ట్స్), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెట్టుబడుల పంపిణీ మొదలైన అంశాలపై ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌లోనూ తరచూ ప్రశ్నలు వస్తుంటాయి. ఈ అంశాలు వర్తమాన వ్యవహారాలకు సంబంధించినవే అయినా ఏటా మారుతుంటాయి. కాబట్టి ఈ అంశాలపై ఎల్లప్పుడూ విశ్లేషణాత్మక అధ్యయనం సాగిస్తే ప్రిలిమ్స్, మెయిన్సకు తోడ్పడుతుంది. సైన్స్ అంశాల నుంచి: ప్రిలిమినరీలో కరెంట్ ఐఫైర్స్ విభాగం ప్రత్యేకమైంది. రాజ్యాంగం, ఎకానమీ, సైన్స్‌లో సాధించిన పురోగతిపై అధికంగా ప్రశ్నలు వస్తున్నాయి. జాతీయ స్థాయి పత్రికల్లో తరచూ వచ్చే అంశాలపై అంటే సైన్స్‌లో ఎబోలా వైరస్, క్రయోజెనిక్ ఇంజిన్, శుద్ధి చేసిన యురేనియం, అణు సంబంధ పదార్ధాలు తదితర విషయాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఎకానమీ, జాతీయ విధానం అంశాలు కూడా కరెంట్ అఫైర్స్‌లో అడుగుతున్నారు. అన్ని రంగాల నుంచి పలు రూపాల్లో ప్రశ్నలు రావొచ్చు. వీటితోపాటు సంప్రదాయ జీవ, భౌతిక శాస్త్రాల అంశాలు కరెంట్ అఫైర్స్‌లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జన్యు మార్పులు, జన్యు సాంకేతికతపై పలు నివేదికలు వెలువడ్డాయి. డీఆర్డీవో పరిశోధ నలు, బ్రిక్స్ బ్యాంక్ ఏర్పాటు.. ఇలా పలు అంశాలపై పట్టు సాధిస్తే ప్రిలిమ్స్‌తో పాటు మెయిన్స్‌కూ ఉపయుక్తం. దినపత్రికలతోనే దిశ-దశ: సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారు ప్రామాణిక దినపత్రికలను చదవడం ఉత్తమం. పత్రికల్లో వచ్చే వర్తమాన వ్యవహారాలు, ఆర్థిక, సామాజిక, రక్షణ రంగాలకు చెందిన విశ్లేషణలు మనం చదివినవాటికి మరింత అదనపు సమాచారాన్ని అందిస్తాయి. ఉదాహరణకు ఆర్థిక సర్వే-2013. ఇందులో ఆర్థికపరమైన అంశాలన్నీ వివరణాత్మకంగా పత్రికల్లో వచ్చాయి. ఆర్థిక నిపుణులు తమ ఆలోచనలు, అనుభవాలను రంగరించి రూపొందించిన ఈ నివేదికలోని అంశాలను చదివితే ఎంతో ప్రయోజనం. ఇటీవల ఎక్కువగా స్మార్ట్‌సిటీల గురించి ప్రస్తావన వస్తోంది. వీటితోపాటు కేంద్రం చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు పాతపేర్లను తొలగించి వాటి స్థానంలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, శ్యామప్రసాద్ ముఖర్జీ, జయప్రకాశ్ నారాయణ్, మదన్మోహన్మాళవీయ పేర్లను పెడుతున్నారు. వీటిపై అభ్యర్థులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చదవని అంశాల గురించి ఆందోళన చెందకుండా చదివిన అంశాలను ఏ మేర విశ్లేషణతో ఆకళింపు చేసుకున్నారో స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి. కొత్తగా ప్రాధాన్యమనిపించిన విషయాలేవైనా గుర్తించినట్లైతే అలాంటి వాటిపై పట్టు సాధించేందుకు మరింత కృషి చేయాలి. చర్చా కార్యక్రమాలు: టీవీల్లో ప్రసారమయ్యే చర్చా కార్యక్రమాలను చూస్తే విశ్లేషణ శక్తి పెరుగుతుంది. కొన్ని చానెళ్లు విషయ పరిజ్ఞానం లేనివారితో చర్చలు కొనసాగిస్తుంటాయి. వాటి జోలికి వెళ్లకుండా ఆయా రంగాల్లో నిపుణులైన వారితో చేపట్టే కార్యక్రమాలను వీక్షిస్తే ఫలితం ఉంటుంది. కొందరు టీవీ చర్చా కార్యక్రమాలను చూస్తున్నాం కాబట్టి పత్రికలను చదవాల్సిన అవసరం లేదనుకుంటారు. అలాంటివారు ఈ ధోరణి విడనాడాలి. కనీసం ఒక ప్రామాణిక దినపత్రికనైనా చదవాలి. పరీక్షకు అవసరమైన వార్తలు, సమీక్షలు, సంఘటనలపై ఎప్పటికప్పుడు నోట్స్ రూపొందించుకోవాలి. జయాపజయాలను నిర్ణయించేది ప్రిలిమ్స్‌లో కరెంట్ అఫైర్స్ విభాగం నుంచి కనీసం 40 నుంచి 45 ప్రశ్నలు వస్తాయి. ఎవరైతే ఇందులో 40 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తిస్తారో వారు విజయానికి చేరువవుతారు. ఓ రకంగా చెప్పాలంటే జయాపజయాలను నిర్ణయించే విభాగం ఇదే. కరెంట్ అఫైర్స్‌కు ప్రిపేరవ్వాలనుకునేవారు ప్రామాణిక దినపత్రికలు, వార్తా మ్యాగజైన్లను చదివితే మంచిది. వాటిలో కీలకమైన పాయింట్లను గుర్తించి, దాన్ని ప్రశ్న రూపంలో ఇలా అడగొచ్చు అని ఏవరికి వారు విశ్లేషించుకోవాలి. ఒక్కో అంశాన్ని నాలుగు కోణాల్లో ఆలోచించి సమాధానం గుర్తించడం సాధన చేయాలి. గత ప్రిలిమ్స్‌లో ఏ రూపంలో ప్రశ్నలు వచ్చాయో వాటికి అనుగుణంగా నోట్స్ రాసుకోవాలి. ఇలా చేయడం నాకు ఎంతో ఉపకరించింది. ప్రభుత్వ రంగ సంస్థల అధినేతలు, పభుత్వ పథకాలు, వాటి లక్ష్యాలు, అంతర్జాతీయ సంఘటనలపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. వార్తల్లోకెక్కిన ప్రదేశాలపై పట్టుకోసం అట్లాస్ చూస్తే మరింతగా గుర్తుండి పోతుంది. ఇలా సాధన సాగిస్తే కరెంట్ అఫైర్స్ విభాగంలో 95 శాతం విజయం సాధించవచ్చు. - శశాంక ఆల, సివిల్స్- 2013 విజేత. రిఫరెన్స్ బుక్స్ హిస్టరీ: ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ - బిపన్ చంద్ర ఫాసెట్స్ ఆఫ్ ఇండియన్ కల్చర్ - స్పెక్ట్రమ్ (కల్చర్) జాగ్రఫీ: జాగ్రఫీ ఆఫ్ ఇండియా - మాజిద్ హుస్సేన్ ఆక్స్ఫర్డ స్కూల్ అట్లాస్ - ఆక్స్ఫర్డ్ సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ- జి చాంగ్ లియోంగ్ ఎకానమీ: ఇండియన్ ఎకానమీ - ఎన్సీఈఆర్టీ 10, 12 తరగతుల సిలబస్-ఎకానమీ ఆక్స్ఫర్డ్/పెంగ్విన్ డిక్షనరీ ఆఫ్ ఎకానమిక్స్ సోషియో ఎకనమిక్ సర్వే (2013) సైన్స అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా- కల్పనా రాజారామ్, స్పెక్ట్రమ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఫ్రమ్ క్రైసిస్ టు క్యూర్ - రెండో ఎడిషన్-ఆర్.రాజగోపాలన్ (ఎన్విరాన్మెంట్) కరెంట్ అఫైర్స-జీకే ఇండియా ఇయర్ బుక్ 2014 మనోరమ ఇయర్ బుక్ 2014 పామాణిక కెరీర్ జర్నల్ న్యూస్ మ్యాగజైన్స్ సెలెక్టివ్ రీడింగ్ ఫ్రమ్ వికీపీడియా -
చట్టంపై అవగాహన ఉన్నవారిని ఎన్నుకోవాలి
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ చంద్రకుమార్ ఉయ్యూరు/విజయవాడ, న్యూస్‌లైన్: స్వాతంత్య్ర ఫలాలు అందించిన మహనీయుల స్ఫూర్తితో రాజ్యాంగంపై అవగాహన కలిగిన నాయకత్వాన్ని కోరుకుంటే చట్టాలు సమర్ధంగా అమలై వనరులన్నీ సమానంగా అందుతాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్రకుమార్ సూచించారు. రాజ్యాంగాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఉయ్యూరులోని ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ కళాశాల ఆవరణలో ‘రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు-ప్రభుత్వాలు’ అంశంపై గురువారం నిర్వహించిన సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ‘‘మహానీయుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం సిద్ధించింది. వారి ప్రతి రక్తపు బొట్టు, స్ఫూర్తితోనే రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రపంచ దేశాల్లో ఎన్నో రాజ్యాంగాలను, చట్టాలను అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దేశవనరులను ప్రజలందరికీ సమానంగా పంపిణీ లక్ష్యంతో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు పొందుపరిచారు. వీటన్నింటిపై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలి. రాజ్యాంగం, చట్టంపై అవగాహన కలిగిన వ్యక్తులనే ఎన్నుకుంటే చట్టాలు పూర్తిస్థాయిలో అమలై ప్రజలకు మేలు జరుగుతుంది. యువత ఆ దిశగా సంకల్పబలంతో ముందుకు సాగాలి’’ అని జస్టిస్ చంద్రకుమార్ ఉద్బోధిం చారు. సదస్సుకు ప్రముఖ కంటివైద్యులు పి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన ముఖాముఖిలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు న్యాయమూర్తి బదులిచ్చారు. విజయవాడ నలందా విద్యానికేతన్‌ను సందర్శించిన ఆయన అక్కడ కూడా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్భ య చట్టం గురించి, రాజకీయాల్లో డబ్బు ప్రాధాన్యత, రిజర్వేషన్లు తదితర అంశాలపై సంధిం చిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.