ఇది చరిత్రాత్మక తీర్పు. ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపగల తీర్పు. ‘‘పర్యావరణ మార్పుల దుష్ప్రభావం నుంచి విముక్తి’’ని సైతం ప్రత్యేకమైన ప్రాథమిక హక్కుగా భారత సర్వోన్నత న్యాయస్థానం తొలిసారిగా గుర్తించింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14), వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు (ఆర్టికల్ 21)ల విస్తృత పరిధిలోకే అదీ వస్తుందంటూ గత వారం సుప్రీమ్ పేర్కొనడం విశేషం.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టమేక పిట్ట), లెస్సర్ ఫ్లోరికాన్ (గడ్డి నెమలి) లాంటి అంతరిస్తున్న పక్షుల పరిరక్షణకు సంబంధించిన ఓ కేసు విచారణలో కోర్ట్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పక్షులను కాపాడడం, పర్యావరణ పరిరక్షణ... రెండూ కీలకమైన లక్ష్యాలంటూనే, ఒకదాని కోసం మరొకదాన్ని బలి చేయకుండా సమగ్ర వైఖరిని అవలంబించడం అవసరమని స్పష్టం చేసింది. పర్యావరణ మార్పులపై ఉదాసీనంగా ఉన్న పాలకులకు బాధ్యతను గుర్తు చేసింది.
గతంలోకి వెళితే, పక్షుల రక్షణ కోసం 2021లో గుజరాత్, రాజస్థాన్‌లలోని 99 వేల చదరపు కి.మీ.ల పైగా ప్రాంతంలో ఎత్తైన విద్యుత్ లైన్లపై సుప్రీమ్ ధర్మాసనం పూర్తి నిషేధం విధించింది. సౌరఫలకాల ప్రాజెక్టుల వద్ద వేసిన ఎత్తైన వైర్లకు తగిలి పక్షులు మరణిస్తుండడంతో ఈ వివాదం రేగి, నిషేధం దాకా వచ్చింది. అయితే సౌర, పవన విద్యుచ్ఛక్తికి అవకాశం ఉన్న ప్రాంతంలో భూగర్భ విద్యుత్ కేబుళ్ళనే అనుమతిస్తే, స్వచ్ఛ ఇంధన లక్ష్యాలలో భారత్ వెనుకబడుతుందని కోర్ట్ తాజాగా భావించింది.
పర్యావరణంపై ప్రపంచ ప్రయత్నాలకు అది అవరోధమనీ, పైపెచ్చు జీవించే హక్కు, సమానత్వపు హక్కు, ఇంధనం అందుబాటు లాంటి ప్రాథమిక హక్కులకు ముప్పు అనీ అభిప్రాయ పడింది. పక్షులను రక్షిస్తూనే, పర్యావరణాన్ని పరిరక్షించేలా సమతూకం పాటించడంపై దృష్టి పెట్టా లంటూ, విద్యుత్‌లైన్లపై ఏకపక్ష నిషేధాన్ని తొలగించింది. మార్చి 21న ఈ ఉత్తర్విచ్చినా శనివారం మొత్తం తీర్పును అప్‌లోడ్ చేయడంతో పర్యావరణంపై జడ్జీల విస్తృత చర్చ బయటకొచ్చింది.
ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి. పర్యావరణ మార్పులపై భారత్‌లో చట్టం లేనంత మాత్రాన వాటి దుష్ప్ర భావాల నుంచి భద్రతకు భారతీయులకు హక్కు లేదని కాదు అని కోర్ట్ కుండబద్దలు కొట్టింది. పర్యావరణ మార్పుతో సమానత్వపు హక్కుపై ఎంత ప్రభావం ఉంటుందో సోదాహరణంగా చర్చించింది.
పర్యావరణ మార్పు వల్ల ఒకచోట తిండికీ, నీటికీ కొరత ఏర్పడితే ధనికుల కన్నా బీదలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనీ, సమానత్వపు హక్కనే భావనే దెబ్బతింటుందనీ విశదీకరించడం విశేషం. క్లైమేట్ ఛేంజ్‌కూ, మానవ హక్కులకూ ఉన్న సంబంధాన్ని ప్యారిస్ ఒప్పందం గతంలోనే గుర్తించింది. అంతర్జాతీయ చట్టాల కింద గ్రీన్‌హౌస్ వాయువుల్ని తగ్గిస్తూనే, ఆరోగ్య వాతావరణంలో జీవించడానికి ప్రజలకున్న ప్రాథమిక హక్కును కాపాడాలని సుప్రీమ్ పేర్కొనడం కీలకాంశం.
ఇది స్వాగతించాల్సిన విషయం. ఆ మాటకొస్తే పర్యావరణ పరిరక్షణను హక్కుల కోణంలో నుంచి వ్యాఖ్యానించడం సుప్రీమ్ చాలాకాలంగా చేస్తున్నదే. కాలుష్యరహిత వాతావరణంలో బతకడమ నేది జీవించే హక్కులో భాగమని దశాబ్దాల క్రితమే పేర్కొంది. స్వచ్ఛమైన నీరు, గాలి అనేవి ప్రజల హక్కు అని గత నెలలోనూ వ్యాఖ్యానించింది. తాజా తీర్పు వాటికి కొనసాగింపు.
అయితే, దేశంలోని కోట్లాది ప్రజానీకాన్ని పర్యావరణ దుష్ప్రభావాల నుంచి విముక్తం చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త తీర్పు అయినా పూనిక నిస్తుందా అన్నది ప్రశ్న. అసలు స్వచ్ఛమైన, ఆరోగ్య కరమైన వాతావరణంలో బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ, వనరుల దుర్వినియోగం, మార్కెట్ శక్తుల ప్రకృతి విధ్వంసం, పెరిగిపోతున్న వినిమయవాదం ప్రాణాల మీదకు తెస్తోంది.
తెలిసైనా, తెలియకైనా అలా పర్యావరణ హాని చేయడమంటే మనిషి జీవించే హక్కును నిరాకరించడమే! జీవితాలనూ, జీవనోపాధినీ దెబ్బ తీస్తున్న ఈ పరిస్థితులు మానవాళి ఉనికికే ఎదురైన సవాళ్ళు. పైపెచ్చు, ధనికులతో పోలిస్తే దారితెన్నూ లేని బీదసాదలపై ఈ ప్రభావం అధికమని అందరూ అంగీకరిస్తున్నదే. ఆ పరిస్థితులు కొనసాగరాదన్నదే సుప్రీమ్ ఆదేశం అందిస్తున్న సందేశం.
వర్షపాతాల్లో మార్పులు, వేళ కాని వేళ వడగాడ్పులు రాగల కాలంలో మరింత పెరగనున్నాయని ప్రపంచ సంస్థలు భారత్‌ను ఇప్పటికే హెచ్చరించాయి. హిమానీనదాలు కరుగుతున్నా, సముద్రమట్టాలు పెరుగుతున్నా, రాజధానిలోనే స్వచ్ఛమైన గాలి కరవైనా అవేవీ పాలకులకు ప్రాధాన్యాలుగా కనపడక పోవడం దౌర్భాగ్యం. ఆ తలనొప్పి విద్యావేత్తలు, ఉద్యమ కారులు, పౌరసమాజ బృందాలదేనని పొరబడుతున్న వేళ సుప్రీమ్ తీర్పు చెంపపెట్టు.
పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేసి, ప్రభుత్వాలు చేపడుతున్న అనేక విధానాలు ఇవాళ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయనేది నిష్ఠురసత్యం. దానికి తోడు కనీస స్పృహ లేకుండా నేల, నింగి, గాలి, నీరును కలుషితం చేయడంలో అందరం పోటీలు పడుతున్నాం. పర్యవసానాలే ఇప్పుడు చూస్తున్న అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, ఇంకా అనేకానేక పర్యావరణ దుష్ప్రభావాలు.
ఈ పరిస్థితుల్లో సుప్రీమ్ గుర్తించిన ఈ ప్రత్యేక హక్కు పార్లమెంట్‌కు మేలుకొలుపు కావాలి. పర్యావరణంపై కుంభకర్ణ నిద్ర నుంచి ఇకనైనా పాలకులు మేల్కోవాలి. ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగాల్సి ఉంది. వనరుల సమర్థ వినియోగంపై చర్యలు చేపట్టి, అందరిలో అవగాహన పెంచాల్సి ఉంది. లేదంటే, ఈ తాజా తీర్పు ఆసరాగా పౌరులు తమ హక్కును కాపాడుకొనేందుకు చట్టపరమైన మార్గాలను అనుసరించే వీలు ఉండనే ఉంటుంది.
సుప్రీమ్ తేల్చిన ప్రత్యేక హక్కు
Published Wed, Apr 10 2024 12:27 AM | Last Updated on Wed, Apr 10 2024 12:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment