Environmental issues
-
సుప్రీమ్ తేల్చిన ప్రత్యేక హక్కు
ఇది చరిత్రాత్మక తీర్పు. ప్రభుత్వ విధానాలపై ప్రభావం చూపగల తీర్పు. ‘‘పర్యావరణ మార్పుల దుష్ప్రభావం నుంచి విముక్తి’’ని సైతం ప్రత్యేకమైన ప్రాథమిక హక్కుగా భారత సర్వోన్నత న్యాయస్థానం తొలిసారిగా గుర్తించింది. రాజ్యాంగం కల్పించిన సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14), వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు (ఆర్టికల్ 21)ల విస్తృత పరిధిలోకే అదీ వస్తుందంటూ గత వారం సుప్రీమ్ పేర్కొనడం విశేషం. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టమేక పిట్ట), లెస్సర్ ఫ్లోరికాన్ (గడ్డి నెమలి) లాంటి అంతరిస్తున్న పక్షుల పరిరక్షణకు సంబంధించిన ఓ కేసు విచారణలో కోర్ట్ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పక్షులను కాపాడడం, పర్యావరణ పరిరక్షణ... రెండూ కీలకమైన లక్ష్యాలంటూనే, ఒకదాని కోసం మరొకదాన్ని బలి చేయకుండా సమగ్ర వైఖరిని అవలంబించడం అవసరమని స్పష్టం చేసింది. పర్యావరణ మార్పులపై ఉదాసీనంగా ఉన్న పాలకులకు బాధ్యతను గుర్తు చేసింది. గతంలోకి వెళితే, పక్షుల రక్షణ కోసం 2021లో గుజరాత్, రాజస్థాన్లలోని 99 వేల చదరపు కి.మీ.ల పైగా ప్రాంతంలో ఎత్తైన విద్యుత్ లైన్లపై సుప్రీమ్ ధర్మాసనం పూర్తి నిషేధం విధించింది. సౌరఫలకాల ప్రాజెక్టుల వద్ద వేసిన ఎత్తైన వైర్లకు తగిలి పక్షులు మరణిస్తుండడంతో ఈ వివాదం రేగి, నిషేధం దాకా వచ్చింది. అయితే సౌర, పవన విద్యుచ్ఛక్తికి అవకాశం ఉన్న ప్రాంతంలో భూగర్భ విద్యుత్ కేబుళ్ళనే అనుమతిస్తే, స్వచ్ఛ ఇంధన లక్ష్యాలలో భారత్ వెనుకబడుతుందని కోర్ట్ తాజాగా భావించింది. పర్యావరణంపై ప్రపంచ ప్రయత్నాలకు అది అవరోధమనీ, పైపెచ్చు జీవించే హక్కు, సమానత్వపు హక్కు, ఇంధనం అందుబాటు లాంటి ప్రాథమిక హక్కులకు ముప్పు అనీ అభిప్రాయ పడింది. పక్షులను రక్షిస్తూనే, పర్యావరణాన్ని పరిరక్షించేలా సమతూకం పాటించడంపై దృష్టి పెట్టా లంటూ, విద్యుత్‌లైన్లపై ఏకపక్ష నిషేధాన్ని తొలగించింది. మార్చి 21న ఈ ఉత్తర్విచ్చినా శనివారం మొత్తం తీర్పును అప్లోడ్ చేయడంతో పర్యావరణంపై జడ్జీల విస్తృత చర్చ బయటకొచ్చింది. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు దీర్ఘకాలిక ప్రభావం చూపనున్నాయి. పర్యావరణ మార్పులపై భారత్‌లో చట్టం లేనంత మాత్రాన వాటి దుష్ప్ర భావాల నుంచి భద్రతకు భారతీయులకు హక్కు లేదని కాదు అని కోర్ట్ కుండబద్దలు కొట్టింది. పర్యావరణ మార్పుతో సమానత్వపు హక్కుపై ఎంత ప్రభావం ఉంటుందో సోదాహరణంగా చర్చించింది. పర్యావరణ మార్పు వల్ల ఒకచోట తిండికీ, నీటికీ కొరత ఏర్పడితే ధనికుల కన్నా బీదలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనీ, సమానత్వపు హక్కనే భావనే దెబ్బతింటుందనీ విశదీకరించడం విశేషం. క్లైమేట్ ఛేంజ్‌కూ, మానవ హక్కులకూ ఉన్న సంబంధాన్ని ప్యారిస్ ఒప్పందం గతంలోనే గుర్తించింది. అంతర్జాతీయ చట్టాల కింద గ్రీన్హౌస్ వాయువుల్ని తగ్గిస్తూనే, ఆరోగ్య వాతావరణంలో జీవించడానికి ప్రజలకున్న ప్రాథమిక హక్కును కాపాడాలని సుప్రీమ్ పేర్కొనడం కీలకాంశం. ఇది స్వాగతించాల్సిన విషయం. ఆ మాటకొస్తే పర్యావరణ పరిరక్షణను హక్కుల కోణంలో నుంచి వ్యాఖ్యానించడం సుప్రీమ్ చాలాకాలంగా చేస్తున్నదే. కాలుష్యరహిత వాతావరణంలో బతకడమ నేది జీవించే హక్కులో భాగమని దశాబ్దాల క్రితమే పేర్కొంది. స్వచ్ఛమైన నీరు, గాలి అనేవి ప్రజల హక్కు అని గత నెలలోనూ వ్యాఖ్యానించింది. తాజా తీర్పు వాటికి కొనసాగింపు. అయితే, దేశంలోని కోట్లాది ప్రజానీకాన్ని పర్యావరణ దుష్ప్రభావాల నుంచి విముక్తం చేసేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడానికి ఈ కొత్త తీర్పు అయినా పూనిక నిస్తుందా అన్నది ప్రశ్న. అసలు స్వచ్ఛమైన, ఆరోగ్య కరమైన వాతావరణంలో బ్రతికే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ, వనరుల దుర్వినియోగం, మార్కెట్ శక్తుల ప్రకృతి విధ్వంసం, పెరిగిపోతున్న వినిమయవాదం ప్రాణాల మీదకు తెస్తోంది. తెలిసైనా, తెలియకైనా అలా పర్యావరణ హాని చేయడమంటే మనిషి జీవించే హక్కును నిరాకరించడమే! జీవితాలనూ, జీవనోపాధినీ దెబ్బ తీస్తున్న ఈ పరిస్థితులు మానవాళి ఉనికికే ఎదురైన సవాళ్ళు. పైపెచ్చు, ధనికులతో పోలిస్తే దారితెన్నూ లేని బీదసాదలపై ఈ ప్రభావం అధికమని అందరూ అంగీకరిస్తున్నదే. ఆ పరిస్థితులు కొనసాగరాదన్నదే సుప్రీమ్ ఆదేశం అందిస్తున్న సందేశం. వర్షపాతాల్లో మార్పులు, వేళ కాని వేళ వడగాడ్పులు రాగల కాలంలో మరింత పెరగనున్నాయని ప్రపంచ సంస్థలు భారత్‌ను ఇప్పటికే హెచ్చరించాయి. హిమానీనదాలు కరుగుతున్నా, సముద్రమట్టాలు పెరుగుతున్నా, రాజధానిలోనే స్వచ్ఛమైన గాలి కరవైనా అవేవీ పాలకులకు ప్రాధాన్యాలుగా కనపడక పోవడం దౌర్భాగ్యం. ఆ తలనొప్పి విద్యావేత్తలు, ఉద్యమ కారులు, పౌరసమాజ బృందాలదేనని పొరబడుతున్న వేళ సుప్రీమ్ తీర్పు చెంపపెట్టు. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేసి, ప్రభుత్వాలు చేపడుతున్న అనేక విధానాలు ఇవాళ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయనేది నిష్ఠురసత్యం. దానికి తోడు కనీస స్పృహ లేకుండా నేల, నింగి, గాలి, నీరును కలుషితం చేయడంలో అందరం పోటీలు పడుతున్నాం. పర్యవసానాలే ఇప్పుడు చూస్తున్న అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు, ఇంకా అనేకానేక పర్యావరణ దుష్ప్రభావాలు. ఈ పరిస్థితుల్లో సుప్రీమ్ గుర్తించిన ఈ ప్రత్యేక హక్కు పార్లమెంట్‌కు మేలుకొలుపు కావాలి. పర్యావరణంపై కుంభకర్ణ నిద్ర నుంచి ఇకనైనా పాలకులు మేల్కోవాలి. ప్రభుత్వాలు తక్షణమే రంగంలోకి దిగాల్సి ఉంది. వనరుల సమర్థ వినియోగంపై చర్యలు చేపట్టి, అందరిలో అవగాహన పెంచాల్సి ఉంది. లేదంటే, ఈ తాజా తీర్పు ఆసరాగా పౌరులు తమ హక్కును కాపాడుకొనేందుకు చట్టపరమైన మార్గాలను అనుసరించే వీలు ఉండనే ఉంటుంది. -
పర్యావరణ సంరక్షణ.. అందరికీ అర్థమయ్యేలా ఇమోజీ, కార్టూన్లతో
‘కళ కళ కోసమే కాదు... పర్యావరణ సంరక్షణ కోసం కూడా’ అంటోంది యువతరం. సంక్లిష్టమైన పర్యావరణ అంశాలను సులభంగా అర్థం చేయించడానికి, పర్యావరణ స్పృహను రేకెత్తించడానికి గ్రాఫిటీ వర్క్, ఇల్లస్ట్రేషన్, ఇమోజీ, కార్టూన్లను బలమైన మాధ్యమంగా ఉపయోగించుకుంటుంది. ఆర్ట్, హ్యూమర్‌లను కలిపి తన ఇలస్ట్రేషన్లతో పర్యావరణ సంరక్షణకు సంబంధించిన అంశాలను ప్రచారం చేస్తున్నాడు రోహన్ చక్రవర్తి. కామిక్స్, కార్టూన్లు, ఇలస్ట్రేషన్ సిరీస్‌లతో ‘గ్రీన్ హ్యూమర్’ సృష్టించాడు. రెండు జాతీయ పత్రికల్లో వచ్చిన ఈ సిరీస్‌ను పుస్తకంగా ప్రచురించాడు. తన కృషికి ఎన్నో అవార్ట్లు వచ్చాయి. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు రోహన్ చక్రవర్తి కార్టూన్లను పర్యావరణ పరిరక్షణ ప్రచారానికి వినియోగించుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన రోహన్ పదహారు సంవత్సరాల వయసు నుంచే కార్టూన్లు వేయడం మొదలుపెట్టాడు.‘పర్యావరణ సంక్షోభ తీవ్రతను కామిక్స్‌తో బలంగా చెప్పవచ్చు. శాస్త్రీయ విషయాలపై ఆసక్తి ఉన్న వారినే కాదు, వాటిపై అవగాహన లేని వారిని కూడా ఆకట్టుకొని మనం చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సులభంగా చెప్పవచ్చు’ అంటున్నాడు రోహన్ చక్రవర్తి. కార్టూనిస్ట్, గ్రాఫిక్ స్టోరీ టెల్లర్ పూర్వ గోయెల్ తన కళను పర్యావరణ సంబంధిత అంశాల ప్రచారానికి ఉద్యమస్థాయిలో ఉపయోగిస్తోంది. పర్యావరణ నిపుణులు, పరిశోధకులు, పర్యావరణ ఉద్యమ సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ‘అన్ని వయసుల వారిని ఆకట్టుకొని, అర్థం చేయించే శక్తి కార్టూన్లకు ఉంది’ అంటోంది 26 సంవత్సరాల పూర్వ గోయెల్.పశ్చిమ కనుమల జీవవైవిధ్యానికి వాటిల్లుతున్న ముప్పు నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని దిబంగ్ లోయలోని మిష్మి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల వరకు పూర్వ గోయెల్ తన కళ ద్వారా ఆవిష్కరించింది. అభివృద్ధిగా కనిపించే దానిలోని అసమానతను ఎత్తి చూపింది. డెహ్రడూన్‌కు చెందిన పూర్వ గోయెల్ నదులు, అడవులు ఎదుర్కొంటున్న జీవన్మరణ సమస్యను దగ్గరి నుంచి చూసింది. బెల్జియంలో గ్రాఫిక్ స్టోరీ టెల్లింగ్‌లో మాస్టర్స్ చేసింది. ఐక్యరాజ్య సమితి జీవవైవిధ్యం అంశంపై కెనడాలో నిర్వహించిన సదస్సుకు హాజరైంది.‘ఆ సదస్సులో వక్తలు పర్యావరణ విధానాల గురించి సంక్లిష్టంగా మాట్లాడారు. సామాన్యులు ఆ ప్రసంగ సారాన్ని అర్థం చేసుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ అర్థమయ్యేలా పర్యావరణ విషయాలను చె΄్పాలనుకున్నాను. దీనికి నా కుంచె ఎంతో ఉపయోగపడింది. నన్ను నేను కమ్యూనికేటర్‌గా భావించుకుంటాను’ అంటుంది పూర్వ గోయెల్. ఒక స్వచ్ఛంద సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా కామిక్ బుక్ తయారుచేసింది గోయెల్. ఈ కామిక్ బుక్కు అనూహ్యమైన స్పందన వచ్చింది. ‘మేము ఎన్నో రిపోర్ట్లు విడుదల చేశాం. కాని ఒక్క రిపోర్ట్ చదవడానికి కూడా మా ఎకౌంటెంట్ ఆసక్తి చూపించలేదు. కామిక్స్ రూపంలో ఉన్న రిపోర్ట్ ఆమెకు బాగా నచ్చింది. కామిక్స్ ద్వారా తెలుసుకున్న విషయాలను ఇతరులకు చెప్పడం మొదలు పెట్టింది’ అని ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినప్పుడు ఉత్సాహం రూపంలో గోయెల్‌కు ఎంతో శక్తి వచ్చి చేరింది. ‘గ్రాఫిక్ డిజైన్‌లో భాగంగా బ్రాండ్ డిజైన్ నుంచి పబ్లికేషన్ డిజైన్ వరకు ఎన్నో చేయవచ్చు. కాని నాకు కామిక్ స్ట్రిప్స్ అంటేనే ఇష్టం. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్‌ను సంక్షిప్తంగానే కాదు అర్థమయ్యేలా చెప్పవచ్చు. ఒకటి లేదా రెండు వాక్యాలు, ఇమేజ్‌లతో పెద్ద స్టోరీని కూడా చెప్పవచ్చు’ అంటున్న అశ్విని మేనన్ గ్రాఫిక్ డిజైన్‌ను పర్యావరణ అంశాల ప్రచారానికి బలమైన మాధ్యమంగా చేసుకుంది.బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో చదువుకున్న అశ్విని కళకు సామాజిక ప్రభావం కలిగించే శక్తి ఉందని గ్రహించింది. తన కళను సమాజ హితానికి ఉపయోగించాలనుకుంది. రిచీ లైనల్ ప్రారంభించిన డాటా స్టోరీ టెల్లింగ్ సంస్థ ‘బెజలెల్ డాటా’ అసాధారణ ఉష్ణోగ్రతలకు సంబంధించిన సంక్లిష్టమైన సమాచారం అందరికీ సులభంగా, వేగంగా అర్థమయ్యేలా యానిమేటెట్ ఇమోజీలను క్రియేట్ చేస్తోంది.‘సంప్రదాయ రిపోర్ట్ స్ట్రక్చర్స్ ప్రకారం వెళితే అందరికీ చేరువ కాకపోవచ్చు. రిపోర్ట్ సారాంశాన్ని సులభంగా అర్థం చేసుకునేలా డాటా కామిక్స్ ఉపయోగపడతాయి. పెద్ద వ్యాసం చదువుతున్నట్లుగా కాకుండా ఇతరులతో సంభాషించినట్లు ఉంటుంది’ అంటున్న రిచీ లైనల్ ఎన్నో స్టోరీ టెల్లింగ్ వర్క్‌షాప్‌లు నిర్వహించాడు క్లైమెట్ డాటాపై అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీతో కలిసి పనిచేశాడు. సంక్లిష్టమైన విషయాలను సంక్షిప్తంగా, సులభంగా అర్థమయ్యేలా చేయడానికి రిచీ లైనల్ అనుసరిస్తున్న మార్గంపై యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది. మెరైన్ బ్లాగిస్ట్, నేచర్ ఫొటోగ్రాఫర్ గౌరవ్ పాటిల్ రాతలతోనే కాదు ఇలస్ట్రేషన్స్, ఫొటోలతో పర్యావరణ సంబంధిత అంశాలను ప్రచారం చేస్తున్నాడు. సముద్ర కాలుష్యం నుంచి కాంక్రీట్ జంగిల్స్ వరకు ఎన్నో అంశాల గురించి తన ఇల్లస్ట్రేషన్ల ద్వారా చెబుతున్నాడు.బెంగళూరుకు చెందిన అక్షయ జకారియ వైల్డ్‌లైఫ్ డాక్యుమెంటరీలు చూస్తూ పెరిగింది. పర్యావరణంపై ఆసక్తి పెంచుకోవడానికి అది కారణం అయింది. పర్యావరణ సంరక్షణపై అవగాహనకు ఇలస్ట్రేషన్, డిజైన్లను ఉపయోగిస్తోంది. రోహన్ చక్రవర్తి నుంచి అక్షయ వరకు పర్యావరణ అంశాలపై ఆసక్తి పెంచుకోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. అయితే అందరినీ ప్రకృతి ప్రపంచంలోకి తీసుకువచ్చింది అనురక్తి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువైన అంకితభావం కూడా. -
ఐరాస అవార్డుకు ఎంపికైన భారతీయుడు
ఐక్యరాజ్యసమితి: పర్యావరణ సమస్యలను ఎదుర్కోవడానికి సృజనాత్మక పరిష్కారాలను సూచించే వారికి ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రకటించే ‘యంగ్ చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్–2020’ విజేతల్లో భారత్‌కు చెందిన విద్యుత్ మోహన్ (29) కూడా నిలిచారు. ఈ అవార్డుకు మొత్తం ఏడు మంది ఎంపికయ్యారు. వృత్తిరీత్యా ఇంజినీర్ అయిన విద్యుత్.. మిగిలిపోయిన పంటను ప్రత్యేక పద్ధతిలో కాల్చడం ద్వారా రైతులకు ఆదాయం చేకూరే విధానాన్ని గురించి ప్రచారం చేసినందుకుగానూ ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. పంటను యాక్టివేటెడ్ కార్బన్‌లుగా మార్చి వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చని ప్రచారం చేశాడు. పేదలకు ఆదాయం వచ్చే మార్గాల గురించి చెప్పడం తనకు ఇష్టమని విద్యుత్ అన్నారు. కరోనాతో ప్రపంచం బాధపడుతున్న వేళ పర్యావరణహితం కోరి ఈ ఏడు మంది చేసిన ప్రయత్నాలకు ఈ అవార్డును ప్రకటించినట్లు ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో అన్నారు. -
‘అయ్యప్ప’కు పొంచి ఉన్న పెను వివాదం
సాక్షి, న్యూఢిల్లీ : శబరిమలలోని అయ్యప్ప ఆలయానికి మరో పెను వివాదం పొంచి ఉంది. ఆ వివాదానికి కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులే కారణం అవుతాయనడంలో సందేహం లేదు. అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ప్రస్తుతం వివాదం రగులుతున్న విషయం తెల్సిందే. ఈ వివాదం కారణంగానే సుప్రీం కోర్టు అయ్యప్ప ఆలయానికి సంబంధించి జారీ చేసిన మరో ఉత్తర్వులు మరుగున పడిపోయాయి. శబరిమల పరిసర ప్రాంతాల్లోని అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని జస్టిస్ మదన్ బీ లోకుర్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచీ నవంబర్ 2వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. మొదటి వివాదం భక్తుల నమ్మకానికి సంబంధించినది కాగా, పొంచి ఉన్న వివాదం పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది. ఒకప్పుడు సన్నిదానంలో శబరిమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండేది. ఇప్పుడు దాని చుట్టూ 63.5 ఎకరాల పరిధిలో చెట్లుపోయి కాంక్రీటు జంగిల్ ఆవిర్భవించింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలంటే ఈ కాంక్రీటు జంగిల్లో 90 శాతం కట్టడాలను కూల్చాల్సిందే. శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణ పరిస్థితులను పరిరక్షించాలంటూ కోజికోడ్‌కు చెందిన సామాజిక కార్యకర్త శోభీంద్రన్ నాలుగేళ్ల క్రితం సుప్రీం కోర్టులో పిల్ వేశారు. దాంతో శబరిమల ఆలయం పరిసరాల్లో పర్యావరణానికి హాని కలిగించే అక్రమ కట్టడాలను పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఓ కేంద్ర కమిటీని సుప్రీం కోర్టు ఆదేశించింది. అటవి ప్రాంతాల్లో గనులు, పరిశ్రమలకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల అమలును పర్యవేక్షించే కమిటీయే ఇది. ఈ కమిటీ ఇటీవలనే సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో అనేక భయానక వాస్తవాలు బయట పడ్డాయి. శబరిమల ఆలయం భక్తుల నుంచి వస్తున్న భారీ ఆదాయానికి ఆశపడి 1998లో కేరళ అసెంబ్లీ ఆమోదించిన ఆలయం మాస్టర్ ప్లాన్‌నే కాకుండా ఆ తర్వాత 2007లో తీసుకొచ్చిన సవరణ ప్లాన్‌ను కూడా ఉల్లంఘించి కేరళ దేవసం బోర్డు పలు అక్రమాలను నిర్మించిన విషయాన్ని కమిటీ నివేదిక వెల్లడించింది. శబరిమల ఆలయ పరిసర కొండల్లో పుడుతున్న పంబా నదీ ప్రవాహాన్ని దెబ్బతీసేలా నది ఒడ్డునే కాకుండా నది ప్రవహించే ప్రదేశంలో కూడా అక్రమ కట్టడాలు నిర్మించారట. అందుకనే గత ఆగస్టులో వచ్చిన పంబా వరదల వల్ల రెండంతస్థుల మురుగుదొడ్ల భవనాలు, భక్తుల క్లాక్‌రూమ్‌లు, ఓ రెస్టారెంట్ కూలిపోయాయని నివేదిక తెలిపింది. ఆ మరుగుదొడ్ల స్థానంలో మరోచోట మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదు. పర్యవసానంగా భక్తులు భహిర్భూమిని ఆశ్రయిస్తున్నారట. పంబా నది కాలుష్యం కాకుండా నియంత్రించేందుకు రెండు సివరేజ్ ప్లాంట్లను నిర్మించినా అందులో ఒకదాన్నే ఆపరేట్ చేస్తున్నారు. దానికి కూడా అన్ని మరుగు దొడ్ల కాల్వలను అనుసంధానించలేదు. కొన్ని కాల్వలు నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పైగా ఆగస్టులో వచ్చిన వరదల్లో ఈ రెండు సీవరేజ్ ప్లాంట్లు, మరుగుదొడ్డి కాల్వలు దెబ్బతిన్నాయి. ఆ కాల్వలు కూడా ఒవర్ ఫ్లోఅయి నేరుగా పంబా నదిలో కలుస్తున్నాయి. పర్యవసానంగా నీటిలో ‘ఫేకాల్ కోలిఫామ్ బ్యాక్టీరియా’ కనీసం ఊహకు కూడా అందనంతగా పెరిగిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. స్నానం చేయడానికి పనికి వచ్చే నీటిలో ‘ప్రతి 100 ఎంఎల్ నీటికి 2,500 ఎంపీఎన్’ కన్నా ఈ బ్యాక్టీరియా తక్కువ ఉండాలట. 2014–2015లో సేకరించిన శాంపిల్ నీటిలోనే ‘100 ఎంల్ నీటికి బ్యాక్టీరియా 13,20,000 ఎంపీఎన్’ ఉందట. అంటే ఉండాల్సిన దానికన్నా 500 రెట్లు ఎక్కువ. సీవరేజ్ ప్లాంటులు, మురుగు కాల్వలు దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల్లోబ్యాక్టీరియా మరింత ప్రమాదకరంగా ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అడవి పందులు వచ్చి నీటిని తాగుతున్నాయంటేనే అందులో ఈ బ్యాక్టీరియా ఎక్కువగా ఉందని అర్థం అట. అయ్యప్ప ఆలయంకు వచ్చే భక్తులు విధిగా ఈ పంబా నదిలో స్నానం ఆచరిస్తారు. అంతేకాకుండా పట్టణం మిట్ట, అలప్పూజ, కొట్టాయం జిల్లాల్లోని దాదాపు 50 లక్షల మంది ప్రజలు తాగునీటి కోసం ఈ నదిపైనే ఆధారపడుతున్నారు. నవంబర్ 17వ తేదీన ప్రారంభమైన ‘మండల మకరవిలక్కు’ సీజన్లో భక్తుల రద్దీ మరింత పెరగడం వల్ల పంబా నదికి వాటిల్లే కాలుష్యాన్ని అంచనా కూడా వేయలేకపోతున్నామని పంబా పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి నక్కే సుకుమారన్ నాయర్ లాంటి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎన్ని అభ్యంతరాలు చెప్పినా వినకుండా నది ఒడ్డుకు 50 మీటర్ల దూరంలోనే కేరళ దేవసం బోర్డు పనుల నిర్వహణా భవనాన్ని కూడా నిర్మించారని ఆయన తెలిపారు. నీలక్కల్ వద్ద భక్తుల సౌకర్యాల కోసం 2007లో సవరించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 250 ఎకరాలను కేరళ ప్రభుత్వం కేటాయించినా పట్టించుకోకుండా సన్నిధానంలోనే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని నాయర్ ఆరోపించారు. గత నెలలోనే సన్నిదానంలో 52 గదుల అతిథి గృహాన్ని కేరళ దేవసం మంత్రి కే. సురేంద్రన్ ప్రారంభించారు. సన్నిదానం, పంబా ప్రాంతాల్లోనే కాకుండా నీలక్కల్ వద్ద కూడా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని కేంద్ర కమిటీ పేర్కొంది. వాటన్నింటిని కూల్చివేయాల్సిందిగా కేరళ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేయడం తన కర్తవ్యమని అయ్యప్ప ఆలయంలోకి మహిళలను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్న కేరళ ప్రభుత్వం కూల్చివేతల విషయంలో కూడా సుప్రీం కోర్టు ఉత్తర్వులకు కట్టుబడి ఉంటుందా? కూల్చివేతల వల్ల భక్తులకు ఎదురయ్యే ఇబ్బందులను ఎలా ఎదుర్కొంటుంది? భక్తులుగానీ, భక్తుల తరఫున హిందూ సంఘాలుగానీ కూల్చివేతలను అనుమతిస్తాయా? -
మూత్రంతోనూ విద్యుత్!
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. విద్యుదుత్పత్తికి గాలి, నీరు, సూర్యుడు, మూత్రం కాదేదీ అనర్హం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓ పక్క పర్యావరణ సమస్యలు, మరో పక్క పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్. ఈ డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు వివిధ వనరుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. తాజాగా లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్కు చెందిన శాస్త్రవేత్తలు మూత్రం నుంచి విద్యుదుత్పత్తి చేశారు. మూత్రానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలను జోడించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేశారు. సేంద్రియ పదార్థాలు, మురికినీరు, బ్యాక్టీరియాల ద్వారా మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్‌ను ఉపయోగించి విద్యుత్ తయారుచేస్తారనే విషయం తెలిసిందే. ఇలాంటి ఫ్యూయల్ సెల్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. బాత్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి మూత్రంతో విద్యుదుత్పత్తి చేసే సెల్స్‌ను తయారుచేశారు. ప్రపంచంలోని ఏ మూలనైనా విద్యుదుత్పత్తి చేయొచ్చని శాస్త్రవేత్త మిరెల్లా డీ లొరెంజో పేర్కొన్నాడు. ఒక క్యూబిక్ మీటర్ పరిమాణమున్న సెల్ ద్వారా రెండు వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెప్పాడు. -
అమరావతి ఫైలును తిప్పిపంపిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణానికి పర్యావరణ అడ్డంకులు ఎదురయ్యాయి. నగర నిర్మాణానికి అనుమతి కోసం ఏపీ ప్రభుత్వం పంపిన ఫైలును కేంద్రం తిప్పి పంపింది. అటవీ భూమిని బదలాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. మొత్తం 19 వేల హెక్టార్ల భూమిని కోరడంపై కేంద్ర పర్యావరణ సలహా సమితి సందేహాలు వ్యక్తం చేసింది. డీనోటిఫికేషన్‌కు సంబంధించిన సమాచారం అసంపూర్తిగా ఉందని పర్యావరణ సలహా సమితి చెప్పింది. ఇప్పటికే రాజధాని నిర్మాణం విషయమై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
వాతావరణ్ ఫిల్మ్ ఫెస్టివల్
పర్యావరణ సమస్యలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడం కోసం 2002లో ఏర్పాటైన ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫోరమ్... సీఎంఎస్ వాతావరణ్. పర్యావరణం, వణ్యప్రాణుల సంరక్షణపై 26 రాష్ట్రాల్లోని 30 నగరాల్లో 39 ట్రావెలింగ్ ఫెస్టివల్స్ నిర్వహించింది. అలాగే ఇప్పటివరకు ఏడు కాంపిటేటివ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కూడా జరిపింది. ఈ ఏడాది అక్టోబర్ 9 నుంచి 12 వరకు ‘వాటర్ ఫర్ లైఫ్’ అంశంపై ఎనిమిదవ ఫిల్మ్ ఫెస్టివల్ దిల్లీలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ ఎడిషన్ కోసం 11 కేటగిరీల్లో ఔత్సాహికులైన ఇండియన్, ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ఎంట్రీలకు ఆహ్వానం పలుకుతోంది. ఎంట్రీలు పంపించాల్సిన చివరి తే ది మార్చ్ 22. ఎంట్రీ ఫాం, ఇతర వివరాలు సంస్థ వెబ్సైట్ www.cmsvatavaran.org చూడొచ్చు.