
రోజులన్నీ ఒకేలా ఉండవు. ఈ పరమ సత్యం వైట్‌హౌస్ వేదికగా, ప్రపంచ మాధ్యమాల సాక్షిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి సంపూర్ణంగా అర్థమైవుంటుంది. హోంవర్క్ ఎగ్గొట్టిన కుర్రాడిని మందలించినట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ విరుచుకుపడుతుంటే జెలెన్‌స్కీ సంజాయిషీ ఇస్తూనే, అవకాశం చిక్కినప్పుడల్లా తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశారు.
ఆయన దయనీయ స్థితిని ప్రత్యక్షంగా తిలకించిన సాధారణ ప్రజానీకం సరే... అంతర్జాతీయంగా చిన్నా పెద్దా దేశాధినేతలందరూ విస్మయపడ్డారు. కాస్త వెనక్కు వెళ్తే జరిగిందంతా వేరు. గత మూడేళ్లుగా ఆయనకు ఎక్కడికెళ్లినా రాజలాంఛనాలు! అమెరికన్ కాంగ్రెస్‌లోనూ, పాశ్చాత్య దేశాల పార్లమెంట్లలోనూ, అవార్డు ప్రదానోత్సవాల్లోనూ, న్యూయార్క్ స్టాక్ ఎక్ఛ్సేజ్‌లోనూ ఆయనకు సాదర స్వాగతాలు!!
ఆయన కోరకుండానే మారణాయుధాలూ, యుద్ధ విమానాలూ, డాలర్లూ పెద్దయెత్తున వచ్చిపడ్డాయి. వాటి విలువ ట్రంప్ అంటున్నట్టు 35,000 కోట్ల డాలర్లా, జెలెన్‌స్కీ సవరించినట్టు 11,200 కోట్ల డాలర్లా అన్నది మున్ముందు తేలుతుంది. చిత్ర మేమంటే... ఆయనతో అమర్యాదకరంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ను పల్లెత్తు మాట అనని మీడియా, సూట్‌కు బదులు టీ షర్ట్ వేసుకురావటం అగ్రరాజ్యాధినేతను అవమానించినట్టేనని జెలెన్‌స్కీకి హితబోధ చేసింది!
ట్రంప్ తీరు దౌత్యమర్యాదలకు విఘాతమనీ, వర్ధమాన దేశాధినేతను కించపరుస్తూ, ఆధిపత్యం చలాయిస్తూ మాట్లాడటం సరికాదనీ వస్తున్న వాదనలు ముమ్మాటికీ సమర్థించదగినవే. కానీ అమెరికా వ్యవహార శైలి గతంలో కూడా భిన్నంగా లేదు. మర్యాదలివ్వటం మాట అటుంచి గిట్టని పాలకులను పదవీచ్యుతుల్ని చేయటం, తిరుగుబాట్లకు ప్రోత్సహించటం రివాజు. కాకపోతే ట్రంప్ బహిరంగంగా ఆ పని చేశారు.
అమెరికా చరిత్రనూ, పాశ్చాత్య దేశాల తీరుతెన్నులనూ చూస్తే ఎన్నో ఉదాహరణలు దొరుకుతాయి. 1946–49 మధ్య గ్రీస్‌లో రాచరిక నియంతృత్వంపై చెలరేగిన తిరుగుబాటును అణచటానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రూమన్ సైన్యాన్ని తరలించారు. క్యూబా, చిలీ, వియత్నాం, ఇరాన్ వగైరాల్లో ప్రభుత్వాలను కూలదోసి తనకు అనుకూలమైనవారిని ప్రతిష్ఠించేందుకు అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది.
ప్రచ్ఛన్న యుద్ధకాలంలో మనల్ని చీకాకు పరిచేందుకు పాకిస్తాన్‌లో సైనిక తిరుగుబాట్లకు ఉసి గొల్పింది అమెరికాయే. ప్రభుత్వాల కూల్చివేతకు క్యూబాలోనూ, ఇతరచోట్లా పన్నిన పథకాలను రిటైర్డ్ సీఐఏ అధికారులు ఏకరువు పెట్టారు. ఈ పరంపరలో పాశ్చాత్య దేశాలు అమెరికాతో కలిసి కొన్నీ, సొంతంగా కొన్నీ చేశాయి. మన దేశంలో దాదాపు 200 ఏళ్లు అధికారం చలాయించి ఇక్కడి సంపదను బ్రిటన్ కొల్లగొట్టింది.
ఆ దేశమే 1982లో ఫాక్‌ల్యాండ్ ద్వీపసముదాయం కోసం అర్జెంటీ నాపై యుద్ధం చేసి ఆక్రమించింది. ఇంకా 1990–91 నాటి గల్ఫ్ యుద్ధం, 1992–95 మధ్య కొన సాగిన బోస్నియా యుద్ధం, 1999లో కొసావో యుద్ధం, 2001లో ఉగ్రవాదంపై యుద్ధం పేరుతో మొదలెట్టి 2021 వరకూ సాగించిన అఫ్గాన్ యుద్ధం, 2003–2011 మధ్య సాగిన ఇరాక్ యుద్ధం, 2011లో జరిగిన లిబియా దురాక్రమణ... ఇవన్నీ అమెరికా–పాశ్చాత్య దేశాలు ‘నాటో’ ఛత్ర ఛాయలో సాగించిన యుద్ధాల్లో కొన్ని. ఈ దేశాల్లో మానవ హక్కుల హననం జరుగుతున్నదనీ, ప్రభుత్వాలు నియంత పోకడలు పోతున్నాయనీ సంజాయిషీ ఇచ్చారు. కానీ అక్కడ పౌరులు లేరా... వారు తిరగబడలేరా?
వాదోపవాదాల మధ్యన జెలెన్‌స్కీని ఉద్దేశించి ‘మీ దగ్గర పేకముక్కలు అయిపోయాయి’ అన్నారు ట్రంప్. అది వాస్తవం. ఒక వ్యంగ్యచిత్రకారుడు ఆ ఉదంతంపై వేసిన కార్టూన్ మాదిరే ఆయన్ను ఇన్నాళ్లూ అమెరికా, పాశ్చాత్య దేశాలు పేకమేడ ఎక్కించాయి. మారిన పరిస్థితులను జెలెన్‌స్కీ గ్రహించలేకపోతున్నారు.
ఒక సార్వభౌమాధికార దేశంపై మరో దేశం విరుచుకుపడటం, దురాక్రమించటం, జనావాసాలను ధ్వంసం చేయటం ముమ్మాటికీ నేరం. ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆ తప్పు చేశారు. కానీ అందుకు తన చర్యల ద్వారా దోహదపడింది జెలెన్ స్కీయే. ఈ పోకడలు నివారించాలనీ, ఆయనకు మద్దతునీయటంకాక, చర్చల ద్వారా పరిష్కరించు కొమ్మని నచ్చజెప్పాలనీ పుతిన్ కోరినప్పుడు అమెరికా, పాశ్చాత్య దేశాలు ముఖం చాటేశాయి.
ట్రంప్ తన పూర్వాశ్రమంలో రియాలిటీ షోలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు. ఇప్పుడు వైట్ హౌస్ ఉదంతం ఆ మాదిరి ప్రదర్శనే. తాను పుతిన్‌తో చేతులు కలపటం సరైందేనని అమెరికా ప్రజా నీకం అనుకునేలా చేయటమే ట్రంప్ లక్ష్యం. అది నెరవేరిందో లేదోగానీ ఉక్రెయిన్ కోసం పాశ్చాత్య దేశాలు ఏకమవుతున్న సూచనలు కనబడుతున్నాయి.
సైన్యాన్ని కూడా తరలిస్తామంటున్నాయి. కానీ జెలెన్‌స్కీ ఒక సంగతి గ్రహించాలి. ఎవరి మద్దతూ ఉత్తపుణ్యానికి రాదు. ఉక్రెయిన్ నేల ఒడిలో నిక్షిప్తమైవున్న అపురూప ఖనిజాలు, ఇతర ప్రకృతి సంపదపైనే ఎవరి దృష్టి అయినా. ఇవాళ మద్దతు నిస్తామంటున్న పాశ్చాత్య దేశాలు రేపన్నరోజు అమెరికాతో రాజీపడితే ఉక్రెయిన్‌కు మళ్లీ సమస్యలే.
నిన్నటివరకూ మద్దతిచ్చిన అమెరికా స్వరం మార్చడాన్ని చూసైనా యూరప్ దేశాలను నమ్ముకుంటే ఏమవుతుందో జెలెన్‌స్కీ గ్రహించాలి. రష్యాతో శాంతి చర్చలకు వేరే ప్రత్యామ్నాయం లేదు. ఇకపై స్వతంత్రంగా వ్యవహరించగలమన్న అభిప్రాయం కలగజేస్తే, దురాక్రమించిన భూభాగాన్ని వెనక్కివ్వాలని రష్యాను డిమాండ్ చేస్తే జెలెన్‌స్కీకి అన్నివైపులా మద్దతు లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment