తమ పరిశోధనా ఫలితాలను తెలుపుతున్న బాత్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. విద్యుదుత్పత్తికి గాలి, నీరు, సూర్యుడు, మూత్రం కాదేదీ అనర్హం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓ పక్క పర్యావరణ సమస్యలు, మరో పక్క పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్. ఈ డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు వివిధ వనరుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. తాజాగా లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్‌కు చెందిన శాస్త్రవేత్తలు మూత్రం నుంచి విద్యుదుత్పత్తి చేశారు. మూత్రానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలను జోడించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేశారు.
సేంద్రియ పదార్థాలు, మురికినీరు, బ్యాక్టీరియాల ద్వారా మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్‌ను ఉపయోగించి విద్యుత్ తయారుచేస్తారనే విషయం తెలిసిందే. ఇలాంటి ఫ్యూయల్ సెల్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. బాత్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి మూత్రంతో విద్యుదుత్పత్తి చేసే సెల్స్‌ను తయారుచేశారు. ప్రపంచంలోని ఏ మూలనైనా విద్యుదుత్పత్తి చేయొచ్చని శాస్త్రవేత్త మిరెల్లా డీ లొరెంజో పేర్కొన్నాడు. ఒక క్యూబిక్ మీటర్ పరిమాణమున్న సెల్ ద్వారా రెండు వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెప్పాడు.