University of Bath
-
మూత్రంతోనూ విద్యుత్!
అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. విద్యుదుత్పత్తికి గాలి, నీరు, సూర్యుడు, మూత్రం కాదేదీ అనర్హం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఓ పక్క పర్యావరణ సమస్యలు, మరో పక్క పెరిగిపోతున్న విద్యుత్ డిమాండ్. ఈ డిమాండ్‌కు తగ్గట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు శాస్త్రవేత్తలు వివిధ వనరుల కోసం అన్వేషిస్తూనే ఉన్నారు. తాజాగా లండన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్కు చెందిన శాస్త్రవేత్తలు మూత్రం నుంచి విద్యుదుత్పత్తి చేశారు. మూత్రానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలను జోడించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేశారు. సేంద్రియ పదార్థాలు, మురికినీరు, బ్యాక్టీరియాల ద్వారా మైక్రోబియల్ ఫ్యూయల్ సెల్‌ను ఉపయోగించి విద్యుత్ తయారుచేస్తారనే విషయం తెలిసిందే. ఇలాంటి ఫ్యూయల్ సెల్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. బాత్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి మూత్రంతో విద్యుదుత్పత్తి చేసే సెల్స్‌ను తయారుచేశారు. ప్రపంచంలోని ఏ మూలనైనా విద్యుదుత్పత్తి చేయొచ్చని శాస్త్రవేత్త మిరెల్లా డీ లొరెంజో పేర్కొన్నాడు. ఒక క్యూబిక్ మీటర్ పరిమాణమున్న సెల్ ద్వారా రెండు వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెప్పాడు. -
కాఫీ రుచి...నీళ్లలో ఉంది!
సర్వే ఉదయం లేవగానే కాఫీ రుచి కోసం నాలుక గోల పెడుతూ ఉంటుంది. ఆ కాఫీ కూడా ఎలా ఉండాలంటే... మన నాలుక దాన్ని రుచి చూడటం కోసమే పుట్టినట్లనిపించాలి. అయితే ఒక్కొక్కరు చేసే కాఫీ అమృతంలా ఉంటుంది. కొందరు చేసేది అంత రుచించదు. ఎందుకింత తేడా? ఎందుకంటే... కాఫీ తయారీ విషయంలో ఎవరి ఫార్ములా వాళ్లకు ఉంటుంది. ఖరీదైన కాఫీ బీన్స్, చిక్కటి పాలతోనే తయారు చేసే కాఫీ చాలా టేస్ట్‌గా ఉంటుందనేది చాలా మంది చెప్పే మాట. నాణ్యమైన విత్తనాలతో తయారు చేసే కాఫీ మరీ రుచిగా ఉంటుందనేది మరికొందరు అనే మాట. అయితే కాఫీ టేస్ట్ దాన్ని తయారు చేసేందుకు వాడే విత్తనాల మీదనో, కాఫీ పౌడర్ మీదనో కాదు, తయారీకి వాడే నీళ్ల మీదే ఆధారపడి ఉంటుందని అంటున్నారు పరిశోధకులు. ఆశ్చర్యంగా ఉంది కదూ ఈ మాట! బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బాత్ పరిశోధకులు కాఫీ రుచుల మీద ఒక పెద్ద పరిశోధనే చేశారు. తద్వారా వాళ్లు కనిపెట్టిందేమిటంటే... కాఫీ తయారీలో వాడే నీళ్లను, ఆ నీళ్లలో ఉండే ఖనిజ లవణాలను బట్టి కాఫీ రుచి వస్తుందని! రోస్టెడ్ కాఫీ బీన్స్‌ను వేసి మరగ కాచినప్పుడు, ఆ గింజల్లోని రసాయనాలను నీళ్లు ఏ మేరకు సంగ్రహిస్తాయి అనేదాన్ని బట్టి కాఫీ రుచి ఉంటుందట. నీళ్లలోని మినరల్స్ స్థాయిని బట్టి ఆ రసాయనాలు కాఫీలో మిళితం అవుతాయట. అలా కెమికల్స్‌ను సంగ్రహించే శక్తి ఉన్న నీళ్లు పడితే కాఫీ అసలు రుచి ఏమిటో తెలుస్తుందని పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు. ఖరీదైన కాఫీ బీన్స్ వాడుతున్నప్పటికీ ఖనిజ లవణాల రహిత నీళ్లతో కాఫీ తయారు చేస్తే రుచిగా ఉండకపోవచ్చని, తక్కువ ధరలో లభించే కాఫీ విత్తనాలతో తయారు చేసే కాఫీ రుచిని కూడా అద్భుతంగా మార్చే శక్తి నీళ్లకు మాత్రమే ఉందని ఆ వర్సిటీ వాళ్లు తేల్చారు. కాఫీ రుచికి కీ ఎక్కడుందో తెలిసింది కదా... ఇక నీళ్ల మీద ఓ కన్నేయండి మరి!